కొండవీటి సత్యవతి
.
నిర్మల మొబైల్ ఫోన్లోంచి ఖయ్‌మంటూ విజిల్ శబ్దం.
‘‘నన్నిక పనిచేసుకోనివ్వదా’’ అనుకుంటూ ఫోన్ లేసి చూసింది. అనల అమెరికా నుంచి... వాట్సప్‌లో మెసేజ్.
‘‘అమ్మా! నేనొస్తున్నాను. టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. నువ్వు కూడా శెలవు పెట్టేయ్’’
‘‘క్రిస్మస్ శెలవులు ... ఆ తర్వాత సంక్రాంతి శెలవులు’’
‘‘సరె అన్నూ! ఏ రోజు బయలు దేరతావు’’
‘‘డిశంబరు పది... మనం నాలుగురోజులు హైదరాబాదులో వుండి అమ్మమ్మ దగ్గరి కెళ్ళిపోదాం’’
‘‘అన్ని రోజులు నువ్వా పల్లెటూళ్ళో ఉండగలవా?’’
‘‘ఉంటాను... ఈరోజే అమ్మమ్మకి చెప్పేయ్. బై అమ్మా!’’
ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టేసి నిర్మల తన పనిలో పడింది.
ఆఫీసులో చాటింగ్ తనకిష్టముండదు. కానీ అన్నూ వదలదు. నెలరోజులు శెలవంటే... దొరుకుతుందో లేదో... ఇవ్వకపోతే సిక్ లీవ్ వుండనే వుంది.
క్యాలండర్ చూసాను. నవంబరు 23. ఫర్వాలేదు. టైముంది.
అర్జంట్ పనులేమున్నాయా అని ఆలోచిస్తుంటే...
కోలీగ్ సరస్వతి అడిగింది.
‘‘అనల వస్తోందా నిర్మలా’’
‘‘అవునే... నెల రోజులుంటుందట... ఇక్కడ కాదు. అమ్మమ్మ దగ్గరుంటుందంట’’.
‘‘అమెరికాలో వుండే పిల్ల అంతర్వేదిలో వుండగలదా?’’
‘‘వుంటుందట... తనకి అలవాటే గానీ అన్ని రోజులుండలేదెప్పుడూ. నెల రోజులు లీవ్ పెట్టాలి.ఏం అర్జంటు పనులున్నాయా అని ఆలోచిస్తున్నా’’.
‘‘పెట్టేయ్... పనులెప్పుడూ వుంటాయ్.. నేను అకౌంట్స్ సెక్షన్‌కి వెళ్ళొస్తా...’’
అంతటితో సంభాషణ ముగిసింది.
***************
డిశెంబరు
పది రానే వచ్చింది. ఎయిర్ పోర్ట్‌లో అనలను చూసి ఆనందంతో
ఉక్కిరిబిక్కిరైంది నిర్మల. సన్నగా... పొడవుగా తెల్లటి షర్ట్... నీలంరంగు
జీన్స్...
రింగులు తిరిగిన జుట్టు గాలికి ఎగిరెగిరి పడుతోంది. ఎంత కాన్పిడెంట్‌గా
నడిచి వస్తోంది... ఇది తన కూతురు...
‘‘అమ్మా!’’ అంటూ ఎగిరివచ్చి నిర్మలను చుట్టేసింది. ‘‘ఏరా! ప్రయాణం బాగా సాగిందా?’’
‘‘హేపీగా... అమ్మా... నువ్వేంటి చిక్కిపోయావ్’’
‘‘ఏం లేదు... ఈ మధ్య చక్కెరకి నాకూ చుక్కెదురైందిలే’’ నవ్వింది.
‘‘అంటే... షు గరొచ్చిందా? నాకు చెప్పలేదు.’’
‘‘అదేం శుభవార్తని చెప్పడానికి ... సరే గానీ అన్ని గంటలు ఏం చేసావ్ విమానంలో’’
వాళ్ళెక్కిన క్యాబ్ అమీర్‌పేటవైపు బయలు దేరింది.
‘‘అమ్మా!
ప్లైట్‌లో తినడానికి, తాగడానికి బోలెడుంటాయి. చదువుకోవచ్చు. సినిమాలు
సినిమాలు చూడోచ్చు. బోర్ కోడితే నిద్రపోవచ్చు. అమ్మా! చాలా రకాల డ్రింక్స్
వుంటాయి. తాగితే హాయిగా నిద్రపోవచ్చు.’’
నిర్మల ఏం మాట్లాడలేదు.
‘‘ఏంటమ్మా! తాగాననా?’’
‘‘ఏం కాదులే...’’
అనలకి అర్థమైంది. నాన్న తాగుడు.. అమ్మ పడిన కష్టాలు.
‘‘సారీ అమ్మా!’’ అమ్మ మెడ చుట్టూ చేతులేస్తూ గోముగా అంది.
‘‘పోరా... ఏం కాదులే.. నువ్వు తప్పు చెయ్యవని నాకు తెలుసు... నా బంగారు తల్లివి కదా’’
‘‘తప్పా? తాగడం తప్పు కాదమ్మా.. నాన్నలా తాగడం తప్పు.’’
‘‘తాగుడు తప్పే... సరే పొనీయ్ కానీ.. అమ్మమ్మ భలే ఎగ్జైటెడ్‌గా వుంది. వెంటనే వచ్చెయ్య మంటోంది..’’
‘‘అమ్మా! నీ ఫోన్ ఇవ్వు... అమ్మమ్మతో మాట్లాడతా’’
అవతల
అమ్మమ్మ ఏం చెబుతోందో అనల భలే..భలే.. వచ్చేస్తాం... నాలుగు రోజులు
ఇక్కడుంటా...పనుంది... అమ్మమ్మా! అవునా... భలే..ఉంటాను అమ్మమ్మా!’’ఇల్లొచ్చింది.
**************
‘‘ఏంట్రా ఇవన్నీ...
అనల సూట్ కేస్ తెరిచి తను తెచ్చిన వస్తువులన్నింటినీ బయటకు తీస్తోంది.
‘‘ఇదా... వైన్ బాటిల్.. నా ఫ్రెండ్ వుంది కదా రిథమ... దానికిష్టం...’’
‘‘అక్కడి నుండి మోసుకు రావాలా?’’
‘‘ఇది
ఒరిజినల్ ఫ్రెంచ్ వైన్... ఇక్కడ దొరుకుతుందేమో తెలియదు. అమ్మా ఇది నీ
కోసం... లేేప్ టాప్.. మనం రోజూ చాట్ చేసుకోవచ్చు. స్కైప్‌లో
మాట్లాడుకోవచ్చు...’’
‘‘అబ్బ... నాకవన్నీ రావు లేరా...’’
‘‘నేను నేర్పిస్తాగా... వై ఫై పెట్టిద్దాం. అమ్మా! ఇందులో అమ్మమ్మకి ఏం సెలెక్ట్ చేస్తావో నీ ఇష్టం’’
‘‘అమ్మమ్మకా...’’ కాలింగ్ బెల్ మోగింది.
అనల స్ప్రింగ్ లా లేచెళ్ళి తలుపు తీసింది. రిథమ... ఇద్దరూ ఒకర్నొకరు వాటేసుకుని లోపలికొచ్చారు.
‘‘హాయ్ ఆంటీ...".
‘‘హాయ్... రిథమా... ఎలా వున్నావ్?
‘‘బావున్నానాంటీ... ఎన్ని రోజులైంది దీన్ని చూసి’’ అంటూ మళ్ళీ అనలని గట్టిగా వాటేసుకుంది.
‘‘రీతూ... నువ్వు కూడా అంతర్వేది కొస్తావా? అమ్మమ్మ వాళ్ళ ఊరికి’’
సోఫాలో సెటిలయ్యారు ఇద్దరూ..
నిర్మల వంటింట్లోకి వెళ్ళిపోయింది.
‘‘ఎప్పుడూ... వీకెండ్ అయితే ఓకె.’’
‘‘అమ్మా! రీతూ కూడా మనతో వస్తుంది.’’
ఇద్దరూ అంతులేని కబుర్లలో మునిగిపోయారు.
ఇల్లంతా కబుర్లతో, వాళ్ళిద్దరి నవ్వులతో మారు మోగుతోంది.
నిర్మల ఆలోచిస్తూ వంట చేస్తోంది.
ఎంత
హాయిగా వున్నారిద్దరూ...
వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ శరీర కదలికలు ఎంత డిఫరెంట్‌గా వున్నాయి. ఆ వయసులో తనెలా వుంది. తన ఆలోచన లెలా వున్నాయి?
వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ శరీర కదలికలు ఎంత డిఫరెంట్‌గా వున్నాయి. ఆ వయసులో తనెలా వుంది. తన ఆలోచన లెలా వున్నాయి?
‘‘అమ్మా! ఏం చేస్తున్నావ్? మనం బయటకెళదాం. డిన్నర్ బయటే’’ అంటూ వంటింట్లోకి వచ్చింది అనలు.
‘‘నేనెందుకు లేరా? మీరిద్దరూ వెళ్ళండి’’.
‘‘లేదు లేదు... నువ్వు రావాలి. పద.. పద... రెడీ అవ్వు’’ అంటూ స్టౌ ఆపేసింది.
ఓ అరగంట తర్వాత ముగ్గురూ రిథమ కార్లో వున్నారు. ఆ తర్వాత కారు మెయిన్‌లాండ్ చైనా రెస్టారెంట్ ముందాగింది.
‘‘హమ్మో! ఈ హోటల్ కా.. చైనా వాళ్ళ కప్పలు.. పాములు పెడతారట’’
‘‘కమాన్ అమ్మా! ఇక్కడ ఫుడ్ బావుంటుందని రీతూ చెప్పిందిలే’’
వాలెట్ పార్మింగ్‌లో కార్ ఇచ్చేసి ముగ్గురు హోటల్ వేపు నడుస్తున్నారు.
ఎవరో
హఠాత్తుగా అనల జుట్టు పట్టుకుని లాగుతూ ‘హాయ్ బేబీ’’ అంటూ
వెళ్ళిపోతున్నాడు. అనల మెరుపు వేగంతో పరుగెత్తి వెళ్ళి వాడి కాలర్
పట్టుకుని ఎడాపెడా వాయించేసింది. వాడు చొక్కా వదిలించుకుని పరుగే పరుగు...
నిర్మల అదిరిపోయింది.
‘‘అన్నూ...ఏంటిరా? ఇది అమెరికా అనుకున్నావా? వాడు వెళ్ళి ఒక గ్యాంగ్‌తో మళ్లీ వస్తాడు’’ అంది భయపడుతూ...
‘‘ఏడిసాడు.. మళ్ళీ ఈ చుట్టుపక్కలకి రాడు ఆంటీ...’’
‘‘ఏంటమ్మా! ఇదేమన్నా సినిమానా? ఎంత ధైర్యం వాడికి నా వొంటిమీద చెయ్యి వెయ్యడానికి బాస్టర్డ్... పదండి... పదండి.. భలే ఆకలేస్తూంది.’’
నిర్మల
వాళ్ళ ననుసరించింది కానీ.. అన్నూ తెగింపు, ధైర్యం చూసి భయపడింది. అదే
సమసయంలో సంతోషించింది. తను పనిచేసే ఆఫీసులో కోలీగ్స్ చెత్త కామెంట్లు,
సతాయింపులు మౌనంగా భరించడమే కానీ ఎప్పుడైనా ఎదురు మాట్లాడిందా? తన మొగుడు
ఎంత హింసపెట్టే వాడు? ఏ రోజైనా తిరగబడిందా? తాగి తాగి చనిపోయాడు... అతను
బతికుండగా ఒక్కరోజైనా సుఖపడిందా?
‘‘అమ్మా!... ఏంటి ఆలోచిస్తున్నావ్? ఏం తిందాం చెప్పు’’.
‘‘హమ్మో! నా కేం తెలుసు... మీరె చెప్పండి. నచ్చితే తింటా’’ అంది.
అన్ని టెబుళ్ళు నిండిపోయాయి. గోలగా మాట్లాడుకుంటున్నారు. అవతలి వేపు ఎవరిదో పుట్టిన రోజు సెలబ్రేషన్స్.
ఏవేవో ఆర్డర్ చేసారు. అనల, రిథమ హాయిగా కబుర్లాడుకుంటూ, నవ్వుకుంటూ తింటున్నారు.
నిర్మలకి పెద్దగా నచ్చలేదు. తిన్నానని పించింది.
పదిన్నరకి రిథమ నిర్మల వాళ్ళని దింపేసి వెళ్ళిపోయింది.
******************
నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి సికింద్రాబాద్ ప్లాట్‌పారం మీద ఎదురుచూస్తున్నారు. అనల, నిర్మల.
‘‘రిథమ కూడా వచ్చుంటే బావుండేది. నీకు బోర్ కొట్టకుండా తోడుండేది’’ నిర్మల అంది.
‘‘సడెన్ గా బెంగుళూరు వెళ్ళాల్చొచ్చిదట. అమ్మమ్మ గారి ఊరిలో నాకేమీ బోర్ కొట్టదు. యు డోంట్ వర్రీ అమ్మా! ’’.
పదిన్నరకి ట్రయిన్ వచ్చింది. ఏసి సెకెండ్ క్లాస్ లో సర్దుకున్నారు.
పడుకోబోతూ అనల అడిగింది. ‘‘అమ్మా! ఎన్నింటికి నర్సాపూర్ చేరతాం’’.
‘‘ఎనిమిది దాటుతుంది. మాయిగా పడుకో.. అది లాస్ట్‌స్టాప్. రామం మావయ్య కారు పంపుతానన్నాడు లే’’.
‘‘అయితే ఇంకేం... హేపీగా నిద్రపోవచ్చు’ అంటూ ముసుగు పెట్టేసింది అనల.
నిర్మల కూడా పడుకుంది.
*********************
*********************
ఎనిమిదిన్నరకి ట్రయిన్ నర్సపూర్ చేరింది. స్టేషన్‌కి శ్రీధర్ వచ్చాడు.
‘‘అత్తయ్యా! బావున్నారా... అన్నూ.. ఎలా వున్నావ్’’.
‘‘బావున్నాం రా... అమ్మ నాన్న, అమ్మమ్మ ఎలా వున్నారు.
‘‘అంతా బావున్నారత్తయ్యా... నువ్వెప్పుడొచ్చావ్ అన్నూ’’
‘‘వారం అయింది శ్రీధర్.. ఏంటి మన కారు డైరక్టుగా దానిమీదకి వెళ్ళిపోతుందా?’’ ఆశ్చర్యంగా గోదావరిలో ఉన్న పొడవాటి పంటిని చూస్తు అంది.
‘‘వెళ్ళిపోతుంది..
చించినాడ దగ్గర గోదావరి మీద బ్రిడ్జి కట్టారు కానీ అలా దూరమౌతుంది. ఈ పంటి
మీద దాటేస్తే అంతర్వేదికి గంట కూడా పట్టదు.’’ అన్నాడు జాగ్రతత్తగా కారుని
పంటి మీద ఎక్కిస్తూ...
‘‘వారేవా..భలే ఉంది.. గోదావరి భలే మెరుస్తోంది.’’ అంది సంబరపడుతూ అనల.
పంటి
దిగి.. కారు సఖినేటిపల్లి మీదగా పచ్చటి కొబ్బరి తోటల్లోంచి రయ్‌మంటూ
దూసుకెళ్ళితోంది. అనల శ్రీధర్ పక్క సీట్లో కూర్చుని ఆ పచ్చదనాన్ని ఎంజాయ్
చేస్తోంది.
అనల శ్రీధర్‌ని బావా అని పిలిస్తే బావుండు. చెబితే
కొప్పడుతుంది. నిర్మల ఆలోచిస్తోంది. అన్నూ పెళ్ళి మాట ఎత్తాలంటే భయం. నేను
ఇప్పుడే చేసుకోను అంటుంది. శ్రీధర్ కూడా బాగా చదువుకున్నాడు. వ్యవసాయం
చేస్తూ ఊళ్ళోనే వుండిపోయాడు. ఇద్దరూ ఈడూ జోడూ బావుంటారు కూడా.... ఆమె
ఆలోచనలు సాగుతూనే వున్నాయి.
ఎత్తైన అరుగులతో ఠీవిగా నిలబడి
వుంది ఆ ముండువా లోగిలి.ఆ ఇంటి ముందు కారాగింది. ఇంటి చుట్టూ కొబ్బరి
చెట్లు ..ఇంటి ముందు పెళ్ళి పందిరి.
‘‘అమ్మమ్మా!’’ అంటూ లోపలికి పరుగెత్తింది అనల.
‘‘వచ్చేసారా? ఏంటీ ఇంత పొడుగైపోయావ్... మీ మీయమ్మేదీ ?’’ సంపూర్ణమ్మ.
"అమ్మ వస్తుందిలే.. ఎలా వున్నావ్ అమ్మమ్మా!’’ అమ్మమ్మ మెడకి వేలాడుతూ అనల.
‘‘రైలు బాగా లేటల్లే వుందే.. ముందు ముఖాలు కడగండి. కాఫీ తాగుదురుకానీ’’
ఈలోపు బయట ఎవరో పలకరిస్తే మాట్లాడి నిర్మల లోపలి కొచ్చింది.
‘‘ఏం పాపా... ఎలా వున్నావ్’’ నిర్మలని సంపూర్ణ పాపా అని పిలుస్తుంది.
‘‘నాకేం బాగానే వున్నాను. క్రితం నెలేగా పెళ్ళికని వచ్చాను. . నీ ఆరోగ్యం ఎలా వుందమ్మా’’.
‘‘అవుననుకో.. ఎనభై ఏళ్ళ వయసులో నేనెలా వుంటానే.. ఫర్వాలేదు. నడుస్తోంది.’’
‘‘నా దగ్గరొచ్చి ఉండమంటే వినవుకదా..’’
‘‘స్టాప్... స్టాప్.. మీ ఇద్దరూ మొదలెయ్యాకండి. అమ్మమ్మా! ఆకలి.. టిపిన్ పెట్టు’’.
‘‘నా బంగారమే.. అయ్యో! ఐదు నిమిషాలాగు... వెంకమ్మా... ఇడ్లీ లేసేసావా... పాపం. పిల్ల ఆకలంటోంది..’’
‘‘ఆయ్.. వేసేసానండి... పచ్చడి కూడా నూరేసానండి అమ్మగారూ’’ వెంకమ్మ.
‘‘అయితే పెట్టేయ్.. పదండి.. టిఫిన్లు తిందురుగాని’’ హడావుడి పడుతోంది సంపూర్ణ.
‘‘అన్నూ... మన ఆవు ఈనింది.. జున్ను తింటావా?’’
‘‘ఓ.. జున్నంటే నాకు చాలా ఇష్టం. ఆవు దూడలు ఎక్కడున్నాయ్ అమ్మమ్మా’’
‘‘పోలాన వున్నాయ్.. కోడిదూడ భలే ఉషారుగా వుందంట శ్రీధర్ బావ చెప్పాడు’’.
‘‘అయితే శ్రీధర్‌తో నేను పొలమెళతా...’
‘‘పోలానికా.. వద్దులేవే’’ అంది నిర్మల.
‘‘ఎళ్ళనీయవే.. సరదాపడుతుంది కదా’’.
*************************
సాయంత్రం
శ్రీధర్‌తో కలిసి పొలమెళ్ళింది అనల. పచ్చటి పంట పొలాలు... గట్ల మీద
సైనికుల్లాగా లైనుగా కొబ్బరి చెట్లు. పశువుల కోసం వేసిన పాకలో
కూర్చీలున్నాయి. పాలేరు కుర్చీలు తెచ్చి కొబ్బరి తోటలో వేసాడు.
‘‘ఆవు దూడేది...’’
‘‘అదిగో ఆ పాకలోపల కట్టేసి ఉందిగా...’’
‘‘వదలమనవా.. శ్రీధర్’’
‘‘నారాయణా... దూడని కట్టేసి ఇటు తీసుకురా’’ పాలేరుకు చెప్పాడు.
దూడ చెంగుచెంగుమంటూ ఎగురుకుంటూ వచ్చింది. తెల్లగా వుంది. నుదిటి మీద గోధుమ రంగు మచ్చ.
‘‘భలే
వుంది... నారాయణ.. నాకివ్వు నేను పట్టుకుంటాను.’’ దానితో పాటు ఎగురుతోంది.
అది తోక బిగబెట్టి చెంగుమంటూ ఎగురుతోంది. ఛాన్సు దొరికితే తల్లి దగ్గరకు
ఉరకాలని చూస్తోంది.
‘‘నారాయణా! ఇంకచాల్లే... దూడని కట్టేసి కొబ్బరి బొండాలు తియ్య’’ అన్నాడు శ్రీధర్
చీకటి
పడేవేళకి ఇల్లు చేరింది అనల... శ్రీధర్ బండి దిగేసి ఊళ్ళోకొస్తున్న ఎద్దుల
బండెక్కింది. బండి తోలేవాని పక్కనచేరి బండి తోలుతుంటే శ్రీధర్ నవ్వుతూ
చూసాడు.
‘అన్నూ.. మీ అమ్మ చూస్తే నన్ను తిడుతుంది. అది ఎక్కుతానంటే నువ్వెలా ఎక్కనిచ్చావ్ అంటుంది’’.
‘‘ఇల్లు దగ్గర పడగానే దిగిపోతాలే’’ అంది నవ్వుతూ.
*****************
వారం
రోజులు గడిచిపోయాయి. అనల చుట్టూ పక్కల ప్రాంతాలన్నీ తిరుగుతోంది. ఒకరోజు
గుడి దగ్గరకెళ్ళింది. ఒక రోజు సముద్రం, లైట్‌హౌస్ చూసింది.
‘‘శ్రీధర్.. అన్నా చెల్లెల గట్టుకు తీసుకెళ్లవా?’’
అంతర్వేది దగ్గర గోదావరి సముద్రంలో కలుస్తుంది. ఆ చోటునే అన్నాచెల్లె గట్టు అంటారు.
‘లాంచి
దొరికితే వెళదాంలే.. నువ్వు భయపడవు కదా.. అక్కడ సముద్రంలో అలలు
గోదావరిలోకి వెనక్కి వస్తాయి. లాంచి ఎగిరెగిరి పడుతుందిమరి. భయపడతావేమో’’
‘‘నాకేం భయం లేదు....ఇంతకు ముందు వెళ్ళాం కదా... వెళదాం’
‘‘సరేలే.. ఇంక దిగు ఇల్లోచ్చింది’’
బండిలోంచి చెంగున ఉరికి ఇంట్లోకి వెళుతుంటే శ్రీధర్ నవ్వుతూ చూస్తూ ‘‘ఏం పిల్లరా బాబూ’’ అనుకున్నాడు.
*******************
హైదరాబాదు
తిరిగి వెళ్ళే రోజులు దగ్గర పడుతున్నాయి. అనల ఆ పల్లెటూరంతా చుట్ట
బెడుతోంది. నిర్మల కూతురి పనులన్నీ గమనిస్తూనే వుంది. అమ్మమ్మ అయితే
మురిపెంగా ‘‘దీనికి అన్నీ నా బుద్ధులే’’ అంటూ మురిసిపోతుంది.
ఆ రోజు రాత్రి అనల అమ్మమ్మ దగ్గర చేరింది. భోజనాలైపోయాయి. నిర్మల నిద్రపోవాలని తన రూవ్‌ులోకి వెళ్ళబోతుంటే
‘‘అమ్మమ్మా! నువ్వు తాతయ్యను వదిలేసావంట నిజమేనా’’
‘‘అన్నూ.. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏం మాటలవి. ఇప్పుడెందుకు.’’
‘‘ఫర్వాలేదు లేవే.. .. ఎవరు చెప్పారు.’’
‘‘ఊర్లో ఎవరో అన్నారమ్మమ్మా! నిజమేనా?’’
‘‘జనాలు ఇంకా మర్చిపోలేదన్న మాట... ఏ నాటి మాట..’’
‘‘అమ్మమ్మా! ప్లీజ్ చెప్పవా! ఏం జరిగింది.’’
‘‘అన్నూ... అమ్మమ్మని పడుకోనీయ్... పద... మనం వెళ్ళిపడుకుందాం’’.
‘‘పాపా.. నువ్వెందుకు కంగారుపడతావ్... చెబుతానుండు’’.
అనల అమ్మమ్మ మంచమెక్కి వినడానికి సిద్ధంగా కూర్చుంది.
................
పదమూడేళ్లప్పుడు
నా పెళ్ళయింది. మీ తాతకి ఇరవై పైనే... వాళ్ళది అనకాపల్లి... మీ తాత
రెవెన్యూ డిపార్ట్‌మెంటులో పని చేసేవాడు. ఎప్పుడూ క్యాంపులు
తిరుగుతుండేవాడు. మీ అమ్మ, రామం మావయ్య పుట్టాక నాకు మరో ఇద్దరు పుట్టి
పోయారు. ఇంట్లో నౌకర్లు, ఇంటి నిండా సరుకులు.. లోటుండేది కాదు. మీ తాతయ్య
ఇంట్లో వుండేది తక్కువ. అది బ్రిటిష్ వాళ్ళ కాలం కదా! మనకి ఇంకా స్వాతంత్రం
రాలేదు. అప్పుడప్పుడూ దొరలు కూడా మనింటి కొచ్చేవారు. మీ తాత తాసిల్దార్
అయ్యాడు. గుర్రం మీద తిరుగుతుండే వాళ్ళు. మీ తాత గురించి చుట్టాలు
రకరకాలుగా చెప్పెకునేవాళ్ళు. దొరలతో కలిసి తాగుతాడని, తిరుగుతాడని..
ఏంటేంటో చెప్పుకునే వాళ్ళు. నేను పట్టించుకునే దాన్ని కాదు. నాకు పిల్లలతో,
ఇంటిపనితో సరిపోయేది.
‘‘నువ్వెప్పుడూ తాతయ్యని అడగలేదా అమ్మమ్మా’’ హఠాత్తుగా అడిగింది అనల. నిర్మల నిశ్శబద్ధంగా వింటోంది.
‘‘ఏమని అడగమంటావ్... అసలు మాట్లాడ్డానికే భయం. సింహంలా ఉండేవారు. గుర్రం మీద వెళుతుంటే జనాలే భయపడేవాళ్ళు.’’
‘‘అదేంటి.. అందరూ అలా అంటుంటే నీకు బాధగా వుండేది కాదా.. అమ్మా! నీకు తెలుసా?’’
‘‘నీకు తెలియదే వెర్రి పిల్లా! భర్తల్ని అడగడమే.. అంత ధైర్యం ఎవరికీ వుండదు... ఆ రోజులు వేరు’’.
‘‘ఏంటి
వేరు... ఈ రోజుల్లో మాత్రం ఏం గొప్పగా వున్నాయి? మా నాన్న లేడా? మా అమ్మ
ఎపుడైనా మా నాన్నని ఎదిరించిందా? తాగొచ్చి కొడుతుంటే దెబ్బలు తినేది...’’
తండ్రి గుర్చొచ్చి కోపంతో ఊగిపోయింది అనల.
‘‘నిజమేనే... మీ అమ్మకన్నా నేనే నయం... మీ అమ్మకి ఉద్యోగముంది. సంపాదనుంది. అయినా మీ నాన్నని వదలలేకపోయింది’’.
‘‘ఆ...
బాగా చెబుతావ్‌లే అమ్మా! వదిలెయ్యడం అంత తేలికా? పైగా నాకో ఆడపిల్లుంది.
దాని గురించి ఆలోచించాలా? వద్దా?’’నిర్మల ఉక్రోషంగా అంది.
‘‘ఛ... ఛ.. నా గురించి నాన్నను భరించావా?’’
‘‘సరేలే... ఇపుడవన్నీ ఎందుకు? అన్నూ... పెళ్ళింటే ఏంటో... దాన్నుంచి ఎందుకు బయటపడలేరో నీకు అర్థం కాదులే...’’
‘‘అలాంటి దాన్నుండి నువ్వెలా భయటపడ్డావ్ అమ్మమ్మా! వెరీ ఇంట్రస్టింగ్... చెప్పు.... చెప్పు’’
‘‘చెప్పాను
కదా! మీ తాతయ్య గురించి ఎవరెన్ని చెప్పినా పట్టించుకునే దాన్ని కాదు.
ఆయన్ని అడిగేదాన్ని కాదు. అలాంటిది ఒకరోజు ఎవరో ఒకామెని తనతో ఈ ఊరికి
తీసుకొచ్చేసాడు."
‘‘అవునా???’’
‘‘అవును. వాళ్ళు ఊళ్ళోకి
వచ్చారని ట్రావలర్స్ బంగళాలో వున్నారని నౌకరొచ్చి నాకు చెప్పాడు. నేను
తెల్లబోయాను. చాలా కోపమొచ్చింది. ఇంత కాలం బయట ఎన్ని వేషాలేసినా
పట్టించుకోలేదు. ఏకంగా ఇంటికే తీసుకొచ్చేస్తాడా? ఇంట్లోకి రానీయొద్దని
గట్టిగా అనుకున్నాను. ఇంటికి ఒక పెద్ద సింహద్వారం వుండేది. దాన్ని మూసేయమని
చెప్పాను.’’
‘‘సూపర్ అమ్మమ్మా.. ఐ లవ్ యూ’’ అనల అమ్మమ్మకి ముద్దు పెట్టింది.
‘‘మహా డాబుగా
ఇద్దరూ ఆ సాయంత్రం ఇంటికొచ్చారు. నేను తలుపు తియ్యలేదు. ఎంత కొట్టినా
తలుపు తియ్యలేదు. పిల్లలిద్దరినీ అక్కున చేర్చుకుని బిక్కు
బిక్కుమంటూ...కూర్చున్నాను.. తలుపులు పగలగొట్టిస్తారేమో అని భయమేసింది.కానీ
అలా చెయ్యలేదు. జనం గుమిగూడారు. వింత చూస్తున్నారు. తలోమాట అంటున్నారు.
ఇంక
లాభం లేదని వాళ్ళు వెళ్ళిపోయారు. నేను చాలా ఏడ్చాను... ఈ పిల్లలతో ఎలా అని
దిగులు పడ్డాను. ఆ తర్వాత నేను మీ తాత ముఖం చూడలేదు. వాళ్ళిద్దరూ
వైజాగ్‌లో కాపురం పెట్టారని తర్వాత తెలిసింది.’’
‘‘అమ్మమ్మా... నువ్వు సూపర్ వుమన్’’
‘‘ఆ సూపరే... తర్వాత ఎన్ని కష్టాలు పడ్డామో నీకేం తెలుసు. నాన్న మాకు అన్నీ అమర్చాడు కాబట్టి సరిపోయింది.’’
‘‘అవునే.. చాలా కష్టాలు పడ్డాం. కానీ నేను మాత్రం మీ తాతని క్షమించలేకపోయాను. ఆయన చనిపోయినపుడు కూడా నేనెళ్ళలేదు.’’
‘‘అమ్మా!
అమ్మమ్మ ఆత్మగౌరవం నుంచి నువ్వేం నేర్చుకోలేదు. నాన్న నిన్నెలా కొట్టేవాడో
నాకు తెలుసు. ‘‘ఎందుకమ్మా! అమ్మమ్మకి చదువు లేదు.. ఉద్యోగం లేదు... అయినా
తెగించింది. నీకు చదువుంది. ఉద్యోగముంది... ఎందుకని నాన్నని
వదిలేయలేకపోయావ్?’’
‘నీకు తెలియదు... మగదిక్కులేని సంసారం ఎలా వుంటుందో నాకు తెలుసు. నువ్వలా కాకుండదనే నేను సహించాను’’ నిర్మల గొంతులో నిర్వేదం.
‘‘అయ్యో! అమ్మా! నా కోసమా?’’ అమ్మమ్మని వదిలి అమ్మ దగ్గర కెళ్ళి... అమ్మ గుండెల్లో దూరిపోయింది.
‘అవును రా అన్నూ!!..నీ కోసమే... తండ్రి లేకపోవడం.. ఆ లోటు నాకు తెలుసు... అయినా నాకు మీ అమ్మమ్మంత ధైర్యం కూడా లేదు.’’
‘‘నువ్వనుకున్నావ్‌కానీ...
ఇప్పుడు నాన్నేలేడు. నీ కోసమే మీ నాన్న హింసను భరిస్తున్నాని చెప్పుంటే
నాన్నను వదిలేయ్‌మనిచెప్పేదాన్ని కదా’’
‘‘సర్లే.. అయినా అవన్నీ ఇప్పుడెందుకురా? అమ్మా! దీని పెళ్ళి సంగతేంటో కనుక్కో... నా మాట వినడం లేదు’’ నిర్మల తల్లితో అంది.
‘‘అర్రే...
వుండమ్మా... కథ క్లైమాక్స్‌లో వుంది. ‘‘అమ్మమ్మా! నీ కింత దైర్యం ఎలా
వచ్చింది? తాతయ్యని ఇంట్లోంచి గెంటేసేంత తెగువ?’’ మళ్ళీ అమ్మమ్మ దగ్గర
చేరింది.
‘‘ఏమో! అలా వచ్చిందంతే... మీ తాతయ్యని వేరేవాళ్ళతో
పంచుకోలేకపోయా... నీకు తెలుసా? భ్రమర అదే.. మీ తాతయ్య రెండో పెళ్ళి
చేసుకుని తీసుకొచ్చినామె నా దగ్గర కొచ్చింది.’’
‘‘అవునా! కథలో మలుపు భలే వుంది’’.
‘‘మా అమ్మ జీవితం నీకు కథలా వుందా?’’ గయ్‌మంది నిర్మల.
‘‘అమ్మా ప్లీజ్.. చెప్పు అమ్మమ్మా’’
‘‘భ్రమర
చిన్న పిల్ల... ఏదో ఊళ్ళో గుమాస్తా కూతురు. మీ తాతకి క్యారియర్
తెచ్చిస్తే... ఆమెను లోబరుచుకున్నాడట. అలా చాలాసార్లు జరిగిందట. గుమాస్తా
భయపడిఎవరికీ చెప్పలేదు. ఆ పిల్లకి కడుపొచ్చింది. ఊళ్ళో పెద్ద గొడవైతే... మీ
తాత ఆ పిల్లను వెంటబెట్టుకొచ్చేసేడు. నాకు భ్రమరని చూస్తే చాలా
జాలనిపించింది.’’
‘‘జాలా? అమ్మా! నీ కాపురం కూల్చింది ఆమెనే కదా?’’నిర్మల కోపంగా అంది.
‘‘తప్పంతా మీ నాన్నది... భ్రమర నిస్సహాయకురాలు... ఏం చేస్తుంది చెప్పు... ’’
‘‘అమ్మమ్మా! యీ ఆర్ గ్రేట్. ఐ యాం ప్రౌఢ్ ఆఫ్ యూ’’.
‘‘సరే... మీ అమ్మ అడిగిందానికి ఇప్పుడు సమాధానం చెప్పు... నా కథ అయిపోయింది. నీకు పెళ్ళి కొడుకును చూడాలి కదా!’’
‘‘వేరే చూడ్డం ఎందుకమ్మా! శ్రీధర్ లేడా ...ఏం వాడికేం తక్కువ?’’
‘‘అన్నీ ఎక్కువే... శ్రీధర్ చాలా మంచివాడు...చదువుకుని కూడా చక్కగా వ్యవసాయం చేస్తున్నాడు.’’
‘‘మరింకేం..’’
‘‘ఏంటి ఇంకేం’’
‘‘నీ కెవరన్నాఫ్రెండ్ వుంటే చెప్పరా పోనీ’’
‘‘ఫ్రెండ్స్
చాలా మంది వున్నారు. మీ ఇద్దరికీ ఈ రోజు చెబుతున్నా... నేను అరేంజ్‌డ్
పెళ్ళి చేసుకోను. కట్నాలు, కానుకలు, ఆడంబరాలు... ఐ డోంట్ లైక్’’.
‘‘అయితే ఏం చేస్తావే... పెళ్ళి చేసుకోవా?’’
‘‘తెలియదు’’.
‘‘తెలియదా? పిచ్చి పట్టిందా’’నిర్మల అరిచింది.
‘‘అమ్మా!
ఆవేశపడుకు.... నా జీవితం గురించి నాకు కచ్చితమైన అభిప్రాయాలున్నాయి.పెళ్ళి
పెద్ద ముఖ్యం కాదు. నాకు కొన్ని ఆశయాలున్నాయి. మొదట అవి తీర్చుకోవాలి. నా
పెళ్ళిలో మీ పాత్ర ఏమీ వుండబోదు... నాకు అన్ని విధాలా నచ్చినవాడు ఎదురైతే
నేనే నిర్ణయించుకుంటాను. మీకు తప్పకుండా చెబుతాను. నిర్ణయం మాత్రం
నాదే....’’ అనల గొంతు దృఢంగా పలికింది.
‘‘అంటే... నీ పెళ్ళి మేము చేయెద్దా? నీ కోసం బోలెడు బంగారం... నగలు... సామాన్లు కొని వుంచానే...
‘‘ఆహా... హా.... నేను చెబుతూనే వున్నాను. నాకు నగలొద్దని... నువ్వు వినలేదు... ఎవరికైనా దానం చేసేయ్’’
అమ్మా కూతుళ్ళిద్దరూ అనలనే చూస్తున్నారు.
ఏంటీ పిల్ల ఇలా మాట్లాడుతుంది. కొంపదీసి ఎవరైనా అమెరికావోడిని పెళ్ళి చేసేసుకుంటుందా ఏంటి?
‘‘అమ్మమ్మా!
నీ ధైర్యం నాకివ్వు... ప్రపంచాన్ని గెలిచేస్తాను... అమ్మా! నీ
కన్నీళ్ళను నాకివ్వకు.. నేను నీ అంత బేలను కాదు. నాన్నలాంటి మనిషిని నువ్వు
కాబట్టి భరించావ్... నేను వొక్కరోజు కూడా భరించను’’.
‘‘ఆ.. చెప్పావ్ లే... ఇది అమెరికా కాదు... ఇక్కడ నీ ఆటలు సాగవు... పొనీ ఎప్పుడు
చేసుకుంటావో చెప్పు... నా దిగులు తగ్గుతుంది.’’ నిర్మల అనునయంగా అంది.
‘‘అమ్మా!
డోంట్ వర్రీ... నాకు అమెరికా అయినా ఆంధ్రా అయినా వొక్కటే... పెళ్ళి
విషయంలో నన్ను వొదిలేయ్.... అమ్మమ్మా! నువ్వు చెప్పు....పెళ్ళి చేసుకుని
నువ్వు కష్టాలు పడ్డావ్... అమ్మా కష్టపడింది.... ఎందుకు అలాంటి పెళ్ళిలోకి
నన్ను లాగాలని చూస్తున్నారు. ఏముంది దాంట్లో శోకమేకదా ?
‘‘అది కాదు బంగారం... అందరికీ కష్టాలే వుండవు. మగాళ్ళందరూ దుర్మార్గులు కాదు. పెళ్ళి మన సంప్రదాయం... కాదనకూడదు.’’
‘‘అమ్మమ్మా!
అంటే పెళ్ళి జూదంలాంటిదన్నమాట... నాకు జూదమంటే ఇష్టం లేదు. ఇంక నాకు
నిద్రొస్తోంది. ఇంతటితో ఈ మీటింగ్ ముగిసింది.’’ అంటూ లేచిపోయింది అనల.
నిర్మల కూడా లేచింది.
‘‘అమ్మా! నా గురించి నువ్వేమీ దిగులుపడకు.
నా పెళ్ళి గురించిన ఆలోచన నీ మనసులోంచి తీసేయ్. అమెరికాలో నాకో
బోయ్‌ఫ్రెండ్ వున్నాడు. అతను బెంగాలీ... నా ఆలోచనలకు దగ్గరగా వచ్చినవాడు...
నేను అతను కలిసి వుంటున్నాం. మాకు పెళ్ళి చేసుకోవాలనిపిస్తే నీ దగ్గరకే
వస్తాం.’’ అమ్మను గట్టిగా హత్తుకుని ఈ మాట చెప్పినప్పుడు నిర్మల ఉలిక్కి పడడం
అనలకు స్పష్టంగా తెలిసింది.
‘‘అన్నూ.... అంటే... మీరిద్దరూ కలిసి వుండడమంటే... ’’ గొంతులో ఏదో అడ్డం పడినట్టయింది.
‘‘అవునమ్మా.... మీం కలిసే వుంటున్నాం. నీ మాటల్లో చెప్పాలంటే మొగుడు పెళ్ళాల్లాగానే’’ అంటూ గట్టిగా నవ్వింది.
‘‘అన్నూ... తప్పు కదా! మన సంప్రదాయం కట్టుబాట్లు... ఎవరికైనా తెలిస్తే.’’ వణికిపోయింది నిర్మల.
‘‘తొక్కలో
సంప్రదాయం... ఆడవాళ్ళని శోకమూర్తుల్లా బతకమంటుంది సంప్రదాయం. ఏంటి
కట్టుబాట్లు... మారాలి. అన్నీ మారాలి... ప్రేమ వుంటేనే కలిసుండాలి...
లేకపోతే విడిపోవాలి... హింసలు,తన్నులు, వేధింపులు, కట్నాలు, కానుకలు
ట్రాష్... పెళ్ళంటే ఇదేగా... అమ్మా! నువ్వెప్పుడైనా నాన్నతో సుఫపడ్డావా?
అమ్మమ్మ సుఖపడిందా? నేనలా కాదు... నేను అనలను...ఐ నో వాట్ టు డూ... ఐ కెన్
మానేజ్ మై లైఫ్... నా జీవితానికి నేనే కర్త కర్మ క్రియ... దట్సిట్....’’
అనల ఆవేశం చూసి నిర్మల భయపడింది.
‘‘అమ్మా!!
అశోక చెట్టు కింద సీత ఏడుస్తూ కూర్చున్నట్టు ఆడవాళ్ళు ఏడుస్తూ వుండాలని
అందరూ ఆశిస్తారు. నేను శోకాన్ని గెలవాలనుకుంటున్నాను.
నేను అశోకాన్ని... నేనెప్పుడూ ఆనందంగా వుండాలని కోరుకో అమ్మా!’’ అమ్మ గుండెల్లో దూరిపోతూ అంది అనల.
నేను అశోకాన్ని... నేనెప్పుడూ ఆనందంగా వుండాలని కోరుకో అమ్మా!’’ అమ్మ గుండెల్లో దూరిపోతూ అంది అనల.
‘‘అన్నూ... నా బంగారం... నువ్వెప్పుడూ ఆనందంగా, హాయిగా
వుండాలి. నువ్వు గెలుస్తావని నాకు నమ్మకముంది. నువ్వెప్పుడూ అశోకంగానే
వుండాలిరా...’’
వొకరిని ఇంకొకరు హత్తుకుని హాయిగా నిద్రపోయారు. ఎక్కడో తొలికోడి కూసిన శబ్దం లీలగా వినిపించింది.
**************
1 comment:
Satyavati. Garu
Eenaati. Pillala. Bhavalni,teguvanu. Chakkagaa. Chepparu. kondarustreelu. Pade. Mooga. Kshobhani. Ilaage. Prasnistunnaaru. Samaajaaniki. Bhayapadi,peddalaku jihadisi, vidyaleka,dabbuleka. Bayataku. Adugu. Veste. Nilabade chotu
Leka. Enno. Jeevitaalu kamili,kumili. Nusi. Ayipoyaayi,inkaa. Avutune. Vunnaayi.
Post a Comment