Sunday, June 14, 2009

సబర్మతిలో బావురుమంటున్న 'బా' గది!

  గుజరాత్‌లో అడుగుపెట్టగానే మానుతున్న గాయాన్ని ఎవరో కెలికినట్టయింది. మాకారు వడోదర మీదుగా వంద కిలోమీటర్ల వేగంతో ( ఎక్స్‌ప్రెస్‌ వేలో) పరుగెడుతున్నా ఏవో ఆర్తనాదాలు, అరుపులు, కేకలు చెవులపడుతున్నట్లే వుంది. గుజరాత్‌ గాయం అంత త్వరగా మానేది కాదు. ఈ బాధ గుండెల్ని పిండుతుండగానే మేం అహమ్మదాబాద్‌ చేరాం. అహమ్మదాబాద్‌లో అవీ ఇవీ చూశాక, కస్తూర్భా, గాంధీజీ చాలాకాలం నివసించిన సబర్మతీ ఆశ్రమం చూడ్డానికి వెళ్ళాం. గాంధీ జీవిత విశేషాలన్నీ వివరంగా రాసివున్న ఎగ్జిబిషన్‌ చూశాం. ఆయన జీవితంలో చోటు చేసుకున్న ప్రముఖ ఘట్టాలన్నింటినీ ఈ ప్రదర్శనలో చూపించారు. గాంధీజీ గదిలో ఆయన వడికిన రాట్నం చెక్కుచెదరకుండా వుంది. ఆయన కళ్ళజోడు, చేతికర్ర, చెప్పులు లాంటి వస్తు వులన్నింటినీ అద్భుతంగా అమర్చి ప్రదర్శనలో వుంచారు. అత్యంత నిరాడంబరుడైన వ్యక్తి వాడిన వస్తువులన్నీ అంతే సాదాసీదాగా వున్నాయి.
  ఒక్కొక్క గది చూసుకుంటూ వెళుతుంటే ' కస్తూర్భా గాంధీ గది' అని బోర్డు పెట్టి వున్న గది కనబడింది. ఆవిడకు చెందిన వస్తువులేమున్నాయో చూద్దామని ఆతృతగా గదిలోకి అడుగుపెట్టిన నేను అవాక్కై అలాగే నిలబడిపోయాను. 'కస్తూర్భా గాంధీ గది' అని తలుపుమీద రాయడం మినహా, ఆ ఒక్క చెక్కముక్క తప్ప ఆ గదిలో చిన్న పుల్ల ముక్క కూడా లేదు. కనీసం ఆ త్యాగమూర్తి ఫోటో కూడా ' ఆమె గది' లో లేదు. ఆవిడ వాడిన వస్తువులు , ఆమె ఇష్టపడిన సరంజామా కానీ ఆ గదిలో లేవు. ఖాళీ గది. బోసిపోయి బావురుమంటున్న గది. ' బా' రాట్నం వడికారు. అదేమైందో మరి? గాంధీజీ వస్తువుల్లాగా ఆమె ఉపయోగించిన వస్తువులు ఎన్నో వుండి వుంటాయి. అవన్నీ ఎక్కడ పారేసారో మరి?
  ఆ గదిని చూడగానే నాకు పట్టరాని కోపం వచ్చింది. బాధ కలిగింది. దుఃఖం తన్నుకొచ్చింది. ఒక పెద్ద ఉద్యమానికి సారథ్యం వహించిన వ్యక్తితో కలిసి బతికి, ఎన్నో కష్టాలు పడి, అతను ఏడిస్తే ఏడ్చి, నవ్వితే నవ్విన ఓ వ్యక్తికి ఇచ్చిన గౌరవం ఎంత గొప్పగా వుందో చూస్తే గుండె చెరువవకుండా ఎలా వుంటుంది? జాతి మొత్తానికి పితృసమానుడుగా భావిస్తూ ' జాతిపిత'గా గాంధీజీని గౌరవిస్తామే! మరి, ఆ 'జాతిపిత' సహచరి ' జాతి మాత' కాదా? బారతీయులందరికీ గాంధీజీ పితృ సమానుడైతే కస్తూర్బా మాతృసమానురాలు కాదా? అయితేనేం, పితృస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నాం కదా! అక్కడ తండ్రులకే గౌరవం. తల్లులకి ప్రత్యేక గౌరవాలక్కరలేదు అంటారు కాబోలు.
  నేను 'బా'కి జరిగిన అన్యాయం మీద ఎమోషనల్‌గా మాట్లాడుతుంటే ' ప్రతి చిన్న విషయానికి ఎందుకు వంకలు పెట్టడం? ప్రతిదాంట్లోకీ మీ ఫెమినిజం రావాల్సిందేనా? అనే కామెంట్‌ పుండుమీద కారం జల్లినట్లయింది. చరిత్ర పొడుగునా స్త్రీలకి ఎంత అన్యాయమైనా జరగనీ... మనం ప్రశ్నించకూడదన్నమాట. దుఃఖాన్ని వ్యక్తం యెయ్యడం అరవడం కిందకు వస్తుందన్నమాట. ఇంకో గమ్మత్తయిన విషయం ఏమిటంటే, కస్తూర్భాకి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడం గాంధీజీ పట్ల అపచారంగా ప్రచారమైనా ఆశ్చర్యపడనక్కరలేదు.ఎందుకంటే, తెలుగులో తొలికథ రాసింది భండారు అచ్చమాంబ అని సప్రమాణకంగా నిరూపించడం, గురజాడకి జరిగిన అవమానంగా కొందరు వ్యాఖ్యానించడం నాకు తెలుసు. గాంధీజీతో సమానంగా కస్తూర్బాకి గౌరవం ఇవ్వకపోవడాన్నీ, ఆమెకు సంబంధించిన చరిత్రని అందుబాటులో లేకుండా చేయడాన్నీ ఎవ్వరూ ప్రశ్నించకూడదు. గాంధీతో ఆవిడ కలిసివున్న ఫోటోలు బోలెడు వున్నాయిగా. ఇంకా ఈ ఏడుపెందుకు? అని ఒకాయన అన్నాడు కూడా.
 మాతో వచ్చిన ఇంకొకాయన ' మీరు కస్తూర్భాని గాంధీజీ నుంచి విడదీసి ఎందుకు చూస్తున్నారు? షీ ఈజ్‌ పార్ట్‌ ఆఫ్‌ గాంధీ కదా! అసలు ఆవిడకు ప్రత్యేకంగా ఓ గది ఎందుకు, మీలాంటి వాళ్ళు పోట్లాడ్డానికి తప్ప' అని కూడా అన్నాడు. అంటే ఆయన దృష్టిలో కస్తూర్బా ఒక వ్యక్తి కాదు. ఆమెకు తనకంటూ వ్యక్తిత్వం లేదు. ఆలోచనల్లేవు. అభిరుచుల్లేవు. గాంధీగారిలో ఒక పార్ట్‌ కనుక ఆయన ఆలోచనలే ఆమెవన్నమాట. ఓహోహో... ఎంత దూరం ఆలోచించి ఆమె గదిని ఒక శూన్యమంటపంలా వుంచారు! నా మట్టి బుర్రకు ఈ ఆలోచన తట్టనేలేదు. వ్యక్తిత్వమే లేనివాళ్ళకి, అసలు ఒక ఉనికే లేనివాళ్ళకి ఆమె గది అనీ, ఆమె జ్ఞాపకచిహ్నాలు అనీ వెతకడం నాలాటి ఆజ్ఞానులే చేస్తారని ఆ మిత్రుడు తేల్చిచెప్పాడు.
 నాకు హఠాత్తుగా 'అనూరాధ' అనే అద్బుతమైన సినిమాలోని ఒక డైలాగు గుర్తుకొచ్చింది. లీలానాయుడు ( హీరోయిన్‌) బలరాజ్‌ సహానీ ( హీరో) ని ఓ సందర్బంలో - ' నువ్వు నీ డాక్టర్‌ గిరీ తప్ప నన్ను గురించి పట్టించుకుని ఎంతకాలమైంది? నా పాటవిని ఎన్ని రోజులైంది? నా ఆశలూ, అభిరుచులూ ఏమైపోయాయో ఆలోచించావా? ' అని అడుగుతుంది. బలరాజ్‌ సహానీ ఆశ్చర్యపోయి, చాలా అమాయకంగా ' నీ ఆశలూ, అభిరుచులూనా? నీకు వేరే ఆశయాలూ, ఆశలూ వున్నాయని నాకు తెలియదే! నేను నిన్నెప్పుడూ నానుంచి విడదీసి చూడలేదు.నువ్వు నాలో ఐక్యమైపోయావనుకున్నాను' అంటాడు - నిజాయితీగానే.
 పైన పేర్కొన్న మితృడి వ్యాఖ్యానం కూడా దీనికిందకే వస్తుంది. చరిత్రకారులది కూడా ఇదే ధోరణి. చరిత్ర పుటల్నిండా పురుషులు, వారి వీరత్వాలు, శూరత్వాలు, ఎంతమంది భార్యలు, ఎంతమంది సంతానాలు... ఇవే వుంటాయి ఈ పురుష చరిత్రల్లో జనాభాలో సగం వుండే స్త్రీలుండరు. వారి జ్ఞాపక చిహ్నాలూ వుండవు. దీనికి 'జాతిమాత' కూడా మినహాయింపు కాదని సబర్మతీ ఆశ్రమం చూసాక అర్థమైంది.
 గాంధీజీని పెళ్ళి చేసుకుని, ఓ మహోద్యమంలో తనవంతు కృషి చేసి, ఎన్నో బాధలు పడి, ఆయన చేసిన ప్రయోగాల నేపథ్యంలో ఎంతో మానసిక సంఠర్షణను అనుభవించిన కస్తూర్భాకి మనమిచ్చిన గౌరవం ఒక ఖాళీ గది. కనీసం ఆమె ఫోటోకైనా నోచుకోని ఓ శూన్యగది. గాంధీజీతో పాటు ఆమెకూడా కళ్ళజోడు పెట్టుకుంది.చెప్పులు వేసుకుంది. రాట్నం వొడికింది. కర్ర కూడా వుండే వుంటుంది. కానీ అవేవీ అంత విలువైనవి కావు. గౌరవవార్హమైనవి కావు. ప్రదర్శించాల్సినంత 'పవిత్రమైనవి' కావు. వేల సంవత్సరాలుగా స్త్రీలకు జరిగిన అన్యాయమే 'బా'కు కూడా జరిగింది. ప్రపంచం ' మహాత్మునిగా' కొనియాడే వ్యక్తికి భార్య అవుగాక, వ్యక్తిత్వం తొణికిసలాడే సంపూర్ణ మానవి అవుగాక, అయితేనేం, ఆమె స్త్రీ మాత్రమే. గాంధీగారి నీడ మాత్రమే. దీనినే అక్షరాలా ఆచరించి చూపించారు సబర్మతీ ఆశ్రమ నిర్వాహకులు.

11 comments:

GKK said...

ప్రతి ఒక్కరు వాడిన వస్తువులు దాచాలంటే అయ్యే పని కాదు. అసలు గాంధీజీ వాడిన వస్తువులు కూడా ఎన్నాళ్ళని దాయగలం? ఎందుకు దాచాలి? ఎవరు పోయినా వాళ్ళ చెప్పులు, బట్టలు, etc దాచాలనుకోవటం అవివేకం. అనవసరం. ఇది నా అభిప్రాయం మాత్రమే.

జీడిపప్పు said...

" ఆ 'జాతిపిత' సహచరి ' జాతి మాత' కాదా? "
పరాకాష్ట అంటే ఇదే మరి. ఈ లెఖ్ఖన మా గురువు గారు చెప్పినట్టు గాంధీజీ బావమరిదిని "జాతి బావమరిది" అనాలా? దేశమంతటా కస్తూరిబా పేరుతో కాలేజీలు, హాస్టల్లు మరెన్నో సంస్థలు ఉన్నాయి. ఇంతకంటే ఇంకేమి గౌరవం కావాలి "జాతి మాత" కు?

Kathi Mahesh Kumar said...

మీ బాధ సహేతుకంగానీ, మీవాదనలో ఏదో లోపముంది.

పునర్వసు said...

తెలుగు అభిమాని గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. అయితే ఈ సాంప్రదాయం ఎందుకు మొదలయిందో కొంచెం ఆలోచిద్దాం.

తమ తరంలో సమాజానికి మేలు చేకూర్చినవారు, సమాజానికి మార్గదర్శకులుగా ఉన్నవారిని తర్వాతి తరాలకు ఆదర్శంగా చూపడానికి ఇదొక పద్దతి కావచ్చు. పూర్వం వాటికి గుడులు, చైత్యాలు ( బౌద్దమతం), చర్చిలు కట్టెవారు.

అవి నిజానికి తక్కువ ఇబ్బంది కలిగించేవే, సమాదులతొ పోలిస్తే.
ఒక ప్రయోజనాన్ని మాత్రం గ్రహించాను. కొన్ని తరాల తర్వాత కత్తి మహేష్ కుమార్ గారి లాంటి వారు, గాంధీజీ కేవలం ఊహే అంటే కనీసం సాక్షానికి పనికివస్తుంది. వారు వేరొక బ్లాగుకు సమాదానంలో రాముడు కేవలం పురాణ పురుషుడే కాని చారిత్రక ఆదారాలేవి లేవు కదా అని వ్రాశారు. గాంధీజీకి ఆ గతి పట్టకుండా ఉండాడానికి ఐనా ఈ సాంప్రదాయం ఉపయోగకరం.

Vinay Chakravarthi.Gogineni said...

i agree with jeedi pappugaaru

nijam gaane ada maganu veru chesi neelanti vallanu choostunte..........

bonagiri said...

కస్తూరిబా గది ఖాళీగా ఉండడం అన్యాయమే ఎవరూ కాదనరు.

కాని ఇక్కడ ఆడా మగా తేడాలు ఎందుకు వచ్చాయి?

నెంబర్ 1 సఫ్దర్ జంగ్ రోడ్డులోని ఇందిరా గాంధి మ్యూజియంలో ఫిరోజ్ గాంధికి ఎంత విలువ ఇచ్చారు?
సరోజిని నాయుడు, పి టి ఉష, ప్రతిభా పాటిల్ లాంటి వాళ్ళ భర్తల గురించి ఎంత మందికి తెలుసు?

విజేతలకే ప్రముఖ స్థానం ఉండడం తప్పేమి కాదు.

అయినా కస్తూరిబా గురించి అందరికీ తెలుసు.

The Brahmin Times said...

గాంధీతో ఐడెంటిఫై చేసుకునే మగవాళ్ళు దేశంలో చాలా తక్కువ. అసలు లేరేమో కూడా ! ఇక ఉద్దేశపూర్వకంగా ఆయన్ని హైలైట్ చేశి, కస్తూరిబాని కావాలని నిర్లక్ష్యం చెయ్యడం కూడానా ? భర్తతో సమానంగా గుర్తింపు కావాలని కస్తూరిబా ఎప్పుడైనా పోరాడిందా ? లేదు కదా ! మరి మీరెందుకు ఆవిడతో మరీ అంత ఎక్కువ ఐడెంటిఫై అవుతున్నారు ? ఒకవేళ గాంధీకి జనం గుర్తింపు ఇవ్వడం మానేస్తే కస్తూరిబాకి న్యాయం జరుగుతుందని ఆశిద్దామా ? అసలు వ్యక్తుల సంగతి పక్కన బెట్టి "వాళ్ళ భర్తలెవరు ? భార్యలెవరు ? వాళ్ళకి గుర్తింపు లభిస్తోందా ? లేదా ? " అని ఆలోచిస్తే ఉపయోగం ఏముంది ?

(ముందో వెనకో జనం గాంధీని దేశంలోంచి వెళ్ఖ్ఖగొట్టడం ఖాయం. బుద్ధుడికి పట్టిన గతే గాంధీకి కూడా పడితే ఆశ్చర్యపోనవసరం లేదు)

maa godavari said...

నా వ్యాసానికి స్పందించిన మీ అందరికి ధన్యవాదాలు.
నేను గాంధీ వస్తువుల్ని గాని మరెవ్వరి వస్తువుల్ని గానీ
సంవత్సరాల తరబడి దాచిపెట్టాలని అనుకోవడం లేదు.
నిజానికి నాకు ఢిల్లీ ని చూస్తే ఓ పెద్ద స్మశానం లాగా (లెక్కకు మించిన సమాధులతో)అనిపిస్తుంది.
కస్తూరిబా కు ఓ గది కేటాయించిన వాళ్ళు ఆమె వస్తువుల్ని అక్కడ ఉంచొచ్చు కదా అన్నదే నా వాదన.ఆమె గారి వస్తువుల్ని మ్యుజియం లో లాగా ప్రదర్శించాలన్నది నా అభిమతం కాదు.

The Brahmin Times said...

"....ముందో వెనకో జనం గాంధీని దేశంలోంచి వెళ్ఖ్ఖగొట్టడం ఖాయం. బుద్ధుడికి పట్టిన గతే గాంధీకి కూడా పడితే ఆశ్చర్యపోనవసరం లేదు..."

నేనీ మాట రాయకుండా ఉండాల్సింది. ఇది ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి. గాంధీగారి పట్లా, బుద్ధుడి పట్లా నాకు గౌరవభావమే ఉన్నది. నా అసలు ఉద్దేశం - ఈ దేశపు జనానికి బుద్ధభగవానుణ్ణి అర్థం చేసుకోవడం ఎట్లా చేతకాలేదో గాంధీగారిని అర్థం చేసుకోవడం కూడా అట్లానే చేతకాలేదని చెప్పడం మాత్రమే.

చదువరి said...

ఆ ఎక్స్‌ప్రెస్‌వేలో ఇంకాస్త స్పీడుతో పోతే ఆ ఆర్తనాదాలు వినబడుండేవి కావేమో! గుజరాతు దాకా వెళ్ళడంతో గాయాన్ని కెలికినట్టవడం మీపై నాకు జాలి కలిగించింది. అయితే గాయాన్ని కెలుక్కోవడం కోసమే గుజరాతు వెళ్ళేవాళ్ళకంటే అది కాస్త నయమేననుకోండి -అది ఝాలి కలిగిస్తుంది.

ఇలాటి "రేగిన గాయాల" కథలను వింటున్నప్పుడు, గుజరాతులోనే ఉండేవాళ్ళ సంగతేంటా అని తలపుకొచ్చి.. పాపం ఆ గాలి పీలుస్తూ, ఆ రోడ్ల మీద నడుస్తూ, ఆ రైళ్ళలో, బస్సుల్లో ప్రయాణాలు చేస్తూ, ఎక్స్‌ప్రెస్‌వేల మీద పోతూ,.. పాపం, ప్రతీరోజూ గాయం కెలుక్కుంటూంటారే.. ఎంత కష్టమో వాళ్ళకు!!

"గుజరాత్‌ గాయం అంత త్వరగా మానేది కాదు." -అవును, మానేది కాదు. మనం మాననివ్వం!!

Varunudu said...

మగ, ఆడ అని ఇంకా ఎన్నేళ్ళు పోరాడాలంటారు? మంచి చేసినప్పుడు ఆ చేసింది మగ ఐనా, ఆడ ఐనా సమానంగా గౌరవించిందీ సమాజం. చర్య ను వదిలేసి గతించిన విషయాల్లో ఎవరికో అన్యాయం జరిగింది అనడం..మొత్తం స్త్రీ జాతికే తీరని అవమానం అనడం.. నా ఉద్దేశ్యం లో అజ్ఞానం !

నిందాపూరితమైన విమర్శ కన్నా, నిర్మాణాత్మక ఆచరణ ముఖ్యం..

గాంధీ వస్తువులు ఉన్నాయి.. కస్తుర్బా వస్తువులు లేవు అని ఆలోచించే కంటే, ఒక లీడర్ గా గాంధీ గారు ఎన్నుకొన్న పంధా కు ఆవిడ అందించిన సహయా సహకారాన్ని ఆదర్శం గా తీసుకోవాలి గానీ, ఆయనకు సేవ చేసింది కాబట్టి ఇద్దరూ ఒకటే అనడం హాస్యస్పదం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే.. అక్కినేని గారికి దాదాసాహెబ్ అవార్డ్ వచ్చిందంటే.. అన్నపూర్ణ గారి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి, ఆమెకు కూడా పనిలో పని గా అదే అవార్డ్ ఇవ్వలి...(అలా ఇవ్వక పోవడం మొత్తం స్త్రీ జాతికే అవమానం.. ఎన్నేళ్ళు ఈ దాస్య శృంఖలాలు? అంటే ఎలా ఉంటుంది.. చిర్రెత్తదూ?) అక్కినేని షూటింగ్ కు వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు (నాగార్జున, వెంకట్) అల్లరి చెయ్యలేదు కాబట్టి వాళ్ళకూ ఇవ్వాలి అంటూ వాదించుకొంటూ పొతే దేశం మొత్తం ఇలా గుళ్ళూ గోపురాలే మిగుల్తాయి.

గాంధీ గారు సమాజ సేవకుడు.. అందుకే భారత జాతి ఆయనను గౌరవిస్తుంది.. గాంధీ గారికి ఆ ఉనికే లేకుంటే.. కస్తూర్బా ఎవరో కూడా జనానికి తెలీదు. అలా అని ఆవిడ గురించి తక్కువ చెయ్యడం లేదు. వ్యక్తి గా గాంధీ గారి జీవితం లో ఆవిడ ఒక భాగం.. తన కర్తవ్యం భార్యగా తను నిర్వహించింది. ఆ కర్తవ్యం ప్రతీ భార్యా చేసేదే.. ఇందాక ఎవరో అన్నట్టు.. ఇందిరా గాంధీ పేరిట అనేకం ఉన్నాయి. పాపం ఫిరోజ్ కు లేదే అని ఒక సారి ఆయినా గుండే కలుక్కు మనలేదా మీకు.. ?

సో లీడర్ ఎవరైనా సమాజం లో గుర్తింపు ఉంటుంది - వారు చేసే పనుల్లో సామాజిక పరమైన స్పృహ ఉంటుంది కనుక. వారి జీవిత భాగస్వాములను కూడా ప్రజలు అదే స్థాయిలో గుర్తించాల్సిన అవసరం లేదు గాక లేదు..

నొప్పించింటే మన్నించండి. కానీ నా దృక్పథం చేప్పాను అంతే..

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...