భండారు అచ్చమాంబ సచ్చరిత్ర


Written by: అసూర్యంపశ్య 
అచ్చమాంబ (౧౮౭౪-౧౯౦౫) గారి గురించి మొదటిసారి విన్నది బహుసా ఐదేళ్ళ క్రితం తూలిక.నెట్ లో వచ్చిన కొండవీటి సత్యవతి గారి వ్యాసం ద్వారా అనుకుంటాను. అప్పట్లో ఇది చదవగానే, ఆవిడ ఏం రాసారో? అన్న కుతూహలం కలిగినా… బద్ధకం వల్ల అంతగా శ్రమించలేదు వాటిని దొరకబుచ్చుకోవడానికి. కాలక్రమంలో ఆవిడ రాసిన కథలని పోయిన సంవత్సరం అనుకుంటా – సంగిశెట్టి శ్రీనివాస్ గారి సంపాదకత్వంలో “తొలి తెలుగు కథలు” పేరిట వెలువరించారు (ఈ కథలు ఇక్కడ, వీటి గురించి మాలతి గారి పరిచయం ఇక్కడా చదవొచ్చు). నేను కథలు ఒకటీ అరా తప్ప చదవలేదు కానీ, అచ్చమాంబ గారి గురించి వచ్చిన వ్యాసాలు కొన్ని (మాలతి గారివి, సత్యవతి గారివి) చదివాను. దానితో ఆవిడంటే ఒక విధమైన అభిమానం ఏర్పడ్డది – వందేళ్ళ నాడు, ఆవిడ తొలి తెలుగు కథలు, తొలిసారిగా “అబలా సచ్చరిత్ర రత్నమాల” పేరిట స్త్రీల చరిత్ర చిత్రణలు చేశారనీ, అలాగే ఆ కాలంలోనే ఆంధ్ర రాష్ట్రంలో స్త్రీ సమాజం స్థాపించి, స్త్రీ సమస్యల గురించి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారనీ చదువుతూ ఉంటే. ఇన్నీ చేసిన ఈవిడ ముప్పై ఏళ్ల వయసులోనే, పదిసంవత్సారాలు కూడా లేని సాహితీ కెరీర్ తరువాత  కన్నుమూసారు అన్నది దృష్టిలో ఉంచుకుంటే, ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది ఆవిడ జీవితం. అలాంటి అచ్చమాంబ గారి జీవితం పై కొండవీటి సత్యవతి గారు రాసిన పుస్తకమే ఈ “భండారు అచ్చమాంబ సచ్చరిత్ర“.
అచ్చమాంబ గారు పుట్టిన కాలం – స్త్రీ విద్య అన్న ఆలోచనే జనాల మెదళ్ళలో అంతగా దూరని కాలం. కనుక, ఆ కాలపు ఆచారవ్యవహారాలకి అనుగుణంగా ఆవిడకి కూడా ప్రత్యేకం చదువు చెప్పించలేదు. కానీ, తన తమ్ముడు కొమర్రాజు లక్ష్మణ రావు చదువుతున్నప్పుడు వింటూ ఆవిడ చదువుకున్నారనీ అలాగే వివిధ భాషల్లో నిష్ణాతులు అయ్యారు  అనీ చదువుతూ ఉంటే చాలా ఆసక్తికరంగా, అబ్బురంగా అనిపించింది. అలాగే, ఇక్కడ మరొక్క విషయం నన్ను ఆకర్షించింది – ఆవిడ భర్త మాధవరావు గారు అప్పటి సంప్రదాయాలకి అనుగుణంగా పెరిగిన మనిషి. కనుక, ఆయన అచ్చమాంబ గారి చదువులని అంతగా సమర్ధించలేదట. అయితే, అచ్చమాంబ గారు పట్టు విడువకుండా, ఆయన ఇంట్లో లేనప్పుడు తన చదువు కొనసాగిస్తూనే, క్రమంగా ఆయన మనసు మార్చారని చదివినప్పుడు ఎంతో స్ఫూర్తివంతంగా అనిపించింది. పురాణ కథల్లో పత్రివ్రతల కథలా కూడా అనిపించింది :) . అలాగే, స్త్రీ విద్య కోసం ఆవిడ కథల్లోనూ, వ్యాసాల లోనూ, ప్రసంగాల లోనూ – ఎక్కడైనా చాలా తెలివిగా, సందర్భోచితమైన ఉదాహరణలతో వాదించడం చూస్తే కూడా ఆవిడ విషయ పరిజ్ఞానానికి ఆశ్చర్యం కలిగితే, ఇదంతా జరిగింది వందేళ్ళ నాడు అన్న విషయం గుర్తు వచ్చినప్పుడు  అద్భుతంలా అనిపించింది.
ఇవన్నీ ఒక ఎత్తు. “అబలా సచ్చరిత్ర రత్నమాల” రాయడానికి పూనుకున్నాక, ఆ కాలంలో ఆ పుస్తకంలో ప్రస్తావించిన స్త్రీల గురించి వివరాలు తెలుసుకోవడానికి ఎంత శ్రమించారో చదివినప్పుడు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. సమాచార వ్యవస్థ ఇప్పటిలా లేని కాలంలో, అందునా ఒక స్త్రీ – ఇంత శ్రమించి వివరాలు సేకరించడం అన్నది గొప్ప విషయం. ఏమన్నా మాట్లాడితే – “ఆ ఫలానా వాళ్ళ భర్తో నాన్నో ఎవరొ సాయం చేయడం వల్ల వాళ్ళు చేసారు అనో, ఈవిడ పేరుతో ఆయన రాస్తారు” అనేసి ఆడవాళ్ళకి ఆట్టే తెలివి ఉండదంటూ పెదవి విరిచేసే వారు ఈ కాలంలోనే ఎందరినో చూసాను. అటువంటిది ఆకాలంలో ఆవిడ ఎలాంటి పరిస్థితుల మధ్య ఉంటూ అంతెత్తు కి ఎదిగారో, నా ఊహకైనా అందని విషయం. ఆవిడ అప్పట్లో ఈ విషయం పై వ్యక్త పరచిన అభిప్రాయాలు ఇప్పటికీ సబబుగానే ఉండడం ఒక విధంగా శోచనీయమే. (అబలా సచ్చరిత్ర రత్నమాల గురించి మాలతి గారి బ్లాగులో వివరంగా పరిచయం చేసారు. అక్కడే ఆ పుస్తకం భాగాల డీ.ఎల్.ఐ. లంకెలు కూడా ఉన్నాయి). ఎప్పుడో వేద కాలం నాటి స్త్రీలు మొదలుకుని అచ్చమాంబ గారి కాలానికి చెందిన ఆనందీ బాయి దాకా ఎంతో మంది చరిత్రలని ఈ పుస్తకంలో పొందుపరిచారు.  ఒక్క పరిచయ వ్యాసంలో అచ్చమాంబ గారి భావజాలం గురించి వివరంగా చెప్పేంత సామర్థ్యం నాకు లేదు కానీ, సత్యవతి గారి పుస్తకం చదివితే అచ్చమాంబ గారంటే ఏమిటో అర్థమవుతుంది.
పుస్తకం రాయడం వెనుక సత్యవతి గారు ఎంత కృషి చేసారో ముందుమాటలో చెప్పారు. అచ్చమాంబ గురించి మొదట సూసీ తారు, కే.లలిత లు రాసిన “Women writing in India” పుస్తకాలు చదువుతున్నప్పుడు తెలుసుకోవడం, అటు పై ఆశ్చర్యం తో ఆవిడ గురించి, ఆవిడ రచనల గురించి వివరాలు సేకరించడం, వందేళ్ళ నాటి పత్రికలను సంపాదించడం  – ఇదంతా వివరంగా రాసారు. ఇది ఈ పుస్తకం రాయడం వెనుక ఆవిడ ప్రస్థానం. వివరాలు సేకరించడానికి ఇంత కష్టపడ్డారు అన్నాక, పుస్తకంపై ఒక అంచనా ఏర్పడడం సహజం. ఆ అంచనాలకి తగ్గట్లుగానే ఉంది ఈ పుస్తకం. అయితే, నాకు బాగా ఆశ్చర్యం కలిగించే ఏకైక విషయం ఏమిటంటే పైన చెప్పే పుస్తకం వచ్చేదాకా అచ్చమాంబ గారి కథల గురించి కథా-విమర్శకులు ఎవరూ వారి రచనల్లో ప్రస్తావించకపోవడం! (ఇది నేను అనటం లేదు. ఈ పుస్తకంలోనే ఆ ఉదంతాలు కూడా ప్రస్తావించారు.)
“The outstanding life and works of Bhandaru Acchamamba” పేరిట నిడదవోలు మాలతి గారు ఆంగ్లంలో రాసిన వ్యాసం లంకె ఇదిగో. అక్కడే అచ్చమాంబ రాసిన రెండు కథలకి ఆంగ్లానువాదాలు కూడా ఉన్నాయి. (తెలుగు మూల కథల్లో భాష ఇప్పటి తరం వారికీ కొంచెం చదవడానికి ఇబ్బందిగా అనిపించవచ్చు. నేను అలా ఇబ్బంది పడ్డాను. కనుక, ఈ ఆంగ్ల అనువాదాల గురించి కూడా ప్రస్తావిస్తున్నాను). అలాగే, మనం ఇప్పటి మన పరిజ్ఞానంతో ఈ కథల్ని విశ్లేషించడం కూడా అంత సబబు కాదేమో అనిపిస్తోంది ఈ పుస్తకం చదివాక. ఇంకా కథ అన్న ప్రక్రియే మనకి తెలియని కాలం అది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అని ఇపుడు నా అభిప్రాయం. మొత్తంగానే ఈ పుస్తకంలో అచ్చమాంబ గారు చేసిన పనులు ఇప్పటి దృష్టితో చూస్తే – “ఆ, బోలెడంత మంది చేస్తున్నారు ఇలాంటివి” అని పెదవి విరిచే అవకాశం లేకపోలేదు. కానైతే, ఇప్పుడిలా ఆ బోలెడంతమందీ చేయగలగడానికి బాటలు వేసిన జీవితాలు వారివి అన్న స్పృహతో చదివితే, అచ్చమాంబ గారి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలో అర్థమవుతుంది.
పుస్తకం ఆర్గనైజేషన్ విషయానికి వస్తే: ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి.
౧) పుస్తకం రాయడం వెనుక అంటూ సత్యవతి గారు చెప్పిన కథ
౨) తెలుగు సాహిత్యంలో ధ్రువతార అచ్చమాంబ – అనే అచ్చమాంబ జీవిత సంగ్రహం
౩) తొలి కథకురాలు – పేరిట ఆవిడ రాసిన కథల వివరాలు, వాటి పై వచ్చిన పలు అభిప్రాయాలు
౪) అచ్చమాంబ రాసిన వ్యాస సముదాయం – పేరిట ఆవిడ రాసిన వ్యాసాలు, వాటిలోని ప్రధానాంశాల గురించి ఒక పరిశీలన.
౫) స్త్రీ సమాజ స్థాపనము/బృందావన సమాజం – ఇందులో అచ్చమాంబ గారి సామజిక కోణం, స్త్రీల అభ్యున్నతి కోసం ఆవిడ చేసిన కృషి గురించి వివరంగా రాసారు
౬) అక్కా-తమ్ముళ్ళ అనుబంధం – తమ్ముడు కొమర్రాజు లక్ష్మణ రావు తో ఆవిడ అనుబంధం గురించి
౭) అచ్చమాంబ మరణం
ఇవి కాక, అనుబంధ రూపంలో విలువైన వ్యాసాలు పొందుపరిచారు ఈ పుస్తకంలో. అచ్చమాంబ రచనలపై ఆ కాలపు పత్రికల్లో వచ్చిన వ్యాసాలు, ఆవిడ మరణ సందర్భంలో వచ్చిన వ్యాసాలు, ఆవిడ ఇచ్చిన ఉపన్యాసాలు కూడా ఉన్నాయి. అనుబంధ వ్యాసాల్లో కొన్ని అంశాలు నన్ను ఆకర్షించాయి.
౧) అచ్చమాంబ గారికి స్వాగతం పలుకుతూ పలికిన వాక్యాల్లో కనబడ్డ అభిమానం – ఆవిడ రచయిత్రిగా బాగా ఆక్టివ్ గా ఉన్న కాలం బహుసా ఏ పదేళ్లో ఉంటుందేమో (నిజానికి అంత కూడా ఉండదు. ఈ పుస్తకం ప్రకారం ఆవిడ తొలి కథ ౧౮౯౮ లో రాసారు..అదిప్పుడు అలభ్యం. ఆవిడ ౧౯౦౫లొ మరణించారు. కనుక, ఆవిడ రచయిత్రి గా వెలుగులో ఉన్న సమయం ఏడేళ్ళు.)…కానీ, ఆవిడకి ఉన్న అభిమానులు ఎక్కువే. అచిరకాలంలోనే ఇంత పేరు తెచ్చుకున్నారంటే అబ్బురంగా అనిపించింది.
౨) ఆవిడ మరణానంతరం రాసిన వ్యాసాల్లో – ఒక్క వీరేశలింగం గారి వ్యాసం లో మాత్రం మాధవరావు (ఆవిడ భర్త) ఆవిడ భర్త పూర్వాచార పరాయణులు కానందున ఆవిడకి ప్రతిబంధకము కల్పించకుండా ప్రోత్సహించారని రాసారు. కానీ పుస్తకం చదివితే, పుస్తకంలో రచయిత్రి, ఇతరులు వ్యక్తీకరించిన అభిప్రాయాలు చదివితే మాత్రం ఇలా అనిపించదు. :-)
౩) హిందూ సుందరి పత్రికలో వచ్చిన సంస్మరణ వ్యాసం లో అచ్చమాంబ గారి పుస్తకాలు నిలిచిపోకుండా వారి కూతురు మీనాక్షమ్మ గారు పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు రాసారు. తర్వాత ఏమైంది? అని వెంటనే నాలో సందేహం కలిగింది.
పుస్తకంలో ఒక్క చోట రెండు పేజీలు మిస్సై, వాటి స్థానంలో ముందు వ్యాసంలోని పేజీలు వచ్చినట్లున్నాయి. అదొక్కటే ఈ పుస్తకంలో నాకు కనబడ్డ లోపం.
అచ్చమాంబను రచయిత్రి గా మాత్రమే చూస్తే సరిపోదు. ఆవిడలో ఉన్న బహుముఖ ప్రజ్ఞ కారణంగా, ఆవిడ అందరికీ స్పూర్తిని కలిగించే వ్యక్తి.  అందువల్ల ఈ పుస్తకం తెలుగు వారు అందరూ చదవవలసిన పుస్తకం.
పుస్తకం వివరాలు:
భండారు అచ్చమాంబ సచ్చరిత్ర
రచన: కొండవీటి సత్యవతి
ప్రచురణ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్, జూన్ ౨౦౧౨.
వెల: యాభై రూపాయలు
పేజీలు : ౯౨
డిజిటల్ కాపీ కొనుగోలుకు: కినిగె.కాం లంకె ఇదిగో.

Comments

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం