Tuesday, February 1, 2011

చంబల్ లోయలో రేగుపళ్ళ వేట


కరక్ట్ గా సంవత్సరం గుర్తు లేదు.
హైదరాబాద్ నుండి ఓ పదిహేను మందిమి నేషనల్ వుమన్ స్టడీస్
కాన్ ఫరెన్స్ లో పాల్గొనడానికి జైపూర్ వెళ్ళేం.
నాతో పాటు స్త్రీల ఉద్యమ నాయకులంతా ఉన్నారు.
జైపూర్ మీటింగ్ అద్భుతంగా సాగింది.
జాతీయస్థాయి మహిళా నాయకురాళ్ళనెందరినో ఆ కాన్ ఫరెన్స్ లో కలిసాను.
జైపూరంతా చుట్టబెట్టి సమావేశపు జ్ఞానాన్ని మెదళ్ళలో నింపుకుని
ఆంధ్ర ప్రదేశ్ ఎక్ష్ ప్రెస్ లో తిరుగు ప్రయాణమయ్యాం.
జైపూర్ నుండి బస్సు లో వచ్చి ఢిల్లీ నుండి ట్రైన్ లో బయలుదేరాం.
దాదాపు 36 గంటల ప్రయాణం.
మేము పాటలతో,ఆటలతో అల్లరితో మా కంపార్ట్ మెంట్ మోగించాం.
గ్రూప్ తో ప్రయాణాలు నాకు అలవాటే.అల్లరి అల్లరిగా గొడవ చెయ్యడం అలవాటే.
మేము ప్రయాణిస్తున్న రైలు హఠాత్తుగా ఓ అడవిలో ఆగిపోయింది.
బయటకు చూస్తే దట్టమైన అడవి, ఎత్తైన కొండలు,లోతైన లోయలు కనిపిస్తున్నాయ్.
మధ్య ప్రదేష్ రాష్ట్రం లో ఉన్నామన్న మాట.
నేను మెల్లగా లేచి డోర్ దగ్గరకొచ్చాను.

అబ్బ!ఏమి అడివి,ఎంత పచ్చదనం.బండ రాళ్ళల్లా ఉన్న కొండలు.
హఠాత్తుగా నా కళ్ళు రేగుచెట్ల మీద పడ్డాయి.
ఆకుపచ్చ,పసుపు రంగుల్లో రేగుపళ్ళు కనబడ్డాయ్.
ఇంకేమీ ఆలోచించకుండా రైలు దిగి ఆ చెట్ల వేపు వెళ్ళిపోయా.
నేను రేగు పళ్ళు కోస్తుండగా మా గ్రూప్ వాళ్ళు చూసారు.
ఒకటే కేకలు,అరుపులు.రా,వచ్చేయ్ అంటూ కోపంగా అరుస్తున్నారు.
నేను తాపీ గా దోసిలినిండా పళ్ళు కోసుకుని భోగీ లోకి ఎక్కేసాను.
ఎక్కేకా చూడండి తిట్టారూ.
ఏమనుకుంటూన్నావ్ ఇది చంబల్ లోయ. ఫూలందేవి తిరిగే చోటు.
రైలు ఇక్కడాగిందేమిటా అని అందరూ హడిలి చస్తుంటే నువ్వు రేగుపళ్ళ కోసం చంబల్లోయలోకెళతావా అంటూ తలంటేసారు.
నిజమా?? ఇది చంబల్ లోయా?నాకేం తెలుసు?
రైలు వెళ్ళిపోతునదని అరుస్తున్నారనుకున్నాను.
పూలన్ దేవి కనిపిస్తుందా?
రైలు దిగడానికి నాకేమీ భయమెయ్యలేదు.
రైలు కదిలినా పరిగెత్తి ఎక్కగలనులే అనుకున్నాను.
తిట్ట్లతో తల తడిసిపోయాకా బయటకు చూద్దును కదా పక్క కంపార్ట్ మెంట్ వాళ్ళు నన్ను చూసి ఆవేశం తెచ్చుకున్నట్టున్నరు రేగు చెట్టుకి ముళ్ళుంటాయని తెలియక అమాంతంగా కొమ్మల్ని పట్టుకోబోయేసరికి ముళ్ళు గుచ్చుకున్నాయ్ కాబోలు నా వేపు కోపంగా చూస్తూ వెళ్ళి రైక్కేసారు.
దీనిక్కూడా నాకు మళ్ళీ తిట్లు పడ్డాయ్.
పాపం వాళ్ళకి ముళ్ళు గుచ్చుకున్నాయ్ నీ వల్లనే అని మొదలేసారు.
నేను చెవుల్ని వాళ్ళకి ఇచ్చేసి నా కళ్ళని చంబల్ లోయ కి అంకితం చేసాను.
పూలన్ దేవి కనబడకపోతుందా అని తలపోస్తుంటే ఒక్క కుదుపుతో రైలు కదిలింది.

1 comment:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...