Tuesday, September 25, 2007

ఆరు బ్రహ్మ కమలాలతో నేను


ఆరు బ్రహ్మ కమలాలతో నేను

మిత్రులారా! బ్రహ్మ కమలాలు సంవత్సరానికి ఒకటో రెండో పూస్తాయని నేను విన్నాను.చదివాను.అయితే మా ఇంట్లో మాత్రం బ్రహ్మకమలాలు ఆగకుండా పూస్తూనే వున్నాయి.ఓ నెల రోజుల క్రితం తొమ్మిది పూలు పూసాయి.మళ్ళీ మొన్న పన్నెండు పువ్వులొచ్చాయి.రెండు రోజులు వరుసగా ఆరు ఆరు పువ్వుల చొప్పున వికసించి నన్ను ఆశ్చర్యంలో ముంచేసాయి.
మీకోసం ఈ ఆరు పువ్వులు.

Monday, September 24, 2007

పత్తి మందారం








పత్తి మందారం పువ్వులివిగో.ఈ పువ్వులు ఉదయం పూసినప్పుడు పాల నురుగంత తెల్లగా ఉంటాయి.మధ్యాహ్నానికి చక్కటి గులాబీ రంగులోకి మారతాయి.సాయంత్రానికి ఎర్రటి అరుణిమ దాలుస్తూ ముడుచుకుపోవడం, రాలిపోవడం జరుగుతుంది.
ఈ రోజు మా ఇంట్లో పూసిన పత్తి మందారల భిన్న స్వరూపాలివి.

Saturday, September 15, 2007

మణిపూర్ ఉక్కు మహిళ షర్మిలా ఇరామ్

షర్మిలా ఇరామ్, 35 సంవత్సరాల మణిపూర్ ఉక్కు మహిళ నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెట్టి ఏడు సంవత్సరాలు దాటుతోంది. మణిపూ‌ర్‌లోనే కాక మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో 48 సంవత్సరాలుగా అమలులో ఉన్న అమానుష చట్టం ఆర్మడ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) చట్టాన్ని (ఎఎఫ్ఎస్‌పిఎ) కి వ్యతిరేకంగా షర్మిల నవంబర్ 2000 లో తన అమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టింది. నవంబరు 2, 2000, షర్మిల జీవితాన్ని అనూహ్యమైన మలుపుతిప్పిన రోజు. మణిపూ‌ర్‌లోని ‘మలోమ్’ ప్రాంతంలో ‘తిరుగుబాటు’ దారుల మీద అస్సామ్ రైఫిల్స్ జరిపిన దారుణ కాల్పుల్లో పదిమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. శాంతి ఊరేగింపుకోసం ‘మలోమ్’ వెళ్ళిన షర్మిలను ఈ సంఘటన కలిచివేసింది. మణిపూ‌ర్‌లో ఇలాంటి దారుణ సంఘటనలు ఇంతకు ముందు జరగలేదా అంటే జరిగాయి. కాని శాంతి ఊరేగింపుల ద్వారానే ఈ భద్రతా దళాల దారుణాలను ఆపలేమని అర్థం చేసుకున్న షర్మిల ఆరోజు నుంచే తన అమరణ నిరాహారదీక్ష మొదలు పెట్టింది. ఆమె బలహీనమైన శరీరం యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ప్రభుత్వం ఆమె మీద కేసుపెట్టి జైలుకు పంపింది. ఆమెకు బెయిల్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికి తన నిరాహారదీక్షని జైల్లోనే కొనసాగించింది. అప్పటినుండి ఆమె నిర్బంధంలోనే వుంది. బలవంతంగా ముక్కుకు గొట్టాలు అమర్చి ఆహారం పంపిస్తున్నారు. ఆమెకు కొన్నిసార్లు బెయిల్ దొరికినా, ఆమె నిరాహార దీక్ష కొనసాగించడంతో మళ్ళీ మళ్ళీ అరెస్టు చేయడం జైలుకి పంపడంజరుగుతూ వచ్చింది.

ఈ ఏడేళ్ళ కాలంలో షర్మిల వృద్ధురాలైన తన తల్లిని ఒక్కసారి కూడా కలుసుకోలేదు. నిరక్షరాస్యురాలైన , గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆమె తల్లి షర్మిలకిస్తున్న మానసిక మద్దతు వెలకట్టలేనిది. “మీరు ఎందుకు మీ బిడ్డను చూడడానికి వెళ్ళలేదు” అని అడిగిన ఒక విలేఖరికి ఆమె తల్లి ఇరామ్ సఖీదేవి ఇచ్చిన సమాధానం “నా గుండె చాలా బలహీనమైంది. నేను షర్మిలను చూస్తే ఏడుస్తాను. నా ఏడుపుతో తన ధృఢ నిర్ణయాన్ని చెదరగొట్టదలుచుకోలేదు. అందుకే షర్మిల తన గమ్యం చేరేవరకు ఆమెను చూడదలుచుకోలేదు.”

షర్మిల నిరాహారదీక్ష కొనసాగుతున్న సమయంలోనే 2004 లో మణిపూర్ స్త్రీల చారిత్రక నగ్న ప్రదర్శన జరిగింది. భద్రతా దళాల చేతిలో మనోరమ అనే మహిళ అత్యాచారానికి, హత్యకి బలైనపుడు మణిపూర్ స్త్రీల గుండెలు మండిపోయాయి. తీవ్ర చర్యకి వారిని ప్రేరేపించిందీ సంఘటన. అస్సామ్ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ ముందు మణిపురి తల్లుల నగ్న ప్రదర్శన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. సెవెన్ సిస్టర్స్‌గా పిలవబడే ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో యావత్ ప్రపంచానికి తేటతెల్లం చేసిందీ నగ్న ప్రదర్శన.

ఇంఫాల్‌లోని జవహర్ లాల్ నెహ్రూ హాస్పిటల్‌లోని జుడీషియల్ కస్టడీ నుంచి బెయిల్ దొరికిన వెంటనే ఆమె మిత్రులు షర్మిలాను ఢిల్లీకి తరలించారు. చాలా నాటకీయ పరిస్థితుల్లో ఆమె హఠాత్తుగా అక్టోబరు 2 న ఢిల్లీలోని రాజ్‌ఘాట్ ముందు ప్రత్యక్షమై మహాత్మాగాంధి సమాధి మీద పుష్పగుచ్ఛం వుంచుతూ “మహాత్మా గాంధీ కనుక ఈరోజు బతికి వుండి వుంటే, ఆయన తప్పకుండా సాయుధ దళాలకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టి వుండేవాడని నేను యావత్ భారత ప్రజలకు చెప్పదలిచాను. భారతీయులందరికీ నా విన్నపం ఒక్కటే. సాయుధ దళాల చర్యలకు వ్యతిరేకంగా గళం విప్పండి. మా ప్రచారంలో భాగం పంచుకోండి” (టెలిగ్రాఫ్ అక్టోబరు 5, 2006)

ప్రస్తుతం షర్మిలను అరెస్టు చేసి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో వుంచి బలవంతంగా ముక్కు ద్వారా ఆహారం పంపిస్తున్నారు. ఇంఫాల్ హాస్పిటల్ ఇరుకు గదిలోంచి, ఎయిమ్స్‌లోని స్పెషల్ వార్డులో వుంటూ షర్మిల తన నిరాహార దీక్ష కొనసాగిస్తూనే వుంది. అయితే ఆమె ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోందని డాక్టర్లు ప్రకటిస్తున్నారు. ముక్కుకి బలవంతంగా అమర్చిన గొట్టం వల్ల షర్మిల తీవ్రమైన బాధని భరిస్తోంది.. ఇటీవలే ఆమె బి.బి.సిలో మాట్లాడుతూ “మణిపూర్ ప్రజల కోసం నేను పోరాటం చేస్తున్నాను. ఇది వ్యక్తిగతమైంది కాదు. నా పోరాటం సత్యం కోసం, ప్రేమ కోసం, శాంతికోసం” అంటూ ప్రకటించింది.

ముప్పై ఐదేళ్ళ బలహీనమైన ఈ యువతి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గణతికెక్కిన భారతదేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గాంధీ అడుగుజాడల్లో, అహింసాయుత పద్ధతిలో, మడమతిప్పనిపోరు సల్పుతోంది. తన ప్రాణాలను తన ప్రజలకోసం తృణ ప్రాయంగా ఫణంగా పెట్టి పోరాడుతున్న షర్మిలా ఇరామ్‌తో గొంతు కలపడం అభ్యుదయాన్ని కాంక్షించే వారందరి కర్తవ్యం.

Friday, September 14, 2007

మానవీయ భాష నేటి అవసరం

ఆగష్టు ఆరవ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాలులో ‘’పాలపిట్ట పాట - ప్రత్యేక తెలంగాణా పోరాట పాటలు'’ వరవరరావు రాసిన పాటల సిడీల ఆవిష్కరణ సభ జరిగింది. మా భూమి సినిమాలో ‘’పల్లెటూరి పిల్లగాడా'’ పాటతో జనం నాలుకల మీద ఈనాటికీ నిలిచిన సంధ్య, విమల, రడం శ్రీను, పుష్ప, వెంకట్ల పాటలు వినడానికి ఎంతో ఉత్సాహంలో ఆ మీటింగుకు వెళ్ళడం జరిగింది. మీటింగు మొదలవ్వడానికి ముందు అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం.

నిజానికి ఎడిటోరియల్గా వస్తున్న ఈ కధనం రిపోర్ట్ల్లో రావలసింది. కానీ ఆనాటి ఆ సమావేశంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన వల్ల సంపాదకీయం రాయాల్సి వస్తోంది. అయితే ఇది ఒక ఉద్యమాన్ని కించపరచడానికో, వ్యక్తిగతంగా ఎవరినో దుమ్మెత్తి పోయడానికో రాస్తున్నది కాదు. అస్తిత్వ ఉద్యమాల పట్ల ఉద్యమంలో వున్న వారి నిబద్ధత పట్ల వున్న గౌరవానికి ఈ సంపాదకీయానికి ఏలాంటి సంబంధమూ లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పట్ల మాకెలాంటి వ్యతిరేకతా లేదు. ఇంతకు ముందు భూమిక తెలంగాణా పోరాట నేపధ్యంతో ‘’ ప్రత్యేక తెలంగాణ సంచికను'’ కూడా వెలువరించిన విషయం విస్మరించకూడదని మనవి.

అయితే ఆ రోజు సమావేశంలో జరిగిన సంఘటనని ఎత్తి చూపాల్సిన అవసరం చాలా వుంది. మీటింగు మొదలవ్వబోతోందని సూచిస్తూ తెలంగాణ వైశిష్ట్యం గురించి ఒక పాట పాడ్డం మొదలుపెట్టారు. పాట మంచి ఊపుగా, ఉద్విగ్నంగా సాగుతోంది. సభికులు పాటను ఆస్వాదిస్తున్నారు. నేనూ అదే మూడ్లో వున్నాను. హఠాత్తుగా, కర్ణకఠోరంగా వినబడిన పాటలోని ఒక వాక్యం నన్ను దిగ్భ్రమకి గురి చేసింది. నిలువెల్లా వొణికించింది. కోపంతో నో..నో..అని అరిచాను కూడా.
తెలంగాణ అపుడెలా వుండేది, ఇపుడెలా వుంది పోలుస్తూ సాగుతోన్న పాటలో
‘’నిండు ముత్తయిదువులా ఉండేదానివి
ముండ మోపి లెక్క నయ్యావే తెలంగాణ…'’

ఆ పాటని పాడుతున్న వాళ్ళల్లో ఇద్దరు స్త్రీలు కూడా వున్నారు. ఆ వాక్యాలని వాళ్ళెలా ఉచ్ఛరించగలిగేరా అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు గుండెల్లో ముల్లు గుచ్చుకున్నంత బాధేసింది. నేనింక అక్కడ ఒక క్షణం నిలవలేకపోయాను. చివరి దాకా సమావేశంలో వుండి పాటలన్నింటిని వినాలని కూర్చున్న నేను, ఆ ఒక్క పాట అవ్వగానే లేచి హాలు బయటకి వచ్చేసాను.పాట పాడిన వాళ్ళని పిలిచి పబ్లిక్ మీటింగులో ఆడవాళ్ళని అవమానిస్తున్న ఆ పాటని మీరెలా పాడగలిగేరు అని అడిగితే సరైన సమాధానం రాలేదు.

విప్లవోద్యమ నేపధ్యం, ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపధ్యం కలిగిన వ్యక్తులు వేదిక మీద, వేదిక కింద ఆసీనులై వున్న ఆనాటి సమావేశంలో స్త్రీలని ముత్తయిదువలని, ముండ మోపులని చీలుస్తూ, అవమానిస్తూ గొంతెత్తి పాడటాన్ని నేను ఈ రోజుకీ జీర్ణించుకోలేక పోతున్నాను. అభ్యుదయ వాదులూ, విప్లవ వాదులూ కూడా ఇంకా స్త్రీలను అవమాన పరిచే భాషను వదులుకోలేక పోతున్నారే అని చాలా బాధపడుతున్నాను. స్త్రీలను కించపరిచే భాషను భాషాశాస్త్రం నుంచి తొలగించాలని ఒక వైపు స్త్రీవాద ఉద్యమం డిమాండ్ చేసి కొంతవరకు మామూలు సాహిత్యకారుల్లో సైతం ఒక అవగాహనని కల్గించినా అభ్యుదయవాదులు, విప్లవ వాదులు దీన్ని వొదిలించుకోలేకపోవడం చాలా దు:ఖంగా అన్పిస్తోంది.

తెలుగు భాష నిండా స్త్రీలను కించపరిచే పదాలు - మానభంగం, అనుభవించడం, చెరచడం, ముండమోపి, ముత్తయిదువ, అయిదోతనం, శీలం, అబల, సౌభాగ్యవతి లాంటి పితృస్వామ్య సంస్కృతికి అద్దం పట్టే పదాలు కుప్పలు తెప్పలుగా వున్నాయి. ఇలాంటి దారుణ పద ప్రయోగాలను భాషా శాస్త్రం నుండి తొలగించడానికి ఒక భాషా సాంస్కృతిక విప్లవంలో పాలు పంచుకోవాల్సింది పోయి అభ్యుదయ వాదులు కూడా వివక్షాపూరిత భాషను యధేేచ్ఛగా ప్రయోగించడం అర్ధం చేసుకోలేకపోతున్నాను.

ఇప్పటికైనా స్త్రీలకు సంబంధించి ఒక గౌరవ ప్రదమైన మానవీయ భాషను, ప్రత్యామ్నాయ పద ప్రయోగాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని అభ్యుదయ వాదులతో సహా అందరూ ఆలోచించాలని, పెద్దు ఎత్తున చర్చను లేవనెత్తాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

Sunday, August 26, 2007

గుండె చెరువౌతోంది మిత్రులారా!
మతమౌఢ్యం,మతవాదాల రూపమింత భయానకమా?


మన బతుకులింక వేయి పడగల మతమౌడ్య్లుల పడగ నీడల్లోనేనా?
అయ్యో!మనం 21 వ శతాబ్దంలోనే బతుకుతున్నామా!


నిన్న ఆ భయానక,బీభత్స సంఘటన జరగడానికి పది నిమిషాల ముందు నేను, పిఓడబ్ల్యూ సంధ్య,సుజాత,ఇంకో అమ్మాయి కలిసి విశాఖ గిరిజన స్త్ర్రీల పై అత్యాచారాల విషయమై జరిగిన సమావేశంలో పాల్గొని ముఖ్య మంత్రి కి మెమొరాండం ఇవ్వడానికి వెళ్ళేం.మేము ఆ రోడ్డు దాటిన పది నిముషాలకి బాంబు దాడి జరగడం,అందమైన లుంబిని పార్క్ బుద్ధుడి సాక్షిగా రక్తసిక్తమైపోయింది.అమాయక ప్రాణాలు మత మౌఢ్యానికి బలై పోయాయి.
కళ్ళ వెంబడి రక్తాశ్రువులు ధార కడుతున్నాయి. గుండెను పిండేసే ఆ బీభత్స ద్రుశ్యాలను చూసి చూసి మెదడు స్తంభించిపోయింది.
ఉదయమే పేపర్ ముట్టుకుంటే చేతులకంటిన నెత్తురు ఎంత కడుక్కున్నా,ఏ సబ్బులేసి తోముకున్నా వదలడం లేదు.ఆ నెత్తుటి చేతులతో తిండి సహించక,పడుకుంటే నిద్ర రాక పీడ కలలు
పగలు కూడ పీడిస్తున్నాయి.
అయ్యో! ఇది నాగరిక సమాజమా?
మతం పేరు మీద ఎన్ని కోట్ల మంది బలవ్వాలి?
క్షతగాత్రుల్ని చూస్తుంటే గుండె చెరువై కళ్ళళ్ళోంచి ఉప్పెనలా
దుఖం తన్నుకొస్తోంది.
ఈ బాధకి మందేమిటి?

Friday, August 17, 2007







ఒక్కటి కాదు రెండు కాదు
ఐదు బ్రహ్మ కమలాలు


నిన్న రాత్రి మా ఇంట్లో ఒక్కటి కాదు రెండు కాదు ఐదు బ్రహ్మ
కమలాలు/వెన్నెల పుష్పాలు పరిమళాలు వెదజల్లుతూ
ఒకేసారి పూసాయి.అబ్బ! అంత ఘాటైన పరిమళం ఏ పువ్వు నుంచి వెలువడ్డం చూడలేదు.మీకోసం కొన్ని ఫోటోలు పంపుతున్నాను.

Wednesday, August 15, 2007




ఖుషీ కా దిన్
జగనే కీ రాత్

హమ్మో! ఎన్ని నీళ్ళో
ఆకాశం లోంచి అంచెలంచెలుగా జారి
భూమిలో కి ఇంకుతున్నాయి
సాగర్ కాదది ఆనంద సాగరం
ఇరవై గేట్లు గుండెలు తెరుచుకుని
పాలనురుగుల్లాంటి ప్రేమ పానీయాన్ని ఒంపుతున్నాయ్
మెగా డాం ముందు
మరుగుజ్జుల్లా,మంత్ర ముగ్దల్లా
నువ్వూ,నేనూ
అదేంటో మరి అదేం చిత్రమో మరి
నువ్వూ నేనూ పాపికొండలు చూసి
పరవశించాలని వెళితే
గోదారమ్మ తన చుట్టూ
ఎత్తైన పచ్చదనాన్ని పరిచి
ముత్యాల ధారల్లాంటి వర్షంలో
వరదగోదారి అవతారమెత్తి
తానే పులకించిపోయింది గుర్తుందా నేస్తం!
అలాగే క్రిష్ణమ్మ కూడా
మనం సాగర్లో అడుగుపెట్టామని
ఎలా తెలుసుకుందో ఏమిటో
శ్రీ శైలం గేట్లను బద్దలు కొట్టుకుని
ఉవ్వెత్తున ఎగిసి పడుతూ
మనల్ని నిలువెల్లా తన్మయంలో ముంచేసింది
ఏభై మూడులొ నేనూ
నలభై ఆరులో నువ్వూ
పదేళ్ళ పిల్లకాయల్లోకి
పరకాయ ప్రవేశం చేసి
ఉల్లాసంలో ,ఉద్వేగంలో
ఒక ఉన్మాదంలో కొట్టుకుపోయాం
గంటల్ని క్షణాల్లా కరిగించేసి
అన్నం కూడా నీళ్ళల్లోనే ఆరగించేసి
ఎడారుల్లో బతికే వాళ్ళల్లా
నీళ్ళను కావలించుక్కూర్చున్నాం
ఆత్మీయ నేస్తాన్ని వాటేసుకున్నట్టు
అచ్చంగా నీళ్ళను హత్తుకుని కూర్చున్నాం
కెరటాలు కెరటాలుగా క్రిష్ణమ్మ ఉరికొచ్చి
మనల్ని ముంచేసినపుడు
చేతులు బార్లా చాచి
అలల రాశుల్ని గుండెల్లోకి ఒంపుకున్నాం
మబ్బులతో పోటీ పడుతున్న
నురుగుల ధవళ వర్ణం
మనల్కి తాకాలనే ప్రయత్నంలో
క్రిష్ణమ్మ కరిగి నీరై
మన కళ్ళల్లో ఆనందభాష్పాలైంది
మన పారవశ్యానికి సమస్త ప్రక్రుతి పరవసించిందో
మనమే ప్రక్రుతిలో మమేకమై మెరుపుల్లా మెరిసిపోయామో
ఐదు గంటలు అచ్చంగా నీళ్ళనే వాటేసుకుని
ఉద్విగ్నంగా ఒకర్నొకరం కలేసుకుని
నవ్వుల్ని పువ్వుల్లా నీళ్ళలోకి వదులుతూ
కేరింతలు,తుళ్ళింతలు
సంగీత కచేరీలు,సంతోష తరంగాలు
గులకరాళ్ళను విసరడాలు
ఎగిరొచ్చిన నీళ్ళ ముత్యాలు వొళ్ళంతా తాకుతుంటే
ముసు ముసి నవ్వుల మురిపాలు
అన్ని గంటల గాఢాలింగనంలో కూడా
తనివి తీరని వెదుకులాట
ఒదల్లేక ఒదల్లేక ఒడ్డుకొచ్చాం
ఆ రోజు......
నువ్వూ నేనూ క్రిష్ణమ్మ సాక్షిగా
సాగర్ డాం అంత ఉత్తుంగంగా ఎదిగిన
మన స్నేహాన్ని సెలబ్రేట్ చేసాం
మనకి ఖుషీ కా దిన్ అయిన ఆరోజే
జగనేకీ రాత్ కూడా అయ్యింది.

(శనివారం రోజు సాగర్ డాం లోంచి ఉరకలెత్తిన క్రిష్ణమ్మని
చూసి, ఆ అనుభవాన్ని ఆత్మీయ నేస్తంతో పంచుకున్న తన్మయంలోంచి)

Monday, July 23, 2007



నవ్వుల పువ్వుల్ని పూయించిన వేసవి శిబిరం

కొండవీటి సత్యవతి

మే మొదటివారంలో ఓ రోజు ఉదయాన్నే సి. సుజాత ఫోన్‌ చేసింది. మూసాపేటలోని ఒక మురికివాడలో తాము ఒక వేసవి క్యాంప్‌ పెట్టబోతున్నామని, నన్నూ రమ్మని ఆ ఫోన్‌ సారాంశం. అంతేకాదు ప్రముఖ నవలారచయిత్రి యద్దనపూడి సులోచనారాణి తన పేరు మీద ఒక ఫౌండేషన్‌ (వై.ఎస్‌.ఎస్‌.ఆర్‌. ఫౌండేషన్‌) ఏర్పరచారని, దానిమీదనే ఈ క్యాంప్‌ మొదలు పెడుతున్నా మని కూడా చెప్పింది. ఆ క్యాంప్‌ చూడడానికి వెళ్ళాను నేను. మూసాపేటలో ఓ మారు మూల ఉన్న చిన్న పాఠశాల. అందులో చదివేది అందరూ ముస్లిమ్‌ పిల్లలే. అక్కడ సులోచనా రాణి, డా|| సునంద, సి. సుజాత ఇంకా కొంత మంది మిత్రులు కలిసారు. మాటల సందర్భంలో తను ప్రిన్సిపాల్‌గా రిటైర్‌ అయ్యా నని, ఎవరైనా పిల్లలు వుంటే వాళ్ళకు ఆంగ్లం నేర్పాలని ఉందని సునంద అన్నారు. కుందన్‌బాగులో ప్రయత్నం చేద్దాము లెండి అన్నాన్నేను.

అలా ఒక చిన్న ప్రయత్నానికి బీజం పడిందక్కడ. ఆ బీజం మొలకౌవుతుందని, చిగురుల్లాంటి పిల్లలలో నేను వేసవి శెలవుల్ని గడుపుతానని అస్సలు అనుకోలేదు. అంతవరకు నాకు అలాంటి ఆలోచనే లేదు. సరే. ఆలోచనను ఆచరణ లోకి తేవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాను. మా ఇంటి ఆవరణలోనే వుండే షమీమ్‌, ఆయేషాలని పిలిచి నా ఆలోచన గురించి చెప్పాను. కుందన్‌బాగులో ఎక్కడైనా చిన్న స్థలం దొరికితే మనం సమ్మర్‌ క్యాంపు పెట్టుకుందామన్నపుడు మా స్కూల్‌లోనే పెడదామన్నారు వాళ్ళు. వాళ్ళతో కలిసి వెళ్ళి వాళ్ళ స్కూల్‌ వివేకానంద విద్యాలయ చూసొ చ్చాను. బావుంది. ఆ స్కూల్‌ యజమాని కేంప్‌ నడుపుకోడానికి ఒప్పుకున్నాడు.

ఈ ప్రాంతాన్ని మక్తా అంటారు. మురికివాడ లక్షణాలు పూర్తిగా లేకున్నా మురికివాడ కిందకే వస్తుంది. ఊళ్ళలో పనులులేక, ఉపాధి అవకాశాలు లేక హైదరాబాదుకు వలస వచ్చినవారు ఎక్కువగా వుంటారిక్కడ. ముఖ్యంగా శ్రీకాకుళం లాంటి దూరప్రాంతాలనించి వచ్చినవారు చాలామందే వున్నారు. మామూలుగా వేసవిలో నడిచే ఖరీదైన క్యాంపులకు వెళ్ళగలిగే ఆర్థికస్తోమతలేని పిల్లలు ఇక్కడ చాలామంది వున్నారు.

షమీమ్‌, ఆయేషాలు సైకిల్‌ మీద ఆ ప్రాంతమంతా తిరిగి సమ్మర్‌ క్యాంపు గురించి ప్రచారం చేసారు. కుందన్‌బాగు బంగ్లాలలో పనిచేసే అటెండర్ల పిల్లలకు కూడా కబురు అందించాం. షమీమ్‌ వాళ్ళు రెండు రోజులు తిరిగి ముప్ఫైమంది పిల్లల్ని పోగేసారు. ఇంకేం స్థలం దొరికింది. పిల్లల్ని కూడేసాం. మే 10న క్యాంప్‌ ప్రారంభించాలనుకున్నాం.

మే పదిన సులోచనారాణి, డా|| సునంద, డా|| వహీదా, సుజాత గార్లు వచ్చారు. ముప్ఫైమంది పిల్లలు వచ్చారు. రకరకాల వయస్సులవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు వచ్చారు. అలా మా క్యాంప్‌ మొదలైంది. పిల్లలు ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా వుండేవారు. ఉదయం తొమ్మిదికి మొదలుపెట్టి పదకొండు, పదకొండున్నర మధ్య ముగించేవాళ్ళం. ఆటలు, పాటలు, డాన్సులు, డ్రాయింగులు నేర్పేవాళ్ళం. సునందగారికి పిల్లలకి ఇంగ్లీషు నేర్పాలని ఉండేది. అయితే పిల్లలు ఎక్కువమంది చిన్నవాళ్ళు అవడంవల్ల కొంచం కష్టంగా వుండేది. పదిరోజుల తర్వాత తనకు వ్యక్తిగత పనులు వున్నాయని ఇక రాలేనని సునందగారు చెప్పి వెళ్ళిపోయారు.

ఈ క్యాంప్‌ని ఇరవై నాలుగు రోజులు నడిపాం. పిల్లలకి పాటుల నేర్పడం కోసం నేను పాటలు నేర్చుకున్నాను. భూపాల్‌ రాసిన పిల్లల పాటల్ని వాళ్ళకి నేర్పాను. ఒక్కసారి చెప్పగానే చకాచకా నేర్చేసుకునేవాళ్ళు. ఇరవైకన్నా ఎక్కువ పాటలు నేర్పాను. వాళ్ళు కాంప్‌కి రాగానే వందేమాతరం, మా తెలుగు తల్లికి పాటలతో మొదలుపెట్టి జణగణమనతో ముగించేవాళ్ళు. ఆరోగ్యంగా వుండడం గురించి, పళ్ళు శుభ్రంగా తోముకోవడం గురించి, అమ్మా నాన్నల్ని, చదువుచెప్పే గురువుల్ని ఎలా గౌరవించాలి, కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఎలా వుండాలో అన్నీ పాటలద్వారా చెప్పేదాన్ని. వాళ్ళు చక్కటి అభినయంతో పాడేవాళ్ళు.

మధ్యలో డా|| విష్ణుప్రియ నాతో చేరారు. ఆవిడ, నేనూ కలిసి చివరిదాకా క్యాంప్‌ నిర్వహించాం. పిల్లలతో ఉత్తరాలు రాయించడం, కథలు చెప్పించడం, బొమ్మలు వేయించడం లాంటివి చేయించాం. బుల్లి కొబ్బరిపిందెలతో, ఆలుముక్కలతో, దొండకాయ ముక్కలతో చక్కగా రథాలు చేసి ఆకులతో పూలతో అలంకరించారు. నా ఫ్రెండ్‌ భార్గవి ఒక రోజు కేంప్‌కి వచ్చి రంగురంగుల కొవ్వొత్తులు ఎలా తయారు చేస్తారో చూపించి పిల్లల్ని సంభ్రమంలో ముంచెత్తింది. అంతేకాదు తాను తెచ్చిన ప్రమిదల్లో రంగురంగుల వేక్స్‌పోసి, వొత్తిపెట్టి అవి పిల్లలకే ప్రజంట్‌ చేసినపుడు ఆ పసిముఖాల్లోని ఆనందాన్ని చూసి తీరాల్సిందే! ఎన్ని రాశుల డబ్బులు పోసినా ఆ ఆనందాన్ని కొనలేం. అనుభవించా ల్సిందే.

పిల్లల చేత ఆడించి, పాడించి, బొమ్మ లేయించిన తర్వాత వాళ్ళకి పండ్లు, స్వీట్లు, బిస్కట్‌లు, చాక్‌లెట్‌ లాంటివి పంచే వాళ్ళం. వాటిని ఆరగించి, సంతోషంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఆ... అన్నట్లు ఈ కేంప్‌లో మేము ముగ్గురి పుట్టిన రోజులు కూడా జరిపాం. ఒకరు రిథమ. రెండు రాణి. మూడు శివ. కేకులు కట్‌ చేసి, ఐస ్‌క్రీమ్‌లు పంచాం. ఇక్కడ శివ గురించి కొంచం చెప్పాలి. ఈ కుర్రాడు సెవెంత్‌ చదువు తున్నాడు. చాలా తెలివైన, ప్రతిభావంతుడైన కుర్రాడు. నేను నా మిడిమిడి జ్ఞానంతో ఒక గిరిజన నృత్యాన్ని నాలుగు స్టెప్పు లు నేర్పిస్తే వాడు దానిని పద మూడు స్టెప్పు లుగా విస్తరించి, అందరికీ చక్కగా నేర్పాడు. మూడు నాట కాలను వాడే రూపొందించి నటింపచేసాడు. అమ్మాపులి, చెట్టు సాక్ష్యం, అపాయంలో ఉపాయం నాటకాల్లో శివ హీరో. మూడు నాటికలను పిల్లలు చక్కగా ప్రదర్శించారు.

కొంతమంది పిల్లలకి జూన్‌ మొదట వారంలోనే స్కూల్స్‌ తెరుస్తుండటంతో జూన్‌ 2న మా క్యాంప్‌ ముగిద్దామ నుకున్నాం. ముగింపు కార్య క్రమానికి యద్దన పూడి, సునంద, వహీదా, విష్ణు ప్రియ, గీత హాజరయ్యారు. పిల్లలు రంగురంగుల పువ్వుల్లా ముస్తాబై వచ్చారు. రెండు న్నర గంటల పాటు వాళ్ళు నేర్చుకున్న వన్నీ ప్రదర్శించారు. దాదాపు ఇరవై పాటల్ని అభినయం తో పాడి విన్పించారు. హైలెస్సా డాన్సు చేసారు. మూడు నాటికలు ప్రదర్శించారు. వాళ్ళు వేసిన బొమ్మల్ని ఎగ్జిబిషన్‌లాగా పెట్టాము. చివర్లో వాళ్ళ కోసం కొన్న బహుమతుల్ని పంచిపెట్టాము. ఒక టిఫిన్‌ బాక్సు, వాటర్‌బాటిల్‌, కలర్‌ పెన్సిల్స్‌, పెన్సిల్‌ బాక్సులు పంచాం. అన్నింటిలోను ప్రతిభ కన్పరిచిన శివకుమార్‌కి, రెగ్యులర్‌గా క్యాంపుకి వచ్చిన గిరీష్‌కి మొమెంటోలిచ్చాం. వివిధ పోటీల్లో నెగ్గినవారికి చెస్‌, టిన్నికాయిట్‌, క్రికెట్‌బాల్‌ లాంటివి ఇచ్చాం. అగ్గిపెట్టెలో వస్తువులు పెట్టుకురమ్మని చెప్తే ఒక్కొక్కళ్ళు 160, 150, 140 బుల్లిబుల్లి వస్తువుల్ని సేకరించిపెట్టారు. అలా ఆటల్తో, పాటల్తో సమ్మర్‌కాంప్‌ ముగిసింది.

ఈ కేంప్‌ని ఆర్గనైజ్‌ చేసిన సందర్భంగా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మనం దేన్నైనా మనస్ఫూర్తిగా మొదలుపెడితే ఏదీ దానిని ఆపలేదు. అలాగే ఏదైనా చెయ్యడానికి డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు. ఇలాంటి క్యాంపులు ఎవరి ప్రాంతంలో వాళ్ళు పెట్టగలిగితే, ఏ సౌకర్యమూ లేని మురికివాడల పిల్లలు కూడా వేసవిశిబిరాల సంతోషాన్ని పొందుతారు. నేను ఈ క్యాంప్‌ మొదలు పెట్టినపుడు డబ్బు గురించి ఆలోచించలేదు. యద్దనపూడి గారు ఇప్పటికే మొదలుపెట్టారు కాబట్టి వాళ్ళ బానర్‌నే పెట్టాము. దీనిద్వారా భూమిక హెల్ప్‌లైన్‌ నంబరును ఆ ప్రాంతంలో ప్రాచుర్యానికి తేగలిగాను. క్యాంపు చూడడానికి వచ్చిన కె.బి. లక్ష్మి రూ.500/- విరాళం ఇచ్చింది. సునంద కూడా రూ.500/- ఇచ్చారు. ఇక శాంతసుందరి గారయితే వెయ్యి రూపాయలిచ్చారు. వహీదా మొదటిరోజునే పిల్లలందరికి పెన్సిల్‌బాక్సులిచ్చింది. విష్ణుప్రియ కలర్‌ పెన్సిల్స్‌, తినుభండారాలు తెచ్చారు. భార్గవి తానే అన్నీ కొనుక్కుని వచ్చి కొవ్వొత్తుల తయారీ చూపించింది. అక్కడికొచ్చిన స్త్రీల కోసం ఫినాయల్‌, సబీనా పౌడర్‌ తయారీలను కూడా చూపించింది. సులోచనారాణి గారు వచ్చినపుడల్లా పండ్లు తెచ్చి పంచేవారు. ముగింపు రోజున పిల్లలకి స్వీట్లు పంచారు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే మనం ఓ చెయ్యి వేస్తే పదిచేతులు సహాయంగా వస్తాయని చెప్పడం కోసమే. మనం ఓ అడుగేస్తే, పది అడుగులు మనని అనుసరిస్తాయని నిరూపించడం కోసమే.

నేను సాధార ణంగా వేసవిలో ఎటైనా దూర ప్రాంతాలకెళ్ళి గడుపుతుంటాను. అది నాకు చాలా ఇష్టం. అయితే ఈ వేసవిలో నేను ఒక్క రోజు కోసం కూడా హైదరాబాదు దాటి వెళ్ళలేదు. అయితే విహార యాత్రకి వెళ్ళినప్పటికంటే ఎక్కువ సంతోషాన్నే నేను పొందాను. పిల్ల లతో కలిసి ఆడాను, పాడాను, నృత్యాలు చేసాను. ఈ పిల్లలంతా మే పదికి ముందు నాకు అపరి చితులు. కానీ జూన్‌ 2 నాటికి నాకు చాలా ఆత్మీయులైనారు. ముగింపు రోజున నాకు చాలా దుఃఖ మన్పించింది. పిల్లల్ని వదిలిరావడం కష్టమైంది.

మొత్తానికి అనుకోకుండా, ఎలాంటి ప్లానింగు లేకుండా మొదలైన చిన్న ప్రయత్నం విజయవంతంగా ముగిసింది. ఆ పిల్లల ముఖాల్లో నవ్వుల్ని పూయించడమే ఈ క్యాంప్‌ ముఖ్య ఉద్దేశ్యంగా మొదలై, వాళ్ళ నవ్వుల మధ్యే ముగిసింది. పిల్లల చల్లటి చిరునవ్వులు, వేసవికాలపు సాయంత్రాలు హఠాత్తుగా కురిసే చిరుజల్లుల్లా నన్ను అలరంచి సేదతీర్చాయని గర్వంగా, సంతోషంగా చెప్పగలను.

Monday, July 16, 2007

మిగిలిన భాగం

అలా మేము గుర్రం బండీ మీద కొంత కాలం స్కూలుకి వెళ్ళేం.మహేశ్వరం మావయ్య పూలరంగడిలా సెంట్లు పూసుకుని హుషారుగా ఉండేవాడు.అతను తన భార్యతో కాక కాలవ గట్టు మీద వేరే ఇంట్లో ఉండేవాడు.ఆ వేరే ఆమెని బీబమ్మ అనేవాళ్ళు. ముస్లిం స్త్రీ అన్నమాట.మహేశ్వరం మావయ్య తన ఇంట్లో తన భార్యతో కాక బీబమ్మతో ఎందుకుండేవాడో అర్ధమయ్యే వయసు కాదు. కానీ హుషారుగ బండి నడపడం,మమ్మల్ని బండి లో ఎక్కించుకోవడం,మళ్ళి జాగ్రత్తగా తీసుకురావడంతో అతనంటే మాకు చాలా ఇష్టంగా ఉండేది.అతను తన భార్యను పట్టించుకోకపోవడమే కాక బాగా కొట్టేవాడని చెప్పుకునేవారు.ఇప్పుడు తలచుకుంటే అతనంటే అసహ్యంగా అనిపిస్తుంది కానినా చదువు కొనసాగడంలో,చదువు నా జీవితంలో తెచ్చిన మార్పులో అతని పాత్ర కూడా ఉందని ఖచ్చితంగా ఒప్పుకుంటాను.ఆ గుర్రం బండి, మహేశ్వరం మవయ్య అంటే అందుకే ఒకలాంటి అభిమానం.ఆడవాళ్ళ పట్ల జరిగే అమానుషాలు,దుర్మార్గాలూఎలా ఉంటాయో వాటి స్వరూపం ఆ రోజుల్లో అర్ధమై ఉంటే నేనతని బండి ఎక్కేదాన్ని కాదు.
ఓ సారి మా బండి అదుపు తప్పి కాలువలో పడిపోయింది.నాకేమీ దెబ్బలు తగల్లేదు కానీ భారతి స్ప్రుహ తప్పి పడిపోయింది.మా పుస్తకాలన్నీ నీళ్ళల్లో పడిపోయాయి.
చాలా రోజులవరకు మాకు పుస్తకాలు దొరకలేదు. "హిందు" లో మ్యూజింగ్స్ చదవగానే నాకిదంతా గుర్తుకొచ్చింది.దాదాపు నలభై ఏళ్ళనాటి మాట.

Sunday, July 15, 2007



మా గుర్రం బండీ-మహేశ్వరం మామయ్య

ఈరోజు హిందూ పేపర్లో ఎద్దుబండి ప్రయాణం గురించి జార్జి.ఎన్.నెట్టో రాసిన మ్యూజింగ్స్ చదివాక నాకు మా గుర్రం బండి గుర్తొచ్చింది.మా సీతారమపురంలో హైస్కూల్ లేదు.ఐదు వరకే ఉంది.ఆరో క్లాసు చదవాలంటే నర్సాపురం(ఐదు కిలోమీటర్లు)వెళ్ళాలి. చదువు కోసం నేను మా ఇంట్లో నిత్య యుద్ధం చేసేదాన్ని.మా నాన్నకి నన్ను చదివించాలంటే ఇష్టమే కానీ ఉమ్మడి కుటుంబమవ్వడం వల్ల డబ్బులుండేవి కావు.ఏలాగోలా నేను నర్సాపురంలో ఓరియంటల్ స్కూల్లో చేరాను.ఆ స్కూల్లో ఫీజులుండేవి కావు.అద్దేపల్లి సర్వి శెట్టి అనే ఆయన ఆడవాళ్ళ కోసం ముఖ్యంగా భర్తలు పోయిన వాళ్ళ కోసం ఓ సంస్థను స్థాపించి దానికి హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంగం స్కూలు అని పేరు పెట్టేరు.
విడోస్ కోసం అక్కడ ప్తిమెట్ర్క్,నేత.దాన్సు,సంగీతం లాంటివి నేర్పేవాళ్ళూ.ఆ సంస్థ కిందే మా ఓరియంటల్ స్కూల్ నడిచేది.ఫీజులు లేవు కబట్టి నా చదువు సధ్యమైంది.అయితే రోజూ స్కూల్కి వెళ్ళడం మాకు పెద్ద సంస్యగా ఉండేది.ఇంట్లో వాళ్ళు అసలు పట్టీంచుకునేవారు కాదు. కొన్ని సంవత్సరాలు నడిచే వెళ్ళేవళ్ళం. సైకిల్ మీద వెళ్ళే వాళ్ళని లిఫ్ట్ అడిగి వెల్లేవాళ్ళం.నేను మెల్లగా సైకిల్ నేర్చుకున్నాను.మగవాళ్ళ సైకిల్ తొక్కేదాన్ని.లంగా,వోణీ వేసుకుని మగాళ్ళ సైకిల్ ఎక్కడం దిగడం చాలా కష్టంగా ఉండేది.మైలు రాళ్ళను చూసుకుని ఎక్కడం దిగడం చేసేదాన్ని.
అలా కష్టాలు పడుతుండగా మా ఉదురింటివాళ్ళ ఆడపిల్లలు నర్సాపురం హైస్కూల్లో చేరారు.వాళ్ళ కోసం వాళ్ళ నాన్న గుర్రం బండీ కొన్నాడు.ఆ బండి నడిపేటాయన పేరు మహెశ్వరం,మేము మామయ్య అని పిలిచేవాళ్ళం.ఆ బండిలో నన్ను మా చిన్నాన్న కూతురు భారతిని తేసుకెళ్ళేట్టుగా భారతి వాళ్ళ తాత ఏర్పాటు చేసాడు.

ఇంకా ఉంది.......

Thursday, July 12, 2007


నిప్పుల గుండం లో నడిస్తే కాళ్ళు కాలవు

నిప్పుల గుండం లో నడవడానికి, మహత్యాలకి ఏమి సంభంధం లేదన్నది నా అనుభవం.నేను 1980 లో విజయవాడలో జరిగిన ప్రపంచ నాస్తిక మహా సభలల్లో జరిగిన ఓ కార్యక్రమంలో నిప్పుల మీద నడిచాను. ఎర్రటి నిప్పుల మీద నడిస్తే కాళ్ళు కాలవు.నివిరుగప్పిన నిప్పు కాలుతుంది.తాటాకుతో నిప్పుల గుండాన్ని విసురుతారు.కణ కణలాడే గుండంలో మాత్రమే నడవాలి.చాలా వేగంగా కూడా నడవాలి.మనం నడిచినపుడు ఆ వేడికి అరికాళ్ళలో సన్నటి నీటిపొర ఏర్పడుతుంది.ఆ నీటి పొర కాళ్ళు కాలకుండా కాపాడుతుంది. ఇది విగ్న్ఞానం,సైన్సు కు సంబంధించినది. మహత్యాలకు,మాయలకు సంబంధించినది కాదు.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...