తొలి తెలుగు కథా రచయిత్రి భండారు అచ్చమాంబ

స్త్రీల సాహిత్య చరిత్రను తవ్వుకుంటూ పోతే ఎన్నెన్నో మణులు, మాణిక్యాలు దొరుకుతాయి. ఇంత కాలం మట్టిలో కూరుకు పోయి ఉన్న వజ్రాల్ని సాన పెడితే వాటి ధగ ధగలముందు మిగిలినవన్నీ వెల వెలా పోవాల్సిందే. భండారు అచ్చమాంబలాంటి ప్రతిభావంతులెందరో చరిత్ర చీకటిలో మినుకు మినుకు మంటున్నారు. స్త్రీవాద చైతన్యంతో, స్త్రీల దృష్టికోణంతో మనం ఈ రోజు స్త్రీలను అంచులకు నెట్టేసిన సాహిత్య చరిత్రను తిరిగిరాయాల్సి వుంది. ఇక్కడ గమ్మతైన విషయం ఏమిటంటే ''ఆధునిక మహిళ స్త్రీల చరిత్రను తిరగ రాస్తుంది.'' అని చెప్పిన గురజాడే తొలి కథకురాలు అచ్చమాంబకి పోటీగా నిలవడం. గురజాడ మీద అత్యంత గౌరంవంతోనే నేను తొలి తెలుగు కథా రచయిత్రి అచ్చమాంబే అని సగర్వంగా, సాధికారంగా ప్రకటిస్తున్నాను.

అచ్చమాంబ రాసిన మొదటి కథ 'ధన త్రయోదశి'. దీనిని 1902 నవంబరు నెలలో 'హిందూ సుందరి' లో ప్రచురించారు. ఈ కథలో ఇతి వృత్తం ఆధునికమైనదే. కథా నాయకి విజయలక్ష్మమ్మ. కథా స్థలం బొంబాయి. దీపావళి రోజు సాయంత్రం ఒక్కర్తీ కూర్చుని ఆలోచనల్లో మునిగిన విజయలక్ష్మమ్మ పేదరికంవల్ల కనీసం దీపాలు కూడా వెలిగించలేక పోయానే, పిల్లలకి టపాసులు కొనియ్య లేకపోయానే అని తలుస్తూ బాధపడుతూ వుంటుంది. ఆమె భర్త ఒక బట్టల కొట్టులో పని చేస్తూ వుంటాడు. నెలకు పది రూపాయల జీతంతో ఆ కుటుంబం చాలా కష్టాలు పడుతుంటుంది. ఆ బట్టల కొట్టులోని పెద్ద గుమాస్తా విజయలక్ష్మమ్మ భర్త వెంకటరత్నాన్ని ప్రలోభ పెట్టి షాపు ఇనప్పెట్టేలోంచి సొమ్ము సంగ్రహిద్దామని చెబుతాడు. వెంకటరత్నం మొదట ఒప్పుకోడు. ఆలోచించి చెబుతానంటాడు. ఈ విషయం కనిపెట్టిన విజయలక్ష్మి భర్తను మందలిస్తుంది. దొంగతనం చేసిన సొమ్ము నాకు వద్దంటుంది. పెద్ద గుమాస్తా ఇచ్చిన వంద నోటును తిరిగి ఇప్పించేస్తుంది. కథ చివరలో సేటు వెంకటరత్నాన్ని మెచ్చుకుని నిన్ను పరీక్షించడానికే ఈ నాటకం ఆడామని చెప్పి అతని జీతం పెంచుతాడు. ఇది 'ధన త్రయోదశి' లోని కథ. 'దిద్దుబాటు' కథలో కథాంశం కూడా భర్తను సంస్కరించడమే. ధనత్రయోదశిలో కూడా అదే కథాంశం. అంతేకాకుండా దిద్దుబాటు కథ ఆదర్శపూరితంగాను, హాస్యంగాను వుంటే అచ్చమాంబ కథ గంభీరంగా, వాస్తవికంగా వుంటుంది. గురజాడ కన్నా పదేళ్ళ ముందే ఇలాంటి కథ రాసిన అచ్చమాంబను సాహిత్య కారులు ఉద్దేశ్యపూర్వకంగానే తెర వెనక్కి నెట్టేసారు.
ఈ తెరల్ని చీల్చి నిజాల్ని బయటపెట్టి భండారు అచ్చమాంబను రంగం మీదికి తీసుకు వచ్చినది కె. లలిత. వుమెన్‌ రైటింగు ఇన్‌ ఇండియా పుస్తకాన్ని ఎడిట్‌ చేస్తున్న సందర్భంలో మొట్ట మొదటగా లలిత ఈ అంశాన్ని పేర్కొన్నది. అచ్చమాంబను తొలి తెలుగు కథకురాలుగానే కాక 'ప్రధమ స్త్రీవాద చరిత్ర కారణిగా ప్రకటించినది కూడా ఆమెనే. ఫిబ్రవరి 27 - మార్చి 1 వరకు 1998 లో ' భూమిక, అన్వేషి ఆధ్యర్యంలో ''తెలుగు కథ, నిర్మాణం, పరిధి, వైవిధ్యం'' పేరుతో నడిచిన మూడు రోజుల కథా వర్క్‌ షాప్‌లో లలిత తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ''సంఘ సంస్కరణోద్యమం - స్త్రీల కథలు'' అంశం మీద ప్రసంగిస్తూ లలిత, 1910లో వచ్చిన గురజాడ కథ మొదటి ఆధునిక కథ అంటున్నారు విమర్శకులు. కానీ 1902లో అచ్చమాంబ రాసిన ''ధనత్రయోదశి'' ఎందుకు మొదటి కథగా పరిగణించడం లేదు అని ప్రశ్నించారు. ఆ తర్వాత డా. భార్గవీరావు సంకలనం చేసిన నూరేళ్ళ పంట '' కథల సంకలనంలో ప్రచురించిన స్త్రీవిద్య మొదటి కథ కాదు. ''ధనత్రయోదశి నే మొదటి కథగా చెప్పుకోవాలి''
అయితే ఈ కథని తొలి కథగా ఒప్పుకోకపోవడానికి విమర్శకులు చెబుతున్న కారణాలు రెండు. ఒకటి కథ గ్రాంధిక భాషలో వుంది. రెండు ఆధునిక కథకుండాల్సిన లక్షణాలు లేవు. గురజాడ దిద్దుబాటును మొదట గ్రాంధిక భాషలోనే రాసి తర్వాత సరళ గ్రాంధిక భాషలోకి మార్చినట్టుగా తెలియ చెప్పే ఆధారాలు మన ముందున్నాయి. గురజాడ 'కమిలిని' పేరుతో రాసిన ఈ కథని అవసరాల సూర్యారావుగారు 'అణిముత్యాలు' కథా సంకలనంలో ముద్రించారు. ఇది గ్రాంధిక భాషలోనే వుంది.

రెండోది కథకుండాల్సిన లక్షణాలు లేవనేది. ఈ కథ రాసిన నాటి చారిత్రిక నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే ఈ మాట రాదు. సాహిత్య ప్రక్రియగా ప్రపంచ సాహిత్య చరిత్రలో కథ పుట్టిందే 19 శతాబ్దంలో. కథకు ఉండవలసిన లక్షణాలు స్థిర పడుతున్న సందర్భం. ఈ నేపథ్యంలోంచి చూడాల్సిన అవసరం వుంది. అయితే ఒక స్త్రీని ఒకానొక నూతన సాహిత్య ప్రక్రియకి ఆద్యురాలుగా ఆంగీకరించలేకపోయిన తెలుగు సాహిత్య విమర్శకులు చాలా తెలివిగా పై రెండు అంశాలను చూపించి అచ్చమాంబ తొలి కథకురాలు కాదు పొమ్మన్నారు. లేదా పట్టించుకోకుండా వదిలేసారు.

''కథా శిల్పం'' పేరుతో కథ మీద సిద్ధాంత గ్రంధం లాంటిది రాసిన వల్లంపాటి వెంకట సుబ్బయ్య అచ్చమాంబ కథని కనీసం స్పృశించకుండా, చాలా తెలివిగా ''తెలుగులో మొట్ట మొదటి కథ ఏది అన్న వివాదాన్ని కథా సాహిత్య చరిత్ర కారులకు వదిలి పెట్టి గురజాడ 'దిద్దుబాటు' మొదటి కథ అన్న పరికల్పనతో తెలుగు కథా పరిణామాన్ని గురించి ఆలోచిద్దాం'' అంటూ దాటవేసారు. ఎవరి కథ మొదటిది అనే అంశాన్ని పక్కకు పెట్టినా 'ధనత్రయోదశి' కథలోని మంచి చెడ్డల్ని గురించి ప్రస్తావించడం కూడా ఆయనకు ఇష్టం లేకపోయింది.
 ''తొంభై ఏళ్ళ తెలుగు కథ'' పుస్తకంలో కూడా పెదిభొట్ల సుబ్బరామయ్య, భమిడిపాటి జగన్నాధరావులు కూడా కథ గురించి విపులంగా చర్చిస్తూ భండారు అచ్చమాంబ గురించి ఒక్క మాట కూడా రాయలేదు. అంతెందుకు. ఇటీవల విశాలాంధ్ర పబ్లిషింగు హౌస్‌ వారు '' తెలుగు కథకులు - కథన రీతులు'' పేరుతో వరుసగా మూడు పుస్తకాలు ప్రచురించారు. సింగమనేని నారాయణ, మధురాంతకం రాజారామ్‌లు ఎడిటర్లుగా వ్యవహరించిన ఈ పుస్తకాలలోని మొదటి సంపుటిలో గురజాడ అప్పారావు గురించి రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు రాసిన వ్యాసం వుంది. అయితే భండారు అచ్చమాంబను తొలి కథా రచయితగా ఒప్పుకోలేక పోయినా అచ్చమాంబ కథల గురించి, కథన రీతులు గురించిన వ్యాసం రాయించేంత విశాల హృదయం వుండకపోయినా ఆవిడ గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదా? ఆవిడ రాసిన కథల్లో ఆధునిక లక్షణాలు లేవని కొట్టి పారేయడం కాకుండా వాటి మంచి చెడ్డల్ని సమీక్షించాలన్న ఆలోచన లేకపోవడం వెనుక వున్నదంతా పురుషాధిపత్యమే అని అనుకోవాల్సిన పరిస్థితుల్ని వారే కల్పించినట్లు అవ్వలేదా? అయితే ఇటీవల కాత్యాయని విద్మహే సంపాదకత్వంలో వెలవడిన '' తెలుగులో స్త్రీల సాహిత్యం'' 20 వ శతాబ్ది రాజకీయార్ధిక పరిణామాలు'' పుస్తకంలోని ఒక పేరాను ప్రస్తావించి ఈ తొలి కథ ఎవరు రాసారన్న చర్చను ముగిస్తాను. ఈ పుస్తకంలోని అవగాహన పత్రం వ్యాసంలో కాత్యాయని ఇలా పేర్కొన్నారు.
 '' స్త్రీల సాహిత్య అధ్యయనానికి రాజకీయ అర్థశాస్త్ర దృక్పధం స్వీకరించవలసిన సిద్ధాంతం''. నిర్ధిష్ట చారిత్రక రాజకీయార్ధిక పరిణామాల నేపధ్యంలో దానిని పరిశీలించటం పద్ధతి. స్త్రీల సాహిత్య అధ్యయనానికి ప్రాతిపదికలు-
1. స్త్రీలు ఎంత సాహిత్యాన్ని సృష్టించారని కానీ ఎంత బాగా వ్రాసారని కానీ కాక అసలు వాళ్ళేం వ్రాసారో, ఎందుకు వ్రాసారో, ఎందుకు వ్రాయలేకపోయారో చూడాలి.
 2. పితృస్వామిక సామాజిక అధికారిక సంబంధాలలో అణిచివేతకు గురయిన వర్గం సృస్టించిన సాహిత్యంగా స్త్రీల సాహిత్య ప్రత్యేకతను గురించి పరిశీలించి విలువ కట్టాలి.
 3. స్త్రీల సాహిత్యాన్ని విలువ కట్టడంలో ఆ సాహిత్యం వచ్చిన కాలం నాటి మొత్తం సమాజపు స్థితి, అందులో స్త్రీల కున్న అవకాశాల నుండి వాళ్లు పొందిన చైతన్య స్థాయి ప్రాతిపదికలు కావాలి.
 సాహిత్యాన్ని తూకం వేయడానికి ఇంతకాలం పురుషులు వాడిన ప్రాతిపదికలు సాహిత్యాన్ని పురుష దృష్టి కోణం నుంచి అంచనా వేయడానికే పనికి వచ్చాయి. స్త్రీల ప్రత్యేక పరిస్థితుల గురించిన అవగాహన లేకపోవడమో లేక స్త్రీలను ముందుంచడం ఇష్టం లేకనో ఇంతకాలం స్త్రీల సాహిత్య చరిత్ర గురించి ఖచ్చితమైన, సవ్యమైన దిశలో అధ్యయనం లేకుండా పోయింది. పురుషాధిపత్యం, పితృస్వామ్యం అద్దాల్లోంచే స్త్రీల సాహిత్యాన్ని చూడడానికి అలవాటు పడిన విమర్శకులు, సాహిత్య చరిత్ర కారులు ఇకనైనా నిజాల్ని చూడటానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ, అచ్చమాంబను తొలి తెలుగు కథకురాలిగా, ప్రధమ స్త్రీవాద చరిత్ర కారిణిగా బలంగా ప్రతిపాదిస్తూ ఆవిడ రచనల్లో జండర్‌ స్పృహ గురించి వివరిస్తాను.
 అచ్చమాంబ 1874 వ సంవత్సరంలో కృష్ణాజిల్లా నందిగామలో పెనుగంచిప్రోలు గ్రామంలో పుట్టింది. ఈమెకు ఆరేళ్ళ వయసపుడే తండ్రి చనిపోయాడు. 10వ ఏటనే ఈమెకు పెళ్ళయ్యింది. పెళ్ళయ్యే నాటికి అచ్చమాంబ ఏమి చదువుకోలేదు. ఆమె తల్లి, తమ్ముడు కూడా ఆమెతో పాటే ఉండేవారు. ఆమె తమ్ముడికి చదువు చెప్పించారు కానీ ఈమెను ఎవరూ ప్రోత్సహించలేదు. తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ తెలుగు, హిందీ నేర్చుకొన్నది. చదువు విషయంలో చిన్నతనంలోనే కుటుంబంలో వివక్షకు గురయిన అచ్చమాంబకు చదువు విలువ బాగా తెలుసు. తన తమ్ముడు ఎమ్‌. ఏ చదవగలగటం తాను కనీసం ఇంగ్లీషు అక్షరాలను కూడా నేర్చుకోలేక పోవడం వెనుక వున్న లింగవివక్షని అర్థం చేసుకున్నది కాబట్టే ఈ విషయం మీద చాలా సార్లు తన రచనల్లో ప్రస్తావించింది.
అచ్చమాంబ తాను ఎందుకు చదువుకోలేకపోయిందో తన తమ్ముడుపై చదువులు ఎలా చదవగలిగాడో అర్థం చేసుకున్నది కాబట్టే 'అబలా సచ్చరిత్ర రత్నమాల'లో ఇలా రాసింది.
 '' స్త్రీల బుద్ధి పురుష బుద్ధి కన్న మందమనియు, స్త్రీల మెదడు మస్తిష్కము, పురుషుల మస్తిష్కము మెదడు కన్న బలహీనమగుటచే దక్కువ తూగుననియు వ్రాయు వ్రాత బక్షపాతము కలదనుట నిర్వివాదమే- స్త్రీలు నైసర్గిక మూఢురాండ్రనుటకంటె బాల్యము నుండియు వారికి విద్యాగంధమే సోకనియ్యనందున మూఢురాండ్రుగా నున్నారనుట మంచిది- చిన్నతనమున బాలురు బాలికలు సమబుద్ది కలవారుగా నున్నను శాస్త్ర విషయముల బ్రేశ పెట్టనందున బురుషులు జ్ఞానాధికులును ఎట్టి తెలివిగలదైనను కన్న తల్లిదండ్రులే యామెను పైకి రానీయక మూల మూలల నగణదొక్కుటచే బాలిక మూర్ఖురాలును అగుచున్నవారు. స్త్రీ యభివృద్ధి లేకుండుటకిట్లు మగవారి పక్షపాతమే మూలం కాని మరోకటి కాదు. పురుషులా పక్షపాతమును విడిచిరేని స్త్రీలు విద్యావతులయి భర్తలకర్ధాంగులన్న నామును సార్దకము జేతురని నా నమ్మకం''.
 భారత వీర నారీ మణుల జీవిత సంగ్రహములను రాయడానికి ' అబలా సచ్చరిత్ర రత్నమాల' అనే పేరుతో రాసిన గ్రంధం గురించి అందరికీ తెలుసు. ఈ పుస్తకానికి రాసిన ఉపోద్ఘాతం చదివినపుడు అచ్చమాంబలో జండర్‌స్పృహ ఎంత వుందో అర్థమౌతుంది.
 ఆ పుస్తకం రాయడం వెనుక వున్న ముఖ్యోద్దేశ్యం గురించి
1. '' స్త్రీలు అబబలనియు, బుద్ధి హీనులనియు వివేకశూన్యులనియు, సకల దుర్గుణములకు -నివాస స్థలమనియు గొందరు నిందింతురు. స్త్రీలపయిన మోపబడిన ఈ దోషారోపణములన్నియు నబద్ధములనియు స్త్రీలలో నత్యంత శౌర్యధైర్యవతులును, అసామాన్య విద్యావిభూషితులునూ... బూర్యముండిరనియు, నిపుడున్నారనియూ స్థాపించుట నా మొదటి యుద్దేశము''
2.'' స్త్రీలకు విద్య నేర్పిన యెడలను, వారికి స్వాతంత్య్రమోసగిన యెడలను, వారు చెడిపోవుదురనియు, బతుల నవమానించెదరనియు, గుటుంబ సౌఖ్యమును నాశనము చేసేదరనియు గొందరు మహానుభావులు వక్కాణించెదరు. ఈ యారోపణములన్నియు నిరర్థకములనియు, స్త్రీవిద్య దురాచార ప్రతీకారానుకూలమగునే కాని దురాచార ప్రవృత్త్యనుకూలము గానేరదనియు స్త్రీ విద్యా స్వాతంత్య్రముల వలన దేశమునకు లాభమే గాని నష్టముంగలుగనేరదనియు, స్త్రీ విద్య యత్యంతావశ్యకంబనియు సోదాహరణ పూర్వకంగా నిరూపించుట నా ద్వితీయోద్దేశ్యము'' అని రాసుకున్నారు అచ్చమాంబ.
 'అబలా సచ్చరిత్ర రత్నమాల' గ్రంధంలో భారతదేశంలో వివిధ రంగాలలో ప్రసిద్ధులైన 34 మంది స్త్రీల సంగ్రహ చరిత్ర వుంది. ఒక్కొక్క స్త్రీ గురించి వివరిస్తూ అచ్చమాంబ తాను ఉపోద్ఘాతంలో రాసుకున్న తన ఉద్దేశ్యాలను బల పరుచుకుంటూ రాయడం కన్పిస్తుంది.
ఈ గ్రంధంలోని మొట్ట మొదటి కథ వీరమతి గురించి వుంది. ఈ కథా ప్రారంభం ఇలా వుంది.
 ''స్త్రీయ...స్తధా...'' ఈ సంస్కృత శ్లోకానికి అర్థం పురుషుల వలె ధైర్యము నవలంభించి, భీతి చెందక సర్వ కార్యములను నిర్వహంచునటుల స్త్రీలకు విద్య నేర్పవలయును.''
అచ్చమాంబ ఏది రాసినా సమయానుకూలంగా స్త్రీలకు విద్య ఎంత అవసరమో, విద్య లేకపోతే స్త్రీలు ఎలా వెనుకబడిపోతారో సోదాహరణంగా చెబుతుంది.
 మన దేశంలో ఆడపిల్లల్ని హీనంగా, తక్కువ చేసి చూడడం గురించి అచ్చమాంబ ఎపుడూ బాధపడుతుండేది. అబలా సచ్చరిత్ర రత్నమాల గ్రంధంలో ప్రముఖ కవయిత్రి తోరుదత్తు గురించి రాస్తూ, తోరూదత్తు తండ్రి ఆమెను పుత్రునివలె పెంచడం గురించి, చదువు చెప్పించడం గురించి ఇలా అంటుంది.
''పుత్రికలను పుత్రుల వలె జూచుటయే శాస్త్ర ధర్మం. కన్యా వివాహ సమయమందు దండ్రి ''పుత్రవత్పాలితామయా'' ''పుత్రునివలె నాచే పెంచబడిన కన్య'' అని చెప్పుట సర్వసిద్ధమే కదా''!
 ఆడపిల్లలను పుట్టిన దగ్గర నుండి వివక్షతో పెంచడం గురించి అదే వ్యాసంలో
 '' మన దేశమునందు బాలికలను బాలురకంటే నతి నీచముగా జూచుట మిక్కిలి ఖేధకరముగా నుండక మానదు. ఆడపిల్ల పుట్టిన నాటి నుండియు దలిదండ్రులు మిక్కిలి ఖేధముతో నుండెదరు. పెద్ద పెరిగిన కొలది పుత్రికలను పుత్రులవలె జూడక యెటులనైన బెంచవలయునని పెంచుదురు... ఈ దేశములోని యాడు పిల్లలలో నూటికి తొంబది తొమ్మండ్రు బాలికలు నేను చెప్పిన ప్రకార మత్యంతా లక్ష్యముతో బెంచబడుతున్నారనుటకు సందేహం లేదు.'' అంటుంది.
లింగవివక్ష పుట్టుక నుంచే ప్రారంభమౌతుందని ఈ వివక్ష వల్లనే బాలికలకు అత్యంత దురవస్థ ప్రాప్తించిందని వాపోతుంది అచ్చమాంబ.
 జ్యోతిశ్శాస్త్రంలో అద్వితీయ ప్రతిభావంతురాలైన ''ఖనా'' అనే స్త్రీ గురించి రాసిన వ్యాసంలో కూడా తల్లిదండ్రులు పక్షపాతంలో ఆడపిల్లలను ఎలా నిర్లక్ష్యం చేస్తారో రాస్తూ స్త్రీలు స్వతహాగా తెలివి లేనివారుగా పుట్టరని వారి పెంపకమే వారినలా తయారు చేస్తుందని వాదిస్తుంది.
'' బాలుడు చిన్నతనమునందెంత మందబుద్దియైనను వానికైదేండ్లు రాగానే తల్లి దండ్రులు విద్య నేర్పి వానికిగల మాంద్యమును వదిలించి జ్ఞానాభివృద్ధికొరకనేక శాస్త్రములను జదివింతురు...చిన్ననాడు వానికంటే విశేష ప్రజ్ఞ గల వాని యక్క మాత్రము విద్యాగంధమేమియు లేనందున మహా మూర్ఖశిరోమణియై యుండును. ఇట్లు తల్లిదండ్రులు పక్షపాతముచే బురుష సంతతిలోను స్త్రీ సంతతిలోను జ్ఞానమును గురించి మహదంతరము పడినదే గాని స్త్రీల స్వాభావిక మౌర్ఖ్యము వలన కాదు''.
కుటుంబంలో స్త్రీల అణిచివేత స్వరూపం గురించి ఇంత చక్కగా, స్త్రీ చైతన్యంతో మాట్లాడిన అచ్చమాంబ, ఆ అణిచివేతను ఎదుర్కొనాలంటే స్త్రీలకు విద్య అత్యంతావశ్యకమని వీలు చిక్కినపుడల్లా చెబుతుండేది. జండర్‌ వివక్ష కుటుంబంలో ఎలా మొదలవుతుందో, ఈ వివక్ష వల్ల స్త్రీలు ఎలా అణిచివేయబడి, తెలివి తక్కువ వారుగా , శక్తి లేనివారుగా ప్రచారం చేయబడతారో విశ్లేశిస్తూ అచ్చమాంబ ఆ రోజుల్లోనే రాయడం ఆశ్చర్యమన్పిస్తుంది.
 స్త్రీలకు విద్య అందకుండా చేసిన దుర్మార్గాల గురించి ఒక వైపు రాస్తూ, వారి మీద విరుచుకు పడుతూ మరో వైపు భార్యాభర్తల సంబంధం గురించి, భార్యల్ని గదుల్లో మూసిపెట్టే భర్తల గురించి రాయడం కన్పిస్తుంది.
 ఆదిశంకరుని సమకాలికురాలు, న్యాయ, మీమాస, వేదాంత శాస్త్ర పారంగతురాలు, తన వాదనతో ఆదిశంకరుని ఎదుర్కొనిన విదూషీమణి అయిన సరసవాణి గురించి రాసిన వ్యాసంలో పురుషులు స్త్రీలకు చేసిన అన్యాయాల గురించి దుయ్యబడుతుంది అచ్చమాంబ.
''మానవ దేహమున కలంకారమయిన విద్యభూషణము వారికి లేకుండ చేసి లోహపు నగలను మాత్రము పెట్టి తమ వేడుక నిమిత్తమయి వారిని తోలుబొమ్మల వలె జేయుచున్నారు. వారిని గృహ యజమానురాండ్రుగా జూడక తమ యుపచారము నిమిత్తమయి దాసులనుగా జేయుచున్నారు. పురుషులు స్త్రీల విషయమున జేసినయిట్టి యన్యాయము వలన స్త్రీలను మూఢురాండ్రనుగా జేసి చెడగొట్టుటయే కాక తామును వారికి తోడిపాటుగా మూర్ఖ శిరోమణులయి జెడిపోవుచున్నారు. ఈ స్థితి యంతయు పురుషుల లోపమువలనను, స్వప్రయోజనపరత్వం వలనను గలుచు చున్నదే కాని స్త్రీల దోషము వలనను మాత్రము గాదు.''
స్త్రీల స్థితి దిగజారిపోవడానికి పురుషులే కారణమని స్త్రీలను ఇళ్ళలో బంధించి తమ సేవ కోసం వాళ్ళను బానిసలుగా తయారు చేసారని చాలా ఘూటుగా విమర్శించిన అచ్చమాంబను పురుషద్వేషి అని ఆ రోజుల్లో ఎవరూ అనకపోవడం విచిత్రమే.
 అసలు ఈ గ్రంధానికి ప్రారంభంగా ఈమె పేర్కొనిన సంస్కృత శ్లోకం ఒక్కటి చాలు ఈమె ఆలోచనల్ని, దృక్పధాలిన్ని పట్టివ్వడానికి
 '' అరక్షితా గృహే రుద్ధా: పురుషై రాప్తకారిభి:
ఆత్మాన మాత్మనా యాస్తు రక్షేయుస్తాస్సురక్షితా:''
'' ఆప్తులైన పురుషులచే గృమమున నిర్భంధింపబడు స్త్రీలు సురక్షితురాండ్రు కాదు. ఏ స్త్రీలు తమ యాత్మను తామే కాపాడుకొందురో వారే సురక్షితరాండ్రు''.
ఆప్తులైన పురుషులంటే తండ్రి, అన్నదమ్ములు, భర్త మొదలైన వారు. వీళ్లు ఆప్తులే. ఆత్మీయులే. అయితే స్త్రీలని ఇంట్లో నిర్బంధించడానికి అందరూ సిద్ధమే. వాళ్లని అణిచివేస్తూ, ఎదగనీయకుండా అడ్డుకుంటూ, ఇంట్లో బంధిస్తూ వాళ్ళని రక్షిస్తున్నామని భావిస్తారు. అది రక్షణ కాదని, ఆప్తులు రక్షణ పేరుతో చేసేది నిర్భంధమని చెపుతూ, స్త్రీలు తమ ఆత్మని తామే కాపాడుకోవాలని, అపుడు మాత్రమే వారు సురక్షితులని అచ్చమాంబ రాసారు. అచ్చమాంబ ఆలోచనలు చాలా నిశితంగా, సూటిగా వుండేవి. తనేం రాస్తుందో ఆ అంశం పట్ల చాలా స్పష్టత వుంటుంది. స్త్రీలు స్వయం సిద్ధ్దలు కావాలని, తమను తామే రక్షించుకోవాలని ఎవరి మీదా ఆధారపడకూడదని తన అబలా సచ్చరిత్ర రత్నమాలలో రాసిన అచ్చమాంబ ఇతర రచనలను కూడా పరిశీలిద్దాం.
అచ్చమాంబ రాసిన వ్యాసాలు, పద్యాలు ఇతర రచనలు ఎక్కువగా 'హిందూసుందరి', 'సరస్వతి' అనే పత్రికలో ప్రచురించబడ్డాయి.
 హిందూసుందరిలో 1903 జూన్‌ నెల సంచికలో అచ్చమాంబ గారి రచన '' ఊనీలి తీరిజీరీశి ఖిరిరీచీతిశిలి ళితీ గీరితీలి '', 'దంపతుల ప్రధమ కలహము'పేరుతో ఒక రచన ప్రచురితమైంది. ఇందులో ఒక చిన్న విషయమై భార్యా భర్తలకు గొడవ జరుగుతుంది. భార్య కోపంతో పుట్టింటికి వెళ్ళిపోతుంది. భార్యకు, ఆమె అమ్మమ్మకు జరిగిన సంభాషణలో అచ్చమాంబ భార్య చేత ఈ వాక్యాలు పల్కిస్తుంది.
 ''నేను పెండ్లాడిన భార్యను గాని దాసిని గాను. వివాహమాడుట వలనను భర్తకు దాసినగుదునా ఏమి? గృమయజమానురాలిగా నెంచి, మన్నించి ప్రేమించవలయును గదా! అట్లు చేయక యిచ్చవచ్చిన పనులన్నియు నన్ను సేయమనిన నేను జేయుదునా ఏమి''.
 ''వివాహము కాగానే మేము గృహిణీ పదమున కర్హురాండ్రమగుదుమే కాని ధనమిచ్చి కొన్న బానిసలము కాము. మా వంటి పత్నులు పురుషుల యహంభావమునెంత మాత్రమును సహింపజాలరు.''
భార్యాభర్తల సంబంధంలోని అసమానత్వాన్ని పురుషుల అహంకారాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే గాని ఇలాంటి వాక్యాలు రాయడం సాధ్యం కాదు. అచ్చమాంబ జీవించిన నాటి పరిస్థితుల్ని గణనలోకి తీసుకుని ఆలోచిస్తే తప్ప ఆమెకు గల చైతన్యపు స్థాయి అర్థం కాదు.
 అలాగే ''విద్యావతులగు యువతుల కొక విన్నపము'' వ్యాసంలో ఆడపిల్లలకు విద్య నేర్పించడం ఎంత అవసరమో, ఆడపిల్లల్ని చదివించడానికి తల్లి దండ్రులు ఏం చేయాలో చాలా వివరంగా చర్చిస్తుంది. స్త్రీలు తమ గురించి తాము ఊపేక్ష చూపరాదని, పాఠశాలల్లో మగ టీచర్లే వుండడం వల్ల బాలికా విద్య కుంటుపడుతుందని, మహిళా టీచర్ల అవసరం గురించి చెబుతూ దీనికి పరిష్కారంగా
''స్త్రీ లందఱొక జట్టుగా గూడి తమలో వొకరి యింట పాఠకాలను స్థాపించి, అచటకే యందఱును పోయి నేర్పునట్టును, మనలో నొకరికి యిబ్బంది కలిగినపుడు వారి పనిని గడమ వారందఱు నిర్వహించునట్టును తమలో తాము నియమించుకొని తప్పక పనిచేయుచుండ, స్త్రీ విద్య నభివృద్ది గావింపగలిగి తమ కాలమును, జన్మమును సార్థకములగునటుల జేసెదరు'' అంటూ రాసింది. (హిందూసుందరి,1903 జూన్‌)
 అంతేకాదు చదువుకున్న స్త్రీలు గ్రామ గ్రామాన పాఠశాలలు ప్రారంభించి బాలికలందరికి చదువు చెప్పాలని, విద్యా సంపన్నులగు వారు ఆ విద్యా ధనమును తామే అనుభవించక తమ జాతి వారందరికి పంచి పెట్టడానికి పాటు పడాలని పిలుపు నిస్తూ అచ్చమాంబ ఎంతో ఉత్తేజకరంగా స్ఫూర్తిదాయకంగా ఈ వ్యాసాన్ని రచించింది. తన తోటి స్త్రీల విద్య లేమి పట్ల ఆర్తి, ఆవేదన ఈ వ్యాసం నిండా పరుచుకుని వుంది.
 'స్త్రీల విద్య యొక్క ప్రభావం' అనే వ్యాసంలో అచ్చమాంబ రాసిన విషయాలు మిక్కిలి ఆశ్చర్యకరముగా వున్నవి. ఇలాంటి ప్రాంతం భూ ప్రపంచం మీద వున్నదా లేక అచ్చమాంబ ఊహశక్తితో ఈ విషయాలు రాసిందా అన్పిస్తుంది.
 '' అయిస్‌ లండన్‌ ద్వీపమున స్త్రీ పురుషులందఱు సమానంగా విద్యను గాంతురు. అచట రాజకీయ హక్కులన్నియు స్త్రీ పురుషులకు సమానముగా నియ్యబడును... అచట విద్యాశాఖవారందరు స్త్రీలే...జనరక్షణమంతయు నచట నాడువారే చేయుచుండినందున..నిచట కారాగౄహముగాని, పోలీసుగాని లేరు. సైన్యము లేదు. న్యాయస్థానములు లేవు. ఇది యంతయు స్త్రీ విద్యా ప్రభావమే కదా? యితర దేశములందిట్టి దృష్టాంతములగుపడుచుండగా మన దేశమునందింకను కొందఱు స్త్రీలకు విద్య నేర్పవచ్చునా? లేదా? యని వాదించుచునే యున్నారు''. (హిందూ సుందరి 1902 ఆగష్టు నెల)
స్త్రీలు విద్యావంతులైతే దేశానికి ఎంత లాభం కలుగుతుందో నొక్కి చెప్పడానికి అచ్చమాంబ ఇంత అద్భుతమైన ఊహాప్రదేశాన్ని ఆవిష్కరించిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జైళ్లు, పోలీసులు, సైన్యం లేని దేశం ప్రపంచంలో ఎక్కడా వుండదు. అపూర్వమైన అచ్చమాంబ ఊహశక్తికి నిదర్శనంగా దీనిని అర్థం చేసుకోవాలి.
 భండారు అచ్చమాంబ రచనల గురించి ఇలా రాసుకుంటూ పోతే ఒక గ్రంథమే అవుతుంది. ఆమె రచనలన్నింటిని సేకరించి విశ్లేషణాత్మకత అధ్యయనం చేయాల్సిన అవసరం చాలా వుంది.
 అచ్చమాంబ గురించి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ తన ''ఆంధ్రకవయిత్రులు'' గ్రంథంలో
''బాల్యమునందంత విద్యావతి కాకున్నను స్వయంకృషిచే శాస్త్రములను, సంస్కృత కావ్యములను శ్రుతి స్మృతులను గూడ నర్థం చేసికొను శక్తిని సంపాదించింది. మహా రాష్ట్రాంగ్ల భాషలలో కూడా పండిత యయ్యెను.
చరిత్ర రచనయనిన మగవారికే మిక్కిలి కష్టతరము కదా. అట్టి యెడ స్త్రీలలో ప్రథమంగా చరిత్రను రచించి చక్కగా రచన నిర్వహించినదను ఖ్యాతి పొందినది. స్త్రీలలో చరిత్ర రచించిన ప్రథమ గౌరవమీమెదే'' అని రాశారు. ఊటుకూరు లక్ష్మికాంతమ్మ స్త్రీ కాబట్టి అచ్చమాంబను ప్రప్రధమ చరిత్రకారిణిగా గుర్తించింది.
 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీ పట్నంలో మొదటి మహిళా సమాజం ''బృందావన స్త్రీల సమాజం''ను స్థాపించిన ఘనత కూడా అచ్చమాంబకే దక్కుతుంది.రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నో స్త్రీల సంఘాలు ఏర్పడటానికి కృషి చేసింది. అనాధ పిల్లల్ని చేరదీసి చదువు చెప్పించేది ఆమె ఇంట్లో ఎపుడు ఐదారుగురు పిల్లలుండి చదువుకుంటూ వుండేవారు.
 1905 జనవరి 18వ తేదీన అతి చిన్న వయస్సులో ముఫ్ఫైఏళ్ళకే అచ్చమాంబ మరణించింది. ''కీర్తిశేషురాలగు శ్రీమతి భండారు అచ్చమాంబగారు'' శీర్షికతో హిందూసుందరి పత్రిక ''అన్యులకు మేలు చేయ నీ యతివ బుట్టె''నని ''సుందరి పత్రికకు మాతృవియోగము కలిగినదని'' పేర్కొంటూ ఐదు పేజీల నివాళిని ప్రచురించింది.
 ఈ విధంగా భండారు అచ్చమాంబ ఆధునిక సాహిత్య చరిత్రలో సుస్థిరంగా నిలిచి పోయింది. చిన్నతనంలో ఏమి చదువుకోకపోయినా, స్వయం కృషిితో వివిధ భాషల్లో పాండిత్యం సంపాదించింది. వ్యక్తిగత జీవితంలో సంభవించిన విషాదకర సంఘటనలకు ఆమె కుంగి పోలేదు. చిన్న వయసులో కుమారుడు, కుమార్తె మరణించడం ఆమెకు తీవ్రమైన దు:ఖాన్ని కల్గించింది. ఇంతటి దు:ఖంలో కూడా కుప్ప కూలి పోకుండా, పట్టుదలతో 'అబలా సచ్చరిత్ర రత్నమాల' గ్రంధాన్ని రచించింది. 1903లో దేశమంతా పర్యటించినపుడు పండితులతో, మేధావులతో చర్చించి పురాణ కాలపు స్త్రీల గురించిన సమాచారాన్ని సేకరించింది. తన రచనలన్నింటి నిండా స్త్రీవిద్య ఆవశ్యకత గురించి ప్రస్తావిస్తూ, స్త్రీ ఉద్యమాన్ని నిర్మించడానికే , ప్రోత్సహించడానికే తన రచనలను ఉపయోగించింది.
 చైతన్య వంతమైన జీవనశైలితో అభ్యుదయకరంగా, స్త్రీల జీవితాల్లో మార్పు కోసం అహరహం శ్రమించిన అచ్చమాంబ జీవితం అతి చిన్న వయసులోనే ముగిసిపోవడం నిజంగా మన దురదృష్టమే. ఆమె కనుక పూర్తి జీవితం జీవించి వుంటే అమూల్యమైన గ్రంధాలనెన్నింటినో రచించి వుండేది. స్త్రీవాద ఉద్యమం ఆమె స్ఫూర్తితో ఆనాడే ప్రారంభమై వుండేదేమో???
 తెలుగు సాహిత్యంలో మొట్ట మొదటి కథకు శ్రీకారం చుట్టిన అచ్చమాంబ, ప్రధమ స్త్రీవాద చరిత్ర కారిణి అచ్చమాంబ నూరేళ్ళ క్రితమే అభ్యుదయకరంగా స్త్రీవాద స్పృహతో రచనలు చేసింది.
నిజంగా కె. లలిత అన్నట్లు ఆధునిక చరిత్రలో మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటివి, మనం గర్వించదగినటువంటి నమూనాల కోసం వెతుక్కోవాలంటే మొట్ట మొదట కన్పించేది అచ్చమాంబ.
 1874 సంవత్సరంలో పుట్టిన అచ్చమాంబ శత జయంతి ఉత్సవాన్ని, భారతదేశంలో స్త్రీల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడిన 1974 ప్రాంతంలో మనం సెలబ్రేట్‌ చేసుకోలేక పోయినా కనీసం అచ్చమాంబ చనిపోయి వందేళ్ళు నిండిన సందర్భంలో ఆమెను ఈ విధంగా గుర్తు చేసుకోవడం నాకు అత్యంత విషాదంగాను అదే సమయంలో సంతోషంగాను, గర్వంగాను వుంది.
( నవంబరు 2003, 29,30 తేదీలలో తెలుగు విభాగం, యూనివర్సిటీ ఆర్ట్స్‌ ఞ సైన్స్‌ కళాశాల, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్‌ వారి ఆధ్వర్యంలో జరిగిన యు.జి.సి జాతీయ సదస్సులో (''జండర్‌ స్పృహ '' ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రతిఫలనాలు) సమర్పించిన ప్రసంగ వ్యాసం.)

ఈ వ్యాసం రాయడానికి నాకు ఉపకరించిన పత్రికలు

1. అబలా సచ్చరిత్ర రత్నమాల -భండారు అచ్చమాంబ
2. ఆంధ్రకవయిత్రులు - ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ
3. హిందూ సుందరి పత్రికలు
4. భూమిక స్త్రీవాద పత్రిక
5. తెలుగు కథకులు -కథన రీతులు
సంపాదకులు: సింగమనేని నారాయణ, మధురాంతకం రాజారామ్‌
7.తొంభై ఏళ్ల తెలుగు కథ -పెద్దిభోట్ల సుబ్బరామయ్య, భమిడిపాటి జగన్నాధరావు
8.కథా శిల్పం -వల్లంపాటి వెంకట సుబ్బయ్య
 9.నూరేళ్ళ పంట, రచయిత్రుల కథా సంకలనం -డా. భార్గవీరావు
10. 20 వ శతాబ్ది రాజకీయార్థిక పరిణామాలు తెలుగులో స్త్రీల సాహిత్యం - సంపాదకత్వం కాత్యాయనీ విద్మహూే
11.20 వ శతాబ్దంలో తెలుగు రచయిత్రుల రచనలు
 సంకలనం: అబ్బూరి ఛాయాదేవి

12.WOMEN WRITING IN INDIA 600 BC to the present Volume 1:
 600 BC to the early 20 th Century

Comments

మంచి ప్రయత్నం. అభినందనలు.
Nrahamthulla said…
http://te.wikipedia.org/wiki/%E0%B0%AD%E0%B0%82%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81_%E0%B0%85%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AE%E0%B0%BE%E0%B0%82%E0%B0%AC
Nrahamthulla said…
http://te.wikipedia.org/wiki/%E0%B0%AD%E0%B0%82%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81_%E0%B0%85%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AE%E0%B0%BE%E0%B0%82%E0%B0%AC