Wednesday, July 2, 2008

అరుషి హత్య-అమానవీయ కోణాలు

మే నెల 17 వ తేదీన నేను మొదటి సారి అరుషి అనే పధ్నాలుగు
సంవత్సరాల అమ్మాయి హత్య గురించి ఢిల్లి లో ఉన్నపుడు చదివాను.నేషనల్
మీడియా అవార్డ్ తీసుకోవడాని కి డిల్లీ వెల్లడం వల్ల 17 న ఉదయమే ఆ వార్త
చదివి, అరుషి అమాయకమైన ముఖం చూసి చాలా బాధ పడ్డాను. ఆ రోజ వచ్చిన వార్తలో
ఆఇంటి లో పనిచేస్తున్న హేమరాజ్ అనే పనివాడు అరుషి హత్యకు పాల్పడి పరార్
అయ్యాడని పోలీసులు చెప్పారు. ఈ వార్త చాలా మందిని భయ కంపితులుని
చేసింది.ఇళ్ళల్లో పని చేసే వాళ్ళే పిల్లల్ల్ని చంపేస్తే ఎల అంటూ
నివ్వెరపోయారు.అయితే పోలీసులు ఇంటి టెర్రేస్ మీద పడున్న హేమరాజ్ శవాన్ని
కనుక్కోకుండా హేమరాజ్ ఇంట్లో కనబడ లేదు కాబట్టి అతనే ఆ హత్య చేసి ఉంటాడని
నిర్ధారణకి వచ్చేసి మొదటి స్టేట్మెంట్ ఇచ్చేసారు.
ఇంక అక్కడి నుండి ఈ కేసు ఎన్ని వంకరలు తిరగాలో అన్ని వంకర్లు
తిప్పారు పోలీసులు.ఆ తర్వాత రంగ ప్రవేశం చేసిన మీడియా ముఖ్యంగా
ఎలక్ట్రానిక్ మీడియా అరుషి పట్ల వ్యవహరించిన తీరు అత్యంత
జుగుప్సాకరం.అన్యాయంగా హత్యకు గురై అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయీన ఆ
పిల్ల కారెక్టర్ కు ఎన్ని తూట్లు పోడవాలో అన్ని పొడవడం మొదలు
పెట్టారు.హేమరాజ్ చంపాడని ప్రకటించిన పోలీసులు కాదు కాదు హేమరాజ్
ని,అరుషిని ఆమె తండ్రి రాజేష్ తల్వార్ చంపాడని శెలవిచ్చారు.ఒక సారి
రాజేష్ వివాహేతర సంబంధం కారణమని,ఇంకోసారి హేమరాజ్ ని, అరుషిని దగ్గరగా
చూడడం వల్ల కోపంతో రాజేష్ ఆ ఇద్దరిని చంపేసాడని ఒక ప్రకటన చేసారు.ప్రతుతం
రాజేష్ కాంపౌండర్ మీద పడ్డారు .పధ్నాలుగేళ్ళ అరుషి తండ్రి లాగానే మంచిది
కాదని ఉత్తర్ ప్రదేష్ డిజిపి
బాధ్యతా రహితమైన ప్రకటన ఇచ్చాడు.
అరుషి కేస్ మొత్తం ఒక సారి అవలోకిస్తే మన దేశం లో పోలీసులు,మీడియా ఎంత
అమానవీయంగా ప్రవర్తిస్తున్నాయో అర్ధమౌతుంది.ఓ పసి పిల్ల హత్య కు
సంబంధించిన వార్తను సెన్సేషనల్ చెయ్యడంలో తప్ప సున్నితంగా
వ్యవహరించాలన్న ఆలోచన లేకపోవడం ఎంతో విచారకరం. పోటీలు పడి టాక్ షోలు
నిర్వహించిన టీవీ చానళ్ళు అరుషి హత్య పట్ల పోలీసుల వ్యవహరిచిన తీరును
ఎండగట్ట కుండా తమవంతు
అగ్నికి ఆజ్యం పోసి తమ ఫక్తు వ్యాపార ధోరణిని నిస్సిగ్గుగా
ప్రకటించుకున్నయి.తమకు డబ్బు ఏవ తప్ప హ్రుదయాలుండవని నిరూపిస్తూ ఏక్తా
కపూర్ అరుషి దారుణ హత్యని సీరియలైస్ చేసి తన భయంకరమైన సీరిఎల్స్ పక్కన
దీనిని కూడా చేర్చింది.ఈ విషయంలో అరుషి తల్లి రోదన అరణ్య రోదనే అయ్యింది.
తన బిడ్డ మీద అలాంటి సీరిఎల్ తీయొద్దని ఆమె మొత్తుకున్నా వివే నాధుడే
కరువయ్యాడు.
అరుషి దారుణ హత్య చుట్టూ అల్లుకుంటున్న అమానవీయ ధోరణులు చూస్తుంటే గుండె
కరిగి నీరౌతోంది.సున్నితంగా ,జెండర్ అవగాహనతో వ్యవహరించాల్సిన ఇలాంటి
అంశాల పట్ల మెయిన్ స్ట్రీం మీడియా, పోలీసులు మొరటుగా, ఎలాంటి మానవత్వం
లేకుండా వ్యవహరిచడం అత్యంత శొచనీయం. అరుషి తల్లి గుండె కోత గురించి,
హేమరాజ్ కుటుంబ పరిస్తితి గురించి ఎవ్వరూ ఆలోచించినట్టు కనబడదు. నిజానికి
ఈ కేసు లో మీడియా ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించి పోలీసుల
విచ్చలవిడి,నిర్లక్ష్య ప్రకటనలను ఎండగట్టి ఉండవలసింది.
అరుషి కి వ్యతిరేకంగా కాక ఆ అమ్మాయి పక్షాన నిలబడి నిజానిజాలను వెలికి
తీసి ఉండవలసింది.పోలీసుల బాధ్యతా రాహిత్యాన్ని ఉతికి ఆరేసి ఉండవలసింది.
కానీ అలా జరగక పోగా మీడియా వైఖరి పోలీసులకేమీ తీసిపోలేదని నిరూపితమవ్వడమే
అత్యంత విషాదకరం.

3 comments:

Sujata M said...

సత్యవతి గారూ.. వీళ్ళ అమానుష ప్రవర్తన - పక్కన పెడితె, ఇవన్నీ చూసే ప్రజల వల్లె గా వీళ్ళకు లాభాలు వస్తాయి! అందుకె, వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారు. ఇలాంటి టాక్ షోలు చూసే, వార్తా చానెళ్ళు పిచ్చి పిచ్చిగా చూసే జనాలని కూడా తిట్టాలి. ఏదైనా ఎవరి జీవితం గురించైనా వీధిన పడితే వినోదంగా టీ వీ ల లో, వార్తా పత్రికలలో చదివే ప్రజలది కూడా తప్పే. వీళ్ళ కి ఏదైనా జరిగితే, కెమెరా పట్టుకొచ్చి, వీళ్ళ ఇంట్లోకి టీవీ విలేఖరులు వస్తే వీళ్ళ ప్రవర్తన ఎలా వుంటుందో చూడాలని అనిపిస్తుంది. జర్నలిజం కి చచ్చుకాలం వచ్చింది. వీళ్ళను అదుపు లొ పెట్టేది ఎవరో తెలియట్లేదు. 'భూమిక ' ఎడిటర్ గా మీ ఈ పొస్ట్ కి విస్తృతమైన పాఠకులు దొరుకుతారు. వారి అభిప్రాయాలు ఏమిటో చూడాలని వుంది.

Kathi Mahesh Kumar said...

TRP ద్వారా TV పాప్యులారిటీని కొలిచే విధానం ఉన్నణ్ణాల్లూ, ఇలాంటి సెన్శేషనలిజం నిండిన జర్నలిజం గోల తప్పదు. ప్రజలు ఇలాంటి సమాచారాన్ని విరగబడి చూడట్లేదు, చూస్తున్నారన్న అపోహలో TV వాళ్ళున్నారు.

ఆరుషి కేసే కాదు ఏకేసులోనూ మీరన్న ‘జెండర్ సెన్సిటివిటీ’ ఇటు పోలీసులకూ, అటు మీడియా వారికీ లేదు. అదిప్పట్లో రాదు కూడా!


మీడియా హైలైట్ చేస్తోందిగనక ఏదో ఒక సమాచారం ఇవ్వాలని పోలీసులు అవాకులు పేలితే, దాన్ని కూడా ప్యాకేజ్ చేసి TV వాళ్ళందించారు. దీంట్లో తప్పెవరిదీ? ఇది "గుడ్డు ముందా? పిల్ల ముందా?" సమస్య.

Naveen Garla said...

దేశంలో ఎన్నో సమస్యలు ఉండంగా...ఈ హత్య కేసునే పట్టుకొని అన్ని ప్రముఖ వార్తా ఛానెళ్ళు పట్టుకొని వేలాడటం ఆశ్చర్యకరం. ప్రభుత్వం, చట్టంలోని లొసుగులను నిర్లక్ష్యాన్ని బయటపెట్టి ప్రజలకు మేలు చెయ్యాలే తప్ప, ఇలా చచ్చిన మనుష్యుల మీద వ్యాపారం చెయ్యకూడదు. మీడియా ఆ చిన్న పిల్లను రెండో సారి చంపేసింది.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...