Wednesday, January 4, 2012

ఫీనిక్స్ పక్షిలా, పడిలేచిన కెరటం – ఇందిరా గోస్వామి


2002 మార్చి నెలలో ఇందిరా గోస్వామి హైదరాబాదు వచ్చారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగిన జాతీయ స్థాయి రచయిత్రుల మహాసభల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఇందిర ఆ రోజు ఎంతో ఉద్వేగభరితమైన ఉపన్యాసం ఇచ్చారు. నేను, కొండేపూడి నిర్మల ఆవిడను ఇంటర్వ్యూ చెయ్యడానికి లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌కి వెళ్ళినపుడు ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. ఉత్సాహంగా నవ్వుతూ మాతో దాదాపు గంటసేపు గడిపారు.
నవంబరు 29న ఇందిరా గోస్వామి మరణించారని విన్నపుడు చాలా బాధేసింది. 69 సంవత్సరాలకే ఆమె తుదిశ్వాస వీడడం ఒక్క అస్సామ్‌ రాష్ట్రానికే కాక యావత్‌ దేశానికి ఎంతో విషాదకరమైన అంశం. ఫీనిక్స్‌ పక్షిలా, పడిలేచిన కెరటంలా ఆమె అత్యంత విషాదంలోంచి తేరుకుని, భారతదేశం గర్వించదగ్గ రచయిత్రిలా ఎదిగిన తీరు మరుపురానిది. ఆత్మహత్యకు ప్రయత్నించిన నేపథ్యంలోంచి ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకుంటూ అత్యద్భుతమైన రచనల్ని అందించింది. మైమోన్‌ రాయసం పేరుతో అస్సామ్‌ అంతటా ప్రసిద్ధురాలైన ఇందిర అస్సామీయులకు పెద్దక్క. వేర్పాటు వాద ఉద్యమాన్ని నడుపుతున్న ఉల్ఫా ఉద్యమకారులతో శాంతి చర్చలకు శ్రీకారం చుట్టిన సాహసి ఆమె.
తాను ఎంతో ప్రేమించిన భర్త మాధవన్‌ రాయసం అయ్యంగార్‌ కాశ్మీరులో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించినపుడు ఆమె కుప్పకూలిపోయింది. ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. అంత దు:ఖంలోంచి ఆమెను బయట పడవేసింది ఆమె రచనలే. ఆ రచనల నిండా పొంగేేది స్త్రీల దు:ఖమే. ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలో జరిగిన సిక్కుల దారుణ ఊచకోత నేపథ్యంగా వచ్చిన నవల చదివినపుడు అందులోని సంఘటనలు రోజుల తరబడి మనల్ని వెంటాడుతాయి. ఆమె స్వయంగా ఆ దుర్ఘటనలు జరిగిన ప్రాంతాలని సందర్శించి భర్తల్ని కోల్పోయి హృదయ విదారకంగా సామూహికంగా విలపిస్తున్న వందలాది స్త్రీలని కళ్ళారా చూసి చలించిపోయింది. ”నా జీవితంలో ఇంతమంది విధవలు ఒకేచోట సామూహికంగా ఏడ్వడం ఎప్పుడూ చూడలేదు. ఆ దృశ్యాలను చూడడం ఎంతో బాధాకరం” అంటుంది ఒక ఇంటర్వ్యూలో.
అన్నింటిని మించి భారతీయ సమకాలీన సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయే నవల ”నీల్‌కాంత్‌ బ్రజ”. తాను వైధవ్యం పొందిన తొలి రోజుల్లోనే తన దు:ఖాన్ని మోస్తూనే ఆమె ”బృందావనం” లో నివసించే భర్తృహీనుల దయనీయ స్థితిగతుల్ని అధ్యయనం చేయడానికి కొంతకాలం వారితో కలిసి బతికింది. ఉత్తరప్రదేశ్‌లో ఒక చిన్న గ్రామంలో ఒక విధవతో కలిసివుంటూ వారి స్థితిగతుల్ని అధ్యయనం చేసి, హిందూ సమాజం విధవల్ని ఎంత భయానకంగా, కిరాతకంగా దోచుకుంటుందో అణిచి వేస్తుందో వర్ణిస్తూ రాసిన పుస్తకం ”నీల్‌ కాంత్‌ బ్రజ”. ఇందిరా గోస్వామి రచనల నిండా అంతర్లీనంగా ప్రవహించేది ఈ దేశంలోని ఆడపిల్లల, ఆడవాళ్ళ దు:ఖం, వివక్ష, అణిచివేతలే. అస్సాం అంతటా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆమె ఆత్మ కథాత్మక కథనం ”ఆధాలేఖా దస్తావేజ్‌” (జుదీ తిదీతీరిదీరిరీనీలిఖి జుతిశిళిలీరిళివీజీబిచీనీగి) ని 1988లో రాసింది. భర్త హఠాన్మరణంతో తాను ఎలా మానసికంగా కుంగిపోయిందో, ప్రతి రాత్రి నిద్రమాత్రలు మింగినా నిద్రపట్టని స్థితి గురించి, అవే నిద్రమాత్రల్ని ఎక్కువ మోతాదులో మింగి రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిన విషాదం గురించి తన ఆత్మకథలో వివరంగా రాసింది. తన మన: శరీరాలను కుంగతీసిన డిప్రెషన్‌ నుంచి తనని బయట పడవేసింది తన సాహిత్య సృజనేనని, తన పోరాటం గురించి ఆత్మకథలో రికార్డు చేసిన ఇందిరా గోస్వామి జీవితం అస్సామీయులకు తెరిచిన పుస్తకమే. బహుళ ప్రచారం పొందిన ఒక జానపదకథలా ఇందిర జీవిత కథ అస్సామ్‌ ప్రజల మనసుల్లోకి ఇంకిపోయింది.
2004 సంవత్సరంలో గౌహతిలో ”ధేమాజి” అనే ప్రాంతంలో సంభవించిన పేలుళ్ళు, స్వాతంత్య్ర దినోత్సవాన ఒక పాఠశాల మీద ఉల్ఫా ఉద్యమకారులు బాంబుదాడులకు పాల్పడడం, ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఇందిరను కలిచివేసింది. ఆ దుర్ఘటనలో ఒలికిన రక్తం, జరిగిన మానవహక్కుల ఉల్లంఘనలు ఆమెలో తీవ్రమైన సంఘర్షణను రేపాయి. ఏర్పాటువాద ఉద్యమాలు అంతమవ్వాలని, దారితప్పిన అస్సామీ యువతను తిరిగి ప్రధాన స్రవంతిలోకి తేవాలని ఆమె చాలా తపనపడింది. వేర్పాటు వాదులకు, ప్రభుత్వానికి మధ్య చర్చల ప్రక్రియకు తెరతీసింది.  అదే సమయంలో 2007లో ఆమెకు తొలిసారి సెరిబ్రల్‌ హెమరేజ్‌ అయ్యింది. మెల్లగా కోలుకుని, తిరిగి తన రచనల మీదికి దృష్టి సారించింది. ఆమె చిట్టచివరి నవల రాసింది. ఈ నవల కథానాయకి, బ్రిటిష్‌ పాలనకి వ్యతిరేకంగా పోరాడిన ఒక బోడో మహిళ. 2007 లో వచ్చిన స్ట్రోక్‌ క్రమంగా ఆమె ఆరోగ్యం మీద ప్రభావం చూపింది. ఆమె ఎంతో ఉత్సాహంగా పబ్లిక్‌లైఫ్‌లో వుంటున్నప్పటికీ  ఆరోగ్యం క్షీణిస్తూవచ్చింది.  అంతిమశ్వాస వరకు ఆమె ఏం చెప్పినా అస్సాం ప్రజలు అత్యంత ప్రేమతో విన్నారు. ఆమె అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరినపుడు, గౌహతి మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌ జనప్రవాహమైంది. రాజకీయ నాయకులు, సాహిత్యకారులు, సామాన్య ప్రజలతో ఆ ప్రాంతం కిటకిటలాడి పోయింది. ఆమె కోసం దేశమంతా ప్రార్థనలు జరిగాయి. ఇంటర్‌నెట్‌లో మెసేజ్‌లు సర్క్యులేట్‌ అయ్యాయి. హాస్పిటల్‌ ఆవరణలో వేలాదిగా ఆవనూనె దీపాలను వెలిగించి, ఆమె పట్ల తమ ప్రేమను చాటుకున్నారు అస్సామీయులు.
బహుశా ఇంతటి ప్రజాదరణ పొందిన రచయిత్రి భారతీయ సాహిత్యంలోనే కాక ప్రపంచ సాహిత్యంలో కూడా చాలా అరుదుగా కనబడతారు. తామెంతో ప్రేమించిన తమ పెద్దక్క మరణం అస్సామీయులను ఎంతో వ్యథకు గురిచేసి వుంటుంది. 1942 నవంబరు నెలలో పుట్టిన ఇందిరా గోస్వామి మరణం కూడా నవంబరులోనే సంభవించింది. భూమిక కుటుంబం మొత్తం ఇందిరా గోస్వామికి హృదయ పూర్వక నివాళులు అర్పిస్తూ, ఆమె ఇంటర్వ్యూను పాఠకుల కోసం పున:ప్రచురిస్తున్నాం. కమలాదాస్‌ తర్వాత నాకు అత్యంత ఆత్మీయురాలు ఇందిరా గోస్వామి గురించి ఈ నాలుగు మాటలు రాయాలన్పించింది. ఆమె కీర్తి, ఆమె ముద్ర భారతీయ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతాయనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

4 comments:

Sandeep P said...

గోస్వామి గురించి చక్కని వ్యాసం వ్రాసారు. అదే చేత్తో wiki పుటను కూడా సవరిస్తే మరింత బాగుంటుందని మనవి.

వనజ తాతినేని/VanajaTatineni said...

గొప్ప రచయిత్రినే కాదు మానవీయ విలువలున్న మహా..మనీషిని .పరిచయం చేసినందుకు ధన్యవాదములు...ఆమె ఆత్మకి శాంతి కలిగించే పని ఈ దేశం లో నెరవేరే రోజు రావాలని కోరుకుందాం.

Lasya Ramakrishna said...
This comment has been removed by the author.
Lasya Ramakrishna said...

satyavathi garu mee blog chala bagundi. pls visit my blog and provide your suggestions...

serialmutchata.blogspot.com

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...