అనంతగిరి కొండల్లోకి అలా అలా.......

అనంతగిరి అంటే వైజాగ్ జిల్లా అరకు దగ్గరి అనంత గిరి అనుకుంటే మీరు మూసిలో కాలేసినట్టే.
నేను రాస్తున్నది రంగారెడ్డి జిల్లా,వికారాబాద్ దగ్గరున్న అంతగిరి గురించి.
హైదరాబాద్ కి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అద్భుతమైన ప్రదేశం.
నిన్న అనుకోకుండా అప్పటికప్పుడు అనుకుని అనంత గిరికి ఎగిరిపోయాం నేను నా నేస్తాలు గీత,జయ.
జయ నిన్ననే వైజాగ్ నుండి వచ్చింది.
ఎటైనా పోదామా ముగ్గురం అనుకుని ఓ పెద్ద కారియర్ కట్టుకుని 10 గంటలకి బయలుదేరాం.నేనే డ్రైవింగ్.
మబ్బులు పట్టిన ఆకాశం మాతోనే ప్రయాణం చేసింది.
చల్లటి గాలి మమ్మల్ని వదిలితే ఒట్టు.
హైదరాబాద్ కి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అద్భుమైన ప్రదేశం.
వికారాబాద్ రోడ్ లో ఓ ప్రత్యేకత ఉంది.రోడ్డుపొడవునా ఊడలు దిగిన మర్రి చెట్ట్లు మనకి పచ్చటి స్వాగత తోరణాలు కట్టి ఆహ్వానిస్తున్నట్టుంటాయ్.
ఈ రోడ్డు నాలుగు లేన్లో ఆరు లేన్లో అవ్వకూడదని నేను చాలా బలంగా కోరుకుంటున్నాను.
రోడ్డు వెడల్పు ప్రోగ్రాం పెడితే ఈ మర్రి ఊడల సౌందర్యమంతా హుష్ కాకే.
సరే! మేము ఈ పచ్చటి రోడ్డుమీద గతుకులు గట్రా ఉన్నప్పటికి రయ్మంటూ దూసుకెళ్ళసాగాం.
నేను చాలా ఫాస్ట్ అండ్ రాష్ డ్రైవర్ ని లెండి.
చేవెళ్ళ చెల్లెమ్మ సబిత నియోజకవర్గం కదా రోడ్డు అద్దం లా ఉంటుందనుకున్న మా భ్రమలు ఆ గతుకుల రోడ్డు మీద భళ్ళున పగిలాయ్.
మేము 12 గంటలకి అనంతగిరి చేరాం.అక్కడొ అనంత పద్మనాభుడి గుడి కూడా ఉందండోయ్.
టిబి సానిటోరియం కూడా ఉంది.ఒకప్పుడు టిబి వస్తే ఇంట్లో ఉండనిచ్చేవారు కాదు కాబట్టి సానిటొరియం లుండేవి.అనంతగిరి లోని ఈ సానిటోరియం కూడా ఒకప్పుడు రోగులతో కిటకిట లాడేదట.ఇప్పుడలాంటి సీనుల్లేవు.
నాకు గుళ్ళతో పని లేదు కానీ నా ఫ్రెండ్స్ కోసం గుళ్ళో కెళ్ళాను.చాలా శుభ్రంగా చల్లగా ఉంది లోపల.
ఓ ఐదు నిమిషాల్లో గుడిపక్కనున్న మెట్ల మీదుగా అడివిలోకి అడుగులేసాం.
కాలేజి పిల్లలు చాలా మందే కనబడ్డారు.
నడుస్తూ,నడుస్తూ చిక్కటి అడవిలోకి వచ్చేసాం.
అడవి ఎంత అందంగా ఉందో చెప్పలేను.ఈ అడవిలోనే క్షణ క్షణం సినిమా తీసారట.
ఈ అడవికి కొంచం అవతల కొండల్లోనే మన మూసి పుట్టింది.
తలకోన అడవిలో ఉండేలాంటి పెద్ద పెద్ద తమ్మకాయల తీగలు ఒక చెట్టు మీంచి ఇంకో చెట్టుమీదకి ఎగబాకి ఎంత దట్టంగా అల్లుకుపోయాయో.లావు లావు తీగలు ఉయ్యాలల్లాగా అల్లుకున్నాయి.
మేము ఓ చెట్టు కింద కూర్చుని తెచ్చుకున్న కారియర్ పని పట్టాం.
మేము తింటున్నప్పుడు ఓ శునకం గారు వస్తే వారికీ భోజనం పెట్టాం.ఇంక వారు తోక ఊపుకుంటూ మాకు కాపలా కాస్తూ అడివంతా మాతో తిరిగారు.
మేము అచ్చం ముసాఫిర్ల్ లాగా తిన్న చోట బిచాణా ఎత్తేసి ఇంకో పెద్ద చెట్టు కింద పడకలేసేసాం.
ఆ అడవి మధ్యలో ఆ పెద్ద చెట్టు కింద వెల్లికిలా పడుకుని,చెట్ల ఆకుల్లోంచి కనిపిస్తున్న ఆకాశాన్ని చూడాల్సిందే.
అలా చూస్తూ ఉన్నామా హటాత్తుగా మబ్బులు కమ్మి జలజలా
వానపడసాగింది.ఈ దృశ్యాన్ని ఎలా వర్ణించాలో నిగంగా నాకు మాటలు దొరకడం లేదు.
మా మీద ప్రకృతి కెంత ప్రేమ ఇలా ముత్యాల జల్లు కురిపించిందని తెగ మురిసిపోయాం.
ఆ దృశ్యం ఎక్కువ సేపు లేదు కూడా.అయినా మా మనసుల్లో నిండిపోయింది.
ఆ మత్తులోంచి తేరుకుని ఆ అడవిని వదలలేక వదలలేక మళ్ళి జనారణ్యలోకి వెలుతురుండగానే వచ్చిపడాలి కాబట్టి తిరుగు ప్రయాణమయ్యాం.
నిన్న నేను 160 కిలోమీటర్లు డ్రైవ్ చేసి ఈ అద్భుతానందాన్ని నా నేస్తాలతో సహ అనుభవించాను.
ఆ సంతోషాన్ని మీతో కూడా పంచుకోవాలని ఇదంతా రాసాను.Comments

tolakari said…
మన హైదరాబాద్ దగ్గిరలో వున్నఅనంతగిరిని వర్ణిస్తూంటే నాకు వెంటనే వెళ్లి చూడాలని అనిపిస్తోంది. థాంక్స్. ఈసారి తప్పకుండా వెళ్లి వస్తాము. మీ బ్లాగుని ఇదే చూడడం. మీ గురించి తెలిసినందుకు ఆనందంగా వుంది.
ఇందు said…
చాలాబాగుందండీ మీ నేస్తాలతో చేసిన సరదాప్రయాణం! అడవుల్లో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది..అక్కడ ప్రకృతికి ఎక్కువ ప్రాముఖ్యతేమో అందుకే అంత అందంగా ఉంటుంది. మీరు కోరుకున్నట్టే ఆ రోడ్డు వెడల్పు కాకూడదని నేను కోరుకుంటున్నా! :)
సుజాత said…
నేను టైటిల్ చూసి మూసీలో కాలు బాగా బురద ఉన్న చోటు చూసుకుని మరీ వేశాను. ఇలాంటి ప్రదేశాలు ఎలా కనిపెడతారో మీరు? మీ బ్లాగ్ చూశాకే నేను టైడా వెళ్ళి దాన్ని ఈనాడులో రాశా కూడా!

మీరు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న ఫొటో లైవ్లీగా ఉంది.

ఓ సారి ఇక్కడికీ వెళ్ళి చూడాలి. అప్పుడు నా కారు నేనే డ్రైవ్ చేస్తా!
Vasu Chowdary said…
చాలా అందంగా ఆవిష్కరించారు మీ అందమైన ప్రయాణ అనుభవాన్ని. నాకైతే కళ్ళకు కట్టినట్లు ఉంది...నేను ఒకసారి మా ఫ్రెండ్స్ తో అహోబిలం వెళ్ళాను..ఆ రోజులు గుర్తుకు వచ్చాయి. ధన్యవాదాలు.
జయ said…
చాలా బాగుందండి. నా అనంతగిరి ప్రయాణాన్ని కూడా భలే గుర్తు చేసారు.మీరూ చూస్తారా మరి.
http://manasvi-jaya.blogspot.com/2010/11/blog-post_20.html
Venugopal said…
Chaala bagundandi Anantagiri Ventane velli choodalanipisthundi..
Hyderabad Daggarlo Intha Aaahladamaina Palace.. Very Happy..

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం