లాడ్లి అవార్డుల ఫంక్షన్.......త్రివేండ్రం ట్రిప్

 1. 2011-12 సంవత్సరానికిగాను లాడ్లీ అవార్డుల ప్రదానోత్స వం అక్టోబరు 6న త్రివేండ్రమ్‌లో జరిగింది. ఈ సంవత్సరం ఈ అవార్డులు పొందినవారు – అత్తలూరి అరుణ (హెచ్‌ఎమ్‌టి.వి) ఉమాసుధీర్‌ (ఎన్‌డిటివి) స్టెల్
  లా (బ్లాగ్‌), రాజేశ్‌ (వనిత టివి),నందగిరి కిష్టయ్య (వనిత టివి), ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ (ఎపిఎఆర్‌డి). రాజేశ్‌, కిష్టయ్యగారికి వనిత ఛానల్‌ యాజమాన్యం అనుమతి ఇవ్వనందున వారిద్దరూ అవార్డుల్ని స్వీకరించడానికి రాలేకపోయారు. నేను యాజమాన్యం వారితో మాట్లాడి కనీసం వొకరినైనా పంపమని కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో నేను, అరుణ, ఉమాసుధీర్‌ 5వ తేదీనే బయటుదేరి త్రివేండ్రం వెళ్ళాం. స్టెల్లా విదేశాల్లో వుండడంవలన రాలేకపోయింది. ‘అపార్డ్‌’ ని రిప్రజెంట్‌ చేస్తూ చంద్రమౌళి, ఐఎఎస్‌, కమీషనర్‌ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 6 వ తేదీన వచ్చారు.

  మేము ముగ్గురం త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌లో దిగి, ‘కోవలం’ బీచ్‌ చూసుకుంటూ, మాకు రూమ్‌లు కేటాయించిన హోటల్‌కి వెళ్ళాలనుకున్నాం. ఎయిర్‌పోర్ట్‌ నిర్మానుష్యంగా వుంది. రాష్ట్ర రాజధానిలో వున్న ఎయిర్‌పోర్టులా లేదు. మన రాజమండ్రో, విజయవాడోలాగా అనిపించింది. ఫ్లయిట్‌లోంచి బయటకు రాగానే చేపలకంపు, నీచువాసన ముక్కుపుటాల్ని అదరగొట్టింది. కాకినాడ లోనో, బందరులోనో మత్స్యకారుల కాలనీలో అడుగుపెట్టిన భావన కలిగింది. బయటకొచ్చి టాక్సీ మాట్లాడుకుని ‘కోవలం’ వేపు బయలుదేరాం. టైమ్‌ ఐదున్నరే కాబట్టి బీచ్‌లో సూర్యాస్తమయం చూడొచ్చనుకున్నాం. వైజాగ్‌ బీచ్‌లో సూర్యోదయం ఎంత అద్భుతంగా వుంటుందో, కోవలం బీచ్‌లో సూర్యాస్తమయం అంత బావుంటుంది.
  మేము ఎక్కిన టాక్సీ డ్రైవర్‌ పేరు జార్జి. సన్నగా రివటలా వున్నాడు. ” ఉదయం నాలుగు నుండి ఎయిర్‌పోర్ట్‌లో వున్నాను. ఈ రోజు మీరే మొదటి బోణి” అన్నాడు కొంచెం హిందీ, కొంచెం మళయాళం కలగలపి. ఉమాసుధీర్‌ అత్తగారి ఊరు త్రివేండ్రం కాబట్టి తనకి మళయాళం వచ్చు. డ్రైవర్‌ జార్జి ఆపకుండా మాట్లాడసాగాడు. జీవితం ఎంత కష్టంగా వుందో, రోజుకి కనీసం వందరూపాయలు కూడా సంపాదన వుండదని, తను, భార్య, ఇద్దరు పిల్లలు, అమ్మా, నాన్న కలిసి వుంటామని, ఈ రోజు సంపాదన ఏభై రూపాయలు కూడా లేదని గుండె చెరువయ్యేలా చెబుతున్నాడు. ఇరుకిరుకు రోడ్ల మధ్య నుంచి టాక్సీ వెళుతోంది. త్రివేండ్రమా? చిన్న పట్టణమా? అన్నంత అధ్వాన్నంగా వున్నాయి రోడ్లు. జార్జి గుండెఘోష ప్రవాహంలా సాగుతూనే వుంది. కొంత అర్థమై, కొంత ఉమ చెప్పి మనసంతా దు:ఖమేఘం కమ్మేసినట్లయింది. ఒక లోయ లాంటి ప్రదేశం దగ్గర కారాపాడు. లోయకి ఒక వైపు గోడలాంటి రాయి వుంది. లోయ నిండా నీళ్ళున్నాయి. ”ఇది సూసైడ్‌ పాయింట్‌. రోజూ ఎవరో ఒకరు దూకుతూనే వుంటారు. నేనూ ఎపుడో ఇందులో తేలతాను” అని జార్జి అన్నపుడు దు:ఖమేఘం కళ్ళలోకి జారి చుక్క చుక్కగా రాలసాగింది.

  లోయకావలంతా అపరిమితంగా పరుచుకున్న పచ్చదనం. దట్టంగా కమ్ముకున్న కొబ్బరితోటలు, పోకచెట్లు, ఇంత పచ్చదనం మధ్య ఈ ”ఆత్మహత్యల వేదన ఏంటి?” దేవుడి సొంత దేశం”గా చెప్పుకునే ఈ నేల మీద ఇంత దు:ఖమా? జార్జి ఆత్మఘోష మమ్మల్ని ఊపిరి తిప్పుకో నివ్వలేదు. అలాంటి మానసిక స్థితిలోనే మేము కోవలం బీచ్‌లో దిగాం. అప్పటికీ సూర్యాస్తమయమైపోయి పడమర దిక్కుంతా ఎర్రబారి వుంది. మా మనసుల్లో ముసిరినట్టుగానే చిక్కటి చీకటి సముద్రం మీద క్రమంగా పరుచుకోసాగింది. ఎడమవేపున వున్న కొండమీద లైట్‌ హౌస్‌ వుంది. అలలు ఆ కొండను ఢీ కొట్టి అంతెత్తున ఎగిసిపడుతున్నాయి. అరేబియన్‌ సముద్ర విశ్వరూపం కోవలం బీచ్‌లో కనిపిస్తుంది. బీచ్‌లో నిలబడి చూస్తే సముద్రం చాలా ఎత్తులో వున్నట్టు, కెరటాలు ఎగిసిపడుతున్నట్టుగా కనిపిస్తుంది. కాసేపు బీచ్‌లో వుండి మా హోటల్‌ వేపు బయలుదేరాం. డ్రైవర్‌ జార్జి మాటల ప్రవాహం కొనసాగుతుండగానే త్రివేండ్రం రైల్వే స్టేషన్‌కి ఎదురుగా, పరమ ఇరుకుగా, రద్దీగా వుండే హోటల్‌కి వచ్చిపడ్డాం. బిల్లు మీద వంద ఎక్స్‌ట్రా ఇవ్వమంటే ఇచ్చేసి మా రూమ్‌ల్లో చేరిపోయాం. కానీ జార్జి ఘోష చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే వుండింది.

  మర్నాడు ఉదయం మహాధనవంతమైన అనంతపద్మనాభుని గుడికి వెళ్ళదామని అరుణ, ఉమ అన్నారు. సరే నాకు భక్తి లేకపోయినా ప్రపంచంలో కెల్లా రిచ్‌ టెంపుల్‌ ఎలా వుంటుందో చూద్దాంలే అని నేనూ వస్తానని చెప్పాను. ఉదయం ఏడింటికల్లా ఆటోలో గుడికి చేరాం. గుడి మూసేసారని, లోపల రాజకుటుంబీకులున్నారని, ఎనిమిదిన్నరదాకా లోపలి కెళ్ళే వీలులేదని సెక్యూరిటీ వాళ్ళు చెప్పడంతో ఏం చెయ్యాలో అర్థం కాక అటూ ఇటూ చూస్తుంటే ఓ చోట ఓ పెద్ద క్యూ కనబడింది. ఏమిటా అని దగ్గరకెళ్ళి చూస్తే పంచలు అద్దెకిస్తున్నారు. సెల్‌ఫోన్‌లు, కెమెరాలు డిపాజిట్‌ చేసుకుంటున్నారు. జీన్‌పాంట్‌లు, పంజాబీడ్రెస్‌లు వేసుకున్నవాళ్ళని గుడిలోని ‘దేవుడు’ ఇష్టపడదట. చీర కట్టిన వాళ్ళు ఒ.కే.నట. మనుష్యుల తిక్కలు, సంకుచిత ఆలోచనలు ఎలా వుంటాయో, ఉన్నాడో లేడో తెలియని రాతి బొమ్మలకి తమ పైత్యపు ధోరణులు ఎలా అంటకడతారో ననుకుంటూ, నవ్వుకుంటూ నేను అక్కడే వున్న కోనేరు వేపు వెళితే ఉమ, అరుణ పంచెలకోసం క్యూ కట్టారు. ఒకవేళ నేను ఏ జీన్‌పాంటో వేసుకుని వుంటే.. ఆ పంచెలు అద్దెకు తీసుకుని గుడిలోకి వెళ్ళి వుండేదాన్ని కాదు.

  కేరళీయులు మహా మెల్లగా పనిచేస్తారు. ఆ పంచెల కోసం వాళ్ళిద్దరూ అరగంట క్యూలో వుండి, వాటిని సంపాదించి డ్రెస్‌ మీద చుట్టుకున్నారు. అప్పటికీ గుడిలోకి వెళ్ళే క్యూ కూడా తయారైంది. మేము అందులో చేరాం. లోపల ఆవరణంతా చాలా పెద్దగా వుంది. అక్కడి ఇసు తిన్నెలు నాకు చాలా నచ్చాయి. ఫోటోలు తీద్దామంటే కెమెరాలు లాక్కున్నారు. అపార సంపద దాచిపెట్టిన నేలమాళిగలు ఎక్కడున్నాయండీ, నేను చూడాలి అంటుంది అరుణ. అలాంటివేమీ కనబడలేదు కాని, పిస్టళ్ళు బొడ్లో దోపుకుని, లుంగీలు కట్టిన పోలీసులు మాత్రం కనపడ్డారు. అందరినీ రక్షిస్తాడని జనం నమ్మే ‘దేవుడి’ ఆస్థిని కాపాడడానికి అడుగడుగునా ఆయుధదారులైన పోలీసులు. శభాష్‌… అనుకుంటూ క్యూలో ముందుకు కదిలాం. క్యూ నిండా చొక్కాల్లేని పురుషులు, లుంగీలు కట్టుకున్న ఆడవాళ్ళు. వేడిగా, ఉక్కగా వుంది. చెమటలు కార్చుకుంటూ జనం నడుస్తున్నారు.

  గర్భగుడి ముందువరకూ బుద్ధిగా నడిచినా క్యూ అక్కడికెళ్ళగానే అరాచకంగా తయారైంది. ఆడలేదు, మగలేదు, ముసలివాళ్ళు లేదు, పిల్లలు లేదు. పెద్ద పెట్టున తోసుకుంటూ, నెట్టుకుంటూ జనం. ఏం జరిగిందో తెలుసుకునే లోపల నా చుట్టూ చొక్కాల్లేని,చెమటకంపు మనుష్యులు. నాలుగు వేపుల్నుంచి తోసేస్తున్నారు. పెద్దవాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా వుంది. నేను అతికష్టం మీద గుంపులోంచి బయట పడి, మంటపం దిగేసి ఓ పక్కగా నిలబడ్డాను. ఉమ, అరుణ ఇంకా అందులోనే వున్నారు. వాళ్ళకోసం వెయిట్‌ చేస్తూ ఎదురుగా కన్పిస్తున్న అరాచక దృశ్యాన్ని అసహ్యించుకుంటూ నిలబడి వున్నాను. పోలీసులాంటి వాడొకొకడి వచ్చి అక్కడ నిలబడవద్దు అన్నాడు. నా ఫ్రెండ్స్‌కోసం నిలబడ్డానని, వాళ్ళురాగానే వెళ్ళిపోతానని చెప్పాను. నిలబడ్డొద్దు అని గట్టిగా అరిచాడు. ”నన్నెందుకు సతాయిస్తావ్‌. పోయి ఆ గుంపును క్యూలో పెట్టు” అని గట్టిగా హిందీలో అరిచాను. అయినా సరే వినకుండా, గర్భగుడిలో జరుగుతున్న చీదర వ్యవహారాన్ని పట్టించుకోకుండా నాతో వాదులాటకు దిగాడు. నా ఫ్రెండ్స్‌ వచ్చే వరకు నేను వెళ్ళను. ఏం చేసుకుంటావో చేసుకో ఫో అని గట్టిగానే కేకలేస్తుంటే, చెమటలు కక్కుకుంటూ ఉమ, అరుణ వచ్చారు. ”ఛీ..ఛీ.. వీళ్లేం భక్తులండీ. ఇంత భయంకరమైన అనుభవం ఎక్కడా కలగలేదు. రెండు తాళ్ళు కట్టి విడివిడిగా క్యూ మానేజ్‌ చెయ్యరా?పాపం! ముసలి వాళ్ళు చూడండి” అంటూ నా ఉక్రోషాన్ని వాళ్ళ ముందు వెళ్ళగక్కాక, పోలీసోడిని అక్కడికి పోయి ఏడు అని తెలుగులో తిట్టి గుడి నుండి బయటపడ్డాం. నేనెమన్నానో అర్థం కాక వెర్రి ముఖం పెట్టి నా వేపు గుర్రుగా చూస్తున్న కానిస్టేబుల్‌ని వెక్కిరిస్తూ బయట కొచ్చేసాం.

  ప్రపంచం మొత్తం మీద ఎంతో సంపద కలిగిన అనంత పద్మనాధుని గుళ్ళో మాకెదురైన అనుభవం అది. గుడి ముందు హిందూ మతస్థులు మాత్రమే గుళ్ళోకి వెళ్ళడానికి అర్హులనే బోర్డు పెట్టారు. దానిని ఫోటో తియ్యబోతుంటే, తియ్యొద్దని సెక్యూరిటీ మనిషి అడ్డం పడ్డాడు. కాని నేను అప్పటికే ఫోటో తీసేసాను. గుడి ముందున్న షాపుల్లో అరుణ, ఉమ షాపింగ్‌ చేసారు. నాకేమీ కొనాలన్పించలేదు. అలా షాపుల్లో తిరుగుతున్నపుడే అక్కడ ఏదో మ్యూజియమ్‌ కనబడింది. ట్రావెన్‌కూర్‌ రాజుల రాచప్రసాదం అది. దాదాపు రెండు వందల గదులతో అతి విశాలంగా రాజు నిర్మించుకున్న ఇల్లు. కొన్ని వేల మంది కూలీలు కళాత్మకంగా, రెక్కలు ముక్కలు చేసుకుని కట్టిన ఆ రాజసౌధంలో పాపం! ఆ రాజు ఏడు నెలలు మాత్రమే నివసించి చనిపోయాడట. అంతే వాస్తు బాగా లేదని రాజప్రసాదాన్ని వదిలేసి వెళ్ళిపోయారట మిగతా కుటుంబ సభ్యులు. ఆ మ్యూజియమ్‌లో రాజుగారు వాడి వదిలేసిన సమస్తమూ భద్రపరిచారు. ఎన్నో యుద్ధాలు చేసి, ఎంతో మందిని చంపిన ఆయుధాలు, కత్తులూ, బరిసెలూ, ఎన్నో దేశాల నుండి తెప్పించుకున్న వస్తు సామగ్రి, కట్టుకున్న బట్టలు, తిన్న కంచాలూ తాగిన గ్లాసులూ, కూర్చున్న బంగారు సింహాసనాలు వగైరాలన్నీ అక్కడున్నాయి. గుళ్ళోకి వెళ్ళడానికి రహస్య సొరంగ మార్గం కూడా వుంది. అన్నీ చూసి కాళ్ళ నొప్పులతో పదకొండింటికి బయటకొచ్చాం.

  నాకెందుకో మ్యూజియంలు చూడడం ఇష్టముండదు. ప్రజల ముక్కుపిండి వసూలు చేసిన సొమ్ముతో గొప్ప గొప్ప కోటలు, ప్రసాదాలు కట్టుకుని, వాటినిండా అతి ఖరీదైన వస్తు సామాగ్రిని నింపుకుని మహా ఆడంబరంగా, విలాసవంతంగా బతికిన రాజులు అనుభవించి వదిలేసిన నానావిధ సామాగ్రిని, మ్యూజియాల పేరిట భద్రపరచడం వాటిని జనాలకు చూపించడం ఎందుకో నాకు నచ్చదు.ఇంత ఖరీదు, అంత ఖరీదు అని గొప్పలు చెప్పడం తప్ప ప్రజల ఉపయోగంలోకి రాని వస్తువులు ఎంత గొప్పవైనా, ఎంత ఖరీదువైనా ఏం లాభం అనిపిస్తుంది. అలాగే అనంత పద్మనాభుని గుళ్ళో కానీ, మరే ఇతర గుళ్ళో కానీ, మఠాల్లో కానీ, పీఠాల్లో కానీ మేటలు వేసిన సంపద కూడా ప్రజలకు చెందిందే. ప్రజలు సమర్పించిందే. ఆ సంపదనంతటినీ ప్రజలకోసం వెచ్చిస్తే భారతదేశంలో పేదరికం జాడ కూడా కనబడదు. కానీ అలా చెయ్యరు. ఇలా రాసినందుకు నన్ను తిట్టిపోస్తారు. నన్నేం చెయ్యమంటారు, మ్యూజియమ్‌ చూసిన తర్వాత నాకు కలిగిన భావాలివి.

  సాయంత్రం ఆరుగంటలకి లాడ్లీ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. అవార్డుల ప్రదానం క్షుణ్ణంగా ముగిసినా, సుదీర్ఘమైన నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మళయాళ భాష ఒక్క ముక్క అర్థం కాక మేం తెల్లముఖాలేసుకుని కూర్చున్నాం కానీ సమావేశానికి హాజరైన ప్రేక్షకులు మాత్రం ఆద్యంతం కార్యక్రమాన్ని ఆనందంగా ఆస్వాదించారు. దక్షిణ భారత రాష్ట్రాలకు చెందిన తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, ఆంగ్ల భాషల జర్నలిస్ట్‌లు అవార్డుల్ని అందుకున్నారు. కేరళ శాసనసభ స్వీకర్‌ అవార్డుల్ని అందచేసారు. 2010లో హైదరాబాద్‌లో భూమిక నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ సమావేశంతో పోల్చుకుంటే త్రివేండ్రంలో జరిగిన సభ వెలవెల పోయింది. ఏర్పాట్లు కూడా అంతే పేలవంగా వున్నాయి. సభను నిర్వహించిన సంస్థవారు కొంత జాగ్రత్త పాటించి వుంటే సభ ఉత్సాహ పూరితంగా జరిగివుండేది.

  మర్నాడు మేము ముగ్గురం ఎయిర్‌పోర్ట్‌కు వెళుతున్నపుడు, ఉదయం వెళ్ళదామని వెళ్ళలేకపోయిన శంఖుముఖ బీచ్‌ కంటపడింది. డ్రైవర్‌ను ”బాబ్బాబు ఓ పది నిముషాలు బీచ్‌లో ఆపు” అనగానే ఆయన సరే అన్నాడు. పదిగంటలవేళ బీచ్‌లో ఇసుక మిలమిలా మెరుస్తోంది. కెరటాలు రారమ్మని పిలుస్తున్నాయి. ఇంకో పది నిముషాల్లో ఫ్లయిట్‌ ఎక్కాలి. తడిసిన బట్టలతో ఎలా?? అనుకుంటూ, కొన్ని ఫోటోలు మాత్రం తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాం. తిరిగి వస్తుంటే ఓ అద్భుత దృశ్యం కంటపడింది. ఓ ఇరవై మంది మత్స్యకారులు బలంగా సముద్రంలోంచి చేపల వలను లాగుతున్నారు. వలలో పడ్డ మత్స్ప సంపదను చూడాలని మనసు లాగుతున్నా, విమానం తలుపు మూసేస్తారేమో అనుకుంటూ ఎయిర్‌పోర్ట్‌ వేపు బయలు దేరాం మేం ముగ్గురం.

  త్రివేండ్రం ట్రిప్‌ నాకు ఎన్నో భిన్నమైన అనుభవాలనిచ్చింది. డ్రైవర్‌ జార్జి దీనగాథ, అతని మహా ఘోష ఒక రకమైన అనుభవాన్నిస్తే, మరోవేపు మహామెల్లగా, తాబేటి నడక కన్నా స్లోగా, కూల్‌గా పనిచేసే హోటల్‌ సిబ్బంది పనితీరు మహాశ్చర్యం కొలిపింది. హైదరాబాద్‌లో కనిపించే వేగవంతమైన జీవితం త్రివేండ్రంలో మచ్చుకైనా కనబడలేదు. మహా ఆరామ్‌గా,తొణక్కుండా పనిచేసుకునే మనుష్యులే మాక్కనబడ్డారు. మహా సంపద పోగు పడిన అనంత పద్మనాభుడి గుడి, ఆ సంపద మాదంటున్న రాజకుటుంబీకులు ఒక వైపు, అంతులేని పేదరికం (అపరిమితమైన పచ్చదనంతో అలరారు తున్నప్పటికీ) తాండవిస్తున్న కేరళ ఒక వైపు. గుళ్ళో విలువలేకుండా మగ్గుతున్న ఆ సంపద, ప్రజల చేతుల్లోకి వస్తేనే కదా విలువ పొందుతుంది? ప్రజావసరాలకు వినియోగిస్తేనే కదా దాని ఉపయోగం విదితమౌతుంది?
  ఈలాంటి ఆలోచనలు బుర్రను తొలుస్తుండగా మా త్రివేండ్రం ట్రిప్‌ ముగింపు కొచ్చింది..

Comments

Anonymous said…
ఎవడో అవార్డులిస్తుంటే ఆంధ్రానుండి కేరళ వరకూ ఎగేసుకుంటూ వెళ్ళిన మీరు అక్కడే ఉన్న దేవున్ని (అనంత పద్మనాభున్ని) చూడ్డానికి మనసొప్పలేదంటే చాలా వింతగా ఉంది.
Anonymous said…
ఎవడో అవార్డులిస్తుంటే ఆంధ్రానుండి కేరళ వరకూ ఎగేసుకుంటూ వెళ్ళిన మీరు అక్కడే ఉన్న దేవున్ని (అనంత పద్మనాభున్ని) చూడ్డానికి మనసొప్పలేదంటే చాలా వింతగా ఉంది.
Adi Narayana said…
కొండవీటి జ్యోతిర్మయిగారూ.. మీ వ్యవహారం చూస్తుంటే అవార్డులు ఎందుకో ఏమిటో అన్న గొడవ మరచి.. దాన్నో ఇండస్ట్రీగా మార్చేసినట్టు కనిపిస్తోంది. గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండీ.. మీ అవార్డుల వితరణలో నిజమైన పరిశోధన కనిపిస్తోందా? మీ పరిజ్ఞానానికి లోబడి అవార్డులిప్పిస్తున్నట్టుంది చూస్తుంటే. ఈ జెండర్ సెన్సిటివ్ అవార్డులకు ‘అత్తలూరి అరుణ’ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మరి పోయినట్టుంది. ఇలాంటి అవార్డులంటే.. అరుణకు ఇచ్చేస్తే చాలన్న ముద్ర.. పడిపోయింది. ఈ పద్ధతి మారాలి. అవార్డుల కోసం కాకుండా నిబద్ధతతో పనిచేసే వారిని, అర్హులైన వారిని ఎంపిక చేయవలసిందిగా ప్రార్ధన. ఇది నాలాంటి సామాన్యులందరి తరఫు మనవి.
ఆదినారాయణ గారూ
నా పేరు కూడా తెలియని మీరు చేసిన విమర్శ చాలా అర్ధరహితంగా ఉంది.నా పేరు కొండవీటి సత్యవతి.
ఈ అవార్డులిస్తున్నది నేను కాదు.
ముంబై లో పనిచేసే పాపులేషన్ ఫస్ట్ అనేసంస్థ.
నేను ఆంధ్ర ప్రదేశ్ కి కోఆర్డినేటర్ గా ఉన్నాను.
విజేతల ఎంపిక ను వివిధ రంగాల్లో ప్రముఖులైన జురి సభ్యులు చేస్తారు.
పాపం! అన్నమయ్య పాటలు పాడుకునే కొండవీటి జ్యోతిర్మయి ని ఎందుకు ఇందులోకి లాగుతారు.
Anonymous said…
సత్యవతి గారు,

మీకు దేవుడి మీద నమ్మకంలేక పోతే గుడికి పోవటం మెందుకు? పోయారేపో మళ్ళి మీ విమర్శిస్తూ టపాలు రాయటమెందుకు? మిమ్మల్ని ఎవరు బొట్టుపెట్టి గుడికి రమ్మని ఆహ్వానించలేదు కదా! శుబ్ర్హంగా ఇంట్లో కూచొకుడదా? అక్కడికెళ్ళి మీరు చేసే సత్యశోధన ఎమిటి? మీరు వెళ్ళిందే అక్కడ అరాచక దృశ్యాలను వెతకటానికి ఎవరు ఎది వేతుకుతారో దేవుడు వారికి అదే చూపిస్తారు. మీకు అసహ్యించుకునే దృశ్యాలనే చూపి పంపాడు.

"అనంత పద్మనాభుని గుళ్ళో కానీ, మరే ఇతర గుళ్ళో కానీ, మఠాల్లో కానీ, పీఠాల్లో కానీ మేటలు వేసిన సంపద కూడా ప్రజలకు చెందిందే. ప్రజలు సమర్పించిందే. ఆ సంపదనంతటినీ ప్రజలకోసం వెచ్చిస్తే భారతదేశంలో పేదరికం జాడ కూడా కనబడదు"

అబ్బ ఎమీ చేప్పారు. మీలాంటి వారికి వచ్చిన ప్రశ్నలు మిగతావారికి రావా? అసలికి మీ దగ్గర ఉన్న ఉన్న తెలివివంతా యురోప్, రష్యాల నుంచి వచ్చిన సాహిత్యం చదివే కదా! మరి ఆదేశాలలో కూడా ఎన్నో మ్యుసియం లు ఉన్నాయి. కోహినూర్ వజ్రం తో సహా అందులో పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు రిసేషన్ లో ఉన్న యురోప్ లో, మీలాంటి మేధావులు మ్యుసియం లో ఉండేసంపదని పేద ప్రజలకు ఉపయోగించాలి అని ఎందుకు కోరటంలేదు? అక్కడే ఉంది అసలు కిటుకు.

Anonymous said…
anany wel said.
with new generation...................
Anonymous said…
నేనూ మీఇతో ఏకీభవిస్తున్ననండీ సత్యవతి గారు, మతచాంధసులు వంటి మీద ఉండే దుస్తులని చూసి గుళ్ళల్లోకి అనుమతిస్తున్నారు కానీ మనుషుల ఆలోచనలు గమనించట్లేదు, బుద్ది వక్రంగా ఉంటే అన్నీ వక్రంగానే కనిపిస్తాయి, స్త్రీల వస్త్రధారణలో అయినా, ప్రార్ధనాస్థలాల ఔచిత్యంలో అయిన అంతే. శరత్
Adi Narayana said…
సత్యవతి గారూ.. జ్యోతిర్మయి గారి ఇంటి పేరూ మీ ఇంటి పేరు ఒకటి కావడం అది కూడా ఆమె పేరెప్పుడూ నోటిలో నానుతుండటం వల్ల ఈ పొరబాటు జరిగింది. జ్యోతిర్మయిగారికి క్షమాపణలు. కానీ నా కామెంట్లోని ఇంటెన్షన్ అర్ధం చేసుకోవాలనే ఇలా రాసాను. మీ కోర్డినేషన్ కు లిమిటేషన్స్ పెట్టుకోవద్దనేదే నా మనవి. ఆ ఎల్లలు చెరిపేసి నిజంగా ఈ విభాగంలో సేవ చేసున్న వారిక కృషి మీరు గుర్తించాలన్నదే నా కోరిక. కనుక గమనించగలరు. మీకు కోపం తెప్పించినందుకు సారీ.

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అశోకం