Saturday, January 29, 2011

నేను చచ్చి బతికి ఈవాల్టికి 26 సంవత్సరాలు


అవునండి.1985 లో నేను ఓ నాలుగ్గంటలు చనిపోయాను.
నా గుండెను ఓపెన్ చేసి డాక్టర్లు నా గుండె లయను ఆపేసి
తాత్కాలికంగా హార్ట్ లంగ్ మిషన్ కి అనుసంధానించారు.
నా గుండెకున్న రూపాయి బిళ్ళంత కన్నాన్ని ఓ స్పెషల్ మెటీరియల్తో కుట్టేసి
ఆపేసిన నా గుండెకు షాక్ ఇచ్చి మళ్ళి లయలోకి తెచ్చారు.
అంటే ఓ నాలుగ్గంటలు నేను డెడ్ అన్నమాట.
ఈ మాటలు హార్ట్ లంగ్ మెషీన్ ఆపరేటర్ మధు సూదన్ చెప్పాడు.
చాలా సార్లు ఆపేసిన గుండె షాక్ ఇచ్చినా తిరిగి కొట్టుకోదట.
అంటే పేషంట్ హరీ అన్న మాట.
నాకు 30 ఏళ్ళపుడు చాలా సీరియస్ అనారోగ్యం చేసి తిన్నదంతా కక్కేసే దాన్ని.
రోగమేంటో ఎవ్వరికీ అంతుబట్టలేదు.
నా డాక్టర్ ఫ్రెండ్ అనిత ఎందరో డాక్టర్లకి చూపించి ఆఖరికి
డా: అరవింద్ దగ్గరికి తీసుకెళ్ళింది.
అప్పటికి ఖంగ్ ఖంగ్ మని దగ్గుతున్నా.
ఆయన చెష్ట్ స్పెషలిష్ట్.గుండె మీద స్టెత్ పెట్టి అలాగే ఉండిపోయాడు.
మాకేమీ అర్ధం కాలేదు.
ఆయన వివరంగా చెప్పింది విని అందరం షాక్ అయ్యాం.
నాకు పుట్టుకతోనే (కంజినేటల్)గుండెకి పెద్ద కన్నం ఉంది.
ఇంత కాలం ఎవ్వరూ కనిపెట్టలేదు.
చెడు రక్తం,మంచి రక్తం కలగలిసిపోవడం వల్ల లోపల ఇన్
ఫెక్ట్ అయ్యి దగ్గు రావడం దానిటొ పాటు తిన్నదంతా వాంతి అవ్వడం.
నాకు అర్జంటుగా ఓపెన్ హార్ట్ సర్జరి చెయ్యాలని లేకపోతే ప్రాణ హాని అని అరవింద్ చెప్పారు.
హమ్మో ! ఓపెన్ హార్ట్ సర్జరీ!!!!
ఇప్పుడు చాలా ఈజీనే.1985 లో అపోలోలు కేర్లు ఎక్కడున్నాయ్.
ఉన్నా మన దగ్గర డబ్బులెక్కడివి.
అప్పటికి మేము రిజిస్టర్ మారేజ్ చేసుకుని (1981)
నాలుగేళ్ళు.ఇంకా అవతలి పెద్దలతో ఒద్దిక కుదరలేదు.
నా సహచరుడు చాలా ధైర్యంగా ఈ అంశాన్ని ఎదుర్కున్నాడు.
నాకు కొండంత అండగా నిలబడ్డాడు.
బయటకెళ్ళి ఆపరేషన్ చేయించుకునే ఆర్ధిక స్తోమత లేక
గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాను.
చాలా గొప్ప డాక్టర్ల బృందం డా: పివి సత్యనారాయణ గారు,డా:హరిప్రేం డా: శకుంతల వీళ్ళు నన్ను కంటికి రెప్పలా కాపాడారు.థొరాసిక్ సర్జన్ అయిన పివి సత్యనారాయణ గారు
ఆపరేషన్ చేసి రాత్రంతా రికవరి రూంలో ఉన్నారు.
అరుణ అనే నర్సు నన్ను ఎంత ప్రేమగా చూసిందంటే ఆమె గుర్తొస్తే ఇప్పటికి నా కళ్ళల్లో నీళ్ళొస్తాయి.
నా సహచరుడు రాత్రి పగలు బాత్ రూంలపక్కన కూచుని నాకు సేవ చేసాడు.
గవర్నమెంట్ ఆసుపత్రి అయినా గాంధీ ఆసుపత్రి అయినా అద్భుతమైన డాక్టర్లు సేవా నిరతి వల్ల నేనీ రోజు ఈ టపా రాయగలుగుతున్నాను.
ముప్ఫయ్యేళ్ళ చిన్న వయసులో అంత పెద్ద ఆపరేషన్ చేయించుకున్నా నేనెప్పుడూ హమ్మో నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది అని సెల్ఫ్ పిటి లోకి వెళ్ళలేదు.చచ్చి బతికాను కదా అనిపిస్తుంటుంది అంతే.

ఇందులో ఓ కొస మెరుపు:

ఇంకో రెండు రోజుల్లో ఆపరేషన్ ఉందనగా దూరదర్శన్ లో సాగర సంగమం సినిమా వేస్తున్నారని తెలిసింది.
ఆ రోజు ఆదివారం.
డాక్టర్లని ఇంటికెళతానని అడిగి, ఒద్దనిపించుకుని, గొడవపడి ఇంటికెళ్ళి సాగర సంగమం చూసి సోమవారం పొద్దున్నే ఆసుపత్రికి వచ్చేసాను.
ఆ మర్నాడే జనవరి 30 న ఆపరేషన్ అయ్యింది.
ఇదండి సంగతి.

6 comments:

Hemalatha said...

వామ్మో సత్యవతి గారు,
ఇంత కథ ఉందా?
మీరు నాకు అభినందనలు చెప్పారు కదా...థాంక్స్ చెప్దామని ఇలా వచ్చా.
నేను కూడా ఇలాగే ఏవో జ్ఞాపకాల లోకి వెళ్ళిపోయా.
ఆ టెన్షన్ లో 'సాగర సంగమం' ఎంజాయ్ చెయ్యటం మీకే చెల్లింది.

budugu said...

నాకర్థం కాలేదు. 85కి ఇప్పటికి 30ఏళ్ళు ఎలా అయ్యాయి-- సాగరసంగమం 85లో కదా విడుదలైందీ.. అప్పుడే డీడీలో ఎలా వేసారు?

maa godavari said...

సాగర సంగమం విడులలైంది 82 లో నండి బుడుగు గారూ.లెక్కల్లో కొంచం పూర్.సరిచేసానులెండి.
హేమలత గారూ థాంక్స్ అండి.
జీవితమంతా ఇలాంటి ఎడ్వంచర్లే కదాచేసింది.

సత్యవతి said...

happy birth day

ఆ.సౌమ్య said...

oh congratulations and happy b'day!

సుమలత said...

ante miku yeppudu 26 years annamaata
anyway many maore happy returns of the day

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...