మొగలి పూలూ -ఇందిరా పార్కూ
చాలా రోజుల తర్వాత ఈవేళ సాయంత్రం నేనూ గీత కలిసి ఇందిరా పార్క్ కి వెళ్ళేం.ఓ నాలుగైదేళ్ళ క్రితం రోజూ ఉదయం వాకింగ్ కి వెళ్ళేదాన్ని.అలా వెళ్ళే క్రమం లోనే మొగలి పూలమ్మే ఓ అమ్మాయితో పరిచయమైంది.ఇందిరా పార్క్ లో బోలెడన్ని మొగలి పొదలున్న విషయం చాలా మందికి తెలుసనుకుంటాను.ఆ పిల్లతో సాన్నిహిత్యం పెరిగి సీజన్ లో రోజూ మొగలి పువ్వు కొనేదాన్ని.చాలా సార్లు చల్లటి ఉదయపు వేళ మొగలి సువాసనల్ని మోసుకుంటూ గీత దగ్గరికెళ్ళేదాన్ని.తనకి మొగలి పూలంటే చాలా ఇష్టం.ఆ పూల పిల్ల మీద నేను "మొగలి పూల పిల్ల" అనే కధ కూడా రాసాను.అది నా కధల సంపుటి "ఆమె కల" లొ ఉంది.
ఈ రోజు నేనూ గీత ఆ పార్క్ కి వెళ్ళి చాలా సేపు కూర్చుని బోలెడన్ని కబుర్లు కలబోసుకున్నం.పూలమ్మే అమ్మాయి గుర్తొచ్చింది కాని ఎక్కడా కనబడలేదు.మొగలి పూల మీదకి మనసు మళ్ళింది. పొదల చుట్టూ ప్రదక్షిణ చేసాం కాని ఒక్క పువ్వూ కనబడలేదు.ఎలాగైనా పూలు సంపాదించాలని చిప్స్ అమ్ముకునె అతన్ని అడిగాం మొగలి పూలు దొరుకుతాయా అని.అతను తన బుట్ట మా దగ్గరే పెట్టి ఇప్పుడే వస్తానంటూ వెళ్ళి పూలు కోసే మనిషిని పట్టుకొచ్చాడు.వీళ్ళు కోస్తారని చెప్పి తన బుట్ట తీసుకుని వెళ్ళిపోయాడు.మీరు ఇక్కడే కూర్చోండి మేము పూలు కోసుకొస్తాం అని ఆ పొదల్లో మాయమయ్యారు.ఓ అరగంట తర్వాత గోధుమ రంగు తాచుల్లా మెరుస్తూ సువాసనలు వెదజల్లుతున్న మొగలి పూలతో ప్రత్యక్షమయ్యారు.అప్పటి మా సంతోషాన్ని వెల కట్టలేం కాని వాళ్ళు చెప్పిన వెలకి మా కళ్ళు బైర్లు కమ్మాయి.కేవలం రెండు వందలడిగారు.హమ్మో మరీ అంతా అంటే మీ ఇష్టం మీరు అడిగారనే వెదికి కోసుకొచ్చాం అన్నారు.పువ్వుల్ని వదలాలంపిచడం లేదు.రెండు వందలు చాలా ఎక్కువ.సరే బేరం చేస్తే 100 కిచ్చాడు.
ఆ పువ్వులు మా చేతుల్లోకి వచ్చాక ఆ మత్తు వాసనకి గమ్మత్తుగా చిత్తై పోయాం.
ఆకాశం నిండా కమ్ముకున్న నల్లని మబ్బులు.తుంపర తుంపరగా కురుస్తున్న చిరు జల్లుల్లో నేనూ గీత మొగలిపూల సువాసనల్ని వెదజల్లుకుంటూ కైనటిక్ మీద రయ్ మంటూ దూసుకెళ్ళిపోవడం తో మా ఇందిరా పార్క్ విహార యాత్ర ముగిసింది. మొగలి పూల పిల్ల కనబడలేదు కానీ మొగలి పూలు మాత్రం మా చేతుల్లోకి వచ్చి మా ఇద్దరికి మహదానందం కలిగించాయి.

Comments

oremuna said…
నూర్రూపాయలే! అసలు ఆ అమ్మాయి దగ్గర ఎంతకు కొనేవారు?
బాగు౦ది.మీలా౦టి వారు కూడా అన్ని పనులు చేస్తూ మళ్ళీ బ్లాగు రాయడ౦ ఆన౦ద౦ గాను,ఆశ్చర్య౦ గాను ఉ౦ది.నెనర్లు.
sujata said…
సత్యవతి గారూ.. మొగలి పూలూ, సెలవులూ, సముద్రం మీద ప్రయాణం, అడవిలో వెన్నెల నీడల్లో నడకా, నిప్పుల మీద నడవటం, ఎథీయిసం, హెల్ప్ లైన్, భూమిక, ఇన్నిటి మధ్య బ్లాగింగ్.. మీరు నిజంగా సూపరే. అన్నట్టు, మీ కధ కు లింక్ ఇవ్వాల్సింది. ఇంకో ప్రశ్న - అండమాన్ నుంచీ తీసుకొచ్చిన కోరల్ మీ ఇంటి తొట్టెలో పెరిగిందా ? దాని విశేషాలు ఏమిటి ?
Satyavati said…
నా మొగలి పూల సువాసన మీకు చేరడం సంతోషం.
ఒరేమూనా గారూ!అవునండి అక్షరాల వంద రూపాయలు పోసాము.అంతకు ముందు ఆ అమ్మాయి దగ్గర పది పన్నెండు కి కొనేదాన్ని.
క్రాంతి కుమార్ గారూ!నా బ్లాగ్ సందర్శించినందుకు థాంక్స్.మనం ఎన్ని పనులు చేసినా,ఎంత బిజీగా ఉన్నా ప్రక్రుతి ఎంతో ఉదారంగా,అయాచితంగా అందించే ఆనందాన్ని పోగొట్టుకోగలమా చెప్పండి. నా వరకు నేను చేసే పనులన్నింటికి సరిపడే ఎనర్జి అంతా ప్రక్రుతి నుంచే వస్తుంది.ఎన్ని పనులున్నా హుస్సైన్ సాగర్ మీద ఇంద్రధనుస్సు ఏర్పడితే వదిలి వెళ్ళి పోగలమా?నా అనందాలన్నీ ఇలాంటి వాటిల్లోనే ఉన్నాయండీ. మీకు ధన్యవాదాలు.
సుజాత గారూ!థాంక్స్.నా గురించి మొత్తం రాసేసారు.నా ప్రాణాలన్నీ వాటిల్లోనే ఉన్నాయి మరి.నా కధలు నెట్లో పెట్టలేదింకా."పాలపుంత" ఒక్కటే ఉంది నా బ్లాగ్ లో.నేను అంత ఫాష్ట్ గా టైప్ చెయ్యలేను. ఒకసారి జ్యోతి గారు అన్నారు మీ కధలు ఇవ్వండి నెట్ లో పెడదామని. ఇచ్చాను.
అండమాన్ నుంచి ఎత్తుకొచ్చిన కోరల్ బతకలేదండీ. డెడ్ కోరల్స్ అలాగే ఉన్నాయి.అవును మీ ఇంట్లో బ్రహ్మ కమలాలు పూసాయా? మా ఇంట్లో మొన్న ఒకేరోజు 9 పువ్వులు పూసాయండోయ్.
srinivas said…
satyavathi gariki Namasthe. blog first time chushanu. chaala bagundi

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

ఉప్పొంగే గంగ వెంబడి ఉరుకులెత్తిన ప్రయాణం