మంచు కురిసే వేళలో -మా ఊరిలో

శీతాకాలంలో మా ఊరు కూనూరు లాగా ఉంటుంది.
ఊటి వెళ్ళిన వాళ్ళకి కూనూరు తెలిసే ఉంటుంది.
మా ఊరి నిండా పచ్చటి తోటలే ఉంటాయి.
రయ్ మని ఈలలేసే సరుగుడు తోటలు.
తోటకి తోటకి మధ్య గోడలాగా పెట్టే కోరాడులు.
కోరాడుల మీద పాతే బ్రహ్మజెముడు ముళ్ళపొదలు.
చలి కాలంలో ఈ బ్రహ్మజెముడు విరగ పూస్తుంది.
తెల్లటి బ్రహ్మకమలాల్లాగానే ఉంటాయి బ్రహ్మజెముడు పూలు.
ఉదయం లేచి మా వీధిలోకొస్తే అబ్బ! చూడాల్సిందే.
విపరీతంగా పొగమంచు కురుస్తూ ఉంటుంది.
మా ఇంటి వీధరుగు మొత్తం తడిసిపోయుంటుంది.
మంచుకురిసే వేళలో విరగబూసిన ఈ పువ్వుల సొగసు చూడాల్సిందే.
అప్పటికే మా వాళ్ళు చలి మంట వేసి ఉంటారు.
క్రితం రోజు తవ్వి తీసిన తేగలు మంటలో కాలుతూంటాయి.
నేను చిన్నప్పుడు నిద్రలేచిందే తడవు చలిమంట దగ్గర చేరడం
మా అమ్మ ఓ గమ్మత్తైన తిట్టు తిట్టేది.
జడ్జిగారమ్మా మొగుళ్ళా ఎలా కూర్చుందో చూడండి అనేది
మా నాన్న నవ్వుతూ చూసేవాడు కానీ ఏమీ అనే వాడు కాదు.
మా అమ్మ తిట్టిన తిట్టో ఆశీస్సో తెలియదు కానీ


 జడ్జిగారమ్మా మొగుళ్ళా కాదు కానీ జడ్జీ కే సహచరినయ్యాను.
ఇంతకీ మా ఊరి మంచు గురించి చెబుతూ ఎటొ వెళ్ళిపోయాను.
సరుగుడు చెట్లమీద జారిన మంచు ముత్యాలు సూర్యుడి తొలికిరణం పడగానే మిల మిల మెరిసిపోయేవి.
చాలా సార్లు తొమ్మిదైనా మంచు విడిపోయేది కాదు.
ఆ మంచులో గడ గడ వణుకుతూ నడుచుకుంటూ బడికి బయలుదేరేవాళ్ళం.
స్వెట్టర్ పేరు కూడా వినని రోజులు.
ఒక్కోసారి వర్షం కురిసినట్టు మంచు కురిసేది.
మేము తడిసి ముద్దయ్యే వాళ్ళం.ఆ తడిసిపోయిన బట్టలతోనే బడికెళ్ళే వాళ్ళం.
మా ఊరి మంచుతో ఎన్నెన్ని జ్ఞాపకాలు.
ఆ అన్నట్టు మరిచిపోయాను.
ముందురోజు సాయంత్రం తంపటేసిన తేగల్ని రాత్రంతా మంచులో పెట్టి తింటే
ఆ మజాయే వేరు సుమా!
ఆ తేగల్ని నములుకుంటూ వాటిల్లోని చందమామల్ని ఎగరేసుంకుంటూ
మంచులో నడుస్తూ బడికెళ్ళిన రోజులు ఎంత బావుండేవో.
ఆ జీవితంలో ఎంత కష్టముందో అంతే సంతొషముంది.

Comments

ఇందు said…
అబ్బ! భలే ఉందే మీ ఊరు? ఏం ఊరు మీది? చాల బాగ వర్ణించారు మంచుని,అందులొ మీ ఊరి అందాలని.నేను కూనురు వెళ్ళాను.మీ ఊరు అలగే ఉంటుంది అంటే ఒకసారి మన ఆంధ్రా కూనూరుని కూడా చూడాలనుంది :)

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం