Monday, November 8, 2010

తుపాకీ మొనపై వెన్నెల

క్రితం సంవత్సరం జమ్మువెళ్ళి వచ్చిన దగ్గరి నుంచి శ్రీనగర్‌ చూడాలనే కోరిక మరింత బలపడసాగింది. మేం శ్రీనగర్‌ ప్రోగ్రామ్‌ వేసుకోగానే ఎక్కువమంది నిరుత్సాహపరిచారు.ముందే అక్కడ శాంతి భద్రతల సమస్య వుంది దానికి తోడు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. శ్రీనగర్‌కు వెళ్ళడం మంచిది కాదు అని సలహా ఇచ్చారు. అయిన మేం వెళ్ళడానికే నిర్ణయించుకున్నాం.
మే ఒకటవ తేదీన ఢిల్లీలో దిగగానే పిడుగులాంటి వార్తను మోసుకొచ్చారు ప్రొటోకాల్‌ అదికారులు. ఏప్రిల్‌ 26 నుంచి వరసగా నాలుగు రోజులు శ్రీనగర్‌లో వర్షాలతో పాటు, విపరీతంగా మంచు కురిసిందని, లేకు వెళ్ళే రోడ్లు మంచుతో నిండిపోవడం వల్ల ముసేసారని ఆ వార్త సారాంశం. శ్రీనగర్‌, సిమ్లా, కులు,మనాలి ప్రాంతాల్లో మంచు కురస్తుండడం వల్ల అక్కడికి విమాన సర్వీసులు రద్దయ్యాయని కూడా చెప్పారు. ప్రాణం ఉస్సురంది. మాతోపాటు శ్రీనగర్‌ ప్రోగ్రామ్‌ పెట్టుకున్న మరొకరు వాళ్ళ ప్రయాణం కాన్సిల్‌ చేసుకున్నారు. ఢిల్లీలో రెండు రోజులు గడిపాక మే మూడో తేదీన ఉదయం తొమయ్మిది గంటల ఫ్లయిట్‌కి మేం శ్రీనగర్‌ వెళ్ళాల్సి వుంది.
రెండో తేదీ సాయంత్రం నా బెంగాలీ మిత్రురాలు ఉత్పల వాళ్ళింటికి వెళ్ళాం. మాటల సందర్భంలో ఉలన్‌ దుస్తులు తీసుకెళుతున్నారా అని అడిగింది ఆమె. నేను ఒక షాల్‌ మాత్రమే తీసుకెళుతున్నానని చెప్పాను. శ్రీనగర్‌, లే వెళుతూ ఒక్క షాల్‌ సరిపోతుందనుకున్నావా అంటూ తన దగ&గరున్న ఉలెన్‌ బట్టలన్నీ ఓ సూట్‌కేస్‌ నిండా సర్ది ఇచ్చింది. రెండు లాంగు కోటులు, మంకీక్యాప్‌లు, షాక్సులు, గ్లౌజులు, స్వెట్టర్‌లు చూసి ఇవన్నీ ఎందుకని నేను నవ్వితే అక్కడికెళ్ళాక అర్థమౌతుందిలే ఎందుకో అని తనూ నవ్వింది. నిజంగానే లే వెళ్ళాక నాకు బాగానే అర్థమైంది. అవన్నీ తీసుకెళ్ళి వుండకపోతే మేం చలికి గడ్డకట్టుకుపోయేవాళ్ళం.
ఉత్పల ఇచ్చిన అదనపు సూట్‌కేస్‌తో సహా మూడో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళాం. మాతోపాటు కాశ్మీరుకు చెందిన మరొక ఆంధ్రప్రదేశ్‌ జడ్జి, ఆయన భార్య వహీదా కూడా సమ్మర్‌ వెకేషన్‌ కోసం శ్రీనగర్‌ వెళుతున్నారు. శ్రీనగర్‌ ఫ్లయిట్‌ కన్‌ఫర్మ్‌ అయ్యేవరకు నాకు ఆందోళనగానే వుంది. వ్రీనగర్‌లో వాతావరణం మెరుగైందని విమానం బయలుదేరబోతున్నదని తెలియగానే నా సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. విమానం గాల్లోకి లేవగానే నా మనసు విమానం రెక్కమీదకెక్కి కూర్చొంది. వెన్నముద్దల్లాంటి మబ్బుతునకల్ని చీల్చుకుంటూ విమానం ఎగురుతోంది. ఓ అరగంట గడిచాక వహీదా నన్ను పిల్చి ఇక్కడ కూర్చో అంటూ కుడివైపు విండో సీట్‌ ఆఫర్‌ చేసింది. ఆ సీట్లో కూర్చుని కిటికీ నుంచి బయటకు చూడగానే అద్భుతమైన దృశ్యం కంటబడింది. మంచుతో కనప్పబడి, సూర్యకాంతికి మెరుసు&తన్న హిమాలయ ఉత్తుంగ పర్వత పంక్తులు. లోతైన లోయలు, సన్నటి నీటి పాయలు ధవళ కాంతులీనుతున్న పర్వత సముదాయాలు మనస్సును పులకరింపచేసాయి. కన్నార్పితే ఏ సౌందర్యం కనుమరుగైపోతుందో అని చేపలాగా అనిమేషనై అలాగే చూస్తుండిపోయాను. కాశ్మీరు లోయలోకి ప్రవేశిస్తున్నాం అంది వహీదా. కళ్ళను కట్టిపడేసే ఆ ఆకుపచ్చలోయ సొగసును అనుభవించాలి తప్ప మాటల్లో వర్ణించలేం. పచ్చనిలోయ చుట్టూ మే నెల ఎండలో మెరుస్తున్న మంచు పర్వతాలు. మరో పావు గంటలో విమానం శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది.
ఎయిర్‌పోర్ట్‌ నించి బయటకు వచ్చి కారులో కూర్చుని తలుపు వేయబోయాను. ఒక్క అంగుళం కదలలేదు. ఆ తర్వాత తెలిసింది అది బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారని. ఎందుకు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారని అడిగితే ఇక్కడ మిలెటెన్సీ ప్రోబ్లమ్‌ వుంది. సెక్యూరిటీ కోసం తప్పదు అన్నరు. నా వరకు ఆ కారులో కూర్చోవడం ఇష్టంలేకపోయింది. కాని తప్పలేదు. ఎకె 47 పట్టుకున్న పట్టుకున్న పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ముందు సీట్లో సెటిల్‌ అయిపోవడం కూడా నాకు ఎంత మాత్రమూ నచ్చలేదు.
మాకు టూరిస్ట్‌ గెస్ట్‌ హౌస్‌లో బస ఏర్పాటు చేసారు. శ్రీనగర్‌ రోడ్లమీద జనం కంటే పోలీసులు, మిలటరీ వాళ్ళు, బోర్డర్‌ సెక్యూరిటీ వాళ్ళు అడుగడుగునా ఆవరించి కని&పంచారు. మేం గెస్ట్‌ హౌస్‌కి వెళ్ళేలోపు నాలుగైదు చెక్‌పోస్ట్‌లను దాటాం. గెస్ట్‌ హౌస్‌ ఆవరణలో కారు ఆగగానే తలుపుతీయబోయి ఆ ప్రయత్నం విరమించుకున్నాను. ఆవరణలో ఆకాశాన్నంటిన చినార్‌ చెట్లు కారు కలి&పంచిన విసుగును దూరం చేసాయి. చినార& చెట్లు మహావృక్షాల్లా, నిండా ఆకుల్తో చూడ్డానికి ఎంత బావున్నాయో! మాకిచ్చిన రూమ్‌లో అడుగుపెట్టి కిటికీ తలుపు తెరవగానే ఉరవడిగా పారుతున్న నదిమీంచి వచ్చిన గాలి ఉక్కిరిబిక్కిరి చేసింది. అది జీలం నది అని తర్వాత తెలిసింది. చినార్‌ చెట్ల సౌందర్యం, జీలం నది దర్శనం నాలో గొప్ప సంతోషాన్ని నింపినా అడుగడుగునా కప్పించిన పోలీస్‌ మిలటరీ, బి ఎస్‌ ఎఫ్‌ జవాన్లు నాలో మాత్రం చాలా ఆందోళనను కల్గించారు.
ఆరోజు సాయంత్రం దాల్‌లేక్‌ చూడ్డానికి వెళ్ళాం. హిందీ సినిమా పాటల్లో చూసి ఈ సరస్సు పట్ల అభిమానం పెంచుకున్న వాళ్ళలో నేనూ వున్నాను. షికారీలు, హౌస్‌ బోటులు విస్తారంగా పరుచుకున్న జలరాసి చూడడానికి ఎంతో బావున్నా జీవం లేనట్టుగా, చైతన్యరహితంగా వున్న ఆ పరిసరాలు మాత్రం మనసును మెలిపెట్టాయి. వందల సంఖ్యలో వరసగా కొలువు తీరిన లగ్జరీ హౌస్‌ బోటులు, సరస్సు నలువైపులా బారులు తీరిన షికారీలు మనుష్యులు లేక వెల వెల బోతున్నాయి. దాల్‌లేక్‌లో పన్నెండు వందల హౌస్‌ బోటు లున్నాయని, టూరిస్టులు లేక అన్నీ ఖాళీగా పడివున్నాయని మా షికారీని నడిపిన హమీద్‌ చెప్పాడు. హౌస్‌ బోటుల్లోపల గదులు ఫైవ్‌స్టార్‌ హోటళ్ళలో గదుల్లా అన్ని హంగులతో వున్నాయి. ప్రతి బోటు ముందు దిగులు ముఖాలతో యజమానులు కూర్చునివున్నారు. హమీద్‌ ఫ్లోటింగు గార్డెన్‌ గురించి చెబుతూ గబుక్కున షికారీలోంచి నీళ్ళల్లో ఏపుగా ఎదిగిన గడ్డిమీదికి దూకాడు. గమ్మత్తుగా ఆ గడి&డ లోపలికి కుంగి వెంటనే పైకి లేచింది,. మేం ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టాం. ' ఏ పానీకా ఊపర్‌ జమీన్‌' అంటూ నవ్వాడు. దానిమీద టమాటాలు, కీరకాయలు, తరుబూజాలు పండుతాయని చెప్పి మరింత ఆశ్చర్యపరిచాడు. దాల్‌లేక్‌ మధ్య చిన్న ద్వీపం. దాని మీద నాలుగు చినార్‌ చెట్లు వుండే ప్రాంతాన్ని చూపించి దీన్నీ ' చార్‌ చినార్‌' అంటారని చెప్పి అటు తీసుకెళ్ళాడు. చుట్టు పరుచుకుని వున్న మంచు కొండలు దాల్‌లేక్‌ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంటాయి.
శ్రీనగర్‌లో చక్కటి ఉద్యానవనాలు చాలా వున్నాయి. వీటన్నింటినీ మొఠల్‌ గార్డెన్స్‌ అనే పిలుస్తారు. చష్మీషాహి, పరీమహల్‌, నిషాద్‌, హనూర్‌, షాలిమార్‌. వీటిలో చష్మీషాహి ఉద్యానవనంలో ఓ ప్రత్యేకత వుంది. అక్కడ భూమి నుంచి ఉబికి వచ్చే సహజసిద్ధమైన వాటర్‌ ఫౌంటెన్‌ నుంచి చల్లటి, స్వచ్ఛమైన నీళ్ళు సంవత్సరం పొడుగునా వస్తుంటాయి. ఆ నీళ్ళనే నెహ్రూ తాగేవాడని చెప్పి మాచేత కూడా తాగించారు. ఫ్రిజ్‌లోంచి తీసినట్టు చల్లగా వున్నాయి. మిగతా మొఘల్‌ గార్డెన్స్‌ కూడా చూసాక శ్రీనగర్‌లో ప్రసిద్ధమైన సిల్క్‌ చీరల ఫ్యాక్టరీని చూద్దామని మాతో వచ్చిన వాళ్ళని అడిగాం. మా డ్రైవర్‌ చీకటి పడబోతోందని, ఇంక బయట తిరగడం మంచిది కాదని అడ్డుపడ్డాడు. ఇంకా ఆరున్నర కూడా కాలేదు. అక్కడ ఏడున్నర దాకా వెలుగుంటుంది. ఇప్పుడే రూమ్‌కెళ్ళి ఏం చేస్తాం పోనీ షాపింగుకి వెళదాం అంటే మార్కెట్‌కెళ్ళడం అస్సలు శ్రేయస్కరం కాదని తెగేసి చెప్పాడు. ఏడు కూడా కాకుండానే మమ్మల్ని గెస్ట్‌హౌస్‌లోకి తోసేసి వెళ్ళిపోయాడు.
మర్నాడు గుల్‌మార్గ్‌ వెళ్ళాలని చాలా తొందరగా తయారైపోయాం. గుల్‌మార్గ్‌ శ్రీనగర్‌కి 57 కిలోమీటర్ల దూరంలో 2730 మీటర్ల ఎత్తులో వుంది. గుల్‌మార్గ్‌ అంటేనే పూల రహదారి. శీతాకాలంలో కురిసిన మంచు జూన్‌, జూలై నెలల్లో కరిగిపోయి పర్వతాలు మొత్తం రంగు రంగుల పూలతో నిండిపోతుంటాయట. మేం వెళ్ళింది మే నెలలో కాబట్టి ధవళ కాంతుల్తో మెరిసే కొండల్ని మాత్రమే మేం చూడగలిగాం. తొమ్మిదింటికి మా డ్రైవర్‌ అన్వర్‌ వచ్చాడు. వచ్చీ రాగానే ' మీరు నిన్న మార్కెట్‌కి వెళదామన్నారు చూడండి, అక్కడే గ్రేనెడ్‌ పేలింది రాత్రి. ఒక మిలటరీ జవాను ఇద్దరు పౌరులు గాయపడ్డారు!'అన్నాడు. 'నిజంగానా' అన్నాను నేను. ' ఇది మాకు అలవాటైపోయింది. మేం గ్రేనేడ్స్‌ మద్య బతకడం నేర్చుకున్నాం' అన్నాడు మనసంతా వికలం అయిపోయింది.
మా మూడ్స్‌ మళ్ళీ మామూలు అయ్యింది గుల్‌మార్గ్‌ దారిలో పడ్డాకే. దట్టమైన అడవిలోంచి ప్రయాణం అద్భుతంగా వుంటుంది. ఆకాశాన్నంటే ఫైన్‌, దేవదార్‌, పోప్లార్‌ వృక్షాలు. కొండపైకి వెళ్ళే కొద్దీ దగ్గరయ్యే మంచుకొండలు. కొండలమీద అక్కడక&కడ రాత్రి కురిసిన మంచు ముక్కలు. పెద&ద మంచు దిబ్బ మా కారుకు అడ్డు వచి&చంది. అన్వర్‌ దానిమీద నుంచే కారు పోనిచ్చాడు. మెత్తగా జారిపోయింది కారు. అక్కడి నుంచి మంచు మీదే ప్రయాణం. పన్నెండులోపే గుల్‌మార్గ్‌ చేరిపోయాం. ఎక్కడ చూసినా మంచే. కారుదిగి మంచు మీద నడుస్తుంటే ఇది కలా నిజమా అన్నంత అబ్బురమన్పించింది. మంచుతో నిండిపోయిన కొండలమీద కూడా సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. వేడి మాత్రం తగలటం లేదు. కాసేపు మంచులో కేరింతలు కొట్టాక గండోలా( కేబుల్‌ కార్‌) లో టాప్‌ ప్లేస్‌ ఐన సెవెన్‌ స్ప్రింగ్సు చేరాక సూర్య కిరణాలతో ధగధగ మెరిసిపోతున్న ఆ హిమసమూహ దర్శనం మమ్మల్ని సమ్మోహితులను చేసింది. కన్నార్పడం మర్చిపోయాం. ఐస్‌మీద ఎగిరాం. గుప్పెళ్ళనిండా తీసుకుని గుండెలకద్దుకున్నాం. మోకాళ్ళలోతు మంచులో నడవడం గురించి నేను కల కూడా కని వుండను. ఆ స్వచ్ఛమైన మంచు స్పర్శని అనుభవించడం కోసం నేను వేసుకున్న ఊలు దుస్తుల్ని తీసిపారేసి, చీరతోనే తిరిగాను. మైనస్‌ డిగ్రీ చలిలో, ఆ మంచులో స్వెట్టర్లాంటిదేదీ వేసుకోకుండా, మంచు మత్తులో తిరిగినదాన్ని అక్కడ నేను ఒక్కదాన్నే. ఆ అందమైన అనుభవాన్ని గుండెల్లో దాచుకుని గుల్‌మార్గ్‌ నించి తిరుగు ప్రయాణమైనాం. వెళ్ళేటప్పుడు మామూలుగానే వున్న మా రావ్‌ ముఖం తిరిగివచ్చేటప్పుడు ఆపిల్‌ పండు రంగులో కొచ్చింది. 'స్నోబైట్‌' ' సన్‌బర్న్‌' అని తర్వాత తెలిసింది. ముఖమంతా కమిలిపోయినట్లయింది. 'నిన్ను మంచు కరిచింది. నన్నేమో ముద్దుపెట్టుకుంది ' అంటూ ఏడిపించాను.
మర్నాడు పెహల్‌గావ్‌ వెళ్ళొచ్చని, అనంతనాగులో ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఏమి ప్రమాదం లేదని అన్వర్‌ ప్రకటించాడు. అమర్‌నాథ్‌ యాత్ర పెహల్‌గావ్‌ మీదుగానే జరుగుతుంది. అమర్‌నాథ్‌ గుహ పెహల్‌గావ్‌కి 16 కి.మీ దూరంలో వుంది. ప్రపంచంలోనే ప్రసిద్దమైన కుంకుమపువ్వుల పొలాలు కూడా ఈ దారిలోనే వున్నాయి. అయితే మా పెహల్‌గావ్‌ ప్రయాణం అంత సాఫీగా జరగలేదు. శ్రీనగర్‌ నుంచి మేం ముఫ్ఫై కిలోమీటర్లు ప్రయాణం చేసాక ఓ పెద్ద ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుపోయాం. అనంతనాగులో ఆ క్రితంరోజే ఎన్నికలు ముగిసాయని, భద్రతా దళాలు, ఎన్నికల సామాగ్రి, సిబ్బంది ఓ పెద్ద కాన్వాయ్‌గా జమ్ము బయలుదేరిందని అన్వర్‌ చల్లగా చెప్పాడు. మూడు గంటల పాటు ఆగిపోయాం. ఎలాగో దాన్నుండి బయటపడి పెహల్‌గావ్‌ చేరేటప&పటికి రెండయిపోయింది. శేష్‌నాగు సరస్సుకు వెళ్ళలేకపోయాం. అయితే మా ప్రయాణం పొడవునా ట్రెడ్పీనది పరవళ్ళను చూడగలిగాం. రాళ్ళమీద గల గల పారే ట్రెడ్సీనది నీల్లు ఫ్రీజర్‌లోంచి తీసినట్టున్నాయి. తిరుగు ప్రయాణంలో నేషనల్‌ పార్క్‌లో వున్న ట్రాట్‌ ఫిష్‌ ఫామ్‌కెళ్ళి వేడి వేడి ఫిష్‌ తిన్నాం. అతి చల్లటి ఫ్రెష్‌ వాటర్‌లోనే ట్రాట్‌ఫిష్‌ బతుకుతుంది. దేశంలో మరెక్కడా ఈ చేప దొరకదట. శేష్‌నాగు సరస్సును చూడలేకపోయామన్న నిరాశతో తిరిగి వచ్చేం.
మే 7 న ఉదయం తొమ్మిదింటికి మా ' లే' ప్రయాణం మొదలైంది. లే గురించి మమ్మల్ని చాలా మంది బయపెట్టారు. సముద్రమట్టానికి 14,500 అడుగుల ఎత్తులో వుంది లే పట్టణం. అది లదాఖ్‌ రాజధాని. ఒక్కసారిగా ఆ ఎత్తైన ప్రదేశంలో కాలు పెట్టగానే చాలా ఆరోగ్య సమస్యలు అంటే తీవ్ర తలనొప్పి, కళ్ళు తిరగడం, ఒళ్ళంతా బరువెక్కిపోవడం, ఊపిరాడకపోవటం లాంటి సమస్యలతో పాటు గడ్డకట్టించే చలి వుంటుందని నేను ఇంటర్‌నెట్‌ ద్వారా తెలుసుకున్నాను. మిత్రులు కూడా చెప్పారు. శ్రీనగర్‌ నుంచి లే కు విమానంలో అయితే అరగంటే పడుతుంది. అదే కారులో అయితే 20 గంటలు పడుతుందట. కార్గిల్‌లో రాత్రి ఆగి వెళ్ళాల్సి వుంటుంది. అయితే ఏప్రిల్‌ 26 న కురిసిన మంచు వల్ల శ్రీనగర్‌ - లే రహదారి మూసేసారు. మేం విమానంలోనే వెళ్ళాం. లే లో విమానం రెండు కొండల మధ్య నుంచి దిగుతుంది. ఆ దృశ్యం తప్పకుండా చూడు అని వహిదా చెపి&పంది. తొమ్మిదిన్నరకి లే లో దిగాం. నిజంగానే విమానం ల్యాండింగు అద్భుతంగా వుంది. గమ్మత్తుగా ఒక వేపు మంచు కొండలు, ఒక వేపు ఎడారి లాంటి ఇసుకకొండలు. వాటి మధ్యనించి విమానం దిగింది. ఎందుకైనా మంచిదని భుజానికి వేలాడుతున్న స్వెట్టర్‌ని ఒంటికి తగిలించాను. మెట్లు దిగుతుంటే వంద కేజీల బియ్యం బస్తా తలమీద వున్న ఫీలింగు కలిగింది. ఒళ్ళంగా బరువుగా అయిపోయి ఆచితూచి అడుగేయాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలోనే వున్న ఫుల్‌మూన్‌ గెస్ట్‌హౌస్‌కి తీసుకెళ్ళారు. వేగంగా నడవొద్దని, వొంగకూడదని, ఎక్కువ మాట్లాడవద్దని, సాయంత్రం దాకా రెస్ట్‌ తీసుకోమని సలహా ఇచ్చారు ప్రోటోకాల్‌వాళ్ళు. డాక్టర్‌ వచ్చి మా ఇద్దరి బ్లెడ్‌ ప్రెషర్‌ చెక్‌ చేసాడు. నార్మల్‌గానే వుంది. చలి గడ గడ లాడించేస్తోంది. హై ఆల్టిట్యూడ్‌ వాతావరణంలో ఎదురయ్యే ఇబ్బందులేవీ మమ్మల్ని తాకలేదు. మేం సాయంత్రం ఫ్రెష్‌గా తయారై బయటకు వస్తుంటే మా డ్రైవర్‌ తాషి ' ఆప్‌ లోగు హమ్‌ సె బీ ఫిట్‌ హై, ఏక్‌ దమ్‌ ఫిట్‌' అంటూ నవ్వాడు. అతడా మాట అనగానే మాలోని ఆందోళనంతా పటాపంచలై వొళ్ళంతా తేలికగా అయిపోయింది. ఆ తర్వాత 'హోల్‌ ఆఫ్‌ ఫేమ్‌' పేరుతో మిలటరీ వాళ్ళు ఏర్పాటు చేసిన మ్యూజియం చూడ్డానికి వెళ్ళాం. లే చరిత్రతో పాటు, లదాఖ్‌ ఫెస్టివల్స్‌, నృత్యాల గురించిన సమాచారం ఎంతో వుందక్కడ. కార్గిల్‌ యుద్ధం, యుద్ధంలో మరణించిన వారి వివరాలు, సియాచిన్‌ గ్లేసియర్‌ ఫోటోలు, అక&కడి భద్రతా దళాలు ధరించే దుస్తుల వివరాలు, పాకిస్తాన్‌ ఖైదీల ఫోటోలు, వాళ్ళ నించి సంపాదించిన ఆయుధాలు అన్నింటినీ ప్రదర్శించారక్కడ.
అక్కడినుంచి మార్కెట్‌కు వెళ్ళాం. చిన్న బజారది. అక్కడే వున్న చహంగా విహార్‌కు వెళ్ళాం. లే చుట్టూ ఎన్నో బౌద్ధ ఆరామాలు వున్నాయి. వాటిని గొంపాలంటారు. హెమీస్‌, ఆల్చి, ఫైయాండ్‌, షె మొదలైన ఎన్నో గొంపాలు వున్నాయి. వీటిలో లే కు 40 కిలోమీటర్ల దూరంలో వున్న హెమీస్‌ గొంపా చాలా పెద్దది. ధనికమైనది. ఈ గొంపాల్లో వందల సంఖ్యలో లామాలుంటారు. ప్రతీ గొంపా విలక్షనమైన పూజా పద్దతుల్ని కలిగి వుంటుంది. కొన్నింటికి దలైలామా అధిపతిగా వున్నాడు.మేం ఏడున్నరదాకా బయట తిరుగుతూనే వున్నాం. పావు తక్కువ ఎనిమిది వరకు సూర్యాస్తమయం కాలేదు. మమ్మల్ని గెస్ట్‌ హౌస్‌లో వదిలేస్తూ తాషి ' ఇక్కడ వెన్నెల చాలా బాగుంటుంది . చూడండి' అన్నాడు. రావ్‌ ' ఇంత చలిలోనా చస్తాం' అన్నాడు. నేను మాత్రం ఎలాగైనా చూడాలి అనుకున్నాను. ఆరాత్రి తను నిద్రపోయాక లాంగు కోట్‌, గ్లౌస్‌ వేసుకుని, మంకీకేప్‌ తగిలించుకుని ఒక్కదాన్ని బాల్కనీలోకి వెళ్ళాను. వావ్‌! అద్భుతం! మంచుకొండలతో పోటీపడి కురుస్తున్న వెన్నెల, పండువెన్నెల ! తిలక్‌ ' అమృతం కురిసిన రాత్రి' కవిత అలవోకగా నా నాలుకమీదకొచి&చంది. చలికి కాలివేళ్ళు కొంకర్లు పోతున్నా అలాగే మైమరచి చూస్తూండిపోయాను. తాషికి థాంక్స్‌ చెప్పుకుని పిల్లిలాగా లోపలికొచ్చి రజాయిలో దూరిపోయాను. మంచుకొండలమీద వెన్నెలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు కలలు కంటూ వెచ్చగా నిద్రపోయాను.
మే ఎనిమిదో తేదీన మా అసలు అడ్వంచర్‌ మొదలైంది. 17,350 అడుగుల ఎత్తులో వున్న చాంగ్లా పాస్‌ దాటి 14,000 అడుగుల ఎత్తున వున్న పాన్‌గాంగు సరస్సును చూడడానికి మనస్సు తహతహలాడసాగింది. అంత ఎత్తుకెళ్ళడం చాలా కష్టమని,గాలిలో ఆక్సిజన్‌ చాలా తక్కువగా వుంటుందని మమ్మల్ని నిరుత్సాహపరచబోయారు. కాని మేం వినలేదు. తాషి మాత్రం మమ్మల్ని ఉత్సాహపరిచాడు. అవసరమొస్తుందేమోనని హాస్పిటల్‌ నుంచి ఆక్సిజన్‌ సిలిండర్‌ తెచ్చి పెట్టాడు. మేం ఎనిమిది గంటలకు బయలుదేరాం. మనాలి - లే రోడ్డు మీదుగానే చాంగ్లా పాస్‌కి వెళ్ళాలి. అతి పురాతనమైన సింధునది దర్శనం ఇక్కడే అయ్యింది. ' కారు' గ్రామం నుంచి కుడివేపు మనాలి రోడ్డు, ఎడంవేపు పాన్‌గాంగు సరస్సుకెళ్ళే రోడ్డు విడిపోతాయి. మా కారు ఎడంవేపు తిరిగింది. మాలో చెప్పలేని ఉత్కంఠ, ఉద్వేగం. చాంగ్లాపాస్‌ దాటగలమా లేదా అనే ఆందోళన. ఆ బృహత్తర పర్వత సముదాయాల మధ్య సన్నటి రోడ్డుమీద కారు మెలికలు తిరుగుతోంది. ఒక్క రోడ్డు తప్ప సమస్తం స్నోతో నిండివుంది. చిన్న చిన్న సెలయేళ్ళు, రాసులు రాసులుగా హిమపాతం. కారు దిగి కేరింతలు కొట్లాని, ఈల లేసి గోల చెయ్యాలనే బలమైన ఆకాంక్షని చలి చిదిమేసింది. అయినా ధైర్యం చేసి ఒక చోట దిగి మంచుని ముద్దాడుతూ ఫోటోలు తీసుకున్నాం. గడగడలాడిపోయాం. అక్కడ మైనస్‌ 4 టెంపరేచర్‌ వుంటుందని తాషి చెప్పాడు.చిన్న చలికే తట్టుకోలేని రావ్‌ మైనస్‌ డిగ్రీలో నిలబడటం నాకు స్థలమహత్యమన్పించింది. చాంగ్లాపాస్‌ దగ్గర పడుతుంటే తాషి ఆక్సిజన్‌ పెట్టాలా అని అడిగాడు. మేం వద్దన్నాం. నేను యోగాలో నేర్చుకున్న 'శీతలి ప్రాణాయామం' ద్వారా ధారాళంగా ఆక్సిజన్‌ లోపలకు పంపించగలిగాను. రావ్‌కు కూడా నేర్పాను. దీనివల్ల మాకు ఆక్సిజన్‌ లేమి సమస్య ఎక్కువగా ఎదురుకాలేదు. చాంగ్లా చేరగానే ప్రతి ఒక్కరికి ఏదో ఆరోగ్య సమస్య వస్తుంది కాబట్టి అక&కడ ఒక మిలటరీ కేంప్‌ పెట్టారు. ఫస్ట్‌ ఎయిడ్‌, టాయిలెట్‌ లాంటి సౌకర్యాలున్నాయి. మేం గడగడలాడుతూ కేంప్‌లోకి వెళ్ళగానే అక్కడున్న నాయక్‌ సుబేదార్‌ విష్ణు బహదూర్‌ గురండ్‌ మాకు మిరియాలతో కాచిన వేడి వేడి టీ ఇచ్చారు. ఆ చలిలో కారం కారంగా, వేడిగా గొంతులోంచి జారుతున్న టీ ఎంత తృప్తి నిచి&చందో మాటల్లో చెప్పలేను. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి మేం ముందుకు సాగాం. ఆ కొండల్లో చిన్న చిన్న గ్రామాలు చూసాం. గుర్రాలతో పొలం దున్నుతున్న రైతుల్ని చూసాం. పసిమినా గొఱ్రెల్ని మేపుతున్న కాపరుల్ని చూసాం. చకాచకా పరుగులు తీసే మర్మాడ్‌ ( కొండ ఉడతలు) లు, యాక్స్‌, కొండ మేకలు, రకరకాల పక్షులు కన్పించాయి.మరో అరగంటలో మేం పాన్‌గాంగు సరస్సు తీరాన వున్నాం. అద్భుతం. అపురూపం. విభిన్నరంగుల్లో మిల మిల మెరిసే 130 కిలోమీటర్ల పొడవైన ఉప్పునీటి సహజ సరస్సు దర్శనం ఇచ్చింది. ఇండియాలో నలబై, చైనాలో 90 కిలోమీటర్ల పొడవునా పాన్‌ గాంగు సరస్సు విస్తరించి వుంది. నాలుగు కిలోమీటర్ల అడ్డం వుంటుంది. అన్నింటినీ మించి 14,000 అడుగుల ఎత్తుమీద ఆవిర్భవించిన అద్భుత ప్రకృతి దృశ్య కావ్యం ఈ సరస్సు. క్షణం క్షణం రంగులు మారుతోంది. నీలం, ఆకుపచ్చ సరస్సు తీరాన చిత్తరువులమై వినమ్రంగా అలా నిలబడిపోయాం. మనస సరోవరం చూడాలన్న గాఢమైన కోరికను ఈ సరస్సు ఛిద్రం చేసేసింది. పాన్‌గాంగు సరస్సు కెరటాలు మా గుండెల్లోనే ఉప్పొంగుతుండగా మేం తిరుగు ప్రయాణానికి అయిష్టంగానే సిద్ధమయ్యాం. ఆ ... అన్నట్టు ఇక్కడ మిలటరీ కేంప్‌లో మాకు చక్కటి ఆతిథ్యమిచ్చిన వాళ్ళు మన తెలుగువాళ్ళేనండి. మేం ఇద్దరం తప&ప మూడో మనిషి నోటివెంట ఈ పదిరోజులుగా తెలుగుమాట వినని మేం ముగ్గురు తెలుగువాళ్ళని చూసి బోలెడు సంతోషపడ్డాం. వాళ్ళూ చాలా సంతోషించారు. నాయక్‌ షేక్‌ మహబూబ్‌ పాషా గిద్దలూరుకు, లాన్స్‌ నాయక్‌ రామానుజం చిత్తూరుకు, సిపాయి నాగేశ్వరరావు శ్రీకాకుళానికి చెందినవాళ్ళట. సంవత్సరం నుంచి ఇక్కడే వున్నారట. మా దగ్గరున్న చాక్‌లెట్‌లు, బిస్కట్‌లు, మెడిసిన్స్‌ అన్నీ వాళ్ళకిచ్చేసాం. వాళ్ళిచ్చిన వేడి వేడి టీ తాగి తిరుగు ప్రయాణమయ్యాం.
అప్పటికి మంచుకొండల మీద ఎండకాస్తోంది. అయితే మేం చాంగ్లా పాస్‌ దగ్గరికి వచ్చేటప్పటికి హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలుల్తో మంచు కురవడం మొదలైంది. మేం అదిరిపోయాం. ఆ అదురులోనూ మంచుకురవడాన్ని చూస్తున్నందుకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయిపోయాం. కొన్ని క్షణాల్లో మా కారు ముందు అద్దం మంచుతో నిండిపోయింది. వైపర్స్‌ కదలనని మొండికేసాయి. తాషి కిందికి దిగి అతి కష్టం మీద కొంత మంచును తొలగించి వైపర్స్‌ ఆన్‌ చేసాడు. మెల్లగా కారును నడపడం మొదలెట్టాడు. ఏకధాటిగా కురుస్తున్న మంచును చూస్తూ సర్వం మర్చిపోయాం. ఆక్సిజన్‌ విషయం అసలు గుర్తే రాలేదు. లోపలంతా ఓ ఉద్విగ్నత నిండిపోయింది. చాంగ్లాపాస్‌ ఎక్కి దిగిపోగానే వాతావరణం మళ్ళీ ఎండతో నిండిపోయింది. లే పట్టణంలోకి అడుగుపెట్టేముందు సిధు నదిని చూసాం. నీళ్ళల్లో దిగి ఆ చల్లటి నీటి స్పర్శని అనుభవించాం. ఇటీవలే అక్కడ సింధు దర్శనం పేరుతో ఓ ఉత్సవాన్ని ఎల్‌.కె. అద్వానీ ప్రారంభించినట్లు శిలాఫలకం మీద చదివినప్పుడు బౌద్ధమతస్తులు అదికంగా వున్న లే , లదాఖ్‌ లకు ' హిందూత్వ'ను దిగుమతి చేయడానికి అద్వాని ప్రయత్నాలు మొదలుపెట్టాడు కాబోలు అనుకున్నాను.
అపూర్వ అద్భుత అనుభవాలను మూటగట్టుకుని మర్నాడు ఉదయం మేం తిరుగు ప్రయాణమయా&యం. క్షణక్షణం మారే లే వాతావరణం మా విమానాన్ని ఆరుగంటలు ఆలస్యం చేసింది. ఇసుకతో కూడిన ఈదురుగాలులు, మబ్బులతో నిండిపోయే పర్వత సానువులు, దూరాన కొండల మీద వర్షం, ఎయిర్‌ పోర్ట్‌లో ఎండ ఇలా ఎన్నో వాతావరణ విన్యాసాల మధ్య మా విమానం గాల్లోకి ఎగిరి మమ్మల్ని ఢిల్లీ చేర్చింది.
పది రోజులపాటు కాశ్మీర్‌ అందాల్ని గుండెల్లో వొంపుకుంటూ పరవశించిపోయినా నాలోపలెక్కడో ఓ ముల్లు గుచ్చుకుంటూనే వుంది. ప్రతి కాశ్మీరీ ముఖంలో ' ఏదో పోగొట్టుకొన్నామన్న భావన' గుండెల్ని మెలిపెడుతూనే వుంది. శ్రీనగర్‌ సందుగొందుల్లో పేలుతున్న గ్రెనేడ్‌లు, భద్రతా దాళాల మోహరింపులు, పనుల్లేక ఉద్యోగాల్లేక గుంపులు గుంపులుగా రోడ్ల మీద తారసపడే కాశ్మీరీ ముస్లిమ్‌ యువకుల నిరాశామయమైన చూపులు ఇంకా నన్ను వెంటాడుతూనే వున్నాయి. అందమైన కాశ్మీర్‌లోయలో అందవిహీనం చేయబడిన కాశ్మీరీ జీవితం, అభద్రత, అన్యాయం మధ్య కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలను మర్చిపోవడం చాలాకష్టం. గత పదిహేను సంవత్సరాలుగా బారత భద్రతా దళాల తుపాకులకు, పాకిస్తాన్‌ ప్రేరేపిత ఆగ్రవాదుల బాంబు దాడులకు బలైపోయిన 80,000 వేల మంది మరణాలకు ఎవరి జవాబుదారీ లేదు. మూడు వేలమంది యువకులు లోయనుండి అదృశ్యమైపోయారని వాళ్ళేమయ్యారో ఎవరికీ తెలియదని మా పి.ఎస్‌.వో అన్నాడు. 8000 మంది స్త్రీలు బర్తలను పోగొట్టుకున్నారని, మరెందరో స్త్రీలు బతికి వున్నారో లేదో తెలియని బయంకర స్థితిలో సంగం విధవలుగా మారారని ఒక చోట చదివాను. 20 వేల మంది పిల్లలు అనాధాశ్రమంలో మగ్గుతున్నారని విన్పపుడు కడుపులో చెయ్యిపెట్టి కెలికినట్లయింది. ఒక పోలీసు ఉన్నతాధికారి పొరపాటుగా ఒక కుటుంబాన్ని టెర్రరిస్టులుగా భ్రమించి కాల్చి చంపి చావకుండా మిగిలిపోయిన అల్‌తాఫ్‌ అనే కుర్రాడిని, భార్య ప్రోద్భలం మీద దత్తత చేసుకుని పెంచుతున్నాడని విన్నప్పుడు నా వొళ్ళంతా కంపించిపోయింది. తల్లిదండ్రుల్ని చంపినవాడే తన ప్రస్తుత తండ్రి అని ఆల్‌తాఫ్‌కి బహుశా తెలిసి వుండదు. కాశ్మీరులో జరుగుతున్నదేమిటో అర్థం చేసుకోవడానికి ఇలాంటి ఉదంతాలు సరిపోతాయనుకుంటాను. ఉత్తుంగ పర్వతాలు, మహావృక్షాలు, సరస్సులు, లోయల సోయగాలు ఒకవైపు, కర్కశ భద్రతా దళాల ఇనపబూట్ల చప్పుళ్ళు, పొగలు కక్కే ఎ.కె. 47లు, ఉగ్రవాదుల గ్రేనేడ్‌ పేలుళ్ళు, నెత్తురోడుతున్న శరీరబాగాలు ఇదీ నేటి కాశ్మీర్‌ వెన్నెల్ని, కటిక చీకటి అమావాస్యని ఒకేసారి అనుభవిస్తూ మేం హైదరాబాదులో అడుగుపెట్టాం.

3 comments:

వాసు.s said...

మీరు పెట్టిన టైటిల్ బావుంది, పోస్ట్ అంతకన్నా బావుంది.

dorababu gannamani said...

mee kasmir yatra chala bagundi, prati bharateeyudu surakshitam ga kasmirlo viharinche roju kosam eduru chooddamu! - dorababu.

వనజ తాతినేని/VanajaTatineni said...

mdm.. mee yaatraanubhavam.. gundelani pindesindhi.. manadhi kaani bhaarathamlo.. mana sahodharula ikkatlu theerenaa.. yevaru chidhimesina poomoggalu ee ee andhamaina kaasmeerula jeevana chithraalu.. naa.. kalala kaasmeeramaa.. nee odilo sedha theeredli yennado.. gurthukocchindhi. bharatha mukha chithrampai.. kaasmeeram Ghulmahar.. kaavaalani aakaankshisthoo..

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...