Wednesday, February 2, 2011

వేధింపులు ఆగలేదు రూపాలు మారాయంతే!

భూమిక ఆధ్వర్యం "పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక బిల్లు 2010"

మీద ఒక రోజు జరిగిన సమావేశపు రిపోర్ట్ నిన్న ఆంధ్రజ్యోతి నవ్య పేజిలో వచ్చింది.
మీ కోసం ఆ లింక్.
https://www.andhrajyothy.com/navyaNewsShow.asp?qry=2011/feb/1/navya/1navya1&more=2011/feb/1/navya/navyamain&date=2/1/2011
బాత్‌రూముల్లో యాసిడ్...

నా పేరు ఉమ, ఐఎన్‌టియుసికి ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నాను. మేము కొన్నాళ్లుగా రైల్వే మహిళా కూలీల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఇందులో భాగంగా...దేశంలోని చాలా రైల్వే స్టేషన్లకి వెళ్లాం. ఒక రైల్వేస్టేషన్ బాత్‌రూమ్‌లలో కనిపించిన ఒక దృశ్యం మా గుండెల్ని పిండేసింది. బాత్‌రూమ్‌ల్లో మహిళల బొమ్మల్ని వేయడం, రకరకాల రాతలు రాయడం అందరికీ తెలిసిన విషయమే. ఆ రాతల్ని చదివిన వారు ఓ గంటో...రెండు గంటలో వాటి గురించి ఆలోచిస్తారు, తరువాత మరిచిపోతారు.
కాని మేం చూసిన రైల్వే స్టేషన్లలో మహిళలు వాడే బాత్‌రూమ్‌ల్లోకి నీళ్లు వెళ్లకుండా చేసి బక్కెట్లలో యాసిడ్ పోసి పెట్టారు. మహిళల్ని హింసించడానికి ఎన్ని కొత్త పద్ధతులు కనిపెడుతున్నారో చూడండి. ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంటేనే ఒళ్లంతా జలదరిస్తోంది. అప్పటికే ఆ బాత్‌రూమ్‌లు వాడిన వారి సంగతేంటి? ఇలా ఒకటీ...రెండూ కాదు కొందరు మగవారి వికృత చేష్టలకు మహిళలు పడే ఇబ్బందులు అన్నీ...ఇన్నీ కాదు. నోటితో ఎవ్వరికీ చెప్పుకోలేని వేధింపులు ఈ రోజు మహిళలు ఎదుర్కొంటున్నారు. చంపితేనే శిక్ష, వేధిస్తే ఎవరు ఏమంటారు అనే ధీమానే వారితో ఈ పనులన్నీ చేయిస్తోంది.

ఉద్యోగం మానేశాను...

నా పేరు ఇందిర, నాలుగేళ్లక్రితం నేను ఒక పేరున్న కార్పోరేట్ కంపెనీలో పనిచేశాను. కొత్తగా ఉద్యోగంలో చేరాను. అక్కడ డిజిఎం హెచ్ఆర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఫోన్ నుంచి నాకు 'ఇది నా పర్సనల్ ఫోన్‌నెంబర్' అని ఒక మెసేజ్ వచ్చింది. మర్నాటి నుంచి ఆ ఫోన్ నుంచి నాకు రకరకాల మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. వాటిని చదివినపుడు వెంటనే వెళ్లి వాడ్ని చంపేయలన్నంత కోపం వచ్చేది. కాని ఏం చేయలేను. కొత్తగా ఉద్యోగంలో చేరాను. పైవారితో పెద్దగా పరిచయాలు లేవు. రెండు నెలలు నరకం భరించాను. గంటగంటకీ వచ్చే మెసేజ్‌లు మా ఇంట్లోవాళ్ల కంటపడకుండా చూడ్డానికి ఎన్ని తిప్పలు పడ్డానో. గోల చేస్తే నా పరువే పోతుందనుకున్నాను.
నా మౌనాన్ని వాడు బలహీనతగా భావించాడు. రోజురోజుకీ శృతి మించిపోతున్నాడు. ఒక రోజు వాడో, నేనో తేలిపోవాలని నిర్ణయించుకున్నాను. మా హెచ్ఒడికి, హెడ్ ఆఫ్ ది హెచ్ఆర్‌కి, డైరెక్టర్‌గారికి అందరికీ వాడి చేష్టల గురించి చెప్పాను. రుజువులు చూపించాను. వాడికి చాలా పెద్ద శిక్ష పడుతుందని ఆశించాను. తీరా చూస్తే... అందరూ వాడ్ని గదిలోకి పిలిపించి నాకు సారీ చెప్పించారంతే. వాడు సింపుల్‌గా సారీ చెప్పి వెళ్లిపోయాడు. నా సెక్షన్‌లో ఉన్న ఆడవాళ్లంతా నన్ను తిట్టడం మొదలుపెట్టారు. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్...ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దది చేస్తావా అన్నారు. దాంతో రిజైన్ చేసి బయటికి వచ్చేశాను. నేను వచ్చిన రెండు నెలలకి ఆ డిజిఎమ్‌కి ప్రమోషన్ వచ్చిందని విన్నాను. ఈ హైటెక్ వేధింపుల గురించి ఎవ్వరికీ చెప్పుకోలేం. భరించలేక కడుపు చించుకుంటే వచ్చి కాళ్లమీద పడుతుంది.. అంతే.

పిల్లాడి కోసం...

నా పేరు లలిత, మాకు ఒక్కగానొక అబ్బాయి. మధ్యతరగతి కుటుంబం. కష్టపడి పిల్లాడిని ఇంజనీరింగ్ చదివించుకుంటున్నాం. ఒక రోజు అబ్బాయితో ప్రిన్సిపల్ కబురు పంపించాడు. మర్నాడు వెళ్లి కలిశాను. 'మీ పిల్లాడు సరిగ్గా చదవడం లేదు. మీరు అప్పుడుప్పుడు వచ్చి అతని చదువు విషయాలు తెలుసుకుంటుండాలి' అని చెప్పాడు. అలాగేనన్నాను. మొదట్లో వెళ్లినపుడు అబ్బాయి చదువు విషయాలే అడిగేవాడు. తరువాత...నా పర్సనల్ విషయాలు అడగడం మొదలుపెట్టాడు. మాట్లాడడం అయిపోయినా సరే వెళ్లనిచ్చేవాడు కాదు. టీలు, కాఫీలు తెప్పించి తాగమని ఏవో కబుర్లు చెప్పేవాడు. నాకు చాలా ఇబ్బంది అనిపించేది.
క్కడికీ ఇంటిదగ్గర ఏవో ముఖ్యమైన పనులు ఉన్నాయని చెప్పి తప్పించుకునేదాన్ని. కబురు పంపినపుడు వెళ్లకపోతే 'మీ అబ్బాయి పాసవడం మీకిష్టం లేదా'అంటూ బెదిరించేవాడు. ఈ విషయం మావారికి చెబితే ముందు నన్నే తప్పుపడతారెమో. నీ ప్రమేయం లేకుండా వాడు అలా ప్రవర్తించడంటూ నన్నే అనుమానిస్తారేమో అని భయపడ్డాను. అదెలా ఉన్నా...ఆ దుర్మార్గుడు అబ్బాయి చదువుని చెడగొడతాడేమోనని భయం వేసింది. ఏం చేస్తాను? నిస్సహాయిరాలిని అయిపోయాను. ఒకోసారి చచ్చిపోతే బాగుండుననిపిస్తోంది.

ఆ ఫోన్‌కాల్ వల్ల...

నా పేరు సరిత, నాకు పెళ్లయి ఆరునెలలైంది. నేను ఒక పేరున్న కంపెనీలో పనిచేస్తున్నాను. ఒకరోజు సాయంత్రం నా ఫోన్‌కి ఒక కాల్ వచ్చింది. అవతలి గొంతు ఎవరిదో మగవారిది. పేరు, ఊరు చెప్పి పరిచయం చేసుకున్నాడు. వెంటనే నేను మీరెవరో నాకు తెలియదన్నాను. 'తెలియాల్సిన పనేంటి' అన్నాడు వెటకారంగా. వరసగా వాడు చేస్తున్న ఉద్యోగం గురించి, వాడు సంపాదించిన ఆస్తుల గురించి చెప్పుకొచ్చాడు. 'అవన్నీ నాకెందుకు చెపుతున్నావ్...ఇంతకీ నువ్వు ఎవరు?' అంటూ గట్టిగా అరిచాను. 'ఎందుకు అరుస్తావు? మాలాంటి వారి కాల్స్ గురించే కదా నువ్వు ఎదురుచూస్తావు' అన్నాడు. 'ఎవరు చెప్పారు?' అన్నాను.

'సర్లే మ్యాటర్‌లోకి వస్తాను. యస్ ఆర్ నో చెప్పు. ప్యారడైజ్ దగ్గర ఉన్న ఒక బార్‌లో ఉన్న బాత్‌రూమ్‌లో నీ పేరు, ఫోన్ నెంబరు రాసి ఉంది. పక్కనే ప్లీజ్ కాల్ అని కూడా రాసి ఉంది. అందుకే చేశాను. ఇప్పుడు చెప్పు' అన్నాడు విజయగర్వంగా. ఎదురుగుండా ఉంటే చంపేసేదాన్ని. ఎవడ్రా నువ్వు అంటూ....నా నోటికొచ్చినట్టు తిట్టేసి పెట్టేశాను. మళ్లీ ఫోన్ చేస్తాడేమోనని ఫోన్ నా దగ్గరే పెట్టుకున్నాను. ఒకవేళ అలాంటి కాల్స్ గురించి నా భర్తకి తెలిస్తే, అమ్మో ఇంకేమైనా ఉందా! వచ్చింది ఒక ఫోన్ కాల్ అయినా నేను మామూలు మనిషి కావడానికి మూడ్నెల్లు పట్టింది. ఇలాంటివి చెప్పడానికి చాలా చిన్నవిగా అనిపిస్తాయి. కాని ఆ క్షణంలో పడే వేదన, ఒత్తిడి చాలా ఎక్కువ. మాటల్లో చెప్పలేం.

షాపింగ్ అంటేనే....

మాది పశ్చిమగోదావరి జిల్లా, నా పేరు సునీత. మా బంధువుల అమ్మాయి పెళ్లి షాపింగ్ కోసం హైదరాబాద్ వచ్చాం. ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌కి వెళ్లాం. అక్కడ ఒక డ్రస్సు బాగా నచ్చింది. సైజు కొంచెం డౌటుగా ఉండడంతో డ్రస్సింగ్‌రూమ్‌లోకి వెళ్లాను. మర్నాడు నా బంధువుల్లో ఒకబ్బాయి...ఆ షాపింగ్‌మాల్‌లో ఉన్న డ్రస్సింగ్ రూముల్లో కెమెరాలు ఉన్నాయని చెప్పాడు. నేను నమ్మలేదు. ఒకరోజు నాకు తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది.'పలానా షాపింగ్‌మాల్ సెంటర్‌లో ఉన్న డ్రస్సింగ్‌రూమ్‌లో డ్రస్సు మార్చుకుంటుంటే...తీసిన ఫొటోలు నా దగ్గర ఉన్నాయి' అని ఉంది ఆ మెసేజ్‌లో. మెసేజ్ చదివిన వెంటనే నా ఒళ్లంతా చెమటలు పట్టేశాయి.
విషయాన్ని గుట్టుగా ఉంచాలా? లేక మా వాళ్లందరికీ చెప్పాలా? అర్థం కాక ఓ నెల రోజుల పాటు నరకం అనుభవించాను. మెసేజ్ వచ్చిన నెంబర్‌కి ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వస్తుంది. ఏం చేయాలో తోచలేదు. నలుగురికీ చెప్పి దొంగని పట్టుకునే ప్రయత్నం చేద్దామని నిర్ణయించుకున్నాను. ముందు మా కజిన్‌కి చెప్పాను. విన్న వెంటనే కయ్యిమన్నాడు. 'ఒకసారేగా మెసేజ్ వచ్చింది, మళ్లీ రెండో మెసేజ్ వస్తే నాతో చెప్పు...ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం.
అయినా డ్రస్సు కొనుక్కుని ఇంటికి రాక డ్రస్సింగ్‌రూమ్‌లోకి ఎవడు వెళ్లమన్నాడు?' అని తిట్టాడు. అంటే ఏమటి? ఉన్న అవకాశం వాడుకోవడం కూడా నా తప్పేనా? ఇలా కొందరు మహిళలు చెప్పిన సమస్యలకు అక్కడున్న పెద్దలు పరిష్కారం చెప్పే ప్రయత్నం చేశారు. కాని ఖచ్చితమైన పరిష్కారమంటూ ఏదీ కనిపించలేదు. ఆయా పరిస్థితులని బట్టి మహిళలందరూ సంఘటితమై సమస్యపై పోరాడ్డం ఒక పరిష్కారమైతే, పనిప్రదేశాల్లో కమిటీలను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు మహిళలు ఎదుర్కొనే వేధింపులపై దృష్టిపెట్టడం మరో మార్గమని చెప్పారు.

6 comments:

SHANKAR.S said...

" మహిళలు వాడే బాత్‌రూమ్‌ల్లోకి నీళ్లు వెళ్లకుండా చేసి బక్కెట్లలో యాసిడ్ పోసి పెట్టారు."
దారుణం. ఇది నిజంగా పైశాచికత్వానికి పరాకాష్ట. ...ఎటు పోతున్నాం మనం? అనిపిస్తోంది

Praveen Mandangi said...

ఇలాంటి ఘటన మా ఊర్లోనూ జరిగింది. నా దగ్గరకి వచ్చిన కస్టమర్ ఒకామెకి ఫోన్ వచ్చింది. ఆమె ఫోన్‌లో నా నంబర్ నీకు ఎలా తెలిసింది? నీకు నా నంబర్ ఎవరు ఇచ్చారు అని ఫోన్ చేసిన అబ్బాయిని తిడుతోంది. నేను మాట్లాడుతాను అని చెప్పి ఆమె దగ్గర ఫోన్ తీసుకుని ఈ అమ్మాయికి పెళ్లయ్యింది, ఈమె భర్తకి చెప్పి నిన్ను పోలీస్ స్టేషన్‌కి లాగిస్తాను అని చెప్పాను. అతను ఫోన్ పెట్టేశాడు. తాను పరిచయం లేనివాళ్లెవరికీ ఫోన్ నంబర్ ఇవ్వలేదని ఆ అమ్మాయి చెప్పింది. అమ్మాయిల ఫోన్ నంబర్లు ఫ్రెండ్స్‌ని అడిగి తెలుసుకునేవాళ్లు ఉంటారు. ముక్కూమొహం తెలియని వ్యక్తి ఫోన్‌లో ప్రేమిస్తున్నాను అని చెపితే నమ్మరు అనే డౌట్ ఫోన్ చేసేవాళ్లకి రాదా?

SHANKAR.S said...
This comment has been removed by the author.
SHANKAR.S said...

సారీ అండీ. క్రితం ఇష్యు చదివిన తరువాత మిగిలినవి చదవకుండా ఉద్వేగం ఆపుకోలేక కామెంట్ చేసాను.తరువాతవి చదివాక
" మర్నాడు నా బంధువుల్లో ఒకబ్బాయి...ఆ షాపింగ్‌మాల్‌లో ఉన్న డ్రస్సింగ్ రూముల్లో కెమెరాలు ఉన్నాయని చెప్పాడు. నేను నమ్మలేదు. ఒకరోజు నాకు తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది.'పలానా షాపింగ్‌మాల్ సెంటర్‌లో ఉన్న డ్రస్సింగ్‌రూమ్‌లో డ్రస్సు మార్చుకుంటుంటే...తీసిన ఫొటోలు నా దగ్గర ఉన్నాయి' అని ఉంది ఆ మెసేజ్‌లో."
ఇది చదివాక నాకెందుకో ఆ నెంబర్ ఆ సోకాల్డ్ బంధువుల అబ్బాయిదే ఎందుకు కాకూడదు అనిపించింది.

Ennela said...

వేధిపులు ఆగలేదు రూపాలు మారాయంతే...

పరిమళం said...

అన్నిటికంటే దారుణమైన విషయం ఏమిటంటే స్త్రీని తమవారు అర్ధం చేసుకొని అండగా ఉండి మానసిక స్థైర్యాన్ని ఇవ్వకకపోవడం !అది ఉంటే మహిళలు ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలరు.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...