మా ఊరు సీతారామపురం-నా లైఫ్ లైన్


    ఆయ్‌! మాది నర్సాపురమండి. కాదండి... కాదండి నర్సాపురానికి నాలుగు మైళ్ళ దూరంలో వుందండి మావూరు. సీతారామపురం. మా గొప్పూరు లెండి. నిజానికి అదసలు ఊరులాగుండదండి. 'అప్పిచ్చువాడు వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారు ఏరు' అని ఏమనగారు చెప్పినలాంటియ్యేమీ మా వూర్లో లేవండి. ఇప్పటిగ్గూడ మా ఊరికి బస్సు లేదంటే మరి మీరు నమ్మాలండి. నమ్మకపోతే మీ ఇష్టమండి. మా వూర్లోనండి ఏమున్నా ఏం లేకపోయినా బోలెడన్ని తోటలున్నాయండి. మామిడి, జీడిమామిడి, సపోటా, సీతాఫలం తోటలేనండి ఊర్నిండా. ఇక సరుగుడు తోటలగురించి, వాటి ఈలపాట గురించి ఏం చెప్పమంటారు. నే సెపితే కాదండి మీరు ఇనాలండి. తాడితోపులు, కొబ్బరిచెట్లు కూడా ఊరంతా వున్నాయండి.
    మా యింట్లో మేం సుమారు 50 మంది పిల్లలుండేవాళ్ళం.ఏసంగి శెలవులొస్తే ఇంకా పెరిగిపోయేవారు. మా తాతకి ఏడుగురు కొడుకులు. ఇద్దరు కూతుళ్ళు. మా చిన్నప్పుడు మేమందరం కలిసే వుండేవాళ్ళం. మా అమ్మ వాళ్ళ్ళ్ళు రోజూ వందమందికి వండి పెట్టేవాళ్ళంటండి. చివరాకర్న ఆడోళ్ళకి ఏముండేది కాదంట. అది వేరే సంగతిలెండి. మరొకసారి చెబుతాను  ఆ సంగతులు.
    మీరందర జీడిపప్పు బోలెడ్డబ్బెట్టి కొనుక్కుంటారుకదా. మాకైతే ఊర్నిండా జీడితోటలే. మేం పిల్లలందరం కలిసి వేసంగి శెలవులొస్తే కోతుల్లాగా చెట్లమీదే ఎగురుతుండేవోళ్ళం. జీడిపళ్ళు చీక్కుంట, గింజల్ని చెట్లకిందే కాల్చుకుంట, జీడిపప్పు తెగ తినేవోళ్ళం. ఇప్పుడేమో కొలస్ట్రాలని భయపెడుతున్నారుగాని మేం తిన్నంత జీడిపప్పు ఎవ్వరూ తినుండరంటే నమ్మండి. మా కూరల్నిండా పచ్చిజీడిపప్పే. చింతచిగురు, మామిడి కాయ, వంకాయ కోడిగుడ్లు అన్నింట్లోను కలిపేసుకుని వండేసుకునేవాళ్ళం. చింతాకు జీడిపప్పు కూర  రుచి నే చెబితే ఏం తెలుస్తుంది. తిని చూడాలంతే.
    వేసంగి శెలవుల్లో మా పిల్లమూకంతా ఆడపిల్లలైతే లంగాలకి కచ్చాలుపోసి, మొగపిల్లలైతే జేబుల్లోకి గంపెడేసి చింతచిగురు కోసి కుప్పలు పోసేవోళ్ళం. చిటారుకొమ్మల్లోకి పాక్కున్టూ వెళ్ళిపోవడం బలే మజాగా వుంటుంది. చింతాకు ఉడకబెట్టి బిళ్ళలు చేసేవోళ్ళు. ఆకు ఎండబెట్టి డబ్బాల్లో పోసేవోరు. మాకు సంవత్సరమంతా చింతాకు, చిన్తపరిగెలు, మెత్తళ్ళు,చిత్తడాయిలు, చెంగుడుపట్టు- ఇయ్యన్ని ఏంటీ అనుకుంటున్నారా? చేపలండీ బాబు చేపలు. ఈ చేపలన్నీ చింతాకుతో కలిపి ఒండుకుతింటే  ఇంకేమీ ఒద్దనిపిస్తదండి. మీరు కూడా పశ్చింగోదావరి వాళ్ళయితే ఇయ్యన్నీ ఈజీగా తెలిసిపోతాయండి.
    ఏసంకాలంలో మామిడి పళ్ళతోపాటు మాన్చి రుచైన పండు మరోటుందండి. మీరెప్పుడైనా తాట్టెంక తిన్నారా? చెట్టుమీద ముగ్గిన తాటి పండు నిప్పులమీద కాల్చుకుని తిన్నారంటే..... ఎందుకులెండి వర్ణిఅమ్చడం. మీరెరూ తినుండరు. పోనీ కుంపటేసిన తేగలన్నా తిన్నారా లేదా? కనీసం బుర్ర గుంజయినా తిన్నారా? తినుంటే మాత్రం వందేళ్ళొచ్చినా ఆ రుచుల్ని మర్చిపోవడం వుండదండి. సరే. మా ఊరినిండా పళ్ళతోటలే కాదండి కూరగాయల పాదుల ఎక్కువేనండి. వంకాయలు, దొండకాయలు, బీర, సొర, పొట్ల, గోరుచిక్కుళ్ళు, టమెటాలు, పచ్చిరగాయలు, గోన్గూర, తోటకూర ఒకటేమిటి అన్నీ పండిస్తాం. వీటన్నింటికి నీళ్ళెక్కడినించొస్తాయా అని ఆలోచిత్తన్నారా ఏంటి? నుయ్యిలు తవ్వుతారు. పదడుగులు తవ్వితే చాలు బుడబుడమని  నీళ్ళూరిపోతాయి. రెండు కుండల్లాంటివుంటాయి. వాటిని బుడ్లజోడంటారండి. ఈ బుడ్లజోడుని నూతుల్లోని నీళ్ళతో నింపి కూరపాదులకి నీళ్ళుపోస్తారు. బుడ్లజోడుతో నీళ్ళపోత అంటారు సిపుల్‌గా.
    మా నాన్న చాలా కష్టజీవి. గోచిపెట్టుకుని బుడ్ల జోడుతో పాదులకి నీళ్ళపోతపోసి, పచ్చిగడ్డి కోసుకుని ఇంటికొచ్చి అలిసిపోయి అలానే వీధరుగుమీద పడి నిద్రపోయేవాడు. నేను నాన్నతో కలిసి పాదుల్లో పనిచేసేదాన్ని. గొడ్డలితో కట్టెలు కొట్టేదాన్ని. పాలు పితికేదాన్ని.నూతుల్లో దిగి బోలెడన్ని చేపలు పట్టేదాన్ని. ఎపుడూ ఊరిమీద బలాదూర్‌ తిరిగేదాన్ని. నువ్వాడపిల్లవి. ఇలాంటి పనులు చెయ్యకూడదు అని ఏనాడూ మా నాన్న నాకు చెప్పలేదు. నేనేం చేసినా అడిగేవోడు ఎవ్వడూ లేడనుకోండి.
    ఓసారి నూతిలో దిగి చేపలు పడుతుంటే సీసాపెంకు గుచ్చుకుని ఒకటే రక్తం. నేనేం భయపడలేదు. ఆ నూతుల్లోనే వున్న మెట్టతామరాకు ముద్దగా చేసి తెగిన చోట పూసేసానంతే. తెగిందని ఆరోజు ఎవ్వరికీ చెప్పలేదు. కానీ ఈ రోజుకి నా ఎడం చేయి మణికట్టు దగ్గర ఆ మచ్చ అలాగే వుండిపోయి, ఆ అల్లరి రోజుల్ని గుర్తుచేస్తంటుంది. తేగబుర్రల్ని కత్తితో కొడుతుంటే తెగిన మచ్చ కూడా ఎడం చేతి చూపుడు వేలు మీద వుందండోయ్‌. మరేంటనుకున్నారు. ఆ మచ్చల వెనక ఇంత మహా చరిత్ర వుందిమరి.
    తోటలెంబడి తూనీగలాగా తిరుగుతుండేదాన్ని కదా! నాకు బయమంటే ఏంటో తెలియదండి. కాని ఒక్క బావురుపిల్లికి  మాత్రం తెగ భయపడేదాన్ని. మా యిల్లు రైలుబండంత పొడుగుండి చాలా పెద్దమండువా ఇల్లండి. బోలెడంత పెరడు వుండేది. గుమ్పులుగా కోళ్ళు తిరుగుతుండేవి. ఈ కోళ్ళ కోసం రాత్రిళ్ళు బావురు బావురంటూ బావురుపిల్లి వచ్చేదండి. కోళ్ళు  గూళ్ళో దూరి కోడినెత్తికెళ్ళి తినేసేది. పిల్లొచ్చినపుడు కోళ్ళు గోల గోలగా అరిచేవండి. నా గుండెల్లో రైళ్ళు పరుగెట్టేవి. గుడ్లు మిటకరించి అటకమీదికి చూస్తుండేదాన్ని. అటకమీంచి బావురుపిల్లి  నా మీదికి  దూకేస్తుందని తెగ భయపడేదాన్ని. నేనెంత మొద్దునంటే పిల్లిక్కావలిసింది కోడిగాని నేను కాదుగా. అది ఈ మొద్దుబుర్రకు అర్తం కాడానికి చాలా కాలమే పట్టింది. అదండి సంగతి.
    మా వూర్లో నాకు ఎక్కువ యిష్టమైంది, ప్రాణప్రదమైంది అమ్మోరి తీర్తం.  మా వూరి దేవత పేరు మారమ్మ. సంవత్సరానికి ఒకసారి జాతర చేస్తారు. తీర్తం పదిరోజులుందనగానే  పిల్లల హడావుడి మొదలయ్యేది. తాటాకులు కోసుకొచ్చి బుల్లి బుల్లి బుట్టలల్లేవాళ్ళం. వీటిని జాజారి బుట్టలు అనేవాళ్ళు. ఒక్కొక్కళ్ళకి రెండేసి బుట్టలన్నమాట. బుట్టల్లో  మట్టి నింపి నవధాన్యాలు వేసి నీళ్ళు పోసేవాళ్లం. పొద్దున లేవడం బుట్టలన్నీ వీధరుగుమీద పెట్టుకుని మొలకలొచ్చినయ్య లేదా అని చూసుకునేవాళ్ళం. అన్నింటి కన్నా ముందు పెసల మొక్కలొచ్చేవి. తీర్తం నాటికి జాజారి బుట్టల్నిండా పచ్చటి మొక్కలు గుబురుగా వచ్చేసేవి. తీర్తం నాటిముందు రోజు రాత్రి ఆసాదులు మోళీ కట్టేవాళ్ళు. ఆసాదులంటే ఎవరో చెప్పలేదు కదా!  మారమ్మ తీర్తంలో ఘటాలనే గరగలంటారు. ఈ  ఆసాదుల గరగల నృత్యం చూసి తీరాల్సిందే. మాదిగడప్పుకు అనుగుణంగా వారు వేసే స్టెప్‌లు, ఏ మెగాస్టార్‌ కూడా వెయ్యలేదండోయ్‌. ఆ... అన్నట్టు మెగాస్టార్‌ మా వూరివాడేనండి. మా బస్సులోనే వచ్చి మాకు బీటేసినవోడేనండోయ్‌. ఆ ముచ్చట మరోసారి చెబుతాలెండి. ఈ ఆసాదుల  మోళీ అబ్ధుతంగా వుంటుంది.  మోళీ అంటే మరేం కాదండి మేజిక్‌ అన్న మాట. మనిషి నెత్తిమీద నల్ల దుప్పటి కప్పి, పొయ్యేట్టి పకోడీలువొన్డేసేవోరు. జేబుల్లోంచి రూపాయల కట్టలు లాగి దండల్లాగా మెళ్ళో వేసుకునేవోళ్ళు. పేకముక్కల్ని ఫెవికాలెట్టి అంటించినట్టు సర్రున ఎగరేసేవోళ్ళు. మేం పిల్లలం నోళ్ళు ముయ్యడం మర్చిపోయి మొద్దురాచ్చిప్పల్లా చూస్తుండిపోయేవాళ్ళం. పి.సి. సర్కార్‌ మేజిక్‌ షో వాళ్ళముందు పనికిరాదంటే నమ్మండి.
    ఇంక తీర్తం రోజు సంగచ్చెబుతాను. తలంటుస్తానం చేసేసి, వుంటే కొత్తబట్టలేసేసుకుని ఆసాదుల రాకకోసం ఎదురుచూత్తా కూచొనేవాళ్ళం. డప్పుల హోరుతో ఆసాదులెళ్ళి ఊరి పొలిమేరల్ని కట్టేసి వచ్చేవోళ్ళు. ఆసాదుల వెంటపడి రెండు చేతుల్లో పచ్చటి జాజారి బుట్టలతో మిడతల దండులాగా పిల్లల గుంపు. బుట్టలో జానేడేసంత పచ్చటి మొక్కలు. ఆసాదులు గరగల నృత్యంతో ముందుకెళుతుంటే వాళ్ళ వెనకాల మేము. గుడి వరకూ అలా వెళ్ళి బుట్టల్ని గుడిచుట్టూ తిప్పి గుడి గోపురం కింద అంచుల మీద పెట్టేసేవోళ్ళం. గుడంతా పచ్చగా కళకళల్లాడిపోయేది. అసలు పిల్లలు బుట్టల్తో నడుస్తుంటే పచ్చటి తివాసీని మోసుకెళుతున్నారా అన్నంత ఆకుపచ్చగా వుండేది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నా కళ్ళకి ఆ పచ్చదనం అగుపిస్తుందంటే మీరు నమ్మితీరాలి మరి.
     దీపాళి పండగ గురించి ఏం చెప్పమంటారు. ఎప్పుడూ డబ్బుల్తో దీపావళి టపాసులు కొనలేదు మేం. అన్నీ మేమే తయరు చేసుకునేవాళ్ళం. పేటేప్‌ కాయలు ( తాటాకులతో చేసేవి), మతాబులు,  సిసింద్రీలు, చిచ్చుబుడ్లు అన్నీ చేసేవోళ్ళం. ముడిసరుకులు కొనుక్కొచ్చి తయారు చేసేవోళ్ళం. మతాబులు చేయడానికి ముందు కాగితం గొట్టాలు చెయ్యలిగా. అలాగే సిసింద్రీ గొట్టాలు. కాయితం, అన్నం మెతుకులు వుంటే గొట్టాలు రెడీ. వాటిల్లో మందుకూరి ఎండకి పెట్టేవోళ్ళం. తాటాకుల్ని మెలికతిప్పి, మందుకూరి, వొత్తిపెడితే పెటేప్‌కాయ రెడి. మేం చేసినవి ఫట్‌ ఫట్‌ మని పేలేవి. మతాబులు జలతారు పువ్వుల్ని రాల్చేవి. సిసింద్రీలయితే  సుయ్‌మని ఎగిరిపోయేవి. ఇవన్నీ కాకుండా దీపావళికి మేం ఓ ప్రత్యేక వస్తువు  తయారు చేసేవోళ్ళం. ఉప్పు, ధాన్యపువూక, పేడ కలిపి ఓ మూటలాగా చేసి తాడు కట్టేవోళ్ళం. మూట మధ్య నిప్పురవ్వేస్తే, ఉప్పు టపటప పేలేది. తాడుతో ఆ మూటని గుండ్రంగా తిప్పితే మనచుట్ట నిప్పుల వలయం  ఏర్పడుతుంది. పేడ, వూక కాలుతుంటే ఉప్పురవ్వలు ఎగిసేవి. ఈ ఉప్పు మూట దీపావళికి స్పెషల్‌ ఎట్రాక్షన్‌ తెలుసాండి.
    వినాయక చవితికి కూడా మేం ఎండుపల్లేరుకాయల్ని మూటగట్టి ఇంటికొచ్చే కొత్తల్లుళ్ళని తెగ బెదిరించేవాళ్ళం. మా అల్లరికి బావలు పరుగో పరుగు. అల్లుళ్ళని చాలా రకాలుగా ఏడిపించే వాళ్ళం. ఆకునిండా భోజనం పెట్టి, ఆకు కింద ఆవాలు పోసి, సన్నటి  తాడుకట్టి ఆయన భోజనానికి కూర్చుని తినడం మొదలెట్టగానే ఆకుని లాగేసేవాళ్ళం. కింద ఆవాలుంటాయిగా ఆకు ఈజీగా కదిలిపోయేది. ఇంటల్లుడి ముఖం చూడాలి. అందరం గొల్లున నవ్వేవాళ్ళం. అలాగే గారెల్లో బండారు గాజులెట్టి అల్లుడికి పెట్టేవాళ్ళు. ఆయన ఆనందంగా  గారెలు లాగించబోయేసరికి గాజు గట్టిగా పళ్ళకి తగిలి బెంబేలెత్తిపోయేవాడు. మేం నవ్వుకుంటూ గాజుకు సరిపడా డబ్బులివ్వాలని ఆటపట్టించేవాళ్ళం. ఇవన్నీ పండగ సరదాల్లో భాగమేనండోయ్. పండగ సంబరాలు ఎంత రాసినా తనివి తీరదు . ఉగాదికి అరకలు కట్టి దున్నడాలు, సంగ్రాంతికి దుంలెత్తుకొచ్చి భోగిమంటలేయడాలు, కార్తీక వమాసం చలిరోజుల్లో తెల్లవారు ఝామునే గోదావరిలో మునగడాలు, అట్లతద్దికి ఉయ్యల లూగడాలు ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో సంబరాలు.
     మావూరి గొప్పదనం గురించి ఇంకేం చెప్పమంటారండి బాబు! మాకు ఒక వేపు గోదారి. మరోవైపు సముద్రం. గోదావరి నాలుగు కిలోమీటర్ల దూరంలో వుంటే  పది కిలోమీటార్ల దూరంలో సముద్రం. నా బతుకు మా వూరి పచ్చదనంతోటి, మా వూరి చుట్టు వున్న నీళ్ళతోటి ముడిపడిపోయింది. వెన్నెల్లో గోదారి మీద లాంటి ప్రయణం, అంతర్వేది రేవు, అన్నాచెల్లెలగట్టు, కొనసీమ కొబ్బరి చెట్లు ఇవన్నీ నా జీవితంలో అంతర్భాగాలు. నా బాల్యం ధగధగ మా గోదారి గట్టుమీద సూర్యబింబం మెరిసినట్టు మిరుమిట్టు గొలుపుతుంటుంది.
    నేనేం టాటాలు, బిర్లాల్లాగా నా నోట్లో బంగారపు చెంచా పెట్టుకునేం పుట్టలేదు సుమండి. నేను పుట్టింది ధాన్యపు కొట్లోనంట. మా అమ్మ నిండు నెలల్తో ధాన్యపు కొట్లోంచి ధాన్యం తీస్తోందట. అమాన్తం నేను పుట్టేసానంట. కొవ్వాసు పీసు ( ఒక రకం చేప) లాగా వుండి ఈరోజో రేపో అన్నట్టుండేదాన్నంట. నా కర్మకాలి నే పుట్టిన పద్నాలుగో రోజే మా అమ్మమ్మ  చచ్చిపోయిందంట.  నా చదువుకూడా అంతే. మా వీధరుగు మీదే బడి వుండేది. బుద్ధిపుడితే కూర్చునేదాన్ని. లేకపోతే చెట్లెక్కేదాన్ని. టీకాల వాళ్ళు వస్తే మాత్రం నేను చిక్కడు, దొరకడు. చిటారు కొమ్మల్లోకి ఎక్కి కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయాక దిగేదాన్ని. నా కెవరన్నా భయముండేది కాదు కాని టీకాల వాళ్ళంటే ఆ సూదులు  చూసి భయమేసేది.
     నా కెందుకు, ఎలా, ఎపుడు పుట్టిందోగాని చదువుకోవాలనే కోరిక మాత్రం పుట్టేసింది. మా కుటుంబంలో అటు ఇటు చదువుకున్న వోళ్ళే లేరుమరి. నాకెలా పుట్టిందో తెలియదు. చదువుకోసం ఎంతో పోరాటం చేయాల్సివచ్చింది. మా నాన్నకి నన్ను చదివించాలనే వుండేది కాని డబ్బుల్లేవు. ఉమ్మడి కుటుంబానికి ఆయన చాకిరీ చేసేడు గాని చిల్లి కాని కూడా వుండేది కాదు. నా చదువు సమాచారం క్లుప్తంగా చెబుతాను. అయిదు వరకు ఊర్లోనే చదివాను. ఆరునించి పదివరకు ఓరియంటల్‌ స్కల్‌. అంతా సంస్కృతం మయం. మా సంస్కృతం మేష్టారు శ్లోకం తప్పు చదివితే స్కల్‌ చుట్టూ తిప్పి కొట్టేవోరు. ఒకసారి నేను ఆయనకి దొరక్కుండా బాదం చెట్టెక్కి కూర్చున్నా. ఆయన కోపం ఆపుకోలేక గోడకేసి తలబాదుకున్నాడు. నేను కిందికి వచ్చేసాను గాని ఆయన నన్ను కొట్టలేదు. నేను టెంత్‌ వరకు సంస్కృతం, ఇంటర్‌లో తెలుగు లిటరేచర్‌, డిగ్రీలో ఇంగ్లీషులిటరేచర్‌ చదవడమ్ వల్ల   సాహిత్యం మీద వల్లవలిన ప్రేమనాకు.
    మళ్ళీ ఓసారి మా ఊరి కెళదావ! మా ఊరికి బస్సులేదని ముందే చెప్పానుకదండి. నడవాల్సిందే! పదండి నడుద్దాం. కాలవ దగ్గర ఎర్ర బస్సుదిగి నడవడం మొదలెడితే మీకు ఇళ్ళేం కనబడవు. ఒక వేపు జీడితోటలు, మరోవేపు సరుగుడు తోటలు. ఆ తోటల్లో పడి ఓ మైలున్నర నడిస్తే  మా ఇల్లొస్తుంది. ఆ.... అన్నట్టు మీకు ఇంకో రహస్యం చెప్పడం మర్చిపోయా. ఎవరికి చెప్పకండేం. ఎండు సరుగుడాకులు చూసారా ఎపుడైనా? ఎండిపోయిన సరుగుడాకుల్ని తెల్ల కాగితాల్లో చుట్టుకుని గుప్‌ గుప్‌ మని పీల్చి పొగవొదిలేవాళ్ళం. హమ్మ! ఎంత రౌడీ పిల్లలు అని ముక్కుమీద వేలేసుకుంటున్నారా?  'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు' అని మహాకవే అన్నాడు నాదోలెక్కా. మాకు సిగరెట్లు తయరు చేయడం ఎంత సులువో తెలిసిపోయింది.  మాకు నోబుల్‌ ప్రైజ్‌ ఇవ్వాలికూడా.
    మీకు మరోరహస్యం కూడా చెబుతానండి. ఎవరితోనుచెప్పకండి. మా నాయనమ్మ రోజూ పొద్దున్నే మాన్చి్ పోత్తాడి కల్లు ముంతలు ముంతలు లాగించేదంటండి. మీకు ఇంకో సీక్రెట్టు చెప్పేస్తున్నాను. కాచుకోండి. మేం కూడా తాటాకు దొన్నుల్లో నింపుకుని పోత్తాడి కల్లు తాగేసేవోళ్ళమండి. మా ఇంటెనక ఓ  పోత్తాడి వుందండి. దాని కల్లు భలే తియ్యగా వుండేదండి. కల్లు అనగానే చాలా మంది మొకాలెందుకో తుమ్మల్లో పొద్దుగకినట్టయిపోతాయి. ఎందుకో నా కర్థమే కాదు. ముంజలు మాత్రం జుర్రుకుంట తినేస్తారు కాని కల్లంటే ఆముదం తాగిన మొకాలు పెడతారు. కల్లంటే కల్తీ కల్లనుకుంటున్నారా ఏంటి కొపదీసి. కాదండి బాబూ! మా వూరి ఈడిగ ఎంకట్రావుడు కల్లు తీస్తాడు. తెల్లారగట్లే అతను చెట్టెక్కడం మనం చెట్లకింద చేరడం. ఫ్రెష్‌. తాగితే అపుడే దింపిన కల్లే తాగాలండి. లేకపోతే యమ డేంజర్‌. కొబ్బరి నీళ్ళలాగానే వుంటదండి. ఒట్టండి. ఆరోగ్యానికి అపుడే తీసిన కల్లు చాలా మంచిదని  మా ఎంకట్రావుడు చెపుతాడండి. ఇదండి మావూరి కల్లు బాగోతం.
    మీరందరూ గోలీకాయల్తో గోలీలాడితే మేమ్  జీడిపిక్కల్తో గోలీలాట ఆడి బోలెడు జీడిగింజల్ని సంపాదించేవాళ్ళం. ఆ తర్వాత వాటిని అమ్మి  డబ్బులు సంపాదించేవాళ్ళం. పుస్తకాలు కొనుక్కోవాలికదా! డబ్బులంటే గుర్తొచ్చింది. మేం డబ్బులు కూడా తయరు చేసేం. ఫెయిలయామనుకోండి. చిల్ల పెంకుల్ని గుండ్రంగా అరగదీసి సిగరెట్‌ పెట్టెల్లో వుండే ముచ్చిబంగారం అంటించి కొట్టుకు తీసుకెళ్ళి ( రాత్రిపూట) నిమ్మతొనలిమ్మంటే, చిల్లపెంకుల్ని తీసుకుని మా వీపుల్ని  విమానంమోత మోగించిన విషయం గుర్తొస్తే చచ్చేంత నవ్వొస్తుంది నాకు. ఇంకా బలుసుచెట్ల కొమ్మలకుండే ముళ్ళకి నేరేడు పండ్లు గుచ్చి ద్రాక్ష గుత్తుల్లా చేసినా, పుంతలోని ఇసకలో ఉసిరి కాయల్ని కప్పెట్టి మర్నాడు తొనలు తొనలుగా వొలుచుకుతిన్నా, బ్రహ్మజెముడు కాయల్ని  కాళ్ళంతా పూసుకుని అమ్మోరక్తం  అని గగ్గొలు పెట్టినా, పిచ్చికాయలు, తాటాకు కలిపి నమిలి కళ్ళీ కన్నా ఎర్రగా నోరు పండించుకున్నా ఇదంతా మా అల్లరిలో భాగమైనా మా సృజనాత్మకతకి పునాదులని నేననుకుంటాను.
    అందుకే మా ఊరంటే ప్రాణం నాకు. నాకు బంగారు  బాల్యాన్నిచ్చిన మా సీతారామపురం నా లైఫ్‌ లైన్‌. ఊరుకుండాల్సిన లక్షణాలు లేని ఊరు కాబట్టి నేనాడింది ఆట పాడింది పాటగా సాగింది. దళితులు, రాజులు, కాపులు తప్ప వేరే  ఏ కులం వాళ్ళూ మా వూళ్ళో లేరు. దళితుల అణిచివేత విషయంలోమా ఊరేమీ మినహాయింపు కాదు. మా తాత ఓ భయంకరమైన, కరడుకట్టిన భూస్వామి. పావలా, అర్థణా అప్పిచ్చి ఎకరాలకెకరాలు భూమి రాయించుకున్న దుర్మార్గ భూస్వామి. ఈయన దుర్మార్గానికి బలై కుటుంబాలకు కుటుంబాలే ఊరొదిలి పోయారని, అందులో నా చిన్ననాటి నేస్తం నాగులు కూడ వుందని నేను పెద్దయ్యాకే నాకు అర్థమైంది. దొంగతనాలంటగట్టి దళితుల్ని గుంజలక్కట్టేసి కొట్టిన ఉదంతాలు చూచాయగా గుర్తున్నాయి. పాలేర్ల పెళ్లాల మీద అత్యాచారాలు చేసి, గర్భవతుల్ని చేసిన వాళ్ళూ వున్నారు. వాళ్ళకు పుట్టిన వాళ్ళ పిల్లల్లో తమ పోలికలు చూసుకుని ముఖాలు మాడ్చుకున్న వాళ్ళూ  వున్నారు. ఇవన్నీ నాకు పెద్దయ్యాక తెలిసిన నగ్న సత్యాలు.    వీటికి, మా వూరిలో నాకున్న అనుబంధానికి ఏం సంబంధం లేదు. పైరు పచ్చల్తో కళ కళలాడే మా ఊరు, ఎత్తైన అరుగుల్తో గంభీరంగా వుండే మా యిల్లు ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో సజీవంగా వుంటాయి.
     ఇవండి మా ఊరి సంగతులు. ఇవన్నీ చదివేక మీరు నా బాల్యానుభవాలని ఆడపిల్ల మగపిల్లాడు సున్నితపు తాసులో కొలుత్తారని నాకు తెలుసండి. కల్లు తాగడాలు, సరుగుడు సిగరెట్లు పీల్చడాలు, గొడ్డళ్ళతో కట్టెలు కొట్టడాలు, చిటారుకొమ్మల్లోకి ఎగబాకడాలు, చేపల్ని పట్టుకోవడాలు ఇయ్యన్నీ జనం దృష్టిలో మగానుభవాలు. మగపిల్లలు మాత్రమే చేయల్సిన పనులు. ఆడపిల్లలక్కూడా ఇలాంటి బాల్యం వుంటుందంటే నమ్మరేమో! మనోళ్ళ దృష్టిలో ఆడపిల్లలు ఎచ్చనగాయలూ, వోమన గుంట్లూ ఆడాలి. లక్కపిడతలాటలూ, బొమ్మల పెళ్ళిళ్ళాటలు ఆడాలి. అమ్మలెనక వొంటింట్లో తిరిగి వొంటల్నేర్చుకోవాలి. తమ్ముళ్ళని  చెల్లెళ్ళని  ఎత్తుకు మోయలి. అడ్డగాడిదలు అన్నలు, తమ్ముళ్ళు తిని తేన్చిన కంచాలు ఎత్తాలి. వినయ విధేయతల్తో నడుములు, మెడలు వొమ్చేసి పెళ్ళికి సిద్ధంగా వుండాలి. అంతేకాని నాలాగా స్వేచ్ఛగా, పక్షిలాగా బయటే తిరగడం, నా కిష్టమైన  అన్ని పనుల్ని అడ్డూ, అదుపూ లేకుండా చేసేయడం అబ్బో! చాలా మందికి కంట్లో నలకపడ్డట్లే.
    చివరగా మా దొంగతనాల సంగతుల్జెప్పేసి ముగించేత్తానండి. మా వూర్లో బోలెడన్నిమామిడి తోటలున్నాయని చెప్పేనుకదండి. పచ్చిమామిడికాయలు మాకు బాగానే దొరికేవి కాని పండ్లు చిక్కేవి కాదు. మామిడి కాయల్ని ఎడ్లబండి మీద తీసుకొచ్చి మా తాతకు అప్పచెప్పేవోరు. మా తాత వాటన్నింటిని ఓ పెద్ద గదినిండా పోయించి పండింతర్వాత, కొంచం కొంచం డాగుపడ్డ పళ్ళనే బయటకు తెచ్చి ఇచ్చేవోడు. మాకు చాలా కోపమొచ్చేది. ఒక్క మంచి పండు ఇయ్యొచ్చు కదా అనుకునేవోళ్ళం. చచ్చినా ఇచ్చేవోడు కాదు. మరి మేం తక్కువోళ్ళమా? సరుగుడు కర్రల చివర్న సూదివాటంగా చెక్కి కిటికీల్లోంచి  పళ్ళు లాగేసేవోళ్ళం. ఆ గది కిటికీకి రెండు చువ్వల్లేకపోవడం మా పనెంతో సులువుగా అయిపోయేది. బోలెడన్ని మామిడి పండ్లు దొంగతనంగా లాగేసి తినేసేవోళ్ళం. మామిడిపండ్లు ఏమైపోతున్నాయో అర్తం కాక మా తాత జుట్టు పీక్కునేవోడు. ఇక మారెండో దొంగతనం భోగిమంటల కోసం దుంగలు ఎత్తుకురావటం. పొయ్యికిందికి దాచుకున్న కట్టెల్ని ఎత్తుకొచ్చి  భోగిమంటల్లో పడేసేవోళ్ళం. ఓసారి పెద్ద గొడవైపోయింది. రామాయమ్మని ఒకామె వుండేది. ఆమె పోట్లాట మొదలెట్టిందంటే ఓ పగల ఓ రాత్రీ నడిచేది. చెంబునిండా నీళ్ళు పెట్టుకుని అవి తాగుతూ మరీ తిట్టేది. దుంగలెత్తుకొచ్చామని మమ్మల్ని దుంపనాశనం తిట్లెన్నో తిట్టి మా చిన్నానతో కొట్టించింది.
     ఇలా రాసుకుంటపోతే ఈ వ్యాసం కొండపల్లి చెంతాడంత పొడుగైపోతాది. అవకాశం దొరికితే తరువాయి భాగం మళ్ళెప్పుడన్నా వినిపిస్తాలెండి. ఇంకా చానా సంగతులున్నాయి మరి.
     నేను ఇప్పటికే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసేసాను. ఏభై ఏళ్ళు వచ్చేసినా నా బాల్యం నా కళ్ళకి నవనవోన్మేషంగా కన్పిస్తూనే వుంటుంది. నా పెదాల మీద తురాయి పువ్వుల్ని పూయిస్తూనే వుంటుంది. మ ఊరు జున్నుముక్కలా నన్ను ఊరిస్తనే వుంటుంది. మా సపోటతోట నూతిలోని తెల్లని కలువపూలు నన్ను రా రమ్మని పిలుస్తనే వుంటాయి.
    మరింక శెలవుచ్చుకుంటానండి. మా ఊరంటే మీకూ ప్రేమ పుట్టే వుంటుంది. మీరందరూ కూడా మా ఊరిని, నాకు ప్రాణప్రదమైన మా సీతారామపురాన్ని ప్రేమించాలని కోరుకుంటూ....

Comments

Tink said…
mee vooru chaala baavundandi :)
రాధిక said…
ఇన్ని జ్ఞాపకాలు ఒకేసారి చుట్టుముట్టేసేసరికి దేనిగురించి రాయాలో తెలియట్లేదు.ఎక్కడ చూసినా మీ మాటలే వినిపిస్తున్నాయి.కళ్ళుతెరిచినా,మూసినా పచ్చదనమే కనిపిస్తుంది.బాల్యాన్ని ఎవ్వరూ తిరిగి ఇవ్వలేరు.కానీ మీరు ఒక్కగంట నాబాల్యాన్ని నాకు ఇచ్చారు.అవును నిజం చెపుతున్నాను నిజంగా ఆరోజులకి వెళ్ళి మాతోటల్లో ఆడుకుని వచ్చాను.ఇప్పటికిప్పుడు మీకేమయినా ఇచ్చేయాలనివుంది.ఏమీ ఇవ్వలేక దూరమ్నుండే ఒక హగ్గు ఇచ్చి వదిలేస్తున్నాను.
థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్
చెప్పనేలేదు కదూ మన తూగోజీ,పగోజీలలోని గ్రామాల్లో ప్రతీఒక్కరి బాల్యం ఇలాగే వుంటుందికాబోలు.ఒక్క చిరంజీవి తప్ప[చిరంజీవిలాంటి అబ్బాయిలు వున్నారనుకోండి] మిగిలినదంతా నా బాల్యాన్ని కాపీకొట్టి రాసినట్టుంది.:)
సత్యవతి గారు,ఇదేమీ బాగలేదండి,ఇంత ఇబ్బంది పెడితే ఎలాగా?పైగా ఆంధ్రమాతను,శాకాంబరీ దేవి ప్రసాదము మాకు(గుంటూరు జిల్లావారికి)ప్రాణప్రదమైన గోంగూరను గోన్గూర అంటారా?

చాలా హృద్యంగా ఉందండి మీ జీవనరేఖ,కండువాలు తీసాం :)
SHREYUS said…
meeru cheppina chala vishayalu naa lifelo jariginiyyi...ippatiki maa uriki bus ledhu ika medha undahu kuda..endhuko ala polalu madhya tiragatam chala adbutamga untundhi...okeysari inni gnapakala hmmmmmm........kadupu nindipoyindhi
Krishna said…
ఇలా మీరు కమ్మటి పల్లెటూర్లు (ఇంకా మిగిలి వున్న) వాటి గురించి మాత్రం వ్రాయకండి. ఎందుకంటె, ఏ వాన్ పిక్ అనో, ఇంకో పేరో పెట్టి, దేవుడు గారు, ఆ డేవుడు బిడ్డ అయిన జగన్ ప్రభువు సెజ్ ల పేరిట, వాటిని కబళించటాని అవకాశం ఇవ్వటమే. మన ముందు తరాలకు ఇలాంటి మచి జ్ఞాపకాలు తప్ప, వూళ్లను ఇవ్వలేము అని తలుచుకొంటే బాధ వేస్తుంది.
సుజాత said…
సత్యవతి గారు,
పసలపూడి కథలు చదివినట్లుగా ఉంది మీ టపా చదువుతుంటే!ఫొటోలు చూస్తుంటే అర్జెంటు గా మీ వూరెళ్ళిపోవాలనిపిస్తోంది. ఇలా అందరూ తమ వూర్ల గురించి రాసుకునే ప్రోగ్రాం పెట్టుకోవాలి అసలు!
Anonymous said…
అయ్ బాబోయ్ మీరేట0డీ బాబూ,
నాచిన్నప్పుడు ఇసయాలన్ని సూసినట్టూ సెప్పేసేరు.
hmmm సత్యవతిగారు,

నాకు చాలా అసూయగా ఉందండి మీ మీద. ఎన్నెన్ని కబుర్లో. మా నాన్నవాళ్ళు ఊర్లో పొలాలు, ఇల్లు వదిలేసి సిటికొచ్చి పడ్డారు. మళ్ళీ తిరిగివెళ్ళలేదు. మాకు మీ అంత మధురమైన అనుభవాలులేవు. ఎం చేస్తామ్. మీ టపా చదువుతున్నంతసేపు మేము కూడా మీ చిన్నప్పటి ఆటలన్నీ చూసాము,ఊరంతా చుట్టేసాము లెండి..
EXCELLENT. అమరావతి కథలు, పసలపూడి కథల మాదిరి మీరు కూడా వారానికో టపా రాయండి.. ఒక్కో విషయం మీద. ఎదురు చూస్తుంటాము.
జననీ జన్మభూమిశ్చ స్వంతఊరి సంగతులు ఇన్ని రోజులు గడచినా మరచిపోకుండా అందంగా పేర్చి మాకందించిన మీకు ధన్యవాదములు. హరేకృష్ణ.
Satyavati said…
@టింక్ గారూ మా ఊరు మీకు నచ్చినందుకు సంతొషంగా ఉంది.

@రాధిక గారూ మీ ఉత్తరం భలేగా ఉంది.మీ హగ్ నన్ను తాకింది.ఓ గంట మీ బాల్యాన్ని మీకు ఇవ్వగలిగినందుకు నాకు బోలెడు హేపీగా ఉంది.మనిద్దరి బాల్యాలు ఒకేలా ఉంటాయి ఎందుకంటే మీరు నేను స్నేహాన్ని ఆక్సిజన్ లాగా పీలుస్తూ బతుకుతున్నాం కాబట్టి.మీ ప్రియమైన స్పందనకి ధన్యవాదాలు.

@రాజేందర్ కుమార్ గారు క్షమించండి బరాహ లో టైప్ చేస్తే గోంగూర అలా అయ్యింది. మనలో మాట నాకు గోంగూరంటె బోలెడు ఇష్టమండోయ్.నా లైఫ్ లైన్ నచ్చిందుకు సంతోషం.

@శ్రేయూస్ గారూ నా బాల్య ఙాపకాలతో మీ కడుపు నిండిపోవడమంటే మీకు అవి అంత బాగా నచ్చాయన్న మాట.థాంక్స్.

@క్రిష్ణ గారూ మీరు చెప్పింది అక్షర సత్యం.మా బంగారు ఊరు మీద జగన్ రాక్షస కన్ను పడకూడదు గాక.

@సుజాత గారూ మా ఊరెళ్ళిపోదాం రండి.నేను ఇంకా చాలా రాయాలి మా ఊరు గురించి.మీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

@లలిత గారూ ఇంక ఆలస్యమెందుకు మన బాల్యానుభవాలు రాసేయండి మరి.

@జ్యోతి గారూ మీరు మా ఊరెళ్ళిపోయారా?మీ పట్నం అనుభవాలు రాయండి.అవి ఎలా ఉంటాయో నాకు అస్సలు తెలియదు.

@బొల్లోజు బాబా గారూ మీ ఆత్మీయ కామెంట్ కి థాంక్స్.

@క్రిష్ణా రావ్ గారూ మీ సలహాకి, మీ స్పందనకి ధన్యవాదాలు.తప్పకుండా రాస్తాను.

@విజయ మోహన్ గారు థాంక్స్.ఎన్ని ఏళ్ళు వచ్చినా ఆ మధుర ఙాపకాలు చెదిరిపోవండి.జన్మనిచ్చిన తల్లి,బంగారు బాల్యాన్నిచ్చిన ఊరు ఒక్కటే నా ద్రుష్టిలో.

మీ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటూ...
అబ్బ, ఎన్ని విషయాలు చెప్పారు. గోదావరిని (ఫోటో)చూడగానే ప్రాణం లేచొచ్చింది. కల్లు తాగలేదు కానీ మిగతావి కాస్తంత చేసాం. తాటి టెంక, బెల్లం లాంటివి కింది స్థాయి వాళ్ళకేనని మాఇళ్ళల్లో తినే వాళ్ళు కాదు. అందుకుని వేరేవాళ్ళు తింటూంటే కళ్ళెట్టుకు చూస్తోండేవాడిని.
భలే బావుంది మీ బాల్యం. ఇది చదివాక నాకూ నా బాల్యం గురించి రాయాలనిపిస్తోంది. (అప్పుడెప్పుడో మొదలెట్టాను గానీ, ఆగిపోయింది.) కానీ ఇంత వివరంగా ఇంత చక్కగా రాయగలనో లేదో!
మీ జ్ఞాపకాలతోటి అందరి జ్ఞాపకాలని కదిలించేసారు. తరువాయి భాగం కోసం ఎదురుచూస్తుంటాము.
"మా ఊరు" అందులో ఉండే గొప్పతనమే అదేమో. తలుచుకోగానే అలల్లాగా ఆగని జ్ఞాపకాలు.
చాలా ఓపికగా, అందంగా, అద్భుతంగా, మనసుకు హత్తుకొనేలా హృద్యంగా కళ్లముందుంచారు. చాలా రోజుల తరువాత ఒక మంచి టపా.
Japes said…
అమ్మా !
పల్లె కన్నీరు [ http://discover-telangana.org/wp/2006/05/20/telangana_songs ] పెట్టే సంగతులు విని ఆ పల్లె జ్ఞాపకలు మా తరానికి ఎట్ల తెలువాలె అనుకున్న. రాధికగారు అన్నట్టు, "బాల్యాన్ని ఎవ్వరూ తిరిగి ఇవ్వలేరు. కానీ మీరు ఒక్కగంట నాబాల్యాన్ని నాకు ఇచ్చారు". మిగిలిన మన ఊర్ల మీద మాయదారి సెజ్‌ల కన్లు పడొద్దని కోరుకుంటున్న !
ravella said…
ఈ ఉగాది పచ్చడి లాంటి అనుభవాలు ఈనాటి పల్లెటూరి తరానికి ఎక్కడ మిగిలి ఉన్నాయ్? పల్లెలను కూడా కృత్రిమత్వం ఆవరిస్తుంది. పెరుగుతున్న అవసరాలు, కోరికలు, పట్నాల్తో పోటి పడలేని నిస్సహాయత, టీవీ, క్రికెట్ల దుమ్ము తెరలు. పల్లెటూరి హృదయంపై మ్రాన్పలేని గాయం. బాల్యం పల్లె ఆత్మని సృశించకుండానే కరిగిపోతుంది.
srisatya said…
madi narsapuram kani menu hyderabad lo untamumeeru mana oori gurinchi chebuthunte kallaku kattinatlu antha kanabaduthundi naku mee utharam chadavadam anandamga undi.
thank u
BARAO said…
మీకు అభినందనలు. వంశీ గారు వ్రాసినట్లే చాలా అందంగా వ్రాసారు.

నా బాల్యమంతా మీ వూరు పక్కనున్న నరసాపురంలోనే గడిచింది.
కాని మీ వూరులొకి ఎప్పుడూ వెళ్ళలేదు. బస్సు లోనే మీ వూరు మీదుగా మా చిన్న మావయ్య ఇంటికి మొగల్తూరు, మా అమ్మమ్మ గారి ఊరు పేరుపాలెం వెళ్ళాను చాలా సార్లు.
వేసవి సెలవుల్లో మా బంధువుల పిల్లలతో సహా పేరుపాలెంలో మామిడి చెట్లలోనే రొజులన్నీ గడిచిపోయేవి.
మీ వూరుకి బస్సు లేదని ఎందుకు వ్రాసారో అర్థం కాలేదు.
www.bonagiri.wordpress.com

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అశోకం