Sunday, October 17, 2010

మలాన్ని తలమీద మోసిన ఆ మహాతల్లికి పాదాభివందనం

ఈ వారం ది వీక్ పత్రికలో మల్లికా సారా భాయ్ రాసిన వ్యాసం చదివాకా 45 సంవత్సరాల నాటి జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి.

మల్లిక తన కాలంలో బెజవాడ విల్సన్ అనే ఆయన గురించి రాస్తూ ఆయన పాకీ పని వారి గురించి చేసిన పోరాటాల గురించి ప్రస్తావించారు.
ఈ విల్సన్ అనే ఆయన హర్ష్ మందిర్ రాసిన పుస్తకం లోని పాత్ర.
మల్లిక రాసింది చదువుతుంటే నా కళ్ళల్లో ఎందుకు నీళ్ళొచ్చాయి?
ధారగా కారుతున్న ఈ కన్నీళ్ళు నా గత స్మృతుల్ని కడుగుతాయా?
నేను ఆరవ తరగతి చదువుతున్నపుడు మా నాన్న కొబ్బరికాయల వ్యాపార నిమిత్తం నరసాపురంలో ఉండేవాళ్ళం.మా నాన్న 25 రూపాయలు అద్దె ఇచ్చి అద్దె ఇంట్లో ఉండేవాడు.
మా ఇంటి పక్క పరకాల ప్రభాకర్ వాళ్ళ ఇల్లు ఉండేది.మేమంతా కలిసి ఆడుకునే వాళ్ళం.ఆ విషయాలు మళ్ళీ రాస్తాను.
మేము అద్దెకున్న ఇంటికి టాయ్ లెట్ ఉండేది కాదు.మరుగుదొడ్డి ఉండేది.ఆ దొడ్లో ఓ పది ఇటికలు వేసి ఉండేవి.అదే మా లెట్రిన్ అన్నమాట.
రోజూ ఉదయమే ఒకామె తట్ట తీసుకుని వచ్చి మలాన్ని చేతులతో,ఓ చిన్న రేకు ముక్క సాయంతో ఎత్తి తట్టలో వేసుకుని తట్టని తలమీదో చంకలోనో పెట్టుకుని వెళ్ళేది.
మేము ఎంత ఘోరంగా ప్రవర్తించే వాళ్ళమో ఇప్పుడు తల్చుకుంటే
నా మీద నాకు అసహ్యం వేస్తుంది.ఆమె రాక ముందే పెరటి తలుపు తీసి పెట్టేవాళ్ళం.ఆమె ముఖం చూడ్డం ఇష్టం లేక.
ఒకా రోజు ఆమె రాకపోతే శాపనార్ధాలు పెట్టడమే.
నిజానికి ఆమె ఒక్క రోజు రాకపోతే మా బతుకు ఘోరమే.
ఆమె వస్తే ముఖం చూడకపొయ్యేది.రాకపోతే తిట్ల దండకం అందుకునేది.
చేతులతో మలం ఎత్తే పనికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నప్పటి నుండి,దానికి సంబందించిన రచనలు చదువుతున్న కొద్దీ నాలో నా చిన్నప్పటి అనుభవాలు సుళ్ళుతిరుగుతూనే ఉన్నాయి.
ఎప్పటికైనా ఈ అమానుషం గురించి రాయగలనా అని అనుకునే దాన్ని.
తెలిసో తెలియకో నేనూ ఈ అమానవీయ కార్యంలో భాగస్వామినైనందుకు సిగ్గుపడుతూ,దుఖపడుతూ,వేదనపడుతూ చిన్నప్పుడు నేను విసర్జించిన మలాన్ని తలమీద మోసిన ఆ తల్లికి పాదభివందనం చేస్తూ ఈ ఉద్యమంలో నా వంతు క్రుషి చెయ్యడానికి బద్దురాలనౌతున్నాను.
ఈ నెలాఖరునాటికి చేతులతో శుభ్రం చేసే పాకీ దొడ్లు ఉండరాదనే ఉద్యమానికి మద్దతు పలుకుతూ,నా తప్పును సరిదిద్దుకునే ఏ పనికైనా సరే నేను రడీ అవుతున్నాను.
ఇలాంటి అమానవీయ,అమానుష ఆచారాలకు పాతర వేద్దాం రండి.
చేతులతో మలాన్ని ఎత్తే మహాపచార పనికి వ్యతిరేకంగా మీ గళాన్ని విప్పండి మితులారా!
మలాన్ని ఎత్తే మహా తల్లులకి పాదాభివందనం చేద్దాం.

9 comments:

Sasidhar said...

నేను మీతో ఏకీభవిస్తాను. ఒక మోస్తరు టౌనులో పెరగడం వల్ల నాకు ఇలాంటి అనుభవం లేకపోయినా, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇలాంటి వ్యవహారాలు జరిగేవట.
ఇంకా ఇలాంటి వెనుకబాటు తనం ఉందా?


~శశిధర్ సంగరాజు.

ఆ.సౌమ్య said...

మీ టపా చదువుతూ ఉంటే నాకెక్కడో తగిలింది. విజయనగరంలో మా ఇంట్లోనూ మరుగుదొడ్డి ఉందేది. మాకు 9 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఆ మరుగుదొడ్డి ఉండేది, తరువాత అది పడగొట్టి సెప్టిక్ టేంక్ కట్టించారు. మీరు చెప్పినట్టుగానే మేమూ ఆమె రాకముందే ఆ తలుపు తీసి ఉంచేవాళ్ళం. అది తలుచుకున్నప్పుడల్లా నాకు ఒళ్ళు గగుర్పొడుస్తూ ఉండేది. ఎంత సంస్కారహీనులమో కదా మనం! హృదయం లేని రాతిమనుషులం.


మీ ఉద్యమంలో నేనూ చేయి కలుపుతున్నాను.

Anonymous said...

ఈ పనులు చేయడానికి ఒక కులం ఉంది. అందులో ఇలాంటి మహాతలులూ, మహాతండ్రులూ అందరూ ఉన్నారు.

కృష్ణప్రియ said...

చాలా బాగా చెప్పారు.
నేను ఈ విషయం వినటం ఇదే మొదటి సారి.. కానీ.. మీరు చెప్పినట్టు హైదరాబాద్ లో మా ఇంట్లో బయట బాత్ రూం కడగటానికి వచ్చే అబ్బాయి కి డబ్బు కూడా ఎడమ చేత్తో.. అరడుగు పైన్నుంచి ఇచ్చేవాళ్ళం. అతను వచ్చి వెళ్ళాక ఆ దారి కాస్త నీళ్ళు పోసి కడుక్కునే వాళ్ళం. ఇదంతా కనీసం 20 యేళ్ళ క్రింద మాట. తలచుకుంటే సిగ్గేస్తుంది నిజమే..

శ్రీనివాస బాబు తోడేటి said...

అలా మలాన్ని తీసుకెళ్ళే వాళ్ళని స్కావెంజర్స్ అంటారు, మన రాష్ట్రాన్ని స్కావెంజర్ ఫ్రీ స్టేట్ గా ప్రభుత్వం డిక్లేర్ చేసింది. అటువంటి మరుగుదొడ్లు మన రాష్ట్రం లో లేవు.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

చాలా మంచి వ్యాసం రాశారు.
The fact that this profession existed or the fact that people belonging to certain caste used to do this, is a kind of well known and well documented fact. ఎవరినైనా నిజంగా కించపరచాలంటే ఉపయొగించే పదంగా కూడా మనకందరికీ తెలిసినదే.

I remember seeing a news program in TV last year, where they high lighted that this practice still exists in some villages just 100 KM away from Delhi.

Such a huge economy as ours still have this as the only job that makes financial viability to certain sections of people is quite an unsettling fact for all the decent people.

It is not really shocking to see that somebody is used to do such a job. That was the system then and somebody had to do that Job. A job is a job and done in hygienic conditions, there is nothing shocking about it.

What we should be ashamed or shocked about is, how these people were treated - inferior human beings, if at all human beings. And the way these people themselves are made to beleive that they are fit for only such things.

I wish the movement mentioned by you succeeds in acheiving the target.

మన ఊరు - నీలపల్లి (తాళ్ళరేవు మండలం, తూ.గో.జిల్లా) said...

టపా చదువుతుంటే, చాలా బాధగా వున్నా, గత 40 సంవత్సరములుగా మా ప్రాంతముల వైపు ఇటువంటి దుస్థితిలో ఎవ్వరూ వున్నట్లు నాకు తెలియదు. బహుశా, గోదావరి తీరము అవ్వడముతో, వారి అవసరము లేదనుకుంటా.

వడ్రంగిపిట్ట said...

మీ కన్ఫెషన్ బాగుంది. పాకీ పని చేస్తున్న వారు ఇప్పటికీ వున్నారు. ప్రస్తుతం టాయిలెట్స్ వుంటున్నా, పట్టణాలలో కాల్వల పక్కన మలవిసర్జన చేస్తున్నవారున్నారు, అలాగే రైల్వే స్టేషన్ల ప్లాట్ ఫారం దగ్గర వున్న పట్టాలమద్య వున్న వాటిని ఇప్పటికీ వాళ్ళే క్లీన్ చేస్తున్నారు. మనుషులంతా అసహ్యించుకునే పనిని ఉపాధిగా చేసుకొని బతుకుతున్న ఆ జాతి వారిని హీనంగా చూడడం మానవజాతికే అవమానం.
మంచి విషయాన్ని చర్చకు పెట్టినందుకు మీ శీర్షికకు మా వందనాలు..అభినందనాలు...

Unknown said...

Thanks for sharing your experience and your solidarity with Safai Karmachari Andolan (SKA) the movement for eradication of manual scavenging by 2010. Today, When we read your note to our liberated saafai karmachari women, they empathised with your feeling with tears. We invite concerned citizens for tomorow's samajik parivartan yatra meet at Basheerbagh Press club at 6PM to listen safai karamcharis.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...