Tuesday, February 5, 2008

'గుంట'గుండె చప్పుడు

కొండవీటి సత్యవతి


అమ్మా ! ఓ అమ్మా!
నన్ను మగ్గం కేసి అలా వొత్తియ్యకే
నేను నలిగిపోతున్నానే.

నువ్వు సగం గుంటలో కూర్చుని
మగ్గం నేస్తుంటే
నీ పొట్ట పలకకి ఆనుతుంటే
నీ లోపల నేను
గిల గిల లాడిపోతున్నాను
గుక్క తిప్పుకోలేకపోతున్నాను
నీ పొట్టలో నేను పెరుగుతున్నాను.

నువ్వేమో నన్ను మర్చిపోయి
నీ పొట్ట కూటి కోసం తిప్పలు పడుతున్నావు
నాకు తెలుసమ్మా నీ గుండె కోత
నాకేమైనా జరిగితే
నీకు కడుపుకోతకూడా తోడౌతుందికదా!

అందరు అమ్మల్లాగా
నీకు శెలవెందుకు దొరకదే!
నాకు ఆరునెలలొస్తున్నాయి
నువ్వింకా నేస్తున్నావు
నూలుపోగుకు నన్ను ఉరేస్తున్నావు
నీ పొట్టనలా మగ్గానికి అదిమెయ్యకే
నాకు గుండెనొప్పి వస్తున్నట్టుగా వుంది
నీ చేతుల చురుకైన కదలికలు
నా గుండె కదలికల్ని ఆపేసేట్టున్నాయి
నీకు చేతులెత్తి మొక్కుతాను

నా గొంతునలా నొక్కెయ్యకే
నువ్వు చీరనే తీక్షణంగా చూస్తావ్‌గానీ
నా వేపు కూడాఒకసారి చూడవే మాయవ్మ!
ఏలికలారా! నా మొర ఆలకించరా
మా అమ్మకి విశ్రాంతి నీయరా!
అందరి పొట్టలు నింపడం కోసం
అమ్మ నా ప్రాణంతో చెలగాటమాడుతోంది
నేను నేతమ్మ కడుపున పడినందుకే కదా
పుట్టకుండానే నాకిన్ని కష్టాలు
అమ్మా! అమ్మా! నీకాళ్ళనలా ఆడించకే
నా ఊపిరి బిగుసుకుపోతోంది
నా ప్రాణం జిల్లార్చుకుపోతోంది

అమ్మా!గుంటలోంచి పైకి రావే
నాకు ప్రాణ భిక్షపెట్టవే
అమ్మా!నన్ను బతకనీయవే
నీ కాళ్ళకు మొక్కుతాను
నన్ను మీ ప్రపంచంలోకి రానీయవే!
(ఐదునెలల గర్భంతో కూడా నేతగుంటలో కూర్చుని నేత నెయ్యక తప్పదని ఓ నేతక్క చెప్పింది విని, కన్ను చెమర్చినపుడు రాసిన కవిత)

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...