Sunday, May 8, 2011

ప్రకృతి, నా తల్లి వేరు వేరు కాదు నాకు

మా అమ్మ పేరు కాశీ అన్నపూర్ణ.అమ్మ పుట్టినపుడు వాళ్ళ తాత గారు కాబోలు కాశీ వెళ్ళేరట.అందుకని అలా పేరు పెట్టేరు.అమ్మకి ఒక అక్క..ఇద్దరు చెల్లెళ్ళు.వాళ్ళ నాన్నని (మా తాతయ్యని)బాబాయి అని పిలిచేది. వాళ్ళ బాబాయి గురించి చాలా చెప్పేది. గ్రామాల్లో భూస్వాములు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించేవాడాయన.గుర్రం మీద తిరుగుతూ,కనిపించిన ఆడపిల్లనల్లా చెరబడుతూ ,తింటూ, తాగుతూ వుండేవాడట.మేము చూళ్ళేదు కాని అమ్మ చెప్పేది.


అమ్మకి తన పుట్టిల్లంటే ఎంతో ప్రేమ.మా అమ్మమ్మ, తాతయ్య అరాచకాలలకి,అక్రుత్యాలకి నిలువెత్తు నిదర్శనంలా ఉండేదట. చెప్పుకోలేని వ్యాధేదో ఆమెని పట్టి పీడించేదని,దానితోనే ఆమె చనిపోయిందని అమ్మ బాధ పడేది. అమ్మమ్మ చనిపోవడంతో ఇద్దరి చెల్లెళ్ళ బాధ్యత అమ్మ మీదే పడింది.వాళ్ళ పెళ్ళిళ్ళు, పురుళ్ళు తనే చూసింది.దాయాదుల పంచన ఉంటూ,తల్లిని, తండ్రిని కోల్పోయి,ఆస్తులు చేజారిపోయి అమ్మ అష్ట కష్టాలు పడిందని,అయినా తనకు పుట్టిల్లంటే,దాయాదుల పిల్లలంటే చాలా ఇష్టమని అక్క అంటుంది.

నేను పుట్టిన పది రోజులకి మా అమ్మమ్మ చనిపోయిందట.అమ్మ నన్ను మా పెద్దక్కకి వదిలేసి వెళ్ళిపోయింది.నెను ఎలక పిల్లలాగా ఇవాళొ రేపో పోతానన్నట్టు ఉండేదాన్నట.ఓ చింపిరి చాప మీద దొర్లుతూ ఉండేదాన్నట.అక్కకి తీరికైనపుడు కొన్ని పాలు తాగించేదట.

మా అమ్మ ఓ పెద్ద ఉమ్మడి కుటుంబంలో చాకిరీ యంత్రంలా పనిచేసిది.మా తాత(మా నన్న నాన్న)కి ఏడుగురు కొడుకులు,ఇద్దరు కూతుళ్ళు.నాకు ఊహ తెలిసేటప్పటివరకు అందరూ కలిసే ఉండేవార్ళ్ళు.ఈంట్లోని ఆడవాళ్ళు పూటకి ఏభై మందికి వండి పోసేవాళ్ళట.ముందు మగవాళ్ళు,తర్వాత పిల్లలు తిన్నాక ఏమైనా మిగిలి ఉంటేనే ఆడవాళ్ళకి.చాలా సార్లు గంజి నీళ్ళే ఉండేవని అమ్మ అంటూ ఉండేది.అమ్మ కన్నా ఉమ్మడి కుటుంబంలోని బాధలు,కష్టాలు పెద్దక్క ఎక్కువ అనుభవించింది.చెళ్ళెళ్ళ బధ్యతల వల్ల అమ్మ ఎక్కువగా పుట్టింట్లో ఉండేదట.

మా పెద్దాక్క అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకునేది.మా తాత వంట వస్తువుల్ని తూకం ప్రకారం ఇవ్వడం వల్ల చివరగా తినే ఆడవాళ్ళకి చాలా సార్లు ఏమీ ఉండేది కాదు.ఆడవాల్లు తిన్నరా లేదా అని ఎవరికి పట్టేది కాదట.మా అక్క వళ్ళని వీళ్ళని అడిగి ఏవేవో తెచ్చి అమ్మకి పెట్టేదట.అమ్మ తోడికోడళ్ళు ఆరుగురు.అందులో కొందరు అమ్మతో తగవులు పడేవారట.అమ్మకి తగవులంటే భయం.గొడవలంటే భయం.తగవులు మొదలైతే భయపడి ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపు గడియ పెట్టుకునేదట.

అమ్మ ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉండేది.

తనకి మంచి మంచి రంగుల చీరలన్నా, నగలన్నా ఎంతో ఇష్టం.మాచింగ్ జాకెట్టు లేకుండా చీర కట్టేది కాదు.శరీరం పట్ల ఎంతో స్రద్ధ.అన్నీ శుభ్రంగా, శుచిగా ఉండాలి.ఆవిడ తినే పళ్ళెం,తాగే గ్లాసు ఎవరూ ముట్టుకోకూడదు.తను ఉండే చొటునల్లా అవన్ని ప్రత్యేకంగా పెట్టే వాళ్ళం.అమ్మ తనని తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకొనేది.తన జీవిత విధానమంతా చాలా డిఫరెంట్ అనుకునేది.శరీరం మీద చిన్న ముడత కనబడినా "చూడవే ఈముడత అసహ్యంగా" అని బాధపడిపోయేది.అమ్మా!నీ వయస్సుకి వస్తాయమ్మా అంటే,ఏమోనే చిరాగ్గా ఉంది చూడ్డానికి అనేది.ఎనభై సంవత్సరాల వయస్సులో కూడా జుట్టు పట్ల ఎంతో శ్రద్ధ.తానే ఓ హెర్బల్ ఆయిల్ తయారు చేసుకుని తలకి పట్టించేది.ఆశ్చర్యంగా నిగనిగలాడుతూ జుట్టు మొలుచుకొచ్చింది.ఆ ఆయిల్ నన్ను పెట్టుకోమని సతాయించేది.నీకు దేనిపట్ల స్రద్ధ లేదని తిట్టేది నన్ను.చివరి దశలో ఆరోగ్యం బగోకుండా మంచం మీద ఉన్నపుడ్ కూడా తని చూడడానికి వచ్చే వాళ్ళకి ఆ హెర్బల్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చెబుతుండేది.

అమ్మకి చివరి స్నానం చేయించిన రోజున వీపంతా పరుచుకున్న నల్లని జుట్టు అందరినీ ఆస్చర్యంలో ముంచేసింది.జీవితం పట్ట్ల తన ప్రేమకి నిదర్శనంలా

నిగనిగలాడుతూ పరుచుకున్న తన ఉంగరాల జుట్టు కన్నీళ్ళ మధ్య నాకీనాటికీ కనిపిస్తూనే ఉంటుంది.

తనకి అరవై సంవత్సరాలపుడె బిపి, షుగర్ మొదలైనాయి.ఎంతో శ్రద్ధగా మందులు వేసుకునేది.2000 లో అమ్మ ఒకసారి చాలా సీరియస్ గా జుబ్బు పడింది.అడుగు తీసి అడుగు వెయ్యలేకపోయింది.మేమిద్దరం చెరో రెక్క పట్టుకుని బాత్రూముకి తీసుకెళ్ళేవాళ్ళం.తనని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కుర్చీలో కూర్చోబెట్టి మేడ మెట్ట్లు దింపుతుంటే నా సహచరుదు ఒక్కసారిగా భోరుమని ఏడ్వడం నాకింకా గుర్తు. ఈమె ఇంక ఇంటికి తిరిగొస్తుందా అంటూ ఏడ్చాడు.లక్కీగా అమ్మ ఆ గండం నుంచి బయటపడి మామూలు మనిషైంది.అమ్మ మా ఇద్దరి జీవితాల్లోను ఒక భాగమైపోయింది.అమ్మ సీరియసుగా జబ్బుపడినపుడే అన్నయ్యను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించాము.కాని తను ఎప్పుడు మా దగ్గర ఉండడానికే ఇష్టపడేది.ఎపుడైనా ఎక్కడికైనా వెళ్ళినా తిరిగి మా దగ్గరికే వచ్చేసేది.

2005 లో నర్సాపురంలో నేను చదువుకున్న కాలేజి వాళ్ళు ఏదో ఫంక్షంకి నన్ను పిలిచారు.నేనూ వస్తానంటూ అమ్మ నాతో బయలుదేరింది.ప్రోగ్రాం అయిపోయాక నేను వచ్చేసాను.తను తమ్ముడి దగ్గర కొన్ని రోజులు ఉండి వస్తానని చెప్పింది.ఆ తర్వాత రెందు రోజులకి బాత్రూంలో పడిపోయిందని తమ్ముడు ఫోన్ చేసి చెబితే నా గుండె గుభేలుమంది. ఈ వయస్సులో పడితే తిరిగి లేస్తారా? లేవనే లేదు.

కొంచం కోలుకున్నాక హైదరాబాదు తీసుకొచ్చేసాము.మా ఇంట్లోకి

రాగానే ఇపుడు నాకేం ఫర్వాలేదు అంది. కానీ బాగాలేదు.

ఒక రాత్రి ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే నింస్కి తీసుకిళ్ళిపోయాం. చాలా సీరియస్ కండిషన్లో పదిహేను రోజులు నింస్లో ఉంది.రోజుకొకలాగా ఉండేది.ఒకరోజు నవ్వుతూ కబుర్లు చెప్పేది.మరో రోజు కోమాలో ఉండేది.మెలుకువ వస్తే కాఫీ కాఫీ అంటూ కలవరించేది.కాఫీ అంటే మహ ప్రాణం అమ్మకి.మే 14 రాత్రి అమ్మ నన్ను విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయింది.ఆ పదిహేను రోజులూ నాకు బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయింది.ఇల్లు,ఆసుపత్రి. అంతే.

అమ్మ కళ్ళను దానం చేసితన పార్ధివ శరీరానీ అంబులెన్సులో ఎక్కించుకుని,తనకెతో ఇష్టమైన మాఇంటికి తెచ్చి,తర్వాత మాఊరు సీతారామపురం బయలుదేరి వెళ్ళాం.అదే రోజు మా పొలాల్లో అమ్మ అంత్యక్రియలు జరిగాయి.

అమ్మతో నా అనుబంధం గురించి నేను అక్షరాల్లో రాయలేను.అది ఆత్మిక బంధం.నాకు తన తల్లి పేరు పెట్టుకుంది కాబట్టి నన్ను అమ్మాజీ అని పిలిచేది.తన నోట్లో నా పేరే నానుతుండేది.ముప్ఫై ఏళ్ళు నాతో ఉంది.నువ్వు నా కూతురి కాదు నా తల్లివి అనేది.తనని కంటికి రెప్పలా చూసుకున్నాను.తనకి ఏ లోటూ రానివ్వలేదు.తనకి ఏ కష్టం కలగనివ్వలేదు అనే త్రుప్తి చాలు నాకు.

నా మీద అమ్మ నాన్నల ప్రభావం అపారం.వాళ్ళు నన్ను పెంచిన తీరు అపూర్వం.అందుకే నా కధల సంపుటిని వాళ్ళకే అంకితమిస్తూ"చెట్టు మీద పిట్టల్లే నన్ను పెంచిన అమ్మా నాన్నలకి" అని రాసాను.నాలాగే అమ్మకి బోలెడుమంది స్నేహితులు.

అమ్మతో అలరారిన బాల్యస్మ్రుతులేవీ నాకు లేకపోయినా,నా ఎదుగుదలలోని ప్రతి మలుపులోనూ అమ్మ అభయ హస్తం నాతోనే ఉంది.నేను రచయిత్రిగా,జర్నలిష్టుగా, కార్యకర్తగా అనూహ్యమైన ఎత్తుకి ఎదగడం వెనక నా తల్లి శ్రమ స్పష్టంగా కనపడుతుంది.నా ఇంటిని, నా వంటిటి శ్రమని తనమీదేసుకుని నన్ను ఓ స్వేచ్చా విహగంలా ఆకాశంలోకి ఎగరేసింది.నేను ఆకాశంలో ఎగురుతున్నా నేల మీదున్న నా తల్లిని ఏ రోజూ నిర్లక్ష్యం చెయ్యలేదు.తనని అరచేతుల్లో పెట్టుకుని అపురూపంగా చూసుకున్నను.తనకి కొడుకులున్నా అమ్మ కి నాతో ఉండడమే ఇష్టం.నేనూ అమ్మ బాధ్యతని ఆనందంగా నా మీద వేసుకున్నాను.తనకి ఏ కష్టం కల్గకుండా ఓ గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వగలిగాను.ఒక ప్రత్యేక వ్యక్తిలా ఎలా బతికిందో అంతే హుందాగా,గౌరవంగా వెళ్ళిపోయింది.తన సేవాభావాన్ని పుణికి పుచ్చుకున్న నేను అమ్మ పేరు మీద మా ఊళ్ళో స్త్రీల కోసం ఒక సంస్థను స్థాపించాను.మా అమ్మను ఎంత ప్రేమిస్తానో మా ఊరిని అంతే ప్రేమిస్తాను.నా ద్రుష్టిలో రెండూ వేరు వేరు కాదు.కన్న తల్లి లాంటిదే పుట్టినూరు కూడా.

అమ్మ భౌతికంగా మా నుంచి దూరమైంది ఈరోజే.అయితే అమ్మ మా హ్రుదయాల్లోంచి ఎక్కడకూ వెళ్ళలేదు.అమ్మజీ అంటూ నన్ను పిలుస్తూ నా చుట్టూ గాలిలో,నేను పెంచే చెట్లలో,నేను ప్రేమించే వెన్నెలలో,సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఒక్టేమిటి నన్ను అలరించే,నన్ను పులకింపచేసే సమస్త ప్రకృతి మాతలో నా తల్లి ప్రతిరూపమే కనిపిస్తుంది నాకు.ప్రక్రుతి, నా తల్లి వేరు వేరు కాదు నాకు. ప్రకృతి ఉన్నంతకాలం,నేను ప్రకృతికి సమీపంగా ఉన్నంత కాలం నా తల్లి స్మ్రుతి సజీవంగా నాలో దీపంలాగా వెలుగుతూంటుంది. నాకు దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది.

3 comments:

సుజాత వేల్పూరి said...

సత్యవతి గారూ, ఏమి చెప్పాలో తెలీడం లేదు. మీ ఇద్దరి అనుబంధం చెప్పలేనంత ఆత్మీయంగా ఉంది. మీరు ఇలా దాన్ని ఇక్కడ పంచుకోడమూ బాగుంది.

ఎన్ని కష్టాలు పడ్డారో ఆమె, మీ వద్ద సుఖంగా గడపగలగడం సంతోషం!

వనజ తాతినేని/VanajaTatineni said...

I like it... Mdm..

Ruth said...

Beautiful !!!

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...