”మేం చదువుకోకూడదా? మేం రోడ్లమీదకు రాకూడదా? మాకు ‘నో’ అనే హక్కు లేదా? ఎవడంటే వాడు నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమను ఒప్పుకుని తీరాలి అని బలవంతపెడితే, మృగంలా ప్రవర్తిస్తే మేము ఒప్పుకు తీరాలా? మా ఇష్టాయిష్టాలకు ప్రమేయం లేదా? మేం ఒప్పుకోకపోతే కత్తులతో పొడవడం, ఆసిడ్ పోసి గాయపర్చడం. వీళ్ళంతా ఏ సంస్కృతికి వారసులు? వీళ్ళకి ప్రేమంటే తెలుసా? ప్రేమంటే ఇదేనా? వీళ్ళని శిక్షించే చట్టమేదీ లేదా?” ఈ ప్రశ్నలను మనం చాలాసార్లు విని వుంటాం. అగ్రికల్చర్ యూనివర్సిటీక్యాంపస్‌లో ఆసిడ్ దాడికి గురై మరణ యాతన అనుభవించిన అనూరాధ, బెంగుళూరులో అలాంటి దాడికే బలైన వందనా పాటిల్. ఈప్రశ్నలను పదే పదే వేస్తూనే వున్నారు. ఒక అయేష, ఒక ప్రత్యూష, ఒక స్వప్నిక, ఒక ప్రణీత-నిండు జీవితాలను ‘ప్రేమ’ అనే క్రూర క్రీడకి బలిపెడుతూనే వున్నారు. ‘ప్రేమ’ ఈ రోజు క్యాన్సర్ కన్నా ప్రమాదకరంగాతయారై ఆడపిల్లల్ని కబళిస్తోంది. ముక్కూ ముఖం లేని స్వప్నిక రూపం, ఉబ్బిపోయి కళ్ళు మూసుకుపోయిన ప్రణీత ముఖాలు మనోఫలకంలోంచి చెదరకుండా పదే పదే కళ్ళముందు కదలాడి కన్నీరు పెట్టిస్తున్నాయి. ఆ కన్నీళ్ళు ఆరకముందే నిందితులు దొరికారన్న వార్త ఎంతో ఊరట కలిగించింది. ఆసిడ్ దాడికి పాల్పడ్డ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో ఘోషించిన వారంతా, వారి అరెస్టుతో ఎంతో ఊరట చెందారు. పోలీసులు చాలా వేగంగా, కేవలం 48 గంటల్లో పట్టుకోగలిగారని ప్రశంసించారు కూడా.
అంబేద్కర్ విగ్రహం దగ్గర మహిళాసంఘాలు తలపెట్టిన ధర్నా మాత్రం కొనసాగాలని నిర్ణయమైంది. అయితే శనివారం ఉదయమే ఎవరో ఫోన్ చేసి ధర్నా కాన్సిల్ అయ్యిందని చెప్పినపుడు, ఏమైంది? ఎందుకు కాన్సిల్ అయ్యింది అని అడిగితే ‘వాళ్ళ ముగ్గురిని ఎన్‌కౌంటర్ చేసేసారు. మీకు తెలియదా? ‘ అని చెప్పారు. వెంటనే టీవీ ఆన్ చేస్తే ఎన్‌కౌంటర్ దృశ్యాలు, ఛానళ్ళ హడావుడి. నిన్న రాత్రి పోలీస్ కస్టడీలో వున్న వాళ్ళు పొద్దున్నే ఎదురుకాల్పుల్లో చనిపోవడం, గుట్టల్లో శవాలు పడి వుండడం, శవాల చేతుల్లో తుపాకులు, కత్తులు వుండడం. నమ్మశక్యంగాని దృశ్యాలు. నిందితుల్ని శిక్షించడమంటే చంపి వేయడమా? నిన్నటి ఆవేశం, కోపం స్థానంలో క్రమంగా ఆవేదన, భయం ప్రవేశించాయి. పోలీస్ కస్టడీలో వున్న వాళ్ళకి ఆయుధాలెలా వచ్చాయనే ప్రశ్న బుర్రలోంచి పోనంటూ వేధించసాగింది.
చేతివేళ్ళు ఛానళ్ళను యా౦త్రికంగా నొక్కుతున్నాయి. టీవీలో దృశ్యాలు మారుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో నిందితులను చంపేయడాన్ని పండగలా జరుగుకుంటున్న క్యాంపస్ విద్యార్థులు . టపాకాయలు కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న మరి కొందరు. పోలీసులు చాలా మంచి పని చేసారని ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపిస్తున్న వాళ్ళు. తేనె పూసిన కత్తిలాంటి నవ్వుతో అభినందనల్ని స్వీకరిస్తున్న ఉన్నత పోలీసు అధికారి. ఆడపిల్లలు అందిస్తున్న పువ్వుల బొకేలని గర్వంగా అందుకుంటూ, టీవీలకు ఫోజులిస్తున్న ఆ అధికారిని చూస్తుంటే నా వొళ్ళంతా జలదరించింది. మూడు ప్రాణాల్ని తూటాలకు బలిచ్చిన అతని ముఖంలోని ఆ నవ్వుని నేను ఈ జన్మకి మర్చిపోలేననుకుంటాను.
దృశ్యం మారింది. టీవీ యా౦కర్ల రిపోర్టర్ల వికృత చర్యలు. హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్న వాళ్ళ ముఖాల దగ్గర, వాళ్ళ బంధువుల ముఖాల వద్ద మైక్‌లు పెట్టి మీరేమనుకుంటున్నారు? ఎన్‌కౌంటర్ మీకు సంతోషాన్నిచ్చిందా? తూటాలకు బలివ్వడం బావుందా? లేదావాళ్ళని యాసిడ్ పోసి చంపి వుండాల్సిందని మీరు భావిస్తున్నారా? ఈ అంశంపై ఎస్.ఎమ్.ఎస్‌లు చేయండి. మీ అభిప్రాయం చెప్పండి. నోరు విప్పి సరిగా మాట్లాడలేక పోతున్న ప్రణీత నోట్లో మైకు కుక్కి మాట్లాడించిన ఈ భయానక, బీభత్స, జుగుప్సాకర దృశ్యాలను చూడాల్సి రావడం ఎంత బాధాకరం. అతి తీవ్రంగా గాయపడి, వైద్యం పొందుతున్న ఆ పిల్లల దగ్గరికి ఈ టీివీ రిపోర్టర్లను ఎలా అనుమతిస్తున్నారో ఎంతకీ అర్ధం కాని ప్రశ్న. టీవీలలో నడుస్తున్న ఈ అమానవీయ దృశ్యాలు మనసును ఎంత బండ బారుస్తున్నాయె, సున్నితంగా స్పందించడం అంటే ఏమిటో మర్చిపోయేలా తయారు చేస్తున్నాయె చూస్తుంటే, మీడియా మహా విశ్వరూపం వెన్నులోంచి చలి పుట్టిస్తోంది.
వరుసగా జరుగుతున్న సంఘటనలు మనసు మీద తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. అమ్మాయిల మీద జరిగిన పాశవిక దాడి, పదే పదే పునరావృతమౌతున్న సంఘటనలు, పువ్వుల్లాంటి పిల్లల ముఖాలు మాడి మసి బారిపోయిన దృశ్యాలు, దోషుల్ని శిక్షించమని కోరిన జనాగ్రహాన్ని తెలివిగా తమ వేపు మళ్ళించుకుని ఏకంగా ప్రాణాలే తీసేసిన పోలీసుల క్రూరత్వం. దీన్నంతా పంచరంగుల సినిమాలా జనం మెదళ్ళలోకి రీళ్ళు రీళ్ళుగా పంపిస్తున్న మీడియా.
ఏం జరుగుతోందసలు? మనం ఎటువెళుతున్నాం? అసలు విషయలను గాలికొదిలేసి, వేరుకు పట్టిన చీడనొదిలేసి పైపైన పాకుతున్న పురుగుల్ని చీదరించుకుంటే ఏం లాభం? ‘మహిళా సాధికారత’ అంటే పావలా వడ్డీ అనుకునే చోట, మహిళల మీద పెరుగుతున్న నేరాలకు కారణాలను అన్వేషిించకుండా, ఆ నేరాలను అరికట్టే చర్యల్ని ఆదిలోనే తీసుకోకుండా, ఇంటా బయటా హోరుగాలిలో దీపంలా రెప రెపలాడుతున్న స్త్రీల జీవితాలను ఆసిడ్‌లకు, కిరోసిన్‌లకు, కిరాతకాలకు బలిస్తున్న చోట ఇలాగే, ఇంత బీభత్సంగానే వుంటుంది. స్త్రీ, పురుషుల సమానత్వం అనే మాట మచ్చుక్కూడా వినబడని, ఆలోచనల్లో, దృక్పధాల్లో మార్పుకోసం ఉద్యమ స్పూర్తిని నింపని రాజకీయ కలుషిత వాతావరణంలో ఇలాంటి దృశ్యాలనే చూడాల్సి వుంటుంది. మాకు హక్కుల్లేవా? అంటూ ఆడపిల్లలు అరుస్తూ బలవుతూనే వుంటారు.
6 comments:
"నో" అనే హక్కు లేదని ఎవరన్నారు? హక్కు ఉంది. కానీ ‘ఆ హక్కుని సాధికారకంగా ఉపయోగించుకుంటే పర్యవసానం ఇంత దారుణంగా ఉంటుంది’, అని మాత్రమే ఈ ఘటనల నేపధ్యంలో మగజాత్యాహంకారం నిరూపిస్తోంది.
మీరు చెప్పే మార్పురావాలంటే మన సమాజం fundamental గా మారాలి.
abba vini vini bore.........blogs chadavaka mundu...ladies meeda manchi opinion i had....but after eppudu choosina maga vadne satru vuga choostunna vaallantae ne .....abbo........enduku artham chesukoru alanti vaallu 2 sides vunnaru ani mukhyam ga manam manushyalam....ani...matladite aada maga ani ..divide chestaaru ..daaniki taggattu ga..kontamandi redeega kaachukoni vuntaru veellendoo potu gallu ayinattu...........
ఆవేశరహితంగా ఆలోచిస్తే, పరిస్థితులు చాలానే మారాయి... ఇప్పుడు ఉన్నత విద్యను అభ్యసించిన యువతులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు, నచ్చినట్టు జీవితం గడపగలుగుతున్నారు (తమ తెలివిని బట్టి). చదువు, ఆర్థిక స్థోమత లేని వారి పరిస్థితులు ఎక్కువగా మారకపోవచ్చు. పత్రికలు, టీవీల్లో చూపించేవన్నీ పూర్తిగా నిజాలు కావు, వార్తలు - విశేషాలు రీసెర్చి పేపర్లు కావు.
కష్టాలు, కన్నీళ్ళు అసలే లేని వర్గం అంటూ ఒకటి లేనే లేదు...!
ఇటువంటి సంఘటనలు జరిగినపుడు మీడియా చేసే అతిని నియంత్రించే రూల్స్ వుండాలని నాకూ అనిపిస్తుంది. మ్రుత్యువు తో పోరడుతున్నవాళ్ళ నోట్లో మైక్ కుక్కి వీరి ఆలోచనలనే వారి మాటలుగా ప్రచారం చేస్తారు. జరిగిన దారుణాన్ని వెనకాల పదే పదే చూపెడుతూ ముందు చర్చలు పెడతారు. కనీసం చర్చ ఏమిటో విందామన్నా వీరు గంటల తరబడి చూపించే ఆ ఘోర దృస్యాలు చూళ్ళేక చానెల్ మార్చాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడా అదే రిపీట్ అవుతుంది.
చాలా సున్నితంగా స్పృశించారు అమ్మాయిల మీద జరుగుతున్న దాడులను, ఆ పై మీడియా అత్యుత్సాహాన్నీ. నా అలోచన ప్రకారం ఇలా దాడి చేయాలనే ఆలొచన సినిమాల్లో చేసేవి చూసి చూసి అలవాటు అవుతున్నట్లుంది. అలాంటివి చూపించే సినిమాలను కూడా సెన్సార్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంక చానెల్స్ విషయంలో మరి ఎం చేస్తే బాగుంటుందో మరి?
సత్యవతిగారు మీ అభిప్రాయంతో నేను కూడ ఏకిభవిస్తాను. ఎన్ కౌంటర్ చేసినంతా యాసిడ్ దాడులు తగ్గవని మళ్ళిమళ్ళీ రుజువవుతున్నది. యువత మెదల్లను పాడుచేస్తున్న సినిమాలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఎడ్యుకేషన్ విదానంలో మార్పు తిసుకురావలి.మహిళలను గౌరవంగా చుసేవిదంగా చిన్నప్పటి నుంచే మగపిల్లలకు నేర్పించాలి
Post a Comment