Tuesday, April 26, 2011

బిట్టూ గాడి బెట్టు చూడండి





నిన్న ఒక ఫంక్షన్ కి వెళ్ళాను.మా వాళ్ళదే.
దాంట్లో హైలైట్ ఏమిటంటే బిట్టూ గాడే.
మా మరిది కొడుకు తాను పెంచుకుంటున్న బుల్లి తాబేలు పిల్ల బిట్టూ.
వాడు దాన్ని చిన్న బాక్ష్ లో పెట్టుకుని రాయ్ చూర్ నుండి తెచ్చాడు.
భలే ముద్దుగా ఉంది.
దాన్ని కొట్టేయ్యాలని చాలా ట్రై చేసాను కానీ వాడు దాన్ని చాలా ఇష్టపడుతున్నాడు.
పోనీలే అని వదిలేసా.పెద్దమ్మా మీకు రెండు తాబేలు పిల్లల్ల్ని తెచ్చి ఇస్తానని ప్రామిస్ చేసాడు.బిట్టూ గాడిని తనతో తీసుకెళ్ళిపోయాడు.
చూడండి బిట్టూ గాడి సొగసులు.

Monday, April 18, 2011

మా ఇంట్లో విరగబూస్తున్న గులాబీలు






నలుపు,ఎరుపు,తెలుపు,పసుపు, పింక్,తెలుపు గులాబిరంగు,ఆరెంజ్ అబ్బో ఎన్ని రంగులో!!!!

కొమ్మ కొమ్మకీ పూవు,గుత్తులు గుత్తులుగా రోజాలు.

పూల చుట్టూ లియో గాడి పరుగులు.

Tuesday, April 12, 2011

మాట్లాడుకోవాలి




ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్ము కుంటున్నాయి. మే నెలలో అనుకోకుండా, హఠాత్తుగా ఎదురైన చల్లటి అనుభవం. నిన్నటిదాకా నలభైనాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత. ఈ రోజు ఇరవైఆరో ఇరవైఏడో. నిన్నటికి, ఇవాల్టికి ఎంత తేడా! బంగళాఖాతంలో పెనుతుఫాను. ఆ బీభత్సానికి ఎంత చక్కటి పేరు. లైలా! క్రితం సంవత్సరమొచ్చిన తుఫాను పేరు ఐలా! ఈ పేర్లు ఎవరు పెడతారో! ప్రళయ విధ్వంసం సృష్టించే ప్రకృతి వైపరీత్యాలకు ఆడవాళ్ళ పేర్లెందుకు పెడతారో!
తుఫాను గురించి, వాటి పేర్లు గురించి మాట్లాడుకుంటూ మురళి, మాధవి ఇంటి బయట లాన్‌లో కూర్చున్నారు. ఐదు గంటలకే చీకటి పడినట్లయిపోయింది. డాబా మీదికి ఎగబాకిన మాలతీలత ఆకు కనబడకుండా విరగపూసింది. మధురమైన సువాసనల్ని వెదజల్లుతోంది. ఇంకో పక్క కుండీలో గ్లోబులా పూసిన మే ఫ్లవర్‌. ఎర్రటి రంగుతో అద్భుతమైన అల్లికతో చూడముచ్చటగా వుంది. మబ్బుల చాటునుంచి కనబడీ కనబడనట్టుగా దర్శనమిచ్చింది నెలవంక.

”తుఫాను ప్రభావం బాగానే వున్నట్టుంది. బాగా వాన పడేట్టుంది. లోపలికెళదాం పద మురళీ” అంది మాధవి.

”వెళదాంలే! చినుకులు రాలనీ. బయట చల్లగా హాయిగా వుంది.” అన్నాడు మురళి.

”నిజమే. నాకూ కదలాలన్పించడం లేదు. మనం ఇలా కూర్చుని, ఇంత సామరస్యంగా మాట్లాడుకుని ఎంత కాలమైందో కదా! ఏమిటో. బతుకంతా ఉరుకులు, పరుగులు. దేనివెంట పరుగెడుతున్నామో అర్థమవ్వడం లేదు.”

మురళి మౌనంగా కూర్చున్నాడు. మాధవి మాటల అర్థం తెలుస్తోంది. ఏం చెప్పాలో తెలియక మౌనం వహించాడు.

”ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్‌ మురళీ?”

”ఏం లేదు మధూ! నీ మాటలు విన్నాక అన్పిస్తోంది. ఇలాంటి సాయంత్రాల్ని ఎన్నింటినో కోల్పోయాం. మనకేం జరిగింది? మనమెందుకంత రొటీన్‌లో పడి కొట్టుకుపోయాం. నువ్వు కాదులే. నేనే ఎండమావుల వెంట వెర్రిపరుగులెత్తాను. కార్పోరేట్‌ కాలేజీలో లక్షల్లో జీతం. పిల్లల్ని తోమడమే పని. ఎమ్‌సెట్‌లో ర్యాంకుల వర్షం కురిపించే ఉద్యోగం. ఇపుడు తల్చుకుంటే నామీద నాకే చిరాకేస్తోంది.”

”అవన్నీ ఇపుడెందుకులే మురళీ” మాధవి అంటుండగానే సన్నగా చినుకులు మొదలయ్యాయి. ఇద్దరూ ఇంట్లోకొచ్చారు.

”ఇప్పుడు వేడిగా, స్ట్రాంగ్‌గా కాఫీ తాగితే బావుంటుంది కదా!”

”బ్రహ్మాండంగా వుంటుంది.” మాధవి కాఫీ కలిపి తెచ్చింది. డైనింగ్‌ టేబుల్‌ మీద కూర్చున్నారు. గాలి ఉధృతి పెరిగింది. జోరుగా వాన కురుస్తోంది. ఎక్కడో ఫెళఫెళమంటూ పిడుగుపడిన శబ్దం. కరెంటు పోయింది.

”అయ్యో! కరెంట్‌ పోయిందే. ఎమర్జన్సీ లైట్‌ చెడిపోయింది. కొవ్వొత్తి తెస్తానుండు” అంటూ లేవబోయింది మాధవి.

”కాండిల్‌ వద్దులే మధూ! కాసేపు చీకట్లో కూర్చుందాం.”

”చీకట్లో కూర్చుందామా? ఇదేం కోరిక.”

”బావుంటుంది కూర్చో!”

కాసేపు ఎవరూ మాట్లాడలేదు.

చిమ్మచీకటి. అప్పుడపుడూ మెరుపులు, మెరుపుల్ని తరుముతూ ఉరుములు, ఫెళఫెళమంటూ పిడుగులు. ధారగా కురుస్తున్న వర్షంలో ఒక లయ వినిపిస్తోంది. మాలతీలత పువ్వుల పరిమళం. వాతావరణం బయట బీభత్సంగా వుంది. చీకట్లో కూర్చున్న ఇద్దరి మనసుల్లోను ఒక ప్రశాంతత, హాయి ఆవరించాయి.

”మధూ! ఇలా చీకట్లో కూర్చోవడం బావుంది కదూ! మన మనస్సుల్లోకి చూసుకోగలిగిన ఇలాంటి అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది.”

‘నిజం మురళీ! మనస్సంతా ఏవో ఆలోచనలతో సతమతమవు తోంది. నిదానంగా నిలబడి నీళ్ళు కూడా తాగలేని వేగం, వొత్తిళ్ళు మన ఆరోగ్యాలను ఎంత నాశనం చేస్తున్నాయో మనకి అర్థమవ్వడం లేదు.”

”నాకిపుడు బాగా అర్థమవుతోంది. ఆ రోజు క్లాసులో పాఠం చెబుతూ నిలువునా కూలబడిపోయినప్పటి నుండి నేను నా శరీరాన్ని ఎంత దుర్వినియోగం చేసానో తెలిసింది. డబ్బు సంపాదించే యంత్రంగానే దాన్ని వినియోగించాను. అలిసిపోతే ఆల్కహాల్‌తో సేదతీర్చాలనుకున్నాను. డబ్బు! డబ్బు! ఎంత సంపాదించాను. ఇపుడేం జరిగింది. నోరు వంకర పోయింది. కన్ను ఒంకరపోయింది. సరిగా నడవకుండా అయ్యింది.” మురళి గొంతు పూడుకుపోయింది.

మాధవి కళ్ళల్లో కూడా నీళ్ళొచ్చాయి. చీకట్లో మురళి చెయ్యి కోసం చూసింది. ఆ చెయ్యి సన్నగా వణకడం గమనించి రెండు చేతుల మధ్య గట్టిగా పట్టుకుని ”జరిగినవి తల్చుకుని బాధపడ్డంలో అర్థం లేరు. ఊరుకో మురళీ” అంది కానీ మాధవికి అతను అలా మాట్లాడటం బావుంది. తనెంత చెప్పినా విన్నాడా? ఎక్కడ డబ్బిస్తే అక్కడికల్లా జంప్‌ చేస్తూ, అదే జీవితంలా బతికిన మనిషి ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడు. మాట్లాడనీయ్‌ అనుకుంది.

”లేదు మధూ! నన్ను మాట్లాడనీయ్‌! నీతో ఇలా కూర్చుని మాట్లాడి ఎన్నో సంవత్సరాలయినట్టుంది. నేను నా ఇష్టమైనట్టు తిరుగుతూ, నీ సంగతేంటి అని ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను కదూ.”

”లేదు మురళీ! నువ్వెపుడూ ఇలాగే లేవు. నాకు ఇరవై సంవత్సరాల నాటి విషయాలు గుర్తొస్తున్నాయి. నిజానికి నేనెపుడూ వాటిని మర్చిపోయింది లేదనుకో.”

”ఏ విషయాలు? మనం కలిసి బతకడం మొదలుపెట్టిననాటి కష్టాలా? అవన్నీ ఇపుడెందుకులే మధూ.”

”ఆ విషయాలు కాదు. నాకు ఆపరేషన్‌ జరిగిననాటి సంగతులు. ఇరవై ఏళ్ళ క్రితం సడన్‌గా ఓపెన్‌హార్ట్‌ సర్జరీ చేయించడం. మన దగ్గర డబ్బుల్లేని రోజుల్లో నువ్వు ఎంత కష్టపడి నాకు ఆపరేషన్‌ చేయించావో నేను ఎప్పుడూ మర్చిపోలేదు.”

”అదా! వాటినేం గుర్తు చేసుకుంటాంలే. అయినా నెలరోజులుగా నాకోసం నువ్వు చేసిందానిముందు అదెంత? డబ్బుల్లేక గాంధీ ఆసుపత్రిలో… ఎంత రిస్క్‌ తీస్కున్నాం.

”తప్పదు కదా! మనమున్న స్థితిలో గాంధీ ఆసుప్రతే కదా శరణ్యం. ఆపరేషన్‌ ఎక్కడ జరిగిందన్నది కాదు ముఖ్యం. నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలియదా? నేను హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు నువ్వెక్కడ ఉండేవాడివో నాకు తెలుసు. బాత్‌రూమ్‌ల పక్కన, జనరల్‌ వార్డుల పక్కన, రోడ్ల మీద… గవర్నమెంట్‌ హాస్పిటల్‌ ఎలా వుంటుందో తెలుసుగా! ఈ నెల రోజులుగా నేను చేసిందేముంది? ఖరీదైన హాస్పిటల్‌. స్పెషల్‌ రూమ్‌. నిరంతరం సేవలు చేసింది నర్సులు. నేను కాదు కదా!”

”అది సరే! ఇన్ని సంవత్సరాలైనా నువ్వా విషయాలు మర్చిపోలేదా? నిజమే. నా జీవితంలో కష్టమైన కాలమది. నా స్థానంలో ఎవరున్నా అంతే చేస్తారు. నీకు హార్ట్‌లో పెద్ద రంధ్రముందని, వెంటనే ఆపరేషన్‌ చేయించాలని డాక్టర్లు చెప్పినపుడు నా బుర్ర మొద్దుబారిపోయింది. అప్పటికి అపోలోలు, కేర్‌లు ఎక్కడున్నాయి. గాంధీ చుట్టూ తిరిగాం. అబ్బో! భయంకరమైన రోజులవి.”

”నువ్వెంత మానసిక క్షోభను అనుభవించి వుంటావో నాకు తెలుసు. ఆపరేషన్‌ థియేటర్‌కి పంపుతూ నువ్వు ఏడుస్తుంటే, అప్పటికే సగం మత్తులోవున్న నేను కళ్ళు విప్పి నవ్వుతూ చెయ్యి ఊపుతుంటే కన్నీళ్ళమధ్య నవ్విన నీముఖం నాకిప్పటికీ కన్పిస్తుంటుంది మురళీ! నన్ను ఎంత అపురూపంగా చూసుకున్నావో ఎలా మర్చిపోగలను? నాకు పునర్జన్మని ఇచ్చింది నువ్వే కదా!”

”సరేలే! నేనేం చేసాను? అప్పట్లో డాక్టర్లు ఇంత కమర్షియల్‌గా లేరు. డా

సత్యనారాయణగారు గుర్తున్నారా? ఆయన టీమ్‌ కదా నిన్ను బతికించింది.”

”ఆయన్ని ఎలా మర్చిపోతాను. కంటికి రెప్పలా చూసాడాయన. డా

హరిప్రేమ్‌ గుర్తున్నారా? ఆ మధ్య రోడ్‌ ఏక్సిడెంట్‌లో చనిపోయారు.”

”అవును. చాలా అన్‌ఫార్చునేట్‌. పునర్జన్మ అన్నావ్‌ చూడు. నిజమే. హరిప్రేమ్‌ ఆపరేషన్‌ ప్రాసెస్‌ ఎలా వుంటుందో నాకు చెప్పాడు. సర్జరీ జరిగే టైమ్‌లో గుండెని కొట్టుకోవడం ఆపేసి, హార్ట్‌లంగ్‌ మిషన్‌కి అనుసంధానిస్తారట. ఆపరేషన్‌ అయ్యాక షాక్‌ ఇచ్చి గుండెని తిరిగి కొట్టుకునేలా చేస్తారట. ఒక్కోసారి షాకిచ్చినా గుండె తిరిగి కొట్టుకోదట. ఆయన నవ్వుతూ జోకులేస్తూ చెప్పినపుడు నేనెంత భయపడ్డానో తెలుసా మధూ!”

”ఈ విషయం నువ్వెపుడూ నాకు చెప్పలేదే! అంటే నిజంగానే నేను చచ్చి బతికానన్న మాట.”

”నిజానికి నేనీ విషయాలు తల్చుకోడానికి కూడా ఇష్టపడను. ఎంతో వేదన వుంది. ఏడుపుంది అందులో. మర్చిపోతేనే బెటర్‌ కదా!”

”లేదు. నేనలా అనుకోను. గతాన్ని మర్చిపోకూడదనే నేనను కుంటాను. అపుడే మన కాళ్ళు నేల మీద ఆనతాయి. మనం నడిచి వచ్చిన దారి స్పష్టంగా కనబడుతుంది.”

”నిజమే కానీ ఎన్నాళ్ళని ఆ కష్టాల అనుభవాలని మోస్తూ తిరుగుతాం. క్రమంగా నేను వాటినుండి బయట పడ్డాను. కసిగా, కచ్చగా డబ్బు వెంట పరుగెత్తాను. బహుశ మన మొదటి రోజుల్లోని కష్టాలే నన్ను పరుగెత్తించాయేమో. ఇపుడు మనకి డబ్బుకేం లోటు లేదు. పిల్లలు బాగా చదివారు. మంచి ఉద్యోగాలు. వాళ్ళు మనతో వుండి వుంటే బావుండేది.”

”అన్నీ వున్నాయ్‌ మురళీ! డబ్బుంది. మంచి ఇల్లుంది. పిల్లలు సెటిల్‌ అయ్యారు. కానీ మన మధ్య ఏం మిగిలింది? అంతులేని దూరం. ఒకే కప్పు కింద బతుకుతున్న పరాయితనం. నా పని నాకుంది కాబట్టి సరిపోయింది కానీ… నీ వెంటపడి… నీతో ఏం మిగలక మన జీవితాలు ఏమైవుండేవో!! నిజానికి నీ నిర్లక్ష్యం భరించలేకే నేను నాకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకున్నాను. నీతో పోట్లాడి పోట్లాడి నిన్ను మార్చలేక నేనే మారాను. నాకంటూ ఓ పనిని ఏర్పరచుకున్నాను. స్నేహితుల్తో గడపడం నేర్చుకున్నాను. నీ దారికడ్డురాకుండా నేను ఏం చేసినా నీకు ఫర్వాలేదు. ఒక విధంగా నేను నా మార్గాన్ని ఎంచుకునేలా పరోక్షంగా నువ్వే చేసావ్‌ మురళీ.”

”నువ్వన్నది నూటికి నూరుపాళ్ళు నిజం మధూ! బతుకుబండి వందమైళ్ళ వేగంతో పరుగెడుతున్నపుడు నాకు ఏమీ తెలియలేదు. శరీరాన్ని నా అంతగా ఎవరూ మిస్‌యూజ్‌ చేసి వుండరు. డబ్బు సంపాదించాను. ఆస్తులుగా మార్చాను. కానీ నా శరీరంలో ఏం జరుగుతోందో పట్టించుకోలేదు. ఆ రోజు క్లాసులో కుప్పకూలేవరకూ నేనేం చేస్తున్నానో ఎలా బతుకుతున్నాననే స్పృహే లేదు. నీ మాట ఏనాడైనా విన్నానా? నీకేం జరుగుతోంది? నువ్వేమవుతున్నావ్‌? ఊ… హూ… ఆలోచనే లేదు. ఆయాం సారీ మధూ.” మురళి గొంతు వొణికింది.

మాధవి కుర్చీలోంచి లేచి వచ్చి మురళి వెనక నిలబడి అతన్ని గుండెకు పొదుపుకుంది.

వర్షం కురుస్తూనే వుంది.

”మధూ! ఇంత దగ్గరితనం, ఈ ఆత్మీయత ఎంత మూర్ఖంగా కాలరాచాను. ఒక పొగరు, అహం. మనం ప్రేమించుకునే రోజుల్లో ఎంత స్నేహంగా వుండేవాళ్ళం. ఎంత దగ్గరగా వుండేవాళ్ళం. తర్వాతెందుకని అంత దూరంగా, అంటీ ముట్టనట్టయిపోతాం.”

పెద్దగా ఉరిమింది. కళ్ళు మిరిమిట్లు గొలిపే మెరుపులతో పాటు పిడుగులు పడిన చప్పుడు.

మనమే చేసుకుంటాం. మాట్లాడుకోవడం మానేసి పోట్లాడుకోవడం దినచర్యలా మనమే మార్చుకుంటాం. నువ్వే అన్నావ్‌ కదా! పొగర్లు. అహంకారాలు, ఆధిపత్యాలూ అన్నీ వచ్చేస్తాయ్‌ పెళ్ళిలోకి. ప్రేమికుడు మొగుడయ్యాకా కొరకరాని కొయ్యలా మారతాడు. నీలాగా” నవ్వింది.

”మొత్తం నావల్లే జరిగిందంటావా?”

”నావల్ల కూడా జరిగివుండొచ్చు. నీ లైఫ్‌స్టయిల్‌ భరించలేక నేనూ నిన్ను సాధించాను. తిట్టాను. ఒక స్టేజిలో వదిలేద్దామనుకున్నాను.”

”అవును గుర్తుంది. ఆరోజు మన మధ్య పెద్ద గొడవైంది.”

”నువ్వు జీతమెక్కువిస్తున్నారని విజయవాడకి పరుగెత్తావ్‌. ఆ విషయంలోనే మనకి గొడవైంది.”

”ఇంత తేలిగ్గా ఆలాంటి విషయాలని మాట్లాడుకోగలుగుతున్నాం ఇప్పుడు. ఇంతకాలం ఎందుకు మాట్లాడుకోలేకపోయాం.”

”కరెంటు పోయి చీకట్లో కూర్చున్నాం కదా! ఒకరి ముఖాలొకరం చూడ్డంలేదు కదా! అందుకేనేమో” అంది మాధవి నవ్వుతూ.

”నిజమే! ఎంత హాయిగా వుందిపుడు. మనసులో పెద్ద భారమేదో తొలిగిపోయినట్లుంది. రోజూ లైట్లాపేసి ఓ గంట చీకట్లో గడిపితే బావుండేట్టుంది.”

”అవునవును. జనాలకి కరెంటు కష్టాలు కూడా తీరతాయి. బిల్లులు తగ్గుతాయి. నువ్వు టాబ్లెట్లు వేసుకోవాలి. కొవ్వొత్తి వెలిగించాల్సిందే” మాధవి అంటుంటే కరెంట్‌ వచ్చింది. వెంటనే ఫోన్‌ కూడా మోగింది. మాధవి ఫోనందుకుంది. కూతురు శ్రావ్య అమెరికానుంచి. ఫోన్‌ మురళికిచ్చి టాబ్లెట్‌ల కోసం వెళ్ళింది.

”బావున్నానురా! ఐ యామ్‌ పర్‌ఫెక్ట్‌లీ ఆల్‌రైట్‌. ఏం చేస్తున్నామా? జోరుగా వానపడుతుంది. వేడి వేడి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నాం. నిజంరా. నమ్మకం కలగడం లేదు కదా! నాన్నేమిటి ఇంత ఆరామ్‌గా కూర్చుని అమ్మతో కబుర్లేమిటి అనుకుంటున్నావ్‌ కదా! సరే అమ్మనడుగు నేను చెప్పింది నమ్మకపోతే” మాధవికిచ్చాడు ఫోన్‌.

”తల్లీ! నాన్న చెప్పింది నిజమేనే. చాలా సంవత్సరాల తర్వాత మేం బోలెడు కబుర్లు చెప్పుకున్నాం. నాన్న బావున్నాడు. మా గురించి కంగారు పడకండి. నీకో రహస్యం చెప్పనా తల్లీ, మీ నాన్న నేను మళ్ళీ ప్రేమలో పడ్డట్టుగా వుంది.” శ్రావ్య నవ్వుతోంది. స్పీకర్‌ ఆన్‌ చేసింది మాధవి.

”కంగ్రాట్స్‌ నాన్నా! ఐయామ్‌ సో హేపీ. వెంటనే వచ్చెయ్యా లన్పిస్తోంది. నో… నో… రాను. ఎంజాయ్‌… ఈ మాట వెంటనే అన్న గాడికి చెప్పాలి బై… బై నాన్నా” శ్రావ్య ఫోన్‌ పెట్టేసింది.

మళ్ళీ ఇద్దరూ కబుర్లల్లో పడ్డారు. గడ్డకట్టిన మాటలన్నీ కరిగి వర్షం నీరులా ప్రవహించసాగాయి. ఆ ప్రవాహంలో తడిసి ముద్దవుతూ మరిన్ని మాటల్ని వెదజల్లుకుంటూ అలాగే కూర్చుండిపోయారు ఇద్దరూ!!







Monday, April 11, 2011

ప్రేమలేఖ



అబ్బాయి రాస్తే
అందమైన మోము,అద్దాల్లాంటి చెక్కిళ్ళు,
సిం హ మధ్యమం లాంటి నడుము
నిగనిగలాడే నీలి కురులు
మేలిమి బంగారులాంటి మేని చాయ
అమ్మాయి రాస్తే
ఆరడుగుల అందం ,ఆజానుబాహువులు
గిరజాల జుట్టు,సన్నని మీసకట్టు
ప్రేమలేఖల్లొ ఉండేదంతా శరీర వర్ణనేనా?
శరీరాల  స్పృహమాత్రమేనా?
ఆశయాలు,ఆదర్శాలు
మనసులోతులు,మానవీయ కోణాలు
ఆత్మ గౌరవాలు,సహజీవన సౌరభాలు,
ఇవేవీ లేకుండా ప్రేమలేఖా?
పూల మధ్య దారం ఇమిడిపోయినట్టు
ఆత్మిక బంధంలొ శరీరాల కలయిక ఉండాలి
ప్రేమలేఖల్లో పూల పరిమళాలు గుబాళించాలి
అంతరంగాలు ఆవిష్కృతమవ్వాలి.
లేఖ అంటేనే ప్రేమ సువాసనల్నో,
స్నేహ సువాసనల్నో మోసుకొచ్చేది.
అలాంటి లేఖ ప్రేమని మోసుకొస్తే....
మొగలి పొత్తులో పొదివినట్టు
మల్లెపూల మధ్యలో అమరినట్టు
గరికపువ్వు మీద తుషారబిందువట్టు
ప్రేమలేఖ
ప్రియమైన లేఖ











 

Thursday, April 7, 2011

మా లియో గాడి మరిన్ని ఫోటోలు






బెంగళూరు నుంచి బస్సెక్కి మా ఇంటికొచ్చిన లియో ఇదే.

బహు అల్లరిది.

మా ఇంట్లో ఇప్పటికే ఉన్న హాయ్ ని తరిమి తరిమి ఏడిపిస్తుంది.

అది వచ్చిన రోజు పావురాలు, కోడి పిల్లలూ క్యూ కట్టి మరీ దాన్ని చూసాయి.

కోడి పుంజు వేపు నదురు బెదురు లేకుండా ఎలా చూస్తోందో చూడండి.

హాయి వేపు కూడా నీ సంగతేంటి అన్నట్టు చూస్తోంది.

నా ముక్కు,చెవులు దానికి ఆటవస్తువులు.

నేరేడు పళ్ళల్లాగా నిగనిగలాడే కళ్ళు,చప్పిడి ముక్కు,ఊ అంటే వెక్కిరించే నాలుక.

నలభై రోజుల పిల్ల.

సరదా మూడ్ లో ఉంటే ముద్దులు,కోపంగా ఉంటే కొరుకుళ్ళు అదే పని దానికి.

వచ్చిన రోజు ముద్దుగా ఉందని ఎత్తుకుంటే కసుక్కున ముక్కు మీద ముద్రేసింది.

లవ్లి డాగ్.నా టైమంతా తినేస్తోంది.


Monday, April 4, 2011

మడిషన్నాకా రోగమూ వస్తుంది రొష్టూ వస్తుంది.సత్యసాయి దీనికి అతీతుడు కాదు.

85 సంవత్సరాలు నిండాకా మనిషి గుండె,ఊపిరితిత్తులు బలహీనంగానే ఉంటాయి కదా!
ఎంత దేవుడని మీరు మొత్తుకున్నా ఆయన మనిషేకాబట్టి ఆసుపత్రిలో పెట్టాల్సిందే.వైద్యం చెయ్యాల్సిందే.
దేవుళ్ళని పిలిచిన ఎంత మంది దయనీయంగా చనిపోలేదు.
ముమ్మిడివరం బాల యోగి మరణం ఎంత హృదయవిదారకమో మర్చిపోయారా.
మంగమ్మవ్వ ఇంకా జైల్లోనే ఉందనుకుంటాను.,జిళ్ళెళ్ళమూడి అమ్మ
దొంగనోట్ల చలా మణి లో దొరికిపోలేదా??
వయస్సు మీద పడినపుడు  అందరిలా మోకాళ్ళ నొప్పులొస్తాయి,చక్రాల బండి అవసరమౌతుంది.
మూత్రపిండాలు సరిగా పనిచెయ్యకపోతే డయాలసిస్ చెయ్యల్సి ఉంటుంది.
గుండె పనిషెయ్యకపోతే పేస్ మేకర్ పెట్టాలి.
శ్వాస సరిగ్గా ఆడకపోతే ఆక్సిజన్ పెట్టాలి.
ఇవన్ని మనిషి అనారోగ్యం పాలైతే పెట్టి తీరాలి.
సత్య సాయి మమూలు మనిషే కాబట్టి ఇవన్ని అవసరమయ్యాయి.
పుట్టిన మనిషి మరణించక తప్పదు కదా.ఈయన మాత్రం దీనికి అతీతుడేలా అవుతాడు???
నీళ్ళిచ్చాడు,వైద్య సదుపాయాలిచ్చాడు,ఇంకేమోచేసాడు అంటే కుప్ప పడిన కోట్ల రూపాయలను ఏదో ఒకటి చెYYఆలి కదా!

గాల్లోంచి వాచీలు,వేళ్ళల్లోంచి విభూది పిసి సర్కార్ కూడా సృష్టించగలడు.ఇంకా ఎన్నో అద్బుతాలు చెయ్యగలడు
నిన్నటిదాకా క్రికెట్ మోత,ఇప్పుడేమో ఈయన మోత.
దేశంలో ఇంకేమీ సమస్యల్లేనట్టు ఏ పిచ్చి పడితే ఆ పిచ్చిలోనే మునితేలుతున్న తెలుగుచానళ్ళకు బలవ్వడం తప్ప ఈ ఉగాదిపూట ఇంకేం చెయ్యగలం చెప్పండి.

Friday, April 1, 2011

హవ్వ! జండర్‌ ఈక్విటీలో మనది అట్టడుగు స్థానం

మార్చి నెల అనగానే గుర్తొచ్చేది మహిళాదినం. అంతర్జాతీయ మహిళా దినం మొదలై వందేళ్ళు గడిచిపోయాయి. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మహిళాదినాన్ని శ్రామిక మహిళా పోరాట దినంగా జరుపుకుంటూనే వున్నాం. ఈ రోజును ఒక ఉత్సవంలాగా, ఒక పండుగలాగా జరపడానికి మార్కెట్‌ శక్తులు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఒక విమాన సంస్థ మార్చి ఎనిమిదిన మహిళలకు టిక్కెట్లలో రాయితీలిస్తుంది. మరో కాస్మెటిక్‌ కంపెనీ తమ వస్తువుల్ని మరింతగా ప్రచారం చేసుకోవడానికి మార్చి ఎనిమిది వాడుకుంటుంది. ప్రభుత్వం కూడా తానేమీ తీసిపోలేదని నిరూపించుకుంటూ కొన్ని మొక్కుబడి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. మార్చి ఎనిమిది ఒక పోరాట దినంగా మొదలై, పోరాటం పూర్తి కాకుండానే, ఆశించినమార్పు సమాజంలో రాకుండానే ఒక ఉత్సవదినంగా మారిపోవడం అత్యంత విషాదకరం.


విషాదమని ఎందుకంటున్నానంటే గతవారం ముంబయ్‌లో జరిగిన నిధిగుప్తా ఆత్మహత్య విషయమే తీసుకుంటే మన సమాజం ఏ స్థాయిలో వుందో అర్ధమౌతుంది. నిధి బాగా చదువుకుని, చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి. పిల్లల్ని స్కూల్‌కి పంపడానికి తయారు చేసి, వాళ్ళని స్కూల్‌కి పంపకుండా 18 అంతస్థులు పైకి వెళ్ళి పిల్లల స్కూల్‌ బ్యాగులు పక్కనే పెట్టి, ఒకరి తర్వాత ఇంకొకరిని కిందికి విసిరేసి తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. ముంబయ్‌ని దిగ్భ్రమకి గురి చేసిన సంఘటన ఇది. బాగా చదువుకున్న, సంపాదిస్తున్న మహిళలు కూడా ఎందుకింత బేలలవుతున్నారు? అంత ఘోరమైన చర్యకి పాల్పడడం వెనుకవున్న సంఘటనలేమిటి? చదువు, సంపాదన కూడా ఆమెకి ఎందుకు గుండె నిబ్బరాన్నివ్వలేకపోయాయి?

నిధిని ఆత్మహత్య వేపు ప్రేరేపించిన అంశాలేమిటనేవి ఎప్పటికీ బయటకు రావు. ఆ ఇంటి నాలుగు గోడల మధ్య ఏం జరిగివుంటుంది.అనేది ఎప్పటికీ బయటకు రాదు. మానసికంగా ఎంత గాయపడితే అంత దారుణానికి ఒడిగట్టి వుంటుంది? ఆమె నివసిస్తున్న ఉమ్మడి కుటుంబం ఆమెకు ఎందుకు ధైర్యాన్ని ఇవ్వలేక పోయింది? ఇంట్లో ఎదురయ్యే హింస నుండి బయటపడటానికి ఈ రోజు గృహహింస చట్టముంది? కుటుంబ హింస నేరమని, ఆ హింస నుండి తప్పించుకోడానికి చట్టసహాయం తీసుకోవచ్చని చదువుకున్న నిధిగుప్తాకి తెలియదనుకోవాలా? లేక చట్టం మీదే నమ్మకం లేదనుకోవాలా? నిధి గుప్తా ఆత్మహత్య అనేక ప్రశ్నల్ని రేపుతోంది. స్త్రీలకు రక్షణ స్థలాలుగా కీర్తించబడే ఇంటినాలుగు గోడలు ఎలాంటి హింసను స్త్రీల మీద అమలుచేస్తున్నాయో, ఆ హింస నుండి బయటపడలేక ఆత్మహత్యలే శరణ్యమని చదువుకున్న స్త్రీలు కూడా అనుకుంటున్నారని నిధి ఆత్మహత్య నిరూపించింది.

నిజానికి భారతదేశం స్త్రీల రక్షణ కోసం ఎన్నో మంచి చట్టాలను చేసింది. సహాయ సంస్థలను నెలకొల్పింది. భారత రాజ్యాంగం సర్వహక్కుల్ని పురుషులతో సమానంగా ప్రసాదించింది. అయితే ఆచరణలోని వైఫల్యాలు, మహిళలకు భరోసా ఇవ్వడంలో దారుణంగా విఫలమవ్వడంవల్లనే, ఈ రోజు, స్త్రీల మీద హింస ప్రతి సంవత్సరం పెరుగుతోంది. చట్టం దారి చట్టానిదే, హింసదారి హింసదే అన్నట్టుగా వుంది పరిస్థితి. దీనికి మంచి ఉదాహరణ ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య ఆధ్యయఫలితాలు, ఆ రిపోర్ట్‌ ప్రకారం 50% స్త్రీలు ఇంట్లో హింసకు గురవ్వడం, గాయపడడం, మరణం కూడా సంభవించడం జరుగుతోంది. కుటుంబ హింస వల్ల స్త్రీలు రకరకాల అనారోగ్యాలకు గురవుతున్నారని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.

ఇంటర్‌నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రిసెర్చి ఆన్‌ విమెన్‌ నిర్వహించిన ఇంటర్‌నేషనల్‌ మెన్‌ అండ్‌ జెండర్‌ ఈక్వాలిటీ సర్వే ప్రకారం  భారతీయ పురుషులు జండర్‌ సమానత్వం విషయంలో ఎంత ఘోరంగా వెనకబడి వున్నారో అర్ధమౌతుంది. అభివృద్ధి చెందుతున్న ఆరు దేశాలలో 18-59 వయస్సులో వున్న 8000 మంది పురుషుల్ని, 3500 మంది స్త్రీలల్లో ఈ సర్వే నిర్వహించారు. బ్రెజిల్‌, చిలి, క్రోషియా, ఇండియా, మెక్సికో, రువాండా దేశాల్లో ఈ సర్వే జరిగింది.

68% భారతీయ పురుషుల అభిప్రాయం ప్రకారం స్త్రీలు గృహహింసని భరించాలి. కుటుంబాన్ని నిలిపి ఉంచాలంటే స్త్రీలు ఈ హింసని సహించాలి అని చెబితే 65% మంది స్త్రీలను కొట్టాల్సిందే. కొన్ని సమయాల్లో కొట్టడం అవసరం అని చెప్పారు. అంతేకాదు గర్భం రాకుండా జాగ్రత్త పడ్డం స్త్రీల బాధ్యత. కండోమ్‌ వాడమంటే మాత్రం కొడతాం అని కొందరు చెప్పారు. మిగతా దేశాల్లో 87-90% శాతం పురుషులు ఇంటిపనుల్లో భాగస్వాములవుతామని, జండర్‌ సమానత్వం పాటించడానికి ప్రయత్నిస్తామని చెబితే కేవలం 16% మంది భారతీయ పురుషులు ఇంటిపనిలో పాలు పంచుకుంటామని చెప్పారు.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగామి దృక్పధంతో వుండే భారతీయ పురుషులు జండర్‌ సమానత్వ అంశంలో (జెండర్‌ ఈక్విటీ) అట్టడుగు స్థాయిలో వున్నారు. కుటుంబ హింస ప్రమాదకర స్థాయికి చేరడం, నిధిగుప్తా లాంటి చదువుకున్న,సంపాదిస్తున్న మహిళలు కూడా ఆత్మహత్యలకి పాల్పడడం వెనుక భారతీయ పురుషుల తిరోగామి దృక్పథాలే కారణం. మహిళల మానవ హక్కుల పట్ల, జండర్‌ సమానత్వం పట్ల వీరిలో వున్న ఇన్‌సెన్సిటివ్‌ దృక్పథం మారనిదే మార్పు సాధ్యం కాదు. ఆధునిక యుగంలో బతుకుతూ ఇంత అమానవీయ, అవమానకరమైన పద్ధతుల్లో ఇంటా బయటా హింసకు పాల్పడుతున్న పురుషులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భమిది. తమ లోపలి చీకటి ప్రపంచాల్లోకి వెలుతురు కిరణాలు ప్రసరించుకోవాల్సిన సందర్భమిది. హింసని విడనాడకపోతే అంతర్జాతీయంగా పరువు పోయేది పురుషులదే.



నా మీద వాలిన ఛాయాదేవి ఛాయ

ఎప్పటిమాట. పచ్చగా, చల్లగా, కుటీరం లాగా ఉండే ఆ ఇంటికి తొలిసారి ఎప్పుడెళ్ళాను. తొలిచూపులోనే ఆవిడతో ప్రేమలో పడిన సంఘటనలో నిజానికి, ఆరోజు ...