Friday, June 25, 2021

ఎక్కిన సైకిల్ దిగాలంటే మైలురాయే దిక్కు


సైకిల్ కి ఓ అంతర్జాతీయ దినోత్సవం ఉందని నాకు తెలియదు.
రఘు మందాటి వాల్ మీద సైకిల్ గురించిన పోస్ట్ చదివాకా నాకు సైకిల్ తో ఉన్న అనుభవం గుర్తొచ్చింది.తప్పక రాయాల్సిన అనుభవం కూడా.
నా చిన్నప్పుడు బహుశా పన్నెండు పదమూడేళ్ళుంటాయేమో నాకు.
మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం.మా నాయనమ్మ,తాత లకి తొమ్మండుగులు సంతానం.ఏడుగురు కొడుకులు,ఇద్దరు కూతుళ్ళు.
అందరికీ ఆరు లేక ఏడుగురేసి పిల్లలు.మేము ఐదుగురం.ఇద్దరక్కలు,ఒక తమ్ముడు ఒక అన్న.
అలా అందరింట్లోను పుష్కలంగా పిల్లలుండేవాళ్ళు.
చుట్టాలు,మా కుటుంబం లోనే ఉండే కొంతమంది ఆడవాళ్ళు కలిసి డెబ్భై మంది వరకు ఉండేవాళ్ళు.అంత పెద్ద కుటుంబమన్నమాట.
మా వీధరుగు మీదే బడి ఉండేది.సూర్య ప్రభ అనే టీచర్ వచ్చి చదువుచెప్పేవారు.
తర్వాత రామాలయం దగ్గర బడి బిల్డింగ్ కట్టారు.రామన్న పంతులు,బాపిరాజు అనే టీచర్లు వచ్చి చదువుచెప్పేవారు.అక్కడ ఐదువరకే ఉండేది.ఆరు చదవాలంటే పెద్ద సీతారామపురం వెళ్ళాలి.అన్నట్టు మాది చిన్న సీతారామపురామన్నమాట.
మా వీధిబయట బోలెడన్ని సెకిళ్ళుండేవి.మా నాన్న సెకిల్ మీదే పొలమెళ్ళేవాడు.మా చిన్నాన్న,పెదనాన్నలు కూడా సైకిళ్ళే వాడేవారు.
సైకిళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు మగపిల్లలు ధనాధనా కిందా మీదా పడుతూ నేర్చేసుకునేవాళ్ళు.
స్కూళ్ళకి వేసుకెళ్ళేవాళ్ళు.
ఆడపిల్లలం సైకిళ్ళు నేర్చుకోవడానికి చాలా కష్టపడేవాళ్ళం.
ఒకటి చాలా ఎత్తుగా ఉండడం రెండు గౌనుల మీద ఎక్కలేకపోవడం.
ఎన్నోసార్లు ఫెడల్ మీద నుంచి తొక్కి గౌనులు చింపుకోవడం.మాకు ఎక్కువ గౌనులు కూడా ఉండేవి కావు.
చాలా తక్కువగా లంగా జాకెట్ లు ఉండేవి.లంగా కట్టినప్పుడు కచ్చాపోసి సైకిల్ తొక్కేసే వాళ్ళం.
ఒకటో రెండో లంగాలు చిరిగాయంటే వీపులు విమానం మోతలే.
మా అమ్మ నాన్న నన్నెప్పుడూ కొట్టినట్టు నాకు జ్ఞాపకం లేదు.సైకిల్ తొక్కద్దని కూడా ఎవరూ రూల్స్ పెట్టలేదు.మీ పాట్లు మీరు పడండి అని వదిలేసారు అంతే.ఆడపిల్లల కోసం ముందు రాడ్ లేకుండా కొంచం ఎత్తుతక్కువ సైకిళ్ళున్నాయని మాకు తెలిసే అవకాశమే లేదు.మా నాన్నకి కూడా తెలిసుండదు.తెలిసుంటే తప్పకుండా నా కోసం ఆడపిల్లల సైకిల్ కొనేవాడు.
అలా అష్టకష్ఠాలు పడి సైకిల్ నేర్చేసుకున్నాను.
మాది చాలా ఎత్తైన అరుగులున్న మండువా లోగిలి.సైకిల్ ని చీడీలవరకు తెచ్చి హాయిగా ఎక్కేసేదాన్ని కానీ దిగేటప్పుడు కాళ్ళు నేలకి అందేవి కాదు.మళ్ళీ చీడిలదాకా వచ్చి దిగాల్సిందే.
ఊర్లో వరకే ఈ సాహసాలు.
మా ఊరి నుండి మెయిన్ రోడ్డు దాదాపు ఒక కిలోమీటర్ దూరముంటుంది.
ఈ దూరమంతా నడిచి కాలవ గట్టుకి వస్తే ఎర్రబస్సులు,రిక్షాలు,గుర్రం బండీ లు దొరుకుతాయి.కానీ డబ్బులివ్వాలి కదా.
మా నాన్న నన్ను నోరు తిరగని ఓ స్కూల్లో చేర్పించాడు.
దాని పేరు "హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘం స్కూల్."
షార్ట్ గా "విడో హోం" అనేవాళ్ళు.అది ఓరియంటల్ స్కూల్,అక్కడ సంస్కృతం తప్ప వేరే సబ్జెక్ట్ ఉండదు.
మా సీతారామపురం నుండి నాలుగు కిలోమీటర్ల దూరం లో ఉన్న నరసాపురం లోని స్కూల్ కి వచ్చేదాన్ని.
చాలా సార్లు నడకే,కొన్ని సార్లు మా కజిన్స్ దింపడం.చాలా సార్లు సైకిళ్ళ మీద స్కూల్ కి వెళ్ళే మగపిల్లల్ని లిఫ్ట్ అడిగి వెళ్ళేదాన్ని.
సరే..సైకిల్ కధకొస్తే నరసాపురం వరకు సైకిల్ మీద వెళ్ళడానికి ప్రయత్నం చేసి దిగడం రాక కింద పడి చాలా దెబ్బలు తగిలించుకున్నాను.
ఓ రోజు సైకిల్ మీద వెళుతున్నాను.పుస్తకాలు జారిపోయాయి.ఎలా దిగాలి.
నా దృష్టి పక్కనే ఉన్న మైలు రాయి మీద పడింది.
సైకిల్ బ్రేక్ వేసి మైలు రాయి మీద కాలేసి సునాయాసంగా దిగిపోయాను.సైకిల్ స్టాండ్ వేసి పుస్తకాలు తెచ్చుకుని స్కూల్ కి వెళ్ళిపోయాను.
ఆ తర్వాత సైకిల్ దిగేటప్పుడు మళ్ళీ కిందపడలేదు.దెబ్బలు తగిలించుకోలేదు.
నాకేదో సొంతంగా సైకిలుండేదని,రోజూ ఝామ్మంటూ వెళ్ళేదాన్నని అనుకునేరు.
అలా ఏమీ లేదు.ఎప్పుడైనా సైకిల్ ఖాళీగా ఉంటే నేను ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా సైకిల్ తీసుకుని ఉడాయించేదాన్ని.
చాలా సార్లు మధ్యలో స్కూల్ కి వచ్చి ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోయేవారు.
మా నడక,లిఫ్ట్ లు షరా మామూలే.
ఎత్తైన సైకిల్ మీద నుంచి మహా పొట్టిగా ఉండే నేను దిగాలంటే నేను కనిపెట్టిన సాధనం మైలురాయి.
ఆడపిల్లలకి అనుకూలమైన సైకిళ్ళొచ్చేసాయి గానీ నేను కనిపెట్టిన మైలురాయి ప్రయోగం తక్కువదేమీ కాదని నా ఉద్ధేశ్యం.
నాకు ఇప్పటికీ సైకిల్ తొక్కడం చాలా ఇష్టం.స్కూటర్లు,కార్లు వచ్చాకా కూడా మనసు సైకిల్ మీదే ఉంటుంది.
ఆ మధ్య ప్రశాంతి తో కలిసి వర్ని వెళ్ళినప్పుడు ఉండబట్టలేక పిల్లల సైకిల్ తొక్కాను.భలే మజా వచ్చింది.
May be an image of Jayalakshmi Akula, bicycle and road
Uma Nuthakki, Chaithanya Pingali and 61 others
5 Comments
Like
Comment
Share

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...