Friday, July 4, 2008

ధీరగాంభీర్యాల వెనుక....

ఇటీవల ఓ జాతీయస్థాయి ఆంగ్లపత్రిక ఆసక్తికరమైన ఒక వార్తను ప్రచురించింది.'లెటజ్ టాక్మెన్ ' అనే ప్రోగ్రాం కింద ఢిల్లీలో కొన్ని డాక్యుమెంటరీ సినిమాలను ప్రదర్సిన్చారు.ఈ డాక్యుమెంటరీలన్నీ మగవారికి సంబందించిన ప్రవర్తన,వాళ్ళల్లో ఉండే అపసవ్య నమ్మకాలు, పురుషత్వం గురించిన భ్రమలు వీటన్నింటి గురించి చర్చించాయి."ఇప్పటి వరకు పురుష ఉద్యమం మొదలవ్వకపోవటం నిజంగా విషాదం.ఇప్పటికైనా మగవాళ్ళు కళ్ళు తెరిచి తమ గురించి తాము తెలుసుకోవాలి.అనుభవాలు పంచుకోవాలి.అంతేకాకుండా ఫెమినిష్ట్ తరహాలో ఒక పురుష ఉధ్యమం మొదలవ్వాల్సి ఉంది.తమను తాము ఆవిష్కరించుకోవటానికి సరిపడిన భాష,ఒక వేధికల అవసరం ఇపుడెంతో ఉంది" అంటారు సినీనిర్మాత రాహుల్ రాయ్.
"నాకు అంతా తెలుసు,అన్నీ తెలుసు" అనే అహంకారపు ధోరణి వల్ల మగవాళ్ళు చాలా కోల్పోతుంటారు.ఏమీ తెలియకపోయినా తెలిసినట్లు గప్పాలు కొట్టడం,తెలియదని చెప్పడానికి బిడియపడడంవల్ల జీవిథంలో చాలా పోగొట్టుకుంటారు.
ఆడవాళ్ళకి సంబందించిన సమస్తం తమకు తెలుసునని భ్రమపడడమే కాకుండా, ఆడవాళ్ళకి ఏమీ తెలియదు,తమద్వారానే వాళ్ళు ప్రపంచాన్ని చూస్తారు అని కూడా అనుకుంటారు.పురుషాహంకారపు పొరలు కళ్ళకు కమ్మడం వల్ల నిజాల్ని చూడడానికి ఇష్టపడరు.తమకు ఏం కావాలి అనే దానికన్నా తమ నమ్మకాలు నడిపించిన దారిలో కళ్ళు మూసుకుని వెళ్ళిపోతుంటారు. ఏమీ తెలియని విషయాల గురించి కూడా "ఎలాగోలా మానేజ్ చేయగలను" "నాకు తెలియని విషయాలు ఎమున్నాయి" అని బుకాయించేస్తారు.అయితే ఈ "లెటజ్ టక్ మెన్" ప్రొగ్రంకి వచ్చిన మగవాళ్ళెందరో తమ మనసుల్లోని సందేహాలను ,అనుమానాలను ఎలంటి దాపరికమూ లేకుండా బయట పెట్టుకోవడమో కాక తమకు చాలా విషయాలు తెలియవని ఒప్పుకున్నారు.
"సర్ జి!నా కల్లల్లో ఎప్పుడూ ఆడపిల్లలెందుకు వస్తారు?నేను బస్ స్టాప్లోనో, రోడ్డుపైనో చూసిన అమ్మాయిలంతా నా కలల్లోకెందుకొస్తారు" అయోమయంగా అడిగే రాం దెవ్."ధూల్ కా ఫూల్" సినిమాలో రాజేంద్రకుమార్,మాలసిణాతో ఒక్కసారే సెక్సులో పాల్గొంటారు.వెంటనే పాప పుడుతుంది.ఒక్కసారికే పిల్లలు పుడతారా నిజంగా" ఆశ్చర్యంతో తలమునకలయ్యే సంజు.
నాకు పెళ్ళి కుదిరింది.మెదటి రాత్రి గురించి నాకొంతో టెన్షన్ గా ఉంటుంది.నాకెన్నో అనుమానాలు ఉన్నాయి కాని అడిగితే ఏమనుకుంటారోనని భయం.మగపుట్టుకపుట్టాక ఆమాత్రం తెలియదా అని వెక్కిరిస్తారని బెదురు" అంటూ బెదురు బెదురుగా ప్రశ్నించే బంటీలాల్.
"నాకు ఫుట్ బాల్ ఆడటం కన్నా పువ్వుల తోటల్ని పెంచటం ఇష్టం . పువ్వులు సున్నితమైనవి.మగవాడు కఠినమై పనులే చెయ్యాలి అంటూ నా మీద చాల ఒత్తిడి చేస్తారు " అనే నేపాలీ యువకుడు.
ఈ అభిప్రాయాలన్నీ చదివినపుడు చాలా ఆశ్చర్యం వేసింది.జీవితం పట్ల,స్త్రీల పట్ల వీళ్ళ అభిప్రాయాలు,నమ్మకాలు ఎంత అజ్ఞానంతో కూడుకుని ఉన్నాయో చదివినపుడు వెన్నుమీద ఏదో జరజరా పాకిన అనుభూతి కలుగుతుంది."అన్నీ తెలుసనే" అహంకారపు ధోరణి వెనక ఎంత అజ్ఞానం దాగివుందో,ఎన్ని సందేహాలు ఉన్నాయో అర్థమౌతుంది.మగవాడంటే కఠినంగా,ధీరంగా,గంభీరంగా ఉండాలనే ప్రచారాన్ని నమ్మి ఎంత మంది తమలోని సున్నిత్వాన్ని,సౌకుమార్యపు భావాల్ని మట్టిపాలు చేసుకుంటున్నారో ఈ బంగ్లాదేశ్ యువకుడి మాటల్లో వినాల్సిందే! "నాకు బొమ్మలేసుకోవటం ఇష్టం.రాత్రింబవళ్ళు బొమ్మలేయడంతో గడుపుతానని మా అమ్మానాన్నలకి కోపం.మగ పుట్టుక పుట్టాక మగాడిలాగా ఏదైనా గట్టిపని చెయ్యలిగాని బొమ్మలేసుకుంటూ కూచోడం ఏమిటి అంటూ తిడతారు" కళ్ళనీళ్ళపర్యంతమౌతూ చెప్పాడు.
ఈ కార్యక్రమానికి హాజరైన వాళ్ళంతా పాఠశాల స్థాయినించి సెక్స్ ఎడ్యుకేషన్ ను ప్రవేశపెట్టలని గట్టిగా కోరారు.ఢిల్లిలోని జహంగీర్ పురి కుర్రాళ్ళు,"మాకు సెక్స్ గురించి ఏమీ తెలియదు,తెలిసినట్టు షో చెప్పడం తప్ప.ఆడవాళ్ళ పట్ల మాలో ఎన్నో 'మిత్ 'లు ఉన్నాయి.ఏది నిజమో,ఏది అబద్దమో మాకు తెలియదు.మాకు ఎవరూ ఏదీ చెప్పరు.సినిమాలు చూసి చాలా విషయాలు నెర్చుకోవలసి వస్తోంది.మగవాడంటే మొరటుగా,అహంకారంతో ఉండాలని మేం మా పెద్దల్నించి,సినిమాల నుంచి నేర్చుకుంటున్నాం.సున్నితంగా ఉంటే 'ఆడంగి వెధవా' అని వెక్కిరిస్తారని చాలా భయం.నిజాయితీగా తమ మనసుల్లోని అభిప్రాయాలు చెప్పుకొచ్చారు.
ఓ ప్రముఖ పత్రిక ప్రచురించిన ఈ వార్తా కథనం నాలో ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తింది.రాహుల్ రాయ్ పేర్కున్నట్లు ఒక 'పురుష ఉద్యమం' ఆవశ్యకతని,పురుషులు తమ సందేహాలను,తమ భయాలను,తమ అనుభవాలను వ్యక్తం చేసుకోడానికి ఒక వేదికని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పినట్లయింది.సమాజం తమకి ఉదారంగా ప్రసాదించిన 'పురుషాహంకారపు 'చీకటి తెరల్ని చీల్చుకుని నిజాయితీగా,నిర్భయంగా బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి.ఏమీ తెలియని చోట కూడా 'అన్నీ తెలుసనే' అతిశయం ఎంత నష్టాన్ని కల్గిస్తుందో అంచనా వేసుకొగలగాలి.తమ అహంకారాలవల్ల,అణిచివేతలవల్ల,అత్యాచరాలవల్ల సమాజంలో తమతో బాటే బతుకుతున్న సగం జనాభా ఎన్ని కష్టాలుపడుతుందో,ఎంత హింసని భరిస్తుందో అర్థం చేసుకోగలిగితేనే వారికీ విముక్తి.
ధీర,గాంభీర్యాహంకారాల వెనుక దాగి ఉన్న తమ అసలు స్వరూపాన్ని గుర్తించగలిగితేనే అందరికీ మంచిది.తమకుతెలియని ప్రపంచం గురించి ('అంతానాకు తెలుసూ అనే అహం వదిలి) తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మరీ మంచిది.

6 comments:

Kathi Mahesh Kumar said...

నిజమే! చాలా వరకూ image trap మరియూ misinformation కు బలై మగాళ్ళు కొన్ని అపోహల్లో జీవిస్తుంటారు.

ఈ అపోహలు సినిమాల నుండీ మొదలై, బూతు పుస్తకాల మీదుగా, స్నేహితుల మధ్యన ఏర్పడి స్థిరపడి జీవితాల్లో భాగాలవుతాయి. వాటిని దూరం చేసుకోవడం సాధ్యమే! కానీ ఈ సమాజ నిర్మాణం అపోహల్ని పెంచిపోషించేదిగా ఉందే తప్ప, ఉపయోగకారిగా ఉండటం లేదని నా స్వీయానుభవం.

Sujata M said...

Good One. Satyavati gaaru! Well Done.

సుజాత వేల్పూరి said...

మంచి ఆర్టికిలే పట్టారు సత్యవతి గారు! కానీ మహేష్ గారన్నట్టు, ఈ సమాజ నిర్మాణం అపోహలను (నిజానికి పురుషులకు సెక్స్ విషయాలలో స్వేచ్చ ఎక్కువనీ, భయపడకుండా తెలుసుకోవడానికి చాన్స్ ఎక్కువనీ జనరల్ అభిప్రాయం కదా) పెంచేదిగా ఉందికానీ తగ్గించేదిగా లేదు.

maa godavari said...

మహేష్ కుమార్ గారు,సుజాత గారూ
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు.
సుజత గారూ ఈ వ్యాసం నేను ఎక్కడా పట్టలేదండి.
"ఈవారం" పత్రిక లోను "ఈభూమి" పత్రిక లోను నేను కాలం రాస్తున్నను.ప్రస్తుతం ఈవారం లో మానేసాను.ఈ వ్యాసం మొదట 'ఈవారం' లో పబ్లిష్ అయ్యింది.

సుజాత వేల్పూరి said...

సత్యవతి గారు, నేనన్నది మీరు ఉదహరించిన ఆంగ్ల పత్రికలోని వార్త గురించి.

maa godavari said...

ok sujatha garu.thanks.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...