Tuesday, November 19, 2013

కలనేత కబుర్ల కలబోత.... కమనీయానుభవాల కలగూరగంప































చాలా సంవత్సరాలుగా కాకినాడ సమీపం లో ఉన్న మడ అడవుల గురించి వింటున్నాను.
నేను పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలోనే కానీ తూర్పు గోదావరిలో ఉన్న అందమైన మడ అడవుల్ని చూడడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది.నా రాజమండ్రి ప్రయాణానికి కారణాలు వేరే ఉన్నాయి కానీ నా మనసులో తిష్ట వేసినవి మాత్రం కోరింగా మంగ్రూవ్ ఫారెష్ట్.ఈ సారి ఎలాగైనా చూడాలి.నేను ఒక్కదాన్నే కాదు నా ప్రియ నేస్తాలు కూడా నాతో ఉండాలి. గీతని,ప్రశాంతిని నాతో తీసుకెళ్ళాలని అనుకున్నాను కానీ గీత రానంది.తనకి వేరే మీటింగ్ ఉంది.
ప్రశాంతి.....చాలా బిజి గా ఉండే తనని రెండు రోజులు నాతో వస్తావా హాయిగా తిరుగుదాం అని అడగ్గానే చాలా ఆశ్చర్యంగా ఒప్పుకుంది.
రాజమండ్రి...కాకినాడ...మచిలీపట్టణం...ఇవి మేము వెళ్ళాలనుకున్న ప్రాంతాలు.
రాజమండ్రిలో ఓ పెళ్ళి....కాకినాడలో మడ అడవులు....మరి బందర్ లో ఏంటి అంటారా....అక్కడికే వస్తున్నా...ఆంధ్రాబాంక్ వ్యవస్థాపకులు..డా: భోగరాజు పట్ఠాభి సీతారామయ్య పేరు మీద ఏర్పాటైన పట్ఠాభి కళా పీఠం వారు రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాలలో విశేష కృషి చేసిన 16 మందికి ప్రతిభా మూర్తి అవార్డులు ప్రకటించి నిన్న సాయంత్రం బందరులో ఆ అవార్డులను ప్రదానం చేసారు.ఉత్తమ మహిళా పాత్రికేయురాలిగా నేను ఆ అవార్డును తీసుకున్నాను.అదీ సంగతి.
సరే....నేను పదిహేను న రాజమండ్రి వెళ్ళాను.16 ఉదయం ప్రశాంతి నాతో కలిసింది.ఇక ఆ రెండు రోజులు మా అనుభవాలను రాయాలంటే చాలా టైం పడుతుంది.
హడావుడి జీవితం లోంచి రెండు రోజులు హాయిగా మనకి అత్యంత ఆత్మీయులైన వ్యక్తులతో
అన్ని ఒత్తిళ్ళను వదిలేసి గడపడం లోని హాయిని రాయడం కన్నా అనుభవిస్తేనే అర్ధమౌతుంది.
మేమిద్దరం 16 ఉదయం 8.30 కి రాజమండ్రి వదిలి కాకినాడ బయలుదేరాం.అప్పటినుండి 18 ఉదయం 5 గంటలవరకు కలిసే ఉన్నాం.
ఆ రెండు రోజులు ఎన్నో అనుభవాలు. అద్భుతమైన అనుభూతులు.

కాకినాడ వెళ్ళే దారిలో బుర్రగుంజు అమ్ముతుంటే కొన్నాం.భలేతియ్యగా ఉంది.
వాళ్ళ దగ్గర కత్తి తీసుకుని బుర్రల్ని కొట్టాను.
ఓ సరదా అనుభవం.
కాకినాడ ఆర్ డి వో జవహర్లాల్ నెహ్రూ నాతో ఎం ఆర్ వో గా పనిచేసిన వ్యక్తి.
ఆయన మా ట్రిప్ ని మరచిపోలేని మధుర జ్నాపకం లా మలిచాడు.
నేను, ప్రశాంతి ఉన్నాం కాబట్టి ఒక స్కూల్ లో సమావేశం ఏర్పాటు చేసి మాచేత మాట్లాడించాడు.
అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పాల్గొన్న ఆ మీటింగ్ లో ఇద్దరం తలో అరగంట మాట్లాడాం.పిల్లల హక్కుల గురించి,బాధ్యతల గురించి,వాళ్ళని వాళ్ళు మేనేజ్ చేసుకోవడం గురించి చెప్పాం.
ఆ తర్వాత మడ అడవుల ప్రయాణం మొదలైంది.మొదట చెట్ల మీద కట్టిన చెక్క వంతెన మీద నడుస్తూ ఆ అడవి అందాన్ని,ఎన్నో జీవరాశుల్ని చూసాం.నత్తలు,పీతలు,జలగలు లాంటి ఎన్నో జీవాలు.నీళ్ళల్లో ఉన్న మంగ్రూవ్ చెట్లు.నల్ల మడ,తెల్ల మడ ఇంకా చాలా రకాలు.ఆ చెట్లలో,ఆ చెక్క వంతెన మీద నడుస్తుంటే కాళ్ళు నేల మీద ఆనడం లేదు.చెట్లెక్కాలని,డాన్సు చెయ్యాలని ఇంకా ఏవో ఊహలు.ఓ అరగంట నడిచి నీళ్ళవేపు వచ్చాం.
దూరంగా గోదావరి ..... గోదారమ్మ నుంచి వెనక్కి వస్తున్న నీళ్ళల్లో అటు ఇటు గోడ కట్టినట్టు మడ అడవి.
ఎండలో ఆకుపచ్చగా మెరిసిపోతున్న చెట్లు.నీళ్ళల్లో వాటి నీడలు.నది మీంచి వస్తున్న గాలికి తలలూపుతూ,మమ్మల్ని చూసి వయ్యారాలు పోతున్న పచ్చటి చెట్లు. వాటి సొగసు చూడతరం కాదు.రెండు చేతుల్ని బార్లా చాపి మొక్కల్ని తాకుతూ గోదారమ్మ వొడిలోకి వెళ్ళిపోవాలన్న కోరికను ఆపుకోవడం కష్టమే.
అసంఖ్యాకమైన పక్షులకి ఆవాసం ఆ ప్రాంతం.మనం ఏ మాత్రం శబ్దం చేసినా గుంపులు గుంపులుగా ఎగురుతూఉంటాయి.అలాంటి ఓ గుంపును మేము చూడగలిగాం.
ప్రశాంతి, నేను ఎంతో పారవశ్యం గా, ప్రేమగా ఆ మడ అడవిని చూసాం. ఆ ప్రకృతి సౌందర్యం మమ్మల్ని ఏవో అలౌకిక లోకాల్లోకి తీసుకెళ్ళిపోయింది.
రెండు రోజులు తన పనులన్నింటిని పక్కన పెట్టి నా కోసమే వచ్చిన ప్రశాంతికి ఈ అపూర్వ సౌందర్యాన్ని చూపించాలని నేను చాలా తపన పడ్డాను.తను నేను ఆశించిన దానికన్నా ఎక్కువ సంబరపడింది.
ఓ మహానందతరంగం మా ఇద్దరిని చుట్టేసింది.
నాలుగంతస్థుల ఓ పోల్ లాంటి దానిమీదకెక్కి ఆ మడ అడవుల్ని,ఆ పచ్చదనాన్ని గుండెల్నిండా నింపుకుని యానాం వేపు మళ్ళిపోయాం.

యానాం లో లంచ్ చేసి అక్కడ ఉప్పొంగుతున్న గోదావరి చూసాం.అక్కడ గోదావరి మీద కట్టిన బ్ర్డ్జిని చూసాం.
ఆ తర్వాత హై సెక్యూరిటి జోన్ ఐన రిలయన్స్ వాళ్ళ క్రిష్ణ గోదావరి గాస్ బేసిన్ చూశాం.గోదావరి లో ఉన్న రిగ్స్,డ్రిల్లింగ్, క్రూడ్ ఆయిల్ వెలికితీత,గాస్ ఎలా విడివడుతుంది మొలైన వివరాలన్ని మాకు చూపించారు.కంట్రోల్ రూంలో కనబడే లైవ్ వీడియోల ద్వారా అక్కడికి దాదాపు నలభై కిలోమీటర్ల దూరం లో ఉన్న కేజి బేసిన్ చిత్రాలు చూసాం.దాదాపు 500 వందల ఎకరాల విస్తీర్ణం లో కేజి బేసిన్ కార్యాలయ సముదాయాలను,వాళ్ళ ఫుడ్ కోర్టులను చూసాం.
ఇక్కడ ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి తప్ప మనసును తాకిన అనుభవమేమి లేదు నావరకు. ప్రశాంతి ఎలా ఫీల్ అయ్యిందో నాకు తెలియదు.కేజి బేసిన్ ఆవరణలో మాకు అన్ని చూపించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పి అప్పటి వరకు మా వెన్నంటి ఉన్న ఆర్ ఐ లక్మి ప్రసన్న, గోపి,సత్తి బాబు(వీరిని ఆర్ డి వో నెహ్రూ మాతొ వచ్చే ఏర్పాటు చేసారు.)గార్లకు థాంక్స్ చెప్పి మేమిద్దరం రాజమండ్రి బయలు దేరాం. ఆ పౌర్ణమి రాత్రి కబుర్ల ప్రవాహం లో కొట్టుకుపోతూ,ఎన్నెన్నో అనుభవాలను పంచుకుంటూ మేము రాజమండ్రి చేరాం.

ఆ మర్నాడు 8 గంటలకి బందరు బయలుదేరా. ఐదు గంటల ప్రయాణం లో మా మధ్య అసంఖ్యాకమైన మాటలు,చర్చలు.జీవితం,జీవితానందం,తాత్విక దృష్టి,స్నేహాలు, ప్రేమలు,ప్రకృతి తో అనుబంధం....ఇలా ఎన్నో చర్చలు.ఈ కలనేత కబుర్ల కలబోత గురించి,అందులోని గాఢత్వం గురించి నేనిక్కడ రాయలేను.
ఎందుకంటే అవి మా ఇద్దరికే సంబంధించిన గాఢానుభూతులు.మా గుండెల్లో ఇంకిపోయిన మధుర స్మృతులు.

బందరు సమీపిస్తుండగా..... చుట్టూ పరుచుకున్న పంటపొలాల,కొబ్బరి తోటల అందాలను మనసారా ఆస్వా
దిస్తుండగా....ప్రశాంతి సంతోషంగా ఒక్క కేక పెట్టింది.అమ్మూ!!!!మంకెనపువ్వులు....ఎన్ని సంవత్సరాలైంది ఈ పూలను చూసి అంటూ మహానందంగా అంది.
సడన్ బ్రేక్ తో మా కారు ఆగింది.ఎర్రటి మంకెన పువ్వులు.పచ్చటి పంట చేలకివతల గట్ల మీద గుత్తులు గుత్తులుగా మంకెన పువ్వులు.ఇంతకాలం మోదుగ పువ్వుల్నే మంకెన పువ్వులనుకున్న నా అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తూ మా ఎదురుగా మంకెనపువ్వులు.కొన్ని పూలు,విత్తనాలు కోసుకుని కారెక్కాం.

ఆ తర్వాత నా మెయిన్ టాస్క్ ప్రశాంతికి కళంకారి బట్ట తయారీ చూపించడం.
బందరు రావాలంటే కళంకారీ చూపించాలని తన సరదా షరతు.చేనేత గ్రామమైన కప్పలదొడ్డిలో నాకు పరిచయాలున్నాయి కాబట్టి తనకి తేలికగానే కలంకారీ తయారీ చూపించగలిగాను.
కార్తీక పౌర్ణమి వల్ల అందరూ కార్తీక స్నానాలకి సముద్రానికి వెళ్ళిపోయినా ఒక చోట మాత్రం పని నడుస్తోంది.
తను వాళ్ళతో చాలా సేపు మాట్లాడగలిగింది. నాకు నేర్పుతారా అని అడిగితే నేర్పిస్తామని చెప్పారు.
కళంకారీ బట్ట తయారీలో ఉన్న విపరీతైమన శ్రమని అర్ధం చేసుకునేలా వాళ్ళు చెప్పారు.సహజ రంగులెలా వస్తాయో చూపించారు.

మేము వాళ్ళతో మాట్లాడుతుండగా సోది చెఫ్ఫే రంగమ్మ అటుగా వచ్చింది.సోదెమ్మలను చూసి ఎన్ని సంవత్సరాలైందో. ఆమెని పిలిచి నేను సోది చెప్పించుకున్నాను.ఏమైనా తలుచుకోమని ఆమె అడిగినా నేను ఏమీ తలుచుకోకుండానే ఆమే ముందు కూర్చున్నాను.ఏమేమో చెప్పింది కానీ నాకేమి అర్ధం కాలేదు.
ప్రశాంతికి చెప్పమంటే చెప్పకుండా ఆమెకు అన్నీ నీ ద్వారానే అవుతాయి,ఆమెకు చెప్పక్కరలేదు అంటూ వెళ్ళిపోయింది. బహుశా ప్రశాంతిని నా కూతురనుకుని ఉంటుంది. మేమిద్దరం బాగా నవ్వుకున్నాం.

కప్పలదొడ్డి లో మాకు అన్ని చూపించిన లోకనాధరావ్ గారికి థాంక్స్ చెప్పి మేము మచిలీపట్టణం బయలుదేరాం.అక్కడ కే. బీ. లక్ష్మి మా కోసం ఎదురు చూస్తోంది.సాయంత్రం ఐదింటికి అవార్డ్ ఫంక్షన్ మొదలై ఎనిమిదికల్లా ముగిసింది.నిజానికి నా మనసు ఇలాంటి వాటి మీద లగ్నం కాదు.వీటిని నేను బడితపూజలని సరదాగా పిలుస్తాను."ఇది నీకు రాష్ట్రవ్యాప్త గుర్తింపు,నీకోసం, నీ గురించి నేను రాసిన ప్రశంశా పత్రం ఫేస్ బుక్ లో పెట్టు" అని లక్ష్మి అంది కానీ దానిని నేను సీరియస్ గా తీసుకోలేదు.

ప్రశాంతి తో కలిసి గడిపిన రెండు రోజుల అనుభవాలను గుండెల్లో భద్రపరిచి,నిండు పున్నమి రేయి,వెన్నెల పాటలు పాడుకుంటూ ఇద్దరం ఇంద్ర బస్సులో హైదరాబాద్ బయలుదేరాం. .
2Like ·  · 

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...