ఆ రోజు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియమ్‌లోకి ప్రవేశించేటప్పుడు మనసులో ఓ చిన్న అసౌకర్యం. అయితే అంతకుముందు గేటు బయట చూసిన వైలెట్ కలర్ పూలబంతులు ఈ అసౌకర్యాన్ని చాలా వరకు తగ్గించేసాయి.ఆ పూలను చూసాకా కూడా మనసులో చీకాకులు, చింతలు మిగిలివున్నాయంటే మనం సరిగ్గా లేమన్న మాట. అంతకు ముందు అదే దారిలో వచ్చిన భానుజ గానీ, జమున గానీ ఆ పూలను చూడనే లేదు. అలా ఎలా చూడకుండా వుంటారా అని నాకు చాలా ఆశ్చర్యంగా వుంటుంది. వాళ్ళిద్దరిని కళ్ళు మూసుకోమని చెప్పి ఆ పూల చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి కళ్ళు తెరవమని చెప్పినపుడు ఆ పూల సొగసు చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటివి సత్యక్క కళ్ళబడతాయి. అని భానుజ అంటే… అబ్బ! ఎంత బావున్నాయి సత్యా! థ్యాంక్స్ అంటూ జమున చటుక్కున నా బుగ్గమీద కిస్ ఇచ్చేసింది. నేనదిరిపోయాను. ఈ లోపు ప్రశాంతి వచ్చింది. తను ఆ పూలను ముందే చూసింది. తనని తీసుకెళ్ళబోతుంటే ”అమ్మూ! పువ్వులా? నేను చూసాగా” అంది హాయిగా నవ్వేస్తూ .
నేను రాయబోతున్నది ఈ పూల కథ కాదు. డిశంబరు నాలుగున ప్రశాంతి సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్ మహిళా సమత సొసైటికి చెందిన మహిళలు ప్రదర్శించిన నృత్యరూపకం ”తిరగరాసిన కథ” గురించి. ఈ నృత్య రూపకాన్ని ఇంతకు ముందు మహిళా సమత సొసైటి ఇరవై ఏళ్ళ ప్రస్థానపు సంబరాలవేళ నిస్సియట్‌లో చిన్న వేదిక మీద ప్రదర్శించినప్పుడు చూసాను. ఆ సంబరాల నిర్వహణలో తలమున్కలుగా వున్న ప్రశాంతితో కలిసి చూసాను. హడావుడిగా చూసాను. మనసు మొత్తం లగ్నం కాకుండా చూసాను. అందుకే ఆ రోజు కలగని ఉద్వేగం, డిశంబరు నాలుగున చూసినప్పుడు నన్ను ఊపేసింది. ఎన్నోసార్లు కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. శరీరమంతటా కమ్మిన వేడి సెగలు, గుండెల్లోంచి తన్నుకొస్తున్న ఆగ్రహజ్వాలలు. దాదాపు ఇరవై మంది పైనే చదువు నేర్వని, గ్రామీణ, పేద సంఘం స్త్రీలు, చదువుకుంటున్న పిల్లలు, మహిళా సమతలో పని చేస్తున్న టీమ్ సభ్యులు ఓ గంటన్నరపాటు ఆడిటోరియమ్‌ని, ప్రేక్షకుల కళ్ళని ఆక్రమించుకున్నారనే చెప్పాలి. గజ్జెకట్టిన పాదాల లయాత్మక కదలికలు గుండెల మీదే కదిలిన ఫీలింగ్. గుండెలయలో కలగలిసిపోయిన మువ్వల సవ్వడులు. కన్నార్పనీయని తాదాత్మ్యత…
వాళ్ళు చెప్పిన రేణుక ఎల్లమ్మ కథ, ఆ కథను మొదలుపెట్టన తీరూ, ముందుకు నడిపించిన తీరూ, ఓ అర్థవంతమైన ముగింపు ఇచ్చిన తీరూ.. నేను రాయడం కాదు. ప్రతి వొక్కరూ చూసితీరాలి. అడవిలో హాయిగా స్వచ్ఛంగా, తేటనీటి ఊటలా బతుకుతున్న అడవిబిడ్డల జీవనశైలి… చెట్టూ, చేమా, ఆకూ, అలమూ, పిట్టా, పామూ, సెలయేళ్ళూ, జలపాతాలూ వెరసి… ఆకు పచ్చగా… పచ్చ పచ్చగా బతుకుతున్న గిరి పుత్రికలు. స్వేచ్ఛ ఊపిరిగా, ఎలాంటి కృత్రిమ కట్టుబాట్లు లేకుండా చిక్కటి అడవిలో చిరు సవ్వడి చేసే గాలిలా అతి సహజంగా బతుకుతున్న గిరిజనుల జీవితంలోకి కార్చిచ్చులా ప్రవేశించాడు జమదగ్ని. అడవి బిడ్డలతో పాటు రూపకంలో మమేకమైన ప్రేక్షకులు కూడా ఉలిక్కిపడతారు. అమ్మ తల్లుల్ని, అడవి దేవతల్ని పూజించే చోటులో జమదగ్ని అడవిని నరికి యజ్ఞం మొదలు పెడతాడు. ఒక బీభత్స విధ్వంశానికి బీజం వేస్తాడు. గిరిజన స్త్రీలు వ్యతిరేకిస్తారు. తిరగబడతారు. తన యజ్ఞానికి అడ్డుపడుతూ ఉద్యమిస్తున్న గిరిపుత్రికలను లొంగదీసుకోవడానికి కొత్త పన్నాగం పన్నుతాడు జమదగ్ని. పోరాటనికి నాయకత్వం వహిస్తున్న రేణుకను పెళ్ళి చేసుకోవాలని అనుకుంటాడు. అతని మోసపు ఆలోచనలు తెలియని రేణుక, జమదగ్నిని పెళ్ళి చేసుకుంటుంది. వాళ్ళకి ఐదుగురు కొడుకులు పుడతారు. జమదగ్ని తన అసలు ఆలోచనలు అమలు చేయడానికి అడవుల్ని నరికి, యజ్ఞాలు చేసే పనిని తిరిగి మొదలు పెడతాడు. అడ్డుకున్న రేణుకను, మగని మాటకు ఎదురాడిందని, ధిక్కరించిందని తూలనాడి, తన కొడుకుల్ని పిలిచి, వారిలో పెద్దవాడిని తన తల్లి శిరస్సు నరకమని ఆజ్ఞాపిస్తాడు. అతను తిరస్కరిస్తాడు. మిగిలిన కొడుకులు కూడా తండ్రి ఆజ్ఞను పాటించరు, వాళ్ళని బండరాళ్ళు కమ్మని శపిస్తాడు. చివరి కొడుకు పరుశురాముడు తన గొడ్డలితో ఒక్కవేటుతో తల్లి శిరస్సును ఖండించివేస్తాడు.
ఈ మొత్తం సన్నివేశాలను మహిళా సమత కల్చరల్ టీమ్ మహాద్భుతంగా ప్రదర్శించారు. జమదగ్ని అహంకారం, రేణుక తిరుగుబాటు, ఆమె మరణం ప్రేక్షకుల్లో తీవ్ర భావోద్వేగాలను కల్గించాయి. ఆయా పాత్రల్ని పోషించిన స్త్రీలు ఆ పాత్రల్లో జీవించారు. మాతృస్వామ్య మహాపతన సన్నివేశం నా కంట నీరు పెట్టించింది. పురుషాహంకారానికి, పితృస్వామ్యానికి పోతపోసినట్టున్న జమదగ్ని నా గుండెల్లో అగ్నిని రగిల్చి, వొళ్ళంతా మండించాడు. కన్నతల్లిని కౄరంగా చంపిన పరుశరాముడు మహాపరాక్రమవంతుడని కీర్తించే హిందూమత గ్రంధాలు, స్త్రీల పరంగా ఎంత విషపూరితమైనవో కళ్ళకు కట్టిన సందర్భమది.
‘తిరగరాసిన కథ’ పేరులో మహిళా సమత బృందం ప్రదర్శించిన నృత్యరూపకం ఆహూతులందరి మన్ననలను అందుకున్నది. ప్రదర్శనకి ముందు మహిళా సమత స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ”ఈ నృత్య రూపకంలో నటించిన వాళ్ళు ప్రొఫెషనల్ కళాకారులు కారని, కేవలం నాలుగు రోజులు రిహార్సల్స్ చేసారని, ఈ బృందంలో చదువుకున్న వాళ్ళు, చదువురానివాళ్ళు, విద్యార్ధులు, తమ టీమ్ సభ్యులు వున్నారని, ఏవైనా లోపాలుంటే క్షమించాలి” అన్నపుడు అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ప్రదర్శన ముగిసాక వారందరి నటనా కౌశలం చూసాక ప్రేక్షకులు మరింత ఆశ్చర్యపోయారు. చక్కటి నటన, హావభావాలు, నాట్యం, పాటలు ఒకదానితో మరొకటి పోటీపడ్డాయి.
రేణుక ఎల్లమ్మ చారిత్రక పరాజయగాధని తీసుకుని, స్త్రీల పరాధీనత ఏ విధంగా ప్రారంభమైంది, మహా బలవంతులు, ఆత్మవిశ్వాసం పొంగిపొరలిన ఆదిమ స్త్రీలు ఎలా, ఏ విధంగా పురుషాధిపత్య భావజాలంలో ఇరుక్కుపోయారు, పితృస్వామ్యం స్త్రీల మనశ్శరీరాలను ఎలా కబ్జాచేసింది అనే అంశాలను అత్యద్భుతంగా ఈ నృత్యరూపకం రూపుకట్టించింది. ఆదిమ సమాజం నుంచి ఆధునిక సమాజం వరకు పురుషాధిపత్యం ఎంత హింసాయుతంగా స్త్రీలను లోబరుచుకున్నదీ చక్కగా ప్రదర్శితమైంది.
సామాజిక కార్యకర్త దేవి సహకారంతో సమతా బృందం రూపొందించిన ఈ తిరగరాసిన కథని ఓ క్షణం పక్కన పెట్టి, అసలు రేణుక ఎల్లమ్మ కథ పురాణాల్లో ఎలా వుందోచూద్దాం. భర్త ఆజ్ఞాపిస్తే కొడుకు చేతిలో హత్యకు గురైన రేణుక ఎల్లమ్మ ఆంధ్రప్రదేశ్‌తో సహా మరెన్నో రాష్ట్రాల్లో దేవతావతారం ఎత్తింది. గుళ్ళు కట్టి పూజలు చేస్తున్నారు. విష్ణువు అవతారంగా కీర్తించబడే పరుశురాముడు తండ్రి చెప్పాడని తల్లి శిరస్సు ఖండించాడు. రేణుక చేసిన అపరాధమేమిటి? ఎందుకు ఆమె అంత కఠినమైన శిక్షను అనుభవించాల్సి వచ్చింది?
రేణుక జమదగ్ని భార్య. జమదగ్నికి యజ్ఞాలు చేయడమే పని. యజ్ఞానికి అవసరమైన నీళ్ళని ప్రతిరోజూ రేణుక సమీపంలోని సరస్సు నుంచి మోసుకురావాలి. ఐదుగురు కొడుకులుండీ ఈ నీటి చాకిరీ రేణుకే చెయ్యాలి. అది కూడా బట్టీలో కాల్చని మట్టి కుండతో ఆ నీళ్ళు తొణక్కుండా తెచ్చిపోయ్యాలి. కాల్చని కుండ ఎలా నిలుస్తుంది? ఆ మట్టి కుండ నీళ్ళల్లో ముంచగానే కరిగిపోకుండా ఎలా వుంటుంది? అంటే ఇక్కడ రేణుకకి పాతివ్రత్యాన్ని అద్ది, భర్త పట్ల విశ్వాసంతో వుంటుంది కాబట్టి ఆమె పతివ్రత… పతివ్రత కాబట్టి పచ్చిమట్టి కుండలు కూడా నీళ్ళలో విచ్చిపోవు. పాతివ్రత్య భావజాలాన్ని ఆ నాటి స్త్రీల మీద ఏ విధంగా రుద్దిందీ అర్ధం కావాలంటే రేణుక కథని మించిన కథ మరొకటి లేదనుకుంటాను. సీత కథకూడా వుందనుకోండి ప్రతిరోజూ పచ్చికుండతో నీళ్ళు తెచ్చిపోసే రేణుక… ఒకరోజు సరస్సు తీరాన శృంగార భంగిమలో వున్న జంటని చూసిందట. ఆమె మనసులోను శృంగార భావనలు రేకెత్తాయట అంతే… పచ్చికుండ కాస్తా విచ్చిపోయిందంట. నీళ్ళు తేవడం ఆలస్యం అయిపోయింది. జమదగ్ని ‘దివ్య’ దృష్టితో ఇదంతా చూసి ఉగ్రుడైపోయి, తల్లి పాతివ్రత్యాన్ని అతిక్రమించింది (మనసులోనే సుమా) కాబట్టి ఆమె తలను నరకమని కొడుకుల్ని పురమాయించాడు. సరే ఇక్కడి నుండి కథ అందరికీ తెలుసుకదా! ఆ… అన్నట్టు ఈ కథకి దళిత కోణం కూడా వుంది. దాన్ని గురించి మరోసారి చర్చిద్దాం.
ఇంత భయానక, భీభత్సమైన కథలో తల్లిని చంపి ఘోర నేరం చేసినవాడు విష్ణువు అవతారమని, పురుషాహంకార హింసకు బలై ప్రాణాలు కోల్పోయిన రేణుక దేవత అని ప్రచారం చేసిన పురాణాలలో ఇలాంటి ఘోర కథలు ఇంకెన్ని వున్నాయో? ‘సతి’ దురాచారంలో బతికున్న భార్యను భర్త చితిలోకి తోసి చంపి, ఆమెకు గుళ్ళు కట్టిన ఘనమైన చరిత్ర లాంటిదే ఎల్లమ్మ కథ కూడా. ఆలయాన వెలసిన దేవతలంటూ ఆడవాళ్ళని కీర్తిస్తూ, ఆచరణలో ఆరని మంటలకి, రకరకాల హింసలకి గురిచేసే పితృస్వామ్య వ్యవస్థ దుర్మార్గాన్ని నిలదీసిన కథ ”తిరగరాసిన కథ”. పురుషాధిపత్యాన్ని నిలదీయడమే కాదు ఆధునిక చరిత్రను మేము తిరగరాస్తామంటూ నిరూపించారు సమతా బృందం. సంఘటితంగా పోరాడితే అన్ని అసమానతల్ని, వివక్షల్ని కూకట్‌వేళ్ళతో కూల్చేయవచ్చు అని తనకు ఎదురైన అన్ని సమస్యల్ని ధైర్యంగా ఎదిరించిన అధునిక మహిళ ఎల్లమ్మ కథ ఈ తిరగరాసిన కథ. ఒక చారిత్రిక పరాయజగాథని, స్పూర్తివంతమైన ఆధునిక పోరాట కథగా తిరగరాసి చూసించారు మహిళా సమత సాంస్కృతిక బృందం వారు.
స్త్రీల పరాధీనతకు పునాదులుగా వున్న కథలన్నింటినీ ఈ రోజు తిరగరాయాల్సి వుంది. ఆ పనిని విజయవంతంగా మొదలుపెట్టి, ప్రేక్షకుల మెదళ్ళలో కొంగ్రొత్త ఆలోచనల్ని రేకెత్తించిన మహిళా సమత బృందానికి హృదయపూర్వక అభినందనలు. ఇంతటి సృజనాత్మక, ఆలోచనాత్మక ప్రక్రియకి శ్రీకారం చుట్టిన సమతా బృందం సారథి ప్రశాంతి అత్యంత అభినందనీయురాలు.