Sunday, August 26, 2007

గుండె చెరువౌతోంది మిత్రులారా!
మతమౌఢ్యం,మతవాదాల రూపమింత భయానకమా?


మన బతుకులింక వేయి పడగల మతమౌడ్య్లుల పడగ నీడల్లోనేనా?
అయ్యో!మనం 21 వ శతాబ్దంలోనే బతుకుతున్నామా!


నిన్న ఆ భయానక,బీభత్స సంఘటన జరగడానికి పది నిమిషాల ముందు నేను, పిఓడబ్ల్యూ సంధ్య,సుజాత,ఇంకో అమ్మాయి కలిసి విశాఖ గిరిజన స్త్ర్రీల పై అత్యాచారాల విషయమై జరిగిన సమావేశంలో పాల్గొని ముఖ్య మంత్రి కి మెమొరాండం ఇవ్వడానికి వెళ్ళేం.మేము ఆ రోడ్డు దాటిన పది నిముషాలకి బాంబు దాడి జరగడం,అందమైన లుంబిని పార్క్ బుద్ధుడి సాక్షిగా రక్తసిక్తమైపోయింది.అమాయక ప్రాణాలు మత మౌఢ్యానికి బలై పోయాయి.
కళ్ళ వెంబడి రక్తాశ్రువులు ధార కడుతున్నాయి. గుండెను పిండేసే ఆ బీభత్స ద్రుశ్యాలను చూసి చూసి మెదడు స్తంభించిపోయింది.
ఉదయమే పేపర్ ముట్టుకుంటే చేతులకంటిన నెత్తురు ఎంత కడుక్కున్నా,ఏ సబ్బులేసి తోముకున్నా వదలడం లేదు.ఆ నెత్తుటి చేతులతో తిండి సహించక,పడుకుంటే నిద్ర రాక పీడ కలలు
పగలు కూడ పీడిస్తున్నాయి.
అయ్యో! ఇది నాగరిక సమాజమా?
మతం పేరు మీద ఎన్ని కోట్ల మంది బలవ్వాలి?
క్షతగాత్రుల్ని చూస్తుంటే గుండె చెరువై కళ్ళళ్ళోంచి ఉప్పెనలా
దుఖం తన్నుకొస్తోంది.
ఈ బాధకి మందేమిటి?

Friday, August 17, 2007







ఒక్కటి కాదు రెండు కాదు
ఐదు బ్రహ్మ కమలాలు


నిన్న రాత్రి మా ఇంట్లో ఒక్కటి కాదు రెండు కాదు ఐదు బ్రహ్మ
కమలాలు/వెన్నెల పుష్పాలు పరిమళాలు వెదజల్లుతూ
ఒకేసారి పూసాయి.అబ్బ! అంత ఘాటైన పరిమళం ఏ పువ్వు నుంచి వెలువడ్డం చూడలేదు.మీకోసం కొన్ని ఫోటోలు పంపుతున్నాను.

Wednesday, August 15, 2007




ఖుషీ కా దిన్
జగనే కీ రాత్

హమ్మో! ఎన్ని నీళ్ళో
ఆకాశం లోంచి అంచెలంచెలుగా జారి
భూమిలో కి ఇంకుతున్నాయి
సాగర్ కాదది ఆనంద సాగరం
ఇరవై గేట్లు గుండెలు తెరుచుకుని
పాలనురుగుల్లాంటి ప్రేమ పానీయాన్ని ఒంపుతున్నాయ్
మెగా డాం ముందు
మరుగుజ్జుల్లా,మంత్ర ముగ్దల్లా
నువ్వూ,నేనూ
అదేంటో మరి అదేం చిత్రమో మరి
నువ్వూ నేనూ పాపికొండలు చూసి
పరవశించాలని వెళితే
గోదారమ్మ తన చుట్టూ
ఎత్తైన పచ్చదనాన్ని పరిచి
ముత్యాల ధారల్లాంటి వర్షంలో
వరదగోదారి అవతారమెత్తి
తానే పులకించిపోయింది గుర్తుందా నేస్తం!
అలాగే క్రిష్ణమ్మ కూడా
మనం సాగర్లో అడుగుపెట్టామని
ఎలా తెలుసుకుందో ఏమిటో
శ్రీ శైలం గేట్లను బద్దలు కొట్టుకుని
ఉవ్వెత్తున ఎగిసి పడుతూ
మనల్ని నిలువెల్లా తన్మయంలో ముంచేసింది
ఏభై మూడులొ నేనూ
నలభై ఆరులో నువ్వూ
పదేళ్ళ పిల్లకాయల్లోకి
పరకాయ ప్రవేశం చేసి
ఉల్లాసంలో ,ఉద్వేగంలో
ఒక ఉన్మాదంలో కొట్టుకుపోయాం
గంటల్ని క్షణాల్లా కరిగించేసి
అన్నం కూడా నీళ్ళల్లోనే ఆరగించేసి
ఎడారుల్లో బతికే వాళ్ళల్లా
నీళ్ళను కావలించుక్కూర్చున్నాం
ఆత్మీయ నేస్తాన్ని వాటేసుకున్నట్టు
అచ్చంగా నీళ్ళను హత్తుకుని కూర్చున్నాం
కెరటాలు కెరటాలుగా క్రిష్ణమ్మ ఉరికొచ్చి
మనల్ని ముంచేసినపుడు
చేతులు బార్లా చాచి
అలల రాశుల్ని గుండెల్లోకి ఒంపుకున్నాం
మబ్బులతో పోటీ పడుతున్న
నురుగుల ధవళ వర్ణం
మనల్కి తాకాలనే ప్రయత్నంలో
క్రిష్ణమ్మ కరిగి నీరై
మన కళ్ళల్లో ఆనందభాష్పాలైంది
మన పారవశ్యానికి సమస్త ప్రక్రుతి పరవసించిందో
మనమే ప్రక్రుతిలో మమేకమై మెరుపుల్లా మెరిసిపోయామో
ఐదు గంటలు అచ్చంగా నీళ్ళనే వాటేసుకుని
ఉద్విగ్నంగా ఒకర్నొకరం కలేసుకుని
నవ్వుల్ని పువ్వుల్లా నీళ్ళలోకి వదులుతూ
కేరింతలు,తుళ్ళింతలు
సంగీత కచేరీలు,సంతోష తరంగాలు
గులకరాళ్ళను విసరడాలు
ఎగిరొచ్చిన నీళ్ళ ముత్యాలు వొళ్ళంతా తాకుతుంటే
ముసు ముసి నవ్వుల మురిపాలు
అన్ని గంటల గాఢాలింగనంలో కూడా
తనివి తీరని వెదుకులాట
ఒదల్లేక ఒదల్లేక ఒడ్డుకొచ్చాం
ఆ రోజు......
నువ్వూ నేనూ క్రిష్ణమ్మ సాక్షిగా
సాగర్ డాం అంత ఉత్తుంగంగా ఎదిగిన
మన స్నేహాన్ని సెలబ్రేట్ చేసాం
మనకి ఖుషీ కా దిన్ అయిన ఆరోజే
జగనేకీ రాత్ కూడా అయ్యింది.

(శనివారం రోజు సాగర్ డాం లోంచి ఉరకలెత్తిన క్రిష్ణమ్మని
చూసి, ఆ అనుభవాన్ని ఆత్మీయ నేస్తంతో పంచుకున్న తన్మయంలోంచి)

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...