ఈ రోజు తండ్రుల దినమట.
మా నాన్నని తలుచుకుంటుంటే ఏమి గుర్తొస్తుంది.
ఆయన రోజంతా చేసిన కష్టం గుర్తొస్తుంది.
పొలంలో ఆరుగాలం పనిచేసిన రోజులు గుర్తొస్తాయి.
మా ఆవు కోసం పచ్చగడ్డి కోసుకొచ్చి మా వీధి అరుగు మీద అలా వొరిగి నిద్రపోయే నా నాన్న గుర్తొస్తాడు.
మా ఆవు కోసం చిట్టు... తవుడు గంపలో కలుపుతుంటే చెంబుతో నీళ్ళు పోసిన దృశ్యం గుర్తొస్తుంది.
మా తోటల్లో కూరగాయల మొక్కలకు దిగుడు బావిలోంచి బుడ్లజోడుతో (మట్టి కుండలు) నీళ్ళు ముంచి పోస్తుంటే నేనూ ఓ కుండ తీసుకుని ఆయన వెనకే నీళ్ళు పోసిన జ్ఞాపకాలు...
నన్ను స్కూల్ చేర్పించడానికి నరసాపురం తీసుకెళ్ళి అది ఏ స్కూలో తెలియకుండానే ఓ కొండపల్లి చేంతాడంత పేరున్న "హిదూ స్త్రీ పునర్వివాహ సహాయక సంగం స్కూల్" లో (అది ఓరియంటల్ స్కూల్ అని తెలిసో తెలియకో) నన్ను జాయిన్ చేసిన జ్ఞాపకం.
(అందరూ నన్ను విడో హోం లో చదువుతోంది అని వెక్కిరించేవారు.అప్పటికి విడోస్ అంటే ఎవరు అని నాకు తెలియదు.)
నేను కష్టాతి కష్టం గా డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఉన్నప్పుడు "పద హైదరాబాద్ పోదాం నీకు ఉద్యోగమొస్తుంద"ని నన్ను ఈ మహానగరానికి తెచ్చి ఎలాంటి సంకోచం లేకుండా నన్ను మా చిన్నాన్న ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయిన జ్ఞాపకం..
.నా జీవిత గమనం...గమ్యం నిర్ణయమైన సమయం..
మా అక్కలు..అన్న తమ్ముళ్ళు నాన్న గారూ అని పిలిచినా
నేనొక్కదాన్నే నాన్నా...నువ్వు అని పిలిచిన నాన్న...మా దొడ్డమనిషి.
వ్యవసాయం చేసిన రైతు...
అప్పుడప్పుడూ వ్యాపారం చేసి అమాయకంగా మునిగిపోయిన నాన్న.
నాన్న 50 ఏళ్ళకే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు.
ఆయనకి ఖరీదైన వైద్యం చేయించే స్థోమత మాకు లేదు.
బిపి పెరిగి తలలో నరాలు చిట్లి చనిపోయాడు నాన్న.
నేను ఆయన్ని చివరి చూపు కూడా చూడలేదు.
నేను చాలా కష్టపడి హైదరాబాద్ నుంచి వెళ్ళినా అప్పటికే అంతా అయిపోయింది.
నాన్న చాలా అరుదుగా షర్ట్ వేసుకునేవాడు.
షర్టులుండేవి కాదు.
నన్ను ఆడపిల్లగా కాకుండా మనిషిగా పెంచిన నాన్న..
చెట్లెక్కడం..
చేపలు పట్టడం...
సైకిల్ తొక్కడం...
గొడ్దళ్ళతో కట్టెలు కొట్టడం నేర్పిన నాన్న...
నువ్వాడపిల్లవి..అది చేయొద్దు.. ఇది చేయొద్దు... అలా తిరగొద్దు అని ఏనాడు చెప్పకుండా నన్ను చెట్టు మీద పిట్టల్లే స్వేచ్చగా పెంచిన నాన్న...
నన్ను హైదరాబాద్ తెచ్చి నా జీవితాన్ని అనూహ్య మలుపు తిప్పిన నాన్నని తలుచుకుంటే ఎంత సంతోషమో నాకు.
నా దగ్గర ఉన్న నాన్న ఒకే ఒక్క ఫోటో ఇది.వెనక రైలుపెట్టెల్లాగా ఉన్న మా ఇల్లు...
మండువా లోగిలి.
ఎడం వైపు నుండి రెండో వ్యక్తి మా నాన్న.పేంటు వేసుకున్న వాడు మా ఆఖరి చిన్నాన్న
2 comments:
baga rasarandi... talchukunte gundelo ni badha,jnapakalu,istam anni karigi neerai kanula chivara munduku venakki velladaniki alochisthaayi.. oka nittorpu, oka chiru navvu...
Adrustavantulandi miru
Post a Comment