Tuesday, October 15, 2013

"అల"జడులు  నా కవిత్వం
నేను రాస్తున్న కవిత్వం పేరు 'అల 'జడులు
ఇవి నా గుండెల్లో అలజడుల ఆనవాళ్ళు

జీవితం కట్టుకొయ్యకు కట్టేసినట్టు అనిపించిందంటే
కనబడని కట్లను విప్పుకోవడం మొదలెట్టాల్సిందే!!
  ***
ఎవ్వరూ ఆపకపోయినా నీ దారుల్లో నువ్వెళ్ళలేకపోతున్నావంటే
నీ మార్గమేదో నీకింకా స్పష్టమవ్వనట్టే !!!
***
సంబంధం లోను లేని బానిసత్వం 
భార్యాభర్తల సంబంధంలో ఎందుకుందో ఎప్పటికి అర్ధం కాదు!!
***
ఏమే ఒసే సంబోధనలకి 
ఏమండీ అనే సంబంధానికి లంకె ఎలా కుదురుతుందో ఎవరైనా చెబుతారా!! ! !
***
జ్ఞానం కోసం బుద్ధుడు సమస్తాన్ని త్యాగం చేసాడు
స్వేచ్చ కోసం నాలుగు గోడల్ని త్యాగం చెయ్యలేమా!!!
***
జీవితం ప్రవాహంలా ఉరకలెత్తాలి
నిలవనీరులా నిలబడిపోకూడదు.
***

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
ఎవ్వరికో తాకట్టు పెట్టక
***
66 ఏళ్ళ క్రితం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందంట 
ఎంత మెల్లగా నడిచి వస్తోందో నా దగ్గరకింకా రానేలేదు.
***
స్వేచ్చ లో ఎంత బాధ్యత
***
జీవితం ఏడు రంగుల ఇంధ్ర ధనుస్సు
వెలిసిపోయిన రంగు నాకెందుకూ!!
***
రాత్రి ఎందుకో నాలో భావాలు ఉప్పొంగుతున్నాయ్
నాతో నేనున్నందుకేమో!!!
***
హిమాలయాలు రా రమ్మని పిలుస్తుంటే 
నౌబత్ పహాడ్ నన్నాపగలదా!!!
***

ఆనందం నీ చుట్టూనే చక్కర్లేస్తుంటే 
దుక్ఖాన్నెందుకేరుకుంటావే వెర్రి పిల్లా!!
***
అడవి ఉప్పొంగుతున్న రాత్రి
జనారణ్యంలో నాకేం పని
***
నీ జ్ఞాపకం
నా పెదవి అంచు మీద 
చిరునవ్వు సంతకం
***

నీ స్నేహం 
నా జీవితాన్ని వెలిగించే 
పున్నమి వెన్నెల
***

నువ్వొకసారి హత్తుకుంటే చాలు
నా నరనరాన స్నేహం ప్రవహిస్తుంది
***

నీతో ప్రయాణం 
జలపాత స్నానమే!!
***

నువ్వు నేను కలిస్తే
వెన్నెల్లో గోదారి మీదపడవ ప్రయాణమే!!
***
నిద్ర రావడం లేదు
కవిత్వం మాత్రం పొంగుకొస్తోంది.
***

అర్ధరాత్రి ఏకాంతం 
ఎంత హృద్యంగా ఉందో 
***

అంతటా నిశ్శబ్దం
నా లోపలంతా నిరామయం
***

ఆకాశంలో చుక్కలు
నన్ను చూసి ఫక్కున నవ్వుతున్నాయ్
***

మేఘాలెక్కడికి పోతున్నాయ్
నన్ను కూడా తీసుకెళితే బావుండు
***

విశాలాకాశం 
ఒంటరెలా అవుతుంది
నేను తోడున్నాను కదా!!
***

అర్ధరాత్రి
నా మనసెందుకిలా ఆనందతాండవమాడుతోంది
***

నా కళ్ళూ.. నిద్రా ఏం గొడవపడ్డాయో 
ఇద్దరూ ఎడ మొఖం పెడమొఖం.
***
నా కళ్ళు నిద్రా రాజీ పడ్డాయ్
నిద్రముంచుకొస్తోంది.
***

నిద్రాదేవి నన్నెంత ప్రేమగా హత్తుకుందో
వస్తానింక కమ్మటి కలలు కనాలి.
***
పున్నమి వెన్నెల్ని చూసి మురిసిపోతాం కానీ
అబ్బో!!నిన్న అమావాస్య రాత్రి ఎంత అందంగా ఉందో!!
***
అందం తెలుపులో లేదు
నీలాకాశం ఎంత సుందరం
***

నలుపు నారాయణుడు మెచ్చు అంటూనే
నల్లనివాళ్ళనెంత హింసిస్తామో కదా!!
***

తెల్లరంగు బిజినెస్ వేల కోట్లు
దీనికి ఆద్యురాలు ఐశ్వర్య రాయ్
***

అమ్మాయిలూ జీరో సైజులొద్దు
కరీనా కల్ట్ బహుత్ ఖత్రనాక్ 
***

చిమ్మ చీకటిలోంచి 
చిక్కని నలుపులోంచి 
తెల్లని వేకువ వెల్లివిరిస్తుంది
***
అమ్మంటే దేవతని కదా అంటారు
మరి... అడుక్కునే అమ్మలందరూ ఎవ్వరో??
* * *

కొండలపై కొలువున్న అమ్మలందరికి పాదనమస్కారాలు
ఇంట్లో ఉన్న అమ్మకి అన్నం కూడా కరువే!!
* * * 
ఏమి భక్తిరా భాయ్! నొసటి నిండా బొట్లే
నోరుతెరిస్తే మాత్రం బూతుల పంచాంగమే
* * *
జనాలు రక్షించాలని మొక్కే దేవుళ్ళు
రోడ్ల మధ్యలో కొలువై ఏక్సిడెంట్లు చేస్తున్నారు
* * * 
సాయిబాబాని సాయిరాం చేసేసారు
బుద్ధుణ్ణి దశావతారం చేసినట్టు.
* * *
మఠాల్లో మేటలు వేసిన సంపద
బయటకొస్తే దేశంలో దరిద్రమే ఉండదు
***
మైండ్సెట్ మారాలి అంటూ ఉద్యమిస్తున్నాం కానీ...
మారాల్సింది హార్ట్ సెట్.
* * *
మనవాళ్ళ మేధస్సు పెరుగుతోంది
మనసే ఎందుకో కుంచించుకుపోతోంది.
* * *
విశాలమైన హృదయమున్నచోట 
వినూత్నమైన ఆలోచనలు పొంగిపొర్లుతాయ్.
* * *
వస్తు ప్రేమల్నివ్యక్తి ప్రేమల్ని 
వదిలేస్తే...... 
మిగిలేది విశ్వప్రేమ
***
జనాలెప్పుడూ నిన్నలోనో రేపటిలోనో బతుకుతుంటారు
కళ్ళముందున్న కమనీయాన్ని కాలితో తన్నేస్తుంటారు.
***
ప్రకృతి నేను ప్రతి క్షణం చెట్టపట్టాల్
అందుకే నాకు బోర్ అంటే ఏంటో తెలియదు
***
అతిగా ఆశించడం దుఖ కారకం
మితంగా పొందడం మహానందం
***
మనం విత్తులు చల్లితే మొక్కలే వస్తాయి
మనం భావాలు చిమ్మితే భావాలే తిరిగొస్తాయి
***
పుస్తకాల నేస్తాలు చుట్టూ కూర్చుని కబుర్లు చెవుతుంటే
మనకు కూడెందుకు...నీళ్ళెందుకు??
***
చేతిలో కలం ఉండాలే కానీ 
అది కాగితాన్ని ముద్దాడకుండా ఉంటుందా??
స్త్రీలని పూజించే దేశమట
అకటా!! అరవై లక్షల అమ్మాయిల్ని చంపేసిందే!!

***
మాతృదేవో భవ
ట్రాఫిక్ కూడళ్ళలో అడుక్కుంటున్న అమ్మలు
***
నాతి చరామి....
దీనిని మించిన అబద్ధం మరోటి లేదు.
***
కన్యాదానం....
దానమియ్యడానికి అమేమైనా వస్తువా???
***
పెళ్ళంటే...
అబ్బో!! పెద్ద తంతు.
***
రాయైతేనేం పళ్ళూడగొట్టుకోవడానికి 
పెళ్ళైనా అదే ఇరుకు!!
***
పెళ్ళికి ముందు ప్రియుడు
పెళ్ళాయ్యాకా మొగుడు.
***
కట్నాలూ,కుంపట్లూ అని ఏడ్చే కన్నా
ఉన్నదాంట్లొ హక్కుగా సగమిచ్చేస్తే పోలా!!!
***
అమ్మాయిల్ని ఇళ్ళల్లో మగ్గబెట్టకండి
ప్రపంచం మీదకి వదిలేస్తే పులిపిల్లల్లా తిరిగొస్తారు. 
***
కలల్ని సాకారం చేసుకోనిస్తే...
ప్రతి పిల్లా కరణం మల్లీశ్వరి కాదా!!
నువ్వు నేను సమం సమం
నీకూ నాకూ సగం సగం
ఇదేనండీ ఫెమినిజం!!!
***
ప్రపంచమంతా పుషాధిక్యం
ప్రతీచోటా పితృస్వామ్యం
పిడికిలిబిగించి ప్రశ్నించడమే ఫెమినిజం.
***
అన్నింటా అసమానతలు
ఆంక్షలు,వివక్షలు,అడ్డుగోడలు
గోడల్ని కూల్చడమే నా పని
***
హింసలేని సమాజం స్త్రీల హక్కు
***
నేను పదహారణాల ఫెమినిష్ట్ ని 
సగర్వంగా దీనిని ప్రకటిస్తున్నాను
***
అతీతశక్తులూ నా జీవితంలో లేవు
నాస్తికత్వం నా జీవన విధానం 
***
మంత్రాలకు చింతకాయలు కూడా రాలవు
మణులూ,మాణిక్యాలు ఏం రాలతాయి??
***
వేలాది బాబాలు,అమ్మలు ఎగబడ్డ దేశం
స్త్రీలపై హింసకు పాల్పడొద్దని ఒక్కరూ చెప్పి చావరే!!
***
ఎంతో చిన్నది జీవితం
ఇంతగా చిందవందర చేసుకోవాలా??

అందమున్నది శరీర కొలతల్లో కాదు
అందమున్నది అంతరంగ వైశాల్యంలో
***
తెల్లతోలు చుట్టూ అల్లుకున్న వ్యాపారం విలసిల్లేది
మన శరీరాలని ఎలా ఉన్న వాటిని అలా మనం ప్రేమించుకునే వరకే
***
నిన్ను నువ్వు ప్రేమిస్తే 
ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది.
***
ఎప్పుడూ ఎదుటివాళ్ళు మెచ్చుకోవడం కోసం ఎదురు చూడ్డం కాదు
నిన్ను నువ్వు మెచ్చుకోవడం లోనే నిజమైన ఆత్మగౌరవం ఉంది
***
నిన్ను నువ్వు గౌరవించి చూడు
నిజమైన స్వేచ్చ అక్కడే ఉంది
***
ఎప్పుడూ బయట ప్రపంచంతో బలాదూరేనా
అప్పుడప్పుడూ అంతర్లోకాల చీకటిని చెక్ చేసుకోవాలి కదా!!!
***
బయట ముఖం బహు సుందరం
అంతరంగమంతా అంధకారబంధురం
***
బయట ప్రపంచంలో బహుముఖాలుగా విస్తరిస్తావ్ సరే 
నీ అసలు ముఖమేదో నీకైనా తెలుసునా???
***
దేవుళ్ళ గుళ్ళల్లో తొక్కిసలాటలు 
మనుష్యులకింత అభద్రత ఏంటో!!!
***
టెంపుల్ టూరిజం
టోకున జనాన్ని చంపుతోంది
***
మనిషి నమ్ముకోవాల్సింది తోటి మనిషినే
రంగులేసిన బండరాళ్ళని కాదు
***
రంగు రాళ్ళూ,రుద్రాక్షలూ 
ఎంతెంత మోసం గురువా!!! 
***
వారఫలాల్లో జాతకాలు చూసుకోవడం కాదు
వాస్తవ జీవితం ఎలా ఉందో చూడు మిత్రమా!!
***
అంతర్జాతీయ విమానాశ్రయం ధగ ధగల వెనక 
వందలాది గ్రామాల చీకటి సమాధులున్నాయ్
***
అపారమైన పళ్ళచెట్లని,పూలతోటల్ని పెకలించేసి
ఎడారుల్లో పెరిగే ఖర్జూర చెట్లు వెయ్యడం దేనికి సంకేతమో !!!
***
"
అభివృద్ధి" అంటే కొండచిలువల్లా విస్తరించిన 
ఫ్లై ఓవర్లు,ఆకాశ హర్మ్యాలేనా???
***
కార్పొరెట్ కౄర ముఖానికి
సున్నితమైన తెర సి ఎస్ ఆర్. 
***
దేశాన్నించి దోచేది కోట్లలో
సి ఎస్ ఆర్ రూపం లో విదిలించేది వందల్లో
***
టి ల్లో మనవాళ్ళు చదివేది మంది సొమ్ముతో
కొలువు తీరేది, సేవ చేసేది కార్పొరేట్ కంపెనీల్లో
***
హైదరాబాద్ అంటే సైబరాబాద్ అని బుకాయించకు
హైదరాబాద్ అంటే వెయ్యి ముఖాలుగా విస్తరించిన మురికివాడలు
***
"
అభివృద్ధి" బాధితులంతా చేరేది నగరాల పేవ్ మెంట్ల మీదకే 
అభివృద్ధిలో బాధితులేంటి చిత్రం కాకపోతే.......
***
ఏలిన వారి "అభివృద్ధి" నమూనా 
ఏలికల పక్షం వారి సంక్షేమం కోసమే 
***
పోలవరం ప్రాజెక్ట్ ......
కొంతమంది భూస్వాముల భూములకు నీళ్ళు 
గంపెడు గిరిజనుల కొంపా గూడూ నీళ్ళపాలు
***
మనసు ఉద్విగ్నమైనప్పుడల్లా..
అక్షరాలు వెల్లువెత్తుతున్నాయ్.
కధలు రాసే నేనేమిటిలా
కవిత్వం లో కొట్టుకుపోతున్నాను
***
తెలుగుభాషలో అతి నికృష్ట పదం.....
కన్యాదానం
***
మనం వాడే పరం వికృతమైన పదం 
మానభంగం
***
ఒక భయానక అనుభవానికి మనం పెట్టిన పేరు
చెరచడం
***
ఒకానొక బీభత్స అనుభవాన్ని మన పిలిచేది
శృంగారానుభవం
***
బయటి వాడు చేసేది రేప్ 
ఇల్లళ్ళో మొగుళ్ళు చేసేది మారిటల్ రేప్
రెండూ శిక్షార్హమే సుమా!!!
***
కోట్లకి పడగలెత్తడానికి
ఒక బ్యాటూ...ఒక బాలూ చాలు
***
ఎవరో రాసిన డైలాగుల్ని వెండి తెర మీద పేల్చే వీరులే
మన హీరోలూ,హీరోయిన్లూ.
***
కార్పొరేట్లకి కాసుల్ని కురిపించే క్రికెట్ ముందు
సకలజనుల ఆటలన్ని వెలాదిలా పోవాల్సిందే
ప్రకృతి ముందు కుప్పిగంతులొద్దు
పై లాన్ పుచ్చుకు కొడుతుంది..
***
సముద్రం మహా సుందరం
తుపానొస్తే పరమ బీభత్సం
***
ప్రకృతి ముందు ఎవ్వరూ నిలవలేరు
ఆఖరికి నువ్వు నమ్మే దేవుడు కూడా.
***
అనంతమైన ప్రేమని పంచే ప్రకృతి
అలిగిందంటే అలలుపెట్టి కొడుతుంది
***
అందమైన అల
ఆగ్రహిస్తే రాకాసి అల.
***
నీలం నుంచి కోలుకోలేదు జనాలు
ఇంకొక ఇంద్రనీలం ముంచుకొస్తోంది
నాకు తెలియక అడుగుతున్నా...
ప్రళయాన్ని సృష్టించే పెను తుపానులకు 
ఆడ పేర్లెందుకు పెడతారూ.......

లైలా...ఖత్రినా... ఐలా.... ఫాలిన్...
రాబోయే తుపాను పేరు హెలెన్ అట..
దీని భావమేమి మితృలారా?????

నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...