Tuesday, May 29, 2012

ఆదివారం సత్యయమేవ జయతే ప్రోగ్రాం లో అమీర్ ఖాన్ చూపించిన గర్భ సంచుల్ని కోల్పోయిన అమ్మలు వీరే.

గర్భసంచుల్ని కోల్పోయిన 100 మంది ఆడవాళ్ళు


నేను ఈ మధ్య ఒక సంస్థ వారు ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి హాజరవ్వడం కోసం మెదక్ జిల్లా సదాశివపేట దగ్గర ఒక గ్రామానికి వెళ్ళాను. నేను చెప్పైన సంస్తకు చెందిన ఒక డాక్టర్ ఆ గ్రామంలో హిస్ట్రెక్టమి (గర్భ సంచుల తీసివేత)చేయించుకున్న స్త్రీలతో పని చేస్తున్నారు. ఆ సమావేశానికి దాదాపు 100 మంది మహిళలు హాజరయ్యారు. అందరూ హిస్ట్రెక్టమి చేయించుకున్న వాళ్ళే. తప్పు తప్పు చేయించుకున్న వాళ్ళు కాదు.భయానో నయానో ఒప్పించి ఒక విధంగా బలవంతపు ఆపరేషన్లకి గురిచేయబడినవాళ్ళు. కాన్సర్ వస్తుందని,పిల్లలు పుట్టాక దాని అవరంలేదు అని చెప్పి,ఇంకా రకరకాల కారణాలు చెప్పి వాళ్ళ గర్భసంచుల్ని కోసేసారట. ఒక్కొక్కళ్ళు తమ కధల్ని మాకు వినిపించారు. ఒకామెకి మరీ ఘోరంగా 19 ఏళ్ళకే తీసేసారు. ప్రస్తుతం వాళ్ళందరూ రకరకాల అనారోగ్య సమస్యలతో ఉన్నారు. నేను చెప్పిన డాక్టర్ అవిశ గింజలతో వాళ్ళకి వైద్యం చేస్తున్నారు. నేను వాళ్ళకి పోషకాహారం గురించి చెప్పాను. 

Thursday, August 20, 2009

Thursday, May 24, 2012

అగ్నిపుత్రి


టెెస్సి థామస్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఖండాంతర క్షిపణి అగ్ని ఖీ ప్రయోగం విజయవంతమవుతూనే అప్పటివరకు ఎవరికీ తెలియని టెస్సి అమాంతం మీడియాలో ప్రముఖవ్యక్తిగా మారిపోయారు. భారతదేశ మీడియానేకాక అంతర్జాతీయ మీడియా కూడా టెస్సికి నీరాజనాలు పడుతోంది. ”మిస్సెల్‌ వుమెన్‌” అని ”అగ్నిపుత్రి” అని బిరుదులిచ్చి సత్కరిస్తోంది. యావద్భారతీయ మహిళ గర్వంతో ఉప్పొంగాల్సిన సందర్భమిది. ఎందుకంటే అత్యధిక సంఖ్యలో పురుషులు పనిచేసే మిస్సెల్‌ డెవలప్‌మెంటు ప్రోగ్రామ్‌ శాఖలో, 49 సంవత్సరాల టెస్సి స్వయంకృషితో, పట్టుదలతో ఎదిగిన తీరు ఈ దేశ మహిళలందరికీ స్ఫూర్తిదాయకం.


1988లో డిఫెన్స్‌ రీసెర్చి డెవలప్‌మెంట్‌ ఆర్గనెజేషన్‌ (డిఆర్‌డివో)లో చేరిన టెస్సి జన్మరాష్ట్రం కేరళ. జన్మస్థలం అల్లెప్పి. తండ్రి చిన్నవ్యాపారి. తల్లి కుటుంబ నిర్వాహకురాలు. రాకెట్‌ లాంబింగ్‌ స్టేషన్‌కు అతి సమీపంలో ఆమె పెరగడంవల్ల రాకెట్ల పట్ల గొప్ప ఆకర్షణను,  ఇష్టాన్ని పెంచుకుంది టెస్సి.
టెస్సి పుట్టింది కేరళలోనే కానీ పాఠశాల, కళాశాల విద్య పూర్తవ్వగానే ఆమె ఉన్నత చదువుంతా పూనాలో పూర్తయ్యింది. ఇరవై సంవత్సరాల వయసపుడే ఆమె స్వరాష్ట్రాన్ని వదిలేసి ”గైడెడ్‌ మిస్సైల్స్‌”లో మాస్టర్స్‌ డిగ్రీ కోసం పూనా వచ్చేసింది. అక్కడ చదువుకుంటున్న సమయంలోనే ఆమె భర్త, భారతీయ నావికా దళంలో కమాండర్‌ సరోజ్‌కుమార్‌ పరిచయవ్వడం, అది వారిద్దరి మధ్య ప్రేమకి దారితియ్యడంతో వారు వివాహం చేసుకున్నారు. వారికి ‘తేజస్‌’ అనే కొడుకున్నాడు.


”కలకత్తాలో నిరుపేదల కోసం పనిచేసిన మదర్‌థెరిస్సా పేరును మా అమ్మనాన్న నాకు పెట్టారు. డి.ఆర్‌.డి.ఏ. తయారు చేసిన తేలికపాటి ఎయిర్‌ క్రాఫ్ట్‌ పేరు తేజస్‌. నా కొడుకుకు ఆ ఎయిర్‌ క్రాఫ్ట్‌ పేరునే పెట్టుకున్నాం. వాడు ప్రస్తుతం ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు.”
”ఖండాంతర పరిధి కల్గిన అగ్ని ఖీ (5000 కి.మీ రేంజ్‌) జనవినాశక ఆయుధం కదా! దీని కోసం పనిచెయ్యడం మీకు ఎలా అన్పిస్తుంది అని అడిగిన ఒక విలేఖరి ప్రశ్నకు ”……మేము తయారు చేస్తున్న ఆయుధాలు శాంతి కోసమే’ అన్నారు. టెస్సి అగ్ని ఖీ ప్రాజెక్టు డెరక్టరుగా, ఈ క్షిపణి విజయంలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు.
భారతదేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ డి. ఆర్‌. డి.ఎ లో పని చేసారు. కలామ్‌ ఆధ్వర్యంలో సమిష్టిగా, పట్టుదలతో పనిచేయడం నేర్చుకున్నామని, శ్రద్ధగా, నిబద్ధతతో పనిచేయడం ఆయనను చూసే నేర్చుకున్నా అంటారు టెస్సి.


”టెక్నాలజీలో జెండర్‌ వివక్ష లేదు. నా వరకు నేను ఎప్పుడూ జండర్‌ వివక్షకు గురవ్వలేదు. నన్నెవ్వరూ ఆ దృష్టితో చూడలేదు. పనిలో నిబద్ధత, పట్టుదల వుంటే చాలు అన్నింటినీ దాటుకుని ఆకాశమంత ఎత్తుకు ఎదగొచ్చు. ఇది నా అనుభవం ” అంటారు టెస్సి.
2008లో జరిగిన ఇండియన్‌ వుమెన్‌ సైంటిస్ట్‌ అసోసియేషన్‌ టెస్సి గురించి” ఎంతో మంది భారతీయ స్త్రీలు లాగానే టెస్సి థామస్‌ కూడా కుటుంబం, కెరీర్‌ల మధ్య సన్నటి తీగమీద సమర్థవంతంగా నడిచి, బాలన్స్‌ చేసుకుని తన ప్రతిభ చాటుకుంది. భార్యగా, తల్లిగా, శాస్త్రవేత్తగా జీవితాన్ని పలుపాత్రల్లో సమర్థవంతంగా పోషించడం అంత తేలికైన విషయం కాదు. కానీ టెస్సి గెలిచి చూపించింది. భారతదేశంలో పనిచేస్తున్న వేలాది మహిళా సైంటిస్టులకు స్ఫూర్తిదాతగా నిలిచి, వాళ్ళు తమ కలల్ని సాకారం చేసుకునేలా వెన్నుతట్టింది మా టెస్సి థామన్స్‌.”
ప్రస్తుతం టెస్సి థామస్‌ బృందంలో 400పై చిలుకు శాస్త్రవేత్తలున్నారు. వారిలో అధికశాతం పురుషులే. ”నేను డిఆర్‌డివోలే చేరినపుడు చాలా తక్కువ మంది స్త్రీ శాస్త్రవేత్తలున్నారు. ప్రస్తుతం వారి సంఖ్య పెరిగింది. ఇది ఇంకా పెరగాలి”.


గత జనవరిలో జరిగిన ఇండియన్‌ కాంగ్రెస్‌ సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని శ్రీ మన్‌మోహన్‌సింగ్‌ టెస్సీ థామస్‌ను అత్తుత్తమ రోల్‌ మోడల్‌లా కీర్తిస్తూ
”పురుషాధిపత్య పోకడలని చిన్నాభిన్నం చేస్తూ ఈ రోజు టెస్సి థామస్‌లాంటి మహిళా శాస్త్రవేత్తలు తమ ప్రతిభావంతమైన ముద్రని శాస్త్రతసాంకేతిక రంగంమీద వేస్తున్నారు” అంటూ కితాబిచ్చారు.
అమ్మాయిలకు ఆమె ఇచ్చిన సందేశం ”దృఢనిశ్చయం, నిబద్దతతో పనిచేస్తే మిగతావన్నీ వాటంతటవే వస్తాయి. పట్టుదల వుంటే ప్రపంచం మీ వెనకే వస్తుంది.”
భారతీయ మహిళల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన అగ్నిపుత్రికి హృదయపూర్వక అభినందనలు.

Tuesday, May 22, 2012

శాస్ర్తీయ దృక్పధం గురించి చర్చలు జరిపే చోట ఇంత అశాస్రీయ పద్ధతులా ???????????????????




  నిన్న ఉదయం దూరదర్శన్ వారి న్యూస్ & వ్యూస్ ప్రోగ్రాం లో పాల్గోడానికి దూర దర్శన్ ఆఫీసుకి కి వెళ్ళాను.నీ ముక్కేది అంటే తలంతా తిప్పి చూపినట్టు మా కార్ ఓ సందులోకి వెళ్ళి వెనక నించి పోర్టికో లోకొచ్చి ఆగింది.
ఇదేంటి ఓ నెల క్రితం వచ్చినప్పుడు కార్ మెయిన్  గేట్ లోంచే వెళ్ళింది కదా అని డ్రైవర్ ని అడిగితే ఆరుగురు ఉద్యోగులు చనిపోయారు.వాస్తు బాగా లేదంట. మైన్ గేట్ మూసేసారమ్మా అన్నాడు.
రకరకాల కారణాల వల్ల  మరణాలు సంభవిస్తాయి.దానికీ వాస్తు అంటూ సెక్యులర్ గా ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలను,వివిధ మతాల,నమ్మకాల వారు పని చేసే ప్రభుత్వ కార్యాలయంలో ఒక మతానికి చెందిన పద్ధతులను అనుసరించడం ఎంతైనా అభ్యంతరకరం.

Wednesday, May 16, 2012

పొగడపూలను చూపించమని అడిగిన మితృల కోసం


కొత్త సంవత్సర శుభాకాంక్షలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మితృలందరికోసం నేను తయారుచేసిన పొగడపూల గుచ్చం.
పొగడపూల వెనకున్నది ఓ చెట్టుకి పూసిన పువ్వు.వుడ్ రోజ్ లా సహజమైన పువ్వు.
దానికి నేను పొగడపూలను అతికిస్తే ఇంత అందమైన పుష్ప గుచ్చం తయారైంది.
సృజనాత్మక దృష్టి ఉండాలే గాని ప్రకృతి మనకెన్నో అద్భుతాలను అందిస్తుంది.

Monday, May 14, 2012

అబ్బ! ఎన్ని పొగడ చెట్లు,ఎన్ని పొగడపూలు, ఏమా సువాసనలు.





సెక్రటేరియట్ దగ్గర రైతు బజార్ లో కూరగాయలు కొనడం అంటే నాకు భలే ఇష్టం.
కూరగాయల మీద ప్రేమ కన్నా చుట్టూ ఉన్న పొగడపూల వనం మీదే నా ప్రేమ.
అబ్బ! ఎన్ని పొగడ చెట్లు,ఎన్ని పొగడపూలు, ఏమా సువాసనలు.
ఏమి కొంటున్ననానే దాని మీద నాకసలు స్పృహ ఉండదు.
దృష్టంతా పొగడ చెట్ల మీదే.
ఒక్కరన్నా పచ్చటి చెట్ల వేపు కాసేపు తేరిపారా చూస్తారేమోనని నా కళ్ళు వెతుకుతుంటాయి. ఊహూ! అందరూ ఉరుకులు పరుగుల పందెంలో పోటీ పడుతూ కనిపిస్తారు.
పొగడపూల సువాసనలనైనా వీళ్ళు పీలుస్తారా అనిపిస్తుంది.
అంత ఘాటైన ,మధురమైన సువాసన అక్కడి గాలినిండా కమ్ముకున్నా
అయ్యో ఒక్కరికీ పట్టలేదే అని నాకు బోలెడు బాధ వేస్తుంది.
ఎంత హడావుడి గా ఉన్నా, ఎన్ని పనుల ఒత్తిడి ఉన్న అలా అలవోకగా పచ్చదనం వేపు చూస్తే ఎంత హాయిగా ఉంటుంది.
ఎన్ని అత్తరు బాటిళ్ళు, ఎంత గొప్ప బ్రాండ్ వైనా సరే సహజ సువాసనల్ని ఇవ్వగలుగుతాయి.
నేను రాసింది నమ్మకపోతే ఆప్ లోగ్ చలో సెక్రటేరియట్.







Friday, May 11, 2012

సృజనాత్మకత ఉట్టిపడే అబ్బూరి చాయాదేవి గారు


 ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, "తనమార్గం" కధల సంపుటికి సాహిత్య అకాడెమి అవార్డ్ పొందిన అబ్బూరి చాయా దేవి గారు ఇటీవల బాగలింగంపల్లి లోని తన ఇంటిని అమ్మేసి కొండాపూర్ లోని చండ్ర రాజేస్వర రావ్ ఫౌండేషన్ వృద్ధాప్య కేంద్రంలో చేరారు. బాగలింగంపల్లి లో చక చకా తిరుగుతూ అన్ని పనులూ చేసుకుటూ తిరిగేవారు.
ఓ రోజు హఠాత్తుగా నిర్ణయం తీసుకుని ఇల్లు అమ్మేసి కొండాపూర్ వచ్చేసారు.
భూమిక ఆఫీసు ఉన్నది బాగలింగంపల్లి లోనే కాబట్టి తరచుగా ఆఫీసుకు వచ్చేసేవారు.నేనూ రెగ్యులర్ గా వాళ్ళ ఇంటికెళ్ళేదాన్ని.
ఆవిడ షిఫ్ట్ అయ్యాకా ఒక సారి వెళ్ళాను కానీ ఆవిడ అప్పటికి రూం సర్దుకోలేదు.
ఈ రోజు సాయంత్రం చల్లగా వాన పడుతున్నవేళ చాయా దేవి గారిని చూడ్డానికి వెళ్ళి నా కళ్ళను నేను నమ్మలేక పోయాను.
తన రూం నూ ఎంత  అద్భుతంగా అలంకరించుకున్నారో మీరే చూడండి.
ఎనభైలలోకి ప్రవేశిస్తున్న ఆవిడ  కళా హృదయం,సృజనాత్మక శక్తికి జేజే లు చెప్పి తీరాలి.
అక్కడికెళ్ళిన ఈ నెల రోజుల్లో ఆవిడ ఎన్నో బొమ్మలు చేసారు.మదర్ థెరిస్సా,రవీంద్రనాధ్ ఠాగూర్,గురజాడ లాంటి ప్రముఖుల బొమ్మలు తయారు చేసారు.
చాయా దేవి గారు చేటలో చేసిన చాట భారతం చూసి తీరాలి.
కేంద్రం వారిచ్చిన పరుపును చూడండి ఎంత కళాత్మకంగా అలంకరించారో.
తన రూం ముందు తన పేరు,పోస్ట్ బాక్ష్ చూడండి.
స్పూర్తిదాయకమైన ఆవిడ జీవన శైలి అబ్బురపరుస్తుంది.అనుసరించాలనిపిస్తుంది.
నాకు ఎంతో ఆత్మీయురాలైన చాయా దేవి గారితో అందమైన ఆవిడ గదిలో ఓ గంట సేపు గడిపి నేను మా ఇంటికి బయలుదేరాను.
కొంత మంది తామెక్కడున్నా పరిసరాలను తమకు కనుగుణంగా మలుచుకుంటారు.
అలాంటి వారిలో అబ్బూరి వారు అగ్రగణ్యులు.








Thursday, May 10, 2012

ఈ కేక్టస్ కి వొళ్ళంతా ముళ్ళే



ఈ కేక్టస్ కి వొళ్ళంతా ముళ్ళే
కళ్ళని కట్టిపడేసే ఈ పువ్వేంటో 
కరకుదనంలోంచి అపుడపుడూ కరుణ జారినట్టు
బురదలోంచి కమలం పుట్టినట్టు.

Tuesday, May 8, 2012

ఈ రోజు నేనొక కొత్త బాధ్యతని స్వీకరించాను.

ఈ రోజు నేనొక కొత్త బాధ్యతని స్వీకరించాను.
రాష్ట్రం లోని అత్యున్నత పోలీస్ కార్యాలయమైన డీ జి పి ఆఫీసులో ఏర్పాటైన
లైంగిక వేధింపుల ఫిర్యాదుల కమిటీలో నేను సభ్యురాలుగా నియమించబడ్డాను.
మహిళా పోలీసులకు సంబంధించిన ఫిర్యాదులను ఈ కమిటీ విచారిస్తుంది.

Thursday, May 3, 2012

గృహహింస నిరోధక చట్టం అమలు తీరుపై రాష్ట్రస్థాయి వర్క్ షాప్


మన రాష్ట్రంలో గృహహింస నిరోధక చట్టం 2005 అమలుతీరుపై గత డిసెంబరు నెలలో రెండు రోజులపాటు వర్క్‌షాప్‌ నిర్వచించాం. ఇదే అంశంపై అంతకు ముందు సంవత్సరంకూడా ఒక సమావేశాన్ని భూమిక నిర్వచించింది.

భారతదేశం మొత్తం మీద చూసుకుంటే మన రాష్ట్రంలో ఈ  చట్టం అమలుతీరు కొంత మెరుగ్గా వున్నప్పటికీ చాలా సమస్యలు కూడా వున్నాయి. ఈ చట్టం అమలులోకి వచ్చి ఆరు సంవత్సరాలు గడిచినప్పటికీ రాష్ట్రంలో చాలామందికి దీని గురించిన అవగాహన లేదు. రక్షణాధికారులంటే ఎవరు? ఎందుకున్నారు? ఎక్కడుంటారు అనే అంశం మీద చదువుకున్న స్త్రీలకి కూడా అవగాహన లేదు. ఒక విధంగా గ్రామీణ, నిరక్షరాశ్య మహిళలకి, వారు సంఘాలుగా ఐక్యమై వుండడం ద్వారా ఈ చట్టం గురించి కొంత చైతన్యం వుంది.
గృహహింస నిరోధక చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవతో వ్యవహరించిన మాట నిజమే. అయితే ఈ చట్టం ప్రకారం ఎన్నో శాఖలు కలిసి కట్టుగా పనిచేస్తూ బాధిత స్త్రీలకు న్యాయం అందించాల్సి వుంది. గృహహింస నిరోధక చట్టం నిజానికి చాలా అందంగా అద్భుతంగా తయారు చేసిన చట్టం. బాధిత మహిళలకు లభించాల్సిన పరిహారాలన్ని అతి తక్కువ సమయంలో అంటే కేవలం 60రోజుల్లో లభించే అవకాశం వుంది. హింసకు పాల్పడుతున్న వ్యక్తులనుండి రక్షణ పొందడం, తాను నివసిస్తున్న ఇంట్లోనే నివాస హక్కును పొందగలగటం, భరణం, పిల్లల కస్టడీలాంటి పరిహారాలన్నింటిని రక్షణాధికారిద్వారా పొందే అవకాశం ఈ చట్టం కల్పించింది. రక్షణాధికారి కోర్టులో కేసు ఫైల్‌ చేసిన తర్వాత 60 రోజుల్లో తీర్పును వెలువరించాల్సిందిగా కోర్టులను కూడా నిర్దేశించింది. అయితే ఇన్ని ఉన్నత లక్ష్యాలతో బాధిత మహిళలకు అండగా ఉండే విధంగా రూపొందించిన గృహహింస నిరోధక చట్టం పకడ్భందిగా అమలు చేయడంలో ప్రభుత్వం మరింత నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం వుంది.
సమస్యలలో ఉన్న స్త్రీల కోసం హెల్ప్‌లైన్‌ నడుపుతున్న అనుభవంలోంచి, ప్రతిరోజు బాధిత మహిళల కష్టాల కడగండ్లను వింటున్న నేపథ్యంతో మేము గృహహింస నిరోధక చట్టం అమలు తీరుపై ఎన్నో సమావేశాలను నిర్వహించాం. దానిలో భాగంగా ఈ చట్టం అమలులో కీలక పాత్ర వహించాల్సి వున్న మహిళా, శిశు అభివృద్ధి శాఖ, ఉచిత న్యాయం స్త్రీలకు అందించాల్సిన లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించాల్సిన  న్యాయమూర్తులతో, తమ వద్దకు వచ్చిన స్త్రీలకు గృహహింస చట్టం గురించి వివరించి రక్షణ కల్పించాల్సిన పోలీసులతోను చాలా సమావేశాలను నిర్వహించాం.
ఈ  కార్యక్రమంలో భాగంగానే  రక్షణాధికారుల కార్యాలయంలో పనిచేసే సోషల్‌ వర్కర్స్‌, లీగల్‌ కౌన్సిలర్స్‌ మరియు సర్వీస్‌ ప్రొవైడర్స్‌ (బాధిత స్త్రీలకు తక్షణ సహాయం అందించేందుకు గాను ప్రభుత్వం 75 స్వచ్ఛంద సంస్థలను/సహాయ సంస్థలను నియమించింది.)తో రెండు రోజుల వర్క్‌షాప్‌ను నిర్వహించాం. మేము ఈ వర్క్‌షాప్‌ నిర్వహించే వరకు కౌన్సిలర్స్‌కు, సర్వీస్‌ ప్రొవైడర్స్‌కు ఎలాంటి అనుసంధాన ప్రక్రియ చోటుచేసుకోలేదు. ఈ రెండు వ్యవస్థలని కలుపుతూ ప్రభుత్వం కూడా ఎలాంటి సమావేశం ఈ  ఆరేళ్ళకాలంలో జరపలేదు. భూమిక ఆధ్వర్యంలో మొదటిసారి పెద్ద ఎత్తున ఈ సమావేశం జరిగింది. 23 జిల్లాలలో పనిచేస్తున్న కౌన్సిలర్స్‌, మేము ఎంపిక చేసిన సేవా సంస్థల బాధ్యులు ఈ రెండు రోజుల సమావేశాలకు హాజరయ్యారు. రంగారెడ్డి మరియు హైదరాబాద్‌ జిల్లాలకు సంబంధించిన రక్షణాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
సమావేశాన్ని ప్రారంభిస్తూ ఈ రెండు రోజుల వర్క్‌షాప్‌ ద్వారా రక్షణాధికారుల కార్యాలయంలో పనిచేస్తున్న కౌన్సిలర్లను, సర్వీస్‌ ప్రొవైడర్స్‌ని ఒకరినొకరికి పరిచయం చేయడం, బాధిత స్త్రీలకి అండగా నిలవటంలో కలిసికట్టుగా పనిచేయడం అనే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని సత్యవతి తెలిపారు.
నిజానికి ఈ సమావేశాన్ని ప్రభుత్వం ఎపుడో ఏర్పాటు చేసి వుండాల్సిందని చెబుతూ, ఇంత పెద్ద స్థాయిలో ఇంత మందితో రెండురోజుల సమావేశ నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్నదని, ఆక్స్‌ఫామ్‌ ఇండియా సహకారంతో పాటు సెంటర్‌ ఫర్‌ వరల్డ్‌ సాలిడారిటీ వారు ఆర్ధికంగా సహకరించడం వల్లనే తాము దీనిని నిర్వహించగలుగుతున్నామని సత్యవతి తెలిపారు.
ఆ తర్వాత సిడబ్ల్యుఎస్‌ నుండి హాజరైన సుచరిత మాట్లాడుతూ కౌన్సిలర్‌లను, సర్వీస్‌ ప్రొవైడర్‌లను కలుపుతూ ఇలా సమావేశం నిర్వహించడం చాలా అవసరమని చెప్పారు. తమ సంస్థ 20 జిల్లాలలో గృహహింస చట్టం అమలు తీరుపై చేసిన అధ్యయనంలో డిఐఆర్‌ ఫైల్‌ చేసిన కేసులో 10 శాతం మందికి మాత్రమే న్యాయం దొరికిందని, మిగిలినవారి కేసులన్నీ పెండింగ్‌లో వున్నాయని తెలిపారు. ఈ చట్టం గురించి పెద్ద స్థాయిలో ప్రచారం చెయ్యాల్సి వుందని చెప్పారు సుచరిత.
తర్వాత రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల రక్షణాధికారులైన ఇందిరగారు, లక్ష్మీదేవిగారు మాట్లాడారు. తమ మీద చాలా పని భారం వుందని, చాలా కేసులు కోర్టుల్లోనే ఆగిపోయాయని చెప్పారు.
శ్రీ సీతారామఅవధాని, అడిషనల్‌ డైరెక్టర్‌, ఎ.పి. జ్యూడిషియల్‌ అకాడమీ, శ్రీ శ్రీనివాస రెడ్డి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎ.పి. జ్యుడిషియల్‌ అకాడమీగార్లు గృహహింస చట్టంలో పొందుపరిచిన కౌన్సిలర్ల, సర్వీస్‌ ప్రొవైడర్ల విధులు, బాధ్యతల గురించి వివరంగా మాట్లాడారు.
రెండోరోజు సమావేశంలో శ్రీ విద్యాప్రసాద్‌ విశ్రాంత సెక్రటరీ, లీగల్‌ సర్వీస్‌ ఆథారిటీ గృహహింసచట్టం అమలు తీరు గురించి వివరంగా మాట్లాడారు.
సర్వీస్‌ ప్రొవైడర్లుగా వున్న శివకుమారి, భానుజ, సూర్యకుమారి మొదలైనవారు తమకు ఈ చట్టం అమలులో ఎలాంటి ప్రాధాన్యతను యివ్వడంలేదని, రక్షాధికారులకు తమకు మధ్య ఎలాంటి అనుసంధానం వుండడం లేదని అన్నారు.
ఆ తర్వాత మహిళా, శిశు అభివృద్ధి శాఖ వారు తమ కౌన్సిలర్సతో గ్రూప్‌ డిస్కషన్‌ చేయించారు. రక్షాధికారుల కార్యాలయంలో పనిచేస్తున్న కౌన్సిలర్‌లు తమ సమస్యల గురించి చర్చిస్తూ తమకు సరిగా జీతాలు రావడంలేదని, ప్రయాణ భత్యం ఇవ్వడం లేదని తెలుపుతూ, తమకు సక్రమంగా ప్రతినెలా జీతాలు వచ్చేలా కృషిచేయ్యమని భూమికను కోరారు. అలాగే ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వారికి జీతాలు పెరిగాయని, తమకు పెంచడం లేదని ఈ విషయమై కూడా ప్రభుత్వంతో మాట్లాడమని కోరారు. ఇంతకు ముందు కూడా వారి జీతాల విషయంలో భూమిక చొరవతోనే త్వరగా విడుదలయ్యాయని, తాము తప్పక వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని సత్యవతి హామీ ఇచ్చారు.
రెండు రోజుల పాటు కలిసి వుండడం, చర్చించుకోవడంవల్ల కౌన్సిలర్లు, సర్వీస్‌ ప్రొవైడర్ల మధ్య మంచి సుహృద్భావ సంబంధం ఏర్పడింది. ఇక ముందు జిల్లాల్లో తాము కలిసి పని చేస్తామని, బాధిత స్త్రీలకు అండగా వుంటామని సమావేశానంతరం అందరూ ప్రకటించడంతో భూమిక ఏ ఉద్దేశ్యంతో ఈ రెండు రోజుల వర్క్‌షాప్‌ను నిర్వహించిందో ఆ లక్ష్యం నెరవేరిందనే అశాభావం అందరిలోను వ్యక్తమైంది.
కొసమెరుపు : కౌన్సిలర్ల జీతాభత్యాల విషయమై సంబంధిత శాఖ స్పెషల్‌ సెక్రటరీ ఛాయారతన్‌గారికి భూమిక రిప్రజెంట్‌ చెయ్యడం, ఆవిడ చాలా పాజిటివ్‌గా స్పందించి ఆగిపోయిన వారి జీతాలను విడుదల చెయ్యడంతోపాటు, పెరిగిన జీతాలను కూడా వారికి వర్తించేలా జి.వో విడుదల చేయించడంలో ప్రముఖ పాత్ర వహించారు వారికి ధన్యవాదాలు.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...