Tuesday, September 12, 2017

రేపటి కల


 -కొండవీటి సత్యవతి


హాలంతా చప్పట్లతో మారుమోగుతుంటే అశ్విని నిటారుగా నడుస్తూ స్టేజిమీదకు వెళ్ళింది. ”యువనాయకురాలు” పురస్కారం స్వీకరించింది. మరోసారి చప్పట్లు… ఆగకుండా. ముందు వరుసలో కూర్చున్న అనన్య కళ్ళల్లో నీళ్ళుబికాయి. కన్నీళ్ళ మధ్య అశ్విని ముఖం మసకబారినట్లయింది. జర్నలిస్టుగా తాను సాధించిన విజయాల్లో అశ్విని కథ చాలా గొప్పది.
‘అశ్విని విజయం వెనక స్ఫూర్తి ప్రదాత అనన్య స్టేజి మీదకు రావాలి’ ప్రకటన విని ఒక్క ఉదుటున లేచి స్టేజి మీదకు వెళ్ళి అశ్వినిని గట్టిగా హత్తుకుని అభినందించింది. కెమెరాలు క్లిక్‌క్లిక్‌మంటూ ఫ్లాష్‌లైట్లు వెలిగించాయి. తనకిచ్చిన మెమొంటోను తీసుకుంటూ ‘అశ్విని గురించి రెండు మాటలు చెప్పాలని ఉంది. మహబూబ్‌నగర్‌లో ఒక మారుమూల గ్రామంలో మొదటిసారి తనను చూసాను. నా వృత్తిలో భాగంగా ఒక స్టోరీ కోసం ఆ గ్రామానికి వెళ్ళినపుడు, నా పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చేస్తున్నపుడు అశ్విని తమ్ముడ్ని చంకనేసుకుని నా దగ్గరకొచ్చింది. చింపిరి జుత్తు, సన్నగా, రివటలాగా ఉంది.’
‘మేడమ్‌! మేం ఏం చెప్పినా మీరు పేపర్లో రాస్తారా’ అని అడిగింది.
‘అవును.. రాస్తాను. నేను జర్నలిస్టును. అంటే పేపర్‌లో రాసే ఉద్యోగం నాది. ఏమైనా చెబుతావా?’ అన్నాను.
‘మేడమ్‌! వచ్చే వారం మావోళ్ళు నాకు పెండ్లి చేయాలనుకుంటుడ్రు. నాకేమో సదువుకోవాలని ఉంది’ అని అంది.
‘నీకు పెళ్ళా! నీ వయసెంత?’
‘పధ్నాలుగు… ఏడు వరకు చదువుకున్నా. ఈడి కోసం చదువు మానిపించి, ఇప్పుడు పెళ్ళంటోంది మాయమ్మ’
ఆ మాట విని వెళ్ళిపోతున్నదాన్ని ఆగిపోయాను. ఆ ఊరిలో చెలరేగిన అంటువ్యాధుల గురించి రాయాలని వెళ్ళిన నేను అశ్విని మాటలతో మళ్ళీ వెనక్కు వచ్చాను.
‘మీ అమ్మ ఎక్కడ?’
‘పనికాడికి బోయింది.’
‘మీ నాయన?’
‘లేడు… సచ్చిపోయిండు.’
ఉస్సూరంటూ ఒక చెట్టు కింద కూర్చుండిపోయాను. ఏం చేయాలి?
”అలాంటి అశ్విని ఈ రోజు యంగ్‌ అచీవర్‌ అవార్డు తీసుకుంది. షి ఈజ్‌ ఎ ఫైటర్‌. తను చైతన్యవంతురాలై ఎంతోమంది తనలాంటి వాళ్ళకి ఆదర్శంగా నిలిచింది. టెన్త్‌ పూర్తి చేసింది. థాంక్యూ… నిర్వాహకులకు ధన్యవాదాలు” అంటూ అనన్య అశ్వినితో సహా స్టేజి దిగిపోయింది.
***********
అనన్య అశ్విని మాటల్ని సీరియస్‌గా తీసుకుంది. ఆరోగ్య సమస్యలు సరే… బాల్య వివాహాల మీద ఓ కథనం రాస్తే ఎలా
ఉంటుందా అని ఆలోచించింది. ముందు ఆ పిల్ల పెళ్ళి ఎలా తప్పించాలా అని ఆలోచనలో ఛైల్డ్‌ లైన్‌లో పనిచేసే తన ఫ్రెండ్‌ మాధురికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది.

”ఆ గ్రామాల్లో అంతే.. పధ్నాలుగు పదిహేనేళ్ళకే పెళ్ళిళ్ళు చేసేస్తారు. మేము వెళ్ళి ఆపినా, మళ్ళీ ఎప్పుడో చేసేస్తారు” అంది తేలిగ్గా తీసుకుంటూ.
”కరక్టే. నాకూ తెలుసు ఆ విషయం. కానీ అశ్విని చాలా ధైర్యంగా వచ్చి నాతో విషయం చెప్పింది. పెళ్ళి ఆపమని అడిగింది. ఆ పిల్ల ధైర్యం నాకు నచ్చింది.”
”సరే నేను మా టీమ్‌ని పంపిస్తాలే” అంటూ ఫోన్‌ పెట్టేసింది.
*********
ఆ రాత్రి అనన్యకి నిద్ర పట్టలేదు. అశ్విని కళ్ళల్లో మెదులుతోంది. ఎంత బలహీనంగా ఉంది. పెళ్ళి చేస్తే, ఆ వెంటనే వచ్చే గర్భంతో… ఊహించలేకపోయింది. ఏదో ఒకటి చెయ్యాలి… ఈ ఆలోచనలతో తను రాయాల్సిన రిపోర్టును రాయలేకపోయింది. మర్నాడు అశ్విని వాళ్ళ గ్రామానికి బయలుదేరింది. వాళ్ళమ్మ పనికి వెళ్ళకముందే ఆమెను కలవాలి, మాట్లాడాలి. తేలికగానే ఇల్లు కనుక్కుంది. అశ్విని తల్లి ఇంట్లోనే ఉంది. ఒక్కటే గది, చిన్న వంటగది…
”ఎవరు నువ్వు? ఏం కావాలి?”
”అశ్విని లేదా?”
”ఎందుకు? బయటికి పోయింది.”
”మీతో మాట్లాడాలి”
”ఏం మాట్లాడాలి.? ఎవరు మీరసలు” అనుమానంగా చూసింది. ఆమె కూడా ఎముకల పోగులాగా ఉంది. వొంట్లో ఇంత కండ కూడా కనబడ్డం లేదు.
ఒక చంకలో తమ్ముడు, మరో చేత్తో కల్లు సీసాతో అశ్విని ఇంట్లో కొచ్చింది.
”మేడం మీరా! మళ్ళీ వచ్చారా?”
కల్లు సీసా లాక్కుని ”ఎవలే? ఎందుకొచ్చింది మనింటికి” కూతురుతో కల్లు సీసా తెప్పించుకున్న ఆ తల్లిని చూసి అనన్యకి నోట మాట రాలేదు.
”ఎల్లుండ్రి.. నే పనికి పోవాల”
”మీ కూతురికి పెళ్ళి చేస్తున్నారంట కదా! చిన్న పిల్ల అపుడే పెళ్ళేంటి?”
”ఎవరు చెప్పారు? పెళ్ళీ లేదు గిళ్ళీ లేదు. ఎళ్ళండి” కరకుగా అంది.
”ఈ వయసు పిల్లకి పెళ్ళి చేస్తే జైల్లో పెడతారు తెలుసా?”
”నా పిల్ల నా ఇష్టం. ఎల్లండింక” విసురుగా అంటూ కల్లు తాగసాగింది. అది తాగి పనికెళ్ళుతుందా?
అశ్విని అయోమయంగా చూస్తూ నిలబడింది. ఇంకిప్పుడు ఆమెతో ఏమీ మాట్లాడలేనని అనన్య బయటకొచ్చింది. అశ్విని రాబోయింది.
”ఏడకి పోతున్నావ్‌.. ఆగ్కడ” అంటూ అరిచింది. అశ్విని ఆ మాటలేమీ పట్టించుకోకుండా అనన్య వెనకాలే బయటికి వచ్చింది. ఎదురుగా ఉన్న వేపచెట్టు కింద కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు చేరారు. అందరిముందు కల్లు సీసాలు… పట్టపగలు, పిల్లలముందే తాగుతున్నారు.
”ఏంటిది? రోజూ ఇంతేనా?”
”అంతే మేడమ్‌.”
అనన్యకి దిమ్మతిరిగినట్లయింది. ఊరినిండా అంటువ్యాధులు, అంటురోగాలు, ఇలా తాగుతుంటే… అది నిజంగా కల్లేనా? ఈ చుట్టుపక్కల తాటి చెట్లే లేవు. అంత కల్లు ఎక్కడినుంచి వస్తోంది. జర్నలిస్టు బుర్ర చకచకా ఆలోచిస్తోంది.
”మేడమ్‌… నా పెళ్ళి ఆపుతారా?”
కల్లు సీసాల మీంచి కళ్ళను మళ్ళించి అశ్విని వైపు చూసింది.
”ఒక్క నిమిషం” అంటూ మాధురికి ఫోన్‌ చేసింది. ఫోన్‌ ఎంగేజ్‌.
అశ్విని తల్లి బయటికొచ్చి ”ఆమెతో నీకేంది పని. తమ్ముడ్ని తీస్కో. నే పనికి పోవాల” అంటూ పిల్లాడిని వదిలేసి పనికెళ్ళిపోయింది. ఆ పూట పనికెళ్ళకపోతే ఆమెకి గడవదు.
”మీ అమ్మ ఇంటికెప్పుడొస్తుంది”
”పొద్దుమీకి… చేను పనికిపోతది”
మాధురి ఫోన్‌ చేసింది. ”మా వాళ్ళు ఎస్‌.ఐ. దగ్గరకెళ్ళారు. అతను లేడట. ‘నువ్వు ఎక్కడున్నావ్‌?”
”నేను ఇక్కడే ఉన్నాను. అశ్విని వాళ్ళమ్మతో మాట్లాడాను. ఆమె పెళ్ళీలేదు గిళ్ళీలేదు అంటోంది. ఇప్పుడే పనికి పోయింది” అంది అనన్య.
”సరే… నువ్వక్కడే ఉండు. మా వాళ్ళకి చెబుతాను” అంది.
ఈ లోపు కల్లు తాగుతున్న వాళ్ళతో కాసేపు మాట్లాడదామనిపించింది అనన్యకి.
వేపచెట్టు కిందకు నడిచింది. కల్లు వాసన గుప్పుమంటోంది. అనన్యకి కడుపులో తిప్పినట్లయింది. తనకి నీరా అంటే ఇష్టమే. అప్పుడే తీసిన ఫ్రెష్‌ కల్లు కూడా తాగింది చాలాసార్లు. కానీ ఈ కల్లేంటి ఇంత భయంకరమైన వాసనొస్తోంది.
అనన్యని చూసి ఒకామె కల్లు సీసాతో సహా లేచి వచ్చి ”చూడు బిడ్డా! నాకు పనిలేదు. నా చేను ఎండిపోయింది. నా కొడుకు సచ్చిండు. నా బిడ్డకి పెండ్లి చేయాలే.. ఎట్లా… నువ్వెవరు సర్కారోళ్ళ…” అంటూ ఏవేవో మాట్లాడసాగింది.
మళ్ళీ తనే ”నీకెరికేనా… ఇదే వారంలో ఈ పిల్ల పెండ్లి. భద్రమ్మ అదుృష్టం. నా బిడ్డ పెండ్లి ఎట్లనో” అంటూ సీసా ఎత్తి గటగటా తాగింది.
”నీ పేరేందమ్మా? నీ బిడ్డ ఏడుంది?”
”ఇస్కూల్‌కి పోయింది. అస్తది” అంది.
”మేడమ్‌! ఆమె బిడ్డ నాకన్నా సిన్నది. ఎనిమిది సదూతుంది” అంది అశ్విని తమ్ముడ్ని చంకనేసుకుని.
”ఏందమ్మా! ఎనిమిదో క్లాసు చదివే పిల్లకి పెళ్ళి సేస్తవా? జైల్లో ఏస్తరు సూడు మరి” అనన్య ఆమె భాషలోనే మాట్లాడింది.
”జయిల్లో ఎందుకేస్తరు? నా బిడ్డ నా ఇష్టం. నీకెరికేనా, ఈ పిల్లలు ఇస్కూలుకి పోయి అటే పోతాన్రు. ఎవడైనా లేపుకుపోతే ఏం సేసేది సెప్పు. అందుకే లగ్గం సేసెయ్యాల”.
కాసేపటికి ఛైల్డ్‌లైన్‌ టీం వచ్చారు.
”ఎస్‌.ఐ. ఇంకా రాలేదు. మీరేనా కంప్లయింట్‌ చేసింది”.
”అవును నేనే. ఈ ఊళ్ళో చాలానే పెళ్ళిళ్ళు ఉన్నట్లున్నాయి. ఇదిగో ఈ అమ్మాయి పేరు అశ్విని. వచ్చే వారం ఈమె పెళ్ళంట. పదిహేను సంవత్సరాలు కూడా లేవు”.
”మేడమ్‌! ఈ ఊళ్ళో పరిస్థితి ఘోరం. మేం చాలాసార్లు వచ్చాం. పెళ్ళిళ్ళు ఆపాం. కానీ పక్క రాష్ట్రం కర్నాటక వెళ్ళి పెళ్ళి చేసేస్తారు”.
”ఛైల్డ్‌ ప్రొటెక్షన్‌ వాళ్ళకి చెప్పాం. ఎస్‌.ఐ.కి చెప్పాం. తల్లిదండ్రులతో మాట్లాడతాం. చట్టం గురించి చెబుతాం. వినకపోతే పోలీసులు కేసు పెడతారు”.
అశ్విని వాళ్ళవైపు చూస్తోంది. పోలీసులు, కేసు అంటుంటే ఆ పిల్లకి భయమేసింది. తల్లిని పోలీసులు తీసుకెళ్ళిపోతారేమో అనుకుని ‘వద్దులే మేడం! మా అమ్మని ఏమీ చేయొద్దని చెప్పండి’ ఆమె కళ్ళనిండా నీళ్ళు.
”ఏం కాదులే! మీ అమ్మని పోలీసులు తీసుకెళ్ళరులే. నీ పెళ్ళి చేయొద్దని చెబుతారంతే” అని ”ఇదిగో పెద్దమ్మా! నీ కూతురికి పెళ్ళి చెయ్యకు. చదువుకోనీయ్‌. లేదంటే.. పోలీసులొస్తారు. జైల్లో వేస్తారు” అంది.
ఆమె ఏమీ పట్టించుకునే స్థితిలో లేదు. ఇంకో సీసా తెచ్చుకుని తాగుతోంది.
”మీ పని మీరు చెయ్యండి. నేను వెళ్ళాలి. అశ్వినీ భయపడకు. వీళ్ళు మీ అమ్మతో మాట్లాడతారులే. నేను మళ్ళీ వస్తాను”. అశ్విని సరేనంది.
*********
మర్నాడు పేపర్‌లో అనన్య రాసిన వ్యాసం వచ్చింది. ”బాల్యానికి ఉరితాడు” పేరుతో ఆమె రాసిన కథనం జిల్లాలోని బాల్య వివాహాలకి అద్దం పట్టింది. అదే వ్యాసంలో అనన్య రాసిన ”బాల దండు” గురించిన వివరాలు చాలా అసక్తికరంగా అన్పించాయి. బాల్యవివాహాల మీద చాలా లోతైన వ్యాసం రాస్తూ ఒక స్వచ్ఛంద సంస్థ ఇటీవలే బాల్యవివాహాల నిరోధానికి కృషి చేస్తూ గ్రామాల్లోని ఆడ, మగపిల్లలతో కలిపి ఏర్పాటు చేసిన ‘బాలదండు’ గురించి రాసింది. కొన్ని గ్రామాల్లో ‘బాలదండు’ ఆపిన పెళ్ళిళ్ళ వివరాలు కూడా రాసింది. అనన్య ఆ పేపర్‌ తీసుకుని అశ్విని దగ్గరకు వచ్చింది.
అశ్విని అనన్యతో మాట్లాడ్డానికే భయపడింది. పిలిస్తే కూడా రాలేదు.
”ఏమైంది అశ్వినీ?”
”మా అమ్మ నన్ను మస్తు కొట్టింది మేడమ్‌”
”ఎందుకు?”
”మొన్న వచ్చినోళ్ళు సాయంత్రం దాకా ఉండి మా అమ్మతో మాట్లాడారు. అమ్మ చాలా గొడవ చేసింది. తిట్టింది. కానీ ఆళ్ళు బెదిరించి చెప్పారు. పెళ్ళి చేస్తే కేసుపెట్టి జైలుకి పంపిస్తామని చెప్పి వెళ్ళిపోయారు. ఆళ్ళు ఎల్లిపోయాక మా అమ్మ నన్ను బాగా కొట్టింది” అంటూ ఏడ్చింది.
”అయ్యో! ఏదీ చూడనియ్‌. మీ అమ్మ ఇంట్లో ఉందా?”
ఆ పిల్ల వీపుమీద దెబ్బల చారలు… దద్దురుల్లా లేచాయి.
”మా అమ్మ లేదు. నన్ను కొట్టి తమ్ముడ్ని తీసుకుని ఎటో ఎల్లిపోయింది”.
”ఎక్కడికి వెళ్ళింది. నిన్ను ఎల్లిపోయింది”.
”ఎప్పుడంతే మేడమ్‌. అలాగే చేస్తది”
”రాత్రికి వచ్చేస్తుంది కదా! ఒక్కదానికి వుండగలవా?”
”ఆ ఉండగలను. నాకు అలవాటే… అమ్మ అట్లానే పోతుంటది. మా మామ ఊరికాడికెల్తా అప్పుడప్పుడూ…”
”సరే అశ్విని. ఇది నా ఫోన్‌ నంబర్‌. అవసరమైతే ఫోన్‌ చెయ్యి. మీ అమ్మ రాత్రికి వచ్చేస్తుందిలే”.
అనన్య బయలుదేరింది వెళ్ళడానికి.
ఙ ఙ ఙ
అశ్విని వేపచెట్టు దగ్గరకొచ్చింది. అందరూ కూర్చుని కల్లు తాగుతున్నారు. అమ్మ ఎప్పటికొస్తదో! ఊర్లోనే ఉండే తన ఈడుపిల్ల రమణి కనిపించింది. అశ్విని సంతోషంగా రమణి దగ్గరకెళ్ళి ”మా అమ్మ ఇంట్లో లేదు. మా ఇంటికి పోదాం పా..” అంటూ రమణి చెయ్యి పట్టుకుని ఇంటికి లాక్కెళ్ళింది.
”ఏంటే అశ్వినీ… నీ పెళ్ళంట కదా! ఎవడే వాడు?” అంది నవ్వుతూ.
”పెళ్ళీలేదు, గిళ్ళీ లేదు. నేను చేసుకోను.” నేను సదువుకుంట
”మీ అమ్మ ఊర్కుంటదా? నాతోపాటు స్కూల్‌కొస్తే ఇప్పటికి తొమ్మిదికి వచ్చేదానివి”
”మా అమ్మ బాగా కొట్టింది పెళ్ళి చేసుకోనన్నానని. అయినా సరే చేసుకోను. ఒక మేడం.. పేపర్లలో రాస్తది. ఆమె కూడా చెప్పింది. నిన్న ఎవరో ఛైల్డ్‌లైనంట ఆళ్ళు వచ్చిన్రు. అమ్మ ఆళ్ళనీ తిట్టింది” అశ్విని గొంతులో దుఃఖం.
”అశ్వినీ! నీకో మాట చెప్పాలే. మా స్కూల్‌కి హైదర్‌బాద్‌ కెల్లి కొందరు మేడమ్స్‌ వచ్చిన్రు. మా హెడ్‌మాస్టర్‌ వాళ్ళతో మీటింగ్‌ చేసిండు. మేమంతా కూడా పోయినం. చిన్నప్పుడే పెళ్ళి చేస్తే మంచిది కాదని, మన ఆరోగ్యం పాడవుతుందని ఇంకా ఏవో హక్కులని, బాలల హక్కులని చెప్పారు. మొదట మాకు అర్థం కాలేదు. రెండోసారి వచ్చినపుడు బొమ్మలు తెచ్చి చూపించారు.అప్పుడు బాగా అర్థమైంది. ఆళ్ళకి హెల్ప్‌లైన్‌ ఉందంట. దానికి ఫోన్‌ చేయమని చెప్పారు. అది ఫ్రీ అంట. మనకేమీ పైసలు పడవంట. ఎక్కడైనా చిన్న పిల్లలకి పెండ్లి చేస్తే ఫోన్‌ చెయ్యమని చెప్పారు” రమణి ఉత్సాహంగా గబగబా చెప్పుకుంటూ పోయింది.
అశ్విని కళ్ళు విప్పార్చుకుని విన్నది.
”నీకు ఇంకో ముచ్చట చెప్పాలే. మా స్కూల్‌లో అబ్బాయిలు, అమ్మాయిలతో కలిసి ‘బాలదండు’ అని ఒకటి పెట్టారు”
”బాలదండా? అదేంటిదే?” ఆశ్చర్యంగా అడిగింది అశ్విని.
”చెప్పాను కదే! హైదరాబాద్‌ కెళ్ళి వచ్చారని. ఆళ్ళే దీన్ని పెట్టారు. నేను కూడా అందులో ఉన్నాను తెలుసా?” గర్వంగా అంది రమణి.
”ఏం చేస్తరు మీరు”
”మొన్ననే ఒక మీటింగ్‌ చేసిన్రు. మేమంతా ఒకకాడ కూర్చుని బాల్యవివాహాలు… అదే చిన్నతనంలోనే పెళ్ళి గురించి మాట్లాడుకున్నం. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నం. నీకు తెలుసా? ఆళ్ళ ఆఫీసు బస్టాండు కాడ ఉంది. నేను చూసాను”
అశ్విని విచారంగా ఎటో చూస్తోంది.
”రమణీ! ఆళ్ళు నా పెళ్ళి ఆపుతారా? నేను చదువుకుంటే నువ్వు చెప్పిన ముచ్చట్లన్నీ నాకూ తెలుస్తాయి కదా!”
”ఏయ్‌ రమణీ! ఏందా ముచ్చట్లు. ఇటు రావే” అంటూ రమణి వాళ్ళమ్మ గట్టిగా కేకేసింది.
”అశ్వినీ! రేపు నేను మా బాలదండు వాళ్ళతో చెబుతా. సరేనా…అమ్మ కొడుతాది ఎళ్ళకపోతే” అంటూ రమణి వెళ్ళిపోయింది.
*********
రాత్రి బాగా పొద్దుపోయాక భద్రమ్మ ఇంటికొచ్చింది. నిద్రపోతున్న కొడుకుని భుజాన వేసుకుని తలుపుకొట్టింది. అశ్విని మంచి నిద్రలో ఉంది. ఉలిక్కిపడుతూ లేచి తలుపు తీసింది. భద్రమ్మ ఏమీ మాట్లాడకుండా పిల్లాడిని పడుకోబెట్టి అశ్విని పక్కన పడుకుంది. అశ్వినిని దగ్గరగా పొదుపుకుంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. తల్లి ఏడుస్తోందని గమనించిన అశ్విని ఆశ్చర్యపోయింది.
”అమ్మా ఏమైంది? ఎందుకేడుస్తున్నవ్‌”
”ఏంలేదులే బిడ్డా! పడుకో” అంటూ కళ్ళు తుడుచుకుంది.
తల్లి అంత మెత్తగా ఎప్పుడూ మాట్లాడదు. ఏమైందో… అనుకుంటూ తల్లిని గట్టిగా వాటేసుకుని హాయిగా నిద్రపోయింది. ఙ ఙ ఙ
”మేడం! మీరు ఒకసారి మా ఇంటికొస్తరా? మాయమ్మ రమ్మంది” అశ్విని గొంతులో ఉత్సాహం ఫోన్‌లో స్పష్టంగా తెలుస్తోంది.
”అవునా! ఎందుకు అశ్వినీ…”
”తెల్వదు గానీ… రాత్రి బాగా పొద్దయ్యాక అమ్మ ఇంటికొచ్చింది. వచ్చిన సంది ఏడుస్తోంది. నాతో కోపంగా లేదు. నా దెబ్బలకి కొబ్బరి నూనె రాసి మళ్ళీ ఏడ్చింది”
అనన్య జర్నలిస్టు బుర్ర చకచకా ఆలోచించింది. ”ఏమై ఉండొచ్చు.. రాత్రికి రాత్రి అంత మార్పెలా సాధ్యం. సర్లే… ఆలోచనలెందుకు. పోదాం పద” అనుకుంటూ అశ్విని ఇంటికి బయలుదేరింది.
వేపచెట్టు కింద ఎవరూ లేరు. ఇంకా చేరలేదు. పొంగుతున్న మురుగు కాల్వలో పందులు పొర్లుతున్నాయి. దుర్వాసనకి ముక్కు మూసుకుంటూ అనన్య భద్రమ్మ ఇంటివైపు నడిచింది. దూరం నుంచే అశ్విని అనన్యను చూసింది. పరుగు పరుగున ఎదురొచ్చింది.
”మేడం! రాత్రి నుంచి మా అమ్మ ఏదోలా ఉంది. ఊరకే ఏడుస్తది. పనికి పోలేదు. కల్లు తాగలేదు. నన్ను తిట్టలేదు. పడుకునే ఉంది. తెల్లారంగానే నాకు చెప్పింది. మొన్న మనింటికొచ్చింది కదా! ఆమె అస్తదేమో అడుగు. నీ తాన ఆమె ఫోన్‌ నంబరుందా” అంది.
”ఎందుకమ్మా అంటే.. రమ్మను. నిన్ను తీసకపోతానందిగా అడుగుతాను” అంది.
”మేడమ్‌! మిమ్మల్ని పిలిచి తిడతదేమో భయంగా ఉంది. కానీ మాయమ్మ కోపంగా లేదు. ఏమైతదో నాకైతే సమజైతలేదు”
”ఫర్వాలేదులే అశ్వినీ. నేను మాట్లాడతాను.”
ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్ళారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.
”అమ్మా! మేడమొచ్చింది”
”అశ్వినీ! నా పేరు చెప్పాను కదా. నన్ను అక్క అని పిలువు చాలు”
”అలాగే అక్కా! అమ్మా” అంటూ పిలిచింది.
భద్రమ్మ మెల్లగా లేచింది. ఆమెకి వంట్లో బాగోలేనట్లుంది అనుకుంది అనన్య. మొన్న కోపంగా, చిరాకుగా విరుచుపడినన భద్రమ్మ ముఖం ఈ రోజు అలా లేదు. బాగా ఏడ్చినట్టు కళ్ళు ఉబ్బి ఉన్నాయి.
”ఆడ కూసుందాం పాండి’ అంటూ ఇంటి బయటకు నడిచింది.
అశ్విని ఆశ్చర్యంగా తల్లిని చూస్తోంది. అమ్మ ఎప్పుడూ ఇలా లేదు. ఏమైంది అమ్మకి?
”అశ్వినిని తీస్కపోయి చదివిపిస్తమన్నారు కదా ఆ దినం… నిజమేనా” సూటిగా అడిగింది.
”నిజమే చెప్పాను. హాస్టల్‌లో వేస్తే చదువుకుంటది. పెళ్ళి చెయ్యకండి” అంది అనునయంగా.
”పెండ్లేడ చేస్త ఇగ. తీస్కపోండి. బడిలో ఏయుండ్రి. అందరొచ్చి చెప్పినా ఇనకపోతిని. నే పోతే పిల్ల బతుకెట్టా అనుకుంటే పెల్లి సేస్తే బరువుపోద్దనుకుంటి. అది నిజం కాదని నిన్న మా అన్న ఊర్ల పిల్లలు చెప్పిన్రు”
అశ్విని కళ్ళు విప్పార్చుకుని తల్లిని చూస్తోంది.
”ఏ పిల్లలు చెప్పారు” అంది అనన్య.
”ఇస్కూలు పిల్లలు. ఊరి మధ్యన నాటకాలేసిండ్రు”.
అనన్యకి అర్థమైంది. బాలదండు పిల్లలు బాల్య వివాహాలకి వ్యతిరేకంగా ‘మల్లెమొగ్గ’ నాటకం వేస్తారని, ఆ నాటకం చూస్తూ అందర ఏడుస్తారని, ఆ నాటకంలో చిన్న వయస్సులో పెళ్ళైన అమ్మాయి గర్భమొచ్చి కనలేక చనిపోయే దృశ్యం నాటకం ఆడేవాళ్ళని కూడా ఏడిపిస్తుంది. భద్రమ్మ ఆ ప్రభావంలో ఉందని అర్థమైంది.
”నాకు సుత సిన్నప్పుడే లగ్గమైంది. సానా కష్టాలు పడ్డా. నా మొగుడు తాగితాగి సచ్చిండు. మా ఊర్ల అందరూ తాగుతరు. కల్లు తాగుతరు. తాగకపోతే పనెట్టా చెయ్యాలి. పనికెళ్ళకపోతే తిండి లేదు. ఏటి సెయ్యాల? ఈ పిల్లాడు కడుపులో ఉన్నప్పుడు నా మొగుడు పోయిండు. నేను సస్తే ఈ పిల్లకెట్టా? అందుకే లగ్గం సేద్దామనుకున్నాను. ఆడికి పెళ్ళాం పోయింది. ఇద్దరు పిల్లలు. దీన్ని చేస్కుంటానన్నడు. సేస్తే పాయె అనుకున్నా”.
”అంత పెద్దవాడికిద్దామనుకున్నారా?”
”అవ్‌…ఏం సేయాల మరి? సరే.. నిన్నటి సంది నా మనసు మారింది. ఈ పెండ్లి చేయ. పిల్లని ఇస్కల్‌లో ఏస్తానన్నావ్‌ కదా! ఏస్తవా మరి”
”చాలా సంతోషం. ఒక్క నాటకం చూసి మీరు ఇంతలా మారిపోయారు. తప్పకుండా వేస్తా. హాస్టల్‌లో వేస్తా…”
”పిల్లలు ఎంత బాగా సెప్పిండ్రు. సచ్చిపోయిన పోరి నా అశ్వినిలాగా కనబడ్డది. అప్పటి సందు ఏడుస్తనే ఉంటి” భద్రమ్మ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.
”అమ్మా” అంటూ అశ్విని తల్లి ఒళ్ళో చేరింది. అనన్య సంభ్రమంగా భద్రమ్మవైపు చూసింది.
”నిన్న బిడ్డని గొడ్డుని బాదినట్టు బాదాను. తిట్టాను” అశ్విని వీపును నిమురుతూ భద్రమ్మ అంది.
”మీ దుఃఖం అలాంటిది. నేను అశ్వినిని ఆడపిల్లలుండే హాస్టల్‌లో చేరుస్తాను. అక్కడే చదువుకుంటుంది.మీరు వెళ్ళి చూస్తుండొచ్చు. మీ కొడుకుని కూడా అంగన్‌వాడిలో వదలండి. వాళ్ళు చూసుకుంటారు. మీరు పనికి వెళ్ళొచ్చు” అంది అనన్య.
అశ్విని ముఖం సంతోషంతో విప్పారింది.
”నన్ను నిజంగా ఇస్కూల్‌ల ఏస్తవా అక్కా!” సంబరంగా అంది.
”బాగా చదువుకుంటావా మరి..”
”ఆ.. చదువుకుంటా. నిన్న రమణి నాకు చెప్పింది. వాళ్ళ స్కూల్‌లో బాలదండున్నరని. నేనూ బాలదండవుతా”.
భద్రమ్మ గురించి స్టోరీ చెయ్యాలని అనన్య డిసైడ్‌ అయిపోయింది. తల్లీ కూతుళ్ళ ఫోటోలు తీసుకుంది.
”సరే! నేను వెళతాను. రెండు, మూడు రోజుల్లో వస్తాను. అప్పుడు అశ్వినిని ఎక్కడ చేర్చాలో చెబుతాను. మీరూ నాతో వద్దురు. అశ్వినీ…అవసరమైతే ఫోన్‌ చెయ్యి. సరేనా?”
”సరే అక్కా! నేనిప్పుడే పొయ్యి రమణికి చెబుతా” అంటూ చెంగు చెంగున ఎగురుతూ రమణి ఇంటివైపు పరిగెత్తింది.
భద్రమ్మ ఏమీ మాట్లాడకుండా కూతురిని చూస్తుండిపోయింది.
అశ్వినిలో అణగారిపోయిన బాల్యం తిరిగి ఉరకలెత్తినట్లనిపించింది అనన్యకి. ఈ టైటిల్‌ బావుండేట్టుంది తన రేపటి కథకి అనుకుంటూ అనన్య కూడా బయలుదేరింది.
***********

Sunday, September 3, 2017

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు



మా అమ్మకి 50 ఏళ్ళ వయసపుడు మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయినపుడు నేను హైదరాబాదులో అనామకంగా ఉన్నాను. ఆయన చనిపోయాడని నాకు చెప్పకుండా నన్ను ఊరికి రమ్మన్నారు. నేను వెళ్ళేటప్పటికి మా నాన్న లేడు. మా అమ్మని మా పడిమీద వసారాలో చీకట్లో కూర్చోబెట్టారు. ఎవరెవరో రావడం, మా అమ్మ, అక్కలు, వదిన గొల్లుమంటూ ఏడవడం. నాకు అలా ఏడవడం రాదు. మా వీథి అరుగుమీద కూర్చుని మా నాన్నని తల్చుకునేదాన్ని. ఆయన అదే అరుగుమీద చాపలాంటిదేదీ వేసుకోకుండానే ఆదమరిచి నిద్రపోయే దృశ్యాన్ని పదే పదే తలుచుకుంటూ ఉండేదాన్ని. నా చిన్ననాటి నేస్తం భారతి నాతో ఉండేది. నాలుగైదు రోజులు గడిచాక నాన్న చనిపోయిన పదో రోజో, పదకొండో రోజో ఏమి చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అనే తర్జన భర్జనలు మొదలయ్యాయి. మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. బోలెడు మంది కజిన్స్‌… పెద్దమ్మలు, చిన్నమ్మలు, పెదనాన్నలు, చిన్నాన్నలు.
మా అమ్మకి ఏదో తంతు చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారని అర్థమైంది. మా అన్న, నేను తీవ్రంగా వ్యతిరేకించాం. అమ్మ ఇప్పుడెలా ఉందో అలాగే ఉండాలి. ఏమీ మార్పులుండవ్‌. అమ్మని కాలువ దగ్గరికి చీకట్లో తీసుకెళ్ళి గాజులు పగలగొట్టడాలు లాంటివి చేస్తే మర్యాద దక్కదని గొడవ పెట్టాను. చివరిసారి అంటూ ముఖమంతా పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, పూలు పెట్టి సోకాల్డ్‌ ముత్తయిదువులు వెళ్ళి చూడడం… మళ్ళీ అవన్నీ తీసేసి అమ్మ నెత్తిమీద వైధవ్యం ముద్ర వేయడం… ఇలాంటివన్నీ జరగనివ్వలేదు. దానికి చాలా పోరాటమే చేయాల్సి వచ్చింది. నాన్న పోయిన దుఃఖంలో మునిగి ఉండి కూడా ఈ పోరాటం చేయడం… నేను చాలా డిప్రస్‌ అయిపోయాను. దానినుండి బయటపడి మళ్ళీ మామూలు మనిషిని కావడానికి, హైదరాబాదు తిరిగి రావడానికి చాలాకాలమే పట్టింది. అమ్మ మామూలుగానే రంగు రంగు చీరలు కట్టుకోవడం నాకు గొప్ప సంతోషాన్నిచ్చింది.
నా జీవితంలో నాకు ఎదురైన ఈ అనుభవం నా ఒక్కదానిదీ కాదని నాకు తెలుసు. మనసును మెలిపెట్టే ఇలాంటి అనుభవాలు ఎదురుకాని వాళ్ళుండరంటే అతిశయోక్తి కాదు. భర్తల్ని కోల్పోయిన ఆడవాళ్ళ పట్ల మన సమాజం అనుసరించే దుర్నీతి, అమానవీయ పద్ధతులు వేలాది సంవత్సరాలుగా కొనసాగుతుండడం వెనుక ఉన్నది ఆధునిక తరం నిర్లిప్త వైఖరి. తమ కుటుంబాల్లో స్త్రీల పట్ల అమలౌతున్న అమానుష పద్ధతుల్ని ఆధునికులు కూడా ఆమోదించడం, వాటిని ఆచారాలుగా, కట్టుబాట్లుగా అంగీకరించి తమ తమ కుటుంబాల్లో భర్తలు చనిపోయిన స్త్రీల పట్ల అత్యంత అమానవీయ పద్ధతుల్ని ఆచరించడం సిగ్గుచేటు.
హిందూ మతావలంబికులే ఈ దారుణ ఆచారాలన్నీ కొనసాగిస్తున్నారు. భర్త చనిపోయిన స్త్రీ ముఖంమీద ‘విధవ’ ముద్రవేసి ఆమె జీవితాన్ని మోడులాగా మార్చేస్తారు. ఆమె తిరిగి చిగురించడానికి ఏ చిన్న ప్రయత్నం చేసినా కుటుంబం, సమాజం ‘అరిష్టం’ ‘అనర్ధం’ పేరుతో ఆ చిగుళ్ళను చిదిమిపారేస్తారు.
ఏది అరిష్టం? ఏది అనర్ధం? ఏది అశుభం? భార్య చనిపోతే నెల తిరక్కుండా పెళ్ళి చేసుకునే మగవాడు వైధవ్యపు ముద్రలేమీ మొయ్యకుండానే కాలరెత్తుకుని తిరగడం ‘అరిష్టం’ ఎందుకు కాకుండా పోయింది. ఉదయాన్నే అతని ముఖం చూడడం ‘అశుభం’ ఎలా కాకుండా పోయింది. భార్య చనిపోయిన దుఃఖపు ఛాయలు కనబడకుండా మామూలుగానే ఎలా మసలగలుగుతాడు. భర్త చనిపోయిన స్త్రీ మాత్రం ఆ దుఃఖాన్ని రోజులు, నెలలు, సంవత్సరాల పాటు వ్యక్తం చెయ్యాల్సిన దుస్థితి ఎందుకు? ఒక్కోసారి ఆమెకు దుఃఖం కలగకపోయినా ‘రుడాలి’లా గుండెలు బాదుకుంటూ ఎందుకేడవాలి? భార్య చనిపోయిన మగాడు మహా అయితే పది రోజులు గడ్డం పెంచుకుని దుఃఖ వ్యక్తీకరణ చేస్తాడేమో! అంతకు మించి ఏడుపులు, పెడబొబ్బలు చెయ్యడు కదా!
ఒకసారి నాకెదురైన ఓ అనుభవం ఇప్పటికీ నా రక్తాన్ని మరిగిస్తుంది. నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు. ఎవరో పేరంటం పిలుపులంటూ మా ఇంటికొచ్చారు. నేను, మా అమ్మ ఇంట్లో ఉన్నాం. వచ్చినవాళ్ళు నాకు బొట్టు పెట్టడానికి వస్తే నేను పెట్టించుకోను అన్నాను. అలా అనకూడదు.’అరిష్టం’ అంది ఒకామె. అరిష్టమంటే ఏంటి? చెబుతావా? అని అడిగాను. మా అమ్మ అక్కడే ఉంది. ఆమె వైపు కూడా చూడకుండా ”సర్లే అమ్మాజి! (నన్ను ఇంట్లో అమ్మాజి అని పిలుస్తారు) నీతో వాదించలేను. ఏం చేయను మరి నువ్వు పెట్టించుకోనంటున్నావ్‌’ అంటూ మా వీథి గడపకి బొట్టు పెట్ట్టింది. మా అమ్మకి పెట్టలేదు. ఆమె చేతిలో ఉన్న పసుపు, కుంకుమ పెట్టిన పళ్ళాన్ని ఎగిరి తన్నాలన్నంత కోపమొచ్చింది నాకు. కానీ వాళ్ళంతా మా చుట్టాలు. ఏమీ చెయ్యలేని నిస్సహాయత ఆవరించి అమ్మవైపు చూడలేకపోయాను. అమ్మకన్నా గడప విలువైందన్నమాట. చెక్కముక్కకి బొట్టు పెట్టొచ్చు కానీ నాన్న లేని అమ్మ ముఖాన పెట్టకూడదన్నమాట.
ఈ చెత్త ఆచారాలను భోగి మంటలో వేసి తగలెయ్యాలి. స్త్రీలు తమకు తెలియకుండానే ఎలా పితృస్వామ్య భావాల ప్రభావంలో ఉంటారో, తోటి స్త్రీని అవమానిస్తున్నామనే స్పృహ లేకుండా ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో అర్థమయ్యాక వాళ్ళ పట్ల జాలి కలిగింది. చూడడానికి ఇవన్నీ స్త్రీల పట్ల స్త్రీలే దారుణంగా వ్యవహరిస్తున్నట్లు కనబడినా అంతర్లీనంగా ప్రహించేది పితృస్వామ్య భావజాలమే. స్త్రీలందరూ మేము ఈ దుర్మార్గ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నాం, సాటి స్త్రీలను అవమానించం అని తీర్మానించమనండి… పురుషస్వామ్య, పితృస్వామ్యం బ్రాహ్మణీయ భావజాలం పడగ విప్పుతుంది. విషం కక్కుతుంది. ముత్తైదువులనీ, పునిస్త్రీలనీ, విధవలనీ విడగొట్టి వికటాట్టహాసం చేస్తుంది. మీరు వీటిని వ్యతిరేకిస్తే మీ భర్తలకి అరిష్టం, ప్రాణ నష్టం అంటూ ఊదరగొట్టి, స్త్రీలందరూ అనివార్యంగా సోకాల్డ్‌ ”మంగళసూత్రాల”ను కళ్ళకద్దుకుని తమ క్రూర పద్ధతులను కొనసాగించేలా భయభ్రాంతులను చేస్తారు. భర్తకంటే ముందు చనిపోయిన స్త్రీల కర్మకాండలను పండగలా చేసి కేవలం భర్తలున్న ”సోకాల్డ్‌ సుమంగళు”లనే పిలిచి వారికి పసుపు, కుంకాలు, కానుకలు ఇచ్చి సత్కరించి, భర్తలు లేని స్త్రీలను అత్యంత హీనంగా అవమానించే పరమ నికృష్ట ఆచారమిది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది. భర్త లేని స్త్రీని అవమానించే ”సుమంగళి” మొగుడు శాశ్వతంగా బతికి ఉంటాడా? తనకు ఈ దుస్థితి ఎదురుకాక తప్పదని తెలిసీ పురుషస్వామ్యం చేతిలో పాచికలా పనిచేస్తుంది కదా! అదే అత్యంత విషాదం.
నాకు ఎదురైన మరో భయానక అనుభవం. నేనూ, మా పెద్దక్క ఏదో పెళ్ళికి వెళ్ళాం. మా బావ చనిపోయాడు. ఆయన చనిపోకముందు మా అక్క ”పెద్ద ముత్తైదువ” హోదాలో చాలా యాక్టివ్‌గా అన్నింట్లో పాల్గొనేది. అదరూ తనను అన్ని ”శుభ” కార్యాలలో ముందుంచేవారు. మా బావ చనిపోగానే ఆమె దేనికీ పనికిరాకుండా పోవడమే కాక అనేక అవమానాలను ఎదుర్కొంటోంది. నేను పైన రాసిన పెళ్ళిలో పురోహితుడు సోకాల్డ్‌ మంగళసూత్రాలు పట్టుకుని జనంలోకి వచ్చి ”ముత్తైదువుల” మెడలకు తాకిస్తూ మా దగ్గరకొచ్చాడు. నేను నాకు తాకించొద్దని తల అడ్డంగా ఊపాను. నా పక్కనే ఉన్న అక్కకు ఎక్కడ తాకించేస్తాడో అని అక్క పక్క కూర్చున్న ఆమె ”పంతులుగారూ! ఆవిడకి వద్దులెండి” అంటూ కంగారుపడిపోయి తన మెడకి ఆనించుకుంది. నిజం చెప్పొద్దూ… మా అక్కని అవమానించిన ఆ సూత్రాన్ని లాక్కుని నేలకేసి కొట్టాలన్నంత ఆవేశాన్ని ఆపుకుంటూ ఆ పెళ్ళిలోంచి లేచి వెళ్ళిపోయాను. ఇలాంటి పెళ్ళిళ్ళకు వెళ్ళడం మానేసి చాలాకాలమైంది. నేను వెళ్ళడం మానేసినంత మాత్రాన అవమానాలు ఆగిపోతాయని కాదు కానీ ఆ బీభత్సాలను, ఆ అమానవీయ దృశ్యాలను చూసి తట్టుకోలేక గొడవ పడతానేమో అనే భయంతోనే మానేసాను.
నాకు చాలా దగ్గరి స్నేహితుడు ఒకరి తల్లికి జరిగిన అవమానం అతనిని కూల్‌గానే ఉంచింది కానీ నా రక్తాన్ని మరిగించింది. ఆవిడకు నలుగురు కొడుకులు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఆవిడ భర్త హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయాడు. చాలా కష్టపడి పిల్లల్ని పెంచి, చదువు చెప్పించింది. అందరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అయితే కొడుకుల పెళ్ళిళ్ళ సమయంలో ఆవిడ పట్ల ప్రవర్తించిన తీరు ఘోరం. ఆవిడ పెళ్ళి మండపంలోకి రాకూడదట. అక్షింతలు వెయ్యకూడదట. ఆవిడ ఆహుతుల్లో ఒకరిగా కూర్చోడానికి కూడా అర్హురాలు కాదట. పెళ్ళిపందిట్లో ఆర్భాటంగా పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆవిడ ఇంట్లోనే ఉండిపోయింది. నా ఫ్రెండ్‌ పెళ్ళిలో నేను అతనిని ”మీ అమ్మేది” అని అడిగినపుడు ”అమ్మెలా వస్తుంది. నాన్న లేడుగా” అన్నాడు. ”ఓరి మూర్ఖుడా! నాన్న ఎలాగూ లేడు. అమ్మరావాలి కదా!” అంటే ”భలేదానివే! అలా వస్తే కోడలికి అరిష్టమట. పిన్ని చెప్పింది.” నా కోపం నషాళానికి అంటింది. ”కోడలికి అరిష్టమంటే ఏంటి? నువ్వు చస్తావా?” అందామనుకుని తమాయించుకున్నాను. ఆ తల్లి పడే మానసిక వేదన, అవమానం, దుఃఖం చదువుకున్న మూఢులకు కూడా అర్థం కాకపోవడమే అసలు విషాదం. రాసుకుంటూపోతే ఎన్నో అనుభవాలు ముల్లులాగా గుచ్చుకుంటూనే ఉంటాయి.
వైధవ్యం పేరుతో తరాల తర్వాత తరాలు ఎలాంటి మార్పు లేకుండా భర్తల్ని కోల్పోయిన మహిళల పట్ల అమానుషంగా, అమానవీయంగా ప్రవర్తిస్తూనే ఉన్నాయి. ఆచారాలు, అరిష్టాలు, అశుభాలు, కట్టుబాట్లు లాంటి పడికట్టు పదాలు ఈ స్త్రీల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. మతం, సమాజం, కుటుంబం ఎన్నో అంశాలలో మారుతున్నా, మార్పును ఆహ్వానిస్తున్నా ”వైధవ్యం” అనే పదం పట్ల శిలాజరూపంలోనే ఉండిపోయింది. దీనిని బద్దలు కొట్టాల్సిన అవసరముంది. పితృస్వామ్య భావజాల మత్తులో మహిళలు తోటి మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ఆచరిస్తున్న ఘోరకృత్యాల అసలు రూపాన్ని అర్థం చేసుకోవాలి.
స్రీలను ముత్తయిదువులు, విధవలు అంటూ విభజించే క్రూర సంస్కృతికి సమాధి కడదాం… రండి… ఆలోచించండి… వ్యతిరేకించండి…

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...