ఓ పదేళ్ళ క్రితం మాట.
కొత్థగా డిప్యూటి తాహసిల్దార్ గా ఎంపికైన రోజులు.
కొత్త మితృలతో కలిసి వైజాగ్ ట్రిప్ వెళ్ళిన సందర్భం.
మా అమ్మ జీవించి ఉన్న రోజులు.అమ్మని కూడా నాతో తిప్పిన ట్రిప్ అది.
వైజాగ్,సిమ్హాచలం,అన్నవరం,పాడేరు,తలుపులమ్మ లోవ,ఏటికొప్పాక అన్నీ తిరిగేసి అరకుకు వెళ్ళేం.
అరకు నుంచి చాపరాయ్. భలే ఉంటుంది నీటి ప్రవాహం.
అందరం ఓ చోట ఆగి నీళ్ళల్లో పాదాలాడిస్తూ ఆడుకుంటున్నాం.
మా అమ్మ కారులోనే ఉండిపోయింది నేను దిగలేనని.
నాకు హఠాత్తుగా అటువేపు వెళ్ళాలనే వెర్రి ఆలోచన కలిగింది.
అంతే గబగబా నడుస్తూ నీళ్ళను దాటేసి అటువేపు వెళ్ళిపోయాను.
తీరా అటువేపు వెళ్ళాకా చూస్తే నీటి ప్రవాహం పెరిగిపోయింది.
తిరిగి రావడం చాలా కష్టమనిపించింది.
ఇటుపక్క నున్న వాళ్ళు గట్టిగా అరుస్తున్నారు రమ్మని.
ఏం చెయ్యాలో అర్ధం కాక అటు ఇటు చూస్తుంటే అడవి కరివేపాకు కోస్తూ ఇద్దరు గిరిజన కుర్రాళ్ళు కనబడ్డారు
హమ్మయ్య ప్రవాహం దాటిస్తారు
లే అని ఓ అబ్బాయి దగ్గరకెళ్ళీ
అడిగాను.మొదట నా మాట అర్ధం కాలేదు. చాలా సిగ్గుపడిపోయాడు మాట్లాడుతుంటే.
ఇటుపక్క మితృల గొడవ ఎక్కువైంది.ప్రవాహం పెరిగిపోతోంది రమ్మంటూ కేకలుపెడుతున్నారు.
ఈ కుర్రాడేమో రానంటున్నాడు తల అడ్డంగా తిప్పుతూ.
ఇంక చేసేదేమి లేక ఆ కుర్రాడి చెయ్యిపట్టుకున్నాను.
గబుక్కున లాగేసుకున్నాడు.నన్ను అటువేపు తీసుకెళ్ళమని సైగలు చేస్తూ మళ్ళి చెయ్యి పట్టుకుని బలవతంగా ప్రవహం వేపు లాక్కొచ్చాను.సిగ్గుపడుతూ,చెయ్యి విడిపించుకుంటూ మొత్తానికి నాతో వచ్చాడు.
నేనే లాక్కొచ్చాను.
ఇటువైపు వచ్చాకా అతనికి ఏ భాషలో కృతజ్ఞతలు చెప్పాలో అర్ధం కాలేదు.
తెలుగు రాదు.నమస్కారం పెడదామా అంటే చాలా చిన్నవాడు.
మొత్తానికి ఆరోజు నన్ను ప్రవాహం దాటించిన ఆ గిరిజ కుర్రాడు ఇప్పటికీ నా మనసులో మెదులుతున్నాడు.
డబ్బులిచ్చాం కానీ అతని సహాయం డబ్బులతో కొలిచేది కాదు.
ఇవతలి గట్టుకి రాగానే నా మితృలంతా తిట్టినతిట్ట్లు హమ్మో ఇప్పుడు గుర్తు చేసుకోకూడదు.
మా అమ్మ మాత్రం ఇదెప్పుడూ ఇంతే నీళ్ళు చూస్తే దీనికి వొళ్ళు తెలియదు అంటూ మురెపెంగా అంటుంటే మా వాళ్ళ ముఖాలు చూడాల్సిందే.
1 comment:
సత్యవతి గారు నేను చూశానండి ఆ ప్లేస్ ను చాల బాగుంటుంది కదా?
Post a Comment