Monday, December 25, 2023

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు

............

మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నారు. మా తాత ఇన్ని పొలాలను ఎలా సంపాదించాడనేది నాకు చాలా కుతూహలంగా  ఉండేది. మా ఊర్లో మా కుటుంబమే ఎక్కువ పొలాలను కలిగి ఉండేది. ఆ పొలంలో చేయడానికి దళితవాడ లోని దళితులు పనిచేస్తూ ఉండేవారు.

 పొలాల్లో పని చేసే వారికి జీతాలు ఇచ్చేవారో, ధాన్యం ఇచ్చేవారో నాకు సరిగా తెలియదు. నా చిన్నప్పుడు ఈ విషయాలు పెద్దగా అర్థమయ్యేవి కాదు. మా ఇంటి చుట్టూ ఉన్న చాలా కుటుంబాల వారు వారి పొలాలను, మా తాతకు వదిలేసి గ్రామం వదిలి వెళ్ళిపోయారు. అలా ఎందుకు వెళ్లిపోయారో అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. అయితే మా తాత దగ్గర  అప్పులు చేసి తీర్చలేక పొలాలు ఇచ్చి వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది. లేకపోతే అన్ని పొలాలు మా తాత ఎట్లా

 కొనగలిగి ఉంటాడు. ఇది ఒక విషయం అయితే ఇంకొక విషయం మా ఇంటికి కుటుంబం అందరికీ ఇంటి చాకలి, ఇంటి మంగలి, ఇంటి వడ్రంగి, ఇంటి పాలేర్లు ఉండేవారు. మీరంతా కూడా మా

 మా కుటుంబం కోసం పనిచేస్తూ ఉండేవారు. అలాగే ఇంటి పూజారి ఒక ఆయన ఉండేవాడు .కుటుంబంలోని పెళ్ళిళ్ళకి, చావులకి, పండగలకి ఆయనే వచ్చి పూజలు చేసేవాడు. చాలా పెద్ద కుటుంబం అవడం వల్ల ఎన్నో తరాల పెద్దవాళ్లు చనిపోయిన తేదీలను ఈయన గుర్తుపెట్టుకుని 

 చనిపోయిన వారి తేదీలను గుర్తు చేసి ఇంటికి వచ్చి బియ్యం కూరగాయలు ఇంకా చాలా వస్తువులు తీసుకెళ్తూ ఉండేవాడు. దాదాపు నెలలో  చాలాసార్లు ఈ కార్యక్రమాలు  కుటుంబంలో చనిపోయిన వారి పేరు మీద జరిగేవి.

 ఈయన వచ్చినప్పుడు పెద్ద పెద్ద మూటలు కట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి పోయేవాడు.

 బహుశా ఆయన ఏమీ పని చేయకుండానే నెలకు సరిపడా వస్తువులన్నీ ఇలా కొన్ని కుటుంబాల నుంచి ఫ్రీ గా వచ్చి పడుతుండేవి. ఈ తద్దినాలు, సంవత్సరీకాలు, ఆబ్దికాలు ఇవన్నీ కూడా  ఇంటి పూజారులు హాయిగా బతకడానికి ఏర్పాటై ఒక శాశ్వతమైన ఏర్పాటుగా ఉండిపోయింది. ఇప్పటికీ మా ఊర్లో  ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది.

అయితే ఇంటి చాకలికి, ఇంటి మంగలికి, ఇంటికి బట్టలు అందించే చేనేత కార్మికునికి, బట్టలు కుట్టే దర్జీకి, వ్యవసాయ పనిముట్లు చేసిపెట్టే వడ్రంగికి, ఇలాంటి ఫ్రీ ఏర్పాట్లు ఏమి ఎప్పుడూ లేవు. వాళ్లు పని చేసుకోవాలి రోజంతా శ్రమ చేయాలి ఆ శ్రమ చేసిన దానికి ఎంతో కొంత కూలి ఉంటుంది అంతే. అది తప్ప వారికి ఇలాంటి శాశ్వతమైన ఉచిత ఏర్పాటు ఏది ఉండదు. వారు అనారోగ్యం పాలై పనిచేయలేకపోయినా, పని మానేసినా వారి ఆర్థిక పరిస్థితి దిగజారి పోతుంది.  ఎంతో సేవ చేసి రోజంతా తన శ్రమతో కష్టపడే మిగిలిన వారు ఎవరికి ఇంటి పూజారికి దక్కిన ఉచిత సరఫరాలు లాంటివి ఏమీ లేవు.

 ఇదంతా చూస్తూనే పెరిగాను కానీ అప్పుడు నాకు అర్థమవ్వలేదు. ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే ఎలాంటి శ్రమ చేయకుండా కొన్ని తంతులను, కొన్ని క్రతువులను ఏర్పాటు చేసి  పూజారి వర్గం ఎలాంటి శ్రమ చేయకుండా సుఖంగా, సునాయాసంగా బ్రతకగలిగితే, 

రెక్కలు ముక్కలు చేసుకునే శ్రామికులు పనిచేస్తే తప్ప కడుపు నిండని దుర్భర పరిస్థితులు.

 నేను ఇప్పుడు ఈ విషయం మాట్లాడితే బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా ముద్ర వేసి నామీద ఒంటి కాలు మీద లేస్తారని తెలుసు కానీ మా తమ్ముడు మా అమ్మ నాన్న

 నాన్నల పేర్ల మీద ఇప్పటికీ ఇంటి పూజారికి కూరగాయలు, బియ్యం, పండ్లు ఇస్తామని చెప్పినప్పుడు ఇంకా ఈ వ్యవహారం జరుగుతున్నట్టు నాకు అర్థమైంది. 

అంటే మా కుటుంబంలో ఇప్పటికి చనిపోయిన వారు దాదాపు 100 మంది ఉంటారు. పెద నాన్నలు, పెద్దమ్మలు, చిన్నాన్న, చిన్నమ్మలు తాతలు, నానమ్మలు

 ఉన్నారు.

 అంటే ప్రతిరోజు మా కుటుంబంలో ఎవరో ఒకరు ఇంటి పూజారికి పైన పేర్కొన్న వస్తువులన్నీ ఇస్తూనే ఉన్నారు. వారు కష్టపడాల్సిన పని ఏంటి? హాయిగా కాలు మీద కాలేసుకుని ఉచితంగా వస్తున్న ఈ వస్తువులన్నింటినీ ఆరగిస్తూ బతికేయొచ్చు. మరి మా ఇంట్లో ఎంతో చాకిరీ చేసిన శ్రామికులు, వాళ్ళ పరిస్థితి ఏంటి.  వాళ్ళని పిలిచి ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చనిపోయి ఉండొచ్చు. పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళ కుటుంబాలు పెద్దగా మార్పు చెందకుండానే ఉండిపోయి ఉండొచ్చు. కానీ వారికి ఉచితంగా ఏది దొరకదు ఆ పెద్ద వయసులో కూడా కష్టపడాల్సిందే పనికి వెళ్లాల్సిందే.


 సింపుల్ దీనిని విశ్లేషిస్తే చాతుర్వర్ణ వ్యవస్థ, నిచ్చెన మెట్ల వ్యవస్థ ఎందుకు ఎవరికోసం ఎవరి ప్రయోజనం కోసం ఏర్పడిందో ఠక్కున చెప్పొచ్చు. ఆధునిక కాలంలో కూడా ఎన్నో గుళ్లను కట్టి ఈ పూజారి వర్గాన్ని ప్రజలు ఉచితంగా పోషిస్తూనే ఉన్నారు. ఎవరికీ ఒళ్ళొంచి శ్రమ చేయాల్సిన అవసరం లేకుండా అన్ని ఆమిరిపోతుంటాయి.


 పొలంలో పనిచేసే వాళ్లు, రోడ్లు ఊడ్చేవారు, అన్ని రకాల శ్రమలు చేసి కడుపు నింపుకునే మనుషులు ఒక పక్కనుంటే  ఏ పని చేయకుండా మంత్రాలను చదువుతూ కడుపు నింపుకొనే శ్రమ చేయని మనుషులు ఒకపక్క.

 మత క్రతువులన్నీ ఏ వర్గం కోసం, ఏ వర్గం సుఖంగా, శ్రమ లేకుండా బతకడం కోసం సృష్టించబడ్డాయో  అర్థమవుతుంది కదా.

 ఇది నా అనుభవం నుంచి రాసిన విషయం తప్ప మా కుటుంబంలో చూసిన అంశం తప్ప ఇక్కడ నేను ఏది ఊహించి రాయలేదు.

 ఈరోజు ఒక బ్లాగులో పితృదేవతల కోసం నగరాల్లో కూడా గుడుల్లో పూజారులకి బియ్యం, కూరగాయలు ఇచ్చామని చదివినప్పుడు ఇవన్నీ  ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇలాగే కొనసాగుతున్నాయని  అర్థమైంది.

చనిపోయి, మట్టిలో కలిసిపోయిన వారికి తర్పణాలు చెయ్యకపోతే త్రిశంకు స్వర్గంలో వేళ్ళాడతారనే భయాన్ని ఇంజక్ట్ చేసి పబ్బం గడుపుకునే ఈ దుష్ట తంతులంటే అందుకే నాకు ఒళ్ళు మంట.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...