2009-10 సంవత్సరానికి గాను లాడ్లీ మీడియా అవార్డ్స్ ఫర్ జెండర్ సెన్సిటివిటీ ఇన్ మీడియా లను ప్రకటించడం,17 వ తేదీన 14 మంది జర్నలిష్టులకు ప్రదానం చేయడం జరిగింది.
రవీంద్రభారతిలో కిక్కిరిసిన ఆహూతుల మధ్య వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ అవార్డులను ప్రదానం చేసారు.
గౌతమబుద్ధుడు పుట్టిన గడ్డమీదే తల్లి పేగు ఆడబిడ్డకి ఉరికొయ్యగా మారింది. బాలికా జననాల సంఖ్య దీనాతిదీనంగా పడిపోతూవుంది. ప్రపంచ జనాభా అసమతుల్యంగా మారింది. రాబోయే కాలంలో దీని ఫలితం ఎంత విషమంగా వుంటుందో ఇప్పటినుంచే ఆ చిహ్నాలు కనిపిస్తున్నాయి.
భారతదేశం అంతటా 0-6 సంవత్సరాలలోపు బాలికల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ అంచనా ప్రకారం బాల బాలికల నిష్పత్తిలో తేడా పేదలకు ధనికులకు గ్రామాలకు పట్టణాలకు భిన్నంగా వుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందినట్టు కనిపిస్తున్న ఢిల్లీ, బాంబే నగరాల్లోనే బాలికల జననాలు తక్కువగా వున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో తక్కువ శాతం బాలికలు వున్నారు. బాలికల జననాలు తక్కువగా వుండటానికి కేవలం పోషకాహార లోపమో, ప్రసూతి విధాన లోపమో మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువగా వేళ్ళూనివున్న పితృస్వామ్య భావజాలం కారణంగా కనిపిస్తోంది. మగపిల్లవాడు అంటే వంశోద్ధారకుడు అని ఆడపిల్ల పరాయిపిల్ల అనే ద్వంద్వ నీతి సమాజంలో వుండడం ప్రధానంగా కనిపిస్తోంది. నిజానికి వెయ్యిమంది పురుషులకి 1020 నుంచి 1070 మంది స్త్రీలు వుండడం గుణాత్మక లక్షణం. కానీ కనీసం సమ సంఖ్యలో కూడా లేరు. తక్కువ నిష్పత్తిలో కూడా వుండటం ఆందోళన పడాల్సిన విషయం. అమెరికాలో స్త్రీల సంఖ్య వెయ్యికి 1058 వుండగా జపాన్‌లో 1034, మయన్మార్‌్‌లో 1016, ఇథియోపియాలో 1066 వుంది. భారతదేశ జనాభాలో స్త్రీ పురుషుల సాధారణ జీవన ప్రమాణం ఒక పక్క పెరుగుతూ వుండగా ప్రత్యేకించి ఆరేళ్ళలోపు బాలికల సంఖ్య తీవ్రంగా తగ్గిపోతూ వుండడం ఆలోచించాల్సిన అంశం.
2001 సంవత్సరంలో చేసిన అంచనా ప్రకారం బాలికల సంఖ్య, గ్రామాల్లో 934 మంది వుండగా పట్టణాల్లో 903 మంది వున్నారు. కారణం ఏమిటంటే పెరిగిన సాంకేతిక(అల్ట్రాసౌండ్), ఆధునిక వైద్యవిధానాలు బాలికల్ని తొలగించుకోవడానికే పట్టణ ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తెలియజేస్తోంది. తక్షణమే దీన్ని గురించి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ప్రపంచ జనాభా ఎంత అనూహ్యంగా పెరుగుతోందో, బాలికల నిష్పత్తి అదే స్థాయిలో పడిపోతోంది. ఒకప్పుడు మగపిల్ల వాడికోసం ఎదురు చూసే క్రమంలో నలుగురైదుగురు ఆడపిల్లల్ని కనే తల్లులు ఇప్పుడు ఆ శ్రమ లేకుండా ఒకే సూదిపోటుతో కన్న బిడ్డల్ని కడతేరుస్తున్నారు. ఒకడైనా, ఇద్దరైనా మగపిల్లలుంటే చాలు. ఆడపిల్లను కనాల్సిన అవసరమే లేదనుకుంటున్నారు. ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా చీలి పోయాక, భూమిని వృత్తి వ్యాపారాల్ని వదులుకుని యువతరం పట్నానికి వలస పోయాక పెరిగిన జీవనవ్యయం పరిమిత సంతానం పట్ల మొగ్గు చూసేలా చేసింది. తల్లి అనారోగ్యం, వంశపారంపర్యమైన రుగ్మతలు, అవాంఛనీయ సంఘటన వల్ల వచ్చిన గర్భం తొలగించుకోవడానికి ఉద్దేశించబడిన గర్భస్రావం ఆడశిశువుల్ని హత్య చేసే ఆయుధంగా మారిపోయింది. ప్రత్యుత్పత్తి రంగంలో స్త్రీలకున్న ఈ హక్కు సమాజం చేతిలో అదే స్త్రీల పట్ల చెలరేగిన దురన్యాయంగా తయారయింది. కుటుంబాలు, వైద్యులు, మతం సంస్కృతి ఏదీ దీన్ని వ్యతిరేకించలేకపోతోంది. మరీ ముఖ్యంగా 1980 తర్వాత వచ్చిన అల్ట్రాసౌండ్, ఆమ్నియోసింటసిస్ విధానం వల్ల ఇది ఇంటింటి రాచపుండులా మారింది. ఆడపిల్లల జననాల్ని ప్రోత్సాహించడానికి ఎన్ని పధకాలున్నా అవి అమలు కాకపోవడం, అవగాహన లేకపోవడంతో పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది. దానాదీనా కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు ఆడశిశువుల మరణాలకూ కనిపిస్తున్నాయి. అంచనా వేసిన గణాంకాలు ఇంకా భయపెడుతున్నాయి.
2001 లెక్కల ప్రకారం పట్టణాల్లో ఆడశిశువుల నిష్పత్తి, వెయ్యి మంది మగపిల్లలకి తొమ్మిది వందల మూడు కాగా, గ్రామాల్లో తొమ్మిది వందల ముప్పై నాలుగు వుంది. గ్రామాల్లో నిరక్షరాస్యత, అనారోగ్యం, పేదరికం కారణమైతే, పట్టణాల్లో చట్టాన్ని ఉల్లంఘించి అయినా గానీ గర్భస్రావం చేసే వైద్యులు కారణమవుతున్నారు. వివక్ష రెండు చోట్లా వుంది.
సామాజిక న్యాయం కోసం బాలల హక్కులకోసం ఉద్యమిస్తున్న వారే కాదు, మానవత్వంమీద నమ్మకం వున్న వారెవరైనా సరే ఈ అంధకారంలోకి కొంతయినా వెలుగు తేవాల్సి వుంది. ఇందుకు మీడియా పాత్ర ఎంతో వున్నదని లాడ్లీ నమ్ముతుంది. ప్రజాజీవితాల్ని యధాతధంగా ప్రతిబింబించడమే కాకుండా కంటిముందున్న చీకటి వలయాల్ని చేధించే నిర్ణయాత్మక శక్తిగా యు.ఎన్.ఎఫ్.పి.ఎ పాపులేషన్ ఫస్ట్ మీడియాని గుర్తిస్తుంది. బాలికల ఉనికి, హక్కుల ప్రాధాన్యతకోసం కృషిి చేస్తున్న లాడ్లీ మీడియా ఈ సంవత్సరం భూమిక సహకారంతో మీడియా అవార్డులను ప్రకటిస్తోంది. ఇటు కుటుంబంలో అటు సమాజంలో బాలికల హక్కుల్ని గుర్తిస్తూ జండర్ అవగాహనతో రచనలు చేస్తున్న వారికి అవార్డు ఇచ్చి గౌరవిస్తుంది. 2009-2010 లో వచ్చిన ఉత్తమ వార్తాకధనాలు, సంపాదకీయాలు, ఫీచర్స్ పోటీ పరిధిలోకి వస్తాయి. ప్రచార, ప్రసార, వెబ్‌సైట్ మాధ్యమాల్లో పని చేస్తున్న విలేకరులు తమ ఎంట్రీలని పంపవచ్చు.నిబందనల్ని అనుసరించి, పంపిన వాటిలో ఉత్తమమైన వాటికి లాడ్లీ మీడియా అవార్డులు బహుకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ,కర్నాటక మరియు యూనియన్ టెరిటరీ పాండిచ్ఛేరి రాష్ట్రాల్లో వున్న తెలుగు, తమిళ, మాళయాళ, కన్నడ, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషా విలేకరులు పోటీ పరిధిలోకి వస్తారు.
1 comment:
ఉదాత్తమైన ఆశయం.
Post a Comment