రావు బాలసరస్వతి గారి 81 వ జన్మదిన వేడుకనిన్న అంటే 28 న ప్రముఖ లలిత,సినీ సంగీత గాయకురాలు రావు బాలసరస్వతి గారి 81 వ జన్మదిన వేడుకలు సికింద్రాబాద్ లోని తాజ్ త్రీ స్టార్ హోటల్ ల్లో ఉత్సాహంగా,సరదగా జరిగాయి. ఆమెకు ఆత్మీయులైన అతికొద్ది మందినే ఆవిడ ఆహ్వానించారు."నువ్వు రాకపోతే చూడు దొంగా" అంటూ నన్ను ప్రేమగా పిలిచారు.ఆవిడ పాటలంటే ప్రాణం కాబట్టి నేను సంతోషంగానే వెళ్ళేను.నా ఫ్రెండ్ గీత నాతో వచ్చింది. మూర్తి,విజయలక్ష్మి,చైత్ర వంటి గాయకులు వచ్చారు. సురేఖా మూర్తి బాలసరస్వతిగారు గానం చేసిన,అత్యంత ఆదరణ పొందిన "ఆ తొటలోనొకటి ఆరాధానాలయము ఆ ఆలయములోని అందగాడెవరే" పాటని అద్భుతంగా పాడారు.విజయలక్ష్మి దేవదాసు లోని పాటను పాడి వినిపించారు.చైత్ర "ఈ చల్లని రేయి తిరిగి రానేరాదు నీ చక్కని మోము చూడ తనివి తీరదు" పాటని చక్కగా పాడింది. ఆ తర్వాత బాలసరస్వతి గారు కేక్ కట్ చేసి మా అందరి బలవంతం మీద "రెల్లు పూల పానుపుపై జల్లు జల్లు గా ఎవరో చల్లినారమ్మా వెన్నెల చల్లినారమ్మా"పాటని ఆ హోటల్ హాల్లో వెన్నెల్ని కురిపిస్తూ,అత్యంత మాధుర్యంగా పాడారు. ఆ తర్వాత అందరం భోజనాలు చేసాం. 81 సంవత్సరాల వయస్సులో కూడా ఎంతో ఉత్సాహంగా,జోకులు పేలుస్తూ గల నవ్వే ఆమెని చూస్తే ఎంత సంతోషం వేస్తుందో. భూమిక కోసం ఆమెని ఇంటర్వ్యూ చేసినపుడు ఆమె చెప్పిన జోకులకి మా కడుపు చెక్కలయ్యింది.ఆమె ప్రత్యేకత ఏమిటంటే జోకు పేల్చినపుడు ఆమె నవ్వదు మనల్ని తెగ నవ్విస్తుంది. ఇటీవల నేను నందలూరు కధానిలయం వారి ఉత్తమ సంపాదక అవార్డును తిరుపతిలో తీ సుకున్నపుడు ఆ మీటింగ్ లో ప్రత్యక్షమై నాకు గొప్ప సంతోషాన్ని కలిగించారు. తన గానం ద్వారా అనిర్వచనీయమైన,అద్భుతమైన ఆనందాన్ని పంచే బాలసరస్వతిగారు నిండు నూరేళ్ళు హాయిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ....కొన్ని పోటోలు,వీడియో మీకోసం.

Comments

Really great. Belated wishes to Her!

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం