ప్రగతి రిసార్ట్స్ లో పరవళ్ళుతొక్కిన బాల్యం( రిలాక్షేషన్ వర్క్ షాప్ 2)


డియర్‌ ఫ్రెండ్స్‌,


హార్సీలీ హిల్స్‌లోనో, శ్రీశైలం అడవుల్లోనో మరో మూడు రోజుల ఉల్లాసపు వర్క్‌షాప్‌ నిర్వహించాలనుకున్నాను. మార్చి నెల మన ఉత్సాహాన్ని మింగేసింది. మీటింగుల మీద మీటింగులు. మీరంతా మహా బిజీ. ఏం చేద్దాం! మూడు నెలలుగా వేసిన నా ప్లానింగు నీళ్ళ పాలయ్యింది. ఆఖరికి అందరం ప్రగతి రిసార్ట్స్‌లో తేలాం. ఓ రాత్రి, ఓ పగలు హాయిగా, రిలాక్స్‌డ్‌గా గడపగలిగినా చాలు అనుకున్నాను. శుక్రవారం రాత్రి సరదాగా డాన్సులేసాం. పాటలు పాడాం. ''లాగూన్‌ విల్లా''లో మనమే వున్నాం. మనల్ని ఎవరూ డిస్టర్బ్‌ చెయ్యలేదు. మనిష్టమైనట్టు అల్లరి చేసాం.

ఉదయం ఐదన్నరకే నేను తయారై బయట కొచ్చేసాను. మీలో కొందరైనా అప్పటికే చెట్లతోనో, పుట్లతోనో కబుర్లాడుతుంటారని అనుకున్నాను. కానీ బయట ఎవ్వరూ లేరు. ప్రకృతి పచ్చగా, తాజాగా వెలిగిపోతోంది. తూర్పుదిక్కు నుండి ఉదయభానుడు వస్తున్నా, నీకు తోడుగా వస్తున్నానంటూ దర్శనమిచ్చాడు. ఒక్కదాన్ని, కాదు కాదు నాకు తోడుగా చెట్లు, పిట్టలు, బాతులు, నెమళ్ళు, సూర్యుడు. ఒక్కో మొక్కని పలకరిస్తూ, ఒక్కో పిట్టతో ముచ్చట్లాడుతూ ఆ ఉదయపు ఏకాంత ప్రశాంతతని వాటితో పంచుకుంటూ నేను పొందిన ఉల్లాసపు అనుభవం, ఆ అనుభవం ఇచ్చిన ఎనర్జీని నేను మాటల్లో చెప్పలేను. అక్షరాల్లోకి అనువదించలేను. మీరంతా ఇంతటి పాజిటివ్‌ ఎనర్జీనీ మిస్‌ అయ్యారని చాలాసార్లు అనుకున్నాను. మీ అందరికీ నా రిక్వెస్ట్‌ ఏమిటంటే మీరు ఎక్కడికెళ్ళినా, ఏ మీటింగుకెళ్ళినా, ఏ ప్రాంతానికెళ్ళినా, ఎంత పని వత్తిడిలో వున్నా ఇలాంటి ఉదయాలని, ప్రకృతితో ఏకాంతాన్ని కోల్పోకండి. అనుభవించి చూడండి. ఈ చెట్లు ఎపుడూ చూసేవే! ఈ పిట్టలు ఎక్కడా వుండేవే! ఈ సూర్యుడు రోజూ వచ్చేవాడే. కొత్తదనం ఏముంది అనుకోవద్దు. ప్రకృతి నిత్య చైతన్య స్రవంతి. ఆ వైవిధ్యం మన ఊహకు అందనిది. మనం వయస్సుని మర్చిపోయి, మన అస్థిత్వాన్ని మర్చిపోయి ప్రకృతిలో మమేకమైపోవాలి. చిన్న పిల్లల అమాయకత్వంతో ప్రతీదాన్ని సరికొత్తగా చూడ్డం నేర్చుకుంటే ప్రపంచం ఎప్పటికీ కొత్తగా మన ముందు ఆవిష్కృతమవుతుంది. అక్కడ అద్భుతమైన ఔషధమొక్కలున్నాయి. నేను ఇదంతా రాసి మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. ఇక ముందైనా ఇలాంటి ఉదయాలని బద్ధకంగా నాలుగు గోడల మధ్యనో, టివీ ముందో కూర్చుని వ్యర్ధపరుచుకోకుండా, హాయిగా, వినీలాకాశం కింద, ఉదయపు శీతగాలి మన శరీరాన్ని ప్రేమగా తాకుతుంటే ఆ ఏకాంతాన్ని గాఢంగా మీరంతా అనుభవించాలన్నదే నా కోరిక. అంతే!

మీ బాల్యం గురించి చెప్పండి అనగానే అందరి ముఖాల్లోను ఒక లాంటి వెలుగును నేను చూసాను. కష్టాలున్నా సుఖాలున్నా, దు:ఖం గూడు కట్టుకుని వున్నా సరే మన బాల్యాలను తడుముకుంటే గొప్ప సంతోషం కల్గుతుంది. బాల్య స్మృతులు కొన్ని కలవరపెట్టినా చాలావరకు మనకు సంతోషాన్నిస్తాయి. ఒక్కో ఘటనని తవ్వుకుంటూ పోతే మసిబొగ్గులుండొచ్చు, మాణిక్యాలూ వుండొచ్చు. ఆ జ్ఞాపకాలు మనసును ఉద్వేగంలో ముంచెత్తుతాయి. గుండె వాకిళ్ళు తెరుచుకుని అనుభవాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఉబికి, ఉరికి వస్తుంటాయి. ఆ వొరవడిని ఆపడం ఎవరి తరం. అందుకే మనం అపుడపుడూ చిన్న పిల్లలమైపోవాలి. మన బాల్యాలను వెతికి పట్టుకోవాలి. ఆ జ్ఞాపకాలలో తడిసిముద్దయి పోవాలి. అందుకే నేను మీ బాల్యం గురించి అడిగాను. మన పని వొత్తిళ్ళను తగ్గించగలిగిన దివ్యౌషధం మన బాల్యం. మీలో చాలామంది చాలా ఉద్వేకంగా మాట్లాడారు. నిరాశగా వున్నపుడు, బతుకు నిస్సారంగా అన్పించినపుడు బాల్యం తాలుకు ఉద్వేగ స్మృతులు మనకి కొత్త శక్తి నిస్తాయి. మన తొలి అడుగు ఎక్కడ పడింది, మలి అడుగు ఎటు మళ్ళింది. ప్రస్తుతం ఎక్కడున్నాం అనే ఎరుకను కల్గిస్తుంది. ఈ ఎరుకను కల్గివుండడం మనలాంటి వాళ్ళకు చాలా అవసరం.

మీ రిలాక్సేషన్‌ పాయింట్స్‌ గురించి చెప్పమన్నపుడు అందరూ రకరకాలుగా స్పందించారు. చేస్తున్న పనిలో రిలాక్స్‌ అవుతున్నామని చెప్పినవాళ్ళు నిజంగా రిలాక్స్‌ అవుతున్నట్టు కాదు. పనిలో మునిగిపోయి దాన్నే రిలాక్సేషన్‌ అనుకుంటున్నట్టు నాకు అనిపించింది. పని వేరు. సేద తీరటం వేరు అని నేననుకుంటాను. పనిని, వ్యక్తిగత జీవితాన్ని కలిపేసుకోకూడదని నేను భావిస్తాను. ఒక్కోసారి పనిని ఇంటికి మోసుకెళ్ళడం తప్పక పోవచ్చు. ఎపుడూ అదే జరిగితే జీవితం యాంత్రికమైపోతుంది. ఇల్లు, పని తప్ప మరోటి ఏదీ కనబడదు. పని చెయ్యాలనే ఉత్సాహం నాశనమైతుంది. పనిని, వ్యక్తిగత జీవితాన్ని విడగొట్టుకోవడం చాలా అవసరం. అలాగే మనం ఎక్కడ ఊరట పొందుతాం అనేది గుర్తించడం చాలా అవసరం. మనకి ఊరటని, రిలాక్సేషన్‌ని ఇచ్చే ప్రాంతాలని, వ్యక్తుల్ని మనమే గుర్తించాలి. ఆ ప్రాంతాల్ని, ఆ వ్యక్తుల్ని ప్రాణప్రదంగా చూసుకోవాలి.

మీకు తెలుసా?

*  నేను ఆకాశమల్లె పూలు ఎప్పుడు పూస్తాయా అని ఎదురు చూస్తుంటాను. ఆ ఎదురు చూడ్డంలో ఎంతో ఆనందం వుంటుంది. ఆ చెట్ల కింత కూర్చుంటే ఆయాచితంగా ఆనందాన్ని జలజలా రాలుస్తుంది ఆకాశమల్లె చెట్టు. ఒక్కో పువ్వు సువాసనలు వెదజల్లుతూ మన శరీరాన్ని తాకుతుంటే ఎంత బావుంటుందో ఒక్కసారి అనుభవించి చూడండి.

*  పొగడపూలు రాలడాన్ని మీరెపుడైనా చూసారా? గాఢమైన ఆ పూలవాసనని అనుభవించారా? ఆ పూలని ఏరడంలో ఎంత సంతోషముందో, వాటిని పుస్తకాల్లో పెట్టి ప్రెస్‌ చేసి మీ ప్రియమైన నేస్తానికి ఓ గ్రీటింగు కార్డ్‌ చేసి ఇచ్చారా ఎపుడైనా? ట్రై చేయండి ప్లీజ్‌.

*  నేను హడావుడిగా ఏదో మీటింగుకి వెళ్ళుతుంటాను. హఠాత్తుగా ఆకాశం నిండా మబ్బులు కమ్మి వర్షం మొదలౌతుంది. నెక్లెస్‌ రోడ్‌లోకి వచ్చేటప్పటికి వాన ఆగిపోతుంది. చిన్న తుంపర పడుతుంటుంది. ఒక వేపు తుంపర. మరో వేపు సూర్యకిరణాలు. ఇంకేముంది హుస్సేన్‌సాగర్‌ మీద ఏటవాలుగా పరుచుకున్న ఇంద్రధనస్సు. ఏడు రంగుల్లో వొంగిన అద్భుత దృశ్యం. నేను ఆ దృశ్యాన్ని గుండెల్లో ఇంకించుకున్నాకే మీటింగుకెళ్ళేది. గొప్ప ఆనందాన్ని ఓ అరగంట అనుభవిస్తే తప్పేంలేదని నేననుకుంటాను. మీటింగులకేముంది రోజూ అవుతూనే వుంటాయి. ఇంద్రధనస్సు రోజూ వస్తుందా? వచ్చినా మన కంట పడుతుందా?

ఎంత బిజీగా వున్నా, ఎన్ని పనుల్లో మునిగి తేెలుతున్నా మన ప్రియమైన నేస్తాలని మర్చిపోకూడదని నేను అనుకుంటాను. గాఢమైన స్నేహం గొప్ప రిలాక్సేషన్‌. మనల్ని మన బలాలు, బలహీనతలతో సహా స్వీకరించగలిగిన ప్రాణనేస్తాలు ఒకరిద్దరైనా వుండాలి. స్నేహం చెయ్యడం గొప్ప కాదు. దాన్ని నిలుపుకోవడం, ఎన్ని సంవత్సరాలైనా నిత్యనూతనంగా వుంచుకోగలగడం గొప్ప విషయమని నేను భావిస్తాను. మనం నవ్వినపుడు నవ్వేవాళ్లే కాదు, మనం ఏడ్చినపుడు తమ భుజాన్ని మనకి ఇవ్వగలిగినవాళ్ళే నిజమైన నేస్తాలు. మన దు:ఖ ఉధృతి ప్రియ నేస్తం కరస్వర్శతో తప్పక తగ్గుతుంది. ఇలాంటి స్నేహాన్ని మనం సంపాదించుకుంటే జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు మనల్నేమీ చెయ్యలేవని నేను నమ్ముతాను.

మన కుటుంబాలు, కుటుంబ సభ్యులు, సహచరులు, పిల్లలు వీళ్ళందించే తోడ్పాటుకు తోడు బయట నుండి కూడా మనకు పైవన్నీ కావాలి. మనం రోజూ ఎందరో బాధితులను కలుస్తుంటాం. వారి బాధల్ని, సమస్యల్ని వింటూ వుంటాం. ఒక్కోసారి వారి దు:ఖం మనల్ని విచలితుల్ని చేస్తుంది. ఒక ట్రాఫికింగు కేసులో ఓ చిన్న పిల్ల దు:ఖం భానుజను ఎంత కుదిపేసిందో నేను చాలా దగ్గరగా చూసాను. మీకూ ఇలాంటి అనుభవాలు ఎదురౌతుండొచ్చు. మేమూ హెల్ప్‌లైన్‌లో ప్రతి రోజూ దు:ఖ సముద్రాలని దాటుతూ వుంటాం. మన చుట్టూ , స్త్రీల జీవితాల చుట్టూ కష్టాలూ, కన్నీళ్ళు వున్నపుడు అవి తప్పకుండా మనల్ని తాకుతాయి. బాధిత స్త్రీల పక్షాన మనం పనిచెయ్యాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఆ బాధలు మనని తాకుతుంటాయి. తప్పదు.

మరి మన మానసిక వొత్తిళ్ళ మాటేమిటి? మన కన్నీళ్ళకి ఔట్‌లెట్‌ వుండాలి కదా! మన మనసులకి అపుడపుడూ ఉల్లాసం కావాలి కదా! అందుకే ఇలాంటి రిలాక్సేషన్‌ వర్క్‌షాప్‌లు చాలా అవసరం. మనం మొత్తం మొద్దుబారిపోకుండా వుండాలంటే మన లోపలికి మనం చూసుకోవడం చాలా అవసరం. మనం చేసే పని యాంత్రికంగా మారిపోకూడదంటే మనకి కొంత రిలీఫ్‌ అవసరం.

రిలీఫ్‌ ఎక్కడ దొరుకుతుంది? రిలాక్సేషన్‌ పాయింట్స్‌ ఎక్కడుంటాయి అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. నా వరకు ఏం చేస్తానో రెండు మూడు అంశాలు రాసాను. మీరేం చేస్తారో మీ ఇష్టం. మనందరం కలిసి ఒక సామూహిక శక్తిగా పనిచెయ్యాలి కాబట్టి మన మనో ప్రపంచాలను తప్పకుండా బలోపేతం చేసుకోవాలి.

మీతో గడపడం, మీకోసం వర్క్‌షాప్స్‌ నిర్వహించడం నాకు మంచి అనుభవాన్నిచ్చాయి. మీరందరూ సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఐక్యంగా వుండాలని కోరుకుంటూ...సత్యవతి

Comments

Jasmine said…
This comment has been removed by the author.

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

ఉప్పొంగే గంగ వెంబడి ఉరుకులెత్తిన ప్రయాణం