Saturday, August 11, 2012

సాల్లో గుర్రం - సాలినంత ధనం


కిటికీలోంచి నీలి సముద్రం ఎగిసి పడుతూ కనబడుతోంది. నా చేతిలో పొగలు కక్కుతున్న కాఫీ గ్లాసు. సముద్రంలో దూరంగా కనబడుతున్న షిప్‌. షిప్‌ మీద నుంచి ఉదయిస్తున్న సూర్యుడు. ఇవాళెందుకో చాలా అందంగా కన్పిస్తున్నాడు. ఎర్రటి టమాటాపండు షిప్‌లోంచి పైకి లేస్తున్నట్టుగా వుంది. సూర్యుడు రోజూ ఇదే వేళకి వస్తాడు. నేను అదే వేళకి నా కాఫీ గ్లాసుతో తయారవుతాను.
    ఈ రోజు నేనూ, ఉదయించే సూర్యుడూ కలిసి కాఫీ తాగుతున్నంత సంతోషంగా వుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. నేను వేస్తున్న కాఫీ గుటక మాత్రమే వినిపించేంత నిశ్శబ్దంగా వుంది ఇల్లు. ఎన్నాళ్ళకెన్నాళ్ళకి నాకు నేను దొరికాను. ఈ 'నేను' అనే పదం ఎంత బావుంది. మేము లోంచి నేను ను విడదీసి చూడడం, ఈ రోజు నేనొక్క దాన్నే వున్నాను అనే భావనే అద్భుతంగా వుంది. ఈ రోజంతా నాదే. ఈ రోజే కాదు ఈ నాలుగు రోజులూ నావే కదా! నా ఇష్టం. నాకిష్టమైంది నేను చేస్తాను. ఎంత కాలమైంది నా ఇష్టాయిష్టాలు మర్చిపోయి, ఎంత కాలమైంది నా కోసమే నేను బతికి. కిటికీలోంచి కనబడుతున్న సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది, నా మనస్సులా. నాకెప్పుడూ ఇలా ఒంటరిగా, నిశ్శబ్దంగా కాఫీ తాగుతూ సముద్రాన్ని చూడాలన్పిస్తుంది. అస్సలు మాట్లాడాలన్పించదు. మా ఆయన నిశ్శబ్దానికి బద్ధవ్యతిరేకి. మంచం మీంచి లేస్తూనే మహా శబ్దంతో లేస్తాడు. తలుపులు దడదడ వేస్తూ, గడగడ మాట్లాడుతూ ఓ శబ్దయంత్రంలా వుంటాడు. బరాబరా పళ్ళు తోమాడంటే, వేడివేడి కాఫీ రడీగా వుండాలి. కాఫీ తాగుతూ, పోనీ ఆ కాఫీని ఎంజాయ్‌ చేస్తాడా అంటే అదీ లేదు. లేచీ లేవగానే టీవీ ఆన్‌ చేసి వెంటకేశ్వర భక్తి ఛానల్‌ ఓపెన్‌ చేస్తాడు. ఏదో ఒక ఛానల్‌ చూస్తాడా అంటే, రిమోట్‌ తెగనొక్కుతుంటాడు. పొద్దున పొద్దున, వింత వింత సన్నాసుల సూక్తి ముక్తావళిని బోలెడంత సౌండ్‌తో మోగిస్తుంటాడు. ఒకడు ఏక ముఖి రుద్రాక్షంటాడు. మరొకడు ఏదో ఉంగరం అంటాడు. ఇంకొకడు ''ఈ పాడు జీవితం వుంది చూసారా..... దీని మీద మమకారం పెంచుకోకూడదు. సకల సౌకర్యాలను త్యజించాలి.'' అంటూ కారుకూతలు కూస్తుంటాడు. సకల సౌకర్యాలను త్యజించాలని చెప్పిన ఆ సన్నాసి బక్కచిక్కి వున్నడా అంటే కాదు కాదు వాక్స్‌ పూసిన అమెరికన్‌ ఏపిల్‌ పండులా నిగనిగలాడుతుంటాడు. ఉదయం లేస్తూనే ఈ సకల సన్నాసుల సొల్లు వింటూ, మా ఆయన పేపర్‌లో తల దూర్చి, కాఫీ గుటక లేస్తూంటాడు.
    పేపర్‌ చదువుతూ కెవ్వున కేకేస్తాడు. మొదట్లో నాకు గుండె నొప్పి వొచ్చినంత పనయ్యేది - ఆ అరుపులకి, మెల్లగా అలవాటైంది లెండి.
    ''ఏమోయ్‌! ఎంత ఘోరమో చూడు. మీ ఆడవాళ్ళు చెడిపోతున్నారు. ఆడపిల్ల పుట్టిందని చెత్త బుట్టలో పడేసిందట కసాయి తల్లి'' ఆ వార్తని గట్టిగా చదివి విన్పిస్తాడు. ఒక పక్క టీవీలో సన్నాసుల గోల, ఇంకో పక్క ఈతని వెర్రి వ్యాఖ్యానాలు. కాసేపు నా బుర్ర పని చేయడం మానేస్తుంది. టీవీ నోరన్నా ముయ్యాలి. నా మొగుడి నోరన్నా ముయ్యాలి. లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది.
    దాదాపుగా రోజూ ఇదే తంతు. ఆఫీసుకెళ్ళే వరకూ నా మొగుడు మహా సందడిగానే వుంటాడు. ఆ శబ్దాల హోరు నా మనశ్శరీరాలను ఆవరించుకుపోతుంది. వాటిని మోస్తూనే నేనూ ఆఫీసుకు బయలుదేరుతాను. ఇంట్లో అరుపులకి అలవాటు పడిన నా చెవులు ఆటోమేటిగ్గా వేరే వాళ్ళతో మాట్లాడినపుడు నేనూ అరవాలి కాబోలనే అసంకల్పిత ప్రతీకార చర్య వల్ల నేనూ గట్టిగా అరవడం మొదలు పెడతాను.
    ''ఎందుకే అంత గట్టిగా మాట్లాడుతున్నావ్‌. నాకేమైనా చెవుడనుకున్నావా?'' అంటూ నా ఫ్రెండ్‌ పల్లవి ఉతికి ఆరేసిందొకసారి.
    ''అరిచానా? మాట్లాడాను కదా'' నా అమాయకపు ముఖం చూసి ఫక్కున నవ్వింది పల్లవి.
    ''అరిచావే తల్లీ! వాల్యూమ్‌ తగ్గించు'' అంటూ తన పనిలో పడింది.
    అంటే నాకు తెలియకుండానే నేను మా ఆయన శబ్దయంత్రానికి ఇరుసైపోయానన్నమాట. నాకు తెలియకుండానే నేనూ అరవడం మొదలుపెట్టానన్నమాట. హమ్మో! అలా జరక్కూడదు. నేనసలు అరవకూడదు అనుకుంటూ నాకు నేను కౌన్సిలింగ్‌ చేసుకుంటుంటాను.
    ఎదురుగా సూర్యుడు షిప్‌ దాటి మెల్లగా పైకొస్తున్నాడు. నా కాఫీ కూడా పూర్తయింది. హాల్లో కొచ్చి కూర్చున్నాను. తలుపు సందులోంచి పేపర్‌ జారొచ్చింది. కాలు మీద కాలేసుకుని కూర్చుని పేపర్‌ చదవడం మొదలుపెట్టాను. నేను కాలుమీద కాలేసుక్కూర్చుంటే మా ఆయనకి నచ్చదు.
    ''ఏంటా కూర్చోవడం. ఆడవాళ్ళు వొద్దిగ్గా కూర్చోవాలి'' అంటాడు.
    తను మాత్రం కాళ్ళు బార్లా జాపి, కాళ్ళ మీద కాళ్ళేసి రకరకాల విన్యాసాల్లో కూర్చుంటాడు. నేను మాత్రం వొద్దిగ్గా, వినయంగా కూర్చోవాలి.
    ఫోన్‌ మోగింది. ఎత్తాలా వద్దా? మా ఆయనే చేసుంటాడు. ఎత్తితే ఒక బాధ. ఎత్తకపోతే ఒక బాధ. ఆగకుండా మోగుతూనే వుంది. తప్పదని ఫోన్‌ తీసాను.
    చెప్పానుగా. మా ఆయనే. ఏం చేస్తున్నావ్‌ ఒక్క దానివి. ఫోన్‌ ఎందుకెత్తలేదు. ఏం టిఫిన్‌ తిన్నావ్‌? ఇదీ ఫోన్‌ సారాంశం. తను ఇంట్లో లేడని నేను అల్లాడిపోతున్నానని అనుకుంటాడు.
    ఏదో ఒకటి చేస్తా. ఏదో ఒకటి తింటా నా ఇష్టం. ఈ నాలుగు రోజులూ నావే. నాకు నచ్చినట్లే గడుపుతా. రోజూ లాగా అయితే ఈ రోజుండదు. పేపర్‌ పక్కన పడేసి కిచెన్‌లోకెళ్ళా. నీట్‌గ అద్దంలా వుంది. రోజూ అయితే ఈ టైమ్‌కి టిఫిన్‌ చేసే పని మొదలౌతుంది. టిఫిన్‌ ఏంటి వంట కూడా మొదలౌతుంది. మా ఆయనకి ఎనిమిదింటికల్లా టిఫిన్‌ పెట్టాలి. అదీ వేడివేడిగా. రోజుకోరకం. ఇడ్లీలు, దోశలు, పెసరట్లు, పూరీలు, ఉప్మా. చాలా వెరైటీగా వుండాలి. వాటిల్లోకి వెరైటీ చట్నీలుండాలి. ఇడ్లీలకి పల్లీ చట్నీ, దోశలకి కొబ్బరి చట్నీ, పెసరట్టుకి అల్లం చట్నీ, ఏది లోపించినా ఆ రోజు టిఫిన్‌ తినడు. దోశలైతే వేడివేడిగా పోస్తూ వుంటే చాలా ఆనందంగా లాగిస్తుంటాడు. కొంచెం చల్లారినా 'ఏంటోయ్‌! వేడి తగ్గింది!' అంటూ సణుగుతాడు. నేను ఏరోజూ వేడిగా తినేదీ లేదు. అతనికి తినబెట్టేసి చల్లారిన వాటినే నేను తింటాను.
    ఈ రోజసలు ఏమీ వొండకూడదని నిర్ణయించుకున్నాను. వెధవ వంట. ఎవడు కనిపెట్టాడో కానీ ఆడవాళ్ళని పీక్కుతినే బ్రహ్మరాక్షసి. ఎవరెవరి కోసమో వేడివేడిగా వొండి వడ్డించడమే కానీ ఒక్క రోజైనా నా కోసం వొండుకున్నానా? మొగుడి కోసం, పిల్లల కోసం వాళ్ళకిష్టమైనవి వొండి పొయ్యడం తప్ప ఇది నాకిష్టం. నా కోసం వొండుకుందామనే ధ్యాసే రాదు. అసలు తనకేది యిష్టమో వీళ్ళకి తెలుసా?
    కాకరకాయ పులుసంటే తనకెంతో యిష్టం. తను తప్ప ఎవ్వరూ ముట్టరు. తినకపోతే మానే వెధవ కామెంట్లు. 'అబ్బ! ఆ చేదు కషాయం ఎలా తింటావోయ్‌' వినివిని వొండడం మానేసింది. దొండకాయ తనకిష్టం లేదు. వొండాలంటే విసుగు. నా మొగుడికి దొండకాయి గుత్తికాయ, వేపుడు పచ్చడి అన్నీ కావాలి. లొట్టలేసుకుంటూ తింటాడు. 'అబ్బ! వెధవ దొండకాయ ఎలా తింటారో' అంటే 'అదేంటోయ్‌ అలా అంటావ్‌? ఎవరి యిష్టం వాళ్ళది' అంటాడు. కాకరకాయ నా యిష్టమని మాత్రం అతను మర్చిపోతాడు.
    వంటింట్లోంచి బయటకొస్తూంటే మళ్ళీ ఫోన్‌ మోగింది. పల్లవి.
    ''ఏంటీ ఇంకా బయలుదేరలేదా?''
    ''లేదు. ఇంకో అరగంట పడుతుంది. మావాడు పూరీలు చెయ్యమన్నాడు సడన్‌గా. అందుకే ఆలస్యమైంది. పూరీ, కూర చేసి వాడికి పాక్‌ చేసి ఇచ్చేసరికి ఇదిగో ఈ టైమయ్యింది. ఓ అరగంటలో వస్తాలే. మనకి కూడా పూరీలు తెస్తున్నా'' అంటూ ఫోన్‌ పెట్టేసింది.
    పాపం పల్లవి కూడా అంతే. ఇద్దరు కొడుకులు మొగుడు. వాళ్ళకి వెరైటీగా వొండిపెట్టాలని చాలా తాపత్రయ పడుతుంది. వాళ్ళేది అడిగినా నిమిషాల్లో చేసిపెడుతుంది. ఒక్కడు ఒక్క పని ముట్టరు. ఒకడు ఇంజనీరింగ్‌, ఒడు మెడిసిన్‌. వాళ్ళకి టైమెక్కడుంటుందే పాపం! అంటుంది. మా ఆయన సాయం చేస్తాంనటాడు కానీ గందరగోళం చేస్తాడు. అవన్నీ సర్దుకునే సరికి తలప్రాణం తోకకొస్తుందే. నాకో గట్టి అనుమానం. అతను కావాలనే గందరగోళం చేసి పనిలోంచి తప్పించుకుంటాడని.' అంటుంది నవ్వుతూ.
    ఇంకో కప్పు కాఫీ కలుపుకుని బెడ్‌ రూమ్‌లోకొచ్చాను. టేప్‌ రికార్డర్‌లో నాకిష్టమైన క్యాసట్‌ పెట్టి మంచం మీద బాసింపట్టు వేసుక్కూర్చున్నాను. బాలసరస్వతి మధుర స్వరం.
    'సృష్టిలో తీయనిది స్నేహమేనోయి'
    మంద్రంగా బాల సరస్వతి పాటలు వింటూంటే ఆ నిశ్శబ్దంలో ఆమె గొంతు ఎంత హాయిగా వుందో. ఏ రోజైనా యీ టైమ్‌లో యింత ఆరామ్‌గా కూర్చుంటానా? ఇంత ఏకాంతం నాకు దొరుకుతుందా? యిల్లంతా ఆక్రమించుకుని, అరుపులతో, అదిలింపులతో రోద చేసే నా మొగుడు యింతటి నిశ్శబ్దాన్ని బతకనిస్తాడా? నా పాటికి నన్నుండనిస్తాడా? ఏంటో నా ఆలోచనలన్నీ అతనికి చుట్టే తిరుగుతున్నాయి. నా గురించి ఒక్క ఆలోచన రావడం లేదు. అతన్నించి విడివడి ఆలోచించలేకపోయేంతగా అతను నన్ను ఆక్రమించాడు. నా ఉనికినే కోల్పోయినట్టుంది. నా మనస్సు, శరీరం నా అదుపులో లేకుండా పోయాయి. ఏంటిది? నేను ఏంటసలు? అతనికి పెళ్ళాన్ని, పిల్లలకి, తల్లిని, ఆఫీసులో ఉద్యోగిని, వంటింట్లో వంటకతై అంతేనా? నా ఉనికి ఇదేనా? నాఅరస్తిత్వం ఇదేనా?
    ఛీ.... ఛీ..... ఒక్క మంచి ఆలోచన రావడం లేదు. ఈ క్షణం నుంచి నా గురించే ఆలోచించాలి. నేను కోల్పోయినదేమిటో వెతికి పట్టుకోవాలి. ఈ రోజు నాది. దీనిలో పల్లవికే తప్ప ఇంకెవ్వరికీ ప్రవేశం లేదు. పల్లవి పేరు తలుచుకోగానే ఒక లాంటి హాయి మనసులో కమ్ముకుంది. నా ప్రాణ నేస్తం. వెంటనే తాము రాసుకున్న ఉత్తరాలు గుర్తొచ్చాయి. కట్టలు కట్టలు. ఎక్కడున్నాయో! తన బీరువాలోనే ఎక్కడో వుంటాయి. పల్లవి వచ్చే లోపు వెతికి పట్టుకోవాలి. హమ్మయ్య దొరికాయి. కవర్‌ తియ్యగానే మొగలి పూల వాసన కమ్మినట్లయింది. ఇద్దరికీ మొగలి పూలంటే ఎంతిష్టమో! ఒక్క మొగలి పూలేమిటి? పొగడపూలు, సంపెంగలు, చమేలీలు, కాగడా మల్లెలు, కొండ మల్లెలు. ఉత్తరాల కట్టను విప్పి మంచం మీద పరిచాను. పల్లవి ఎంత అందంగా రాస్తుందో ఉత్తరాలు. ఎంత చక్కటి కవిత్వం రాస్తుందో. నాకు కథలు రాయడం ఇష్టం. ఎంత కాలమైంది కథ రాసి. ఏ నాటి మాటది?
    ఇల్లు, ఆఫీసు, పిల్లలు, సంసారం, చాకిరీ ఇవే మిగిలాయి కానీ నా లోని సృజనాత్మకత ఏమైపోయిందో. నేను యంత్రంగా మారి చాలా కాలమైంది. చాకిరీ యంత్రం. పల్లవి రాసిన ఉత్తరాలు చదువుతూ కూర్చున్నాను. ఒకదాని తర్వాత మరొకటి.
    ''ఆ తోటలో నొకటి ఆరాధానాలయము
    ఆ ఆలయములోని అందగాడెవరే!''
బాలసరస్వతి గొంతులోని మాధుర్యం, ఆ పాటలోని మధుర భావంలో తేలిపోతున్న వేళ డోర్‌బెల్‌ మోగింది.
    పల్లవి వచ్చినట్టుంది. తలుపు తీసి పల్లవి చేయిపట్టుకుని లోపలికి లాక్కొచ్చాను.
    ఏమిటే! అంత సంతోషంగా వున్నావ్‌. వుండు వీటిని టేబుల్‌ మీద పెట్టనీ ''తాను తెచ్చిన బాక్సును డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టింది.
    పల్లవిని బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్ళాను. ''ఓహో! బాలసరస్వతి! ఎంత కాలమైంది ఈ పాటలు విని.'' పల్లవి సంబరంగా అంది.
    ''రెల్లెపూల పానుపుపై
    జల్లు జల్లుగా ఎవరో
    చల్లినారమ్మా
    వెన్నెల చల్లినారమ్మా!''
    ''ఆహా! ఏమి పాట. ఏమి ఆ సౌకుమార్యం'' పల్లవి.
    ''ఇవేంటో చూడు.''
    ''ఉత్తరాలు. నేను రాసినవి. ఏం చేస్తున్నావ్‌?''
    ''చదువుకుంటున్నానే. ఎంత ఆనందంగా వుందో వాటిని చదువుతుంటే.''
    ''అవునా! మరి నాకు చెప్పలేదే! నా దగ్గరున్న నీ ఉత్తరాలు తెచ్చుకునేదాన్ని.''
    ''పద! ఇపుడెళ్ళి తెచ్చుకుందాం.''
    ''ఇపుడా? పదముందు టిఫిన్‌ తిందాం.''
    ''నువ్వు కవిత్వం రాయడం ఎందుకు మానేసావే.''
    ''కవిత్వం రాసేటట్టే వుంది? అయినా నువ్వెందుకు కథలు రాయడం లేదు?''
    ''ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు.''
    ''ప్రశ్నా లేదు. సమాధానం లేదు. ఈ సంసారం ఓ పెద్దసాగరం. నిండా మునిగిపోయాం. మొగుడు, పిల్లలు, చుట్టాలు. వీటి చుట్టూనే జీవితం తిరుగుతోంది.''
    ''సంసారం అందరికీ వుంటుంది. కొంతమంది అందులో వుంటూనే తమతమ సొంత జీవితాలు నిర్మించుకుంటారే! మంజరిని మించిన మంచి ఉదాహరణ ఏముంది చెప్పు.''
    ''మంజరి! దాని ధైర్యం మనకెక్కడిదే.''
    ''తప్పు మనది కూడా. మనకి ధైర్యం లేదు.''
    ''ఏంటి మహితా! ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నావ్‌.''
    ''నిజమేనే! ఉదయంనించి నాకిలాంటి ఆలోచనలు వస్తున్నాయి. మనం సంసారంలో మునిగిపోయాం సరే. మన ఉనికి కోసం, మన అస్తిత్వం కోసం ఎపుడైనా ఆలోచించామా? లేదు. మనం ఏమీ ప్రయత్నించకుండా వేరేవాళ్ళని నిందించడంలో అర్థం లేదనిపిస్తుందే నాకు.''
    ''మన ఉనికి?? అస్తిత్వం?? ఎక్కడినుంచి తెచ్చుకుంటాం.'' పల్లవి.
    ''నువ్వు రాసిన ఈ ఉత్తరాల నిండా ఎంత కవిత్వం వుంది. నువ్వు ప్రయత్నించి వుంటే మంచి కవయిత్రిగా ఎదిగివుండేదానివి. ఇది నాకూ వర్తిస్తుంది. క్రియేటివిటీని నిలబెట్టుకోవాలంటే క్రియేట్‌ చేస్తూ వుండాలి. మనం ఆ పని మానేసాం.''
    ''నువ్వన్నది నిజమే! ఈ రోజు మనకో అస్తిత్వం లేకపోవడానికి కారణం మనం కూడా. సృజనాత్మకంగా బతకడానికి చాలా సంఘర్షణ పడాలి. మనం ఎందుకొచ్చిన ఘర్షణలే అని సర్దుకుపోవడం నేర్చుకున్నాం.''
    ఫోన్‌ మోగింది.
    మా ఆయనే అయ్యుంటాడు నేను ఏం చేస్తున్నానో, ఏం తింటున్నానో ఆరా తీయడానికి. అలా ఆరా తీయడాన్ని ప్రేమ అనుకుంటాడు. నేను ఫోన్‌ ఎత్తలేదు. మోగి మోగి ఆగింది.
    ''పదవే టిఫిన్‌ తిందాం.''
    బాల్కనీలో కుర్చీలు  వేసుకుని టీపాయ్‌ మీద పూరీలు పెట్టుకుని కూర్చున్నాం. ఎదురుగా ఎగిసిపడుతున్న సముద్రం. మా మనసులు అలాగే వున్నాయి.
    ''మహీ! భిమ్లీ వెళ్ళొద్దామా? నాకు చాలారోజులుగా నీతో కలిసి ఎటైనా వెళ్ళాలన్పిస్తోంది. అసలు మనం కలిసి ప్రయాణం చేసి ఎన్ని సంవత్సరాలైంది? ఎవరి కుటుంబాలతో వాళ్ళం వెళ్ళడం వేరు. ఏమంటావ్‌?''
    ''ఏమంటాను? పద పోదామంటాను. మా ఆయన నాలుగు రోజులదాకా రాడు. ఈ నాలుగు రోజులూ నావే. నాకిష్టమైనవన్నీ చేస్తాను. నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికొస్తాను.'' అన్నాను ఉత్సాహంగా.
    ''వండర్‌ఫుల్‌. నాకు ఓ అయిడియా వస్తోంది. మా అమ్మని ఈ నాలుగు రోజులూ మా ఇంట్లో వుండమంటాను. మనం ఎటైనా వెళదాం.''
    ''వావ్‌ పల్లవీ! వాట్‌ ఎ గ్రేట్‌ ఐడియా! మనకి కొంచెం ఏకాంతం దొరగ్గానే ఎంత డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నామో చూడు. ఎన్ని ఆలోచనలొస్తున్నాయో! అందుకే మనని ఏకాంతంగా వొదలరు. సంసారం, మొగుడు, పిల్లలు - 24 గంటలూ ఇవే ఆలోచించడంవల్ల, అసలు ఏకాంతంగా ఆలోచించుకునే వెసులుబాటు లేకపోవడంవల్లనే మనం మన గురించి ఆలోచించలేకపోతాం. మన సృజనాత్మకశక్తి కూడా చచ్చిపోతుంది. మనకి ఏకాంతం దొరికితే కదా రాయడానికి?''
    ''మహీ! నీకు గుర్తుందా? మనం ఒకసారి చదివాం. ఓ తమిళ రచయిత్రి అర్థరాత్రిళ్ళు టాయ్‌లెట్‌లో కూర్చుని కవిత్వం రాసేదని. ఆమె మొగుడు ఆమెని రాయనిచ్చేవాడు కాడట. వాడికి పెళ్ళాం పక్కనే వుండాలి. నిద్రపోతున్నప్పుడు కూడా.''
    ''అవును. గుర్తుంది. పల్లవీ నువ్వు నిజంగానే అమ్మని రమ్మంటావా? నాలుగురోజులు నాతో గడుపుతావా?'' అనుమానంగా అడిగాను. ఎందుకంటే కొడుకులకి వండిపెట్టకపోతే ఆమెకి క్షణం తోచదు. తను ఇంట్లో లేకపోతే వాళ్ళసలు తిండే తినరని ఆమెకి భయం.
    ''నిజంగానే చెబుతున్నాను. ఇన్ని మాట్లాడుకున్నాక ఈమాత్రం ధైర్యం చెయ్యకపోతే ఎలా? మా ఆయనతో ప్రోబ్లమ్‌ లేదు. మా అమ్మ వస్తుందిలే.''
    ''అయితే మనం భువనేశ్వర్‌ వెళ్దామా?''
    ''భువనేశ్వరా? అంత దూరమా.''
    ''పోనీ అరకు వెళదామా? కనీసం భీమిలీ.''
    ''ఆగు... ఆగు... మహీ! భువనేశ్వర్‌ బెటర.్‌ నా కజిన్‌ కూడా వున్నాడు. బోలెడన్ని రైళ్ళు. రాత్రి ఎక్కితే పొద్దున దిగుతాం. హాయిగా కోణార్క్‌, పూరి, చిల్కాలేక్‌ చూద్దాం.'' ఉత్సాహంగా అంది పల్లవి.
    ''నువ్వలా చెబుతుంటే భలే బావుంది. అపుడే వెళ్ళిపోయినట్టుంది.'' అన్నాన్నేను.
    ''వెళ్ళిపోయినట్టు కాదు. వెళుతున్నాం. నేను ఇంటికెళ్ళి, అమ్మకు చెప్పి బట్టలు సర్దుకు వస్తాను. లంచ్‌కి బయటకెళదాం'' అంటూ పల్లవి వెళ్ళిపోయింది.
జ              జ              జ
    నా మనసు ఉత్సాహంతో ఉరకలేస్తోంది. ఉదయం నుంచి నాతో సయ్యాటలాడుతున్న ఏకాంతం మళ్ళీ నా ముందుకొచ్చి చిందేయసాగింది. ఈ ఏకాంతం ఎంత హృద్యంగా వుంది. ఈ నిశ్శబ్దం ఎంత నిరామయంగా వుంది. మనుష్యులు ఒంటరిగా వుండటానికి ఎందుకు భయపడతారో? బహుశా ఏకాంతానికి, ఒంటరితనానికి తేడా తెలియక కాబోలు. ఒంటరితనంలో దుఃఖం వుంటుంది. ఏకాంతంలో మనసులోతుల్ని, మనలోపలి ప్రపంచాలను ఆవిష్కరించుకునే సొగసైన తీరు వుంటుంది.
    ఏకాంతం ఎంత అపురూపమైందో ఈ రోజు నాకు అర్థమైంది. నా ఆలోచనలు ఇలా సాగుతుండగానే పల్లవి ఫోన్‌ చేసింది. అన్నీ అమిరిపోయాయ్‌. ఒంటిగంటకల్లా సూట్‌కేస్‌తో దిగిపోతున్నానంటూ ఫోన్‌. చెప్పలేని ఉద్వేగమేదో కమ్మినట్టయింది. నేను ఇల్లొదిలి నాలుగురోజులు పోయానంటే మా ఆయన ఏమంటాడో! అని కొంచెంసేపు పీకింది. ఏమంటాడులే! పోట్లాడతాడు. గొడవౌతుంది. కానీయ్‌. తను తిరుగుతూనే వుంటాడు. నేనొక్కసారి వెళితే ఏమౌతుంది?
    నేను ఆలోచనల్లో కొట్టుకుపోతుండగానే పల్లవి వచ్చేసింది. చేతిలో చిన్న సూట్‌కేస్‌.
    ''మీ అమ్మ ఏమంది.''
    ''వస్తానంది. పిల్లలొచ్చే టైంకి వచ్చేస్తుంది.''
    ''మనం! హఠాత్తుగా ఇలా బయలుదేరుతున్నాం కదా! నాకు మా అమ్మ తరచూ అనే మాట గుర్తొస్తోంది.''
    ''ఏంటే అది. ఏమనేది?''
    ''సాల్లో గుర్రం సాలినంత ధనం వుండాలే కాని స్వేచ్ఛకి అడ్డేముంటుంది'' అనేది మా నాన్నతో. మా నాన్న నవ్వేసేవాడు.
    ''సాల్లో గుర్రం. సాలినంత ధనం.'' వారెవా? ఎంత బాగా చెప్పారే. సాల్లో గుర్రం అంటే వాహనం. సాలితం ధనం అంటే డబ్బు. ఈ రెండూ వుంటే హాయిగా తిరగొచ్చు. భలే చెప్పారు ఆంట''ి.
    ''మగవాళ్ళకి ఈ రెండూ అందుబాటులో వుంటాయి. ఆడవాళ్ళకి అందనివి. స్కూటర్లూ, కార్లూ, బైక్‌లూ వాళ్ళకే. వనరులు, డబ్బులు, భూములు కూడా అంతే. వీటిలోనే స్వేచ్ఛ వుందని ఎంత గొప్పగా చెప్పిందో అమ్మ. అనుభవం మీద చెప్పి వుంటుంది.''
    ''మహీ! నీ ఉత్తరాలు కూడా తెచ్చాను. ఎంత కాలమైందో వాటిని చదివి. ఆ... అన్నట్టు మా కజిన్‌తో కూడా మాట్లాడాను. వాడు స్టేషన్‌కి వస్తానన్నాడు.''
    ''వండర్‌ఫుల్‌! పల్లవీ! రాత్రికి ఫలక్‌నుమా గుర్రాన్నెక్కి, కోణార్క్‌వేపు సాగిపోదాం.''
    ''మహీ! చాలా సంతోషంగా వుందే! మనకి ఇలాటి ఆలోచనలు ఇంతకుముందెందుకు రాలేదో కదా!''
    ''రావుగాక రావు. మనకి క్షణం తీరిక లేని రొటీన్‌ పనులవల్ల ఇలాంటి ఆలోచనలు రావు. గాలివాటుకి కొట్టుకుపోతుంటాం. మనకోసం మనని ఆలోచించుకోనివ్వని సంసార బాధ్యతల్లో మనల్ని మనం కోల్పోతాం. మనల్ని వెతికి పట్టుకోవడం అంటే చాలా సంఘర్షణ పడాలి. అసలు విషాదం అక్కడే వుంది. సరే. పద. లంచ్‌కెళదాం.''
*                     *                       *
    ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ భువనేశ్వర్‌ వేపు దూసుకెళుతోంది. నేను పల్లవి అంతూదరి లేని మాటల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. ఆ మాటల్లో మా కథలు, కవిత్వాలు, ఉత్తరాలు, ఆటలు బాల్యజ్ఞాపకాలు, ఊరి సంగతులు, కాలేజి కబుర్లు వస్తూ పోతూ వున్నాయి. ఆ ప్రవాహంలో, ఆ ఒరవడిలో మనసుకంటిన మకిలి కరిగిపోతున్నట్టుగా  వుంది. ఇంతకాలం కోల్పోయినదేదో ఊటలాగా ఒక్కోచుక్క రాలుతున్నట్టుగా వుంది. నన్ను నేను వెతికి పట్టుకున్నట్టుగా వుంది.
*                           *                      *
    మా ముచ్చట్లను లోతుగా పరికిస్తోన్న రైలు ఒక రకమైన ఉద్విగ్నతతో చీకట్లను చీల్చుకుంటూ వెలుగుదారుల్లోకి నడుస్తోంది.
*                            *                           *

Thursday, August 2, 2012

భువనేశ్వర్ వచ్చింది మహా సీరియస్ మీటింగ్ కి.
జెండర్ బడ్జెట్.బడ్జెట్ ని స్త్రీల ద్రుష్టి కోణం నుండి,
జెండర్ పర్స్పెక్టివ్ నుండి ఎలా అర్ధం చేసుకోవాలి
అనే అంశం మీద మీటింగ్ జరిగింది.
కెంద్ర ప్రభుత్వం గ్రుహ హింస నుండి స్త్రీలకు రక్షణ కల్పించే చట్టం తెచ్చింది గానీ
దాని అమలుకు సరిపడిన నిధులివ్వడం లేదు.
జెండర్ బడ్జెట్ కు,ఈ అంశానికి ఉన్న లింక్ కు సంబంధించి
భువనేశ్వర్ లో ఒకటిన్నర రోజులు మీటింగ్ జరిగింది.
చర్చోపచర్చలు,తీర్మానాలు అయ్యాయి.
బుర్ర వేడెక్కిపోయి చల్లగాలి పీల్చుకోకపోతే పిచ్చెక్కిపోయేలా ఉందని కారు బుక్ చేసుకుని కోణార్క్ కి పారిపొయ్యా.
కోణార్క్ శిల్ప సౌందర్యం రెండు కళ్ళు విప్పార్చుకుని చూడాల్సిందే.
అద్భుత శిల్పవిన్యాసం.
ఎన్నివేలమంది శిల్పులు అహర్నిశలు అన్నపానాలు లేకుండా చెక్కారో.
సూర్యుడి రధచక్రాలను చూస్తుంటే ఆ రధం కదులుతున్నదా అనే భ్రమ కలుగుతుంది.
కోణర్క్ చూడడం గొప్ప అనుభవం.
కోణర్క్ నుండి సముద్ర తీరం వెంబడి పురి వెళ్ళడం
మరో అపూర్వానుభవం.
వైజాగ్ నుండి భీమిలి వెళ్ళే రోడ్డులా ఉంటుంది.
దీన్ని మెరైన్ డ్రైవ్ అంటారట.
మధ్యలో దట్టమైన అడవి కూడా వస్తుంది.
పురి బీచ్ అండమాన్ బీచ్ లాగా అనిపించింది.
స్వచ్చంగా,శుభ్రంగా వుంది.
నీలి ఆకాశం రంగులో మిల మిల మెరిసిపోయే నీళ్ళు.
ఇటీవల అక్కడ సముద్రం రోడ్డు మీదకొచ్చేసిందట.అక్కడ రోడ్డు కోతకు గురైంది.
నేను నీళ్ళల్లోంచి బయటకు వచ్చేస్తుంటే కెరటాలు నా పాదాలను పట్టుకొని వెళ్ళిపోవద్దని బతిమాలినట్టు అనిపించింది.
నేను పొవ్వాలని వెనక్కి తిరిగానో లెదో కెరటాలు ఎగురుకుంటూ వచ్చి మళ్ళి మళ్ళీ నా పాదాలను తాకుతూనే ఉన్నాయి.
వెళ్ళొద్దని అడుగుతూనే ఉన్నాయి.
దిగులుగానే వాటిని వదిలేసి జగన్నాధ గుడి వేపు మళ్ళిపోయాను.
అక్కడి కెళ్ళడం ఓ భయంకరానుభవం.
ఇరుకిరికు రోడ్డు,ఆ రొడ్డు నిండ యాచకులు,పశువులు,దుకాణాలు.
గుడిముందు ఏమిటొ మంటలు.గుళ్ళోకి తీసుకెళ్ళి దర్శనం చేయిస్తానంటూ వేధించే పురోహితులు.
వద్దు మొర్రో అంటే వినడు.
నేను గుళ్ళో కెళ్ళను బాబో అంటే నన్నో వింత మ్రుగాన్ని చూసినట్టు చూసి క్యోం ఆయా ఇత్నా దూర్ అంటూ లెక్చరివ్వబోయాడు.
అతన్ని తప్పించుకుని,పురి ఇరుకులోంచి బయటపడి
భువనేశ్వర్ వైపు సాగిపోయా.
కోణర్క్, పురి బీచ్ చూడడం మహాద్భుతం.మంచి అనుభవం.
మొదటి సారి భువనేశ్వర్ వచ్చి ఒక్కదాన్ని వెళ్ళిరావడం మహా థ్రిల్లింగ్ గా ఉంది.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...