ఈనాడు ఆదివారం లో వచ్చిన వ్యాసం.
భర్త సాధింపులు, అత్తమామల వేధింపులు, ఉద్యోగంలో ఒడుదొడుకులు...సమస్య ఏదైనా కానీ పరిష్కార దిశలో మహిళలకు ఆసరాగా నిలుస్తోంది 'భూమిక' హెల్ప్‌లైన్.
1800 425 2908
స్త్రీవాద పత్రిక 'భూమిక' నిర్వహిస్తోన్న హెల్ప్‌లైన్ నెంబర్ ఇది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది టోల్‌ఫ్రీ నెంబరు. ఒక్క ఫోన్‌కాల్‌తో మహిళల సమస్యలకు తగిన పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నారు వీరు. చదువు, ఉద్యోగం, గృహహింస, చట్టపరమైన చిక్కులు, మానసిక ఇబ్బందులు... ఇలా అన్ని రకాల సమస్యల నుంచి స్త్రీలకు విముక్తి కలిగించేందుకు ఈ హెల్ప్‌లైన్ సాయపడుతోంది.
15 ఏళ్లుగా స్త్రీ అభ్యుదయానికి అక్షరసాయం చేస్తున్న భూమిక 2006లో ఈ హెల్ప్‌లైన్‌ను వెుదలుపెట్టింది. 'చాలా మంది మహిళలు తమ సమస్యల్ని ఉత్తరాల ద్వారా భూమికకు తెలియజేసి సరైన దారి చూపమని అర్థించేవారు. అలాంటి వారికి సమాచారం లేదా పరిష్కారం దొరికే మార్గం చూపేవాళ్లం. ఎక్కువ మందిని ఆదుకోడానికి హెల్ప్‌లైనే సరైన మార్గమని భావించి ప్రారంభించాం' అని చెబుతారు భూమిక సంపాదకులు
కె.సత్యవతి. హెల్ప్‌లైన్‌కు కావాల్సిన ఆర్థిక సాయం 'ఆక్స్‌ఫామ్ ఇండియా' అనే స్వచ్ఛంద సంస్థ అందిస్తోంది.
మాటే మంత్రం ఆమెది అత్తవారింట్లో నచ్చని పెళ్లి. భర్త లేని సమయంలో అత్తమామలు మానసికంగా శారీరకంగా హింసించేవారు. మూడేళ్లు అదే పరిస్థితి. కానీ ఒక్కసారైనా ఆమె ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఓరోజు తలపై కట్టెతో కొట్టారు. రక్తం కారుతుండగా బయటకు పరుగుతీసింది. ఓ ఇంటి ముంగిట స్పృహతప్పి పడిపోయింది. ఆ సమాచారం భూమికకు అందింది... నిమిషాల్లో 108తో పాటూ ప్రొటెక్షన్ ఆఫీసర్ అక్కడకు చేరుకుని ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పూర్తయిన తర్వాత రక్షణ గృహంలో ఆశ్రయం కల్పించారు. కొన్నాళ్లకు అత్తమామలతోపాటు భర్తకు కౌన్సిలింగ్ ఇప్పించారు. అప్పటి నుంచి భార్యాభర్తలు సుఖంగా జీవించడం వెుదలుపెట్టారు. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. కాస్త అటూ ఇటుగా ఇలాంటి నేపథ్యంతో భూమిక దృష్టికి వచ్చే కేసులు నెలలో అయిదు వరకూ ఉంటాయి.
ఆలుమగల మనస్పర్థల పరిష్కారానికీ భూమిక వేదికగా నిలుస్తోంది. తమ బాధలు పంచుకోడానికి ఎవరూ లేరని ఫోన్ చేసేవారూ, ఉన్న వాళ్లెవరూ తమని పట్టించుకోవడం లేదని చెప్పేవారూ... రోజులో పది మందైనా ఉంటారు. సమస్యను చెప్పుకోడానికీ, బాధను పంచుకోడానికీ ఓ ఆత్మీయ నేస్తం కావాలి... అది భూమిక రూపంలో వాళ్లకి దొరికింది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలపాటు గొంతులో దాచుకున్న బాధ
ఒక్కసారి బయటకు వస్తుంది. 'ఫోన్ చేసినవారి మాటల్ని చాలా ఓపికతో వింటాం. ఒక్కోసారి గంటకు పైగానే మాట్లాడతారు. అయినా మేం విసుగుచెందం. అన్నీ విన్నాక సలహా లేదా సూచన చెబుతాం. తుది నిర్ణయం వారిదే. ఒక నిర్ణయానికి వచ్చాక సమస్య పరిష్కారానికి మా వంతు సాయం చేస్తాం' అని చెబుతారు భూమిక ప్రతినిధులు.
ఎల్లలు దాటి
రాష్ట్రంలోని అన్ని మూలల నుంచి వీరికి ఫోన్‌లు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మహిళల సమస్యల పరిష్కారానికి వీరిని ఆశ్రయించేవారు ఎక్కువ. అమెరికాలోని దక్షిణాసియా దేశాల మహిళల బాగోగులు చూసే 'మానవి' స్వచ్ఛంద సంస్థ తెలుగువారి సమస్యల పరిష్కారానికి భూమిక సాయం తీసుకుంటోంది. ఉద్యోగాల ఆశతో వెళ్లి విదేశాల్లో వోసపోయిన వారు స్వదేశం చేరుకోడానికీ వీరే దిక్కు. హెల్ప్‌లైన్ సేవలు జిల్లాలకూ విస్తరించాలనే భూమిక లక్ష్యం ఇపుడు నెరవేరింది. భూమిక స్ఫూర్తిగా ప్రభుత్వం ఇందిర క్రాంతిపథం సభ్యులచేత ప్రతి జిల్లా కేంద్రంలో మహిళా సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేస్తోంది. వీరంతా భూమిక హెల్ప్‌లైన్ నిర్వాహకుల దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. దాదాపు పది జిల్లాల్లో ఇప్పటికే హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. మిగిలిన జిల్లాలకు చెందిన వారు శిక్షణలో ఉన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల స్థాయి వరకూ అధికారుల ఫోన్ నెంబర్లూ వారి దగ్గర సిద్ధంగా ఉంటాయి. రాష్ట్రంలో ఏ మూలనుంచి సమస్య వినిపించినా తక్షణ పరిష్కారం కోసమే
ఈ ఏర్పాట్లు. బాధితులు ఆయా జిల్లాల్లో ఉండే మానవహక్కుల సంఘాలు, లోక్ అదాలత్, మహిళా కమిషన్ ద్వారా లబ్ధిపొందడానికీ సాయపడతారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 100 మంది వరకూ భూమిక వాలంటీర్లు ఉన్నారు. వీరిలో మహిళా న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థలకి చెందిన వారు ఎక్కువ. న్యాయ సంబంధ సలహాల కోసం ప్రతి శనివారం న్యాయవాదితో ఫోన్‌లో ప్రత్యక్షంగా మాట్లాడే వెసులుబాటు ఇటీవల ప్రారంభించారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిత్యం ఉండనే ఉంటుంది. సమస్యల వలయంలో చిక్కుకుపోయి అల్లాడే మహిళలను అందులోంచి బయటపడేలా చేయడంలో 'భూమిక' హెల్ప్‌లైన్ కీలక భూమిక వహిస్తోందనడంలో సందేహం లేదు.
No comments:
Post a Comment