చేనేతకి చేయూత నిద్దాం


ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రోజు పీపుల్స్ ప్లాజా నుండి లుంబినీ పార్క్ వరకు చేనేత కోసం నడక కార్యక్రమం జరిగింది. నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను."ఈభూమి" లో నేను ఒరవడి పేరుతో కాలం రాస్తున్నను.ఆగస్ట్ నెల సంచిక లో వచ్చిన ఆ వ్యాసం మీ కోసం.

నేను ఇటీవల మా ఊరు సీతారామపురం వెళ్ళాను. నర్సాపురానికి దగ్గరగా ఒక పక్క గోదావరి, మరో పక్క సముద్రం చుట్టి వుండే మా ఊరు వెళ్ళడమంటే నాకెప్పుడూ సంబరమే. సంతోషంగా వెళ్ళిన నేను ఒక విషాద వార్తని వినాల్సివచ్చింది. ఆ వార్త నన్ను నా బాల్యంలోకి తీసుకెళ్ళిపోయింది. అది సూర్యనారాయణ మరణ వార్త. ఆయన వయసు మీద పడే చనిపోయాడు కానీ ఆయనతో వున్న ఒకానొక అనుబంధం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. చివరిదశలో దీనాతిదీనంగా, దుర్భర దారిద్య్రంతో వాళ్ళ కుటుంబం చితికిపోయిందని విన్నపుడు నాకు ఈ దేశంలోని కోట్లాది చేనేత కళాకారులు, చేనేత కార్మికులు గుర్తొచ్చారు.
సూర్యనారాయణ చేనేత కళాకారుడు. వాళ్ళ కుటుంబమంతా మగ్గం మీద పనిచేసేవాళ్ళు. మా కుటుంబం మహా పెద్దది. దాదాపు వందమంది సభ్యులున్న ఉమ్మడి కుటుంబం. మా తాత, మామ్మలకి తొమ్మిది మంది సంతానం. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు కలిసి మా ఇల్లొక సత్రంలాగా వుండేది. మా కుటుంబానికి కావలసిన బట్టల్లో అధిక భాగం సూర్యనారాయణ కుటుంబం చేతుల్లోంచే వచ్చేవి. చీరలు, లుంగీలు, తువ్వాళ్ళు చేతి రుమాళ్ళులాంటి రోజువారీ దుస్తుల్ని నేసి సూర్యనారాయణ తీసుకొచ్చేవాడు. మా నాన్న, పెదనాన్న, చిన్నాన్నలు ఆ రోజుల్లో పాంట్‌లు వేసుకోవడం నేను చూళ్ళేదు. సూర్యనారాయణ నేసుకొచ్చిన పంచెలు, లుంగీలు మాత్రమే కట్టుకునేవాళ్ళు. చొక్కాలు వేసుకోవడం చాలా తక్కువ. మానాన్న రైతు కాబట్టి పొలానికెళ్ళేపుడు ఏ రోజు చొక్కా వేసుకునేవాడు కాదు. మా అమ్మకి చేనేత చీరలంటే చాలా ఇష్టం. ఆవిడ రకరకాల ఊళ్ళ నుంచి చీరలు తెప్పించేది. బొబ్బిలి, మాధవరం, ఉప్పాడ, వెంకటగిరి - ఈ ఊళ్ళ పేర్లన్ని నేను చేనేత ద్వారానే చిన్నప్పుడే విన్నాను.
బహుశ మా అమ్మ నుంచే నాకు చేనేత చీరల వారసత్వం వచ్చి వుంటుంది. నేను చేనేత తప్ప వేరేదీ కట్టను. నాకు మంగళగిరి, పేటేరు, గుంటూరు, కొయ్యలగూడెం, నారాయణపేట, వెంకటగిరి చీరలంటే చాలా ఇష్టం. ఈ చీరలు కట్టుకుంటే వుంటే హాయిని వర్ణించాలంటే ఇక్కడ సాధ్యం కాదు సరే! మళ్ళీ సూర్యనారాయణ గురించి మాట్లాడాలి. ఆయన ముఖం ఎంతో అమాయకంగా, కోమలంగా వుండేది. బట్టల మూట సైకిల్‌కి కట్టుకుని తెచ్చి మా వీధి అరుగు మీద రంగు రంగుల చీరల్ని, తెల్లటి పంచెల్ని వెదజల్లేవాడు. మేము పిల్లల మూకంతా వాటి చుట్టూ చేరేవాళ్ళం. ఆడపిల్లల కోసం దళసరి, తక్కువ కౌంట్‌లో రంగు రంగుల బట్టముక్కల్ని తెచ్చేవాడు. మాకు వాటితో గౌన్లు కుట్టించేవాళ్ళు. మా కుటుంబానికి కావలసిన బట్టలన్నీ తీసుకుని అతనికావ్వాల్సిన డబ్బులు ఇచ్చేసేవాడు మా తాత. కొన్ని సార్లు అంతా ఇచ్చేవాడు కాదు. సూర్యనారాయణ మళ్ళీ వచ్చినపుడు మిగతాది ఇచ్చేసేవాడు. అలా సూర్యనారాయణతో మాకు ఒక అనుబంధం ఏర్పడిపోయింది. అతని దగ్గర చాలా మంది బట్టలు కొనేవాళ్ళు, నేసినవన్నీ అమ్ముడుపోవడంతో, మళ్ళీ నేయడం, అమ్మడం, ఇలా ఆ కుటుంబానికి కావలసిన పని పుష్కలంగా వుండేది. ఆదాయం కూడా అదే స్థాయిలో వుండేది.
క్రమంగా ఈ చేనేత సంబంధం తెగిపోవడం మొదలై చాలా కాలమే అయ్యింది. సిల్క్‌ బట్టలు వెల్లువెత్తి చేనేతను పక్కకు తోసేసాయి. సిల్క్‌ బట్ట మెయింటెనెన్స్‌ తేలిక కాబట్టి జనం వాటి వేపు మొగ్గడం మొదలైంది. స్వయం పోషకులుగా, తమ హస్తాల్లోంచి వస్త్రాలను రూపొందించే చేనేత కళాకారులు, కార్మికులు క్రమంగా పని కోల్పోవడం, నేసిన వాటిని అమ్ముకోలేక పోవడం, ఆదాయం తగ్గిపోవడం, ఆఖరికి ఆకలి చావులకు, ఆత్మహత్యలకు గురవ్వడం ఈనాటి నగ్నసత్యం. పరమ విషాదం. ప్రభుత్వం ఏదో చేస్తున్నానంటోంది. చేనేత సహకార సంఘాలకి రాజకీయ చీడపట్టి మొదలంటా కుళ్ళిపోయాయి. చేనేత పనివారు పీకలదాకా అప్పుల్లో కూరుకుపోయారు. వారికి ఆ పని తప్ప వేరేది రాదు. పని కల్పిస్తే కుటుంబం మొత్తం కష్టపడి పనిచేసుకుంటారు. అద్భుతమైన వస్త్రాలని అందిస్తారు. వారికి కావలసింది పని. వారు నేసింది అమ్ముడై ఆదాయం రావడం. అంతే పని చెయ్యకుండా పింఛన్‌లిమ్మని, విరాళాలు ఇమ్మని వారు కోరడం లేదు. మేం కష్టించి సృష్టిించే బట్టల్ని కొనండి. మాకు ఆదాయం వస్తుంది. మేం గౌరవ ప్రదంగా బతుకుతాం అనేదే వారి కోరిక.
సూర్యనారాయణ మరణవార్త నాలో రేసిన ఆలోచనలు ఇవి. ఆయనెంత ధైర్యంగా, నిబ్బరంగా వుండేవాడో గుర్తొచ్చి ఆ ధైర్యం వెనుక వున్న బలం ఏమిటో అర్ధమై నేను ఈ కాలమ్‌ ద్వారా ఒక విషయం చెప్పదలిచాను. మనం కూడా చేనేతని ప్రేమిద్దాం. చేనేత వస్త్రాలని కొందాం అనే నిర్ణయం చేసుకోవడంతో పాటు నాది మరో కోరిక వుంది.
మన రాష్ట్రంలో వేలాది ఆలయాలున్నాయి. ప్రతి రోజు లక్షలాది భక్తులు ఈ ఆలయాలను దర్శిస్తుంటారు. ఒక్క తిరుపతికి వచ్చే భక్తులే లక్షలలో వుంటారు. హుండీలో కోట్లాది రూపాయలు సమర్పించుకుంటూ వుంటారు. భక్తజనకోటికి నాదో విన్నపం. గుళ్ళకొచ్చే వాళ్ళంతా చేనేత వస్త్రాలను ధరించి వస్తే... ఊహించుకోవడానికే నాకు పరమానందంగా వుంది.మీ భక్తి రసానికి మానవీయ కోణాన్ని అద్ది చూడండి. కోట్లాది చేనేత పనివారలకి చేతినిండా పని. పనికి తగిన ఆదాయం, కేవలం తిరుపతికి వచ్చే భక్తులు ఒక్క రోజు చేనేత వస్త్రం కట్టి గుళ్ళో కెళ్ళండి. మీకు మానసిక తృప్తితో పాటు, మానవత్వం కూడా పరిమళిస్తుంది. చేనేత పరిశ్రమ మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లకపోతే నన్నడగండి. మా సూర్యనారాయణకి నేనిచ్చే నివాళి ఇదే. చేనేత జిందాబాద్‌.

Comments

మంచి పోస్టు. మంచి ప్రతిపాదన.

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం