Sunday, March 7, 2010

మాలో ఉన్న మనసు మాకు గాక ఇంకెవరికి తెలుసు?

http://www.andhrajyothy.com/navyaNewsShow.asp?qry=2010/mar/7/navya/7navya1&more=2010/mar/6/navya/navyamain


ఈసారి జుగల్‌బందీ ఎవరితో?
సంధ్య..
ఏ సంధ్య?
ప్రగతిశీల మహిళా సంఘం సంధ్య. పీఓడబ్ల్యూ సంధ్య.
అబ్బో ఫైర్‌బ్రాండ్. దులిపిపారేస్తుంది. నిప్పులు చెరుగుతుంది.
తర్వాత?
'భూమిక' ఎడిటర్ కొండవీటి సత్యవతి.
అవునా... ఆడవాళ్ల కోసం హెల్ప్‌లైన్ నడుపుతుంది... ఆవిడేగా...
అవును వాళ్లిద్దరే. రాష్ట్రంలో మహిళలకు, తెలుగు ఛానెళ్ల ప్రేక్షకులకు వీరిద్దరూ బాగానే తెలుసు. స్త్రీల సమస్యల మీద తక్షణం స్పందించే సంధ్య, సత్యవతులు ఫైర్‌బ్రాండ్సే. వాళ్లలో మామూలు మహిళలకుండే భావోద్వేగాలు లేవా? అందరి తరఫునా మాట్లాడే వాళ్ల అసలు స్వరం వినిపించినదెక్కడ? వాళ్ల మనసు సంగతులు ఎందరికి తెలుసు? వందేళ్ల అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఈ జుగల్‌బందీ 'నవ్య'కు ప్రత్యేకం.

సత్యవతి : అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో నా జీవితం తెలియకుండానే ముడిపడింది. '75 అంటే ముప్ఫై ఐదేళ్ల క్రితం ఒక మార్చిలో ఉదయం నేనూ మా నాన్నా ఆవుపాలు పిండుతూ రేడియో వింటున్నాం. 'ఈ ఏడాదిని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటిస్తున్నారం'టూ వార్తల్లో చదివారు. అది నాకు బాగా గుర్తు. ఆ ఏడే నేను నా కాళ్లమీద నిలబడాలని ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాను.

సంధ్య : 75 అంతర్జాతీయ మహిళా సంవత్సరంతో నాకూ కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలున్నాయి. ఇందిరాగాంధీ పాలనలో అవి చీకటి రోజులు. తపాలాపూర్ కుట్రకేసులో ఇరికిస్తారని మా పెదనాన్న ప్రవాసంలోకి వెళ్లారు, మా నాన్న అరెస్టయ్యారు. ఆయన బ్లాక్ డెవెలప్‌మెంట్ ఆఫీసరుగా ఉద్యోగం చేసేవారు. పేదలకు మేలు చేసేవారు. అందువల్ల ఆయన అరెస్టయ్యారని తెలిసినప్పుడు ఆ రోజుల్లోనే 1500మంది గ్రామీణులు అప్పటి మంత్రి బాలాగౌడ్ ఇంటిని చుట్టుముట్టి 'సారును వదిలిపెట్టండి' అంటూ నినాదాలిచ్చారు. తర్వాత మా నాన్న దెబ్బలతో స్పృహతప్పిన స్థితిలో సిరిసిల్ల బస్టాండులో కనిపిస్తే తీసుకొచ్చారు. ఆ సమయంలో మేం స్కూలుకెళ్తున్నప్పుడు ఎవరెవరో వచ్చి 'మీ ఇంటికి రవి మావయ్య వచ్చాడా, రాజన్న మామ వచ్చాడా , సత్యం తెలుసా...' అంటూ ఆరాలు తీసేవారు. మేం పిల్లలం అయినా, ఆ వివరాలు వాళ్లకు చెప్పకూడదని 'మాకేం తెలీదు' అనేసేవాళ్లం అమాయకపు మొహాలు పెట్టి. కొన్ని నెలల పాటు మా ఇంట్లోనూ ఎమర్జన్సీ వాతావరణం కనిపించేది. చాలామందిలాగా నాకు మా అమ్మానాన్నా ఏమీ కొనిచ్చి ప్రత్యేకంగా ముద్దుగా చూసిన జ్ఞాపకాలేమీ లేవుగానీ, వాళ్ల ప్రవర్తన ద్వారా నాలో నింపిన స్ఫూర్తి చాలా గొప్పది.

నవ్య : మీ ఇద్దరికీ బాల్యంలో గోదావరి అనేది ఉమ్మడి అంశం అనుకుంటాను...


సత్యవతి : పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం దగ్గర సీతారాంపురం అనే కుగ్రామంలో పుట్టాను నేను. గోదావరి నదికీ సముద్రానికీ మధ్యన అందమైన ఊరది. మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఎంత పెద్దదంటే రోజూ కనీసం వందమంది భోజనాలు ఇంట్లో! అంతమందిలో పిల్లల్ని ప్రత్యేకంగా పట్టించుకోవడం, ఏం తిన్నారు, ఏం చదువుతున్నారు వంటివి చూడటం జరిగేది కాదు. నాకు ఇద్దరక్కయ్యలు, అన్న, తమ్ముడు. మేం రోజంతా హాయిగా తోటల్లో చేలల్లో తిరగడం, ఇంటికొచ్చి ఉన్నదేదో తినేసి మళ్లీ ఆటలు. ఆడ మగ వివక్ష ఉండేదికాదు. ఇంట్లో అప్పటివరకూ చదువుకున్నవాళ్లెవరూ లేరు కనుక నేను చదువుకోవడానికి మాత్రం కష్టపడ్డాను. చాలాదూరం నడిచివెళ్లటం. సైకిలెక్కి వెళ్లాలంటే లంగాలు అడ్డం పడేవి. అలాగే నేను ఓరియంటల్ టెంత్ పూర్తి చేశాను. ఇంటర్లో తెలుగు, డిగ్రీలో ఇంగ్లిష్ సాహిత్యాలు ప్రధానాంశాలు. స్కూల్లో ఉపాధ్యాయులు, కాలేజీలో లెక్చరర్లు పుస్తకాలు చదవమని ప్రోత్సహించేవారు. అలాగే సమాజం గురించి తెలియజెప్పేవారు. ఇప్పుడదేం లేదు, ఎంతసేపూ ర్యాంకుల గోల.

సంధ్య : మా తాతల సమయంలోనే కృష్ణా జిల్లా నుంచి వరంగల్ అక్కడినుంచి ఆదిలాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్ల ప్రయాణం కొండపల్లిగారితో కలిసి సాగిందని చెప్పొచ్చు. నేను పుట్టింది ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట దొనబండ దగ్గర బుద్ధిపల్లి గ్రామంలో. మా పొలాలు దాటితే అడవి. పొలాలకూ అడవికీ మధ్య గోదావరి వాగులు. మా అమ్మది కృష్ణాజిల్లా కూచిపూడి దగ్గర బార్లపూడి. సెలవులకు వెళ్లొస్తుండేవాళ్లం. అప్పటివరకూ అంతా రైతు కుటుంబమేగానీ మా నాన్న బ్లాక్ డెవెలప్‌మెంట్ అధికారిగా ఉద్యోగస్తులయ్యారు. నాకో అన్నయ్య, ఒక తమ్ముడు. సత్యవతి వాళ్లలాగా మాదీ పెద్ద కుటుంబమే. మరీ వందమందని కాదుగానీ రోజూ కనీసం పాతిక ముప్ఫైమందికి భోజనాలుండేవి. నాన్న పెదనాన్నలకు రాజకీయ చైతన్యం ఎక్కువని చెప్పాను కదా, వాళ్లను కలవడానికి ఎవరోఒకరు వచ్చిపోతుండేవారు. నేను హైస్కూల్లో ఉన్నప్పుడు ప్రజాతంత్రలో వచ్చే 'రాజు-పేద'ను తోటి పిల్లలకు చదివి వినిపించేదాన్ని. శ్రీశ్రీ అనంతం, వాసిరెడ్డి సీతాదేవి సావేరి అప్పుడు చదివినవే. ప్రజాశక్తి, విశాలాంధ్ర, సృజన, నూతన, విమోచన వంటి పత్రికలను తెగ చదివేవాళ్లం.

సత్యవతి : అవును, ఆ పత్రికలంటే చాలా ఇష్టంగా ఉండేది.

నవ్య : మీరిద్దరూ ఒకరికొకరు తారసపడిందెక్కడ?


సత్యవతి : అదా.. తల్చుకుంటే భలే విచిత్రంగా ఉంటుంది. నేను బాగ్‌లింగంపల్లి బస్టాపులో నిలబడి పుస్తకం చదువుకుంటున్నాను. సంధ్య వచ్చి 'ఆ పుస్తకం నా చేతుల్లోంచి వచ్చిందే' అంటూ పరిచయం చేసుకుంది.

సంధ్య : అప్పట్లో నగరంలో భావసారూప్యత ఉన్న వ్యక్తులు పరిచయం కావడం కష్టం. అప్పటికే స్త్రీల కోసం పనిచేస్తున్న మేం రూపంలో కూడా సింపుల్‌గా ప్రత్యేకంగా కనిపించేవాళ్లం. అలా బస్టాపులో సత్యవతిని చూసేసరికి 'మావంటి మనిషే' అని తెలిసిపోయింది. బస్టాపులో నిలబడి మరీ పుస్తకాలు చదివేంత పిచ్చి ఎవరికుంటుంది? పైగా ఏ వారపత్రికో కాదు. మహాశ్వేతాదేవి రాసిన 'ఒక తల్లి' చదువుతోంది. అప్పట్లో నేను హైదరాబాద్ బుక్‌ట్రస్ట్‌లో పనిచేసేదాన్ని. ఆ పుస్తకాన్ని ప్రచురించింది మేమే. అందుకే అలా చెబుతూ పరిచయం చేసుకున్నాను.

సత్యవతి : మీకు తెలుసా, మన రాష్ట్రంలో ప్రింటింగ్ టెక్నాలజీని చదువుకున్న మొదటి మహిళ సంధ్యే. మేం కలిసింది 84లో అనుకుంటాను. మా స్నేహం బలపడింది రకరకాల ఉద్యమాల్లోనే. ముఖ్యంగా 'స్త్రీ శక్తి సంఘటన' వంటి సంస్థల ద్వారా చురుగ్గా పనులు చేపట్టడం తొలి దశ. 85లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఉద్యోగులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాం. మేమిద్దరం ఆటోకు మైక్ కట్టుకుని కూకట్‌పల్లి, వనస్థలిపురం అన్నీ తిరిగాం. నన్ను అరెస్టు చేసి రెండు రోజుల పాటు కంట్రోల్ రూమ్‌లో ఉంచారు! తర్వాత ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్‌లో మేం చేసిన సమ్మెల మూలంగానే ఉద్యోగినులకిచ్చే ప్రసూతి సెలవును 90 నుంచి 120 రోజులకు పెంచారు.

సంధ్య : సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా 'ఆడవాళ్లు ఉద్యోగాలంటూ బయట తిరుగుతుంటే వంటిళ్లేమవుతాయి, కుటుంబాలేమవుతాయి...' అనేలా వ్యాఖ్యలు చేశారు. దానికి దేశంలో తీవ్రమైన నిరసన వచ్చింది. మేం హైకోర్టులో ర్యాలీ చేసి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశాం. అది పూర్తిగా మా సారధ్యంలోనే జరిగింది! అలాంటి దుడుకు పనులెన్నో! ఇక్కడి విద్యారణ్య స్కూల్లో 'డౌరీ డెత్స్ ఇన్వెస్టిగేషన్ కమిటీ' సమావేశాల్లో తరచూ కలిసేవాళ్లం. అక్కడికి వరకట్న బాధితులు చాలామంది వచ్చేవాళ్లు. వాళ్లను చూసి సత్యవతి కదిలిపోయేది. ఒక కేసు వింటున్నప్పుడు ఆమె ఎంత కదిలిపోయిందంటే అప్పటి ఆమె కన్నీళ్లు నాకిప్పటికీ గుర్తున్నాయి.

సత్యవతి : నా జీవితాన్ని మలుపు తిప్పిన కన్నీళ్లవి. స్వరూప అని ఒకమ్మాయి తన అక్కను కట్నం కోసం బావ చంపేశాడని, ఎలాగైనా న్యాయం చెయ్యాలని లేదంటే తనే బావను చంపేస్తానని ఆవేశంగా మాట్లాడింది. ఆ అమ్మాయి చెప్పిన వివరాలు వింటున్నప్పుడు 'ఇంత అన్యాయమా' అని నాకు చాలా ఏడుపొచ్చేసింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, అలాంటివారికి అండగా నిలబడాలి, ఏమైనా చెయ్యాలి అని. అలా మొదలయినవే 'భూమిక' పత్రిక, భూమిక హెల్ప్‌లైన్.

నవ్య : కానీ కన్నీళ్లు నిస్సహాయతకు ప్రతీకలని, ముఖ్యంగా ఆడవాళ్లు మాట్లాడితే కన్నీరు పెట్టుకుంటారని ఒక అభిప్రాయం ఉంది సమాజంలో. మీలాగా ధైర్యంగా పనిచేస్తున్నవారు కన్నీళ్లు పెట్టుకోవడం అంటే...


సంధ్య : అవును. అందరూ అలాగే అనుకుంటారు. మొన్నటికి మొన్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానెల్లో మాజీ గవర్నర్ తివారీ లీలల విషయంలో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆపుకోలేనంత దుఃఖం వచ్చేసింది. రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, ఒక గౌరవనీయమైన పదవిలో ఉన్న వ్యక్తే అంత దిగజారిపోయి ప్రవర్తిస్తే ఇక దిక్కెవరు అనిపించింది. పైగా చాలామంది ఎంపీలు కూడా దానిలో భాగస్వాములని ఆరోపణలు విన్నప్పుడు - ఎంతమంది పెద్దమనుషులుగా ముసుగుల్లో చలామణీ అయిపోతున్నారో అని బాధవేసి కంట నీరొచ్చింది.

దాన్ని కూడా ఎకసెక్కం చేశారు కొంతమంది. సంధ్య కన్నీళ్లు పెట్టుకోవడం ఏమిటని నవ్వినవాళ్లు నాకు తెలుసు. ఇప్పుడేకాదు, ఒక ఛానెల్లో డూపుల మీద కార్యక్రమం వచ్చేది. దానిలో 'సేవల సంధ్య' అంటూ నాకో డూప్‌ను తయారుచేశారు. ఆమె ఆడవారి సమస్యలకు పరిష్కారాలు చెబుతుంటే లోపల్నుంచీ భర్త 'విడాకుల కాగితాల మీద సంతకం పెట్టవే...' అని హుంకరిస్తాడు. ఈమె 'ఏమండీ...' అని బెరుగ్గా వెళ్లిపోతుంది. ఏవిటి అందులోని హాస్యం? దానిద్వారా ఏరకమైన సందేశం జనాలకు పంపదలచుకున్నారు వాళ్లు? సాటి స్త్రీలకోసం పనిచేసేవాళ్లంటే అంత చులకనా?

సత్యవతి : నిజానికి బాధితుల కథలు వింటున్నప్పుడు ఒకోసారి చాలా ఎమోషనల్‌గా అయిపోతాం. కన్నీళ్లూ సహజమే. దాన్ని గుర్తించకుండా కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారు, వెటకారాలు చేస్తుంటారు. అదెంత బాధ కలిగిస్తుందో ఎవరూ అర్థం చేసుకోరు. మగవాళ్లు కుటుంబాన్ని నిర్లక్షం చేసి సమాజం కోసం పనిచేస్తుంటే 'ఆయన కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా పరుల కోసం పనిచేశాడు...' అని పొగుడుతారు. అదే మహిళ అదే పని చేస్తే మాత్రం 'ముందు ఇంటిని పిల్లలనూ చక్కదిద్దుకోకుండా ఎవర్ని ఉద్ధరిస్తావు..' అన్న తరహాలో మాట్లాడతారు.

సంధ్య : దాదాపు పాతికేళ్లుగా చేస్తున్న ప్రయాణం ఇది. ఇందులో ఎదురైన ఇబ్బందుల్ని అధిగమించాం.. మమ్మల్ని అరెస్టులు చేయించినా, బెదిరించినా, చంపేస్తామంటూ అర్థరాత్రి ఫోన్లు వచ్చినా... తట్టుకున్నాంగానీ స్నేహితులుగా నటిస్తూ ఇలా వెటకారాలు చేసినప్పుడు మాత్రం చాలా బాధకలుగుతుంది. ఇంట్లో ఉదయం లేచి అందరిలాగానే వంటపని, ఇంటిపని అంతా చేసుకుని బైటకొచ్చి బాధితుల తరఫున మాట్లాడుతున్నప్పుడు - దాన్ని గుర్తించకపోయింది సరికదా, ఈ కామెడీ ఏమిటి?

నవ్య : గడచిన ఇరవయ్యేళ్లలో సమాజ స్వరూపం మారిపోయింది. వరకట్నం వంటి సమస్యలు అలాగే ఉన్నాయి, వాటికితోడు యాసిడ్ దాడుల వంటివి కొత్తవి వచ్చిపడుతున్నాయి. మరొకవైపు ఉద్యమాలు, సామాజికస్పృహ వంటివి తగ్గుముఖం పడుతున్నాయి. ఇటువంటి సందర్భంలో మీకు 'ఎవరికోసం ఇదంతా' అనే నిస్పృహ కలగదా? కుటుంబాల నుంచి సపోర్ట్ ఎంత?


సత్యవతి : 80లో గోరాగారు ప్రపంచ నాస్తిక మహాసభలు నిర్వహించినప్పుడు నిప్పులగుండాల్లో నడవడం అనేది భ్రమ అని చూపెట్టడానికి నేనూ నడిచాను. ఎందుకో చివరికొచ్చేసరికి తూలిపడబోతే ఒకాయన చెయ్యందించి సాయం చేశాడు. తర్వాత శ్రీశ్రీ సాహిత్యం అవీఇవీ మాట్లాడుతూ రైల్వేస్టేషన్‌కూ వచ్చారు. అలా మా పరిచయం పెరిగి జస్టిస్ వివిఎస్‌రావుగారు నా జీవిత భాగస్వామి అయ్యారు. 81 సెప్టెంబరు 5న ఇరవై రూపాయల ఖర్చుతో జరిగిన దండల పెళ్లి మాది.

సంధ్య :అప్పట్నుంచీ ఈవిడ ఏ నిప్పుల్లో నడిచినా ఆయన సాయం చేస్తూనే ఉన్నారన్నమాట. మావారు రామకృష్ణారెడ్డి ప్రింటింగ్ కోర్సు చదువుతున్నప్పుడు నా క్లాస్మేట్. మా చదువులైన పదేళ్ల తర్వాత పెళ్లి జరిగింది. సత్యవతికీ నాకూ బోలెడన్ని పోలికలు జీవితంలో. మా ఇద్దరివీ స్టేజీ పెళ్లిళ్లే. ఇద్దరం కొన్ని కారణాల వలన పిల్లలు వద్దనుకున్నాం, ఇద్దరికీ రంగవల్లి స్మారక అవార్డులు వచ్చాయి. మమ్మల్ని అక్కచెల్లెళ్లా అని ఎంతోమంది అడిగేవారు... సత్యవతి :మహిళారంగంలో పనిచేస్తున్నవారికి రంగవల్లి పురస్కారం రావడం ఎంతో గర్వకారణం. నాకన్నా ముందటేడు ఆ అవార్డునందుకుంటూ సంధ్య చేసిన ఉద్వేగభరిత ప్రసంగానికి హాల్లో అందరి కళ్లూ తడిసిపోయాయి.

సంధ్య : అప్పటి సత్యవతి మొహం నాకింకా గుర్తుంది. వందేళ్ల మహిళా దినోత్సవం జరుపుకొంటున్నా ఇప్పటికీ అవే సమస్యలు, ఇంకా సమానత్వం కోసం పోరాటమే. మీరన్నట్టు ఇప్పుడంతా కెరీరిజం. అందువల్ల అప్పుడప్పుడూ కాస్త నిరాశగా అనిపిస్తుంది. కానీ ఎక్కడో కలిసినప్పుడు, ఫోన్లోనో ఒకోసారి చెబుతారు... 'సంధ్యక్కా మీరు మాట్లాడింది విని ధైర్యం తెచ్చుకున్నాను, నా కుటుంబం నిలబడింది' ఇలా. అప్పుడు చాలా సంతృప్తిగా ఉంటుంది. అందరి తరఫునా మాట్లాడేవాళ్లకు చెప్పలేనంత స్ట్రెస్, అప్పుడప్పుడూ కొద్దిగా నిరాశ ఉంటాయి. ఇతరులు వచ్చి మాకు చెప్పుకుని తేలికపడతారు. మా సమస్యలు ఎవరికీ చెప్పుకోం. ఎవరికీ పట్టవు.

సత్యవతి : సంధ్య చెప్పింది అక్షరాలా నిజం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఇప్పుడు భూమిక హెల్ప్‌లైన్ నంబర్ ఎక్కువమందికి సాయం చేసింది. ఎక్కడైనా తారసపడినప్పుడు అది తమనెలా ఆదుకుందో చెబుతుంటారు స్త్రీలు. అది చాలా సంతోషంగా ఉంటుంది. ఓపిక ఉన్నంతవరకూ ఇలాగే కొనసాగాలనిపిస్తుంది.

పాతికేళ్ల స్నేహంలో ఎన్నో జ్ఞాపకాలు, సంఘటనలు, మరపురాని అనుభవాలు, అవమానాలు, నిరాశలు, సంతృప్తులు... కలబోసుకుంటుంటే కాలం తెలియకుండా పోవడం సహజమే. వీళ్లతో మాట్లాడుతున్నప్పుడు 'కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు..' పాట ఎక్కణ్నుంచో వినిపిస్తున్నట్టే అనిపించింది. ఇద్దరికీ ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంది నవ్య.

ఇంటర్వ్యూ : అరుణ పప్పు
ఫోటోలు : లవకుమార్

2 comments:

Sravya V said...

మీ ఇద్దరికీ అభినందనలు సత్యవతి గారు మీ స్నేహబంధం ఇలాగే సాగిపోవాలని కోరుకుంటున్నాను !

శరత్ కాలమ్ said...

మీ ఇద్దరికీ అభినందనలు.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...