Tuesday, March 23, 2010

స్త్రీల అంశమే ఊపిరై కడదాకా సాగాల్సిందే.

కొండవీటి సత్యవతి
1975 సంవత్సరం. మా నాన్న మా ఆవుపాలు పిండుతుంటే నేను లేగదూడను పట్టుకుని నిలబడ్డాను. రేడియోలో ఢిల్లీ నుండి వచ్చే ఏడుగంటల వార్తలు వస్తున్నాయి. ఆ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రభుత్వం ప్రకటించిందని వార్తల్లో చెబుతూ స్త్రీల కోసం ఎన్నో సరికొత్త కార్యక్రమాలు చేపట్టబోతున్నారని తెలియచెప్పాడు న్యూస్‌రీడర్‌. పాలుపిండడం అయిపోయింది. నేను దూడను వదిలేసాను. అది చెంగుమంటూ ఎగిరి తల్లి పొదుగులో దూరిపోయింది. ఆ రోజు ఉదయం రేడియోలో చెప్పిన మహిళా సంవత్సరం వార్త మా నాన్న బుర్రలో చేరిపోయింది. నేను డిగ్రీ పూర్తిచేసి ఇంట్లో ఉన్నాను. 'పద హైదరాబాద్‌ పోదాం నీకు ఉద్యోగం వచ్చేస్తుంది' అన్నాడు. హైదరాబాదా? నేను అప్పటికి పక్కజిల్లాకి కూడా పోలేదు. సరే అన్నాను. నాకున్న రెండో, మూడో చీరలు బాగులో పెట్టుకుని మా నాన్నతో కలిసి మహానగరంలోకి వచ్చేసాను.
హుస్సేన్‌సాగర్‌ పక్కన పాటిగడ్డ కాలనీ. మా చిన్నాన్న ఇంటికి వచ్చేసాం. అప్పటికే ఆ ఇంట్లో నాలాంటివాళ్ళు నలుగురు ఉన్నారు. మా చిన్నమ్మ, చిన్నాన్నల హృదయాలు విశాలమైనా, క్వార్టర్‌ మాత్రం మహా ఇరుకు. అందరం అందులోనే సర్దుకున్నాం. నన్ను దింపేసి మానాన్న వెళ్ళిపోయాడు. నాకు మంచి ఉద్యోగం వచ్చేస్తుందని మా ఊళ్ళో వుంటూ గొప్ప కలలు కంటూ వుండేవాడు. 1975 మహిళా సంవత్సరమే కాదు మహా అంధకార సంవత్సరమని నాకు అప్పటికి తెలియదు. 76లో గ్రూప్‌ |ఙకోసం సర్వీస్‌ కమీషన్‌ నోటిఫికేషన్‌ వచ్చింది. అప్పటికి పదేళ్ళుగా రిక్రూట్‌మెంట్‌ లేదు. లక్షలాది అప్లికేషన్‌లు వచ్చాయి. నేను పోటీ పడ్డాను. పేపరంతా ఇందిరాగాంధిమయం. పరీక్ష బ్రహ్మాండంగా రాసాను. కానీ ఆ ఉద్యోగం రావడానికి మూడేళ్ళు పట్టింది. 165 రూ||ల జీతానికి అమీర్‌పేటలో రెడ్‌రోజెస్‌ అనే కాన్వెంట్‌లో చేరాను. ఆ తర్వాత ఇక్రిసాట్‌లో చేసాను. చిన్న చితకా ఉద్యోగాలు చాలానే చేసాను.
నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని కలలు కన్న మా నాన్న 77లో చనిపోయాడు. నేను తీవ్ర నిరాశతో కూరుకుపోయాను. నాకు మా నాన్నతో చాలా అనుబంధం. ఆయనే నాకు కట్టెలు కొట్టడం, చేపలు పట్టడం, పాలు పిండడం, మొక్కలకు నీళ్ళు పట్టడం లాంటి 'మగపనులు'' చేసే అవకాశం కల్పించాడు. నువ్వు ఆడపిల్లవి, అణుకువగా, ఇంటిపట్టున ఉండాలి లాంటి మాటలు, ఆంక్షలు ఎన్నడూ నేను విని వుండలేదు. నేను మా ఊరి తోటల్లో స్వేచ్ఛగా, హాయిగా తిరుగుతుండేదాన్ని. సాధారణంగా అన్ని ఇళ్ళలోను ఆడపిల్లలు ఎదుర్కొనే వివక్షని నేను నా జీవితంలోని ఏదశలోను ఎదుర్కోలేదు. నన్ను చెట్లమీద పిట్టల్లా, నీళ్ళల్లో చేపలా ఎదగనిచ్చిన మా నాన్న మరణం నన్ను చాలా కుంగదీసింది. ఆయన్ని కడసారి కూడా చూడలేకపోయాను. నేను మా ఊరు తిరిగి వెళ్ళిపోయాను.
ఇక్కడే ఓ స్నేహహస్తం నన్ను ఆదుకుంది. నేను పాటిగడ్డలో వుండే రోజుల్లో జయ, విజయ అని ఇద్దరు ఫ్రెండ్స్‌లుండేవాళ్ళు. నేను ఈ రోజు ఈ స్థితిలో నిలబడి వుండడానికి కారకురాలు జయ. తన స్నేహం, నన్ను మా వూరి నుండి లాగి మళ్ళీ హైదరాబాద్‌కు తెచ్చింది. నేను సంఘర్షిస్తూనే ఎదగడానికి, నాకాళ్ళ మీద నేను నిలబడడానికి తను అందించిన సపోర్ట్‌ను మాటల్లోకి అనువదించడం చాలా కష్టం. నిజానికి నా జీవితం పొడవునా, నేను నడిచివచ్చిన దారికిరువైపులా దివిటీలు పట్టి దారి చూపించిన వాళ్ళు స్నేహితులు, హితులే. నేను చదువుకున్న స్కూల్‌ హెడ్‌మిస్ట్రెస్‌ కన్యాకుమారి గారి పాదాలకు రోజు ప్రణమిల్లినా తక్కువే.
కన్యా కుమారి గారు నేను ఇటీవల   దిగిన  ఫోటో

నేను చదువుకోవడానికి, ప్రతి సంవత్సరం అది కొనసాగడానికి ఆవిడ చేసిన కృషి అపారం. రోజూ ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకున్న రోజుల్లో ఆవిడ నన్ను తనింట్లో పెట్టుకుని చదివించారు. నాకు విద్యాభిక్ష పెట్టింది ఆవిడే అని గర్వంగా చెప్పుకుంటాను.
మా వూరు సీతారామపురం. నాలైఫ్‌లైన్‌. నాకు అందమైన, అద్భుతమైన బాల్యాన్నిచ్చిన చిన్న గ్రామం. మామిడి, జీడి, సపోటా, సీతాఫలం, సరుగుడు తోటలతో పచ్చగా, ప్రాణంగా వుండే మా ఊరు. ఒకవైపు గోదావరి, మరోవైపు సముద్రం. మా ఇల్లు పెద్ద సత్రం. మా అమ్మలు రోజూ ఏభైై, అరవై మందికి వండిపోసేవారు. ఏడుగురు చిన్నాన్నలు, పెద్దనాన్నలు వాళ్ళ పిల్లలు కలిసి వుండే పెద్ద వుమ్మడి కుటుంబం. మా తాత ఈ కుటుంబానికి రాజు. ఇంతమందికి వొండి వడ్డించాక అమ్మలకి ఆఖరున తిండివుండేది కాదు. పిల్లలం ఏదో పెట్టింది తిని ఊరిమీద పడేవాళ్ళం. తోటల వెంబడి తిరుగుతూ, కాయో, కమ్మో తింటూ ఎక్కువ టైమ్‌ బయటే. ఎక్కడి కెళ్ళావ్‌? ఏం చేసావ్‌? లాంటి ప్రశ్నలెప్పుడూ నేను వినలేదు. నా ఇష్టం వచ్చినంత సేపు తిరగడం, తిండికి ఇంటికి రావడం, నిజానికి మేం తిన్నమా లేదా అని ఎవరికి పట్టేది కాదు. అద్భుతమైన బాల్యం. అందరికీ దొరకని అరుదైన బాల్యం నాది. ఇప్పటికీ నా గ్రామం గురించి, నా బాల్యం గురించి పచ్చటి జ్ఞాపకాలే నాలో మెదులుతాయి. ఆ రెంటితోనూ నేటికీ సజీవ సంబంధం నిలుపుకోవడం నేను సాధించిన గొప్ప విజయమే.
ఆడపిల్లల్ని చదివించకూడదన్న మూర్ఖత్వం మా కుటుంబంలో లేదు గానీ ఆర్థికంగా స్తోమత లేదు. అందుకే నా చదువు ప్రతి సంవత్సరం ఆగిపోయేది. టీచర్లు ఉత్తరాలు వ్రాసేవారు. కన్యాకుమారిగారు మా ఊరొచ్చి మా వాళ్ళతో మాట్లాడేవారు. అలా అలా చాలా కష్టంగా బి.ఏ. వరకు లాగాను. మా నాన్నకి తెలియక నన్ను ఓరియంటల్‌ స్కూల్‌లో చేర్చాడు. అంతా సంస్కృత మయం. నేను పదో తరగతి వరకు సంస్కృతం తప్ప వేరే సబ్జక్టులు చదవలేదు. లెక్కలు, సైన్స్‌లాంటివేమీ చదవలేదు. ఓరియంటల్‌ టెంత్‌ అంటే ఎమ్‌.ఏ. స్టాండర్డ్‌ అనేవాళ్ళు. అప్పుడే నేను మహాకావ్యాలన్నీ సంస్కృతంలో చదివాను. మేఘసందేశం, చంపూ రామాయణం, కాదంబరి ఇంకా చాలా చదివాను. అమరకోసం భట్టీ వేసేవాళ్ళం. మేము శ్లోకాలు తప్పు చదివితే మా సంస్కృతం మాష్టారు పరుగులు పెట్టించి కొట్టేవారు. మేం దొరక్కపోతే ఆయన తలగోడకేసి కొట్టుకునేేవారు. చాలా కష్టం మీద నేను, అన్నపూర్ణ అనే ఇంకో అమ్మాయి మాత్రమే టెంత్‌ పాస్‌ అయ్యాము. అది కూడా చాలా కాలం రిజల్ట్సు ఆపిపెట్టి పాస్‌ అయ్యామని ప్రకటించారు. ఇంటర్‌లో ప్రత్యేక తెలుగు. తెలుగును ప్రాణప్రదం చేసింది తెలుగు లెక్చరర్‌ హనుమాయమ్మగారు. ఎంత అద్భుతంగా చెప్పేవారో. డిగ్రీలో ప్రత్యేక ఇంగ్లీష్‌. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు ఇలా చదవడం వల్ల సాహిత్యం పట్ల వల్లమాలిన ప్రేమ. చరిత్రని ప్రేమకావ్యంలా బోధించిన వసంత, లలితగార్ల వల్ల చరిత్ర అంటే మహా ప్రేమ.
నా బాల్యం లాగానే నా చదువు కూడా భిన్నంగా వైవిధ్యంగా సాగింది. చదువు చెప్పడమే కాదు సాహిత్యంవైపు చూపు సారించేలా చేసింది మా లెక్చరర్‌లే. ఆంగ్ల నవలలు చదవమని ప్రోత్సహించింది మా హిస్టరీ లెక్చరర్‌ వసంతగారు. ఆరోతరగతి నుండి బి.ఏ. వరకు చదువులో నా అనుభవాలు రాయాలంటే అదో గ్రంథమే అవుతుంది. అందమైన అపూర్వమైన అనుభవాలు నాలో ఇప్పటికీ సజీవంగా మిగిలే వున్నాయి. నేను తొమ్మిదో తరగతి చదివేటప్పుడు ''ఆచంట'' అనే గ్రామంలో పెద్ద ఎత్తున జరిగే శివరాత్రి ఉత్సవాలలో భగవద్గీత పోటీలో పాల్గొని ప్రథమ బహుమతి సంపాదించాను. కన్యాకుమారి గారు నన్ను తనతో తీసుకెళ్ళేవారు. అప్పట్లో నేను భగవద్గీత శ్లోకాలు అనర్ఘళంగా చదివి అర్థాలు చెప్పేదాన్ని. వేలాదిమంది ముందు జరిగిన పోటలో నేను ఆపకుండా శ్లోకాలు చదివితే టైమ్‌ మర్చిపోయి అందరూ విన్నారు. నాకు ప్రథమ బహుమతిగా భాగవతం పుస్తకాలిచ్చారు. చాలామంది స్పాట్‌లో ఏదివుంటే అది నాచేతిలో పెట్టారు. అంత బాగా చదివేదాన్ని. మర్నాడు నా ఫోటో పేపర్లో వేస్తే మా నాన్న చూసాడు. అప్పట్లో నేను నర్సాపురంలో 'గీతాపారాయణం' చెయ్యడానికి వచ్చిన ఒకాయనతో వెళ్ళిపోవాలని అనుకునేదాన్ని. ఆయన సన్యాసి. ఆయన శిష్యవర్గంలో కలిసి నేను వెళ్ళిపోవాలనుకుని మా కన్యాకుమారిగారితో చెపితే ఆవిడ వారించారు. తెగ పూజలు చేసేదాన్ని. భక్తిరసం నరనరాన పారేది. అయితే ఇంటర్‌లోకి వచ్చేసరికి ఎన్నో పుస్తకాలు చదివిన ప్రభావం వల్ల నూటికి నూరు శాతం నాస్తికురాలిగా మారిపోయాను. సి.వి. రాసిన 'సత్యకామ జాబాలి' రాహుల్‌ సాంతృత్యాయన్‌ రాసిన 'ఓల్గా నుండి గంగాతీరం' అప్పటికే చదివిన గుర్తు. ఇవన్నీ నాలో భక్తిని చావగొట్టి, నాస్తికత్వం వేపు నడిపించాయి. నాస్తికత్వం నా జీవన విధానమైంది నేటికీ. నా జీవన సహచరుణ్ణి కూడా నాస్తికత్వం పునాదిగానే ఎంపిక చేసుకునేలా నాలో మార్పు తెచ్చింది.
మళ్ళీ కొంచెం వెనక్కి వెళితో 1979లో నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌లో. ఇరవై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తరాత 2000లో వదిలేసాను. ఆ మధ్యలో 1996లో డిప్యూటీ తాహసిల్‌దారుగా సెలెక్ట్‌ అయ్యి మా ఊరిలో వుండి ఆ ఉద్యోగం చేసాను. యలమంచిలి ఎమ్‌.ఆర్‌.ఓ.గా 1997 సూపర్‌సైక్లోన్‌ను అతి సమీపంగా చూసాను. హైదరాబాద్‌లో ట్రైనింగు సమయంలో వచ్చిన వరద సహాయ కార్యక్రమాల్లో భాగంగా భయంకరమైన మురికివాడల్లో పనిచేసాను. నగరంలో మురికివాడల భీభత్స చిత్రాన్ని అర్థం చేసుకున్నది అప్పుడే. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ లోని అధికారుల అభిజాత్యధోరణి, అవినీతిని తట్టుకోలేక ఎమ్‌.ఆర్‌.ఓ. ఉద్యోగానికి బై చెప్పి మళ్ళీ సర్వీస్‌కమిషన్‌కి వెళ్ళిపోయాను. 'భూమిక'లో పూర్తికాలం పనిచెయ్యాలనే ఆలోచనతో మొత్తానికే ప్రభుత్వ ఉద్యోగానికి పర్మినెంట్‌గా గుడ్‌బై చెప్పేసాను. అయితే ఆ ఇరవై ఏళ్ళ అనుభవాలు నాకెన్నో పాఠాలు చెప్పాయి. నేను ఎదగడానికి, మరో మార్గంలోకి మళ్ళడానికి అక్కడే పునాది పడింది. సర్వీస్‌ కమీషన్‌లో పనిచేసే రోజుల్లోనే రత్నమాల, సంధ్య వాళ్ళంతా పరిచయమయ్యారు. 'డౌరీడెత్‌ కమిటీ' మీటింగులు రెగ్యులర్‌గా విద్యారణ్య స్కూల్‌లో జరుగుతాయని వీళ్ళ ద్వారానే తెలిసింది.
సంధ్యతో పరిచయం చాలా గమ్మత్తుగా జరిగింది. నేను బాగులింగంపల్లి బస్టాండులో నిలబడి 'ఒక తల్లి కథ' అనుకుంటా చదువుతున్నాను. సంధ్య నా దగ్గరకొచ్చి ఆ పుస్తకం మేమే వేసాం. అంటూ పరిచయం చేసుకుంది. అప్పటినుండి ఇద్దరం ఎన్నో కార్యక్రమాల్లో భాగమవ్వడంతో పాటు మంచి మిత్రులం కూడా అయ్యాం. రత్నమాల రెగ్యులర్‌గా మా ఆఫీసుకు వస్తుండేది. నేను సర్వీస్‌ కమీషన్‌ ఉద్యోగుల సంఘంలో చాలా క్రియాశీలంగా పనిచేసేదాన్ని. 'నవ్యసాహితీ సమితి' పేరుతో ఒక సాహిత్య సంస్థను కూడా స్థాపించాం. ప్రముఖ నాటకరచయిత గండవరం సుబ్బరామిరెడ్డి గారు నా సహోద్యోగులు. ఆయన అధ్యక్షులు. నేను కార్యదర్శిగా చాలా సాహిత్య కార్యక్రమాలు చేసేవాళ్ళం. సినారె, దివాకర్ల వెంకటావధాని, నగ్నముని, ఎన్‌.గోపిలాంటిగారి ఎందరినో ఆఫీసుకు పిలిచి ఉపన్యాసాలిప్పించేవాళ్ళం. ఒకసారి ఒకే నివేదిక, మీద సి.నారె, దివాకర్ల వున్నారు. 'నవ్య సాహితీ సమితి' అని ఎందుకు పెట్టారు మీరు పాత సాహిత్యం చదవరా అని దివాకర్ల అంటే సి.నారె. 'అసలు మీరు అభినవ్య అని పెట్టాలి కదా' అన్నారు. చాలా వాదోపవాదాలు జరిగాయి ఆ రోజు. ఆఫీసులో మంచి సాహిత్య వాతావరణం వుండేది ఆ మీటింగుల ద్వారా.
క్రమంగా నేను ఉద్యోగినుల సంఘం వైపు మళ్ళాను. వుమెన్స్‌వింగు కన్వీనర్‌గా ఎన్నికయ్యాను. ఉద్యోగినుల సమస్యలపై అధ్యయనం చేసి ఓ పెద్ద మీటింగు పెట్టాం. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల నుండి రెండువేల మంది ఉద్యోగినులు హాజరయ్యారు. 90 రోజుల నుండి 120 రోజులకు పెంచిన మెటర్నిటీ లీవ్‌ జీవో ఆ సమావేశ ఫలితమే!
రెగ్యులర్‌గా డౌరీ డెత్‌ కమిటీ మీటింగులకి హాజరవ్వ సాగాను. అక్కడే నాకు అన్వేషి గురించి తెలిసింది. సజయ, అంబిక, లలిత ఇంకా ఎంతో మంది పరిచయమయ్యారు. ఒకమ్మాయి ఆ మీటింగుకి వస్తుండేది. ఆమె అక్కని వాళ్ళ బావ కిరోసిన్‌ పోసి చంపేసాడు. చాలా ఏడ్చేది కోపంగా అరిచేది. ఆమె కన్నీళ్ళు ఇంకా నాకు గుర్తే. నాకు కళ్ళల్లో నీళ్ళూరిపోయేవి ఆ పిల్లని చూస్తే. కోపంతో, ఉద్వేగంతో రగిలిపోయేదాన్ని. స్త్రీలపట్ల అమలయ్యే హింసల గురించి వారం వారం వింటూ నాలో ఒక కసిని పెంచుకున్నాను.ఏదో చెయ్యాలి? అనే ఆరాటం కలిగేది. స్త్రీల అంశాలు స్త్రీ సమస్య నా ఆలోచనల్లో ప్రథమస్థానంలోకి వచ్చింది. అన్వేషితో అనుబంధం నన్ను జాతీయస్థాయి స్త్రీల సమా వేశాలకు నడిపించింది. జైపూర్‌, కాలికట్‌, రాంచి అన్ని సమావేశా లకు వెళ్ళాను. నా ఆలోచనల పరిధిని పెంచిన సమావేశాలివి. జాతీయస్థాయిలో పనిచేస్తున్న ఎందరో పరిచయమయ్యారు.
జయప్రభతో పరిచయం 'లోహిత' ఆవిర్భావానికి నాంది అయ్యింది. తెలుగులో మొట్టమొదటి స్త్రీవాద కరపత్రిక లోహిత ఇద్దరి ఆధ్వర్యంలో బయటకొచ్చింది. సంవత్సరం పాటు నడిచింది. ఒకటో రెండో సంచికలు వచ్చాక జయప్రభ అమెరికా వెళ్ళిపోవడంతో ఒక్కదాని నడిపాను. పత్రిక నడపడం అంటే ఏమిటో అర్థమైంది అప్పుడే. కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయినా నాకు మంచి అనుభవాన్నిచ్చింది లోహిత.
క్రమం తప్పకుండే అన్వేషి మీటింగులకి వెళ్ళడం మొదలుపెట్టాను. లలిత ఆధ్వర్యంలో అన్వేషి నిత్యచైతన్యంలా వుండేది. వీణ, రమా, సూజి, వసంత, భారతి వీళ్ళందరితో మాట్లాడటం ఎంతో బావుండేది. అక్కడి లైబ్రరీ, మీటింగులు, చర్చలు మనసు వికసించడానికి, స్త్రీవాదం నరనరాల్లో ఇంకడానికి చాలానే దోహదం చేసాయి. ఫెమినిజం అంటే ఏమిటో అర్థం చేసుకున్నది అన్వేషిలోనే. ''ఫెమినిస్ట్‌ స్టడీ సర్కిల్‌''లో మాట్లాడగలిగే స్థాయికి నేను ఎదిగింది ఇక్కడే. ఈ మీటింగులోనే అనుకుంటాను ఓల్గా పరిచయమైంది. అస్మిత పరిచయం, వసంత్‌తో పరిచయం కూడా ఇక్కడే. 'మూడుతరాలు' పుస్తకాల చర్చలు ఓల్గా రంగనాయకమ్మల వివాదం మీద వచ్చిన పుస్తకాలు ఇవన్నీ నాలో రకరకాల ముద్రల్ని వేసాయి. అప్పట్లో అన్వేషిలో ఒక పత్రిక తీసుకురావాలనే చర్చ జరుగుతుండేది. అన్వేషి టీమ్‌తో కలిసి సారా ఉద్యమ అధ్యయనం కోసం నెల్లూరు వెళ్ళడం జరిగింది. గ్రామ గ్రామాల్లో తిరిగాం. దూబకుంట రోశమ్మను కలిసిన గుర్తు.
చర్చోపచర్చల తర్వాత 1993 జనవరిలో 'భూమిక' మొదటి సంచిక బయటకు వచ్చింది. ఒక సామూహిక ప్రయత్నంగా నేను ఎడిటర్‌గా భూమిక మొదలైంది. మొదటి సంవత్సరాల్లో ఎక్కువ పని సజయ చేసేది. మేము సహకరించేవాళ్ళం. డి.టి.పి. డిజైన్‌, ప్రింటింగు, పోస్టింగు అన్నీ కలిసి చేసేవాళ్ళం. అన్వేషిలోనే మాకు చిన్న రూమ్‌ ఇచ్చారు. అక్కడి నుండే భూమిక వచ్చేది. నిజానికి అన్వేషి అండ లేకుంటే భూమిక మనగలిగేది కాదు. చాలా కాలం అన్వేషి ఆఫీసులోనే కొనసాగింది. భూమిక నిలబడడానికి 'నిర్ణయ' ద్వారా ఇందిరజెన అందించిన సహకారం ఎంతో వుంది.
1996లో బాగులింగంపల్లికి భూమిక ఆఫీసు మారిపోయింది. ఒక సామూహిక ప్రయత్నంగా మొదలైనా క్రమంగా, వివిధ కారణాల వల్ల వ్యవస్థాపక సభ్యులంతా వెళ్ళిపోయినా భూమిక పట్ల నాకున్న ప్రేమ, నిబద్ధతతో నేను మాత్రం వదలలేక పోయాను. బహుశా నేను కూడా వదిలేసి వుంటే ఖచ్చితంగా భూమిక మూతపడివుండేది. ఎన్నో ఘర్షణలు, సంఘర్షణలు తట్టుకుని ఒక సామాజిక బాధ్యతగా భూమికను కొనసాగించాను. ఇప్పటికీ అదే ఉద్దేశ్యంతో నడిపిస్తున్నాను.
నా ఈ అనుభవాలను మీతో పంచుకోవడానికి నేను చాలా సందేహించాను. ఓ ఉదయాన్నే ఛాయాదేవిగారికి ఫోన్‌చేసి భూమికతో నేను ఎదిగిన క్రమాన్ని భూమిక పాఠకులతో పంచుకోవాలనిపిస్తుంది. ఇది కరక్టేనా అని అడిగినప్పుడు తప్పకుండా రాయండి అని ప్రోత్సహించారు. ప్రతిమ కూడా అదేమాటన్నది. ఇంక ధైర్యంగా రాయడం మొదలుపెట్టాను. ఇరవై ఏళ్ళ అనుభవాలు. నా జీవితంలో సుదీర్ఘకాలం భూమికతోనే గడిచింది. భూమిక నా పేరులో భాగమైపోయింది.
ఒక చిన్న పల్లెటూరులో పుట్టి, పొట్ట చేత పట్టుకుని నగరానికొచ్చిన నేను నా జీవితాన్ని అంచెలంచెలుగా నేనే నిర్మించుకున్నాను. జీవితంలోని ఏ దశలోను ఎక్కడా రాజీ పడింది లేదు. కులాలకతీతంగా, సంప్రదాయ విరుద్ధంగా కట్నప్రశక్తి లేని నాస్తికత్వం జీవన విధానంగా వుండే వ్యక్తినే నా సహచరుడుగా చేసుకోవాలనుకున్నాను. అది నా జీవితకాశయం. అలాంటి వాడు దొరక్కపోతే పెళ్ళే వద్దనుకున్నాను. గమ్మత్తుగా అంతర్జాతీయ నాస్తికసభల్లో నేను కోరుకున్న మనిషి దొరికాడు. అది కూడా చాలా చిత్రంగా నాస్తిక సభల సందర్భంగా విజయవాడ నాస్తిక కేంద్రం (గోరాగారిది) మహిమలకు వ్యతిరేకంగా నిప్పులమీద నడిచే కార్యక్రమం పెట్టారు. నేను కణ కణ మండే నిప్పుల గుండం మీద నడిచి తూలిపోబోతున్నపుడు ఓ చేయి నన్ను పడకుండా ఆపింది. నాసికత్త్వం పునాదిగా ఆ చేతిలో చెయ్యేసి అతడినే నా జీవన సహచరుడుగా చేసుకున్నాను. ఆశయాలకోసం, ఆదర్శాల కోసం రాజీ పడని కాలమది. గుండెల్నిండా ఆశయాల అగ్ని రగులు తుండేది. నాస్తికత్వం నేటికీ నా జీవన విధానమే. నా బతుకును నానుండి దూరం కాకుండా చేసుకోవడానికి, నా జీవితం నా చేతుల్లోంచి జారిపోకుండా వుండడానికి నేను చాలా సంఘర్షణే చేసాను. చేస్తూనే వున్నాను.
ఎనభైలలో తెలుగు సాహిత్యాన్ని ముంచెత్తిన స్త్రీవాదకెరటం నన్నూ బలంగానే తాకింది. నా కథల్లోకి దూకింది. మెల్లగా వ్యాసాల్లోకి, కాలమ్స్‌లోకి మళ్ళింది. కథలు రాయలేకపోతున్నాననే అసంతృప్తి కలుగుతున్నా నేను మొదటి రోజుల్లో రాసినంత వాడిగానే ఈనాటికీ వ్యాసం, ఎడిటోరియల్‌ రాయడం వెనుక వున్నది ఏ మాత్రమూ తగ్గని స్త్రీల మీద హింస మాత్రమే. స్త్రీల మీద నిరంతరాయంగా, నిస్సిగ్గుగా అమలవుతున్న కౄరమైన మానసిక, శారీరకహింస నాలో పెను కోపాన్ని పుట్టిస్తుంది. నా ఆవేశాన్ని, ఆవేదనని వ్యక్తీకరించుకోవాలంటే వాడిగానే రాయాలి. భూమిక ఎడిటర్‌గా నాకున్న అనుభవాలకు భిన్నమైనవి హెల్ప్‌లైన్‌ అనుభవాలు. ఉదయం లేచిన దగ్గరనుండి, రాత్రి నిద్రపోయే వరకు హెల్ప్‌లైన్‌లో బాధిత స్త్రీల కన్నీళ్ళు కౌన్సిలర్‌ల చెవుల్లోకి ఇంకు తుంటాయి. వాళ్ళు మాటల్లోంచి నేరుగా నా గుండెల్లోకి జారు తుంటాయి. నిత్య హింసల కొలుముల్లో ఇంత మంది స్త్రీలు మగ్గు తుంటే అవన్నీ వింటుంటే గుండె భగ భగ మండుతుంది.
ఆ రోజు 'డౌరీ డెత్‌ కమిటీ' మీటింగులో ఆ పిల్ల కార్చిన కన్నీళ్ళు నన్నెంతగా కలవరపెట్టాయో ఈనాటికీ ఆ కలవరం, క్రోధం నన్నంటి పెట్టుకునే వున్నాయి. అవే నన్ను నడిపిస్తున్నాయి. పత్రిక నడిపినా, బాధితుల పక్షాన హెల్ప్‌లైన్‌ నిర్వహించినా నా ఆశయం ఒక్కటే. స్త్రీల కోసం పనిచెయ్యడమే. హింస లేని సమాజం కోసం కృషిి చెయ్యడమే ఆ ఆశయం.
ఈ రోజున ప్రపంచం వందేళ్ళ మహిళాదినం జరుపు కుంటున్న నేపధ్యంలోంచి చూసినపుడు, నేను నడిచివచ్చిన మార్గాన్ని వీక్షించుకున్నపుడు నాకు చాలా సంతృప్తిగానే అనిపిస్తుంది. వ్యక్తిగతంగా నేను ఎంచుకున్న మార్గంలోనే నేను నడస్తున్నాననే అనిపిస్తుంది. అయితే ఈనాటి మహిళ ఎదుర్కొంటున్న హింస మాత్రం తీవ్రంగా నన్ను ఉద్విగ్నపరుస్తుంది. ఇంకా ఎంతో చెయ్యాలనే కర్తవ్యాన్ని బోధిస్తుంది. మరోసారి ఉవ్వెత్తున స్త్రీ ఉద్యమం ఎగిసిపడాల్సిన ఆవశ్యకత గురించి కలలు కనమంటుంది. ప్రపంచీకరణ మాయాజాలంలో మునిగి తేలుతున్న మనం జూలు విదిలించాల్సిన అవసరం ఎంత ఉందో, స్త్రీల మీద అమలవుతున్న నేరాల చిట్టా తేల్చి చెబుతుంది.
అభివృద్ధి ముసుగులో ఛిద్రమైపోతున్న స్త్రీల జీవితాలు ట్రాఫికింగులో తెల్లవారుతున్నాయి. గృహహింసచట్టం వచ్చినా ప్రతిరోజూ వేలాది స్త్రీల బతుకుల్ని మసిబారుస్తూనే వున్నాయి. ఇంత జరుగుతున్న పౌరసమాజం స్త్రీల పక్షాన మాట్లాడక పోవడం వెనుక కారనమేంటో అన్వేసించాల్సిన అవసరం ఈ రోజు చాలా వుంది. చట్టాల కోసం డిమాండ్‌ చేసినంతగా అమలు కోసం ఉద్యమించని స్త్రీల ఉద్యమ వైఫల్యమెంతో అంచనా వేయాల్సి వుంది. కొత్త కొత్త చట్టాలు వచ్చేసాయని సంబరపడిపోతే సరిపోతుందా?ఈ తరానికి స్త్రీవాద భావాలను, మానవీయ కోణాలను అందివ్వలేకపోవడం మన వైఫల్యం కాదా? ప్రపంచీకరణ మిగిల్చిన విధ్వంసంలో అన్ని విలువలు కొట్టుకుపోతున్నా, మునుపెన్నడూ లేని తీవ్ర స్థాయిలో ఇంటా బయటా హింస పెచ్చరిల్లి పోతున్నా మనమెందుకు సామూహిక చర్యలకి దిగలేకపోతున్నాం. నేను లోంచి మనలోకి నడిచిన ఆనాటి తరం, మనలోంచి నేను లోకి జారిపోతున్న ఈనాటి తరం. ఈ మార్పు భీతిగొల్పుతుంది. భయపెడుతుంది. మనల్ని ఏకాకులుగా మార్చేస్తుంది. చుట్టూ ఏం జరుగుతోందో చూడనివ్వని బండ తనంలోకి నెట్టేస్తుంది. ఈ రోజు మీడియా ప్రదర్శిస్తున్న విశృంఖల, వినాశకర ధోరణివల్ల స్త్రీలు మరింత హింసకు గురౌవుతున్నారు. చిన్న పిల్లల్ని సైతం వదలకుండా వేటాడుతున్న వైనం దిగ్భ్రమకు గురిచేస్తోంది.
మార్చి ఎనిమిదికి వందేళ్ళు నిండిన సందర్భంగా మనమెక్కడున్నాం అని సమీక్షించుకుంటున్నపుడు, స్త్రీల ఉద్యమంలో భాగమైన జీవితాన్ని జ్ఞాపకాల్ని, నెమరు వేసుకుంటుంటే ఓ గొప్ప ఉద్వేగంతో పాటు విషాదమూ కలుగుతోంది. చెయ్యాల్సింది ఇంకా కొండంత మిగిలిపోయిందని గోరంతకే పొంగిపోతే అర్ధం లేదని కూడా అర్ధమౌతోంది. ఎవరి కన్నీళ్ళైతే నన్ను కలవరపెట్టి కర్తవ్యబోధ చేసాయో, ఆ కన్నీళ్ళని కొంతైనా తుడవగలిగేలా నన్ను నేను మలుచుకోగలిగాననే గర్వం నా గుండెల్నిండా వుంది. నేను ఎంచుకున్న దారిలోనే గత ఇరవై సంవత్సరాలుగా నడవగలిగిన గుండె నిబ్బరాన్ని నేను అలవరచుకోగలిగాను. ఇది నాకెంతో సంతృప్తిని మిగిల్చింది.
ఓ చిన్న గ్రామంలో మొదలైన నా ప్రయాణం, స్త్రీల ఉద్యమంతో మమేకమై, స్త్రీల అంశమే ఊపిరై కడదాకా సాగాలన్నదే నా కోరిక. ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వున్న వాళ్ళమంతా ఖచ్చితంగా మనమెక్కడున్నాం, ఎవరి పక్షాన వున్నాం అని ప్రశ్నించుకోవాల్సిన సందర్భమిది. ఆ ప్రశ్నని నన్ను నేనే వేసుకుని సమాధానాన్ని అన్వేషిస్తూ సాగిందే ఈ వ్యాసం. నేను పబ్లిక్‌లోనే వున్నాను. ఈ రాతలో తప్పొప్పొలు, అభిజాత్యాలు వుంటే నన్ను నిర్ద్వంద్వంగా నిలదీయండి.

Friday, March 12, 2010

హమ్మో!!!! ఎన్ని మోదుగపూలో !!!!!


నువ్వూ నేనూ మోదుగ పూలూ
మార్చి ఎనిమిది మీటింగులో ప్రసంగించి
నేనూ నా నేస్తం సిద్దిపేటకెళ్ళి వస్తుంటే
కరీంనగర్ రహదారిలో కన్నులపండుగగా మోదుగపూలు.
కాదు కాదు మోదుగ వనాలు .
ఒకటా రెండా హమ్మో ఎన్ని వనాలో !
మోదుగపూలని
కావలించుకుని ఫోటో దిగితే కాని తనివి తీరలేదు.
నేనూ నా ఫ్రెండూ
ఒకటే కేరింతలు,తుళ్ళింతలు
అడవి అంటుకుందా అనిపించేలా
ఎర్రని మంటల్లా మోదుగపూలు
మండుటెండలో కూడా మమ్మల్ని సమ్మోహపరిచిన
మళ్ళీ మళ్ళీ రమ్మంటూ మత్తులో ముంచెత్తే
మోదుగ పూలు

Tuesday, March 9, 2010

ఓ భార్య రాసిన కవిత

నేను వండిన కూర అతనికి నచ్చలేదు
నేను చేసిన కేకూ నచ్చలేదు
అతనన్నాడు
నేను చేసిన బిస్కట్లు గట్టిగా ఉన్నయని
వాళ్ళ అమ్మ చేసినట్టు లేవట
నేను కాఫీ కూడా సరిగ్గా చెయ్యలేదట
ప్రేమగా చేసిన స్వీటూ నచ్చలేదు
అతని తల్లి మడత పెట్టినట్టుగా
అతని బట్టలు నేను మడత పెట్టలేదట
నేను వీటన్నింటికి సమాధానం ఏంటీ అని వెతుకుతుంటే
ఒక క్లూ కోసం మధనపడుతుంటే
అతని తల్లి చేసినట్టే నేను ఏమైనా చెయ్యగలనా
అని ఆలోచిస్తుంటే
నా పెదవులమీద చిరుదరహాసం మొలకెత్తింది
ఓ వెలుగు కిరణం నా కళ్ళ ముందు కదలాడింది
ఓ పని ఖచ్చితంగా
వాళ్ళ అమ్మ చేసినట్టు
చెయ్యగలననిపించి
చాచి ఓ లెంపకాయ్ అతని చెంప మీద వేసాను.
వాళ్ళ అమ్మ ఎప్పుడూ చేసేలా

అనుసృజన:సత్యవతి కొండవీటి
(రచయిత్రి ఎవ్వరో తెలియదు)

Sunday, March 7, 2010

మాలో ఉన్న మనసు మాకు గాక ఇంకెవరికి తెలుసు?

http://www.andhrajyothy.com/navyaNewsShow.asp?qry=2010/mar/7/navya/7navya1&more=2010/mar/6/navya/navyamain


ఈసారి జుగల్‌బందీ ఎవరితో?
సంధ్య..
ఏ సంధ్య?
ప్రగతిశీల మహిళా సంఘం సంధ్య. పీఓడబ్ల్యూ సంధ్య.
అబ్బో ఫైర్‌బ్రాండ్. దులిపిపారేస్తుంది. నిప్పులు చెరుగుతుంది.
తర్వాత?
'భూమిక' ఎడిటర్ కొండవీటి సత్యవతి.
అవునా... ఆడవాళ్ల కోసం హెల్ప్‌లైన్ నడుపుతుంది... ఆవిడేగా...
అవును వాళ్లిద్దరే. రాష్ట్రంలో మహిళలకు, తెలుగు ఛానెళ్ల ప్రేక్షకులకు వీరిద్దరూ బాగానే తెలుసు. స్త్రీల సమస్యల మీద తక్షణం స్పందించే సంధ్య, సత్యవతులు ఫైర్‌బ్రాండ్సే. వాళ్లలో మామూలు మహిళలకుండే భావోద్వేగాలు లేవా? అందరి తరఫునా మాట్లాడే వాళ్ల అసలు స్వరం వినిపించినదెక్కడ? వాళ్ల మనసు సంగతులు ఎందరికి తెలుసు? వందేళ్ల అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఈ జుగల్‌బందీ 'నవ్య'కు ప్రత్యేకం.

సత్యవతి : అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో నా జీవితం తెలియకుండానే ముడిపడింది. '75 అంటే ముప్ఫై ఐదేళ్ల క్రితం ఒక మార్చిలో ఉదయం నేనూ మా నాన్నా ఆవుపాలు పిండుతూ రేడియో వింటున్నాం. 'ఈ ఏడాదిని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటిస్తున్నారం'టూ వార్తల్లో చదివారు. అది నాకు బాగా గుర్తు. ఆ ఏడే నేను నా కాళ్లమీద నిలబడాలని ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాను.

సంధ్య : 75 అంతర్జాతీయ మహిళా సంవత్సరంతో నాకూ కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలున్నాయి. ఇందిరాగాంధీ పాలనలో అవి చీకటి రోజులు. తపాలాపూర్ కుట్రకేసులో ఇరికిస్తారని మా పెదనాన్న ప్రవాసంలోకి వెళ్లారు, మా నాన్న అరెస్టయ్యారు. ఆయన బ్లాక్ డెవెలప్‌మెంట్ ఆఫీసరుగా ఉద్యోగం చేసేవారు. పేదలకు మేలు చేసేవారు. అందువల్ల ఆయన అరెస్టయ్యారని తెలిసినప్పుడు ఆ రోజుల్లోనే 1500మంది గ్రామీణులు అప్పటి మంత్రి బాలాగౌడ్ ఇంటిని చుట్టుముట్టి 'సారును వదిలిపెట్టండి' అంటూ నినాదాలిచ్చారు. తర్వాత మా నాన్న దెబ్బలతో స్పృహతప్పిన స్థితిలో సిరిసిల్ల బస్టాండులో కనిపిస్తే తీసుకొచ్చారు. ఆ సమయంలో మేం స్కూలుకెళ్తున్నప్పుడు ఎవరెవరో వచ్చి 'మీ ఇంటికి రవి మావయ్య వచ్చాడా, రాజన్న మామ వచ్చాడా , సత్యం తెలుసా...' అంటూ ఆరాలు తీసేవారు. మేం పిల్లలం అయినా, ఆ వివరాలు వాళ్లకు చెప్పకూడదని 'మాకేం తెలీదు' అనేసేవాళ్లం అమాయకపు మొహాలు పెట్టి. కొన్ని నెలల పాటు మా ఇంట్లోనూ ఎమర్జన్సీ వాతావరణం కనిపించేది. చాలామందిలాగా నాకు మా అమ్మానాన్నా ఏమీ కొనిచ్చి ప్రత్యేకంగా ముద్దుగా చూసిన జ్ఞాపకాలేమీ లేవుగానీ, వాళ్ల ప్రవర్తన ద్వారా నాలో నింపిన స్ఫూర్తి చాలా గొప్పది.

నవ్య : మీ ఇద్దరికీ బాల్యంలో గోదావరి అనేది ఉమ్మడి అంశం అనుకుంటాను...


సత్యవతి : పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం దగ్గర సీతారాంపురం అనే కుగ్రామంలో పుట్టాను నేను. గోదావరి నదికీ సముద్రానికీ మధ్యన అందమైన ఊరది. మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఎంత పెద్దదంటే రోజూ కనీసం వందమంది భోజనాలు ఇంట్లో! అంతమందిలో పిల్లల్ని ప్రత్యేకంగా పట్టించుకోవడం, ఏం తిన్నారు, ఏం చదువుతున్నారు వంటివి చూడటం జరిగేది కాదు. నాకు ఇద్దరక్కయ్యలు, అన్న, తమ్ముడు. మేం రోజంతా హాయిగా తోటల్లో చేలల్లో తిరగడం, ఇంటికొచ్చి ఉన్నదేదో తినేసి మళ్లీ ఆటలు. ఆడ మగ వివక్ష ఉండేదికాదు. ఇంట్లో అప్పటివరకూ చదువుకున్నవాళ్లెవరూ లేరు కనుక నేను చదువుకోవడానికి మాత్రం కష్టపడ్డాను. చాలాదూరం నడిచివెళ్లటం. సైకిలెక్కి వెళ్లాలంటే లంగాలు అడ్డం పడేవి. అలాగే నేను ఓరియంటల్ టెంత్ పూర్తి చేశాను. ఇంటర్లో తెలుగు, డిగ్రీలో ఇంగ్లిష్ సాహిత్యాలు ప్రధానాంశాలు. స్కూల్లో ఉపాధ్యాయులు, కాలేజీలో లెక్చరర్లు పుస్తకాలు చదవమని ప్రోత్సహించేవారు. అలాగే సమాజం గురించి తెలియజెప్పేవారు. ఇప్పుడదేం లేదు, ఎంతసేపూ ర్యాంకుల గోల.

సంధ్య : మా తాతల సమయంలోనే కృష్ణా జిల్లా నుంచి వరంగల్ అక్కడినుంచి ఆదిలాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్ల ప్రయాణం కొండపల్లిగారితో కలిసి సాగిందని చెప్పొచ్చు. నేను పుట్టింది ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట దొనబండ దగ్గర బుద్ధిపల్లి గ్రామంలో. మా పొలాలు దాటితే అడవి. పొలాలకూ అడవికీ మధ్య గోదావరి వాగులు. మా అమ్మది కృష్ణాజిల్లా కూచిపూడి దగ్గర బార్లపూడి. సెలవులకు వెళ్లొస్తుండేవాళ్లం. అప్పటివరకూ అంతా రైతు కుటుంబమేగానీ మా నాన్న బ్లాక్ డెవెలప్‌మెంట్ అధికారిగా ఉద్యోగస్తులయ్యారు. నాకో అన్నయ్య, ఒక తమ్ముడు. సత్యవతి వాళ్లలాగా మాదీ పెద్ద కుటుంబమే. మరీ వందమందని కాదుగానీ రోజూ కనీసం పాతిక ముప్ఫైమందికి భోజనాలుండేవి. నాన్న పెదనాన్నలకు రాజకీయ చైతన్యం ఎక్కువని చెప్పాను కదా, వాళ్లను కలవడానికి ఎవరోఒకరు వచ్చిపోతుండేవారు. నేను హైస్కూల్లో ఉన్నప్పుడు ప్రజాతంత్రలో వచ్చే 'రాజు-పేద'ను తోటి పిల్లలకు చదివి వినిపించేదాన్ని. శ్రీశ్రీ అనంతం, వాసిరెడ్డి సీతాదేవి సావేరి అప్పుడు చదివినవే. ప్రజాశక్తి, విశాలాంధ్ర, సృజన, నూతన, విమోచన వంటి పత్రికలను తెగ చదివేవాళ్లం.

సత్యవతి : అవును, ఆ పత్రికలంటే చాలా ఇష్టంగా ఉండేది.

నవ్య : మీరిద్దరూ ఒకరికొకరు తారసపడిందెక్కడ?


సత్యవతి : అదా.. తల్చుకుంటే భలే విచిత్రంగా ఉంటుంది. నేను బాగ్‌లింగంపల్లి బస్టాపులో నిలబడి పుస్తకం చదువుకుంటున్నాను. సంధ్య వచ్చి 'ఆ పుస్తకం నా చేతుల్లోంచి వచ్చిందే' అంటూ పరిచయం చేసుకుంది.

సంధ్య : అప్పట్లో నగరంలో భావసారూప్యత ఉన్న వ్యక్తులు పరిచయం కావడం కష్టం. అప్పటికే స్త్రీల కోసం పనిచేస్తున్న మేం రూపంలో కూడా సింపుల్‌గా ప్రత్యేకంగా కనిపించేవాళ్లం. అలా బస్టాపులో సత్యవతిని చూసేసరికి 'మావంటి మనిషే' అని తెలిసిపోయింది. బస్టాపులో నిలబడి మరీ పుస్తకాలు చదివేంత పిచ్చి ఎవరికుంటుంది? పైగా ఏ వారపత్రికో కాదు. మహాశ్వేతాదేవి రాసిన 'ఒక తల్లి' చదువుతోంది. అప్పట్లో నేను హైదరాబాద్ బుక్‌ట్రస్ట్‌లో పనిచేసేదాన్ని. ఆ పుస్తకాన్ని ప్రచురించింది మేమే. అందుకే అలా చెబుతూ పరిచయం చేసుకున్నాను.

సత్యవతి : మీకు తెలుసా, మన రాష్ట్రంలో ప్రింటింగ్ టెక్నాలజీని చదువుకున్న మొదటి మహిళ సంధ్యే. మేం కలిసింది 84లో అనుకుంటాను. మా స్నేహం బలపడింది రకరకాల ఉద్యమాల్లోనే. ముఖ్యంగా 'స్త్రీ శక్తి సంఘటన' వంటి సంస్థల ద్వారా చురుగ్గా పనులు చేపట్టడం తొలి దశ. 85లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఉద్యోగులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాం. మేమిద్దరం ఆటోకు మైక్ కట్టుకుని కూకట్‌పల్లి, వనస్థలిపురం అన్నీ తిరిగాం. నన్ను అరెస్టు చేసి రెండు రోజుల పాటు కంట్రోల్ రూమ్‌లో ఉంచారు! తర్వాత ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్‌లో మేం చేసిన సమ్మెల మూలంగానే ఉద్యోగినులకిచ్చే ప్రసూతి సెలవును 90 నుంచి 120 రోజులకు పెంచారు.

సంధ్య : సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా 'ఆడవాళ్లు ఉద్యోగాలంటూ బయట తిరుగుతుంటే వంటిళ్లేమవుతాయి, కుటుంబాలేమవుతాయి...' అనేలా వ్యాఖ్యలు చేశారు. దానికి దేశంలో తీవ్రమైన నిరసన వచ్చింది. మేం హైకోర్టులో ర్యాలీ చేసి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశాం. అది పూర్తిగా మా సారధ్యంలోనే జరిగింది! అలాంటి దుడుకు పనులెన్నో! ఇక్కడి విద్యారణ్య స్కూల్లో 'డౌరీ డెత్స్ ఇన్వెస్టిగేషన్ కమిటీ' సమావేశాల్లో తరచూ కలిసేవాళ్లం. అక్కడికి వరకట్న బాధితులు చాలామంది వచ్చేవాళ్లు. వాళ్లను చూసి సత్యవతి కదిలిపోయేది. ఒక కేసు వింటున్నప్పుడు ఆమె ఎంత కదిలిపోయిందంటే అప్పటి ఆమె కన్నీళ్లు నాకిప్పటికీ గుర్తున్నాయి.

సత్యవతి : నా జీవితాన్ని మలుపు తిప్పిన కన్నీళ్లవి. స్వరూప అని ఒకమ్మాయి తన అక్కను కట్నం కోసం బావ చంపేశాడని, ఎలాగైనా న్యాయం చెయ్యాలని లేదంటే తనే బావను చంపేస్తానని ఆవేశంగా మాట్లాడింది. ఆ అమ్మాయి చెప్పిన వివరాలు వింటున్నప్పుడు 'ఇంత అన్యాయమా' అని నాకు చాలా ఏడుపొచ్చేసింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, అలాంటివారికి అండగా నిలబడాలి, ఏమైనా చెయ్యాలి అని. అలా మొదలయినవే 'భూమిక' పత్రిక, భూమిక హెల్ప్‌లైన్.

నవ్య : కానీ కన్నీళ్లు నిస్సహాయతకు ప్రతీకలని, ముఖ్యంగా ఆడవాళ్లు మాట్లాడితే కన్నీరు పెట్టుకుంటారని ఒక అభిప్రాయం ఉంది సమాజంలో. మీలాగా ధైర్యంగా పనిచేస్తున్నవారు కన్నీళ్లు పెట్టుకోవడం అంటే...


సంధ్య : అవును. అందరూ అలాగే అనుకుంటారు. మొన్నటికి మొన్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానెల్లో మాజీ గవర్నర్ తివారీ లీలల విషయంలో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆపుకోలేనంత దుఃఖం వచ్చేసింది. రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, ఒక గౌరవనీయమైన పదవిలో ఉన్న వ్యక్తే అంత దిగజారిపోయి ప్రవర్తిస్తే ఇక దిక్కెవరు అనిపించింది. పైగా చాలామంది ఎంపీలు కూడా దానిలో భాగస్వాములని ఆరోపణలు విన్నప్పుడు - ఎంతమంది పెద్దమనుషులుగా ముసుగుల్లో చలామణీ అయిపోతున్నారో అని బాధవేసి కంట నీరొచ్చింది.

దాన్ని కూడా ఎకసెక్కం చేశారు కొంతమంది. సంధ్య కన్నీళ్లు పెట్టుకోవడం ఏమిటని నవ్వినవాళ్లు నాకు తెలుసు. ఇప్పుడేకాదు, ఒక ఛానెల్లో డూపుల మీద కార్యక్రమం వచ్చేది. దానిలో 'సేవల సంధ్య' అంటూ నాకో డూప్‌ను తయారుచేశారు. ఆమె ఆడవారి సమస్యలకు పరిష్కారాలు చెబుతుంటే లోపల్నుంచీ భర్త 'విడాకుల కాగితాల మీద సంతకం పెట్టవే...' అని హుంకరిస్తాడు. ఈమె 'ఏమండీ...' అని బెరుగ్గా వెళ్లిపోతుంది. ఏవిటి అందులోని హాస్యం? దానిద్వారా ఏరకమైన సందేశం జనాలకు పంపదలచుకున్నారు వాళ్లు? సాటి స్త్రీలకోసం పనిచేసేవాళ్లంటే అంత చులకనా?

సత్యవతి : నిజానికి బాధితుల కథలు వింటున్నప్పుడు ఒకోసారి చాలా ఎమోషనల్‌గా అయిపోతాం. కన్నీళ్లూ సహజమే. దాన్ని గుర్తించకుండా కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారు, వెటకారాలు చేస్తుంటారు. అదెంత బాధ కలిగిస్తుందో ఎవరూ అర్థం చేసుకోరు. మగవాళ్లు కుటుంబాన్ని నిర్లక్షం చేసి సమాజం కోసం పనిచేస్తుంటే 'ఆయన కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా పరుల కోసం పనిచేశాడు...' అని పొగుడుతారు. అదే మహిళ అదే పని చేస్తే మాత్రం 'ముందు ఇంటిని పిల్లలనూ చక్కదిద్దుకోకుండా ఎవర్ని ఉద్ధరిస్తావు..' అన్న తరహాలో మాట్లాడతారు.

సంధ్య : దాదాపు పాతికేళ్లుగా చేస్తున్న ప్రయాణం ఇది. ఇందులో ఎదురైన ఇబ్బందుల్ని అధిగమించాం.. మమ్మల్ని అరెస్టులు చేయించినా, బెదిరించినా, చంపేస్తామంటూ అర్థరాత్రి ఫోన్లు వచ్చినా... తట్టుకున్నాంగానీ స్నేహితులుగా నటిస్తూ ఇలా వెటకారాలు చేసినప్పుడు మాత్రం చాలా బాధకలుగుతుంది. ఇంట్లో ఉదయం లేచి అందరిలాగానే వంటపని, ఇంటిపని అంతా చేసుకుని బైటకొచ్చి బాధితుల తరఫున మాట్లాడుతున్నప్పుడు - దాన్ని గుర్తించకపోయింది సరికదా, ఈ కామెడీ ఏమిటి?

నవ్య : గడచిన ఇరవయ్యేళ్లలో సమాజ స్వరూపం మారిపోయింది. వరకట్నం వంటి సమస్యలు అలాగే ఉన్నాయి, వాటికితోడు యాసిడ్ దాడుల వంటివి కొత్తవి వచ్చిపడుతున్నాయి. మరొకవైపు ఉద్యమాలు, సామాజికస్పృహ వంటివి తగ్గుముఖం పడుతున్నాయి. ఇటువంటి సందర్భంలో మీకు 'ఎవరికోసం ఇదంతా' అనే నిస్పృహ కలగదా? కుటుంబాల నుంచి సపోర్ట్ ఎంత?


సత్యవతి : 80లో గోరాగారు ప్రపంచ నాస్తిక మహాసభలు నిర్వహించినప్పుడు నిప్పులగుండాల్లో నడవడం అనేది భ్రమ అని చూపెట్టడానికి నేనూ నడిచాను. ఎందుకో చివరికొచ్చేసరికి తూలిపడబోతే ఒకాయన చెయ్యందించి సాయం చేశాడు. తర్వాత శ్రీశ్రీ సాహిత్యం అవీఇవీ మాట్లాడుతూ రైల్వేస్టేషన్‌కూ వచ్చారు. అలా మా పరిచయం పెరిగి జస్టిస్ వివిఎస్‌రావుగారు నా జీవిత భాగస్వామి అయ్యారు. 81 సెప్టెంబరు 5న ఇరవై రూపాయల ఖర్చుతో జరిగిన దండల పెళ్లి మాది.

సంధ్య :అప్పట్నుంచీ ఈవిడ ఏ నిప్పుల్లో నడిచినా ఆయన సాయం చేస్తూనే ఉన్నారన్నమాట. మావారు రామకృష్ణారెడ్డి ప్రింటింగ్ కోర్సు చదువుతున్నప్పుడు నా క్లాస్మేట్. మా చదువులైన పదేళ్ల తర్వాత పెళ్లి జరిగింది. సత్యవతికీ నాకూ బోలెడన్ని పోలికలు జీవితంలో. మా ఇద్దరివీ స్టేజీ పెళ్లిళ్లే. ఇద్దరం కొన్ని కారణాల వలన పిల్లలు వద్దనుకున్నాం, ఇద్దరికీ రంగవల్లి స్మారక అవార్డులు వచ్చాయి. మమ్మల్ని అక్కచెల్లెళ్లా అని ఎంతోమంది అడిగేవారు... సత్యవతి :మహిళారంగంలో పనిచేస్తున్నవారికి రంగవల్లి పురస్కారం రావడం ఎంతో గర్వకారణం. నాకన్నా ముందటేడు ఆ అవార్డునందుకుంటూ సంధ్య చేసిన ఉద్వేగభరిత ప్రసంగానికి హాల్లో అందరి కళ్లూ తడిసిపోయాయి.

సంధ్య : అప్పటి సత్యవతి మొహం నాకింకా గుర్తుంది. వందేళ్ల మహిళా దినోత్సవం జరుపుకొంటున్నా ఇప్పటికీ అవే సమస్యలు, ఇంకా సమానత్వం కోసం పోరాటమే. మీరన్నట్టు ఇప్పుడంతా కెరీరిజం. అందువల్ల అప్పుడప్పుడూ కాస్త నిరాశగా అనిపిస్తుంది. కానీ ఎక్కడో కలిసినప్పుడు, ఫోన్లోనో ఒకోసారి చెబుతారు... 'సంధ్యక్కా మీరు మాట్లాడింది విని ధైర్యం తెచ్చుకున్నాను, నా కుటుంబం నిలబడింది' ఇలా. అప్పుడు చాలా సంతృప్తిగా ఉంటుంది. అందరి తరఫునా మాట్లాడేవాళ్లకు చెప్పలేనంత స్ట్రెస్, అప్పుడప్పుడూ కొద్దిగా నిరాశ ఉంటాయి. ఇతరులు వచ్చి మాకు చెప్పుకుని తేలికపడతారు. మా సమస్యలు ఎవరికీ చెప్పుకోం. ఎవరికీ పట్టవు.

సత్యవతి : సంధ్య చెప్పింది అక్షరాలా నిజం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఇప్పుడు భూమిక హెల్ప్‌లైన్ నంబర్ ఎక్కువమందికి సాయం చేసింది. ఎక్కడైనా తారసపడినప్పుడు అది తమనెలా ఆదుకుందో చెబుతుంటారు స్త్రీలు. అది చాలా సంతోషంగా ఉంటుంది. ఓపిక ఉన్నంతవరకూ ఇలాగే కొనసాగాలనిపిస్తుంది.

పాతికేళ్ల స్నేహంలో ఎన్నో జ్ఞాపకాలు, సంఘటనలు, మరపురాని అనుభవాలు, అవమానాలు, నిరాశలు, సంతృప్తులు... కలబోసుకుంటుంటే కాలం తెలియకుండా పోవడం సహజమే. వీళ్లతో మాట్లాడుతున్నప్పుడు 'కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు..' పాట ఎక్కణ్నుంచో వినిపిస్తున్నట్టే అనిపించింది. ఇద్దరికీ ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంది నవ్య.

ఇంటర్వ్యూ : అరుణ పప్పు
ఫోటోలు : లవకుమార్

Wednesday, March 3, 2010

భల్లుగూడా ఆదివాసీ అక్కలకు జరిగిన అన్యాయాన్ని ఖండిచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను

మేము ఒక ఇంటి ముందు కూర్చున్నాము. మా చుట్టూ ఊరంతా చేరారు.

జనవరి 22 న అత్యాచారానికి గురైన ముగ్గురు మహిళలు కూర్చున్నారు.

మేము వారితో మాట్లాడడానికి ప్రయత్నించాం.అయితే ఆ ముగ్గురికి తెలుగు రాదు.
వాళ్ళ ముఖాలు ఎంత అమాయకంగా ఉన్నాయొ చెప్పలేను.అసలు ఏ భావమూ కనబడ లేదు.బహుశా ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టు ఉన్నారు.
22 జనవరి రోజు ఎమి జరిగిందో చెప్పడానికి అక్కడ ఒకరిద్దరు తెలుగు తెలిసిన వాళ్ళు ఉన్నారు.
రాంబాబు అనే ఆయన మాకు దుబాసీగా వ్యవహరించాడు.
ఒక్కరి తర్వాత ఒక్కరు తమ పట్ల పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తించిదీ చెప్పారు.
జనవరి 22 న దాదాపు 80 మంది గ్రేహౌండ్స్ పోలీసులు స్థానిక ఎస్ ఐ.కేశవ్ రావ్ తో సహ భల్లుగూడా గ్రామం మీద దాడి చేసి మగ వాళ్ళని,మగ పిల్లల్ల్ని దగ్గరలోని స్కూల్ లో పెట్టి తాళం వేసారు. ఆ తర్వాత పోలీసులు ఆదివాసీల ఇళ్ళళ్ళోకి చొరబడి నలుగురు స్ర్తీల మీద అత్యాచారానికి పాల్పడ్డారు.వంతల డోమిని,వంతల రామి,వంతల ముక్త,కిల్లో భుట్టొ లు పోలీసుసు తమ మీద అత్యాచారం చేసారని,అందులో ఒకరి చేతుల్లో ఉన్న పసి పిల్లని తుప్పల్లోకి విసిరేసాసారని వివరించారు.అత్యాచారానికి గురైన ఇద్దరి భర్తలని అరెష్టు చేసి విశాఖ జైల్లో ఉంచి బాగా కొట్టారని రాంబాబు చెప్పాడు.

జనవరి 23 న పాడేరు ఎం ఎల్ ఏ రాజా రావ్ కి తమకు జరిగి దారుణం గురిచి చెప్పుకున్నా మూడు రోజుల వరకు కేసు బుక్ చెయ్యలెదు స్థానిక పోలీసులు.కేసు రిజిస్టర్ చెయ్యకపోగా భల్లుగూడా గ్రామస్తుల్ని తీవ్రంగా బెదిరించారు.
వైద్య పరీక్షలకి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు.

ప్రతి రోజు రాత్రిళ్ళు పోలీసులు తమ గ్రామం చుట్టు తిరుగుతున్నారని,తమని బెదిరిస్తున్నారని గ్రామస్తులు భయపడుతూ చెప్పారు.

తమకి పోలీసులంటే చాలా భయమని,ఓ పదేళ్ళ క్రితం ఇలాగే తమ గ్రామం మీద పడి తమ పెద్దల్ని భయంకరంగా కొట్టారని,ఆ సంఘటనని తాము ఎప్పటికి మర్చిపోలేమని, తమకు నక్సలైట్ల గురించి ఏమీ తెలియదని గద్గద స్వరాలతో చెప్పారు. డొమిని రామి, ముక్తలతో ఇంకా ఎక్కువ మాట్లాడాలని మాకు ఉన్న భాష అడ్డం వచ్చింది.వారి ముఖాల్లో 22 తేదీ నాటి ఘోరం తాలుకూ భయం స్పష్టంగా కనబడుతోంది. వారి ముఖాల్లోని అమాయకత్వం,ఎలాంటి భావాన్ని వ్యక్తం కానివ్వని ఆ అమాయకత్వం మా కళ్ళళ్ళొఓ నీళ్ళు పెట్టించిది.
క్రితం సంవత్సరం ఇదే విధమైన అత్యాచారనికి గురైన వాకపల్లి మహిళలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ భూమి చెబితే ఆకాశం నమ్మదా అంటూ నిలదీసారు.
భల్లుగూడా దోమిని,రామి,ముక్త లు మాత్రం కన్నీళ్ళని సైతం కోల్పోయినట్లు కనబడ్డారు.
భారమైన గుండెలతో,వారికి న్యాయం జరిగేలా క్రుషి చేస్తామని,ఈ మారు మూల ఆదివాసీ గ్రామం లో జరిగిన ఈ బీభత్సకాండ గురించి ప్రపంచానికి తెలియ చెబుతామని వారికి చెప్పి చిక్కటి చీకటిలో కొండలెక్కి అడవి దాటి రాత్రి ఒంటి గంటకి వైజాగ్ చేరాం.
ఆ రాత్రి దుఖంతోనే కడుపు నిడిపోయింది.ఎవ్వరం అన్నాలు తినలేదు.
ఆ అమాయక అదివాసీ ల ముఖాలు కళ్ళళ్ళొంచి కదలడం లేదు.
భల్లుగూడా ఆదివాసీ అక్కలకు జరిగిన అన్యాయాన్ని ఖండిచాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.

Monday, March 1, 2010

భల్లుగూడ లో గిరిజన మహిళలపట్ల గ్రేహౌండ్స్ పోలీసుల బీభత్స కాండ





ఫిబ్రవరి ఇరవై ఆరున కొంతమంది రచయిత్రులం  కలిసి
విశాఖ జిల్లా భల్లుగూడలో గ్రేహౌండ్స్ పోలీసుల అత్యాచారానికి గురైన గిరిజన మహిళలను కలిసాం.
ఉదయం పది గంటలకి విశాఖలో బయలుదేరి పాడేరు మీదుగా రెండు టాటా సుమోల్లో  బయలుదేరాం.భల్లుగూడా బాధిత స్త్రీలు పాడేరు వస్తారని ముందు చెప్పారు.
కానీ మేమే భల్లుగూడా వెళ్ళాల్సి వచ్చింది.
దాదాపు పది కిలోమీటర్లు కొండల్లో,అడవిలో నడవాలని చెప్పడంతో చాలామంది వాహనాల్లోనే ఉండిపోయారు.
నేను మరో ఏడుగురం  నాలుగున్నరకి  భల్లుగూడకి బయలుదేరాం.
దారంతా రాళ్ళు,రప్పలతో నిండి ఉంది.
రెండు కొండలెక్కి దిగడంతో నాకు చాలా అయాసం వచ్చేసింది.
మధ్యలో దట్టంగా చెట్లు అల్లుకున్న అడవి.
కొండలెక్కి అడవి దాటి భల్లుగుడా చేరేసరికి సూర్యాస్తమమౌతోంది.
మా కోసం ఊరంతా ఎదురుచూస్తోంది.
అత్యాచారానికి గురైన ముగ్గురు స్త్రీలు మాతో మాట్లాడడానికి
సిద్ధమయ్యారు....................

(మిగిలింది రేపు చదవండి)

Thursday, February 18, 2010

మహిళలకు సహాయ కేంద్రం




మహిళలకు సహాయ కేంద్రం
మహిళా పోలీస్‌ స్టేషన్‌, సిసిఎస్‌, హైదరాబాద్‌

   ఈ రోజు ఉదయం 11 గంటలకు  నగర పోలీస్ కమీషనర్ ఎ.కే ఖాన్ ప్రారంభించారు. మీటింగ్ ఉండడం వల్ల సబితా ఇంద్రా రెడ్డి ఈ కార్యక్రమానికి రాలేక పోయారు.
    మహిళలపై నానాటికీ పెచ్చరిల్లుతున్న హింస మానవ హక్కులకు విఘాతంగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో బాధితుల అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని, పోలీస్‌ స్టేషన్లలోనే మహిళా సహాయ కేంద్రాల్ని నెలకొల్పడమన్నది ఒకానొక వ్యూహాత్మక ప్రతిపాదనగా ముందుకొచ్చింది. మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోలీసు విభాగంతో పాటు, ఆక్స్ ఫాం ఇండియా, స్వార్డ్ సంస్థల సమష్టి కృషి ఫలితంగా ఈ ప్రతిపాదన కార్యరూపాన్ని సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో 2004లో ప్రారంభమైన ఈ మహిళా సహాయ కేంద్రాల ఏర్పాటు నేడు పౌరసమాజమూ, ప్రభుత్వాల మధ్య అద్భుత సమన్వయ సహకారానికి తార్కాణంగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రోత్సాహకర అనుభవం ఆధారంగా సహాయ కేంద్రాల ఏర్పాటు డిఎఫ్యైడి సహకారంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు (వరంగల్, కరీంనగర్, అనంతపురం) విస్తరించింది. శ్రీ ఎ.కె.ఖాన్‌ అదనపు డిజిపి (లా అండ్‌ ఆర్డర్)గా పనిచేస్తున్న కాలంలో దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో పదిచోట్ల సహాయ కేంద్రాల్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉంది. ఈ దిశగా సంయుక్త కార్యాచరణకు సంబంధించిన ఒక ఒడంబడికని డిజిపి కార్యాలయం ఆమోదించాల్సి
 ఉంది.
    ఐదు లక్షల రూపాయల వ్యయంతో సహాయ కేంద్ర నమూనా నిర్మితమైంది. ఇటువంటి కార్యక్రమానికి ఇంత భారీ స్థాయిలో నిధుల్ని అందించడమన్నది  ఆక్స్ ఫాం ఇండియా చరిత్రలో ఇదే మొదటిసారి. వైవాహిక, గృహ హింసలనెదుర్కుంటున్న మహిళల సమస్యల్ని పరిష్కరించాలంటే అందుకు సానుకూల వాతావరణంతోపాటు, గోప్యమైన విచారణ కూడా అవసరం. ప్రధానంగా ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకునే సహాయ కేంద్ర రూపకల్పన జరిగింది. ముఖ్యంగా ఫిర్యాదుదారులతో పాటు వచ్చే వృద్ధులు, పిల్లలు రోజల్లా స్టేషన్‌ వెలుపలే వేచి ఉండాల్సిన అగత్యముండేది. ఈ అసౌకర్యాన్ని కూడా గుర్తించే కేంద్ర రూపకల్పనలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంతేగాక కేంద్రనిర్వహణలో కొందరు మానసిక వైద్యులు, మనస్తత్వవేత్తలు వంటి నిపుణుల సహకారం అవసరమవుతుంది కనుక, వారిక్కూడా కొంత చోటును కేటాయించాల్సి వచ్చింది. 
   హింసలకి గురైన బాధితులు, ఫిర్యాదుదారులపై ప్రతిదాడులు జరగకుండా నిరోధించేందుకు అన్ని కోణాల్లోనూ సహకరించడంతో పాటు, మహిళలపై హింసకు వ్యతిరేకంగా యువతని, కుటుంబాల్ని, అన్ని సామాజిక వర్గాల్ని చైతన్యపరచడం ప్రధాన బాధ్యతగా సహాయ కేంద్రాలు పనిచేస్తాయి. ఇలాంటి వ్యవస్థ మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, ఒరిస్సా, రాజస్థాన్‌లలో ఇదివరకే అమల్లో ఉంది. ఉత్తరప్రదేశ˜, గుజరాత్
లలో సహాయ కేంద్రాల ఏర్పాటు ఇంకా ప్రారంభదశలో ఉంది.
    పోలీసు స్టేషన్‌ ప్రాంగణంలోనే వ్యూహాత్మకంగా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల నేరాలకు సంబంధించి న్యాయవ్యవస్థ పరిధిలోనే బాధిత మహిళలకు మానసిక, శారీరక, భావోద్వేగ పరమైన రక్షణతోపాటు చట్టపరమైన ఆశ్రయాన్ని కల్పించినట్టవుతుంది. సహాయ కేంద్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్లయిన (సామాజిక సేవ, సామాజిక శాస్త్రాలు) ఇద్దరు సామాజిక కార్యకర్తలు హింసకు గురైన మహిళలకు, పిల్లలకు చట్టపరమైన సలహాలతో పాటు, అన్ని విధాలైన సహాయ సహకారాల్ని అందిస్తారు. 
మహిళలు, పిల్లలకు సహాయాన్నందించడంలో కేంద్రం పాత్ర, విధివిధానాలు
    - బాధిత మహిళలకు మానసిక స్థయిర్యాన్ని కలిగించడంతో పాటు, వారికి భావోద్వేగ పరమైన సహాయాన్ని అందించడం
    - హింసను విడనాడే విధంగా హింసకు పాల్పడిన, అందుకు సహకరించిన వ్యక్తులతో అవసరమైన చర్చలు జరపడం
    - మహిళలకు అవసరమైన అన్ని సహాయ వ్యవస్థల్ని పెంపొందించే విధంగా కృషి చేయడం
    - మహిళలకు ప్రయోజనం చేకూరే విధంగా పోలీసు సహకారం కోసం ప్రయత్నించడం
    - చట్టపరమైన సహాయాన్నందించడం
    - తాత్కాలికంగానైనా హోమ్స్, ఇనిస్టిట్యూషన్స్, హాస్టళ్ళు,తదితర మార్గాల ద్వారా బాధిత మహిళలకు ఆశ్రయం కల్పించడం
    - బాధిత మహిళలకు అండగా నిలిచే పురుషులతో కలిసి పనిచేయడం,
    - స్త్రీధనం వంటి ఆస్తుల పునర్నిర్మాణం, పరిరక్షణ దిశగా బాధిత మహిళలకు సహాయమందించడం
    - యువతరం, విద్యా సంస్థలు, సామాజిక వర్గాల్లో మహిళలపై హింసకు వ్యతిరేకంగా అవగాహన పెరిగేలా వారితో కలిసి పనిచేయడం
    - నేరం జరిగిన తరువాత, సంక్షోభానంతర కాలంలో బాధిత మహిళలకు మరింత మానసిక స్థయిర్యాన్ని కల్పించేలా కవ్న్సెలింగ్ నిర్వహించడం

Saturday, February 13, 2010

నేనొక్కదాన్ని కోణార్క్, పురి వెళ్ళొచ్చానోచ్!!!







భువనేశ్వర్ వచ్చింది మహా సీరియస్ మీటింగ్ కి.
జెండర్ బడ్జెట్.బడ్జెట్ ని స్త్రీల ద్రుష్టి కోణం నుండి,
జెండర్ పర్స్పెక్టివ్ నుండి ఎలా అర్ధం చేసుకోవాలి
అనే అంశం మీద మీటింగ్ జరిగింది.
కెంద్ర ప్రభుత్వం గ్రుహ హింస నుండి స్త్రీలకు రక్షణ కల్పించే చట్టం తెచ్చింది గానీ
దాని అమలుకు సరిపడిన నిధులివ్వడం లేదు.
జెండర్ బడ్జెట్ కు,ఈ అంశానికి ఉన్న లింక్ కు సంబంధించి
భువనేశ్వర్ లో ఒకటిన్నర రోజులు మీటింగ్ జరిగింది.
చర్చోపచర్చలు,తీర్మానాలు అయ్యాయి.
బుర్ర వేడెక్కిపోయి చల్లగాలి పీల్చుకోకపోతే పిచ్చెక్కిపోయేలా ఉందని కారు బుక్ చేసుకుని కోణార్క్ కి పారిపొయ్యా.
కోణార్క్ శిల్ప సౌందర్యం రెండు కళ్ళు విప్పార్చుకుని చూడాల్సిందే.
అద్భుత శిల్పవిన్యాసం.
ఎన్నివేలమంది శిల్పులు అహర్నిశలు అన్నపానాలు లేకుండా చెక్కారో.
సూర్యుడి రధచక్రాలను చూస్తుంటే ఆ రధం కదులుతున్నదా అనే భ్రమ కలుగుతుంది.
కోణర్క్ చూడడం గొప్ప అనుభవం.
కోణర్క్ నుండి సముద్ర తీరం వెంబడి పురి వెళ్ళడం
మరో అపూర్వానుభవం.
వైజాగ్ నుండి భీమిలి వెళ్ళే రోడ్డులా ఉంటుంది.
దీన్ని మెరైన్ డ్రైవ్ అంటారట.
మధ్యలో దట్టమైన అడవి కూడా వస్తుంది.
పురి బీచ్ అండమాన్ బీచ్ లాగా అనిపించింది.
స్వచ్చంగా,శుభ్రంగా వుంది.
నీలి ఆకాశం రంగులో మిల మిల మెరిసిపోయే నీళ్ళు.
ఇటీవల అక్కడ సముద్రం రోడ్డు మీదకొచ్చేసిందట.అక్కడ రోడ్డు కోతకు గురైంది.
నేను నీళ్ళల్లోంచి బయటకు వచ్చేస్తుంటే కెరటాలు నా పాదాలను పట్టుకొని వెళ్ళిపోవద్దని బతిమాలినట్టు అనిపించింది.
నేను పొవ్వాలని వెనక్కి తిరిగానో లెదో కెరటాలు ఎగురుకుంటూ వచ్చి మళ్ళి మళ్ళీ నా పాదాలను తాకుతూనే ఉన్నాయి.
వెళ్ళొద్దని అడుగుతూనే ఉన్నాయి.
దిగులుగానే వాటిని వదిలేసి జగన్నాధ గుడి వేపు మళ్ళిపోయాను.
అక్కడి కెళ్ళడం ఓ భయంకరానుభవం.
ఇరుకిరికు రోడ్డు,ఆ రొడ్డు నిండ యాచకులు,పశువులు,దుకాణాలు.
గుడిముందు ఏమిటొ మంటలు.గుళ్ళోకి తీసుకెళ్ళి దర్శనం చేయిస్తానంటూ వేధించే పురోహితులు.
వద్దు మొర్రో అంటే వినడు.
నేను గుళ్ళో కెళ్ళను బాబో అంటే నన్నో వింత మ్రుగాన్ని చూసినట్టు చూసి క్యోం ఆయా ఇత్నా దూర్ అంటూ లెక్చరివ్వబోయాడు.
అతన్ని తప్పించుకుని,పురి ఇరుకులోంచి బయటపడి
భువనేశ్వర్ వైపు సాగిపోయా.
కోణర్క్, పురి బీచ్ చూడడం మహాద్భుతం.మంచి అనుభవం.
మొదటి సారి భువనేశ్వర్ వచ్చి ఒక్కదాన్ని  కోణార్క్,పూరి వెళ్ళిరావడం మహా థ్రిల్లింగ్ గా ఉంది.

Thursday, February 4, 2010

ఇంఫాల్ ఎక్ పల్ హసి -ఎక్ పల్ ఆశు

2008లో పూనాలో జరిగిన మహిళా జర్నలిస్ట్‌ల ఆరో సదస్సులో 2009లో జరగబోయే సదస్సు ఇంఫాల్‌లో జరుగుతుందని ప్రకటించిన దగ్గర నుంచి ఈశాన్యభారతాన్ని చూడడానికైనా తప్పనిసరిగా ఈ సమావేశాలకి హాజరవ్వాలని అనుకున్నాను. పూనాలో సమావేశాలు జరుగుతున్నపుడే హెల్ప్‌లైన్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కి జైపూర్‌ వెళ్ళడం వల్ల నేను వాటిని మిస్‌ అయ్యాను. ఎలాగైనా ఇంఫాల్‌ వెళ్ళాలని డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టాను. మణిపూర్‌ చాలాదూరం కాబట్టి ప్రయాణ ఖర్చులకే ఇరవైవేలు కావాలి. సొంత డబ్బులతోనే వెళ్ళాలి.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వున్న మహిళా జర్నలిస్ట్‌లు 2003లో ఢిల్లీలో సమావేశమైనపుడు ఒక వెబ్‌సైట్‌ నిర్మాణంతో పాటు ప్రతి సంవత్సరం కలవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ మొదటి సమావేశానికి నేను హాజరయ్యాను. మీడియాలో మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల మీద చర్చలతో పాటు, ఎన్నో అంశాల మీద మూడురోజులపాటు సమావేశాలు జరుగుతాయి.
మూడునెలల క్రితం ఇంఫాల్‌లో సదస్సు నిర్వహణా బాధ్యతని స్వీకరించిన అంజులిక నుంచి చక్కటి కవితాత్మకమైన ఆహ్వానం నెట్‌వర్క్‌ సభ్యులందరికీ అందింది. అంజులిక రాసిన ఈమెయిల్‌ అందరిలో ఉత్సాహాన్ని నింపింది. ఇక అప్పటినుండి ప్రయణపు ఏర్పాట్లు మొదలయ్యాయనే చెప్పాలి. అయితే ఎన్నో అనుమానాలు. మణిపూర్‌ గురించి గాని మిగతా ఈశాన్యభారతం గురించి గానీ మీడియాలో ఎలాంటి వార్తల, సమాచారం లేకపోవడం వల్ల ఎన్నెన్నో సందేహాలు. అసలు ఎలా వెళ్ళాలి? ఇంఫాల్‌కి రైల్వేలైను లేదు. విమానంలో వెళితే ఎక్కడ దిగాలి? కోల్‌కతానా? గౌహతీనా? అక్కడి నుండి బస్సులుంటాయ? ఎన్ని గంటల ప్రయణం? ఇంటర్‌నెట్‌ నుండి కొంత సమాచారం సేకరించినా తృప్తిలేదు. మొబైల్‌ ఫోనులు మౌనవ్రతం పడతాయని, ఎటిఎమ్‌లు మొత్తానికే మొరాయిస్తాయని కొందరు భయపెట్టారు. అవసరమైన డబ్బులు మోసుకెళ్ళాలన్నమాట.


ఈ అనుమానాలన్నీ ప్రశ్నలరూపంలో సంధిస్తూఅంజులికకు ఎన్ని మెయిల్స్‌ రాసినా సమాధానాల్లేవు. మణిపూర్‌లో పరిస్థితి, అంజూలిక నిస్సహాయస్థితి తెలియక కోపం తెచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇంటర్నెట్‌ సరిగ్గా పనిచేయడం లేదని, త్వరలోనే అన్ని వివరాలు రాస్తానని తన మెయిల్‌, ఆ మర్నాడే కల్పనాశర్మ నుండి మెయిల్‌ వచ్చింది. అంజులిక కజిన్‌ ఇంఫాల్‌లో దారుణ హత్యకు గురయ్యాడని తను చాలా దుఃఖంలో వుందని దాని సారాంశం. అందరం చాలా బాధపడుతూ తనకి రాసాం. తను కాన్ఫరెన్స్‌ నిర్వహించగలుగుతుందా అనే భయాలను పటా పంచలు చేస్తూ అంజులిక అన్ని వివరాలతో మెయిల్‌ ఇచ్చింది. తన దుఃఖాన్ని దిగమింగి ప్రోగ్రామ్‌ జరపడానికే తను రెడీ అయ్యింది.


ఆంధ్రప్రదేశ్‌ నుండి ఎంతమంది వెళతారో, ఎవరెవరు వెళతారో స్పష్టత లేకపోవడం వల్ల నేను నా ప్రోగ్రామ్‌ ఒంటరిగానే తయారుచేసుకున్నాను. గౌహతిలో ఐఐటి చదువుతున్న, నా ఫ్రెండ్‌ గీత కూతురు వైశ్ణవి నా కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. క్యాంపస్‌లోను, షిల్లాంగ్‌లో నా కోసం గెస్ట్‌హౌస్‌ బుక్‌ చేసి, టాక్సీ మాట్లాడి గౌహతి ఏయిర్‌పోర్ట్‌లో వుంచింది.ఈశాన్య రాష్ట్రాలకి ఎపుడూ వెళ్ళకపోయినా సరే ఎలాంటి సంకోచం పెట్టుకోకుండా ఒక్కదాన్ని తిరుగుదామనే నిర్ణయించుకున్నాను కొన్నిసార్లు ఒంటరి ప్రయాణాలు గొప్ప గొప్ప అనుభవాలను అందిస్తాయి. ఇంఫాల్‌ వెళ్ళిన తర్వాతే ఆంధ్రా నుండి వచ్చిన వాళ్ళని కలుసుకోవడం జరిగింది.

4వ తేదీన ఉదయం ఎనిమిది గంటల ఫ్లయిట్‌లో నా ఇంఫాల్‌ ప్రయాణం మొదలైంది. పదిగంటలకి కోల్‌కత్తాలో దిగి, ఇంఫాల్‌ ఫ్లయిట్‌ కోసం ఎదురుచస్తున్నపుడు బాంబే, పూనే, కలకత్తా గ్రూప్‌లు కలిసాయి. 12.30కి ఇండిగో విమానంలో బయలుదేరి 1.45కి ఇంఫాల్‌లో దిగాను. ముందు విమానంలో బయలుదేరి వెళ్ళిన ఆంధ్రాగ్రూప్‌లో సాక్షిలో పనిచేసే మంజరి, వార్తలో పనిచేసే జె. శ్యామల, వసంత, వనజారెడ్డి, ఎన్‌టివీలో పనిచేసే సమీర (మంజరి కూతురు) కలిసారు. అంజులిక కోసం ఎదురుచస్తుంటే గలగల నవ్వుతూ చిత్ర మా కోసం వాహనం తీసుకుని వచ్చింది. అందరం వాహనంలో ఎక్కి 'మంత్రిపుక్రి' అనే ప్రాంతానికి బయలుదేరాం. అక్కడే ఒక క్రిష్టియన్‌ సంస్థలో మా అందరికీ వసతి ఏర్పాటైంది. ఎయిర్‌పోర్ట్‌ నుండి మంత్రిపుక్రికి వెళుతుంటే, దారిపొడుగునా కనబడిన షాపులు, భవనాలు గమనించినపుడు మేము ఒక రాష్ట్ర రాజధాని నగరంలో ఉన్న భావం కలగలేదు. దుమ్ముకొట్టుకుపోయిన ఆ దారంతా చూస్తున్నపుడు ఏదో చిన్న పట్టణంలో వున్నామనిపించింది. మధ్యలో అరగంటపైగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. పెళ్ళిళ్ళ సీజనని చిత్ర ప్రకటించింది. మామూలు పౌరుల కన్నా తుపాకు లెక్కుపెట్టిన ఆర్మి, అస్సామ్‌ రైఫిల్స్‌ సాయుధుల హడావుడి ఎక్కువగా వుంది. జిప్సీ వాహనాల్లో ట్రిగ్గర్‌ మీద వేలుంచి, తీక్షణంగా జనంవేపు చూస్తున్న వాళ్ళని చూస్తుంటే వెన్నులో జలదరించినట్లయింది.


మా వాహనం దుమ్ము రేపుకుంటూ మంత్రిపుక్రిలోకి ప్రవేశించింది. మెయిన్‌ రోడ్డుకి అరకిలోమీటర్‌లో రిట్రీట్‌ హౌస్‌ వుంది. దుమ్ము తుఫానును చీల్చుకుంటూ మా వాహనం ఓ చిన్నపాటి చెరువు పక్కనుంచి పాఠశాల భవనంలా వున్న రిట్రీట్‌ హౌస్‌ ముందు ఆగింది. అప్పటికి మూడు గంటలయ్యింది. ఎవరి సామానులు వాళ్ళు మోసుకుంట రెండస్తులు ఎక్కి లోపలికెళితే బోర్డింగ్‌ స్కూల్‌లో వున్నట్లు వరసగా ఓ ఇరవై మంచాలు కనబడ్డాయి. తలో మంచం దగ్గర లగేజ్‌ పెట్టి లంచ్‌ ఏర్పాట్లు ఏమిటా అని అడిగితే ఏమీ లేవు అని తెలిసింది. అందరి బ్యాగుల్లోంచి బిస్కెట్‌ పాకెట్లు, చిక్కీలు, చపాతీలు బయటకొచ్చాయి. అందరం వాటిని షేర్‌ చేసుకుని కబుర్లలో పడ్డాం. ఇరవైమందికి మూడే బాత్‌రమ్‌లున్నాయి. ఎవరెవరు ఎపుడు స్నానాలు చేయాలో జోక్‌లేసుకుంటూ నవ్వుకుంటూ వున్నపుడు ఎవరో వచ్చి మనకోసం రూమ్‌లు కూడా వున్నాయంట అంటూ ప్రకటించారు. మళ్లీ లగేజ్‌మోసుకుంటూ రూమ్‌లున్నవేపు వెళ్ళాం. నేను, కల్పనాశర్మ ఒక రూమ్‌లో సర్దుకున్నాం.


మొబైల్‌ ఫోన్లు మూగనోము పట్టడంతో మెయిన్‌రోడ్డు కెళ్ళి ఎస్‌టిడి ఫోన్‌ చెయాలని కొంతమంది బయలుదేరాం. రోడ్డు మీదకెళ్ళేవరకు మాకు తెలియని విషయం ఒకటుంది. అదే గత నెలరోజులుగా ఇంఫాల్‌లో సాయంత్రం ఐదు నుండి ఉదయం ఐదు వరకు కర్ఫ్యూ వుందని. మేము వెళ్ళేసరికి నాలుగున్నర అయ్యింది. ఇంక అరగంటే టైముంది. ఒకే ఒక్క ఎస్‌.టి.డి. బూత్‌ కనబడింది. ఫోన్లు చేసి, వాటర్‌ బాటిల్స్‌, ఏవో తినుబండారాలు కొనుక్కుని టీ కోసం చూస్తే ఒక్క హోటల్‌ కూడా కనబడలేదు. పోలీసుల విజిల్స్‌ వినబడసాగాయి. హడావుడిగా షాప్‌లు మూసేయసాగారు. ఒకామె టీకోసం మేం పడుతున్న అవస్థ చూసి, ఇంట్లోకి పిలిచి బ్లాక్‌ టీ పెట్టి ఇచ్చింది. పాలు లేవని చెప్పింది. అందరం దుమ్ము లేపుకుంటూ మా బసవేపు నడవసాగాం. తీరా రిట్రీట్‌ హౌస్‌కి చేరేసరికి చిమ్మచీకటి. పవర్‌ కట్‌ అట. కరెంట్‌ ఎపుడొస్తుందో ఎపుడు పోతుందో తెలియదట. చీకటి వల్ల వెన్నెల స్పష్టంగా కనబడుతోంది. చుట్ట పరుచుకున్న కొండల మీద తెల్లగా కురుస్తున్న వెన్నెల. పల్లెటూళ్ళల్లో కరెంట్‌ పోయినపుడు పౌర్ణమి ఎంత అందంగా కనబడుతుందో అష్టమినాటి చంద్రుడు అంత అందంగాను కనబడ్డాడు.


మా అదృష్టం బావుండి రూమ్‌ల్లో చిన్నచిన్న సోలార్‌లైట్‌లు వెలుగుతున్నాయి. ఎనిమిదింటికల్లా డిన్నర్‌కి రమ్మన్నారు. కట్టెలపొయ్యి మీద చికెన్‌ వొండుతుంటే లోపలికెళ్ళి చూసాన్నేను. అపుడే లిల్లీ పరిచయమైంది. రిట్రీట్‌ హౌస్‌లో వంట చేస్తుంది లిల్లీ. కూరల్లో ఉప్పూ కారం అస్సలు లేవు. చికెన్‌ కొంచం బెటర్‌. క్యాబేజ్‌ ఎక్కువగా వాడారు. ఏదో తిన్నామన్పించి ఎనిమిదిన్నరకల్లా రూమ్‌ల్లో పడ్డాం. ఏంచెయ్యలో ఎవరికీ అర్థం కాలేదు. కాసేపు కబుర్లయ్యాయి. ప్రయాణ బడలికతో అందర అలిసిపోయారు. అయినా నిద్దర రావట్లేదు. టీవీల్లేవు. చదువుదామంటే లైట్‌ లేదు. చుట్టూ చిమ్మచీకటి. ఉండుండి వినిపిస్తున్న పోలీసుల విజిల్స్‌. ముసుగేసి పడుకోవడం బెటరన్పించి తొమ్మిదికల్లా మంచమెక్కేసాం. నా రూమ్మేట్‌ కల్పనకి దుమ్మువల్ల బాగా జలుబుచేసి, రాత్రంతా చాలా ఇబ్బంది పడింది.

మర్నాడు ఐదుకల్లా మెలుకువ వచ్చేసింది. తొమ్మిదింటికల్లా రెడీ అవ్వాలని క్రితం రోజు చిత్ర చెప్పింది. ఓ గంటసేపు వాకింగ్‌ కెళితే టైమ్‌పాస్‌ అవుతుందని అనుకుని బూట్లేసుకుని బయటకొస్తే బాగా చలిగా అన్పించింది. అప్పటికే మంజరి, సమీర వాళ్ళు కూడా బయటకొచ్చారు. అందరం కలిసి బయటపడి కనబడుతున్న కొండలవేపు బయలుదేరాం. చల్లగాలిలో నడవడం చాలా హాయిగా వుంది. చిన్నచిన్న ఇళ్ళు. ఎక్కువ భాగం వెదురు తడకలతో కట్టుకున్నవే. మేం నడుస్తూ వెళుతున్నపుడు ఒకామె ఇంటిముందు ఊడుస్తుంటే మాతో వున్న వసంత ఫోటో తియ్యడానికి ప్రయత్నించినపుడు మమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచింది. సన్నగా, సంప్రదాయ మణిపురి దుస్తుల్లో వున్న ఆమె పేరు సోసో. మమ్మల్ని ఎంతో ఆదరంగా పిలిచి, చిన్నచిన్నమోడాలు వేసి కూర్చోమంది. లోపల్నుంచి నలుగురు పిల్లలు వచ్చారు. తన పిల్లలని ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలని చెప్పింది. చక్కటి నవ్వుముఖాలతో, చికిలి కళ్ళతో వున్నారు వాళ్ళు. తన భర్త పొల్ల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడట. వెదురు చాపలతో కట్టిన మూడురూముల ఇల్లు. శుభ్రంగా వుంది. లోపల్నించి కుంపటి తెచ్చి మామధ్య పెట్టి టీ తెస్తానని వెళ్ళింది. మేం పిల్లల ఫోటోలు తియ్యడంలో మునిగాం. ఆమె కొడుకు నవ్వుతుంటే ఎంత ముద్దొచ్చాడో. ఆ పిల్లాడి కళ్ళు, ముక్కు, పెదాలు అన్నీ నవ్వుతుంటాయి. సోసో వేడివేడి టీ తెచ్చి ఇచ్చింది. ఆ చలిలో వెచ్చటి టీ తాగుతూ సోసోతో బోలెడు కబుర్లు చెప్పాం. కర్ఫ్యూ గురించి అడిగితే, నవ్వుతూఅలవాటయిపోయింది అంది. మేము జర్నలిస్ట్‌లమని చెప్పాం. ఆమెకు థాంక్స్‌ చెప్పి బయటపడ్డాం.


తొమ్మిదింటికల్లా అందరం తయరై బస్సులో కూర్చున్నాం. దాదాపు 60 మంది జర్నలిస్టులం అప్పటికి ఇంఫాల్‌ చేరుకున్నాం. ఇంకా రావలసిన వాళ్ళున్నారు. మొదటిరోజు మీటింగ్‌ కాంగ్లా ఫోర్ట్‌ అనే చోట జరుగుతోందని చిత్ర చెప్పింది. మేము కాంగ్లా చేరేసరికి పదయ్యింది. సమావేశాన్ని ప్రారంభించే హాలులో కూర్చున్నాం. మణిపూర్‌ మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌ సమావేశాన్ని ప్రారంభించారు. అదే రోజు ''అనుపవ జయరామన్‌'' అవార్డును ప్రదానం చేయడం జరిగింది. చాలా చిన్న వయస్సులో మరణించిన ''అనుపమ'' పేరు మీద ఆమె తల్లిదండ్రులు, జర్నలిస్టుల నెట్‌వర్క్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవార్డును 2008కి గాను అలీఫియ ఖాన్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌, హిందుస్తాన్‌ టైమ్స్‌, ముంబయ్‌కి ప్రదానం చేసారు.


ఆ తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత 'అరంబమ్‌ మెంచుబీ' మణిపురి స్త్రీల స్థితిగతుల మీద ఉపన్యసించారు. అరంబమ్‌ నాకు బాగా పరిచయమే. మేమంతా ''స్పారో'' ఏర్పాటు చేసిన జాతీయస్థాయి రచయిత్రుల సమావేశంలో ఐదు రోజులు ఖషీద్‌ (ముంబయి)లో కలిసివున్నాం. నన్ను గుర్తుపట్టి ఆప్యాయంగా పల్కరించింది. అక్కడే వుండే మరో మణిపురి రచయిత్రి బోర్‌కన్య గురించి వాకబుచేస్తే, మర్నాడు తనని తీసుకొస్తానని వాగ్ధానం చేసింది అరంబమ్‌. ఆ తర్వాత మణిపురి వర్కింగ్‌ జర్నలిస్ట్‌లతో మాటామంతి జరిగింది. మణిపురి జర్నలిస్ట్‌లతోమాట్లాడుతున్న సందర్భంలోనే కాంగ్లా గేట్‌ ఉదంతం గురించి, ఆ గేట్‌ ముందు జరిగిన చారిత్రాత్మక మణిపురి స్త్రీల నగ్నప్రదర్శన గురించి మా అందరికీ వివరంగా తెలిసింది. నాలుగున్నర అయ్యేసరికి కర్ఫ్యూ హడావుడి మొదలైంది. మేమంతా హడావుడిగా బస్సెక్కేసాం. అందరూ ఎక్కేసరికి ఆలస్యం అవ్వడంతో కర్ఫ్యూ మొదలైంది. పోలీసులు, ఆర్మీ బెదిరింపుల మధ్య మా బస్సు భయంభయంగా బయలుదేరింది.
కాంగ్లాఫోర్ట్‌, మనోరమాదేవి హత్య :

2004, జులై 11వ తేదీన తన ఇంట్లో నిద్రపోతున్న మనోరమాదేవి అనే మహిళను అర్ధరాత్రి అస్సామ్‌ రైఫిల్స్‌ అరెస్ట్‌ చేసి తీసుకెళ్ళారు. తీవ్రవాది అనే అనుమానంతో ఆమెను అరెస్ట్‌ చేసారు. కొన్ని గంటల తర్వాత చిత్రహింసలకు గురిచేయబడి, ఒళ్ళంతా గాట్లు, కమిలిపోయిన శరీరభాగాలతో, సామూహిక అత్యాచారానికి గురైన మనోరమ శవం రోడ్డుమీద దర్శనమిచ్చింది.


ఈ సంఘటన మణిపూర్‌ స్త్రీలను తీవ్రంగా కలిచివేసింది. 12 మంది ''మైరా ఫెయిబి'' సంస్థకు చెందిన మణిపూరి స్త్రీలు ''ఇండియన్‌ ఆర్మి రేప్‌ అజ్‌'' అనే బేనర్‌తో పబ్లిక్‌ ప్రదేశంలో, కాంగ్లా గేటు ముందు నగ్నప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శన దేశం మొత్తాన్నీ నివ్వెరపరిచి మణిపూర్‌లో ఏం జరుగుతుందో అర్థం చేయించింది. మనోరమ హత్యానంతరం కొన్ని నెలలపాటు మణిపూర్‌ మండిపోయింది. కమీషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ వేసారు గానీ ఈ రోజుకీ ఆ రిపోర్ట్‌ బయటకు రాలేదు. స్త్రీల నగ్నప్రదర్శనానంతర ఉద్యమం వల్ల అస్సామ్‌ రైఫిల్స్‌కీ, ఆర్మీకి కేంద్ర స్థావరంగా వున్న కాంగ్లా ప్రాంతాన్ని ఖాళీ చేయించి, సివిల్‌ అధికారులకు అప్పచెప్పడం జరిగింది.


మేము బస్సులో మంత్రిపుక్రికి ప్రయాణం చేస్తున్నపుడు కాంగ్లా గేట్‌ ఉదంతం గురించి విన్నాం. మనోరమని తలుచుకుని కన్నీళ్ళ పర్యంతమయ్యామ్. తోటి స్త్రీకి జరిగిన అన్యాయన్ని ప్రశ్నిస్తూ నగ్నప్రదర్శనలాంటి తీవ్రచర్యతో తమ నిరసనను వ్యక్తం చేసిన పన్నెండుమంది మణిపురి స్త్రీలకు పాదాభివందనం చెయ్యాలన్పించింది. బస్సు మా బస దగ్గరికి దుమ్ములేపుకుంట వచ్చింది. అప్పటికే చీకటి పడింది. కరెంట్‌ లేదు. దూరంగా కొండలమీద మిణుకు మిణుకుమటూ వెలుగుతున్న దీపాలు. పిండారబోసినట్లు నవమి వెన్నెల. ''కొండలపైనా, కోనలలోనా గోగులుపూచే జాబిలి'' అని పాడుకుంటూ ఆ చీకట్లో చేసే పనేంలేక బయటే కూర్చుండిపోయం. చాలాసేపు కాంగ్లా గేట్‌ ఉదంతం మా మాటల్లో నలిగింది. డిన్నర్‌ అయ్యాక కొంతమందిమి ఒక గదిలో చేరి పాటలు పాడే కార్యక్రమం మొదలుపెట్టాం. బెంగుళూరు నుండి వచ్చిన వాసంతి రేష్మా 'చార్‌ దినోంకా' పాటని అద్భుతంగా పాడింది. అన్ని భాషల వాళ్ళు తలో పాటా అందుకుని హైపిచ్‌లో పాడుతూ, అల్లరి చేస్తుంటే రిట్రీట్‌ ఫాదర్‌ పాల్‌ వచ్చి నిశ్శబ్దంగా వుండాలని తొమ్మిది అవుతోంది, లైటు తీసేయాలని హుకుం జారీచేసాడు. బతుకుజీవుడా తొమ్మిదికే పడుకోవాలా అనుకుంటూ ఎవరి గదుల్లోకి వాళ్ళం ముడుచుకుపోయామ్. ఆ రాత్రి సరిగా నిద్రపట్టలేదు. కలల్లో కాంగ్లా గేట్‌, నగ్నస్త్రీలు కలవరపరిచారు. మనసు కలిచివేసి నట్లయింది.
మర్నాడు ఉదయమే ఆంధ్రా బ్యాచ్‌ ఎదురుగావున్న కొండ ఎక్కాలని బయలుదేరాం. నేను, వనజ, మంజరి, శ్యామల, సమీర, వసంత, అనూరాధ, వనజారెడ్డి అందరం హుషారుగా కొండెక్కుతున్నాం. కిందినుంచి చూస్తే కొండమీద ఏమీ కనబడలేదు గాని మేముపైకి వెళుతుంటే ఓ ఇల్లు కనబడింది. దానిపక్కనే ఓ గెష్ట్‌హౌస్‌ లాంటిది కనబడింది. కొండమీదికి వెళ్ళేటప్పటికి ఆ ఇంట్లోని కుటుంబమంతా ఉదయపు ప్రార్థనలో వున్నారు. మేం నిశ్శబ్దంగా నిలబడ్డాం. కొంతసేపటికి ప్రార్థన ముగించి ఒకాయన మాదగ్గరకొచ్చాడు. మేం ఫలానా అని చెప్పాం. తన పేరు అనమ్‌ అని, ఆ కొండపేరు ఖదిమ్‌ కొండ అని చెబుతూ ఖదిమ్‌ అనే అతను అక్కడ వుండేవాడని, ఈ గెష్ట్‌హౌస్‌ వాళ్లదేనని, తాను వాచ్‌మెన్‌నని చెప్పాడు. ఆ పక్కనే వున్న ఖదిమ్‌ భార్య సమాధినిచూపించాడు. మా ఎనిమిదిమందికి పొగలు కక్కే టీ తీసుకొచ్చి ఇచ్చింది అతని కూతురు. టీ తాగి అతని ఇంట్లోకి వెళ్ళాం. చిన్న ఇల్లు. అనమ్‌, అతని భార్య, ఇద్దరు కూతుళ్ళు వుంటున్నారు. ఆవులు, బాతులు పెంచుతున్నారు. మేం శెలవు తీసుకుని బయలుదేరబోతుంటే 'ఆప్‌ లోగ్‌ ఫిర్‌ ఆయియే' అంటూ ఆదరంగా చెప్పాడు అనమ్‌. మణిపూర్‌ వాస్తవ్యులు కొత్తవ్యక్తులతో కూడా చాలా ఆదరంగా, ఆప్యాయంగా మాట్లాడ్డం గమనించాం. సోసో, అనమ్‌ కుటుంబం మాకు బాగా గుర్తుండిపోయారు.


తొమ్మిదిన్నరకి రెండోరోజు సమావేశం మొదలైంది. నెట్‌వర్క్‌ సమావేశాలకు హాజరైన సభ్యుల పరిచయాలయ్యయి. అంతకుముందురోజు మధ్యాహ్నానికి ఇంఫాల్‌ చేరిన 'నవోదయం' సభ్యులు తమని తాము పరిచయం చేసుకున్నపుడు సభ్యులందరూ కరతాళధ్వనులతో వారిని ఆహ్వానించారు. చిత్తరుకు చెందిన ఈ గ్రామీణస్త్రీలు ఎంతో ప్రతిభావంతంగా తామే ఎడిటర్లుగా, రిపోర్టర్లుగా పనిచేస్తూ నడుపుతున్న పత్రిక నవోదయం. స్వయంసహాయక బృందాలకు చెందిన ఈ పత్రిక చాలా సంవత్సరాలుగా నడుస్తోంది. ఆ టీమ్‌ సభ్యులు ప్రతి సంవత్సరం మహిళా జర్నలిస్ట్‌ల నెట్‌వర్క్‌ సమావేశాలకు హాజరవుతారు.


పరస్పర పరిచయలయ్యక నెట్‌వర్క్‌ గురించి, వెబ్‌సైట్‌ గురించి చర్చ జరిగింది. జాతీయస్థాయిలో మహిళా జర్నలిస్ట్‌్‌ల నెట్‌వర్క్‌ను రిజిష్టర్‌ చేయలా వద్దా అనే అంశం మీద వేడైన వాడైన చర్చ జరిగింది. కొంతమంది రిజిష్టర్‌ చేస్తే బావుంటుందని వాదిస్తే మరికొందరు నెట్‌వర్క్‌ అందం అంతా రిజిష్టర్‌ చెయ్యకుండా, ఏలాంటి హెచ్చుతగ్గుల స్థాయిలు లేకపోవడంలోనే వుందని వాదించారు. అయితే ఎక్కువ శాతం రిజిస్ట్రేషన్‌ వైపు మొగ్గుచపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కల్పనాశర్మ చర్చను ముగిస్తూ దీనిమీద తొందరపడడం మంచిది కాదని మరింత చర్చ తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పింది.


ఆ తర్వాత మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి ముగ్గురు ప్రముఖ వ్యక్తులు ఉపన్యాసాలు ఇచ్చారు. హ్యూమన్‌ రైట్స్‌ అలర్ట్‌ అనే సంస్థ నుండి బబ్లూ లైటోంగ్‌బామ్‌ చాలా ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. సభ్యులందరూనిశ్శబ్దంగా ఆయన ప్రసంగాన్ని విన్నారు. మణిపూర్‌లో తిరుగుబాటు నేపథ్యాన్ని గురించి ప్రస్తుతం ఎన్ని గ్రపులు అండర్‌గ్రౌండ్‌లో వుండి పోరాటం చేస్తున్నదీ వివరించారు. నాగాలు, కుకీలు, మైతేయులు, వైష్ణవులు, ముస్లిమ్‌ల గురించి వివరించాడు బబ్లూ. భారతదేశానికి స్వతంత్రం వచ్చేనాటికి మణిపూర్‌ రాచరికంలో వుందని, ఆగష్టు 14, 1947 రోజు అంటే ఇండియాకి స్వతంత్రం వచ్చిన ఒకరోజుముందే నాగా నేషనల్‌ కౌన్సిల్‌ బ్రిటీష్‌ రాజ్యం నుండి తాము స్వతంత్య్రాన్ని పొందినట్టు ప్రకటించుకున్నారు. అయితే స్వాతంత్య్రానంతరం ఇండియన్‌ గవర్నమెంట్‌ బలవంతంగా మణిపూర్‌ను ఇండియాలో విలీనం చెయ్యడాన్ని జీర్ణించుకోలేని అనేక గ్రపులు తిరుగుబాటు బాట పట్టాయి. ఈ తిరుగుబాట్లను అణిచివేసే నెపంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రూరమైన చట్టాలను తెచ్చాయి. అనేక గ్రూపులు చేస్తున్న ఈ తిరుగుబాట్లను లా అండ్‌ ఆర్డర్‌ సమస్యగానే ప్రభుత్వాలు చూస్తున్నాయి తప్ప వారి ఆత్మగౌరవ పోరాటాలుగా గుర్తించడం లేదు. ఈ తిరుగుబాట్లను అణచడానికి ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ పవర్‌ ఏక్ట్‌ 1958ని తీసుకొచ్చారు. సమస్యను పరిష్కరించడానికి బదులు మరింత జటిలం చేసి, మణిపూరీ ప్రజల మాన, ప్రాణాలను ఈ చట్టం హరిస్తోందని బబ్లూ వివరించారు. ఎన్నో దేశీయ గ్రూప్‌లు భారత ప్రభుత్వంతో పోరాడుతున్నాయని, ఆర్మీ, అస్సామ్‌ రైఫిల్స్‌కి చెందిన సాయుధులు ప్రజలను ఊచకోత కోస్తున్నారని బబ్లూ వివరించాడు.


బబ్లూ తర్వాత 'నాగా వుమన్‌ యూనియన్‌'కి చెందిన గ్రేస్‌ ఫట్‌సంగ్‌ నాగా స్త్రీల ఉద్యమం గురించి చెప్పారు. ఆమె ప్రసంగం తర్వాత డా: ఎస్‌. చోంగ్లాయ్‌మానవహక్కుల కోసం 'కుకి'లు చేస్తున్న పోరాటం గురించి ప్రసంగించారు. 1919లో నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌తో కలిసి బ్రిటీష్‌కి వ్యతిరేకంగా పోరాటం చేసిన, ఒకప్పుడు ''ఇండిపెండెంట్‌, హిల్‌, కంట్రీని'' ఏలిన దేశీయ ప్రజలైన 'కుకీ'లు ఈ రోజు అత్యంత దయనీయంగా బతుకుతున్నారని చోంగ్లోయ్‌ వివరించారు.


వీరి ప్రసంగాలు చాలా ఆసక్తిదాయకంగా సాగి, మణిపూర్‌ చరిత్ర పూర్వాపరాలు, ప్రస్తుత స్థితిగతులను వివరిస్తూ మంచి చర్చను లేవనెత్తాయి.

ఆ తర్వాత ''వుమన్‌ విడోడ్‌ బై కాన్‌ప్లిక్ట్‌ ఇన్‌ మణిపూర్‌'' పేరుతో అంజులిక తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్‌ చూపించారు. సైన్యం విచక్షణారహితంగా కాల్చేసిన కుటుంబాల స్థితిగతులు, అతిచిన్న వయస్సుల్లో భర్తల్ని పోగొట్టుకుని విధవలైన స్త్రీలు హృదయవిదారకంగా రోదిస్త కాల్పుల నేపథ్యాలను వివరించినపుడు అందరం కదిలిపోయామ్. నలుగురు నుంచి ఐదుగురు పిల్లలతో భర్తల్ని పోగొట్టుకున్న ఆ స్త్రీల జీవితాల్లోని విషాదం చూస్తూ కన్నీళ్ళ పర్యంతమైనాం అందరం. అన్నిటికన్నా అత్యంత దుఃఖాన్ని నింపిన సన్నివేశం మిలిటెంట్‌ గ్రూప్‌ చేతుల్లో హత్యకు గురైన అంజులిక సోదరుడి భార్య ప్రసంగం. ప్రస్తుత ఇంఫాల్‌ కర్ఫ్యూకి కారణమైన దింగనమ్‌ కిషన్‌, (మణిపురి సివిల్‌ సర్వీస్‌కి చెందిన యువ అధికారి) దారుణహత్య. ఫిబ్రవరి 13న కిషన్‌ని, అతని డ్రైవర్‌ని, అంగరక్షకుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్ళి హత్య చేసారు. శోకదినాలను పాటిస్తూ తెల్లవస్త్రాలను ధరించి కిషన్‌ భార్య నెట్‌వర్క్‌ సమావేశాలకు వచ్చి జరిగిన దారుణాన్ని వివరించినపుడు మేమంతా దుఃఖాన్ని ఆపుకోలేకపోయామ్. అందంగా, అమాయకంగా, పుట్టెడు దుఃఖంలో వున్న ఆమె ముఖం ఈ రోజుకీ కళ్ళల్లోంచి పోకుండా కలవరపెడుతూనే వుంది.

లంచ్‌ తర్వాత ఆరుబయట మణిపురీ నృత్యప్రదర్శన ఏర్పాటుచేశారు. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు కలిసి అద్భుతంగా నృత్యం చేసారు. మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రదర్శనను కూడా తిలకించిన తర్వాత మనం ఇపుడు ఇమా మార్కెట్ చూడ్డానికి వెళుతున్నామని, త్వరగా వెళ్ళి, కర్ఫ్యూ సమయానికి తిరిగి వచ్చెయ్యాలని అంజులిక ప్రకటించడంతో అందరం హడావుడిగా బస్సెక్కేసాం. కాంగ్లా గేట్‌కి ఎదురుగా, కిటకిటలాడుతున్న మార్కెట్‌ దగ్గర బస్సు ఆగింది. అప్పటికి టైమ్‌ నాలుగుంబావు అయ్యింది. బ్యాచ్‌లుగా విడిపోయి ఒక్కో బ్యాచ్‌కి ఒక్కో మణిపూరీ అమ్మాయి తోడురాగా మార్కెట్‌ వేపు వెళ్ళాం.మార్కెట్‌ యమ రద్దీగా వుంది. లోపలికెళ్ళినపుడు అక్కడున్న షెడ్‌లలో బారులుతీరి కూర్చున్న మణిపురీ స్త్రీలు వివిధ వ్యాపారాలు చేస్త కనబడ్డారు. అక్కడ దాదాపు 3000 మంది స్త్రీలు ప్రతిరోజూ వ్యాపారం చేస్తారని తెలిసింది. ఆ మార్కెట్‌ ఎప్పుడు మొదలైందనే దానికి స్పష్టమైన సమాధానం దొరకలేదు. అక్కడ వ్యాపారులందరూ ఆడవాళ్ళే. అదీ మధ్యవయస్సులో వున్నవాళ్ళు, అరవై దాటివాళ్ళు ఉన్నారు.తల్లుల మార్ఖెట్ అనే దీనికి పేరు. బట్టలు, వివిధ వస్తువులు, కూరగాయలు, చేపలు ఒకటేమిటి ఎన్నో అమ్ముతుంటారు. ఎక్కువగా వివిధ రంగుల్లో మణిపురీ చేనేత దుస్తులు కన్పించాయి. ఈమార్కెట్‌ పేరు 'ఇమా' బజార్‌. అక్కడ కొనుక్కునే పురుషులు తప్ప అమ్మే పురుషులుండరు.


మేమంతా తలోదిక్కు వెళ్ళిపోయామ్. అందరూ మణిపురి సంప్రదాయ లుంగీలు, షాల్‌లు కొన్నారు. ఎంతో హడావుడిగా అమ్మేవాళ్ళు అమ్ముతూ, సర్దుకునేవాళ్ళు సర్దుకుంటున్నారు. పిలిచి పిలిచి అమ్ముతున్నారు. కర్ఫ్యూ టైమ్‌ అయిపోతోంది. ఒక ముసలామె గంప నిండా వంకాయరంగు కలువపూలు తెస్తూ కనబడింది. నేను, మంజరి మూడేసి కట్టల పువ్వులు కొనేసాం. మాకు తోడుగా వచ్చినవాళ్ళు ఇంక పోదాం అంటూ కంగారుపెట్టసాగారు. మార్కెట్‌ వొదిలి రావాలని ఎవ్వరికీి లేదు. సరదాగా అట ఇట తిరుగుతూ ఆ స్త్రీలను పల్కరించాలని వాళ్ళతో మాట్లాడాలని వున్నా గాని, పోలీసుల విజిల్స్‌, సాయుధ సైనికులు తుపాకులెక్కుపెట్టి తిరుగుతున్న జిప్సీ వాహనాలు అందరినీ టెన్షన్‌ పెట్టేసాయి.మార్కెట్‌ కూడా చాలావరకు మూసేసారు. మేమంతా కంగారు కంగారుగా మా బస్సు ఆగివున్న చోటుకి పరుగులుపెట్టేం. ప్రతి ఒక్కరూ, ఏదో ఒక వాహనం పట్టుకుని, కిటకిటలాడే ఆటోలెక్కి ఇళ్ళకు వెళ్ళిపోసాగారు. బిజినెస్‌ ఊపందుకునే సాయంత్రం వేళ పాపం! ఆ మహిళలంతా దుకాణాలు మూసేసి ఇళ్ళకు వెళ్ళిపోవడం అదీ ఎంతో టెన్షన్‌గా వెళ్ళడం చాలా బాధన్పించింది. ఇళ్ళకెళ్ళాక మాత్రం ఏముంటుంది? కరెంట్‌ లేని చీకటి ఇళ్ళు మాత్రమే వాళ్ళకోసం ఎదురుచూస్తాయి. బహుశా సైన్యం ఇనుపబూట్ల చప్పుళ్ళే వాళ్ళకి వినోదమేమో! అంతకు మించిన చప్పుళ్ళు ఆ కర్ఫ్యూవేళ ఇంకేముంటాయి?


మా బస్సు వేగంగా మమ్మల్ని తెచ్చి రిట్రీట్‌ హౌస్‌లో దింపేసింది. అప్పటికి ఐదున్నర అయ్యింది. మార్కెట్‌ దగ్గర ఫోన్‌ చేద్దామని ప్రయత్నించినా ఎక్కడా ఎస్‌టిడి బూత్‌ కనబడలేదు. నేను మెయిన్‌రోడ్డు మీదకెళుతున్నా ఎవరైనా వస్తారా అంటే మంజరి నేను కూడా వస్తానంది. శ్యామల కూడా మాతో బయలుదేరింది. ఎస్‌టిడిబూత్‌ వుంటుందనే ఆశతో ఆ చీకట్లో బయలుదేరాం. కరెంటు లేకపోవడం వల్ల వెన్నెల తెల్లగా మెరుస్తోంది. మాకు ఒక మిలిటరీ జీప్‌ ఎదురొచ్చింది. మేం పక్కకు జరిగి నిలబడ్డాం. దుమ్ము లేపుకుంట వెళ్ళిపోయింది. కొంతమంది స్త్రీలు గుడ్డిదీపాలు పెట్టుకొని కూరగాయలు, చేపలు అమ్ముకుంటున్నారు. షాపులన్నీ మూసేసారు. వాటర్‌ బాటిల్స్‌ కొందామంటే దొరకలేదు. మేము అంతకుముందురోజు మాట్లాడిన ఎస్‌టిడిబూత్‌ మూసేసి వుంది. అర్జంటుగామాట్లాడాలి ఎలా? అనుకుంటూ అక్కడ నిలబడిన ఒకాయన్ని ఇక్కడ ఇంకో ఎస్‌టిడి బూత్‌ వుందా అని హిందీలో అడిగాం. మా వేపు ఎగాదిగా చూసి ఆ ప్రాంతానికి కొత్తవాళ్ళమని అర్థం చేసుకుని 'ఆయీయే' అంటూ రోడ్డు మీదకు దారితీసాడు. మెయిన్‌రోడ్డంతా చీకటిగా, నిర్మానుష్యంగా వుంది. ఒక షాప్‌ ముందాగి తలుపు మీద కొడితే ఆ తలుపు ఓరగా తెరుచుకుంది. లోపల ఫోన్‌ వుంది. ముగ్గురం లోపలికెళ్ళగానే ఆ షాపతను తలుపు మూసేసాడు. తనివితీరా ఫోన్‌లో మాట్లాడి, మిత్రులకి ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నామో చెప్పేసరికి వాళ్ళు కంగారుపడ్డారు. నా మిత్రురాలు ఒకామె అయితే నన్ను చివాట్లేసింది. అలాంటి ప్రమాదకర పరిస్థితులున్నచోట ఎడ్వంచర్లేమిటని కేకలేసింది.


షాపతనికి డబ్బులిచ్చేసి మొత్తంగా నిర్మానుష్యంగా మారిన రోడ్ల మీద నడుస్తూ, ఇంఫాల్‌ ప్రజల ముఖ్యంగా స్త్రీల కష్టాలకు బాధపడుతూ,


ఇలా ఎన్నాళ్ళు కర్ఫ్యూనడుస్తుందా, జనం ఇలా ఎంతకాలం భరించాలా అని చర్చించుకుంటూ మా బసకు చేరాం.


మర్నాడు తొమ్మిదిన్నరకే మీటింగ్‌ మొదలైంది. నెట్‌వర్క్‌కి సంబంధించిన కార్యకలాపాల గురించి, వచ్చే సమావేశం ఎక్కడ నిర్వహించాలి అనే అంశం గురించి చర్చ జరిగింది. మేము నిర్వహిస్తాం అంటూ కేరళ బృందం ముందుకు రావడంతో నిర్వహణకు అవసరమైన వనరుల మీద, ఆ వనరుల్ని ఎలా సేకరించాలి అనే దానిమీద వాదోపవాదాలు జరిగాయి. బెంగుళూరుగ్రూప్‌ 'అనుపమ జయరామన్‌' అవార్డు నిర్వహణలో తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చకు పెట్టారు. చాలా సీరియస్‌గా అందరం చర్చలో మునిగివున్న వేళ అంజులిక హఠాత్తుగా ఒక ప్రకటన చేసింది. ఇరామ్‌ షర్మిల ఆ రోజు విడుదల కాబోతోందని, మనమంతా ఇపుడు ఆమెను బంధించి వుంచిన ఆసుపత్రికి వెళుతున్నామని చెప్పడంతో అక్కడంతా ఒక ఉత్కంఠ నెలకొంది. నేను ఇంఫాల్‌కి వచ్చిన రోజే షర్మిలను కలిసే వీలుందా అని చిత్రని అడిగితే చాలా కష్టం అని చెప్పింది. రెండు సంవత్సరాల క్రితమే ''మణిపుర్ ఉక్కు మహిళ ఇరామ్‌ షర్మిల'' అని నేనుభూమికలో సంపాదకీయం రాసాను. ఆమె ధైర్యం, సాహసం ఎంతో స్ఫర్తిదాయకమైనవి. అలాంటి షర్మిలను కలుసుకునే అవకాశం రావడం అందరిలోను ఉద్వేగాన్ని రేపింది.

లంచ్‌ తిన్నామనిపించి అందరం బస్సులో ఎక్కేసాం. ఓ అరగంట ప్రయణం తర్వాత మేము షర్మిల విడుదల కోసం రిలే నిరాహారదీక్షలు చేస్తున్న శిబిరం దగ్గర దిగాం. అప్పటికి 88 రోజులుగా మణిపురి స్త్రీలు రిలే నిరసనదీక్షలు చేస్తున్నారు. మేము కూడా శిబిరంలో కూర్చున్నాం.
అద్భుత సాహసమూర్తి ఇరాం షర్మిల

ఇరామ్‌ షర్మిల సామాజిక కార్యకర్తగా పనిచేసేది. భద్రతాదళాల చేతుల్లో హత్యలకు, అత్యాచారాలకు బలైన స్త్రీల కన్నీటికథనాలను వినేది. శాంతియత్రల్లో పాల్గొనేది. 2000 సంవత్సరం నవంబరు 2న 'మాలోమ్‌' పట్టణంలోని బస్టాండులో అస్సామ్‌ రైఫిల్స్‌ సాయుధులు పదిమంది పౌరులను కాల్చి చంపేసిన దారుణ సంఘటన జరిగినపుడు షర్మిల తీవ్రంగా చలించిపోయింది. అంతకుముందు మణిపురి తిరుగుబాటుదారులు భద్రతాదళాల వాహనాలపై దాడిచేసినందుకు ప్రతీకారంగా అస్సామ్‌ రైఫిల్స్‌ ఈ దురాగతానికి దిగింది. 'మాలోమ్‌' పట్టణం ఇంఫాల్‌కి పదిహేను కిలోమీటర్ల దూరంలో వుంది. షర్మిల ఈ సంఘటన జరగడానికి ముందే ఒక శాంతియత్రా నిర్వహణ కోసం మాలోమ్‌కి వచ్చి వుంది. ఆమె మాలోమ్‌లో వున్నపుడే ఈ దారుణ సంఘటన జరగడంతో, శాంతి ర్యాలీ ఆలోచనను విరమించుకుని అంతకంటే తీవ్రమైన కార్యాచరణకి పూనుకోవాలని నిర్ణయించుకుంది. భద్రతాదళాలకు విచ్చలవిడి అధికారాలు కట్టబెట్టిన Armed Forces Special Powers Act, 1958 (AFSPA) ని రద్దుచేయలంట ఆమరణ నిరాహారదీక్షకు దిగాలనే తీవ్ర నిర్ణయన్ని ఇరామ్‌ షర్మిల తీసుకుని తల్లితో చెప్పినపుడు ఆమె గట్టిగా వ్యతిరేకించి షర్మిలకు నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. షర్మిల తన నిర్ణయానికే కట్టుబడడంతో తల్లి కఠినాతికఠినమైన నియమం పెట్టింది. షర్మిల తను మొదలుపెట్టిన కార్యంలో విజయం సాధించేవరకు తన ముఖం చూపించవద్దని నియమం పెట్టడంతో షర్మిల ఒప్పుకుని తన ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించింది. నవంబర్‌ 11, 2000లో షర్మిల ప్రారంభించిన ఈ దీక్ష తొమ్మిది సంవత్సరాలుగా కొనసాగుతూనే వుంది.


అమరణ నిరాహార దీక్షలో వున్న షర్మిలను ఆత్మహత్యా నేరం కింద ప్రభుత్వం అరెష్ట్‌ చేసి బలవంతంగా ముక్కుల్లోంచి ట్యూబ్‌లేసి, ద్రవాహారం పంపిస్తూ జె.ఎన్‌, ఆసుపత్రిలోని ఎంతో భద్రత కల్గిన వార్డులో బంధించి వుంచింది. ఈ నేరం కింద ఒక్క సంవత్సరమే ఖైదీలో వుంచే వీలుండడంవల్ల, ప్రతి సంవత్సరం ఒక రోజు విడుదల చేసి షర్మిల ఆహారం తీసుకోదు కాబట్టి మళ్ళీ అరెస్ట్‌ చేయడం ఎనిమిదేళ్ళుగా ఒక ''తన్తు''లాగా నడుస్తోంది. మేము ఇంఫాల్‌లో వున్నపుడే మార్చి 7న ఆమెను విడుదల చేసి, మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినం రోజున అరెస్ట్‌ చేసి ఆసుపత్రి వార్డులో బంధించారు.


"షర్మిల కంబ లప్‌" పేరుతో ''మైరా పెయిబి'' స్త్రీలు ఆమెకు సహకరిస్తున్నారు. మణిపూర్‌ లోయలో ఈ మైరాపెయిబి స్త్రీలు అట్టడుగు స్థాయినించి సాంప్రదాయక స్త్రీల సంఘాలుగా ఏర్పడి పనిచేస్తుంటారు. చారిత్రకంగా తీసుకుంటే ఈ మైరాపెయిబీ స్త్రీలు బ్రిటీష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగివున్నారు. అలాగే మణిపూర్‌లో తాగుడు వ్యసనానికి, డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నది కూడా వీరే. అతిబలమైన సాయుధ దళాలను ధిక్కరిస్తూ వనవ హక్కుల ఉద్యమాన్ని నడుపుతున్నది కూడా మైరాపెయిబీ స్త్రీలే నన్నది నగ్నసత్యం. ప్రస్తుతం షర్మిల ఆమరణదీక్షకు మద్దతునిస్తున్నవాళ్ళు వీళ్ళే.


2006లో షర్మిల విడుదలైనప్పుడు, ఆమె తన సోదరుడు, మరో ఇద్దరు కార్యకర్తలతో ఢిల్లీకి వెళ్ళి జంతర్‌మంతర్‌ దగ్గర రోడ్డు మీద తన దీక్షను ప్రారంభించింది. పోలీసులు వెంటనే ఆమెను అరెస్ట్‌ చేసి ఆలిండియా ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో వుంచి ఆమెకు బలవంతంగా ముక్కు ద్వారా ద్రవాహారాన్ని పంపి ఆమె దీక్షని భగ్నం చేసారు. ఆ తర్వాత షర్మిలను ఇంఫాల్‌ తీసుకెళ్ళి జవహర్‌లాల్‌నెహ్రూ హాస్పిటల్‌లో నిర్బంధించారు. ఆమెని ప్రతి సంవత్సరం విడుదల చేసి, ఆమె తన దీక్షను కొనసాగించడంతో, ఆమెపై ఆత్మహత్యానేరం వెపి మళ్ళీ మళ్ళీ నిర్బంధిస్తూనే వున్నారు.మార్చి ఎనిమిదిన ఆమెను తిరిగి అరెస్ట్ చేసారు.


2009లో మేము ఇంఫాల్‌లో వున్నపుడు మార్చి 7న ఆమెను విడుదల చేసారు. ఆమె దీక్షకు మద్దతుగా మైరాపెయిబీ స్త్రీలు చేపట్టిన నిరసన శిబిరంలో మేము కూర్చుని వున్నపుడే మరో పదిహేను నిముషాల్లో షర్మిలను విడుదల చేస్తారనే సమాచారం వచ్చింది. మేమందరం శిబిరంలోంచి బయలుదేరి ఆసుపత్రికి కాలినడకనే చేరుకున్నాం. అప్పటికి సమయం మూడు కావస్తోంది. మేము వెళ్ళేసరికే అక్కడ పెద్దఎత్తున మీడియాకు చెందిన వాళ్ళు, స్త్రీలు, మైరాపెయిబికీ చెందిన కార్యకర్తలు గుమిగూడారు. షర్మిలను నిర్బంధించిన హై సెక్యూరిటీ వార్డు ముందు మేమంతా నిలబడ్డాం. ఎవరెవరో వస్తున్నారు. లోపలికి వెళుతున్నారు. లోపలున్న పోలీసులు మాటిమాటికీ తలుపులు తీసి బయటకు తొంగిచూసి మళ్ళీ తలుపులు మూస్తున్నారు. 70 సంవత్సరాలు పైబడిన మైరాపెయిబీకీ చెందిన వృద్ధ స్త్రీలు చాలా ఓపికగా వార్డు మెట్ల మీద కూర్చుని షర్మిల కోసం ఎదురుచస్తున్నారు. 78 సంవత్సరాల కె.తరుణి అనే స్త్రీమాట్లాడుతూ అప్సని (AFSPA) రద్దుచెయ్యలి. షర్మిలని కాపాడాలి. ఈ దుర్మార్గ చట్టాన్ని రద్దుచెయ్యకపోతే మేము ఈసారి ఎవ్వరికీ ఓట్లు వెయ్యం. జరిగింది చాలు అంటూ దృఢమైన కంఠంతో చెప్పినపుడు ఆ వయస్సులో ఆమె కన్పరిచిన నిబద్ధత మమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. అలాంటి స్త్రీలు చాలామంది అక్కడ గుమిగూడి వున్నారు. వారంతా షర్మిల విడుదల కోసం 88 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్నారు.

మాలో ఉత్కంఠ పెరగసాగింది. అక్కడ కూర్చునే చోటు లేదు. నిలబడ్డం కూడా కష్టంగానే వుంది. సమయం గడుస్తున్నకొద్దీ కర్ఫ్యూ భతం భయపెట్టసాగింది. నాలుగున్నర అయ్యింది. నిలబడి నిలబడి కాళ్ళు పీకుతున్నాయి. ఇంకో అరగంటలో కర్ఫ్యూ పెట్టేస్తారు. వార్డు లోపల్నుంచి పోలీసులు బయటకు వస్తున్నారు. తొంగి చూస్తున్నారు. గ్రిల్‌ చప్పుడైనప్పుడల్లా మా కళ్ళు గ్రిల్‌కు అతుక్కు పోతున్నాయి. ఐదు కావస్తోంది. మేము షర్మిలను చూడలేమేమో ననే సందేహం పీడించసాగింది. సరిగ్గా ఆ సమయంలో ఎవరో బిగ్గరగా ప్రకటించారు. ఆ రోజు కర్ఫ్యూ 7 గంటల వరకు పొడిగించారని. హమ్మయ్య అనుకుంటూ మళ్ళీ గ్రిల్‌ గేట్‌ చప్పుడు కోసం ఎదురుచడసాగాం.

5.30 అయ్యింది. వార్డు రూమ్‌ తెరుచుకుంది. గ్రిల్‌ గేట్‌ కూడా తెరిచారు. సూర్యుడు అస్తమించేవేళ, ఆ చిరుచీకట్లో వెలుగురేఖలా షర్మిల చాలా మెల్లగా అడుగులేస్తూ వస్తూ కనబడింది. తెల్లగా పాలిపోయిన ముఖం. ఒక్కసారిగా వెలిగిన మీడియా ఫ్లాష్‌లైట్లను తట్టుకోలేక కళ్ళు మూసుకున్న షర్మిల కనబడింది. సంప్రదాయ మణిపురి దుస్తుల్లో, భుజాల చుట్టు గులాబీ రంగు షాల్‌ చుట్టుకుని కళ్ళు మూసుకుని బయటకు వచ్చిన షర్మిలనుచూసి కొంతమంది చప్పట్లు కొట్టారు. కొంతమంది స్త్రీలు బిగ్గరగా ఏడ్చారు.


'మైరాపెయిబి' స్త్రీలు ఆమెకు రక్షణ కవచంలా ఏర్పడి, ఆమెను పసిపాపను పొదువుకున్నట్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు. షర్మిల నిలబడడానికి కూడా శక్తి లేక తల వాల్చేస్తూ ఆ స్త్రీల చేతుల ఆసరాతో నడిచి మీడియా ముందుకొచ్చింది. నేను షర్మిలా పక్కనే వుండడంతో ఆమెను అతిదగ్గరగా పరిశీలించగలిగాను. తొమ్మిది సంవత్సరాలుగా నోటితో ఘనపదార్ధం ఏమీ తినకుండా మణిపూరి ప్రజల కోసం, AFSPA 1958 చట్టం రద్దు కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న 35 సంవత్సరాల షర్మిలను అతిసమీపంగా చూసినపుడు నా గుండె ఉద్వేగంతో వేగంగా కొట్టుకోవడంతో పాటు, ఆమె వజ్రసంకల్పం ముందు నా శిరస్సు వాలిపోయింది. పోరాట పటిమ, దృఢ సంకల్పం, ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేయడానికి సిద్ధంగా వున్న ఆ స్త్రీ మూర్తి ముందుమోకరిల్లాలన్పించింది.


చాలా బలహీనంగా వున్నప్పటికీ్ ఆమె ఏ వాహనంలోను ఎక్కకుండా, స్త్రీల సమూహంతో కలిసి అక్కడికి 500 మీటర్ల దరంలో వున్న నిరాహారదీక్షా శిబిరం వరకు నడవసాగింది. ఆమె వెంట మేమంతా, దాదాపు 70 మంది వివిధ భాషలకు చెందిన జర్నలిస్ట్‌లం నడిచాం. శిబిరం దగ్గరకు చేరగానే ఆమె కోసం పరుపు సిద్ధం చేసి కూర్చోబెట్టారు. ఆమె కాళ్ళకు మేజోళ్ళు తొడిగారు. ఆమె మెడను నిలపలేకపోతోంది. ఆమె శరీరం అటు ఇటు ఊగిపోతోంది. అక్కడ చేరిన అసంఖ్యాక మీడియా పదేపదే కోరగా ఆమె గళం విప్పింది. మెత్తగా, పీలగా ఆమె గొంతు విన్పించసాగింది. "నాకోసం ఎదురుచస్తున్న మీ అందరికి కృతజ్ఞతలు తెలపడానికి నాదగ్గర సరైనమాటలు లేవు. మీరు నాకు మరింత ధైర్యాన్నిచ్చారు. మణిపూర్‌ నుండి AFSPA 1958 చట్టాన్ని రద్దుచేసేవరకు నేను ఈ నిరాహారదీక్షని కొనసాగించదలిచాను. ఇమాస్‌ తో కలిసి ప్రచారాన్ని సాగిస్తానని చెప్పింది. షర్మిల మెల్లగా, స్పష్టంగా మాట్లాడుతూ ''ప్రపంచమంతా అంతర్జాతీయ మహిళాదినాన్ని జరుపుకుంటుంటే, ఇక్కడ మణిపూర్‌లో సారవంతమైన భూములతో, అపారమైన వనరులతో, చల్లటి గాలులు వీచే చోట, ప్రజలు ఎంతో స్నేహసుహృద్భావాలతో పల్కరించే చోట స్త్రీలు ఎదుర్కొంటున్న కష్టాలు, అణిచివేత బయట ప్రపంచానికి తెలియవు.'' అన్నప్పుడు అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ''నేను మాఅమ్మకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెను చూడకుండానే ఇంతకాలం వున్నాను. తనకి చాలా అనారోగ్యం చేసినపుడు కూడా చూడాలంటే భయమన్పించింది. నువ్వెందుకు వచ్చావు. నన్నుచూడొద్దన్నాను కదా అంటుందేమోనని ఆమె వున్న ఆసుపత్రి వార్డు ముందు ఎంతోసేపు తచ్చాడాను.'' అన్నప్పుడు అక్కడున్న స్త్రీలు దు:ఖాన్ని ఆపుకోలేక బోరున ఏడ్చారు. మాఅందరి కళ్ళల్లోను నీళ్ళు చిప్పిల్లాయి.


మెల్లగా చీకటి చిక్కనౌతోంది. షర్మిల ఆ రాత్రి శిబిరంలోనే గడపటానికి సిద్ధపడింది. కర్ఫ్యూ పెట్టే టైమ్‌ దగ్గరపడడంతో మేము కూడా వెళ్ళడానికి లేచాం. అప్పుడే అంజులిక షర్మిలకి సమీపంగా వెళ్ళి ఎంతోమంది మహిళా జర్నలిస్ట్‌లు ఆమె చూడడానికి వచ్చారని, వారంతా శిబిరంలో వున్నారని చెప్పగానే ''మీ అందరినీ చూడ్డం నాకు సంతోషంగా వుంది. ఇక్కడి స్త్రీలకు ఏం జరుగుతోందో మీరు దేశం నలుమూలలా తెలియచేస్తారని నాకు ఆశగా వుంది. మీ సోదరుడి హత్య నాకు చాలా దుఃఖాన్ని కలిగించింది'' అన్నప్పుడు అంజులిక బాధతో సతమతమైంది.


మేమంతా శిబిరంలోంచి బయటపడి బస్సులో ఎక్కాం. అందరం మౌనంగా కూర్చున్నాం. కాసేపట్లో కర్ఫ్యూ పెట్టేస్తారు. బస్సు రిట్రీట్‌ హౌస్‌ దగ్గర ఆగింది. యథాప్రకారం చీకటి. చిమ్మచీకట్లో కురుస్తున్న వెన్నెల. నాకురూమ్‌లోకి వెళ్ళాలన్పించలేదు. కాసేపు వెన్నెల్లో కూర్చుని కిచెన్‌ వేపు వెళ్ళాను. లిల్లీతో మాట్లాడాలన్పించింది. ''లిల్లీ! మేము రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్నాం'' అన్నాను. మళ్ళీ రమ్మని, వచ్చినపుడు తనని కలవమని చెప్పింది. నీకు ఇక్కడి పనికి జీతమెంత ఇస్తారని అడిగితే 1200 ఇస్తారని, రెండుపూటలా తిండి పెడతారని చెబుతూ తనకి తొమ్మిది మంది చెల్లెళ్ళున్నారని, తండ్రి చనిపోయాడని, తన తల్లి కూడా వంట పనిచేస్తుందని చెప్పింది. ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్‌ పాటించరా అంటే సిగ్గుపడుతూలేదని చెప్పింది. సోసో కూడా అదే మాట అంది. ఆడవాళ్ళు పిల్లల్ని కంటూ పోవాల్సిందే. ఫ్యామిలీప్లానింగ్‌ లేదు అంది.చూడ్డానికి చిన్నగా వుంటుంది సోసో. ఆమెకు నలుగురు పిల్లలు. డిన్నర్‌ చేసి లిల్లీకి బై చెప్పి నా రూమ్‌కు వచ్చేసాను.

8వ తేదీ ఉదయం సోసో ఇంటికెళ్ళాం. మళ్ళీ తప్పక రమ్మని కోరింది సోసో. ఆమెకు గుడ్‌బై చెప్పి, మళ్ళీ ఇంకో కప్పు టీ తాగి అక్కడి నుండి బయటపడ్డాం. పదిగంటలకి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి. అన్నీ సర్దుకుని అందరికీ వీడ్కోలు చెప్పి రూమ్‌లో ఏకాంతంగా కూర్చున్నపుడు ఇంఫాల్‌ అనుభవాలు ఒకటొకటే కళ్ళముందు కదలాడాయి. దుమ్ము కొట్టుకుపోయిన నగరం, చీకట్లో మగ్గుతున్న నగరం, కర్ఫ్య పడగనీడ కింద కుములుతున్న మణిపూర్‌ రాష్ట్ర రాజధాని. ఇపుడిపుడే ''అభివృద్ధి'' నామజపం వినబడుతోందని, వందలాది కుటుంబాలు ఎయిర్‌పోర్ట్‌ విస్తరణలో నిర్వాసితమౌతున్నయని బబ్లూ చెప్పాడు. మీ హైదరాబాదు చాలా 'అభివృద్ధి' చెందిందటగా అని వ్యంగ్యంగా అడిగినపుడు షంషాబాద్‌ చుట్టుపక్కల కనుమరుగైన వందలాది గ్రామాలు, పూల, పండ్ల తోటలు గుర్తొచ్చాయి. చెట్టుకొకరుగా, పుట్టకొకరుగా చెదిరిపోయిన ఆ ఊళ్ళ ప్రజలు గుర్తొచ్చారు. ఆంధ్రదేశంలో ''అభివృద్ధి'' పేరు మీద ఏర్పాటవుతున్న ''సెజ్‌''ల గురించి జీవనాధారాల్ని కోల్పోతున్న ప్రజల్ని గురించి మేం చెప్పాం.


ఇంఫాల్‌లో వున్న నాలుగురోజుల్లో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. ప్రజలెదుర్కొంటున్న కష్టాలు, స్త్రీలు పడుతున్న అగచాట్లు చూసాం. ఎక్కడ చూసినా ఏదో పనిచేస్తూ స్త్రీలు. ఇమా మార్కెట్‌లో వ్యాపారాలు చేసే వేలాది స్త్రీలు ర్ఫ్యూ వేళ ఉరుకులు పరుగులతో దుకాణాలు మూసేసి, కిక్కిరిసిన వాహనాల్లో ఇళ్ళకు చేరే స్త్రీలు. అన్నింటినీ మించి జిప్సీ వాహనాల్లో ప్రజల మీద తుపాకులెక్కుపెట్టి ఊరకుక్కల్లా వీధులెంబడి తిరిగే సైన్యం, అస్సామ్‌ రైఫిల్స్‌. ఎక్కడచూసినా సైన్యమే. 23 లక్షల మణిపూర్‌ జనాభాకి 53000 సాయుధ సైనికులు వున్నారంటే పరిస్థితి ఎంత భీతావహంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడెవరిని చంపేస్తారో, ఎవరిని అరెస్ట్‌ చేస్తారో? ఎవరిని మాయం చేస్తారో తెలియదు. మహిళల మీద అత్యాచారాలకి అంతేలేదు.AFSPA 1958 చట్టం సైన్యానికిచ్చిన పాశవిక అధికారాలతో ఎవరినైనా కాల్చొచ్చు. ఎవరినైనా చంపొచ్చు. ఊళ్ళకుఊళ్ళు తగలబెట్టొచ్చు. ఇవన్నీ కేవలం అనుమానంతోనే చెయ్యొచ్చు. తిరుగుబాటుదారులున్నారనే నెపంతో రోజుకి కనీసం రెండు హత్యలు జరుగుతున్నాయి. చిన్నవయస్సులో భర్తల్ని పోగొట్టుకుంటున్న స్త్రీలు. అయిదారుగురు పిల్లల్తో అనాథలవుతున్న స్త్రీలు. ఉపాధి లేక ఉద్యోగాల్లేక డ్రగ్స్‌కు, తాగుడుకు బానిసలౌతున్న యువత. నిరాశానిస్పృహలతో తిరుగుబాటుదారుల్లో చేరుతున్న యువకులు. 60 సంవత్సరాలుగా అగ్నిగుండంలా మండుతున్న మణిపూర్‌. 40 ఎత్‌నిక్‌ కమ్యూనిటీలున్న మణిపూర్‌లో 38 తిరుగుబాటు గ్రూపులున్నాయి. ప్రభుత్వాల మీద తిరుగుబాటు చెయ్యడంతో పాటు వాటిల్లో వాటికి ఎన్నో విభేదాలు, పరస్పర దాడులు.


'గ్రేస్‌ షట్‌సంగ్‌' నాగా వుమన్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ మాటల్లో చెప్పాలంటే సాంప్రదాయకంగా మణిపురి స్త్రీలు శాంతిప్రేమికులు. శాంతి స్థాపన కోసం స్త్రీలు పాటుపడుతున్నారు. మణిపురి స్త్రీలు తీవ్ర వివక్ష నెదుర్కొంటున్నారు. వారికి ఎలాంటి హక్కులూలేవు. నిర్ణయధికారం లేదు. సైన్యం చేతిలో అత్యాచారాలు, కాల్పుల్లో భర్తల మరణాలు, కుటుంబాల్ని కాపాడుకోవాల్సిన పెనుభారాలు. మణిపురి స్త్రీలు రెండువిధాలా సమస్యల్ని ఎదుర్కోవాలి. సైన్యం అత్యాచారాలొకవైపు, తిరుగుబాటుదారుల అవసరాలు తీర్చాల్సి రావడం మరోవేపు. అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న మణిపూరి స్త్రీలు. మొత్తం మణిపూర్‌ కోసం ప్రాణాలను అడ్డం పెట్టి పోరాడుతున్న షర్మిల. నగ్నప్రదర్శనలాంటి తీవ్ర నిర్ణయలతో సైన్యం అకృత్యాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన మైరాఫెయిబి కార్యకర్తల సాహసం.


AFSPA లాంటి బలమైన చట్టం పెట్టుకుని కూడా మణిపూర్‌ ప్రభుత్వం మణిపూరి ప్రజల్ని కాపాడలేకపోతోంది. ప్రతిరోజూ సైన్యం కాల్పుల్లోనో, రెబెల్‌ తిరుగుబాటుదారుల చర్యలవల్లో నలుగురో, ఐదుగురో చనిపోవాల్సిందే. మేము ఇంఫాల్‌లో వున్నపుడే 13 ఏళ్ళ కుర్రాడు కాల్పుల్లో చనిపోయిన విషాద సంఘటన జరిగింది. మణిపూర్‌లో మామూలు పరిస్థితులు నెలకొనే ఆశ అయితే కనుచపుమేరలో కనబడ్డం లేదు. AFSPA చట్టం రద్దు అవ్వడం గానీ, ఇరాం షర్మిల ఆమరణ నిరాహారదీక్ష ముగియడం అనేవి కల్లోమాటగానే అన్పిస్తున్నాయి.


ఇంతటి విషాదకర పరిస్థితుల్లో ఎంతో హాయిగా నవ్వే మణిపురి స్త్రీలను చూస్తే ఎంత ఆశ్చర్యంగా వుంటుందో. హృద్యంగా నవ్వే చిత్ర, అంజులిక, సోసో, లిల్లీ, ఆరంభమ్‌. వీళ్ళ హాయైన నవ్వు చసి చిత్రతో అన్నాన్నేను ''magic of Manipur Is your smile''. మీరింత చక్కగా ఎలా నవ్వగలుగుతున్నారు. అంటే సమాధానంగా మరింత నవ్వే దొరికింది.


ఇంఫాల్‌ విమానాశ్రయంలో కూర్చుని గౌహతి వెళ్ళే విమానం ఎక్కేవరకు ఇవే ఆలోచనలు. మణిపూర్‌లో త్వరలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలనే ఆశాభావంతో నేను తిరుగు ప్రయణమయ్యాను. మనస్సునిండా మణిపూర్‌ విషాదం నిండిపోవడం వల్ల అక్కడి నుండి అస్సాం, మేఘాలయ వెళ్ళిన అనుభవాలను ప్రస్తుతం రాయలేకపోతున్నాను. మేఘాలయలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, ప్రపంచంలోనే తడిప్రాంతంగా రెండుసార్లు గిన్నిస్‌ బుక్‌ కెక్కిన చిరపుంజిలో, చెక్కలబళ్ళమీద ప్లాస్టిక్‌ బిందెలతో కిలోమీటర్ల దూరం నీళ్ళ కోసం వెతుకుతున్న స్త్రీలని మాత్రం నేనెప్పటికీ మర్చిపోలేను. నిత్యవర్షం కురుస్తుందని చెప్పుకునే చోట నీళ్ళకోసం వెదుకులాట నిజంగా ఎంత విషాదం. మరెప్పుడైనా ఈ విషయాల గురించి రాస్తాను.

మొత్తానికి, మహిళా జర్నలిస్ట్‌ల మూడురోజుల కాన్ఫరెన్సు, మణిపూర్‌ మహిళల విషాద జీవితాల్లోని మల్లెపువ్వులాంటి నవ్వులు, ఇరాం షర్మిల ఉక్కులాంటి పట్టుదల, మైరాపెయిబీ మాతృమూర్తుల మడమ తిప్పని పోరుబాట ఇవన్నీ నామీద గొప్ప ముద్రవేసాయి. తిరిగివచ్చాక కూడా మనసంతా ముసురుపట్టినట్లే వుంది. కర్ఫ్యూలో వున్నట్లే అన్పిస్తోంది. చీకటి గుయ్యారంలో మగ్గుతున్నట్లే వుంది. మణిపూరి మహిళల మందహాసం గుర్తొచ్చినపుడు మాత్రం చాలా హాయిగా, రిలాక్స్‌డ్‌గా అన్పిస్తోంది. నాతోపాటు నాలుగురోజులు గడిపిన మిత్రులందరూ పదేపదే గుర్తొచ్చినా, ఎక్కువగా నా మనసులో చోటు సంపాదించుకున్నది మాత్రం సమీర. షిల్లాంగ్‌లోని రెయిన్‌బో హోటల్‌ యజవని హరీష్‌ని గురించి తప్పక రాయలి.అతను చాలా ఎమోషనల్‌గా నన్ను కదిలించాడు. నేను అచ్చం తన చెల్లెలులాగా వున్నానని, కళ్ళు, ముక్కుతీరు తన చెల్లెల్ని గుర్తుకు తెస్తోందని చెబుతూ మా గురించి వివరాలు అడిగి, హెల్ప్‌లైన్‌ గురించి విని ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఎవరూ అలా పని చెయ్యరని, తనకి లా ఫామ్‌ పెట్టాలని వుందని మీరు హెల్ప్‌ చేస్తరా అని అడిగాడు. మాకు గౌహతిలో చౌకగా మూడు నక్షత్రాల హోటల్‌లోరూమ్‌లు మాట్లాడి పెట్టాడు. ఎనిమిది మందిమి రెండు రూమ్‌ల్లో సర్దుకోగలిగాం. హైదరాబాద్‌ వచ్చాక రెండు సార్లుమాట్లాడాడు. 'బెహాన్‌! ఆప్‌ ఫిర్‌ కబ్‌ ఆరే షిల్లాంగ్‌' అంటూ ఆప్యాయంగా మాట్లాడే హరీష్‌,గౌహతిలో నన్ను తన ఆటోలో కూర్చోబెట్టుకుని,కామాఖ్య కొన్డ మీదకి,బ్రహ్మపుత్ర నది మీదకి పడవ శికారుకి తీసుకెళ్ళి,నగరమన్తా తిప్పి చూపిన్చి భద్రమ్గా నన్ను ఎయిర్ పోర్ట్ లో దిన్చిన ఆటో వాలా కమల్ భాయ్, వందలకొద్దీ మా ఫోటోలు, వీడియోలు తీసి, ఫోటోలు మాకివ్వాలి సుమా అని అడిగినపుడు ఖర్చవుతుందని అల్లరిగా నవ్వే సమీర, ఖర్చంటే డబ్బులేనా ఏంటి అని వెక్కిరించే సమీర నాకు చాలా నచ్చింది.


మంజరి కూతురుగా కంటే బోలెడన్ని పుస్తకాలు చదివిన, సరదాగా, సంబరంగా నవ్వే సమీర మా గ్రూప్‌లో వుండడం మాకు గొప్ప ఎసెట్‌. అమ్మాకూతుళ్ళలా కాకుండా స్నేహితుల్లా మెలిగిన మంజరి, సమీరామాకు బోలెడంత వినోదం, హాస్యం అందించారు. ఇంఫాల్‌ ట్రిప్‌లో సమీర పరిచయం హైలెట్టే మరి. దీనిక్కూడా ఖర్చవుతుందంటుందో ఏమో!!!

సింగారం పోవాలే

ఉప్పల్ కి ఏడు కిలోమీటర్ల దూరంలో సింగారమనే పల్లె ఉంది.
ఊరు చక్కగా ఉంటుంది.తెలంగాణా పల్లె వాతావరణం ఉంటుంది.
ఊరంతా మోదుగు పూల చెట్లు.
సీజన్లో ఎర్రటి మోదుగు పూలతో ఊరంతా ఎర్రబారి ఉంటుంది.
నిన్న నేను నా నేస్తం గీత నా కారులో నేనే డ్రైవ్ చేస్తూ సింగారమెళ్ళేం.
సింగారం ప్రత్యేకత ఒకటి ఊరంతా పచ్చగా కూరగాయలపాదుల్తో నిండి ఉంటుంది.
నా నేస్తం వాళ్ళ పెద్దమ్మ గారి ఊరు.
వాళ్ళింట్లో టర్కి కోళ్ళు,గిన్ని కోళ్ళు, మామూలు కోళ్ళు
బోలెడు ఉన్నాయి.
అన్నింటిని మించి అక్కడ చల్లటి నీరా ప్రెష్ గా దొరుకుతుంది.
అలా చూస్తున్నారేంటి?
అప్పుడే తాటి చెట్టు నుండి దింపిన నీరా నీటుగా ఉంటుంది.
నమ్మకం లేకపోతే ఒక్కసారి తాగి చూడండి.
నిజానికి నీరా కొబ్బరి నీళ్ళకంటే శ్రేష్టమైంది.
దానిలో నానా చెత్తా కలిపి కల్లు కాంపౌండ్ లో బ్రష్టు పట్టిస్తారు.
మొత్తానికి సింగారమెళ్ళడం తియ్యటి నీరా తాగడం భలే బావుంటుంది.

Sunday, January 31, 2010

మా అమ్మ పేరు మీద నిన్న అంతర్వేది లో అయిదు వేల మందికి భోజనం పెట్టాము.


మా అమ్మ పేరు మీద నిన్న అంతర్వేది లో అయిదు వేల మందికి భోజనం పెట్టాము.
నేను ఈ సందర్భాన్ని భూమిక హెల్ప్ లేయిన్ నంబర్ని ప్రచారం చెయ్యడానికి చక్కగా ఉపయోగించాను.
దురదృష్తవసాత్తు నిన్న గోదావరిలో పడవ ప్రమాదం జరిగింది.అప్పుడు నేను అక్కడే ఉన్నాను.
చాలా మంది జనం రావడం వల్ల ఆ పడవలో ఎక్కువమంది ఎక్కారు.సాధారణంగా మా గోదావరి లో పడవ ప్రమాదాలు  జరగడం చాలా తక్కువ. సముద్రంలో పున్నమి స్నానం చెయ్యడానికి ఒచ్చి ప్రమాదం లో మరణించడం చాలా బాధాకరం.
నిన్న రాత్రి పున్నమి చంద్రుడుని  చూసి తీరాల్సిందే.
బాధిత స్త్రీలని చేరడానికి,భూమిక హెల్ప్ లేయిన్ నంబర్ని ప్రచారం  చెయ్యడానికి ఇల్లాంటి  సందర్భాల్ని ఉపయోగించుకోవాలని నేను చాలా గట్టిగా భావిస్తున్నాను.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...