Friday, September 14, 2007

మానవీయ భాష నేటి అవసరం

ఆగష్టు ఆరవ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాలులో ‘’పాలపిట్ట పాట - ప్రత్యేక తెలంగాణా పోరాట పాటలు'’ వరవరరావు రాసిన పాటల సిడీల ఆవిష్కరణ సభ జరిగింది. మా భూమి సినిమాలో ‘’పల్లెటూరి పిల్లగాడా'’ పాటతో జనం నాలుకల మీద ఈనాటికీ నిలిచిన సంధ్య, విమల, రడం శ్రీను, పుష్ప, వెంకట్ల పాటలు వినడానికి ఎంతో ఉత్సాహంలో ఆ మీటింగుకు వెళ్ళడం జరిగింది. మీటింగు మొదలవ్వడానికి ముందు అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం.

నిజానికి ఎడిటోరియల్గా వస్తున్న ఈ కధనం రిపోర్ట్ల్లో రావలసింది. కానీ ఆనాటి ఆ సమావేశంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన వల్ల సంపాదకీయం రాయాల్సి వస్తోంది. అయితే ఇది ఒక ఉద్యమాన్ని కించపరచడానికో, వ్యక్తిగతంగా ఎవరినో దుమ్మెత్తి పోయడానికో రాస్తున్నది కాదు. అస్తిత్వ ఉద్యమాల పట్ల ఉద్యమంలో వున్న వారి నిబద్ధత పట్ల వున్న గౌరవానికి ఈ సంపాదకీయానికి ఏలాంటి సంబంధమూ లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పట్ల మాకెలాంటి వ్యతిరేకతా లేదు. ఇంతకు ముందు భూమిక తెలంగాణా పోరాట నేపధ్యంతో ‘’ ప్రత్యేక తెలంగాణ సంచికను'’ కూడా వెలువరించిన విషయం విస్మరించకూడదని మనవి.

అయితే ఆ రోజు సమావేశంలో జరిగిన సంఘటనని ఎత్తి చూపాల్సిన అవసరం చాలా వుంది. మీటింగు మొదలవ్వబోతోందని సూచిస్తూ తెలంగాణ వైశిష్ట్యం గురించి ఒక పాట పాడ్డం మొదలుపెట్టారు. పాట మంచి ఊపుగా, ఉద్విగ్నంగా సాగుతోంది. సభికులు పాటను ఆస్వాదిస్తున్నారు. నేనూ అదే మూడ్లో వున్నాను. హఠాత్తుగా, కర్ణకఠోరంగా వినబడిన పాటలోని ఒక వాక్యం నన్ను దిగ్భ్రమకి గురి చేసింది. నిలువెల్లా వొణికించింది. కోపంతో నో..నో..అని అరిచాను కూడా.
తెలంగాణ అపుడెలా వుండేది, ఇపుడెలా వుంది పోలుస్తూ సాగుతోన్న పాటలో
‘’నిండు ముత్తయిదువులా ఉండేదానివి
ముండ మోపి లెక్క నయ్యావే తెలంగాణ…'’

ఆ పాటని పాడుతున్న వాళ్ళల్లో ఇద్దరు స్త్రీలు కూడా వున్నారు. ఆ వాక్యాలని వాళ్ళెలా ఉచ్ఛరించగలిగేరా అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు గుండెల్లో ముల్లు గుచ్చుకున్నంత బాధేసింది. నేనింక అక్కడ ఒక క్షణం నిలవలేకపోయాను. చివరి దాకా సమావేశంలో వుండి పాటలన్నింటిని వినాలని కూర్చున్న నేను, ఆ ఒక్క పాట అవ్వగానే లేచి హాలు బయటకి వచ్చేసాను.పాట పాడిన వాళ్ళని పిలిచి పబ్లిక్ మీటింగులో ఆడవాళ్ళని అవమానిస్తున్న ఆ పాటని మీరెలా పాడగలిగేరు అని అడిగితే సరైన సమాధానం రాలేదు.

విప్లవోద్యమ నేపధ్యం, ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపధ్యం కలిగిన వ్యక్తులు వేదిక మీద, వేదిక కింద ఆసీనులై వున్న ఆనాటి సమావేశంలో స్త్రీలని ముత్తయిదువలని, ముండ మోపులని చీలుస్తూ, అవమానిస్తూ గొంతెత్తి పాడటాన్ని నేను ఈ రోజుకీ జీర్ణించుకోలేక పోతున్నాను. అభ్యుదయ వాదులూ, విప్లవ వాదులూ కూడా ఇంకా స్త్రీలను అవమాన పరిచే భాషను వదులుకోలేక పోతున్నారే అని చాలా బాధపడుతున్నాను. స్త్రీలను కించపరిచే భాషను భాషాశాస్త్రం నుంచి తొలగించాలని ఒక వైపు స్త్రీవాద ఉద్యమం డిమాండ్ చేసి కొంతవరకు మామూలు సాహిత్యకారుల్లో సైతం ఒక అవగాహనని కల్గించినా అభ్యుదయవాదులు, విప్లవ వాదులు దీన్ని వొదిలించుకోలేకపోవడం చాలా దు:ఖంగా అన్పిస్తోంది.

తెలుగు భాష నిండా స్త్రీలను కించపరిచే పదాలు - మానభంగం, అనుభవించడం, చెరచడం, ముండమోపి, ముత్తయిదువ, అయిదోతనం, శీలం, అబల, సౌభాగ్యవతి లాంటి పితృస్వామ్య సంస్కృతికి అద్దం పట్టే పదాలు కుప్పలు తెప్పలుగా వున్నాయి. ఇలాంటి దారుణ పద ప్రయోగాలను భాషా శాస్త్రం నుండి తొలగించడానికి ఒక భాషా సాంస్కృతిక విప్లవంలో పాలు పంచుకోవాల్సింది పోయి అభ్యుదయ వాదులు కూడా వివక్షాపూరిత భాషను యధేేచ్ఛగా ప్రయోగించడం అర్ధం చేసుకోలేకపోతున్నాను.

ఇప్పటికైనా స్త్రీలకు సంబంధించి ఒక గౌరవ ప్రదమైన మానవీయ భాషను, ప్రత్యామ్నాయ పద ప్రయోగాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని అభ్యుదయ వాదులతో సహా అందరూ ఆలోచించాలని, పెద్దు ఎత్తున చర్చను లేవనెత్తాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

1 comment:

రాధిక said...

చాలా దారుణం.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...