Thursday, May 2, 2013

మీడియా దృష్టిలో మహిళా సాధికారత అంటే….

ప్రతిరోజూ ఏదో ఒక చానెల్‌ నుండి పిలుపొస్తుంది. వస్తామని చెప్పగానే ఎక్కించుకు పోవడానికి వాహనమొస్తుంది. అతి మర్యాదగా తోడ్కొని తీసుకెళ్ళి స్టూడియోలో కూర్చోబెడతారు. లైట్లు వెలుగుతాయ్.
కెమెరాలు మర్యాదగా అటూ, ఇటూ కదులుతాయి. ఏంకర్‌ పక్కన కూర్చున్న వొక్కరమో, ఇద్దరమో మాట్లాడటం మొదలు పెడతాం. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మీద పేట్రేగిపోతున్న హింస గురించి యాంకర్‌ ప్రశ్నలు సంధించడం, దీనికి అతిధులు సమాధానాలు చెప్పడం, చర్చ ముగియడం. కొన్నిసార్లు ఉద్వేగంతో, కోపంతో మాట్లాడటం, నోరు నొప్పెట్టే వరకు సమస్యలు, నేరాలు, పరిష్కారాలు గురించి చర్చించడం మీడియాతో చాలా తరుచుగా జరిగే కార్యక్రమమిది.

దాదాపు అన్ని చానెళ్ళు స్త్రీల అంశాల మీద టాక్‌షోలు, చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూనే వున్నాయి. మాలాంటి వాళ్ళం వీటిల్లో పాల్గొంటూనే వున్నాం. ఒకానొక చానల్‌ వారి మహిళా కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైన అంశాలు గురించి, ముఖ్యంగా రాత్రివేళల్లో హైదరాబాదు స్త్రీలకు రక్షణ ప్రదేశమేనా, రాత్రిళ్ళు డ్యూటీలు ముగించుకుని, క్యాబ్‌లలో ఇళ్ళకు చేరే మహిళా సాప్ట్‌వేర్‌ ఉద్యోగులకు ఎంత భద్రత వుంది, లాంటి అంశాల మీద జండర్‌ సెన్సిటివిటీతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన ఈ చానెల్‌ సైతం ఎంత జండర్‌ బండతనంతో వ్యవహరించగలదో ఏప్రిల్‌ 11న జరిగిన సంఘటన రుజువు చేసింది. ఏప్రిల్‌ 11, రాత్రి 11 గంటల సమయంలో అసలు ఏం జరిగింది? నల్సార్‌ లా యూనివర్సిటీ విద్యార్ధులకి, తెలుగు ఎలక్ట్రానిక్‌ మీడియాకు మధ్య యుద్ధ వాతావరణం ఎందుకు ఏర్పడింది? ఆ రాత్రి ఏం జరిగిందో మీడియా ఇప్పటికే ప్రపంచానికి తనదైన శైలిలో చూపించింది.

నల్సార్‌ విద్యార్ధులు కొందరు వీడ్కోలు విందు చేసుకోవడానికి బంజారాహిల్స్‌లోని రైన్‌ క్లబ్‌కి వెళ్ళారు. పార్టీ అయిపోయిన పదిన్నర, పదకొండు గంటల మధ్య క్లబ్‌ బయటకొచ్చారు. పార్టీ జరుపుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కిష్టమైన దుస్తులు వేసుకున్నారు. అది క్లబ్‌ కాబట్టి డ్రింక్స్‌ తీసుకుని వుండొచ్చు కొంతమంది. క్లబ్‌ బయటకొచ్చిన అమ్మాయిల్ని ఫోకస్‌ చేస్తూ ఎవరో వీడియో తీయడంతో అసలు గొడవ మొదలైంది. తమని వీడియో తీయొద్దని అమ్మాయిలు వ్యతిరేకించారు. కానీ…. మీడియా వాళ్ళు హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చారో, క్లబ్‌ దగ్గర ఎందుకు మాటేసి వున్నారో, తెలియదు కానీ అమ్మాయిల్ని టార్గెట్‌ చేస్తూ వీడియో తియ్యడమే కాదు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నా వినకుండా కారు వరకు వేధిస్తూ వెళ్ళారు. ఆ విజువల్స్‌ అన్నీ టీవీల్లో ప్రసారమయ్యాయి.

ఈ న్యూస్‌ని ప్రజంట్‌ చేసిన న్యూస్‌ రీడర్లు, స్పాట్‌లో వుండి రిపోర్ట్‌ చేసిన రిపోర్టర్లు వాడిన భాష, భావజాలం తీవ్ర అభ్యంతరకరంగా వుంది. అమ్మాయిలు తాగి అర్ధరాత్రి రోడ్లమీద తందనాలాడుతున్నారని, మీడియా మీద దాడి చేసారని, భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారని, మహిళా సంఘాలు ఈ విషయం మీద మండి పడుతున్నాయని తమ నోటికొచ్చినట్లు వ్యాఖ్యానించారు. నిజానికి అమ్మాయిలు తాగి రోడ్లమీద గొడవ చెయ్యలేదు. తమ ప్రైవసీకి భంగం కలిగిస్తూ వీడియో తీసిన వ్యక్తిపై తమ ఆగ్రహం చూపించారు. ఆ విజవల్స్‌ను తొలగించమని గొడవ పడ్డారు. అక్కడ జరిగింది అంతే. అయితే ఆ మర్నాడు తెలుగు ఛానళ్ళు ఆ వార్తని సెన్సేషనలైజ్‌ చేస్తూ చూపిన దృశ్యాలు, వాడిన భాష, ఆ సంఘటనకు మహిళల వస్త్రధారణ, నైతికత లాంటి అంశాలను జోడించిన తీరు పరమ అమాననీయంగా వుంది. మీడియా రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతోంది.

మిడ్‌నైట్‌ మసాలాలు, క్రైమ్‌ స్టోరీలంటూ సినిమాల్లోని అసభ్య దృశ్యాలను నిరంతరం… ఆఖరికి వార్తల్లో సైతం విచ్చలవిడిగా చూపించే ఎలక్ట్రానిక్‌ మీడియా, పార్టీ చేసుకుంటున్న అమ్మాయిలు ధరించిన దుస్తులపైనే ఎందుకు తమ కెమారాలను కేంద్రీకరించాల్సి వచ్చింది? అమ్మాయిలు ఇలా వుండాలి? అలా వుండాలి. అమ్మో! అమ్మాయిలు కూడా ఇలా చేస్తే ఎలా అని గుండెలు బాదుకోవడం ఎందుకు? తమకిష్టమైన దుస్తులు ధరించడం, తమ అభిరుచులకనుగుణంగా జీవించడం ప్రతి ఒక్కరి ప్రాధమిక హక్కు. పోట్టి నిక్కర్లేసుకుని, ఒక్కోసారి వొంటి మీద వస్త్రాలు లేకుండా రోడ్లమీద తాగి పోర్లుతూ పబ్లిక్‌ న్యూసెన్స్‌కి పాల్పడే మగవాళ్ళని మీరు వీడియో తియ్యరెందుకు? 11వ తేదీన జరిగింది పబ్లిక్‌ న్యూసెన్స్‌ కాబట్టి మేము బాధ్యతగా రిపోర్ట్‌ చేసామని ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్ట్‌ల అసోసియేషన్‌ చెబుతోంది. అదే నిజమైతే మగవాళ్ళ పబ్లిక్‌ న్యూసెన్స్‌ని కూడా చూపించాలిగా. ఈ మొత్తం ఎపిసోడ్‌ని విశ్లేషించినపుడు అర్ధమయ్యే విషయం ఒక్కటే. మహిళల పబ్లిక్‌ స్పేస్‌ని కుదించేయాలనుకోవడం, బార్లు, పబ్‌లు, క్లబ్‌లు మగవాళ్ళ సామ్రాజ్యాలు, అక్కడ వాళ్ళ ఏమైనా చెయ్యెచ్చు. అమ్మాయిలు మాత్రం ఆ రాజ్యాల్లో అడుగు పెట్టరాదు. పెట్టారా…. ఇదిగో ఇలాగే యాగీ చేస్తాం. మేం ఏం చేసినా మీరు ప్రశ్నించరాదు. ప్రశ్నిస్తే.. దాన్ని ఎలాంటి మలుపులు తిప్పాలో మాకు తెలుసు. ‘నైతికత’ చట్రంలో ఇరికించి మిమ్మల్ని ఎలా బదనామ్‌ చెయ్యాలో మాకు తెలుసు… అన్నట్లుగా వుంది మీడియా ధోరణి. ఇది చాలా విషాదకరమైన, విధ్వంశకరమైన ధోరణి. మహిళల అభివృద్ధి కోసం, సాధికారత కోసమంటూ మీరు చేస్తున్న కార్యక్రమాల డొల్లతనాన్ని ఏప్రిల్‌ 11 ఉదంతం బట్టబయలు చేసింది. మీ దృష్టిలో మహిళా సాధికారత అంటే ఏమిటో శెలవిస్తే.. తెలుసుకుని తరిస్తాం. మహిళల వస్త్రధారణ గురించి చెబుతున్న సుద్దులు, నీతి సూక్తిముక్త్తావళులు ఎంత తొందరగా విరమించుకుంటే అంత మంచిది. సినిమాల్లోని మహిళల అరకొర వస్త్రధారణని హైలైట్‌ చేస్తూ టీఆర్‌పిని పెంచుకునే ఎలక్ట్రానిక్‌ మీడియాకి ‘నైతికత’ మీద మాట్లాడి, వ్యాఖ్యానించే హక్కుందో లేదో ఒకసారి పునరాలోచించుకుంటే అందరికీ మంచిది. అలాగే స్త్రీల అంశాల పట్ల తమ పాలసీ ఏమిటో కూడా మీడియా చెప్పాల్సివుంది.

6 comments:

Anonymous said...

meeru cheppandi mahila saardhikata ante yemito ? TV studio laku velli migata vallanu(magavaarini) badnam chesinappudu media goppadi..? ade media mimmalanu prashninchinappudu meeku media meeda kopam vastundi..
magavaadu taagi road meeda padipoinappudu kuda media choopinchali annaru kada.. ala choopinchina tarvatha media vallu aadavaarini chopiste meeru OK antara.. adi manchi pani avutunda ?

జలతారు వెన్నెల said...

నాకు ఈ సంఘటన గురించి తెలీదు, మీ పోస్ట్ చదివి తెలుసుకున్నాను.చాలా బాగా అడిగారు "మీడియా దృష్టిలో మహిళా సాధికారత అంటే…. " ఏంటి అంటూ...
ఒక మహిళ కి అత్యాచారం జరిగిందన్నా, మహిళలను చిన్న చూపు చూస్తున్నారన్నా...ముందుగా "మహిళల వస్త్రధారణ" గురించి discussions పెట్టేస్తున్నారు. చాలా అన్యాయం గా మాట్లాడుతున్నారు అందరు అనిపిస్తూ ఉంటుంది ఇలా ఎవరైనా అంటే!

చంద్ర said...

well said, thank you

santha sundari.r said...

Very good article.Double standards and irresponsible comments have become the norm of the day.To fight against something, we first need to be supportive to the victim and not to find excuses for the culprits.It is high time some action is initiated to punish the criminals,and not find fault with the victim.

Anonymous said...

mee ardharam leni pidivadana.asalu adavallu battalu lekunda kooda tiragavochhu.valla taalitandrula permission vuntee.

Anonymous said...

Meeru cheppedi chusthunte taagi tandanalu veyadam samardinchinattundi. Magavallaina, Adavallaina Taagi Tandanalu veyyadam Tappe. Private life publicni ibbamdi pettakudado. Jaragakudanidi jarigithe yevariki nastam. Mahila saadhikaratanu gurunchi aalochinchi atyacharalu cheyyaru kadha!. Meeru Alochinchandi. Mee Ammai aithe encourage chesevara! Ippudu cheppandi. Saadhikarata ante Pub Cultura?

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...