Monday, October 15, 2012

స్త్రీవాదం – స్త్రీల సాహిత్య అవగాహన

రెండు దశాబ్దాల (1990-2010) తెలుగు రచయిత్రుల సాహిత్యం గమనం-గమ్యం కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం లో (27,28,29 జనవరి, 2012)  సమర్పించిన అవగాహనా పత్రం
వందేళ్ళ తెలుగు సాహిత్యాన్ని తీసుకుని అప్పటి నుండి తెలుగు సాహిత్యం గమనాన్ని పరికిస్త్తే- నూటపది సంవత్సరాలకు పూర్వమే ఒక స్త్రీ తెలుగు సాహిత్యంలో పలుప్రక్రియలకు ఆద్యురాలుగా నిలిచింది. తెలుగులో తొలికథ రాసి, తొలిసారి స్త్రీల చరిత్రను గ్రంథస్థం చేసి, మొట్టమొదటిసారి స్త్రీల సంఘాలను/సమాజాలను స్థాపించిన భండారు అచ్చమాంబను ఈ సందర్భంగా మనం తప్పకుండా గుర్తుచేసుకోవాలి. స్త్రీ విద్య కోసం అహరహం కృషి చేసిన అచ్చమాంబను గురించి 2003 లో నేను ఇదే వేదిక మీద నుంచి తెలుగులో తొలి కథ రాసింది భండారు అచ్చమాంబ అని సగర్వంగా ప్రకటించడం- ఆ తర్వాత దానిపైన తీవ్ర స్థాయిలో చర్చ జరగడం- ఇప్పటికీ వందేళ్ళ తెలుగు కథ అంటున్నారు గానీ నూట పదేళ్ళ తెలుగు కథ అనడానికి చాలా మందికి మనస్కరించకపోవడం మనం చూస్తున్నాం. ఎవరి మనస్సు ఒప్పుకున్నా, ఎవరి మనస్సు నొచ్చుకున్నా చరిత్ర-చరిత్రే- దానిని వక్రీకరించడం ఇంక ఎంత మాత్రమూ కుదరదు. మహాకవి గురజాడ ఆశించినట్లు మనం చరిత్రను తిరగరాయడం మొదలు పెట్టాం. మనకు తెలియని మన చరిత్రని, మనకు తెలియకుండా ముసుగేసి దాచేసిన చరిత్రని మనం తవ్వడం మొదలు పెట్టాం. స్త్రీవాద దృష్టికోణంతో మనం తవ్వుతుంటే, మటగడ్డలుగానో, మసి బొగ్గులుగానో పక్కన పారేసిన వజ్రపు తునకల్లాంటి అచ్చమాంబ లాంటి అద్భుతమైన స్త్రీలు వెలుగులోకి వస్తున్నారు. పురుషాధిపత్య రంగుటద్దాల్లోంచి తూకం వేసి ఛీత్కరించిన బెంగుళూరు నాగరత్నమ్మ లాంటి వారి జీవిత చరిత్రలు ప్రచురితమయ్యాయి. ఇలా మొదలైన సాహిత్య గమనం 80 లలో ఒక వెల్లువల్లే పోటెత్తింది. డెబ్బె దశకంలో అంతర్జాతీయంగా విస్తృతస్థాయిలో మొదలైన స్త్రీల ఉద్యమం భారతదేశంలోను ప్రవేశించి, 1975ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించబడింది. స్త్రీల అంశాలెన్నో ప్రధాన స్రవంతి చర్చల్లో భాగమయ్యాయి. ఈ పరిణామాలు అనివార్యంగా తెలుగుసాహిత్యాన్ని, తద్వారా తెలుగు సమాజాన్ని ఒక ఉప్పెనలాగా తాకాయని చెప్పుకోవచ్చు. తెలుగు సాహిత్య చరిత్ర మొత్తంలోను ఏ దశాబ్దంలోను కనబడనంత మంది స్త్రీలు స్త్రీవాద స్పూర్తితో, స్త్రీల ఉద్యమాల ప్రేరణతో పెద్ద ఎత్తున సాహిత్యంలోకి దూసుకొచ్చారు. ఉద్వేగాలు అతి తీవ్ర స్థాయిలో వున్నపుడు ఆ ఉద్రేకం కవిత్వంలోనే గాఢంగా ఆవిష్కృతమౌతుందని నిరూపిస్తూ వందల సంఖ్యలో స్త్రీలు కవిత్వం రాయడం మొదలు పెట్టారు. ఆ కవిత్వమంతా నీలి మేఘాలుగా, గురిచూసి పాడేపాటగా ప్రచురణ రూపం దాల్చింది. వందలాదిగా కవిత్వం సంకలనాలు వెలువడ్డాయి.
‘బందిపోట్లు’ కవితతో సావిత్రి తెలుగు సాహిత్యాన్ని ఒక కుదుపు కుదిపింది. ‘పైటను తగలెయ్యాలంటూ’ జయప్రభ స్త్రీవాద కవిత్వాన్ని పతాకస్థాయికి తీసుకెళ్ళింది. అప్పటివరకు సాహిత్యంలో అంటరాని వస్తువులుగా వుండి, పురుషుల కంటికి ఆనని అన్ని వస్తువులనూ తీసుకుని స్త్రీలు కవితలల్లారు. తెలుగు సాహితీ ప్రపంచం విస్తుపోయేలా, విభ్రమకు గురయ్యేలాంటి, బాణం వలలుకంత సూటిగా తగిలే కవితలు వెల్లువెత్తాయి.


కొండేపూడి నిర్మల, పాటిబండ్ల రజని, ఘంటశాల నిర్మల, మందరపు హైమావతి, శిలాలోలిత, విమల, మహెజబీన్‌, జయప్రభ, షాజహాన్‌ లాంటి ఎందరో కవయిత్రులు అద్భుతమైన స్త్రీవాద కవితలు రాసారు. ఇంటి చాకిరీ గురించి, మాతృత్వం గురించి, పెళ్ళి గురించి, భార్యాభర్తల సంబంధంలోని అసమానత గురించి కుటుంబ సంబంధంలోని అసమానత గురించి కుటంబాల్లోని సవాలక్ష వివక్షల గురించి అనన్య సామాన్యమైన కవితలొచ్చాయి.
ముఖ్యంగా కొండేపూడి నిర్మల మాతృత్వ వేదన గురించి ”రైలు పట్టాల మీద నాణెం విస్తరించినంత వేదన’ గా చెప్పడం, విమల వంటిళ్ళలోని చాకిరీ గురించి రాయడం, ఏ కాల్‌ గాళ్స్‌ మోనోలాగ్‌్‌గా వ్యభిచారం కూపంలోని స్త్రీ ఆత్మఘోషని ఘంటశాల నిర్మల అద్భుతంగా ఆవిష్కరించడం కొన్ని ఉదాహరణలు మాత్రమే.
స్త్రీ అంటే శరీరంగా మాత్రమే చూసే పితృస్వామ్య సంస్కృతిని ధిక్కరిస్తూ, తిరుగుబాటు బావుటా నెగరేస్తూ ఎనభయ్యవ దశకంలో స్త్రీవాద కవయిత్రులు స్త్రీలను అణిచివుంచే, అధికారం చలాయించే పురుషాధిక్య భావజాలాన్ని తిరస్కరిస్తూ గొప్ప కవిత్వం రాసారు. ఇంకా రాస్తూనే వున్నారు. ఒక దశలో వరద గోదారిలా తెలుగు సాహిత్యాన్ని ముంచెత్తిన స్త్రీవాద కవిత్వం ఉధృతి తగ్గి, కుదురుకుని నిదానంగా నలుదిక్కులా పారుతూ కథల్లోకి, నవలల్లోకి, వ్యాసాల్లోకి ప్రవహించింది. స్త్రీవాదం అన్ని సాహిత్య ప్రక్రియల్లోకి విస్తరించింది.
ఏ ఉద్యమమైనా ఉధృతంగానే మొదలౌతుంది. ఆ ఒరవడిలో చెత్త్తంతా కడిగేస్తుంది. ఉధృతి తగ్గినపుడు కూడా తన ఉనికిని కోల్పోకుండా నిదానంగా ప్రవహిస్తూనే వుంటుంది. స్త్రీవాదం కూడా దీనికి మినహాయింపు కాదు. ఎనభైలలో కవిత్వరూపంలో ఉరకలెత్తిన స్త్రీవాదం తొంభైల నాటికి కథలోకి ప్రవహించింది.

1990 దశకం నాటికి తెలుగు సమాజంలో అనేక మార్పులు సంభవించాయి. ఎనభైలలో పితృస్వామ్యాన్ని, పురుషాధిపత్యాన్ని సవాల్‌ చేస్తూ వచ్చిన కవిత్వం వచ్చేనాటికి, తొంభైలలోని నూతన సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణల నేపథ్యం లేదు. స్త్రీల శరీరాల చుట్టూ, అణిచివేతల చుట్టూ, ఆడపిల్లలుగా పుట్టి స్త్రీలుగా తయారుచేయబడే క్రమం చుట్టూ, కుటుంబాల్లోని అసమ సంబంధాల చుట్టూ కుటుంబహింస చుట్టూ అల్లుకున్న కవిత్వం ఎనభైలలో వస్తే…. తొంభైల నాటికి ఈ పరిస్థితి మొత్తం మారిపోయింది. మారిపోవడమంటే స్త్రీల సమస్యలన్నీ తీరిపోయాయని అర్థం కాదు. వీటికి తోడు మరిన్ని సమస్యలు ప్రపంచీకరణ పేరుతో మనల్ని చుట్టుముట్టాయి. కుటుంబ హింసకి తోడు, బహిరంగ హింస, పనిచేసే చోట హింస, చదువుకుని సంపాదిస్తూ కూడా తప్పని ఇంటిపని, వంటపని, పిల్లల పని స్త్రీలను పీల్చివేస్తున్న దుర్భర పరిస్థితులు తయారయ్యాయి.

అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంశం, వ్యవసాయ విధ్వంశం, కుదేలైన చేనేత రంగం, చేతి వృత్తుల సర్వనాశనంతో పల్లెలు వదిలి పట్టణాల దారి పడుతూ విపరీతమైన హింసకు గురౌతున్న గ్రామీణ జనాభా. ‘అభివృద్ధి’ ముసుగేసుకున్న బడా ప్రాజెక్టులు, ఎస్‌ఈజెడ్‌లు, కోస్టల్‌ కారిడార్‌ పేరుతో మత్స్యకారుల్ని, మత్స్య సంపదను ధ్వంశం చేస్తున్న వైనాలు తొంభైల నుండి 2010 వరకు నడుస్తున్న విధ్వంశ రూపాలు.
తెలుగు సమాజంపై పెనుసవాల్‌ విసిరిన ప్రపంచీకరణ విధ్వంశాన్ని రచయిత్రులు కథలుగా మలచడంలో సఫలమయ్యారు. గ్లోబలైజేషన్‌ నేపథ్యంతో అనేక వందల కథలు తెలుగులో వెలువడ్డాయి. పి. సత్యవతి, కుప్పిలి పద్మ, నల్లూరి రుక్మిణి, ఓల్గా, కొండవీటి సత్యవతి, వి. ప్రతిమ, పాటిబండ్ల రజని, చంద్రలత, కె. వరలక్ష్మి, ఎస్‌. జయ, మల్లీశ్వరి లాంటి కథకులు ఎన్నో అద్భుతమైన కథలు రాసారు. వీరిలో కొందరి సాహిత్యం గురించి ఇదే సమావేశంలో పత్ర సమర్పణలున్నాయి కాబట్టి నేను లోతుల్లోకి పోవడం లేదు.
1990-2010 మధ్య కాలంలో వచ్చిన పెనుమార్పు మానవ సంబంధాల విధ్వంశం. ఐటి రంగానికిచ్చిన అధిక ప్రాధాన్యత వల్ల సామాజిక శాస్త్రాలు వెనుకబడి, చరిత్రపట్ల, సమాజం పట్ల, తోటి మనిషి పట్ల బాధ్యత లేనితనం పెరిగి మనిషి అంతరంగంలో ఏకాకిగా మారిపోయాడు. మనసు నిండా కమ్ముకున్న డొల్లతనాన్ని నింపుకోవడానికి వస్తు సముదాయంమీద పడేలా పెద్ద పెద్ద మాల్స్‌ విజృంభణతో వస్తు వినిమయ సంస్కృతి పెరగడం అనేది చివరికి స్త్రీలమీద హింసగా పరిణమించి, వస్తువుల కోసం స్త్రీలను హింసించడం ఎక్కువైంది. కట్నాలకు తోడు నానా రకాల వస్తువులు కావాలనే గొంతెమ్మ కోర్కెలు పెరిగిపోయాయి. 
ఈ పరిణామాలన్నీ స్త్రీల కథల్లో వస్తువులయ్యాయి. ఓల్గా, సత్యవతి, కుప్పిలిపద్మలాంటి వాళ్ళు వీటి మీద చక్కటి కథలు రాసారు. ఎంతో మంది స్త్రీలు వీటిని వస్తువులుగా స్వీకరించి కథలు రాస్తున్నారు. ప్రపంచీకరణ ప్రభావాన్ని, అది కలిగిస్తున్న భ్రమల్ని, వేస్తున్న జిలుగు ముసుగుల్ని చించిపారేయాల్సిన అవసరం, అది సృష్టిస్తున్న విధ్వంశాన్ని, అసమానతల్ని చాలా తెలివిగా ధనవంతుల్ని సూపర్‌ ధనవంతులుగా, పేదల్ని మరింత పేదలుగా, స్త్రీలని మరింత అణిచివేతలకు గురి చేస్తున్న వైనాలను మరింత లోతుగా సాహిత్యంలోకి ముఖ్యంగా నవలా రూపంలోకి రావాల్సిన అవసరం చాలా వుంది. ఈ మూడు దశాబ్దాలలో జరిగిన పరిణామాలను వస్తువులుగా స్వీకరిస్తూ పెద్ద కాన్వాసుతో నవలలు రావాల్సి వుంది. నిజానికి ఈరోజు రాస్తున్న రచయిత్రులకు/రచయితలకు వస్తువుల లోటు లేదు. ఎన్నో అంశాలు ఎంతో తీవ్రతతో మనముందున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతూ వారసత్వంగా వస్తున్న తీవ్ర సమస్యలూ మనముందున్నాయి. ఇదిగో ఈ సమస్య పరిష్కారమైంది. దీనిగురించి మనం రాయక్కరలేదు అనేలా ఏదీ లేదు.

భారతీయ సమాజం ప్రత్యేకత ఏమిటంటే అది దేనినీ తెగ్గొట్టుకోదు. ఆటవిక సమాజంలోని ఆచారాలు మధ్యయుగంలోకి, మధ్యయుగాల నాటి అవకతవకల్ని ఆధునిక సమాజంలోకి చాలా తేలికగా మోసుకొచ్చేస్తాం. రాముణ్ణి దేవుడిగా కొలుస్తూనే, ఏకపత్నీ వ్రతుడని పొగుడుతూనే బహుభార్యాత్వాన్ని హాయిగా కొనసాగిస్తాం. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కన్నీళ్ళకి కరిగి నీరౌతూనే మన కూతుళ్ళకి మాత్రం బాల్యవివాహమే చేస్తాం. స్త్రీలు చదువుకోవాలి అంటూ వేదికలెక్కి కేకవేసి మన ఆడపిల్లని మాత్రం ఇంట్లోనే కూర్చోబెడతాం. దేవతల్ని తలకెత్తుకుని, తిలకాలు దిద్దుకుని కొలుస్తాం గానీ కన్నతల్లిని, కట్టుకున్న భార్యని నానా హింసలూ పెడతాం. మాతృమూర్తి అంటూనే నిండు గర్భిణిని సైతం కడుపు మీద తన్నే సంస్కృతి మనది. భారతీయ సంస్కృతి, స్త్రీలని హింసించే సంస్కృతి దీనిలో భాగమే. స్త్రీల కట్టు, బొట్టు, నడక, నడత, మాట, ఆలోచన, ఆచరణ, అంతరంగం అన్నింటినీ నియంత్రించే, అదుపుచేసే పితృస్వామ్య సంస్కృతి, భారతీయ సంస్కృతిలో మిళితమై పోయివుంది. దీనిని విడదీసి చూడాల్సిన అవసరం చాలావుంది. లేకపోతే మనం కూడా అతివాద మతోన్మాద సంస్కృతికి బలైపోయే ప్రమాదం వుంది. ఇప్పటికే మన మాటమీద, ఆలోచనమీద, రచనమీద, వేషధారణమీద విపరీతమైన పోలీసింగ్‌ వుంది. మంగుళూరు పబ్‌లో జరిగిన దాడులు, మీరానాయర్‌ వాటర్‌ సినిమా షూటింగ్‌ సందర్భంగా జరిగిన గొడవలు – ఎన్నెన్నో ఉదాహరణలు మన ముందున్నాయి. మన కలాలకు కళ్ళెం వేసే సంస్కృతి పెరిగిపోయింది. తస్మాత్‌ జాగ్రత్త…

ఈ రోజు మనముందున్న పెనుసవాళ్ళు రెండు. ఒకటి ప్రపంచీకరణ పురికొల్పుతున్న అభివృద్ధి నమూనా, రెండోది అతివాద మతోన్మాధ ధోరణి. మొదటిది మొత్తం పేద ప్రజలని పిజ్జాలుగా, బర్గర్లుగా వార్చుకుని మింగేయడం, అభివృద్ధి పేరిట కడతాయని భ్రమింపచేసే ప్రాజెక్టులు, స్పెషల్‌ ఎకనామిక్‌ జోనులు కుమ్మరిస్తున్న కనకరాసులలో హఠాత్తుగా ధనవంతులౌతున్న వాళ్ళు ప్రదర్శిస్తున్న వల్గారిటీ ఆఫ్‌ వెల్త్‌ – పోగుపడుతున్న సంపద వికృత రూపం. (-దుబాయ్‌ లాంటి ప్రాంతాలు) మరో పక్క పేద ప్రజల్ని ఆత్మగౌరవం లేనివాళ్ళుగా తయారుచేస్తూ కుప్పలు తెప్పలుగా వస్తున్న ప్రభుత్వ పథకాలు. వీటన్నింటిని విశ్లేషణాత్మకంగా రచనల్లోకి జొప్పించాల్సిన అవసరం చాలా వుంది.

రెండోది అతివాద మతోన్మాదం- అది ఏ మతమైనా కానీయండి దీనిని అడ్డుకోకపోతే దాని కొరడా మొదటగా తాకేది స్త్రీలనే. స్త్రీలు చదువుకోవాలా వద్దా? ఉద్యోగాలు చెయ్యాలా వద్దా? బయట తిరగాలా? వద్దా? ఎలాంటి బట్ట తీసుకోవాలి? ఎలా మాట్లాడాలి? ఏం రాయాలి ఏం రాయకూడదు? ఏ బొమ్మ గియ్యాలి? ఏ బొమ్మ గీయకూడదు? ఎంతమంది పిల్లల్ని కనాలి? – వీటన్నింటి మీద తీర్పులు చెప్పడానికి ఫర్మానాలు జారీ చేయడానికి తయారయ్యే అతివాద మతోన్మాద ప్రమాదాన్ని మనం తప్పనిసరిగా, జాగురూకతతో అర్థం చేసుకోవాలి. దానికుతంత్రాలను, తీర్మానాలను ఎదుర్కొనే ఆయుధాలను మనం సిద్ధం చేసుకోవాలి. ఆ దిశగా రచనలు రావాలి.
చివరగా, స్త్రీవాదం పనైపోయింది. నీరస పడిపోయింది అనే విమర్శకు సమాధానం చెప్పి నేను ముగిస్తాను. ఇది వివక్షతో, అక్కసుతో చేసే విమర్శగానే మనం కొట్టిపారేయాలి. నిజానికి తెలుగు నాట ప్రజాస్వామిక పోరాటాలకు అనువైన వాతావరణాన్ని, అస్తిత్వ ఉద్యమాలకు సరైన బాటలేసింది స్త్రీవాదమే. స్త్రీవాదం లోంచి దళితవాదం, మైనారిటీ వాదం, బహుజనుల వాదం బలంగా ముందుకొచ్చాయి. స్త్రీలు స్త్రీవాద దృష్టికోణంతో, మైనారిటీలు తమదైన గొంతుకతో, బహుజనులు తమ తమ ప్రత్యేక కోణాలతో అద్భుతమైన రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. తెలుగు సాహిత్యం మీద బలమైన ముద్రవేసిన స్త్రీవాదం సాహిత్యంతోనే ఆగిపోయిందనుకోవడం వెర్రితనమే అవుతుంది. స్త్రీవాదం చదువులో పాఠమైంది. పాలనలో చట్టమైంది. అంతర్జాతీయ వొప్పందాల వల్లనేమి, భారతదేశంలో ఎగిసిపడిన స్త్రీల ఉద్యమాల వల్లనేమి స్త్రీవాద రచనల ప్రభావం వల్లనేమి ప్రభుత్వ భాష మారింది. స్త్రీల సహాయం కోసం ఎన్నో సపోర్ట్‌ సిస్టమ్స్‌ ఏర్పడ్డాయి. మహిళా కమీషన్‌, మహిళా కోర్టులు, మహిళా పోలీస్‌ స్టేషన్లు – ఇలా ఎన్నో సంస్థలు, వ్యవస్థలు స్త్రీల సహాయార్థం ఏర్పడ్డాయి. పాలనలోకి జండర్‌ అవగాహన, జండర్‌ స్పృహ ప్రవేశించాయి. ప్రభుత్వమే స్త్రీల పట్ల ఎలా మెలగాలో తెలిపే జండర్‌ శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఇదంతా ఒక్క రోజులో, ఆకాశం లోంచి ఊడిపడిన పరిణామం కాదు.
భారత స్త్రీల ఉద్యమంలో స్త్రీవాదం అంతర్లీనంగా ప్రవేసిచడం వల్లనే ఈ రోజు – పవిత్రమైన భారతీయ కుటుంబాల్లో హింసా? అని ప్రశ్నించిన వాళ్ళే – అవును కుటుంబాల్లో తీవ్ర స్థాయిలో హింస జరుగుతోందంటూ ఒప్పుకుని 2005లో గృహహింస నిరోధక చట్టాన్ని, పని చేసే చోట వేధింపులు వాస్తవమని ఒప్పుకుంటూ చేసిన సెక్సువల్‌ హరాస్‌మెంట్‌ బిల్‌ని ప్రభుత్వం తెచ్చింది. ఇవన్నీ స్త్రీల ఉద్యమం సాధించిన విజయాలే. కుళ్ళుతనంతో కాక కళ్ళు విప్పార్చుకుని గమనిస్తే, 1975 చీకటి రోజుల తర్వాత వచ్చిన మార్పులు, ఆ మార్పులకు దోహదం చేసిన స్త్రీవాద ఉద్యమ విశ్వరూపం అర్థమౌతాయి.

అయినా నాకు తెలియక అడుగుతున్నాను. తెలుగు సాహిత్యంలో ఎన్నో వాదాలు వచ్చాయి. ఎంతో సాహిత్య సృజన జరిగింది. ప్రబంధాల యుగాన్ని భోగవాదంగా అనుకుంటే, భావ కవిత్వవాదం, విప్లవ సాహిత్య వాదం ఇలా ఆయా వాదాలన్నింటినీ ఆయా కాలాలకే పరిమితం చేసి, భావకవిత్వం పనయిపోయింది, విప్లవ కవిత్వం పనయిపోయింది అని ఎందుకనడం లేదు. భావకవిత్వం రాసే వాళ్ళు, విప్లవ సాహిత్యం రాసే వాళ్ళు అప్పుడూ వుంటారు. ఇప్పుడూ వుంటారు. సాహిత్యం ఒక జీవధార – ప్రవహిస్తూనే వుంటుంది. పనైపోవడం, నీరసించిపోవడం అంటూ వుండదు. ఆయా కాలాలకు, ఆయా సామాజిక అవసరాలకు అనుగుణంగా సాహిత్య సృజన జరుగుతూనే వుంటుంది. ఎనభైల నాటి పరిస్థితులు, ఉద్యమ ఉధృతికి అనుగుణంగా అంతే ఉధృతంగా, ఉద్రేకంగా, ఉద్వేగంగా స్త్రీవాద రచనలు వెలువడ్డాయి.
 తొంభైలలో తెలుగు సమాజం మీద ఉపద్రవంగా దాడి చేసిన ప్రపంచీకరణ విధ్వంసం మీదికి రచయిత్రులు దృష్టి సారించారు. ఇరవై ఒకటో శతాబ్దపు హామీలన్నీ గాలికెగిరిపోయి, మిలీనియం సంబరాలు ఆవిరైపోయి ఇంకా… విద్య కోసం, ఉద్యోగం కోసం, బతుకు కోసం, బాల్యవివాహాల నిర్మూలన కోసం, సమస్త హింసల్ని అంతం చేసే ప్రజాస్వామిక కుటుంబాల ఏర్పాటు కోసం, కుటుంబాల్లో నిర్ణయాధికారం కోసం – వెరసి విముక్త సమాజం కోసం మన కలగంటూనే వున్నాం. ఆ కలనే సిరాగా మన కలంలోకి ఎక్కించుకుని కన్నెర్ర చేస్తూ కథనో, కవిత్వాన్నో రాస్తూనే వున్నాం. ఎవరాఅన్నది స్త్రీవాదం చచ్చిపోయిందని?? ఇరవై ఏళ్ళ స్త్రీవాద భూమిక వాళ్ళ కంటపడలేదా….??

2 comments:

సామాన్య said...

Chaalaa klupthamgaa,chaalaa vivaramgaa,chaalaa baagundi mam...

Anonymous said...

I have a problem with the overall premise of your article but I still think its really informative. I really like your other posts. Keep up the great work. If you can add more video and pictures can be much better. Because they help much clear understanding. :) thanks

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...