Sunday, June 19, 2016



చెట్టు మీద పిట్టల్లే నన్ను స్వేచ్చగా పెంచిన నాన్న.
.........
ఈ రోజు తండ్రుల దినమట.
మా నాన్నని తలుచుకుంటుంటే ఏమి గుర్తొస్తుంది.
ఆయన రోజంతా చేసిన కష్టం గుర్తొస్తుంది.
పొలంలో ఆరుగాలం పనిచేసిన రోజులు గుర్తొస్తాయి.
మా ఆవు కోసం పచ్చగడ్డి కోసుకొచ్చి మా వీధి అరుగు మీద అలా వొరిగి నిద్రపోయే నా నాన్న గుర్తొస్తాడు.
మా ఆవు కోసం చిట్టు... తవుడు గంపలో కలుపుతుంటే చెంబుతో నీళ్ళు పోసిన దృశ్యం గుర్తొస్తుంది.
మా తోటల్లో కూరగాయల మొక్కలకు దిగుడు బావిలోంచి బుడ్లజోడుతో (మట్టి కుండలు) నీళ్ళు ముంచి పోస్తుంటే నేనూ ఓ కుండ తీసుకుని ఆయన వెనకే నీళ్ళు పోసిన జ్ఞాపకాలు...
నన్ను స్కూల్లో చేర్పించడానికి నరసాపురం తీసుకెళ్ళి అది ఏ స్కూలో తెలియకుండానే ఓ కొండపల్లి చేంతాడంత పేరున్న "హిదూ స్త్రీ పునర్వివాహ సహాయక సంగం స్కూల్" లో (అది ఓరియంటల్ స్కూల్ అని తెలిసో తెలియకో) నన్ను జాయిన్ చేసిన జ్ఞాపకం.
(అందరూ నన్ను విడో హోం లో చదువుతోంది అని వెక్కిరించేవారు.అప్పటికి విడోస్ అంటే ఎవరు అని నాకు తెలియదు.)
నేను కష్టాతి కష్టం గా డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఉన్నప్పుడు "పద హైదరాబాద్ పోదాం నీకు ఉద్యోగమొస్తుంద"ని నన్ను ఈ మహానగరానికి తెచ్చి ఎలాంటి సంకోచం లేకుండా నన్ను మా చిన్నాన్న ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయిన జ్ఞాపకం..
.నా జీవిత గమనం...గమ్యం నిర్ణయమైన సమయం..
మా అక్కలు..అన్న, తమ్ముళ్ళు నాన్న గారూ అని పిలిచినా
నేనొక్కదాన్నే నాన్నా...నువ్వు అని పిలిచిన నాన్న...మా దొడ్డమనిషి.
వ్యవసాయం చేసిన రైతు...
అప్పుడప్పుడూ వ్యాపారం చేసి అమాయకంగా మునిగిపోయిన నాన్న.
నాన్న 50 ఏళ్ళకే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు.
ఆయనకి ఖరీదైన వైద్యం చేయించే స్థోమత మాకు లేదు.
బిపి పెరిగి తలలో నరాలు చిట్లి చనిపోయాడు నాన్న.
నేను ఆయన్ని చివరి చూపు కూడా చూడలేదు.
నేను చాలా కష్టపడి హైదరాబాద్ నుంచి వెళ్ళినా అప్పటికే అంతా అయిపోయింది.
నాన్న చాలా అరుదుగా షర్ట్ వేసుకునేవాడు.
షర్టులుండేవి కాదు.
నన్ను ఆడపిల్లగా కాకుండా మనిషిగా పెంచిన నాన్న..
చెట్లెక్కడం..చేపలు పట్టడం...సైకిల్ తొక్కడం...
గొడ్దళ్ళతో కట్టెలు కొట్టడం నేర్పిన నాన్న...
నువ్వాడపిల్లవి..అది చేయొద్దు.. ఇది చేయొద్దు... అలా తిరగొద్దు అని ఏనాడు చెప్పకుండా నన్ను చెట్టు మీద పిట్టల్లే స్వేచ్చగా పెంచిన నాన్న...
నన్ను హైదరాబాద్ తెచ్చి నా జీవితాన్ని అనూహ్య మలుపు తిప్పిన నాన్నని తలుచుకుంటే ఎంత సంతోషమో నాకు.
నా దగ్గర ఉన్న నాన్న ఒకే ఒక్క ఫోటో ఇది.వెనక రైలుపెట్టెల్లాగా ఉన్న మా ఇల్లు...
మండువా లోగిలి.
ఎడం వైపు నుండి రెండో వ్యక్తి మా నాన్న.పేంటు వేసుకున్న వాడు మా ఆఖరి చిన్నాన్న

Wednesday, March 16, 2016


చట్టాలూ – సహాయ సంస్థలూ… మనం 


మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినం అభినందనలు. ‘హేపీ న్యూఇయర్‌’ లాగా ‘హేపీ ఉమన్స్‌ డే’ ఒక గ్రీటింగ్‌లాగా పడికట్టు పదంగా మారిపోయింది. ఎన్నో సవాళ్ళ మధ్య, హింసాయుత పరిస్థితుల్లో, మతమౌఢ్యపు అంధకారంలో నిత్య పోరాటం సల్పుతున్న ఆధునిక మహిళకు అరుణారుణ అభివందనాలు అభినందనలు. మత అసహనం తోడేళ్ళ గుంపులాగా వెంటాడుతున్న ఈనాటి నేపధ్యంలో స్త్రీల రక్షణ కోసం ఎన్నో చట్టాలున్నప్పటికీ అమలుకు నోచుకోని వైనం మనం చూస్తున్నాం. మహిళలపై పురుషుడు చేసే సర్వ దౌర్జన్యాలకి, హింసలకి, అత్యాచారాలకి తీవ్రమైన శిక్షలు విధించే అవకాశమున్న చట్టాలు వరుసగా బారులు తీరి వున్నాయి. స్త్రీల ఉద్యమం అడిగిన చట్టం, అడగని చట్టం అన్నింటిని ప్రభుత్వాలు చేసాయి. తీవ్రమైన శిక్షలూ ప్రతిపాదించాయి. అయినప్పటికీ ప్రతిక్షణం దేశంలో ఏదో ఒక మూల ఎవరో ఒక మహిళ, బాలిక దారుణ హింసకి గురౌతూనే వుంది. చట్టం తన పనితాను చేయకపోవడం వల్ల, పోలీసులు లా అండ్‌ ఆర్డర్‌ మాత్రమే తమ బాధ్యతగా భావించడం వల్ల, జనాభాలో సగభాగమున్న మహిళల మీద జరుగుతున్న హింసని నివారించాల్సిన, అడుకట్టవేయాల్సిన అంశంగా భావించకపోవడం వల్ల ప్రభుత్వాలు చేసిన సర్వచట్టాలూ బూడిదలో పోసిన పన్నీరుగా పనికి రాకుండా పోతున్నాయి.
చట్టం చేయడంలో వున్న ఉత్సాహాన్ని అమలులో ప్రదర్శించకపోవడం చాలా ప్రస్ఫుటంగా కనబడుతోంది. గృహహింస నివారణ కోసం, గృహ హింస చట్టం అమలు కోసం ఏర్పరచిన వ్యవస్థని చిన్నాభిన్నం చేసి నిర్భయ సెంటర్‌లు, సఖి సెంటర్‌లు ఆపైగా మార్చేసి, కనీస బడ్జెట్‌ కూడా కేటాయించకుండా నడపాలనుకోవడం వెనక వున్నది స్త్రీల అంశాలపట్ల, వారిమీద అమలవుతున్న హింసల పట్ల చిన్నచూపు, తిరస్కార భావమే.
చట్టాల అమలు తీరు ఇలా వుంటే దేశం మొత్తం మీద పెనుచీకటిలాగా కమ్ముకుంటున్న మతోన్మాదధోరణులు మహిళల మీద మరింత హింసని ప్రేరేపించే సంకేతాలను పంపుతున్నాయి. మహిళల్ని ముందడుగు వేయనీయకుండా కట్టడి చేయాలనే కుట్రలూ సాగుతున్నాయి. మాటమీద, రాతమీద, ఆహారం మీద, వస్త్రధారణమీద, చదువు మీద,
ఉద్యోగం మీద, ఒకటేంటి… స్త్రీల జీవితాలకు సంబంధించిన సమస్తం మీద, వారి ఆలోచనల మీద, అంతరంగాల మీద భయానకమైన ఆంక్షలతో కూడిన దాడి జరుగుతోంది.
దశాబ్దాలుగా స్త్రీల ఉద్యమం పోరాడి సాధించుకున్న హక్కులను హరించాలనే దుర్మార్గమైన కుట్రలు సాగుతున్నాయి. పోరాడి వదిలించుకున్న అనేక సామాజిక రుగ్మతలను, కట్టుబాట్లను, అనాచారాలను మహిళలపై తిరిగి రుద్దే ప్రయత్నాలూ జోరుగా సాగుతున్నాయి. లౌకిక తత్వాన్ని సర్వనాశనం చేసి మతోన్మాదాన్ని, మతపరమైన క్రతువుల్ని, యజ్ఞాల్ని, యాగాల్ని, కుంకుమ పూజల్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ప్రజలు తమ సమస్యపై పోరాడకుండా వారిని గుళ్ళవేపు, భక్తివేపు తరుముతున్నారు. ఒకవైపు వరదల్లా పారుతున్న ఆల్కహాల్‌, మరోవైపు ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్న భక్తి మత్తులో సామాన్యుడు జోగుతున్నాడు. మెలుకువ రాగానే మహిళల మీద పడుతున్నాడు. ఈ రోజు ఆల్కహాల్‌ ఆధారిత నేరాలు, హింసలు ఎలా పెట్రేగిపోతున్నాయో ప్రతిరోజూ వార్తాపత్రికల్లో చూస్తూనే వున్నాం.
ఇలాంటి నేపధ్యంలో మహిళలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో ‘మహిళలు – చట్టాలు – సహాయ సంస్థలు’ ప్రత్యేక సంచికను అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా తీసుకువచ్చాం. కనీసం చట్టాల మీద అవగాహన, చైతన్యం పెరిగితే చట్టాల అమలు కోసం ఉద్యమిస్తారన్న ఆశతోనే ఈ ప్రయత్నం చేసాం. 2010లో ఇలాంటి సంచికను 20,000 కాపీలు వేసి అందరికీ పంచాం. ఐతే, ఈ ఆరేళ్ళలో వచ్చిన మరికొన్ని చట్టాల ముఖ్యాంశాలతో పాటు మరోసారి ఈ సమాచారాన్ని అందరికీ అందించాలనేది మా ఉద్దేశ్యం.
హింసలనెదుర్కొనే మహిళలందరికీ దారి చూపే దీపంగా
ఈ ప్రత్యేక సంచిక ఉపయోగపడాలని కోరుకుంటూ…. ఆకాంక్షిస్తూ….
(కాపీలు అందుబాటులో ఉన్నాయి.చాలా సంస్థలు ఎక్కువ కాపీలు కావాలని కోరడం వల్లమళ్ళీ ప్రింట్ చేస్తున్నాం.మామూలుగా భూమిక వెల 10/ అది మేము ఆర్ ఎన్ ఐ కి డిక్లరేషన్ ద్వారా తెలిపిన ధర.రెగ్యులర్ సంచిక మీద రేటు మార్చే వీలు లేదు.ఈ ప్రత్యేక సంచిక 66 పేజీలతో సమగ్రంగా తెచ్చాం.చాలా ఖర్చు పెట్టాం.భూమిక లాంటి చిన్న పత్రికలు చందాల మీద మాత్రమే బతుకుతాయి.కానీ మహిళలకు చైతన్యం కలిగించాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి అలవి కాని సాహసాలు చేస్తున్నాం.
కాపీలు కావాలంటే భూమిక ఆఫీసుకి ఫోన్ చెయ్యొచ్చు.
 ఫోన్::27660173)

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...