Wednesday, September 10, 2008

మంచుపల్లకీలెక్కించొద్దు

తల్లులదినం...మదర్స్‌ డే. ఇటీవలే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంటర్నెట్‌లో లక్షల సంఖ్యలో మదర్స్‌ డే మీద వెబ్‌సైట్లు పుట్టుకొచ్చాయి. కనీసం ఆరోజైనా - ఐ లవ్యూ మామ్‌.. అని చెప్పమనే సందేశాలు కుప్పలుతెప్పలుగా వెబ్‌సైట్లనిండా వుంటాయి. తల్లుల త్యాగాలను కీర్తించే కవిత్వం... అబ్బో... నెట్‌నిండా పొంగిపొర్లుతోంది. మరిక లోటేంటి?.. తల్లుల గురించి ఇంత వీరలెవల్లో కీర్తిస్తుంటే సంతోషించక ఈ సన్నాయి నొక్కులేంటి అనిపిస్తోంది కదా..
మాతృత్వంలోనే వుంది ఆడజన్య సార్ధకం. అంటూ తల్లితనాన్ని ఆకాశానికెత్తేయడం వెనక పిల్లలు కనలేని స్త్రీలను అవవనించడం అంతర్లీనంగా వుందన్న విషయం ముందు అర్థం చేసుకోవాలి. మాతృత్వాన్ని పోటీలుపడి పొగిడే పురుషపుంగవులు పితృత్వం గురించి ఒక్కమాట కూడా ఎందుకనరో ఆలోచించగలగాలి.
సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే పనిని పునరుత్పత్తి శక్తి ద్వారా స్త్రీలు మాత్రమే చేయగలరు. అఫ్‌కోర్స్‌... పురుషుల పాత్ర లేకుండా ఈ పని జరగనప్పటికీ తొంభై శాతం బాధ్యత స్త్రీమీదే వుంది. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసే మాతృత్వ ప్రక్రియను మాటల్లో కోటలు దాటించడం తప్ప ఆచరణలో అంతా అవహేళనే. స్త్రీ గర్భం ధరించిన క్షణం నుంచి కంటికిరెప్పలా కాపాడాల్సిన కుటుంబంగాని, సమాజంగాని, ప్రభుత్వ వ్యవస్థలు గాని తమ తమ బాధ్యతల్ని ఏ రోజూ సక్రమంగా నిర్వర్తించిన దాఖలాలు లేవు.
గర్భం ధరించినప్పటి నుంచి ఆమె శరీరంలో చోటు చేసుకునే మార్పుల గురించి గాని, ఆమె మానసిక కల్లోలాల గురించి గాని ఎవరికీ పట్టదు. శ్రామిక మహిళల విషయమైతే మరీ అన్యాయం. పురుడు పోసుకునే ముందురోజు వరకు శ్రమ చెయ్యవలసిన్దే. కుటుంబ సభ్యుల కంచాల్లోకి అన్నం తేవాల్సిందే. పురిటి గాయలు మానకముందే పనిలోకి చొరబడాల్సిందే. మనం మహాఘనంగా కీర్తించుకునే మాతృత్వ మాధుర్యాలు, మాతృమూర్తుల దినోత్సవాలు వీరి దరిదాపులకు కూడా చేరని విషయాన్ని మనం గుర్తించడానికి నిరాకరిస్తాం. తల్లిపాల దినోత్సవాలను ఫుల్‌సైజ్‌ పేపర్‌ ప్రకటనలతో ఘనంగా జరుపుకుంటాం గాని బిడ్డకి కడుపునిండా పాలివ్వనివ్వని క్రూరత్వాల గురించి అస్సలు పట్టించుకోం.
పురిటి నొప్పుల గురించి , ప్రసవ వేదన గురించి అనుభవించిన వాళ్ళు మాత్రమే రాయగలరు.. చెప్పగలరు. పొరపాటున ఎవరైనా లేబర్‌ రూమ్‌లోని ప్రసవవేదన గురించి కవిత్వమో, కథో రాస్తే వాళ్ళు మాతృత్వాన్ని వ్యతిరేకించేవాళ్ళుగా ప్రచారం చేస్తారు తప్ప, వాళ్ళు వర్ణించినదానిలో వాస్తవం గురించి చచ్చినా బుర్రకెక్కించుకోరు. మాతృత్వం చుట్టూ అల్లిన ఒక మిత్‌ మాతృత్వాన్ని గ్లోరిఫై చేస్తుందే గాని అందులోని బాధల గాధలను వర్ణించదు. ఈ మిత్‌ని బద్దలు కొట్టింది స్త్రీవాదులే. లేబర్‌ రూమ్‌లోని వేదనామయ ప్రపంచాన్ని సాహిత్యంలో ఆవిష్కరించింది స్త్రీవాద రచయిత్రులే. స్త్రీల శరీరాల్లో జరిగే మార్పులు సమస్తాన్నీ, ఆఖరికి రుతుక్రమంతో సహా అక్షరాల్లో నిక్షిప్తం చేయడంతో సాహిత్యంలో మొదటిసారి చాలా తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. స్త్రీలు తమ అనుభవాల్ని, తమ ఆవేదనలను అక్షరీకరించి ప్రపంచం ముందు పెట్టినప్పుడు, ఆర్తిగా, ఆత్మీయంగా అర్థం చేసుకున్నవాళ్ళు బహుకొద్దిమంది. దాడికి దిగి, విష ప్రచారంతో మానసికంగా గాయపరిచినవాళ్ళే ఎక్కువ.
ఈ మధ్యనే ఒక తల్లి గుండెల్ని చీల్చుకుని వచ్చిన బాలింత డిప్రషన్‌ గురించి ఒక దినపత్రిక ప్రచురించిన కథనాన్ని చదివినప్పుడు కడుపులో చెయ్యి పెట్టి కెలికినట్లయ్యింది. చెప్పలేని ఒక ఉద్వేగం మనసంతా కమ్మేసింది. ఆ డిప్రషన్‌లో ఆ తల్లి తన కూతురితో సహా రైలుకెదురుగా నడిచిన సందర్భం గురించి చదువుతున్నప్పుడు గుండె అదిరినట్లయింది. ఆమె అలాంటి తీవ్రమైన మానసిక అలజడి నుంచి బయటపడి ఈరోజు విజయవంతమైన ప్రచురణలో నిలదొక్కుకోవడం నిజంగా అద్భుతమే. ఈ విషయన్ని ఎందుకు చెబుతున్నానంటే తల్లి పాత్రలో ఇమిడిపోయే ప్రతి స్త్రీ ఇంత తీవ్ర స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మానసిక అలజడికి శారీరక మార్పులకు గురవుతుంది. దీనిని అర్థం చేసుకుని ఆసరాగా నిలిచే సపోర్ట్‌ సిస్టమ్స్‌ ఏవీ లేవు. పైగా వాటిని గురించి అవహేళన, నిర్లక్ష్యంతో నిండిన ధోరణే కుటుంబ సభ్యుల్లోను,సమాజంలోను వుంది. బిడ్డకు చెయ్యల్సిన చాకిరీ, నిద్రలేమి, బయటి ప్రపంచానికి దూరమై, ఇంటి నాలుగ్గోడలకే అతుక్కుపోవడం లాంటివన్నీ ఆ మాతృమూర్తిని ఎంత నలిపేస్తాయె ఎవరూ అర్థం చేసుకోరు. ఆడపుట్టుక పుట్టినందుకు ఇవన్నీ చాలా సునాయసంగా ఎక్కడా వ్యతిరేకించకుండా నల్లేరు మీద బండిలా నడిపించుకెళ్ళిపోవాలని అందరూ ఆశిస్తారు గాని వాస్తవ సమస్యల గురించి పట్టించుకునే పద్దతే లేదు.
మాతృమూర్తుల దినోత్సవాలు జరుపుకోవడం గ్రీటింగుల ద్వారాను కాదు. పైపై నుంచి పొంగుకొచ్చే కవిత్వాలతో అసలే కాదు, మానవ జాతిని వృద్ధి చేసే మహత్తర కార్యాన్ని భుజాలకెత్తుకుని, ప్రకృతి తనకు మాత్రమే ప్రసాదించిన గురుతర బాధ్యతను ఎంతో నిష్టతో, ఇష్టంతో కొనసాగిస్తున్న సమస్త స్త్రీ జాతికి ప్రపంచం మొత్తం రుణపడి వుంది. మాతృత్వాన్ని మాటల మాయజాలంతో కీర్తించడం కాక, ఆమె బాధ్యతల్లో మనస్స్ఫూర్తిగా, ప్రేమగా, ఆత్మీయంగా, పాలు పంచుకోవాల్సిన అవసరం వుంది. బిడ్డల బాధ్యతను అంగీకరించగలిగే వున్నత సంస్కారం అలవర్చుకోవడం ఈనాటి తక్షణావసరం. మాతృత్వ మాధుర్యం గురించే కాదు, పితృత్వ మాధుర్యం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంతేగాని, స్త్రీలను, వారి జవజీవాలను పీల్చి పిప్పి చేసే చాకిరీల సమస్తం గురించి మాట్లాడకుండా ముఖం చాటేసి - మాతృమూర్తుల దినోత్సవాలు జరుపుతాం... మమ్మల్ని మంచుపల్లకీల్లో ఊరేగిస్తాం అంటే నమ్మడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు.

9 comments:

Kathi Mahesh Kumar said...

ఇది రెండోసారి చదవడం.మీరు చెప్పాలనుకున్న మూల విషయం నాకైతే అర్థం కావడం లేదు. తేడా మీ పొంతనలేని ఆలోచనలవల్లనో లేక రచనా శైలివల్లనో తెలియకుంది !

Bolloju Baba said...

తల్లి ఎవరికైనా ఒక ఎటర్నల్ ఫాసినేషన్.
బహుసా అందుకే తల్లులపై ఎక్కువ కవిత్వం ఉంటుంది. తండ్రులపై అంతటి ప్రభావవంతమైన సాహిత్యం తక్కువే. దీనికి మరో కారణం మెజారిటీ సాహిత్యం పురుషులే సృష్టించటం జరిగింది కనుక. తనగురించి తాను వ్రాసుకోవటం మోడెస్టీ కాదుకనక ఉండకపోవచ్చు.

స్త్రీలు సృష్టించిన స్త్రీవాద సాహిత్యాన్ని కొద్దిమంది విమర్శకులు తప్ప మెజారిటీ పాఠకులు ఆదరించారు, అభినందించారు. దీనిలో అక్కడక్కడా తండ్రి పాత్రపై కొన్ని కవితలను ఉన్నాయి. చాలా మంచి సాహిత్యంతో ఉన్నవి.

ఇక మీ వ్యాసంలో కనిపించిన మరో ప్రధాన అభియోగం మాతృత్వాన్ని గ్లోరిఫై చేయటం. అవును ఇది జరిగింది జరుగుతుంది. ఫిసికల్ గా తల్లి బిడ్డలనుంచి ఆశించేది తక్కువే, కానీ ఇచ్చింది మాత్రం చాలా చాలా ఎక్కువ. ఆ ఋణాన్ని ఇలా గ్లోరిఫై చేయటం ద్వారా తీర్చుకొంటున్నారేమో.

మరొక వాదన
ఇప్పుడు గ్లోరిఫై కానివేమున్నాయి? ప్రేమ ను గ్లోరిఫై చేసి, వాలెంటైన్ పేరుతోనో, గ్రీటింగ్ కార్డులపేరుతోనో కోట్ల వ్యాపారం జరగటం లేదా. పది సినిమాలలో 8 సినిమాలకు ప్రేమ ఆధారం కాదా? ఎంత వ్యాపారం దాని వెనుక.

రాఖీ పండుగలు, అక్షర తృతీయలు వంటివన్నీ గ్లోరిఫైడ్ మార్కేట్ టెక్నిక్స్ కాదా?

కత్తి గారు అన్నట్లు
బహుసా నాకామెంటు కూడా అర్ధం కాకుండా తయా్రయిందేమో!

బొల్లోజు బాబా

maa godavari said...

కత్తి మహేష్ కుమార్ గారూ
మీకు నా రచనలు అర్ధం కావని ఇదివరకే రుజువైంది.
నా ఆలోచనల్లో అస్పష్టత,పొంతన లేకపోవడం ఎప్పుడూ ఉండదు.
నేను చెప్పదలుచుకున్నది స్పష్టంగానే చెప్పాను.మీకు అర్ధం కాకపోతే అది నా తప్పు కాదు.

బొల్లోజు బాబా గారు
మీ కామెంట్ అర్ధం కాకుండా ఏమీ లేదు.సరిగానే ఉంది.

Anil Dasari said...

పోలిక తెచ్చారు కాబట్టి చెబుతున్నాను. తొమ్మిది నెలలు మోసి పిల్లల్ని కన్నందుకు తల్లికిచ్చే విలువలో కొంతైనా ఆ తర్వాత పాతికేళ్ల పాటు వాళ్ల బాగోగులు చూసే తండ్రికిస్తున్నారా ఎవరైనా? భార్య డెలివరీ రూములో ఉంటే అదిరే గుండెలతో బయట పచార్లు చేసే భర్తల ఆదుర్దా, భయం మీరు మగాడిగా పుడితేనే అర్ధమవుతాయి. ఒకరిది శారీరకమైతే ఒకరిది మానసికం. ఏదెక్కువ అంటే ఎలా చెబుతాం? కవిత్వమో కాకరకాయో, మాతృదేవతకి అదన్నా దక్కింది కదా. పితృదేవుడికి అదీ గతి లేదు.

తల్లీ తండ్రీ ఇద్దరూ కలిసే పిల్లల్ని పెంచేది. ఇందులో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేదేముంది? పిల్లల బాగు కోసం తమ ఆకాంక్షలని పక్కనబెట్టే తండ్రులెందరు లేరు? ఎంత స్త్రీవాదులయితే మాత్రం ప్రతి విషయంలోనూ ఆడాళ్లకి ద్రోహం జరిగిపోతున్నట్లు బాధపడిపోవాలా?

పురుటికి ఒక రోజు ముందు దాకా కూలికెళ్లటం, పురుటి నొప్పులు తగ్గక ముందే మళ్లీ పనికెళ్లటం వంటివి ఆ కుటుంబ పేదరికానికి చిహ్నాలే కానీ ఆ మాతృమూర్తికి జరుగుతున్న అన్యాయానికి కాదు. అటువంటి స్థితిలో ఉన్నందుకు ఆ కుటుంబం మీద జాలి చూపించండి - కుటుంబాన్ని ఎవరికి వారుగా విడగొట్టి మీ జాలిని ఆడాళ్లకి మాత్రమే పంచకండి.

Anonymous said...

నాకు అబ్రకదబ్రగారు ఎందుకో అమితంగా నచ్చేస్తున్నారు.

Kathi Mahesh Kumar said...

కుటుంబ వ్యవస్థ విఛ్చిన్నమైపోతున్న సమాజాలలో ఈ "దినాల" అవసరం చాలా వుంది. మారుతున్న పరిస్థితులదృష్ట్యా, మనకున్న పాశ్చ్యాత్య అనుకరణల ధోరణి నేపధ్యంలో ఇవి ఇక్కడా ప్రవేశించాయి.ఇందులో value judgment కన్నా, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పిల్లలు ఏంచేస్తున్నారో తెలుసుకుంటే మీ దుగ్ధ కొంచెం తగ్గుతుందేమో !

మాతృత్వానికే కాక పితృత్వానికి కూడా విలువనిస్తూ ఫాదర్స్ డే కూడా జరుపబడుతుంది. కాబట్టి ఈ ఏకపక్ష ప్రేమ మీరు చెప్పినంత దారుణమేమీ కాదు.

రోజువారీ అమ్మకష్టాన్ని కేవలం చూసే పిల్లలు, సంవత్సరంలో ఒక రోజు పనిగట్టుకుని ప్రేమ చూపించే ప్రయత్నం చేస్తే అందులో జరిగిపోయే దారుణమేమిటో నాకైతే అర్థం కావటం లేదు. వాళ్ళపిల్లలిచ్చిన గ్రీటింగ్ కార్డుల్ని ఫ్రిజ్ తలుపులకు అంటించి మురిసిపోయిన తల్లులు చాలా మంది నాకు తెలుసు. వారికి ఆ ఆనందంకూడా వద్దంటారా?

తల్లితనాన్ని పొగడటం ద్వారా పిల్లలు కనలేని తల్లుల్ని అవమానిస్తున్నారంటున్నారు. ఇంతకంటే నిర్హేతుకమైన వాదన మరొకటుండదు. తల్లవని ఆడదాన్ని ప్రతిరోజూ ఈ సమాజం, ముఖ్యంగా తోటిఆడవాళ్ళు ఎలాగూ సూటిపోటి మాటలతో సాధిస్తారు. ఈ ఒక్కరొజుతో ఆమె కష్టాలు రెట్టింపైపోతాయని మిగతావాళ్ళ ఆనందాన్ని తృంచేద్దామంటారా?

స్త్రీగర్భం ధరించిన తరువాత కుటుంబం, సమాజం,ప్రభుత్వం ఏఒక్కరోజూ తమ బాధ్యతల్ని నిర్వర్తించిన దాఖలాలు మీకు కనబడలేదన్నారు. దీన్నిబట్టి మీరు ప్రపంచానికి ఎంతదూరంగా వున్నారో తెలుస్తోంది.మరి ఈ బాధ్యతలన్నీ ఎవరు నెరవేరుస్తున్నారు? మీలాంటి స్త్రీవాదులా, స్వచ్చంధ సంస్థలా లేక పైనున్న దేవతలా? ఎవళ్ళూ ఏమీ చెయ్యకుండానే మీలాంటివాళ్ళ సంకల్పబలంతో అన్నీ సకరమంగా జరిగి భారతదేశ జనాభా రోజురోజుకీ అభివృద్ధి చెందుతోందా!

గర్భందాల్చిన భార్య మానసిక స్థితి భర్తకికాక ఇంకెవరికి తెలుస్తుంది? భార్య మానసిక వత్తిళ్ళ(మూడ్ స్వింగ్స్)వలన ఏర్పడే కుటుంబ టెంషన్ భర్తకాక ఇంకెవ్వరు భరిస్తారు? లేబర్ పెయిన్ సృష్టిలో అత్యంత వేదనభరితమైన బాధ అని తెలీకుండానే అర్బన్ మేల్ బతికేస్తున్నాడనా మీ భావన?

ఇంతా చెప్పి, మళ్ళీ కడుపునిండా పాలివ్వాని క్రూరత్వాల గురించి మధ్యలో చెప్పారు...అదెక్కడ్నుంచీ వచ్చింది? అంటే celebrate చేస్తే ఒక తపొప్పు...వీటిమధ్యలో అక్కడక్కడా జరిగే deviations మీద ఫోకస్ లేదని మరో విరుపు. చేసినా తప్పే చెయ్యకపోయినా తప్పే అన్నమాట.

"మానవ జాతిని వృద్ధి చేసే మహత్తర కార్యాన్ని భుజాలకెత్తుకుని, ప్రకృతి తనకు మాత్రమే ప్రసాదించిన గురుతర బాధ్యతను ఎంతో నిష్టతో, ఇష్టంతో కొనసాగిస్తున్న సమస్త స్త్రీ జాతికి ప్రపంచం మొత్తం రుణపడి వుంది." అంటూ మీరూ పనిలోపనిగా మంచుపల్లకీ ఎక్కించేసి..ఆ తరువాత ఇలా చేసే మగాళ్ళని మాత్రం అటకెక్కించి అగ్గంటిచెయ్యాలంటారు. ఏమిటీ విపరీతం?

మీ ఆలోచనల్లో పొంతన లేదుగానీ,బాణం ఎక్కుపెట్టి స్త్రీవాదులు కానివాళ్ళని చీల్చి చెండాడమంటే మాత్రం పదాలు జాలువారతాయి.

ఈ మధ్యనే "అమ్మ" అనే ఒక సంకలనంకూడా బ్లాగుటపాలతో కూర్చబడింది.దాన్నికూడా చదివి మరింత బలంగా ఇంకో టపా రాయండి.

సుజాత వేల్పూరి said...

అబ్రకదబ్ర గారు,
మీరు నాకు కూడా భలే నచ్చేసారు ఇక్కడ! పిల్లల విషయంలో తల్లి ఎక్కువ, తండ్రి తక్కువ అనే విషయం నేనూ ఒప్పుకోను. పిల్లల కోసం సర్వం త్యాగం చేసిన తండ్రులని నేనెరుగుదును.

బాలింతలని పట్టించుకోకుండా, వారి బాధల్లో పాలు పంచుకోకుండా కుటుంబ సభ్యులు వదిలేస్తున్నారన్న సత్యవతి గారి వాదనతో నేను ఏకీభవించలేకపోతున్నాను. ఎటువంటి కుటుంబాలను ఉదాహరణగా చూపిస్తున్నారో అర్థం కావటం లేదు. ఆ టైం లో కుటుంబ సభ్యూలకంటే ఎక్కువగా ఎవరు ఆదరిస్తారు, అర్థం చేసుకుంటారు? "నల్లేరు మీద బండిలా ఇవన్నీ నడిపించుకెళ్ళిపోవాలి" అని ఎవరూ ఆ సమయంలో చెప్పగా నేను చూడలేదు.

సత్యసాయి కొవ్వలి Satyasai said...

సత్యవతిగారు స్త్రీలకోసం చేస్తున్న సేవ చాలా గొప్పది. ఆవిడ కమిట్మెంటు, కార్యపటిమ భూమిక ద్వారా, హెల్ప్ లైన్ లాంటి కార్యక్రమాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆడవాళ్లు కష్టపడుతున్నారు, కానీ అందరూ కాదు. అలాగే గొడ్రాలిని, విధవని అవమానించేవాళ్ళలో ఆడవాళ్ళే ముందుంటారు. కానీ ఒకసారి స్త్రీ వాదానికి కమిటయ్యాకా ఆడవాళ్ల ప్రతీ కష్టానికీ పురుషుడే కారణం అని మాత్రమే అనిపించడం సహజం. ఏదైనా ఒక ఇజానికి బానిసయితే అంతే. కమ్యూనిష్టులది కూడా ఇదే సమస్య. ధీన్ని అంత 'కత్తి' తో ఖండించక్కరేలేదు :). just perspective issue.

సుజాత వేల్పూరి said...

సత్యసాయి గారు చెపిన మాట నిజం! సంతానం లేని స్త్రీలని(అసలు వాళ్ళని గొడ్రాళ్ళు అనడమే రాక్షసత్వం) గొడ్డుమోతులని అవమానించే వాళ్లలో సాటి స్త్రీలే ప్రథములు! సత్యవతి గారు భూమిక హెల్ప్ లైన్ ద్వారా పీడిత స్త్రీలకు చేస్తున్న సేవ అసామాన్యమే! కాదనలేం!

కానీ ఈ టపా లో బాలింతలని నిర్లక్ష్యం చేయడం అనేది నాకు వింతగా తోచింది. ఎందుకంటే సర్వ సాధారణంగా బాలింతలను జాగ్రత్తగా చూసుకోవడం, వారి మనోభావాలకు విలువ ఇవ్వడం ఏ కుటుంబంలోనైనా ఉన్నదే! కొన్ని ప్రత్యేక వర్గాల సంగతి అయితే ఆ విషయం పేర్కొనాలి.

అబ్రకదబ్ర,
నిన్న ఇంకో విషయం చెప్దామని మర్చిపోయాను. భార్య డెలివెరీ రూం లో వుంటే బయట అదిరే గుండెలతో భర్తలు తిరగడం నేనూ ఒప్పుకుంటాను. దాన్ని అర్థం చేసుకోవాలంటే మగాడై పుట్టక్కర్లేదు. ఎందుకంటే అయినవాళ్ళు ఆపరేషన్ థియేటర్ లో ఉంటే బయట వాళ్లకెలా ఉంటుందో చాలా మంది ఆడవాళ్లకు కూడా తెలుసు. లోపల ప్రసవ వేదన పడే భార్యల (మానసిక స్థితి వదిలేయండి) శారీరక పరిస్థితి అర్థం చేసుకోవాలంటే మాత్రం తప్పక స్త్రీ జన్మ ఎత్తి (ఎత్తితే సరిపోదు)ప్రసవ వేదన పడి తీరాల్సిందే!

"మరణం అంటే ఇదే" అనిపించే క్షణం స్త్రీ జీవితంలో అప్పుడే అనిపిస్తుందేమో!
"ఆడజన్మ వద్దంటే వద్దు" అనిపించే క్షణం కూడా అదే!
కానీ ప్రకృతిని తిరస్కరించలేరు కాబట్టి రెండు మూడు సార్లు కూడా మరణాన్ని స్వయంగా స్పృశించడానికి ఆడవాళ్ళు సిద్ధపడతారు.

ఆ ఒక్క పాయింట్ తప్పించి తల్లీ తండ్రులు ఇద్దరి బాధ్యతా సమానమే నన్న మీ వాదనతో ఏకీభవిస్తున్నాను.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...