ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్ము కుంటున్నాయి. మే నెలలో అనుకోకుండా, హఠాత్తుగా ఎదురైన చల్లటి అనుభవం. నిన్నటిదాకా నలభైనాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత. ఈ రోజు ఇరవైఆరో ఇరవైఏడో. నిన్నటికి, ఇవాల్టికి ఎంత తేడా! బంగళాఖాతంలో పెనుతుఫాను. ఆ బీభత్సానికి ఎంత చక్కటి పేరు. లైలా! క్రితం సంవత్సరమొచ్చిన తుఫాను పేరు ఐలా! ఈ పేర్లు ఎవరు పెడతారో! ప్రళయ విధ్వంసం సృష్టించే ప్రకృతి వైపరీత్యాలకు ఆడవాళ్ళ పేర్లెందుకు పెడతారో!
తుఫాను గురించి, వాటి పేర్లు గురించి మాట్లాడుకుంటూ మురళి, మాధవి ఇంటి బయట లాన్‌లో కూర్చున్నారు. ఐదు గంటలకే చీకటి పడినట్లయిపోయింది. డాబా మీదికి ఎగబాకిన మాలతీలత ఆకు కనబడకుండా విరగపూసింది. మధురమైన సువాసనల్ని వెదజల్లుతోంది. ఇంకో పక్క కుండీలో గ్లోబులా పూసిన మే ఫ్లవర్. ఎర్రటి రంగుతో అద్భుతమైన అల్లికతో చూడముచ్చటగా వుంది. మబ్బుల చాటునుంచి కనబడీ కనబడనట్టుగా దర్శనమిచ్చింది నెలవంక.
”తుఫాను ప్రభావం బాగానే వున్నట్టుంది. బాగా వాన పడేట్టుంది. లోపలికెళదాం పద మురళీ” అంది మాధవి.
”వెళదాంలే! చినుకులు రాలనీ. బయట చల్లగా హాయిగా వుంది.” అన్నాడు మురళి.
”నిజమే. నాకూ కదలాలన్పించడం లేదు. మనం ఇలా కూర్చుని, ఇంత సామరస్యంగా మాట్లాడుకుని ఎంత కాలమైందో కదా! ఏమిటో. బతుకంతా ఉరుకులు, పరుగులు. దేనివెంట పరుగెడుతున్నామో అర్థమవ్వడం లేదు.”
మురళి మౌనంగా కూర్చున్నాడు. మాధవి మాటల అర్థం తెలుస్తోంది. ఏం చెప్పాలో తెలియక మౌనం వహించాడు.
”ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్ మురళీ?”
”ఏం లేదు మధూ! నీ మాటలు విన్నాక అన్పిస్తోంది. ఇలాంటి సాయంత్రాల్ని ఎన్నింటినో కోల్పోయాం. మనకేం జరిగింది? మనమెందుకంత రొటీన్‌లో పడి కొట్టుకుపోయాం. నువ్వు కాదులే. నేనే ఎండమావుల వెంట వెర్రిపరుగులెత్తాను. కార్పోరేట్ కాలేజీలో లక్షల్లో జీతం. పిల్లల్ని తోమడమే పని. ఎమ్‌సెట్‌లో ర్యాంకుల వర్షం కురిపించే ఉద్యోగం. ఇపుడు తల్చుకుంటే నామీద నాకే చిరాకేస్తోంది.”
”అవన్నీ ఇపుడెందుకులే మురళీ” మాధవి అంటుండగానే సన్నగా చినుకులు మొదలయ్యాయి. ఇద్దరూ ఇంట్లోకొచ్చారు.
”ఇప్పుడు వేడిగా, స్ట్రాంగ్‌గా కాఫీ తాగితే బావుంటుంది కదా!”
”బ్రహ్మాండంగా వుంటుంది.” మాధవి కాఫీ కలిపి తెచ్చింది. డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. గాలి ఉధృతి పెరిగింది. జోరుగా వాన కురుస్తోంది. ఎక్కడో ఫెళఫెళమంటూ పిడుగుపడిన శబ్దం. కరెంటు పోయింది.
”అయ్యో! కరెంట్ పోయిందే. ఎమర్జన్సీ లైట్ చెడిపోయింది. కొవ్వొత్తి తెస్తానుండు” అంటూ లేవబోయింది మాధవి.
”కాండిల్ వద్దులే మధూ! కాసేపు చీకట్లో కూర్చుందాం.”
”చీకట్లో కూర్చుందామా? ఇదేం కోరిక.”
”బావుంటుంది కూర్చో!”
కాసేపు ఎవరూ మాట్లాడలేదు.
చిమ్మచీకటి. అప్పుడపుడూ మెరుపులు, మెరుపుల్ని తరుముతూ ఉరుములు, ఫెళఫెళమంటూ పిడుగులు. ధారగా కురుస్తున్న వర్షంలో ఒక లయ వినిపిస్తోంది. మాలతీలత పువ్వుల పరిమళం. వాతావరణం బయట బీభత్సంగా వుంది. చీకట్లో కూర్చున్న ఇద్దరి మనసుల్లోను ఒక ప్రశాంతత, హాయి ఆవరించాయి.
”మధూ! ఇలా చీకట్లో కూర్చోవడం బావుంది కదూ! మన మనస్సుల్లోకి చూసుకోగలిగిన ఇలాంటి అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది.”
‘నిజం మురళీ! మనస్సంతా ఏవో ఆలోచనలతో సతమతమవు తోంది. నిదానంగా నిలబడి నీళ్ళు కూడా తాగలేని వేగం, వొత్తిళ్ళు మన ఆరోగ్యాలను ఎంత నాశనం చేస్తున్నాయో మనకి అర్థమవ్వడం లేదు.”
”నాకిపుడు బాగా అర్థమవుతోంది. ఆ రోజు క్లాసులో పాఠం చెబుతూ నిలువునా కూలబడిపోయినప్పటి నుండి నేను నా శరీరాన్ని ఎంత దుర్వినియోగం చేసానో తెలిసింది. డబ్బు సంపాదించే యంత్రంగానే దాన్ని వినియోగించాను. అలిసిపోతే ఆల్కహాల్‌తో సేదతీర్చాలనుకున్నాను. డబ్బు! డబ్బు! ఎంత సంపాదించాను. ఇపుడేం జరిగింది. నోరు వంకర పోయింది. కన్ను ఒంకరపోయింది. సరిగా నడవకుండా అయ్యింది.” మురళి గొంతు పూడుకుపోయింది.
మాధవి కళ్ళల్లో కూడా నీళ్ళొచ్చాయి. చీకట్లో మురళి చెయ్యి కోసం చూసింది. ఆ చెయ్యి సన్నగా వణకడం గమనించి రెండు చేతుల మధ్య గట్టిగా పట్టుకుని ”జరిగినవి తల్చుకుని బాధపడ్డంలో అర్థం లేరు. ఊరుకో మురళీ” అంది కానీ మాధవికి అతను అలా మాట్లాడటం బావుంది. తనెంత చెప్పినా విన్నాడా? ఎక్కడ డబ్బిస్తే అక్కడికల్లా జంప్ చేస్తూ, అదే జీవితంలా బతికిన మనిషి ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడు. మాట్లాడనీయ్ అనుకుంది.
”లేదు మధూ! నన్ను మాట్లాడనీయ్! నీతో ఇలా కూర్చుని మాట్లాడి ఎన్నో సంవత్సరాలయినట్టుంది. నేను నా ఇష్టమైనట్టు తిరుగుతూ, నీ సంగతేంటి అని ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను కదూ.”
”లేదు మురళీ! నువ్వెపుడూ ఇలాగే లేవు. నాకు ఇరవై సంవత్సరాల నాటి విషయాలు గుర్తొస్తున్నాయి. నిజానికి నేనెపుడూ వాటిని మర్చిపోయింది లేదనుకో.”
”ఏ విషయాలు? మనం కలిసి బతకడం మొదలుపెట్టిననాటి కష్టాలా? అవన్నీ ఇపుడెందుకులే మధూ.”
”ఆ విషయాలు కాదు. నాకు ఆపరేషన్ జరిగిననాటి సంగతులు. ఇరవై ఏళ్ళ క్రితం సడన్‌గా ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయించడం. మన దగ్గర డబ్బుల్లేని రోజుల్లో నువ్వు ఎంత కష్టపడి నాకు ఆపరేషన్ చేయించావో నేను ఎప్పుడూ మర్చిపోలేదు.”
”అదా! వాటినేం గుర్తు చేసుకుంటాంలే. అయినా నెలరోజులుగా నాకోసం నువ్వు చేసిందానిముందు అదెంత? డబ్బుల్లేక గాంధీ ఆసుపత్రిలో… ఎంత రిస్క్ తీస్కున్నాం.
”తప్పదు కదా! మనమున్న స్థితిలో గాంధీ ఆసుప్రతే కదా శరణ్యం. ఆపరేషన్ ఎక్కడ జరిగిందన్నది కాదు ముఖ్యం. నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలియదా? నేను హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు నువ్వెక్కడ ఉండేవాడివో నాకు తెలుసు. బాత్‌రూమ్‌ల పక్కన, జనరల్ వార్డుల పక్కన, రోడ్ల మీద… గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా వుంటుందో తెలుసుగా! ఈ నెల రోజులుగా నేను చేసిందేముంది? ఖరీదైన హాస్పిటల్. స్పెషల్ రూమ్. నిరంతరం సేవలు చేసింది నర్సులు. నేను కాదు కదా!”
”అది సరే! ఇన్ని సంవత్సరాలైనా నువ్వా విషయాలు మర్చిపోలేదా? నిజమే. నా జీవితంలో కష్టమైన కాలమది. నా స్థానంలో ఎవరున్నా అంతే చేస్తారు. నీకు హార్ట్‌లో పెద్ద రంధ్రముందని, వెంటనే ఆపరేషన్ చేయించాలని డాక్టర్లు చెప్పినపుడు నా బుర్ర మొద్దుబారిపోయింది. అప్పటికి అపోలోలు, కేర్‌లు ఎక్కడున్నాయి. గాంధీ చుట్టూ తిరిగాం. అబ్బో! భయంకరమైన రోజులవి.”
”నువ్వెంత మానసిక క్షోభను అనుభవించి వుంటావో నాకు తెలుసు. ఆపరేషన్ థియేటర్‌కి పంపుతూ నువ్వు ఏడుస్తుంటే, అప్పటికే సగం మత్తులోవున్న నేను కళ్ళు విప్పి నవ్వుతూ చెయ్యి ఊపుతుంటే కన్నీళ్ళమధ్య నవ్విన నీముఖం నాకిప్పటికీ కన్పిస్తుంటుంది మురళీ! నన్ను ఎంత అపురూపంగా చూసుకున్నావో ఎలా మర్చిపోగలను? నాకు పునర్జన్మని ఇచ్చింది నువ్వే కదా!”
”సరేలే! నేనేం చేసాను? అప్పట్లో డాక్టర్లు ఇంత కమర్షియల్‌గా లేరు. డా
సత్యనారాయణగారు గుర్తున్నారా? ఆయన టీమ్ కదా నిన్ను బతికించింది.”
”ఆయన్ని ఎలా మర్చిపోతాను. కంటికి రెప్పలా చూసాడాయన. డా
హరిప్రేమ్ గుర్తున్నారా? ఆ మధ్య రోడ్ ఏక్సిడెంట్‌లో చనిపోయారు.”
”అవును. చాలా అన్‌ఫార్చునేట్. పునర్జన్మ అన్నావ్ చూడు. నిజమే. హరిప్రేమ్ ఆపరేషన్ ప్రాసెస్ ఎలా వుంటుందో నాకు చెప్పాడు. సర్జరీ జరిగే టైమ్‌లో గుండెని కొట్టుకోవడం ఆపేసి, హార్ట్‌లంగ్ మిషన్‌కి అనుసంధానిస్తారట. ఆపరేషన్ అయ్యాక షాక్ ఇచ్చి గుండెని తిరిగి కొట్టుకునేలా చేస్తారట. ఒక్కోసారి షాకిచ్చినా గుండె తిరిగి కొట్టుకోదట. ఆయన నవ్వుతూ జోకులేస్తూ చెప్పినపుడు నేనెంత భయపడ్డానో తెలుసా మధూ!”
”ఈ విషయం నువ్వెపుడూ నాకు చెప్పలేదే! అంటే నిజంగానే నేను చచ్చి బతికానన్న మాట.”
”నిజానికి నేనీ విషయాలు తల్చుకోడానికి కూడా ఇష్టపడను. ఎంతో వేదన వుంది. ఏడుపుంది అందులో. మర్చిపోతేనే బెటర్ కదా!”
”లేదు. నేనలా అనుకోను. గతాన్ని మర్చిపోకూడదనే నేనను కుంటాను. అపుడే మన కాళ్ళు నేల మీద ఆనతాయి. మనం నడిచి వచ్చిన దారి స్పష్టంగా కనబడుతుంది.”
”నిజమే కానీ ఎన్నాళ్ళని ఆ కష్టాల అనుభవాలని మోస్తూ తిరుగుతాం. క్రమంగా నేను వాటినుండి బయట పడ్డాను. కసిగా, కచ్చగా డబ్బు వెంట పరుగెత్తాను. బహుశ మన మొదటి రోజుల్లోని కష్టాలే నన్ను పరుగెత్తించాయేమో. ఇపుడు మనకి డబ్బుకేం లోటు లేదు. పిల్లలు బాగా చదివారు. మంచి ఉద్యోగాలు. వాళ్ళు మనతో వుండి వుంటే బావుండేది.”
”అన్నీ వున్నాయ్ మురళీ! డబ్బుంది. మంచి ఇల్లుంది. పిల్లలు సెటిల్ అయ్యారు. కానీ మన మధ్య ఏం మిగిలింది? అంతులేని దూరం. ఒకే కప్పు కింద బతుకుతున్న పరాయితనం. నా పని నాకుంది కాబట్టి సరిపోయింది కానీ… నీ వెంటపడి… నీతో ఏం మిగలక మన జీవితాలు ఏమైవుండేవో!! నిజానికి నీ నిర్లక్ష్యం భరించలేకే నేను నాకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకున్నాను. నీతో పోట్లాడి పోట్లాడి నిన్ను మార్చలేక నేనే మారాను. నాకంటూ ఓ పనిని ఏర్పరచుకున్నాను. స్నేహితుల్తో గడపడం నేర్చుకున్నాను. నీ దారికడ్డురాకుండా నేను ఏం చేసినా నీకు ఫర్వాలేదు. ఒక విధంగా నేను నా మార్గాన్ని ఎంచుకునేలా పరోక్షంగా నువ్వే చేసావ్ మురళీ.”
”నువ్వన్నది నూటికి నూరుపాళ్ళు నిజం మధూ! బతుకుబండి వందమైళ్ళ వేగంతో పరుగెడుతున్నపుడు నాకు ఏమీ తెలియలేదు. శరీరాన్ని నా అంతగా ఎవరూ మిస్‌యూజ్ చేసి వుండరు. డబ్బు సంపాదించాను. ఆస్తులుగా మార్చాను. కానీ నా శరీరంలో ఏం జరుగుతోందో పట్టించుకోలేదు. ఆ రోజు క్లాసులో కుప్పకూలేవరకూ నేనేం చేస్తున్నానో ఎలా బతుకుతున్నాననే స్పృహే లేదు. నీ మాట ఏనాడైనా విన్నానా? నీకేం జరుగుతోంది? నువ్వేమవుతున్నావ్? ఊ… హూ… ఆలోచనే లేదు. ఆయాం సారీ మధూ.” మురళి గొంతు వొణికింది.
మాధవి కుర్చీలోంచి లేచి వచ్చి మురళి వెనక నిలబడి అతన్ని గుండెకు పొదుపుకుంది.
వర్షం కురుస్తూనే వుంది.
”మధూ! ఇంత దగ్గరితనం, ఈ ఆత్మీయత ఎంత మూర్ఖంగా కాలరాచాను. ఒక పొగరు, అహం. మనం ప్రేమించుకునే రోజుల్లో ఎంత స్నేహంగా వుండేవాళ్ళం. ఎంత దగ్గరగా వుండేవాళ్ళం. తర్వాతెందుకని అంత దూరంగా, అంటీ ముట్టనట్టయిపోతాం.”
పెద్దగా ఉరిమింది. కళ్ళు మిరిమిట్లు గొలిపే మెరుపులతో పాటు పిడుగులు పడిన చప్పుడు.
మనమే చేసుకుంటాం. మాట్లాడుకోవడం మానేసి పోట్లాడుకోవడం దినచర్యలా మనమే మార్చుకుంటాం. నువ్వే అన్నావ్ కదా! పొగర్లు. అహంకారాలు, ఆధిపత్యాలూ అన్నీ వచ్చేస్తాయ్ పెళ్ళిలోకి. ప్రేమికుడు మొగుడయ్యాకా కొరకరాని కొయ్యలా మారతాడు. నీలాగా” నవ్వింది.
”మొత్తం నావల్లే జరిగిందంటావా?”
”నావల్ల కూడా జరిగివుండొచ్చు. నీ లైఫ్‌స్టయిల్ భరించలేక నేనూ నిన్ను సాధించాను. తిట్టాను. ఒక స్టేజిలో వదిలేద్దామనుకున్నాను.”
”అవును గుర్తుంది. ఆరోజు మన మధ్య పెద్ద గొడవైంది.”
”నువ్వు జీతమెక్కువిస్తున్నారని విజయవాడకి పరుగెత్తావ్. ఆ విషయంలోనే మనకి గొడవైంది.”
”ఇంత తేలిగ్గా ఆలాంటి విషయాలని మాట్లాడుకోగలుగుతున్నాం ఇప్పుడు. ఇంతకాలం ఎందుకు మాట్లాడుకోలేకపోయాం.”
”కరెంటు పోయి చీకట్లో కూర్చున్నాం కదా! ఒకరి ముఖాలొకరం చూడ్డంలేదు కదా! అందుకేనేమో” అంది మాధవి నవ్వుతూ.
”నిజమే! ఎంత హాయిగా వుందిపుడు. మనసులో పెద్ద భారమేదో తొలిగిపోయినట్లుంది. రోజూ లైట్లాపేసి ఓ గంట చీకట్లో గడిపితే బావుండేట్టుంది.”
”అవునవును. జనాలకి కరెంటు కష్టాలు కూడా తీరతాయి. బిల్లులు తగ్గుతాయి. నువ్వు టాబ్లెట్లు వేసుకోవాలి. కొవ్వొత్తి వెలిగించాల్సిందే” మాధవి అంటుంటే కరెంట్ వచ్చింది. వెంటనే ఫోన్ కూడా మోగింది. మాధవి ఫోనందుకుంది. కూతురు శ్రావ్య అమెరికానుంచి. ఫోన్ మురళికిచ్చి టాబ్లెట్‌ల కోసం వెళ్ళింది.
”బావున్నానురా! ఐ యామ్ పర్‌ఫెక్ట్‌లీ ఆల్‌రైట్. ఏం చేస్తున్నామా? జోరుగా వానపడుతుంది. వేడి వేడి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నాం. నిజంరా. నమ్మకం కలగడం లేదు కదా! నాన్నేమిటి ఇంత ఆరామ్‌గా కూర్చుని అమ్మతో కబుర్లేమిటి అనుకుంటున్నావ్ కదా! సరే అమ్మనడుగు నేను చెప్పింది నమ్మకపోతే” మాధవికిచ్చాడు ఫోన్.
”తల్లీ! నాన్న చెప్పింది నిజమేనే. చాలా సంవత్సరాల తర్వాత మేం బోలెడు కబుర్లు చెప్పుకున్నాం. నాన్న బావున్నాడు. మా గురించి కంగారు పడకండి. నీకో రహస్యం చెప్పనా తల్లీ, మీ నాన్న నేను మళ్ళీ ప్రేమలో పడ్డట్టుగా వుంది.” శ్రావ్య నవ్వుతోంది. స్పీకర్ ఆన్ చేసింది మాధవి.
”కంగ్రాట్స్ నాన్నా! ఐయామ్ సో హేపీ. వెంటనే వచ్చెయ్యా లన్పిస్తోంది. నో… నో… రాను. ఎంజాయ్… ఈ మాట వెంటనే అన్న గాడికి చెప్పాలి బై… బై నాన్నా” శ్రావ్య ఫోన్ పెట్టేసింది.
మళ్ళీ ఇద్దరూ కబుర్లల్లో పడ్డారు. గడ్డకట్టిన మాటలన్నీ కరిగి వర్షం నీరులా ప్రవహించసాగాయి. ఆ ప్రవాహంలో తడిసి ముద్దవుతూ మరిన్ని మాటల్ని వెదజల్లుకుంటూ అలాగే కూర్చుండిపోయారు ఇద్దరూ!!