ఈ రోజు పౌర్ణమి.
పౌర్ణమి ప్రతి నెల వస్తుంది కదా.కొత్త ఏముంది.
సూర్యుడు రోజూ ఉదయిస్తాడు.రోజూ అస్తమిస్తాడు.
అయినా సరే ఉదయాస్తమయాలు రెండూ చూసినపుడల్లా మైమరిపిస్తాయి.
ఇంక నిడు పున్నమి గురించి వేరే చెప్పాలా?
"నిండు పున్నమి పండు వెన్నెలలో
నిను చేరగ అంటూ బాలసరస్వతి మెత్తటి మాధుర్యపు పాట
వింటూ వెన్నెల్లో హాయ్ హాయ్ గా నడుస్తుంటే
ఎంత బావుంటుంది.
నాకు ఈ రోజు ఎందుకో వెన్నెల్లో ఒళ్ళంతా తడుపుకోవాలనిపించింది.
వెన్నెలని మాత్రమే వెంటేసుకుని తిరగాలనిపించింది.
హుస్సైన్ సాగర్ మీద దర్జాగా,నిండుగా,మహా గీరగా
పోజులు కొడుతూ మల్లెపూవంటి వెన్నెల్ని ఒలకబోస్తున్న చంద్రుడితో
చక్కర్లు కొట్టాలనిపించింది.
ఆలస్యమేముంది. బూట్లు గీట్లు తగిలించి వాకింగ్ అవతారమెత్తి
ఒక్కదాన్నే డ్రైవ్ చేసుకుంటూ నెక్లెస్ రోడ్ కి పయనమయ్యాను.
ఏకాంతంగా ఉండే ప్రదేశాన్ని చూసుకుని హాయిగా కూర్చున్నాను.
మొబైల్ లో దాచుకున్న బాలసరస్వతి పాటలు
"రెల్లుపూల పానుపుపై జల్లుజల్లుగా ఎవరో చల్లినారమ్మా వెన్నెలా"
పాటలు వింటూ
తిలక్ అమృతం కురిసిన రాత్రిని గుర్తుతెచ్చుకుంటూ
పారవశ్యంలో మునిగిపోయాను.
ఆ హాయి, ఆ నిరామయ స్థితి ఎంత సేపుందో కానీ
కళ్ళు తెరిచి చుట్టూ చూద్దునుకదా నా మైమరపంతా ఆవిర్రైపోయింది.
అంత ఆనందమయమైన ఆ సమయంలో
భావితరం చెట్టుకొకరుగా అతుక్కునిపోయి
నానా విన్యాసాలు చేస్తూ కంటపడ్డారు.
చేతుల్ని పెనవేసిన వాళ్ళు,కౌగిళ్ళలో కూరుకుపోయిన వాళ్ళు,
చుంబనాల్లో మునిగిపోయిన వాళ్ళు వామ్మో!!!!!
ఇందాక చూళ్ళేదేమిటి చెప్మా అని ఝడుసుకుని
అక్కడి నుంచి లేచిపోయాను.
అలా నడుచుకుంటూ వెళుతుంటే నాకు హఠాత్తుగా పాత మల్లీశ్వరి సినిమా,
ఓ వెన్నెల రాత్రి ఏటి ఒడ్డున కూర్చుని
"మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల జాలువారెనే (కరెక్టేనా?)
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్ని నాళ్ళకీ బతుకు పండెనో
నాగరాజు,మల్లి పాడుకున్న పాట,ఆ సన్నివేశం గుర్తొచ్చాయి. చెట్లకి అతుక్కుపోయిన పిల్లల్ల్ని చూస్తే చాలా బాధేసింది.
వెన్నెల పాటల్ని వింటూ,నాతో నేను ఎంజాయ్ చేస్తూ,
లడ్డులాగా, గుండ్రంగా ,దూరంగా ఊరిస్తున్న చంద్రుణ్ణి దొంగచూపులు చూస్తూ
దొరికితే బావుణ్ణే గబుక్కున మింగేద్దునే
అనుకుంటూ ఈ రాత్రి అనుభవాన్ని గుండెల్లో అద్దుకుంటూ ఇంటికి బయలుదేరా!!!!!!!!!!!!!!!!!!
2 comments:
మాటలకందని అనుభూతిని అక్షరాలుగా పేర్చారు ! మల్లీశ్వరి పాట గుర్తుచేసినందుకు థాంక్స్ !
నిన్నటి వెన్నెలే కాదు.. మీ మాటలూ వాటితో పాటూ పాటలూ, ఫొటోలూ సూపర్...
Post a Comment