1993లో తొలి సంచిక విడుదలైన కొంత కాలం తర్వాత తొలి రోజుల్లో వున్న చాలామంది వెళ్ళిపోయారు. అప్పట్లో భూమికలో ప్రచురించే ఆర్టికల్స్ గురించి, సంపాదకీయాల గురించి అందరం చర్చించేవాళ్ళం. సజయ, నేను సోమాజిగూడలో వుండే నవ్య ప్రింటర్స్‌లో గంటల తరబడి వుండేవాళ్ళం. డిటిపి సెంటర్లో రోజుల తరబడి వుండి పనిచేయించాల్సి వచ్చేది. అన్ని పనులూ పూర్తయ్యి, సంచిక బయటకొచ్చాక దానిమీద, జరిగిన పనిమీద ఎవరు ఎంత చేసారు? ఎవరు చెయ్యలేదు అనే అంశం మీద వాడి, వేడి చర్చలు జరిగేవి. చాలాసార్లు రసాభాసగా ఈ సమీక్షా సమావేశాలు ముగిసేవి. సామూహికంగా పనిచేయడంలోని వొత్తిళ్ళను ఇవి ప్రతిబింబించేవి.
త్రైమాసిక పత్రికగా మొదలై, ద్విమాసంగా కొన్నాళ్ళు కొనసాగి ప్రస్తుతం భూమిక మాసపత్రికగా నిలదొక్కుకుంది. అన్వేషి ఆఫీసులో వున్నంతకాలం అన్నింటికీి – ఫోన్, జిరాక్స్‌లాంటి వాటికి కూడా అన్వేషి మీదే ఆధారపడేవాళ్ళం. ఇలా కొన్ని రోజులు జరిగాక భూమిక ఆఫీసు తార్నాకకి మారింది. డా. జి. భారతి, భూమిక విమెన్స్ కలెక్టివ్ అధ్యక్షురాలు, తన ఇంట్లో ఒక రూమ్ భూమికకు ఇచ్చారు. నిజానికి భారతికి భూమికపట్ల అవ్యాజమైన ప్రేమ ఉండేది. చనిపోయే వరకు భూమికలో కొనసాగారు. భూమిక కోసం విరాళాల సేకరణలో భాగంగా ‘అలర్‌మేల్ వల్లి’ నృత్యప్రదర్శన ఏర్పాటు చేసినపుడు భారతి మిత్రులు చాలామంది ఆర్థికంగా సహకరించారు. భూమిక నిలదొక్కుకోవడానికి భారతి చేసిన కృషి మర్చిపోలేనిది.
1998లో భూమిక ఆఫీసు బాగ్‌లింగంపల్లికి మారింది. అప్పటి నుండి భూమిక అడ్రస్ బాగ్‌లింగంపల్లి వాటర్ ట్యాంకు పక్కనే. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రతి సంచిక వెలువడటానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చేది. తెలంగాణా ప్రత్యేక సంచిక తేవడం వెనుక ఎంతో మంది అకుంఠిత కృషి వుంది. అనిశెట్టి రజిత వరంగల్ నుండి హైదరాబాదుకు వచ్చి వుంది కొంతకాలం ఇక్కడే వుంది. ఆ తర్వాత కాలంలో పి. శైలజ కూడా భూమికలో చేరింది.
అప్పటివరకు ఒక సామూహిక ప్రయత్నంగానే భూమిక వెలువడింది. 2000లో హఠాత్తుగా అందరూ భూమికను వదిలేసారు. ఎందుకు వదిలేసారనే దానికి సమాధానం నా దగ్గర లేదు. దానికి నేను బాధ్యురాలను కూడా కాదు. ఆర్ధికంగా కూడా ఏ మాత్రం బాగా లేని ఆ రోజుల్లో భూమిక బాధ్యతని ఒక్కదాన్ని తలకెత్తుకున్నాను. భూమిక పట్ల నాకున్న నిబద్ధత, ప్రేమ వల్ల ఈ బాధ్యత నన్నేమీ భయపెట్టలేదు. ఎలాగైనా సరే పత్రికను ముందు తీసుకెళ్ళాలి. ఎవరున్నా ఎవరు వెళ్ళిపోయినా నేను మాత్రం భూమికను వదిలే ప్రశ్నేలేదనిపించింది. 2000లో నా ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసాను. మనస్ఫూర్తిగా నా మొత్తం సమయాన్ని భూమికకే కేటాయించాను. అప్పుడు నాకు వచ్చిన పెన్షన్ రూ. 2400. ఇరవై సంవత్సరాలలో భూమిక నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని సగర్వంగా పాఠకులకు చెప్పదలుచుకున్నాను.
2003లో దశాబ్ది ప్రత్యేక సంచిక వెలువరించాం. అంతర్జాతీయ మహిళాదినం సందర్భంగా నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన అతి పెద్ద సమావేశంలో ఈ ప్రత్యేక సంచికని ఆవిష్కరించాం. ఆ తరువాత పిల్లల ప్రత్యేక సంచిక, ప్రపంచీకరణ, చేనేత, వ్యవసాయ సంక్షోభం, దళిత మహిళ, హెచ్‌ఐవి/ఎయిడ్స్, రచయిత్రుల ప్రత్యేక సంచిక ఇలా ఎన్నో సమకాలీన సామాజిక అంశాల మీద స్త్రీల దృష్టిికోణంతో ప్రత్యేక సంచికలు వెలువరించాం. వీటన్నింటిని పాఠకులు ఆదరించారు. మమ్మల్ని ముందుకు నడిపారు. ఒక్క సంచిక కూడా మిస్ అవ్వకుండా భూమిక వస్తూనే వుంది.
అన్వేషి తర్వాత భూమికకు అండగా నిలిచింది ‘నిర్ణయ’ సంస్థ వ్యవస్థాపకులు ఇందిర జెన. మూడు సంవత్సరాల పాటు నిర్ణయ భూమికను ఆర్థికంగా ఆదుకున్నది. తనకి మన:పూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
2006లో ఆక్స్‌ఫాం ఆర్థిక సహకారంతో భూమిక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాం. ఈ హెల్ప్‌లైన్‌ను మొదలుపెట్టడానికి ముఖ్య కారకురాలు గిరిజ. తెలుగు సాహిత్యంలోను, సమాజంలోను భూమిక పత్రిక ఆవిర్భావం ఎంత చారిత్రాత్మకమైన సంఘటనో, సమస్యలనెదుర్కొంటున్న స్త్రీల సహాయార్థం ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చెయ్యడం అంతే చారిత్రాత్మకమైనది. భూమికను నడుపుతున్న క్రమంలో, ఆ అనుభవంతో స్త్రీలకు ప్రత్యక్షంగా సహకారమందించడం చాలా అవసరమనిపించింది. ప్రభుత్వం నడిపే అరకొర హెల్ప్‌లైన్‌లు తప్ప అప్పటివరకు స్త్రీలకోసం ఏ సంస్థకూడా హెల్ప్‌లైన్ ప్రారంభించలేదు. దీనిద్వారా ఈ అయిదేళ్ళ కాలంలో దాదాపు 12000 మంది మహిళల సమస్యల్ని విన్నాం. వారికి ధైర్యమిచ్చాం. తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా వారికి దిశానిర్దేశం చెయ్యగలిగాం. ముగ్గురు నిపుణులైన కౌన్సిలర్లు ఉదయం నించి రాత్రి వరకు వారి సమస్యలను వింటారు. వారికి సలహా, సమాచారం అందిస్తారు. ఎంతో మంది బాధిత మహిళల్ని హింసాయుత పరిస్థితుల్లోంచి రక్షించిన అనుభవాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ప్రస్తుతం భూమిక హెల్ప్‌లైన్ గురించి రాష్ట్రంలోను, దేశంలోనే కాదు అంతర్జాతీయంగా తెలుసు. ఎందరో ఎన్‌ఆర్‌ఐ బాధితులు హెల్ప్‌లైన్‌కు కాల్ చేస్తున్నారు. భూమిక హెల్ప్‌లైన్ ఈ రోజు బాధిత స్త్రీలకు స్నేహహస్తంలాగా మారింది. సమస్యల్లో వున్నవారికి ఠక్కున గుర్తొచ్చేది భూమిక హెల్ప్‌లైన్ మాత్రమే అని ఈ రోజు సగర్వంగా చెప్పగలను.
హెల్ప్‌లైన్ నడుపుతున్న అనుభవంతో మహిళలకు అందుబాటులో వున్న సహాయ సంస్థల వివరాలు, అవి పనిచేస్తున్న తీరుతెన్నులు గురించి తెలుసుకోవాల్సిన అవసరం కన్పించింది. స్త్రీల సహాయార్థం ప్రభుత్వం నడుపుతున్న వసతిగృహాలు, స్వాధార్ హోమ్స్, హెల్ప్‌లైన్‌ల గురించి ఒక అధ్యయనం చేసి, ఆ రిపోర్ట్‌ని ప్రభుత్వానికి ఇచ్చాం. బాధిత మహిళలకోసం నడుస్తున్న ఈ వసతి గృహాలు ఎంత అధ్వాన్న స్థితిలో వున్నాయో ఈ అధ్యయనం అర్థం చేయించింది. అలాగే పోలీసువ్యవస్థతో పనిచేయాల్సిన అవసరం, వారికి జండర్ స్పృహ కల్గించాల్సిన ఆవశ్యకత ఎంతో వుంది. ఆక్స్‌ఫామ్ ఇండియా సహకారంతో నాలుగు మహిళా పోలీస్‌స్టేషన్లలోను, ఉమెన్ ప్రొటక్షన్ సెల్‌లోను నిపుణులైన కౌన్సిలర్‌లతో సపోర్ట్ సెంటర్‌లు ఏర్పాటు అయ్యాయి. అనంతపురం, వరంగల్, కరీంనగర్‌లోను, బహీర్‌బాగ్‌లోని మహిళా పోలీస్‌స్టేషనులోను, సిఐడి ఆఫీసులోని వుమెన్ ప్రొటెక్షన్‌సెల్‌లోను పూర్తిస్థాయి సపోర్ట్ సెంటర్‌లు నడుస్తూ స్త్రీలకు ఎంతో సహాయంగా వున్నాయి. వీటి పర్యవేక్షణ, అక్కడ పనిచేసే కౌన్సిలర్లకి శిక్షణా తరగతులు నిర్వహించడం లాంటి బాధ్యతలను భూమిక నిర్వహిస్తోంది.
అన్నింటికన్నా ముఖ్యమైన కార్యక్రమం న్యాయవ్యవస్థలోకి ప్రవేశించగలగడం. సాధారణంగా కోర్టులన్నా, న్యాయమూర్తులన్నా మనకి ఒకలాంటి భయం, బెదురు వుంటుంది. అందరికీ దూరంగా వుండే న్యాయవ్యవస్థలోకి మేము ప్రవేశించడమేకాక శిక్షణలో వున్న న్యాయమూర్తులకు జండర్ అవగాహనపై శిక్షణనిచ్చాం. హింసలో మగ్గుతున్న మహిళలకి సత్వర న్యాయం ఎంత అవసరమో ఈ శిక్షణలో చెప్పగలిగాం. అలాగే రక్షక్ పోలీసులకి కూడా జండర్ ట్రయినింగ్ ఇచ్చాం. ఈ కార్యక్రమాలను చేపట్టడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం బాధిత మహిళలకి సహాయాన్ని, న్యాయాన్ని అందించాల్సిన సంస్థల్ని, వ్యవస్థల్ని జండర్ స్పృహతో పనిచేసేలా, స్పందించేలా చెయ్యడమే.
అలాగే 2006లో అమలులోకి వచ్చిన గృహహింస నిరోధక చట్టాన్ని పకడ్బందీగా , పఠిష్టంగా పనిచేయించడానికి స్త్రీ శిశు అభివృద్ధి శాఖతో కలిసి ఎన్నో సమావేశాలు నిర్వహిచాం. రక్షణాధికారులంటే ఎవరు? వాళ్ళెక్కడవుంటారు? వాళ్ళ దగ్గర పనిచేస్తున్న కౌన్సిలర్ల పనితీరేమిటి? ఎంతవరకు వీరు బాధిత మహిళలకు అందుబాటులో వుంటున్నారులాంటి అంశాల మీద ఇప్పటివరకు చాలా సమావేశాలు పెట్టాం. అలాగే ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అధారిటీ వారు అందించే ఉచిత న్యాయం మహిళలకు అందుతోందా? దీనిపట్ల మహిళల్లో అవగాహన వుందా? ఉచిత న్యాయమంటే ఏమిటి? ఎవరు ఎవరికి ఇస్తారు? వీటన్నింటిమీద ఒక అధ్యయనం చేసి ఆ నివేదికను లీగల్ సర్వీసెస్ అధారిటీకి ఇచ్చాం. భూమిక ఆఫీసులో లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభించాం.
స్త్రీల అభ్యున్నతికోసం స్త్రీలే నడుపుతున్న స్వచ్ఛంద సంస్థలు మన రాష్ట్రంలో చాలా వున్నాయి. అయితే వీరంతా గ్రామీణ నేపథ్యంతో ఎక్కువశాతం గ్రామాలలోనే అట్టడుగు స్థాయి స్త్రీలతో పనిచేస్తుంటారు. వీరు ఇంట్లోను, పనిచేసేచోట అనేక సమస్యలను, ఒత్తిళ్ళలను ఎదుర్కొంటుంటారు. వారికోసం సిడబ్ల్యుఎస్ సహాకారంతో వారి సామర్థ్యాలను పెంపొందించేలా రెండు రిలాక్సేషన్ వర్క్‌షాప్‌లను నిర్వహించాం.
గత సంవత్సరం నవంబర్ సంచికను ప్రత్యేక సంచికగా వేసాం. ఇందులో స్త్రీలు-చట్టాలు, స్త్రీల సహాయార్థం ఏర్పడిన సహాయ సంస్థలు, రక్షణాధికారులు, న్యాయాధికారులు, పోలీసు అధికారులు మొదలైన వారి వివరాలతో పాటు వారి ఫోన్ నెంబర్లతో సహ ఈ సంచికలో ప్రచురించాం. దీనిని అప్పటి మహిళా శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్ ఉషారాణిగారి సహకారంతో ప్రచురించి పన్నెండు వేల కాపీలు ముద్రించి అంగన్‌వాడి స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఉచితంగా పంపిణీ చేసాం. ప్రతి అధికారి చేతిలోను ఇదొక రిఫరెన్స్ బుక్ లాగా వుండాలని, తక్షణం బాధిత స్త్రీలకు సహాయమందించేలా వారికి ఉపకరించాలని మేము భావించాం. ఈ ప్రయత్నాన్ని ఎంతోమంది ప్రశంసించారు. కలెక్టర్లతో సహ ఎందరో ఉత్తరాలు రాసి ఈ పుస్తకం తమకు చాలా ఉపయోగంగా వుందని చెప్పారు. స్త్రీలకు సంబంధించిన అంశాలపట్ల అందరికీ అవగాహన కల్గించాలనే మా సంకల్పం చాలావరకు నెరవేరిందని మేము సగర్వంగా మా పాఠకులకు తెలియచేస్తున్నాం.
ఇరవై సంవత్సరాలుగా భూమిక పత్రికను నడుపుతున్న అనుభవంలోంచి హెల్ప్‌లైన్ ఆవిర్భవించింది. హెల్ప్‌లైన్‌ని విజయవంతంగా నడుపుతున్న క్రమంలోంచి మాకు ఫోన్ చేసిన బాధిత మహిళలకు న్యాయం అందించడంకోసం వారికి కావలసిన సపోర్ట్ సిస్టమ్స్‌ను సక్రమంగా పనిచేయించాల్సిన బాధ్యతతోనే మేము పైన పేర్కొన్న కార్యక్రమాలను నిర్వహించాం. స్త్రీల జీవితాలను ప్రభావితం చేసే ప్రతి అంశంమీద మేము స్పందించాం. ఆసిడ్ దాడుల మీద, పనిచేసేచోట లైంగికవేధింపులు, లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిండాలను చంపేసే దుర్మార్గం మీద, రాష్ట్ర స్థాయి సమావేశాలు పెట్టాం. ఐ.పి.సి సెక్షన్ 498ఎ మీద రంగారెడ్డి, హైద్రాబాద్ జిల్లాల్లో ఒక విస్తృతమైన అధ్యయనం చేసి, 498ఎ దుర్వినియోగం కావడం లేదు చాలా తక్కువగా ఉపయోగించుకోబడుతోంది అని డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌తో సహ రుజువు చేసాం.
భూమిక ఇరవై సంవత్సరాల పయనంలో నాతోపాటు ఎందరో నడిచారు. ప్రారంభంలో భూమికతో వున్న వాళ్ళందరూ వెళ్ళిపోయినా ఎందరో కొత్తవాళ్ళు వచ్చి చేరారు. భూమిక నిర్వహించే సాహితీ యాత్రల్లో, సమావేశాల్లో భాగస్వాములవు తున్నారు. ఇరవై ఏళ్ళ భూమిక పట్ల మీ అభిప్రాయం చెప్పండి అని కొందరు సాహితీ మిత్రులకు, పాఠకులకు ఉత్తరం రాసాం. సాహిత్యంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ప్రముఖులు, వివిధ రంగాలలో లబ్థ్ద ప్రతిష్ఠులైన ఆత్మీయులు రాసిన ఉత్తరాలు చదివాక నాకు హిమాలయాలను అధిరోహించినంత ఆనందం కలిగింది. నా జీవిత లక్ష్యం నెరవేరినంత సంతృప్తి కలిగింది. తెలుగునాట భూమిక వేసిన ముద్ర, తెలుగు సాహిత్యంలో భూమిక స్థానం గురించి ప్రముఖుల అక్షరాలలో చదివాక నేను ఒక వ్యక్తిగా నా సామాజిక బాధ్యతను నిర్వర్తించగలుగుతున్నానని అనుకుంటున్నాను. భూమిక పట్ల, నా పట్ల ఆదరాన్ని, ఆత్మీయతని, ప్రదర్శించిన వారందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
నా గుండె లబ్‌డబ్‌మంటూ కొట్టుకున్నంతకాలం నేను బాధితస్త్రీల పక్షాన పనిచేస్తూనే వుంటాను. ఈ ఇరవై సంవత్సరాల కాలంలో నాతో కలిసి వున్నది ప్రసన్న మాత్రమే. ప్రసన్న జీవితం కూడా నాలాగే భూమికతో ముడిపడి పోయింది. తను లేకుండా భూమికగానీ, నేనుగానీ ఒక్క అడుగు ముందుకేయలేం. తను అంతగా భూమికతో పెనవేసుకుపోయింది. భూమిక సర్క్యులేషన్ చూసే లక్ష్మి గురించి కూడా నేను తప్పక రాయాలి. ఎంతో భిడియంగా ఉద్యోగంలో చేరిన లక్ష్మి ఈ రోజు ఎంతో ధైర్యంగా ప్రభుత్వ ప్రకటనల కోసం ఐఎఎస్ అధికారుల్ని ఒప్పిస్తుంది. భూమికలాంటి చిన్న పత్రికలకు మీరు అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చి తీరాలంటూ వాళ్ళతో వాదిస్తుంది. ప్రకటనలు సంపాదిస్తుంది. భూమిక మనుగడకు ఆమె తెచ్చే ప్రకటనలు చాలా అవసరం. నెలకి ఒకటో రెండో ప్రకటనలు రావడం వల్లనే మేము సకాలంలో పత్రికను తేగలుగుతున్నాం.
ఈ ప్రయాణంలో మేము ఎదుర్కొన్న సమస్యల చిట్టాను ఇక్కడ నేను రాయలేదు. ఆర్థికంగా భూమికను ఆదుకున్న వారు చాలామంది వున్నారు. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతాభివందనాలు తెలియచేస్తున్నాను. అయితే మనస్సు చివుక్కుమనేట్టు, ముల్లు కసుక్కున గుచ్చుకున్నట్లు ప్రవర్తించిన వారు కూడా వున్నారు. భూమిక కేవలం చందాలు, మిత్రుల విరాళాల మీదే నడుస్తున్నది. ఎంతో కాలంగా భూమికను ఉచితంగా పొందుతూ కూడా చందా కట్టండి, మేము చాలా కష్టాల్లో వున్నామని అడిగినందుకు చాలా మందికి కోపం వచ్చింది. మమ్మల్ని చందా అడుగుతారా అంటూ కొందరు కళ్ళెర్రచేసారు!!! అది వారి వారి సంస్కార స్థాయిని పట్టిస్తుందంతే !మేము అడగకుండానే భూమిక పట్ల వారికున్న ప్రేమను వ్యక్తం చేస్తూ భారీ విరాళాలు ఇచ్చిన వారున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో వుండే జెఎల్‌రెడ్డిగారు రూ. 50,000 చెక్కును అబ్బూరి ఛాయాదేవిగారి ద్వారా మాకు పంపించారు. అలాగే సత్తిరాజు రాజ్యలక్ష్మిగారు రూ.20,000 విరాళమిచ్చారు. ఈ ప్రత్యేక సంచికను ఇన్ని పేజీలతో తీసుకురావడానికి ధైర్యమిచ్చింది ఈ రెండు చెక్కులే అంటే అతిశయోక్తి కాదు. వారిరువురికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నాకెంతో మనోధైర్యానిచ్చే అబ్బూరి ఛాయాదేవిగారికి నా కృతజ్ఞతలు. అలాగే నా నేస్తం గీత సర్వకాల సర్వావస్థల్లోను నాతో వుంటుంది. భూమిక సాహితీయాత్రల్లో తనదే ప్రధాన పాత్ర. తను లేకుండా భూమిక యాత్రలు సాధ్యంకావు. భూమికతో నా ప్రయాణంలో గీత పదిహేను సంవత్సరాలుగా నావెన్నంటి వుంది. ఆమెకి మరింత స్నేహాన్ని తప్ప ఇంకేమి ఇవ్వలేను.
చివరగా, భూమిక నిర్వహిస్తున్న ఎన్నో కార్యక్రమాలు, సమావేశాలు, సాహితీయాత్రలు, నెలనెలా రచయిత్రులతో మీటింగులు- వీటన్నింటి వెనుక భూమిక బృందం కృషి వెలకట్టలేనిది. జయ, ప్రసన్న, లక్ష్మి,శిలాలోలిత, నాగమణి, కల్పన, వెన్నెల, ముజీబా తరన్నుమ్- వీళ్ళందరూ నా బలం, నా సైన్యం. నేను చేసే యుద్ధాలను గెలిపించేది వాళ్ళే. నా సంకల్పాలను ఆచరణలోపెట్టేది, ఆవిష్కరించేది వాళ్ళే. మేమందరం కలిసి మరిన్ని కార్యక్రమాలను స్త్రీల పక్షాన నిర్వహిస్తామని భూమికను మరింత పదునుగా, స్త్రీవాద ఉద్యమ స్ఫూర్తితో ముందుకు నడిపిస్తామని మా కత్యంత ఆత్మీయులైన మీకందరికీ హామీ యిస్తున్నాను.
ఇరవై సంవత్సరాల కాలంలో భూమిక ప్రచురించిన అత్యున్నత ప్రమాణాలున్న రచనలను ఈ ప్రత్యేక సంచికలో పునర్ముద్రించాం. కొత్తతరం పాఠకులకు వీటిని అందుబాటులోకి తేవాలన్న మా సంకల్పాన్ని పాఠకులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఎప్పటిలాగానే మీరు భూమికను ఆదరించాలని, అండగా వుండాలని కోరుతూ….