Monday, August 3, 2015

జీవన'చాయ్'


ఫోటోల కోసం నా ఫేస్ బుక్ పేజీని దర్శంచండి
https://www.facebook.com/satyavati.kondaveeti

Chai-enge 16 th Story ~

కొండవీటి సత్యవతి గారితో జీవన'చాయ్'
11. 26.
ఈ రాత్రి ఒక స్నేహశీలి గిరించి రాయాలని, రేపటి స్నేహితుల రోజుకి ఒక కానుకలా ఇవ్వాలని ఇప్పటికే రాసిన దానికి ఇంట్రడక్షన్ జత చేస్తున్నాను.
తను సత్యవతి గారు.
స్నేహానికి చిరునామా.
భూమిక'
తొలి పరిచయం తోనే ఈ విశేషణం ఎలా సాధ్యం అంటే 'ఒక మెతుకు చాలు' అంటారు కదా, అలా.! అంతే మరి. వారితో ఇందిరా పార్క్ సందర్శన ఒక్కటి చాలు, అక్కడ నేను తీసిన ఒక్క చిత్రం చాలు, తను ఎంతటి స్నేహ వస్చాల్యం తో ఉంటె అక్కడి ప్రకృతి నా చిత్రం లో అపురూపంగా కనిపిస్తుంది? నేను మనుషులను తప్ప ప్రకృతి దృశ్యాలు తీయను. కాని తనతో వెళితే నాగ మల్లిని తీసాను. లావెండార్ చెట్టును తీసాను. అడవి బాదం కాయను తీసాను, పురుగూ బూషి కూడా నాకు మహత్యం లా కాన వచ్చింది. తాను ఒక స్నేహితు రాలి తల దువ్వినట్టు, వెంట్రుకలను అలవోకగా ముందుకు వేసినట్టు ఒక చెట్టు ఆకులను ముందకు వేసి అప్పటిదాకా దానికి ఊపిరి ఆడని స్థితిని తప్పించడం చూస్తే, 'ఈమె మనిషి కాదు, ప్రకృతి' అనిపించింది. అలా తొలిసారి ఒక అడవిని, ఒక మైదానాన్ని, తోటని చూపించిన మాదిరి తను ఆ పార్క్ ను చూపడం ఒక చిత్రం. అనేక చిత్రాలు కూడా.
అందుకే ముందు నేను పోస్ట్ చేసిన నా చిత్రాలు చూడండి. తర్వాత ఒక చలన చిత్రం చూపించే ప్రయత్నం చేస్తాను, చూద్దురు గాని!

అవును మరి. సంక్షిప్తంగా చెప్పాలంటే తన జీవితం ఒక అద్భుతమైన చలన చిత్రం.
మామూలుగా ఒక స్టిల్ లైఫ్ ని చేసే రచయిత, కెమెరా దర్శకుడిని నేను. కానీ తాను చలన చిత్రం గనుక కొంత దృశ్యీకరించి చూపాలనిపిస్తోంది.
సో, కొండవీటి సత్యవతి గారు, డాటరాఫ్ కాసి అన్నపూర్ణమ్మ, శ్రీ రామ మూర్తి గారు. వారి కథ ఏమిటో చూడండి. రమారమి నాలుగు దశాబ్దాల చలన చిత్రానికి ఒక మూడుగంటల సంక్షిప్త రూపం ఇస్తే అదిలా ఉండవచ్చు నేమో!
వారి నాన్నగారు తనని హైదరాబాద్ తీసుకు వస్తూ ఉంటారు. అక్కడ టైటిల్స్ పడుతుండగా చిత్రం తొలి సన్నివేశం మొదలువుతుంది. ఆ టైటిల్స్లో కథానాయకి ఊరి పేరు ' సీతారామపురం' అని తొలుత పడుతుంది. తర్వాత రేడియోలో వార్తలు వినబడుతుంటాయి. ఊర్లో మగపిల్లలతో సమానంగా ఆటపాటల్లో నిమగ్నమైన ఆ అమ్మాయిపై కెమెరా ఒక్కసారి ఫోకస్ అయి తర్వాత బ్లర్ అవుతుంది. ఆడపిల్లనా మగపిల్లవాడా అర్థం కాదు. కానీ మల్లీ ఆమెను చూపిస్తే తను అమ్మాయే! ఆమెనే చూపిస్తూ, అక్కడి నుంచి ఆ షాట్ లాంగ్ షాట్లో వైడాంగిల్ లోకి మారి మళ్లీ ప్యాన్ అయిన క్రేన్ షాట్ గా మారి పైనుంచి తండ్రి రేడియో వార్తలు వింటూ ఉండగా క్లోజప్ లోకి వస్తుంది. రేడియో నుంచి ఆ మాటలు మరింత గట్టిగా వినిపిస్తూ ఉండగా పక్షుల అరుపులు, గ్రామీణ జీవితపు సంబ్రమం ఒకింత తగ్గి ఒక అంతర్జాతీయ వేదికపై తొట్టతొలిసారిగా 'మార్చి 8' అన్నది మహిళా దినోత్సవంగా మారుతున్న సంగతి మనకు కానవస్తుంది. లీలగా ఒక మార్చ్ సాంగ్ వినిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఆ పాట ఒక్క మార్చ్ 8 కి మాత్రమే పరిమితం కాదు, ఆ మొత్తం సంవత్సరానికీ విస్తరిస్తుంటే కెమెరా మరింత వైడ్ అవుతూ ఉంటుంది.

'అవును. 1975. ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటో కాదు, మహిళా సంవత్సరం. ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది. దాంతో మహిళల జీవితాల్లో ఒక కీలక ఘట్టానికి తెరలేవబోతోంది' అంటూ ఆకాశవాణి వార్తలు పెద్దగా వినిపిస్తుండగా కెమెరా లక్షలాది మహిళల జీవన ఘడియలను, వారి జీవనచ్ఛాయలని చూపిస్తూ తిరిగి ఫోకస్ లో తెరపై కథానాయకి అటు తర్వాత ఆమె తండ్రి కనపడతారు. ఇంతలో ఆ వార్తలు విన్న తండ్రి డిగ్రీ చదివిన తన కూతురు భవితా ఈ సంవత్సరం నుంచే మారుతుందన్న ఆశతో ఉత్సహంగా రేడియో కట్టేసి కూతురిని రెడీ చేస్తుంటంలోకి మారుతుంది. ఆ అమ్మాయి కూడానూ ఉత్సాహంగా తండ్రి వెంట సీతారామపురం నుంచి హైదరాబాద్ బయలుదేరడం మలిదృశ్యం. ఇంతలో దృశ్యాల్లోకి ఆ ఊరు - అక్కడి నది, గోదావరీ దాటి వారిద్దరూ బాగ్యనగరం రావడం, అప్పటి ఆ ప్రయాణం అంతానూ ఒక కొత్త చరిత్రకు సంకేతంగా కానవస్తూ ఉంటుంది. దాంతోఒక్కపరి ఒక అమ్మాయి జీవితం గ్రామం నుంచి సరికొత్తగా నగరంలోకి రావడం, తర్వాత తనని ఇక్కడ బందువుల ఇంట్లో తండ్రి వదిసి వెళ్లడం...దృశ్యాలు చకచకా మారుతుండగా సరిగ్గా అదే సంవత్సరం మరో మహిళ...పండిత్ జవహర్ లాల్ నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ భారత ప్రధానిగా ఎమర్జెన్సీ విధించడంతో హాయిగా వినవస్తున్న నేపథ్య సంగీతంలో అపశృతి దొర్లుతుంది. అప్పటిదాకా చూసిన రంగుల దృశ్యాల్లోకి నలుపు దృశ్యాలు తోడవుతాయి. దాంతో ఆ సన్నివేశం ఫ్రీజ్ అయి మళ్లీ కదులుతుంది.
నేపథ్యసంగీతం నుంచి మాటలు వినవస్తాయి. 'ఈ కథ ముందుగా కేవలం ఒక స్త్రీ తాలూకు జీవన గాథ మాత్రమే, ఇతివృత్గం ఒక్క స్త్రీకి పరిమితం అనుకునేరు. కాదు' అంటుందా వాయిస్ ఓవర్. వెనకాల నుంచి వినవచ్చే మహిళల స్వరాలు, వారి ఉత్తేజిత ప్రసంగాలు నిదానంగా తగ్గి అటు తర్వాత మొత్తం సమాజం నుంచి వినవచ్చే హాహాకారాలు పెరుగుతాయి. వాటినుంచి ఎదురీతనూ చెప్పే దృశ్యాలు వ్యక్తమవుతూ ఉంటై. అట్లా మొత్తం సంక్షుభిత సమాజం, అందులో ఒక స్త్రీ వాదం కలగలస్తుంది. అది బలోపేతమై విస్తరించి మొత్తం సమాజాన్ని దగ్గరకు తీసుకుంటూ ఉంటే, తనదైన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న కొండవీటి సత్యవతి గారి పాత్ర క్రమేణా ఒక నిండు మనిషిగా వికసించడం, ఒక చక్కటి మూర్తిమత్వం తెరపై భాసిల్లుతుండగా సినిమా టైటిల్ 'భూమిక' అని పడుతుంది.
+++
ఇట్లా అంతర్జాతీయ వేదికపై మహిళలకు సంబంధించిన కీలక సన్నివేశానికి యవనిక తొలగుతుండగా మరోవంక భారతదేశంలో ఒక మహిళా ప్రధాని చేత చీకటి తెరలు కమ్ముకుంటున్న సందర్భంతో కొండవీటి సత్యవతి గారి కథ మొదలవుతుంది. 1975 నుంచి 1985 దాకా -అంటే ఒక దశాబ్దాన్ని యునైటెడ్ నేషన్స్ మహిళా దశాబ్దిగానూ ప్రకటించింది. సరిగ్గా ఈ పదేళ్లలోనే తెలుగునాట స్త్రీ వాదం బలమైన పాయగా ఎదిగడమూ ఒక యాదృచ్ఛికత. ఈ సమయంలో తాను చదువుకున్న అమ్మాయిగా, ఉద్యోగం చేస్తున్న వనితగా, తెలియకుండానే చరిత్ర రచనలో ఒక భాగమై ఒక కథానాయకిగా మారుతుండటం విశేషం. ఆ కథానాయకి నగరంలో వేసే తొలి అడుగులు, నిదానంగానే అయినా అత్యంత సహజంగా, సుందరంగా, స్థిరంగా పాదుకోవడం- తాను ముందుకు వెళుతూ ఉండగా ఆ మహిళ నిండు వ్యక్తిత్వం దశలు దశలుగా తెలుగునీట ఒక స్త్రీ జీవితం ఎంత స్వతంత్రంగా, స్వేచ్ఛగా, జీవితేచ్ఛతో వికసించిందో ప్రతిబింబించేలా సాగడం- అదే అదే 'భూమిక' కథ.
+++
వడివడిగా కథ ముందూ వెనకలకూ వెలుతూ ఒక స్త్రీ తనదైన వ్యక్తిత్వంతో ఉద్యోగిగా, కార్యకర్తగా, రచయిత్రిగా, పాత్రికేయురాలిగా తెలుగునాట తనదైన భూమికను సంతరించుకుంటూ విహరించడంతో కథ పురోగమిస్తుంది. మారుతున్న సమాజంలో తన పాత్ర కూడా బహుముఖాలుగా విస్తరించడం ఈ కథలోని విశేషం.
కథానాయకి పాత్ర నిదానంగా ఎదుగుతుంది. ఒక్క పరి పైకి రాదు. ప్రస్తుతం భూమిక సంపాదకురాలిగా, పత్రికతో పాటు ఐదారేళ్లక్రితమే 'హెల్ప్ లైన్' గా అవతరించి అందరికీ అందుబాటులో ఉంటూ ఉండగా, తన తదుపరి కర్తవ్యాన్ని మరో కథానాయకి ప్రశాంతంగా స్వీకరించడానికి సంసిద్ధం అవుతుండటంతో ఆ పాత్ర కాసింత విశ్రాంతిని పొందడానికి వెసులుబాటును పొందుతూ ఉంటుంది. ఈ దశలో తొలి భాగమైన భూమిక కథ ముగుస్తుందనవచ్చు. అయితే సినిమా చివర్లో 'సశేషం' అని పడుతుందని వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.
అయితే, ఇందులో తన భర్తా ఉన్నారు. ఎనభయ్యవ దశకంలో విజయవాడలో నాస్తిక సమాజం తరఫున జరిగే వేడుకల్లో నిప్పుల మీద నడుస్తుంది కథానాయకి. చివరికొచ్చేసరికి కాస్త తొణుకుతుందగా ఒకరు చేయి అందిస్తారు. వారినే తర్వాత భర్తగా స్వీకరించడం కథలో ఒక మలుపు.
చిత్రమే.అప్పుడు చిన్నఅడ్వకేట్ గా ఉన్న ఆయన తర్వాత సత్యవతిగారిని పెళ్లాడాక ఒక చిన్న సూట్ కేస్ తో ఆవిడ ఇంటికే రావడం అప్పట్లో చిత్రమే. అవును. కథ నిండా ఎవరూ ఊహించని మలుపులు. కల్పన లాగా తోచే జీవన సన్నివేశాలు. ఎన్నో పాత్రలు. తనలోని బహుముఖ వ్యక్తిత్వమూ వివిధ పాత్రలుగా కానరావడమూ అంతనూ ఒక స్నేహితం, శోభ. అయితే బాధితులు, నిస్సహాయులు, విధిరాతను ఎదిరించే మనుషులూ, ఇట్లా జీవితమూ, పోరాటమూ, ఘర్షణా, సంతోషమూ కలగలసి, కథ అనేక లేయర్స్ తో వర్తమాన చరిత్రను ప్రస్తావిస్తూ, గతం నుంచీ భవితలోకి సాగడం నిజంగానే ఒక కథలా ఉంటుంది. ఇదంతానూ - మార్పు యావత్తునూ చిత్రక పట్టేలా, ధ్వనించేలా -వీనుల విందైన ప్రకృతి ఒకటి సినిమా చివరికంటూనూ ఒక చలన సంగీతాన్ని వినిపించడం మరో విశేషం.
+++
భూమిక కథ ఒక హృద్యమైన గాథ. ఎందరితోనో అల్లుకున్న కథనం. ఆ కథలో తొలి దశలో ఉద్యోగిగా ఉంటూ ఉన్నప్పుడు కథానాయకికి తన భవిష్యత్తు పాత్ర ఊహకైనా రాదు. యాదృచ్చికంగా తాను ఒక నాటిక చూస్తూ ఉంటుంది. అది విడాకుల గురించిన నాటకం. అది చూశాక దాన్ని వేసిన వాళ్ల గురించి ఆరా తీస్తుంది. వాళ్లతో తాను కలిసి పనిచేయాలని నిశ్చయించుకుంటుంది. అట్లా తన అన్వేషణ 'ఆన్వేషి' బృందాన్ని పరిచయం చేయడం, కట్ చేస్తే అన్వేషి కార్యాలయంలోనే ఒక గది. అందులో భూమిక పత్రికా కార్యాలయం. అందులో సంపాదకురాలిగా తానే పనిచేస్తూ ఉండటం నిజంగా ఒక ఉద్విగ్న కథ. తనే రాసే ఒక నిజజీవిత కథ వంటి కథే.
సినిమా కథ కొనసాగుతూ ఉంటె, భూమిక కార్యాలయం లో మొదట ఉన్నచాలామంది ఒక్కొక్కరూ వెళ్లిపోతూ ఉండటం, తర్వాత తాను స్థిరంగా అదే భూమికలో ఉంటూ తాను వ్యక్తిగా విస్తరించడం, ఇదంతానూ వర్తమాన చరిత్రను, స్త్రీ వాదాన్ని బలంగా తీసుకు వచ్చిన మూర్తుల పరిచయంతో, వారి వేర్వేరు కార్యక్షేత్రాలతో అందులో తన జీవితం ఇరుసుగా ఈ చలన చిత్రం మన సమాకాలీన చరిత్రకు దర్పణంగా నిలవడం చాలా హాయిగా ఉంటుంది. హాయిగా ఉండటం ఎందుకంటే, ఈ చిత్రం లో గర్షణ పాత్రకన్నా జీవిత ఆవిష్కరణ జరగడమే సిసలు పాత్ర అన్నట్టు సత్యవతి గారి బ్రతుకు కాన రావడం ఒక కవితా న్యాయం అన్నట్టు ఉండటం అదొక చిత్రం. కథ సాగుతూ ఉంటుంది.
అన్నట్టు, తాను ఉద్యోగం చేయడం, ఆ ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా విరమించుకోవడం, భూమిక సంపాదకురాలిగా తాను పనిచే్యడం- తర్వాత రెండు దశాబ్దాలు దాటే సరికి భూమిక హెల్ప్ లైన్ ప్రారంభం కావడం. స్త్రీలు తమ సమస్యలు చెప్పుకోవడానికి టెలిఫోన్ ను సైతం వినియోగించుకుంటూ ఉండటం, రక రకాల ఫోన్లు. వాటినుంచి తాను ఒక్కత్తిగా బయల్దేరడం, తర్వాత మిత్రులతో కలిస ఒక బృందంగా వెళ్లడం, ఒక యాక్టివిజం- ఒకరికి ఒకరు అండదండలుగా ఉండటం, పత్రికా-కార్యాచరణ- అట్లా పోలీసులు, న్యాయవాదులు, డాక్టర్లూ, రకరకాల వృత్తిదారులూ, మనుషులు. ఇట్లా - కథ స్త్రీ సమస్యల ఇతివృత్తం ఎలాంటిదో, అది ఎట్లా మిగతా ఇతివృత్తాలతో అల్లుకుని ఉన్నదో చెప్పడంగానూ ఆ సినిమా వేగంగా అనేక దృశ్యాలతో సాగిపోతూ ఉంటుంది. ఐతే ఎక్కడ విసిగూ విరామం ఉండదు. అదే విశేషం.
తర్వాత తాను తర్వాత సోషల్ నెట్ వర్క్ మీడియం అయిన ఫేస్ బుక్కులోనూ కనిపించడం అక్కడ తనను తాను హాయిగా ఆవిష్కరించుకుంటూ ఉండటం, ఆ క్రమంలో ఒక మెసేజ్. అది నేను పెట్టింది కావడం. దానికి తాను రెస్పాండ్ అవడం నా వరకు మరో విశేషం. తర్వాత ఒకరోజు తాను స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న కారు ఇందిరా పార్క్ దగ్గర ఆగడం, తాను పార్కులోకి నడిచి నడక సాగిస్తుండగా నేను కలవడం, కలిసింతర్వాత పార్కులోని ప్రతి చెట్టు, కొమ్మా, రెక్కా, పూవు కథలు కథలుగా వికసించడం, అసలు ఈ చెబుతున్న సినిమా అంతానూ ఇందిరాపార్కులోని ఒక్కో దృశ్యం దగ్గర నుంచి వెనక్కి నడిచి ముందుకు రావడం చిత్రం. ముందు నేను చెప్పినట్టు -నేను తెసిన ఒక్కో చిత్రం తో కథ వెనక్కు ముందుకూ నడుస్తూ చలన చిత్రం అవడం నిజమైన చిత్రం. ఇక్కడ ఆగాలి. విశ్రాంతి.
+++
ఇందిరా పార్క్ లో జీవన'చాయ్' కోసం మేము కలిసాక-చిత్రంగా మా సంభాషణ అంతా అయిపోయాక- బయటకు వస్తూ ఉండగా ఈ ఉద్విగ్న చిత్రానికి ఒరవడి 'ఆ 1975 కాదా?' అనుకోవడం ఒక ఆశ్యర్యం!
అప్పటి దాక మాకే తెలియదు. ఎవరి జీవితం వారు తిరిగి చూసుకుంటామా ఏమిటి? కాని చిత్రంగా అలా తోచింది. దాంతో ఒక ఆలోచన కలిగింది. ఇందిరాపార్క్ లోని ఇందిరమ్మ విగ్రహం వద్ద తనను నేను నిలిపి ఒక చిత్రం రచించడం అవసరం అనిపించింది. దాంతో ఈ చలన చిత్రానికి భూమిక 'ఆ 1975 సంవత్సరం' అనే నేను నమ్మడం, ఆ మాటా తనతో పంచుకోవడం, అట్లా అన్నప్పుడు ప్రస్తుతం ఇందిర కటింగ్ తో ఉన్న సత్యవతి గారు చిన్నగా నవ్వుకోవడం, నవ్వి 'అవునా' అని తల పంకించడం ఒక చిత్రం. తీసాను దాన్ని. ఇట్లా తన కథను నేను చెప్పడం గమ్మత్తుగా ఉందే అనుకోవడం, ఇదీ మా ఇద్దరి మధ్య నడిచిన ఒక తెలియని ఆవిష్కరణ - జీవన'చాయ్'.
అయితే ఇందిరాపార్కు ఒక ప్రతీక. అది తను పుట్టి పెరిగిన సీతారామాపురం వంటిదే. ఒక బూమికనే!
అక్కడ తాను మొగలిపూల పొదను చూపించారు. తాటివనాలనూ చూపించారు. మాంజా బారిన పడి మరణం అంచున వేలాడిన ఒక కొంగ, మరో గబ్బిలం గురించీ చెప్పారు. తాను వాటిని రక్షించిన విధానాన్ని, ఆ వాతావరణాన్ని, అక్కడ అలా ఆ ఉదయం ఆ చెట్ల నడుమ పంచుకున్నప్పుడు తాను మహిళల రక్షణ గురించి మాత్రమే తపించే స్నేహశీలి అనిపించలేదు. ఒక మమత అనిపించింది, ఆమె గురించిన ఒక ఎరుక తెలియ వచ్చింది. తను తీగల గురించి, ఛీమల పొట్లాల గురించీ చెబుతున్నప్పుడు సుతారంగా అల్లుకునే విధానం అర్థమైంది. తనను తాను దాపెట్టుకునే దాగే సౌందర్యం కాన వచ్చింది. తనకు ఇందిరాపార్కు అన్నది తన జీవావరణ వ్యవస్థలో ఒక భాగం అని, అసలు తానే భూమిక అని, మిగతావన్నీ కేవలం ఆశ్రయాలే అనీ అర్థమైంది. అసలు తన జీవితమే చలన చిత్రం అని, తాను చూపిస్తున్నవి తానూ వేరు వేరు కాదనీ అర్థమైంది. ఒక చిత్రం చలన చిత్రం కావడం అంటే ఇదే.
తాను అనుభవం, అనుభూతి. పంచుకుంటారు కూడా. అట్లా, ఎక్కడుంటే అక్కడ చప్పున తాను ఒక వేరును చూపుతారు. ఒక దారు వలయాన్ని చూపుతారు. అటువంటి మనిషే స్వయానా క్షేత్రం తప్పా మరొక క్షేత్రంలో తనను వెతకడం వృధా ప్రయాస అనీ అనిపించింది.
అక్కడి నుంచి తర్వాత వారి ఇంటికి వెళ్లి చాయ్ తాగడం, భూమిక కార్యాలయానికి వెళ్లి తన పుస్తకాలు తీసుకోవడం, అటు పిమ్మట నేను తీసిన చిత్రాలను కొన్నింటిని ఎంపిక చేసుకుని ఈ చలన చిత్రాన్ని రచించడం అంతానూ ఒక షేరింగ్. ఒకరి చాయలో సేద తీరడం. స్నేహితం. నాలుగు దశాబ్దాల చలన సంగీతానికి సంక్షిప్త అనువాదం.
+++
ఇట్లా సత్యవతి గారి కథనం ఒక చలన చిత్రం. అందులో సీతారామపురం నుంచి ఇందిరాపార్కు దాకా జరిగిన అనేక దృశ్యాదృశ్యాల సమాహారం చలనం అంతానూ ఒకే చిత్రం. అదే ఒక భూమిక.
+++
అయితే ఏవీ కల్పన కాదు. ఏవీ మరచిపోని విషయాలే.'వాడిపోని మాటలు'. అవును. ఆపేరుతో తాను రాసిన భూమిక సంపాదకీయాలు చదివితే, గడిచిన దశాబ్దాలలో విరిసిన ఘట్టాలెన్నో మళ్లీ ముందర ఉద్విగ్నంగా పరుచుకుని వర్తమానాన్ని ఉత్తేజితం చేస్తాయ్. చలన చిత్రం అన్నాను కదా. అందుకే. అందులో అందరి జీవితాలూ తెరుచు కుంటై!
'తుపాకీ మొనపై వెన్నెల' పేరుతో తెచ్చిన తన యాత్రానుభవాలు ఆమెలోని సాహసిని, పరిమితులు దాటి విహరించే స్వేఛ్చ పరిచయం చేస్తాయి. అదొక చిత్రం.
ఇక తన తొలి కథల సంపుటి 'ఆమె కల' తెరిస్తే, అందులో పక్షే ఉంటుంది. బోనులో ఉన్న పక్షి -బొనులొంచి బయట పడే పక్షి. అన్నీ ఉంటై. ' చెట్టు మీద పిట్టల్లే తనని పెంచిన అమ్మా నాన్నా -తనకు భూమికను ఇచ్చిన ఇరుగు పొరుగు - కార్యక్షేత్రం, మానవీయత -అన్ని కలగలసిన ఒక పెద్దబడి వంటి పాఠశాలలోకి ఆ పక్షులే మనల్ని మనల్ని తీసుకెళతాయి. అక్కడ విశ్వవిద్యాలయమూ ఉందని తెలిసి ఆశ్చర్యపోవడం మన వంతు. అవును మరి. అన్ని జీవావరణాలు కలిసిన స్త్రీ మూర్తి, వ్యక్తిత్వ, కొండవీటి సత్యవతి గారు.ఆవిడ స్వయానా రెక్కలున్న పక్షి. పిల్లల కోడి. అల్లుకునే స్నేహలత.
అన్నిటికీ మించి, తాను త్వరలో అచ్చుకు ఇవ్వబోతున్న పుస్తకం - 'ఆనందార్ణవం'. అది ఒక్కటి చాలు, మొత్తం తన చిత్రాన్ని లేదా చలన చిత్రాన్ని సంతోష ద్వీపాల సమాహారం అని రుజువు చేయడానికి. ఇందులో సంతోషం అంటే ఏమిటో తను అనుభవించి పలువరించిన విదానం చూస్తే, తాను గొప్ప రచయిత్రగా కంటే అద్భుతమైన మనిషిగా జీవించడానికి పొందిన వరం ఏమిటో అదెట్లా తనని సామాన్యీకరించిందో అవగతమై ఎదురీత, ఘర్షణ కన్నా 'జీవితేచ్ఛ' అన్నది తనని ఎంత నిశతం చేసిందో తనని అంత ఆనందమైన మనిషినీ చేసిందనిపిస్తుంది. ఒక రకంగా మ్యూజింగ్స్ వలే అనిపించే ఈ పుస్తకం ఆమెను సున్నితమైన మనస్కురాలిగా, ఇన్నేళ్లూ నిరంతర కార్యాచరణలో ఉండి కూడా యాంత్రికం కాని తన జీవధారుడ్యాన్ని ఆవిష్కరిస్తుంది.
ఇక తన ఫేస్ బుక్ 'టైమ్ లైన్'. అక్కడ గనుక తనని చూస్తే, తాను ఎంత స్నేహశీలో మరెంతటి కార్యకర్తో ప్రతి పోస్టూ చెబుతుంది. కార్యాచరణ కోసం తను కాదు. తన కోసమే కార్యం అన్నంత ఇదిగా తాను ఇన్వాల్వ్ అయి ఇష్టంగా, ప్రేమతో నిమగ్నమయ్యే కార్యాచరణ మనల్ని ముగ్దులను చేస్తుంది.
తెలుగునాట ఇంత హాయిగా వ్యక్తమయ్యే 'జీవని' ఒకరు మనకు అరుదుగా కనిపిస్తారు. వారితో గడిపిన బతికిన క్షణాలకు ఆనందం. సంతోషం. ధన్యవాదాలు.
+++
చివరగా, తొలిగా చెప్పవలసిన మాటలు.
అవును. చిత్రమే.
చిత్రం ఏమిటంటే సత్యవతి గారు అద్బుతమైన మనిషి గా ఆవిష్కారం అవుతారు, ప్రతి రచనలో. బహుశా అందుకే తాను పెద్ద రచయితగా పేరు పొందలేదు. అది నిజంగా అదృష్టం!
అలాగే, తాను గొప్ప యాక్టివిస్ట్ గానూ పేరు పొందలేదు. లెఫ్ట్ బ్యాక్ గ్రౌండ్ నించి తను రాకపోవడం తనకు కలిసి వచ్చిన మరో అదృష్టం! లేకపోతే తను జీవితం ఒక సంతోష సాగరం కాకుండా, పోరాట సారం మాత్రమె అయ్యేది. అదొక అదృష్టం.
అలాగే, తన జీవితం ఒక చిత్రం కాలేదు. అది చలన చిత్రం అయింది.
దాన్ని ఎవరూ ఫ్రీజ్ చేయలేరు. అది అన్నిటికన్నా ముక్యం.
ఈవెన్ స్త్రీ వాది గా తాను పని చేస్తున్నప్పటికీ, తనలోని మనిషి, మానవత ముక్యం గా ప్రవర్తించడమే తన స్త్రీ లక్షణం అవడం మా అదృష్టం. లేకపోతే తాను ఏమర్జ్ అయ్యేవారు కాదు, ఇందిర అయ్యే వారు గాని సత్యవతి గారు అయ్యేవారు కాదు.
థాంక్స్ ప్లీజ్.
మీ స్నేహపూర్వక జీవనజీవన'చాయ్'కి ,
మీదు మిక్కిలి మీది అయిన 'భూమిక''కి,
happy friendship day wishesతో.
00.27
02.05.2015
~ కందుకూరి రమేష్ బాబు

No comments:

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...