Wednesday, August 15, 2007
ఖుషీ కా దిన్
జగనే కీ రాత్

హమ్మో! ఎన్ని నీళ్ళో
ఆకాశం లోంచి అంచెలంచెలుగా జారి
భూమిలో కి ఇంకుతున్నాయి
సాగర్ కాదది ఆనంద సాగరం
ఇరవై గేట్లు గుండెలు తెరుచుకుని
పాలనురుగుల్లాంటి ప్రేమ పానీయాన్ని ఒంపుతున్నాయ్
మెగా డాం ముందు
మరుగుజ్జుల్లా,మంత్ర ముగ్దల్లా
నువ్వూ,నేనూ
అదేంటో మరి అదేం చిత్రమో మరి
నువ్వూ నేనూ పాపికొండలు చూసి
పరవశించాలని వెళితే
గోదారమ్మ తన చుట్టూ
ఎత్తైన పచ్చదనాన్ని పరిచి
ముత్యాల ధారల్లాంటి వర్షంలో
వరదగోదారి అవతారమెత్తి
తానే పులకించిపోయింది గుర్తుందా నేస్తం!
అలాగే క్రిష్ణమ్మ కూడా
మనం సాగర్లో అడుగుపెట్టామని
ఎలా తెలుసుకుందో ఏమిటో
శ్రీ శైలం గేట్లను బద్దలు కొట్టుకుని
ఉవ్వెత్తున ఎగిసి పడుతూ
మనల్ని నిలువెల్లా తన్మయంలో ముంచేసింది
ఏభై మూడులొ నేనూ
నలభై ఆరులో నువ్వూ
పదేళ్ళ పిల్లకాయల్లోకి
పరకాయ ప్రవేశం చేసి
ఉల్లాసంలో ,ఉద్వేగంలో
ఒక ఉన్మాదంలో కొట్టుకుపోయాం
గంటల్ని క్షణాల్లా కరిగించేసి
అన్నం కూడా నీళ్ళల్లోనే ఆరగించేసి
ఎడారుల్లో బతికే వాళ్ళల్లా
నీళ్ళను కావలించుక్కూర్చున్నాం
ఆత్మీయ నేస్తాన్ని వాటేసుకున్నట్టు
అచ్చంగా నీళ్ళను హత్తుకుని కూర్చున్నాం
కెరటాలు కెరటాలుగా క్రిష్ణమ్మ ఉరికొచ్చి
మనల్ని ముంచేసినపుడు
చేతులు బార్లా చాచి
అలల రాశుల్ని గుండెల్లోకి ఒంపుకున్నాం
మబ్బులతో పోటీ పడుతున్న
నురుగుల ధవళ వర్ణం
మనల్కి తాకాలనే ప్రయత్నంలో
క్రిష్ణమ్మ కరిగి నీరై
మన కళ్ళల్లో ఆనందభాష్పాలైంది
మన పారవశ్యానికి సమస్త ప్రక్రుతి పరవసించిందో
మనమే ప్రక్రుతిలో మమేకమై మెరుపుల్లా మెరిసిపోయామో
ఐదు గంటలు అచ్చంగా నీళ్ళనే వాటేసుకుని
ఉద్విగ్నంగా ఒకర్నొకరం కలేసుకుని
నవ్వుల్ని పువ్వుల్లా నీళ్ళలోకి వదులుతూ
కేరింతలు,తుళ్ళింతలు
సంగీత కచేరీలు,సంతోష తరంగాలు
గులకరాళ్ళను విసరడాలు
ఎగిరొచ్చిన నీళ్ళ ముత్యాలు వొళ్ళంతా తాకుతుంటే
ముసు ముసి నవ్వుల మురిపాలు
అన్ని గంటల గాఢాలింగనంలో కూడా
తనివి తీరని వెదుకులాట
ఒదల్లేక ఒదల్లేక ఒడ్డుకొచ్చాం
ఆ రోజు......
నువ్వూ నేనూ క్రిష్ణమ్మ సాక్షిగా
సాగర్ డాం అంత ఉత్తుంగంగా ఎదిగిన
మన స్నేహాన్ని సెలబ్రేట్ చేసాం
మనకి ఖుషీ కా దిన్ అయిన ఆరోజే
జగనేకీ రాత్ కూడా అయ్యింది.

(శనివారం రోజు సాగర్ డాం లోంచి ఉరకలెత్తిన క్రిష్ణమ్మని
చూసి, ఆ అనుభవాన్ని ఆత్మీయ నేస్తంతో పంచుకున్న తన్మయంలోంచి)

1 comment:

రాధిక said...

ప్రకృతిని ఆశ్వాదించడం మీకు తెలుసు
స్నేహాన్ని నిలుపుకోవడం మీకు తెలుసు
ప్రేమను పంచిపెట్టడం మీకు తెలుసు
స్త్రీ ని జాగృత పరచడం మీకు తెలుసు
ఆనందాల్ని పంచుకోవడం మీకు తెలుసు
అపురూపం గా దాచుకోవడం మీకు తెలుసు
నాకు మాత్రం
అక్షర రూపం దాల్చిన మీ భావాలని
చదవడం మాత్రమే తెలుసు

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...